
అభిప్రాయం
రాష్ట్ర విభజన జరిగిన గత పదేళ్ళలో రెండు ప్రధాన పార్టీల చెరొక ఐదేళ్ల పాలన తర్వాత, మళ్ళీ బాబు పాలన అంటే, జగన్ సెట్ చేసి వెళ్ళిన వృత్తం పైన బాబు తన చతు రస్రం అయినా ఉంచాలి, లేదు జగన్ చతురస్రం మీద బాబు తన వృత్తం అయినా ఉంచాలి. కానీ ఇద్దరివీ కలవని మార్గాలు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. అందుకే ఈ సారూప్యతను ఎన్నిసార్లు ఎటు తిప్పి చూసినా వాటి అంచులు బయటకు ఉంటున్నాయి.
నిజానికి ఈ ఇద్దరివీ రెండు వేర్వేరు ‘పబ్లిక్ పాలసీలు’. పదేళ్లనాడు బాబు తనకు తాను పనిమాలా తెచ్చిపెట్టుకున్న సంకటం – ‘అమరావతి’ వీటికి అదనం. వైఎస్సార్‌సీపీ అనే ఒక యువ రాజకీయ పార్టీ వచ్చి, అది తన తొలి ఐదేళ్ల పాలనలో వేసిన ‘రన్ వే’ మీద టీడీపీ విమానం ‘టేకాఫ్’ అంటే, అందుకు బాబు నలభై ఏళ్ల అను భవం చాలడం లేదు. జగన్ ఇంజినీరింగ్ మారడంతో భవన నిర్మాణం కూడా మారింది.
దేశంలో ఆర్థిక సంస్కరణలు 1991లో మొదలైతే, ఆ తర్వాత మూడేళ్లకే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చింది. తిరిగి 2004లో వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి డా‘‘ వైఎస్ రాజశేఖర రెడ్డి ‘సంస్కరణల కాలం’ సాగుబడి సమస్యల పరిశీలన బాధ్యతలను తాను మీద వేసుకోకుండా దాన్ని జేఎన్‌యూ ఎకనా మిక్స్ ప్రొఫెసర్ డా‘‘ జయతీ ఘోష్‌కు అప్పగించారు. ఆమె ఇచ్చిన ‘రిపోర్ట్’ను ప్రభుత్వ వ్యవసాయ విధా నంగా అమలు చేశారు. దాపరికం లేదు. నిపుణుల నైపుణ్యం వాడుకోవలసిన విధానమది.
ఏపీ నుంచి తెలంగాణ విడిపోయాక మేధోమథనం ఇంకా చాలా పెద్ద స్థాయిలో జరగాల్సింది. ఖైరతాబాద్ గవర్నర్ బంగళా పక్కనున్న ప్రతిష్టాత్మక పరిశోధన శిక్షణా సంస్థ ‘అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ’ (ఆస్కీ) వంటి సంస్థను ఏపీ ప్రభుత్వానికి ఒక ‘రోడ్ మ్యాప్’ ఇవ్వ మని అడిగి ఉండాల్సింది. అది 46 దేశాలకు చెందిన వందకు పైగా సంస్థలకు సేవలు అందిస్తున్న సంగతి గమనార్హం. దాని సహాయం తీసుకోలేదు.
మొదటి ఐదేళ్లు అలా గడిస్తే, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ‘నీతి ఆయోగ్ ‘ పర్యవేక్షణలో 2030 లక్ష్యంగా ‘యూఎన్‌డీపీ’ జారీ చేసిన– ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’ ప్రాతిపదికన తన ‘పబ్లిక్ పాలసీ’ని రూపొందించుకుని; ‘కోవిడ్’ కాలంలో కూడా దాన్ని అమలు చేసింది. వివరం తెలియనివారు దాన్ని ‘సంక్షేమం’ అన్నారు.
కొత్త రాష్ట్రంలో పరిపాలన ‘చివరి మైలు’కు చేరడానికి అవసరమైన గ్రామ సచివాలయ వ్యవస్థ ఆ కాలంలో ఏర్పాటు అయింది. ఇలా జరిగిన ప్రతిదీ ఒక ప్రభుత్వ చట్రం పరిధిలో జరగడం వల్ల, ప్రభుత్వం మారి ఏడాది గడిచినా గత ప్రభుత్వాన్ని ఇప్పటికీ ‘ఫైల్స్’లో తప్పు పట్టలేదు. పార్టీలు వేరైనా రాజ్యాంగం ఒక్కటే అయినప్పుడు, స్థూలంగా దాని పరిధిలో పనిచేయడం అనేది మౌలిక సూత్రం.
ఈ ఇరువురి భిన్న వైఖరులు నేర్పుతున్న పాఠాలు ఏమిటో ఇప్పుడు గ్రహించవలసి ఉంది. టీడీపీ 2024 ఎన్నికల వరకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో – ‘విధ్వంసం’ జరిగిందని అనేది. కానీ అది ఎక్కడ జరిగిందో తెలియదు. విధ్వంసాన్ని ఈ ఏడాది కాలంలో ఇది అని విడమర్చి ప్రజలకు చెప్పాలి కదా?
వారంటున్న ‘విధ్వంసం’ వికేంద్రీకరణ అయ్యుండాలి. ఎందుకంటే బాబు అమరావతి కేంద్రంగా నేల తవ్వి పునాదులు వేస్తే, జగన్ గ్రామపాలనకు రాష్ట్ర మంతా పటిష్ఠమైన పునాదులు వేశారు. అందువల్ల అధికారిక అంచెలు (హైరార్కీ) తగ్గాయి. ‘ఆన్ లైన్’ సౌలభ్యంతో కొన్ని ప్రజా సమస్యలు గ్రామ సచివా లయాల్లోనే పరిష్కారం అయ్యాయి.
ప్రజాప్రతినిధుల వరకు అవి రాలేదు. అన్ని పార్టీల నాయకులు ఈ కొత్త నొప్పిని మౌనంగా భరించారు. కానీ, ప్రభుత్వం మారాక జరిగింది ఏమిటి? బాబు తన ప్రభుత్వంలో దీన్ని మార్చలేదు సరికదా విస్తరించారు. అందుకు ఈ ఏడాది జూన్ 12న కూటమి ప్రభుత్వం పంచాయతీ రాజ్ శాఖ జారీ చేసిన ‘జీవో’ 57ని చూడాల్సి ఉంటుంది. ఇది వైసీపీ ప్రభుత్వంలో వెలువడిన జీవో 08. తేదీ: 1.11.’23కి కొనసాగింపు.
అందులో అప్పట్లో గత ప్రభుత్వం 77 ‘డివిజినల్ డెవలప్మెంట్ ఆఫీసర్’ పోస్టులు కొత్తగా మంజూరు చేసింది. అయితే గత నెలలో ఆ 77 మంది అధికారుల పరిధిలోకి గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకువచ్చి, వీరు డివిజన్ స్థాయిలో జరిగే పంచాతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, సంక్షేమ అభివృద్ధి పనులు పర్యవేక్షించేలా విస్తృతమైన ‘జాబ్ చార్ట్’తో ఉత్తర్వులు జారీ చేసింది.
చిత్రంగా ఆ యా కార్యాలయాల పోస్టల్ అడ్రెస్ కూడా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రమంతా గ్రామ, వార్డు సచివాలయాలతో నిర్మించిన పరిపాలనా పరమైన పునాదులకు ఉన్న విశ్వసనీయత వల్ల, ఇప్పుడు వాటి పైన కొత్తగా కట్టే అదనపు భవంతులకు భద్రత హామీ దొరికింది. పాత జిల్లాలు చిన్నవై పర్యవేక్షణ పెరిగింది.
పంచాయతీరాజ్ స్థానిక పరిపాలనా వ్యవస్థలతో వైసీపీ తెచ్చిన సచివాలయ వ్యవస్థ ‘ఇంటిగ్రేట్’ అయ్యి రెండింటి మధ్య ఒక ‘ఆర్గానిక్ లింకు’ ఏర్పడింది. పార్టీలు ఏవైనా ‘పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్’ తీసుకునే విధానపర నిర్ణయాలు ప్రభుత్వ పరిపాలన చట్టపరిధిలో ఉన్నప్పుడు, అది ఎవరి ప్రభుత్వం అనే దానితో పని లేకుండా మొక్కకు అంటు కట్టినట్టుగా రెండూ ఒక్కటిగా ఎదుగుతూ విస్తరిస్తుంది.
జాన్‌సన్ చోరగుడి
వ్యాసకర్త అభివృద్ధి– సామాజిక అంశాల వ్యాఖ్యాత