
విశ్లేషణ
ఇంధన వినియోగం పెరగకుండా ఇండియా ఆర్థిక పురోగతి సాధ్యపడదు. వచ్చే ఇరవై ఏళ్లలో జీడీపీ వృద్ధి రేటు ఎంత ఎగబాకుతుందో, ఇది కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. ఇళ్లకు, ఫ్యాక్టరీలకు, ఆఫీసు లకు విద్యుత్ సరఫరా పెంచాల్సి
ఉంటుంది. రవాణా అవసరాలకు మరింత ఇంధనం సమకూర్చాలి. మూడొంతుల విద్యుదుత్పత్తికి బొగ్గే ఆధారం. మిగిలిన ఒక వంతు సోలార్, హైడ్రో, న్యూక్లియర్, బయోమాస్ మార్గాల ద్వారా ఉత్పత్తి అవుతోంది. ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వ్యవస్థాపక సామర్థ్యం మొత్తం విద్యుత్ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీలో 50 శాతానికి చేరినప్పటికీ, వాస్తవ ఉత్పత్తి 25 శాతం మించిలేదు.
చేరుకున్న లక్ష్యం
బొగ్గు నిక్షేపాల్లో ఇండియా ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. అయినా 20 శాతం అవసరాలకు దిగుమతులపై ఆధార పడుతున్నాం. దీంతో విదేశీ బొగ్గు కోసం 20 బిలియన్ డాలర్లు (రూపాయల్లో దాదాపు 1.70 లక్షల కోట్లు) ఖర్చు పెట్టక తప్పడం లేదు. రవాణారంగం అవసరాలకు మరింత ఎక్కువగా దిగు మతులపై ఆధారపడాల్సి వస్తోంది. దేశవ్యాప్త ముడిచమురు విని యోగంలో 90 శాతం దిగుమతి అవుతోంది.
గతేడాది 24.2కోట్ల టన్నుల క్రూడాయిల్ విదేశాల నుంచి వచ్చింది. అంతర్జాతీయ క్రూడ్ ధరలు బ్యారెల్ 65 నుంచి 85 డాలర్ల మధ్య ఉంటాయనుకుంటే, ఈ దిగుమతులపై 125 నుంచి 150 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం (రూ. 10 లక్షల కోట్ల నుంచి 13 లక్షల కోట్లు) వెచ్చించాల్సి వస్తుంది. శుభ వార్త ఏమిటంటే, పెట్రోలు, డీజిలు ఎగుమతులు ముడి చమురు దిగుమతుల కంటే వేగంగా పెరుగుతున్నాయి.
గడచిన ఏడాది, 6.5 కోట్ల టన్నుల పెట్రోలు, డీజిలు మంచి లాభాలతో ఎగుమతి అయ్యాయి. ఇండియా చమురు శుద్ధి సామర్థ్యం 20 శాతం పెరిగి 31 కోట్ల టన్నులకు చేరుకోబోతోంది. దేశీయ అవసరాల కంటే వేగంగా రిఫైనింగ్ కెపాసిటీ పెరుగుతోంది. పశ్చిమ మహారాష్ట్రలో నెలకొల్పాలని ప్రతిపాదించిన కొత్త రిఫైనరీ వల్ల ఉత్పత్తి, ఉపాధి, ఎగుమతులు ఇంకా ఊపందుకుంటాయి.
భవిష్యత్తులో దేశీయ రిఫైనింగ్ కెపాసిటీలో నాలుగో వంతు ఎగు మతులకు అందుబాటులో ఉంటుంది. దీనివల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది. ఇది విశేషమే అయినప్పటికీ, మనం గుర్తు పెట్టు కోవలసిన విషయం ఒకటుంది. ప్రపంచం శిలాజ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించి వేస్తోంది. ఇండియా సైతం కర్బన ఉద్గారాల కాలుష్యాన్ని తగ్గించే ప్రధాన ధ్యేయంతో పెట్రోలు, డీజిలులో ఇథనాల్ బ్లెండింగ్‌ను పెంచేసింది.
ఇండియాలో చెరకు నుంచి, మొక్కజొన్న, బియ్యం తదితర ఆహార ధాన్యాల నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేస్తున్నారు. 2013లో 1.5 శాతంతో ప్రారంభించిన ఇథనాల్ బ్లెండింగ్ ఇప్పటికే 20 శాతం లక్ష్యాన్ని చేరుకుంది. ఈ వృద్ధి పెట్రోలు, డీజిలు వినియోగ వృద్ధి కంటే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం.
ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ (ఈబీపీ) విజయవంతం అయ్యేందుకు వీలుగా ఇథనాల్ ఉత్పత్తిదారులకు ప్రత్యేక సబ్సిడీలు ఇస్తున్నారు. తక్కువ జీఎస్టీ రేట్ల వర్తింపు, రుణాలపై వడ్డీ రాయితీ వంటి పలు ప్రోత్సాహకాలు అమలు అవుతున్నాయి.
ఇథనాల్ ఉత్పత్తి టెక్నాలజీలో ఇండియా ప్రపంచ అగ్రగామిగా అవతరించింది. ఇథనాల్ ఇంత శాతం కలపాలి అనే నిబంధన వల్ల ఆయిలు కంపెనీలు ఆ మేరకు ఉత్పత్తిదారుల నుంచి తప్పనిసరిగా దాన్ని కొనుగోలు చేసితీరాలి. కాబట్టి, ఇథనాల్‌కు మార్కెటింగ్ సమస్య లేదు.
ప్రస్తుతం 1,810 కోట్ల లీటర్ల ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ ఉండగా,ఇందులో చెరకు లేదా మొలాసిస్ ఆధారిత ప్లాంట్ల కెపాసిటీ 816 కోట్ల లీటర్లు. మిగిలిన దానిలో మొక్కజొన్నలు, బియ్యం సహా ధాన్యం నుండి ఇథనాల్ తయారు చేసే కెపాసిటీ 858 కోట్ల లీటర్లు. మరో 136 కోట్ల లీటర్ల కెపాసిటీ ప్లాంట్లు ఈ రెండు ముడి సరుకు లనూ ఉపయోగించుకుని పనిచేస్తాయి.
నాలుగు ప్రయోజనాలు
నాలుగు ధ్యేయాలతో పదేళ్ల క్రితం ఈబీపీ అమలులోకి వచ్చింది. ప్రధానంగా ఒనగూరే ప్రయోజనం క్రూడాయిలు దిగు మతుల మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. మరో మూడు ధ్యేయాలు ఉన్నాయి. అవి: విదేశీ మారక ద్రవ్యం ఆదా, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెంపు. ఇప్పటికే 20 శాతం బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకున్నందు వల్ల, ఈబీపీ తన ధ్యేయాల సాధనలో ఎంతవరకు సఫలీకృతమైందో పరిశీలిద్దాం.
ఈ కార్యక్రమం అమల్లోకి వచ్చి 2024 నాటికి పదేళ్లయ్యింది.
1. ఈ కాలంలో క్రూడాయిలు దిగుమతుల్లో 1.8 కోటి టన్నులు ఆదా చేయగలిగాం. కానీ ఇది మొత్తం దిగుమతిలో 0.8 శాతం మాత్రమే. 2. విదేశీమారక ద్రవ్యం పరంగా చూస్తే ఈ ఆదా విలువ దాదాపు రూ. 1.06 లక్షల కోట్లు. (రూపాయి సగటు మారకం రేటు ప్రకారం 10 బిలియన్ డాలర్లు). ఇది కూడా పదేళ్ల వ్యయంలో 0.5 శాతం కంటే తక్కువ. 3. ఇక కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను ఈబీపీ 5.4 కోట్ల టన్నులు తగ్గించగలిగింది. శాతంలో చూస్తే 1 శాతం కంటే తక్కువ. 4. వ్యవసాయానికి సంబంధించినంత వరకు, ఈబీపీ ఫలి తంగా రైతాంగం ఆదాయం పదేళ్లలో రూ. 1 లక్ష కోట్లు పెరిగింది. అదే సమయంలో డిస్టిలరీలు మరో లక్ష కోట్లు అదనంగా గడించాయి.
శాతం ప్రకారం చూస్తే, చెరకు లేదా మొక్కజొన్న రైతుల వ్యవ సాయ ఆదాయంలో వృద్ధి ఫర్వాలేదన్నట్లు ఉంది. ఈబీపీ వచ్చిన తర్వాత చెరకు మార్కెట్‌లో అస్థిరత తొలగిపోయింది. అప్పటి వరకు చెరకు అధికోత్పత్తి సమస్య ఉండేది. ధాన్యాల విషయానికి వస్తే, 50 లక్షల టన్నుల బియ్యాన్ని ఇథనాల్ తయారీకి మళ్లించాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి ప్రపంచ ఎగుమతుల్లో 9 శాతానికి, దేశీయ ఉత్పత్తిలో 4 శాతానికి, ప్రభుత్వ గోదాముల్లో మూలుగుతున్న నిల్వల్లో 10 శాతానికి సమానం.
దుష్పరిణామాలు
బియ్యం, మొక్కజొన్న వంటి ధాన్యాలను ఈబీపీ కోసం తరలించడం వల్ల ఉత్పన్నమైన దుష్పరిణామం ఏమిటంటే, దేశంలో కోళ్ల దాణా పరిశ్రమ చిక్కుల్లో పడింది. మొక్కజొన్నల నికర ఎగు మతిదారుగా ఉన్న ఇండియా నికర దిగుమతిదారుగా మారింది. ధాన్యంగా అమ్మేకంటే వాటితో ఇథనాల్ తయారు చేసి అమ్మడం డిస్టిలరీలకు లాభసాటిగా మారింది.
ఈ ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం ఆహార ద్రవ్యోల్బణానికీ దారితీసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దేశంలోని 81 కోట్ల మంది పేదలకు అయిదేసి కిలోల గోధుమలు లేదా బియ్యం ఉచితంగా సమ కూరుస్తోంది. దీనికోసం, ప్రభుత్వం పెద్దఎత్తున ధాన్యం సేకరణ, పంపిణీలు చేపట్టవలసి వచ్చింది.
ఇక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోలు, డీజిలు అమ్మకాల మీద 50 శాతం పైనే ఎక్సయిజ్; ఇతర పన్నులు చెల్లిస్తున్నాయి. ఇథనాల్ మీద పన్నుల భారం నామమాత్రం కాబట్టి, ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఈ భారం వారికి గణనీయంగా తగ్గుతుంది.
అందుకే పెట్రోలు, ఇథనాల్ సుంకాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించే అంశాన్ని పరిశీలించాలి. 20 శాతం బ్లెండింగు గొప్ప మైలురాయే. ఈ సందర్భంగా, ఆహార భద్రతపై దుష్ప్రభావాలు, ఆహార ద్రవ్యోల్బణం, రాయితీలు, ఆర్థిక భారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈబీపీ విధానాన్ని పునఃసమీక్షించడం అవసరం.
అజిత్ రానాడే
వ్యాసకర్త ప్రముఖ ఆర్థికవేత్త