
ఇంధన భద్రతను పెంపొందించడానికి, దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఇథనాల్ ఉత్పత్తిపై అన్ని ఆంక్షలను భారత ప్రభుత్వం ఎత్తివేసింది. ఇది 2025-26 ఏడాదికిగాను 20% ఇథనాల్, 80% పెట్రోల్ కలయిక అయిన ఈ20 ఇంధన పరివర్తనను గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు. భారతదేశం ‘ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ (ఇబీపీ) 2.0’లో భాగంగా ప్రకటించిన ఈ విధానం ద్వారా 2025 నాటికి పెట్రోల్‌లో 20% ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకోవాలనే కేంద్రం యోచిస్తోంది. ఈ క్రమంలో సాధారణంగా చాలా మందికి ఉన్న ప్రశ్నలపై నిపుణుల సాయంతో సమాధానాలను కింద తెలియజేశాం.
ఈ20 ఫ్యుయల్ అంటే ఏమిటి? ఇది ఎందుకు ముఖ్యం?
ఈ20 ఫ్యుయల్ అనేది 20% ఇథనాల్ కలిగిన మిశ్రమ ఇంధనం. మొక్కల నుంచి ఉత్పన్నమైన ఆల్కహాల్‌ను పెట్రోల్‌తో కలుపుతారు. ఈ ఇథనాల్ ప్రధానంగా చెరకు రసం, మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేస్తారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు మద్దతు ఇవ్వడమే కాకుండా కర్బన ఉద్గారాలను తగ్గించే జీవ-ఆధారిత ప్రత్యామ్నాయంగా మారుతుంది.
దిగుమతి చేసుకునే చమురుపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించడానికి, ఇంధన భద్రతను పెంచడానికి, స్వచ్ఛమైన ఇంధన ఎంపికలను ప్రోత్సహించడానికి ఈ20 ఒక వ్యూహాత్మక అడుగు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ప్రయోజనాలు
తక్కువ ఉద్గారాలు: ఈ20 ఇంధనం స్వచ్ఛమైన పెట్రోల్ కంటే శుభ్రంగా మండుతుంది. ఇది గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించడానికి తోడ్పడుతుంది. మెరుగైన పట్టణ గాలి నాణ్యతకు దోహదం చేస్తుంది.
ఇంధన భద్రత: ఇథనాల్ మిశ్రమం భారతదేశం ముడి చమురు దిగుమతులను తగ్గిస్తుంది.
వ్యవసాయానికి మద్దతు: చెరకుకు స్థిరమైన డిమాండ్ మార్గాన్ని అందిస్తుంది. రైతులకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు సహాయపడుతుంది.
సవాళ్లు
తక్కువ ఎనర్జీ కంటెంట్: పెట్రోల్ కంటే ఇథనాల్ లీటర్‌కు తక్కువ శక్తిని కలిగి ఉంటుంది. ఇది వాహనాల్లో మైలేజ్ తగ్గడానికి దారితీస్తుంది.
కంపాటబిలిటీ సమస్యలు: అన్ని వాహనాల్లో, ముఖ్యంగా 2023కి ముందు తయారైన వాటిలో ఈ20 ఇంధనం వాడకానికి అవసరమైన మెకానిజం లేదు. ప్రస్తుత పరిణామాల వల్ల ఈ20 ఇంధనాన్ని పాత వాహనాల్లో వాడితే త్వరగా పాడవుతాయనే వాదనలున్నాయి.
వాహనాలకు ఈ20 సురక్షితమేనా?
ఇప్పటికే కొనుగోలు చేసిన వాహనాలు ఈ20 కంపాటబుల్ అయితే పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చనే అభిప్రాయాలున్నాయి. అయితే పాత వాహనాలకు ఈ20 తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందని కొందరు చెబుతున్నారు.
తుప్పు ప్రమాదాలు: ఇథనాల్ తేమను గ్రహిస్తుంది. ఇది ఇంధన ట్యాంకులు, ఇంజెక్టర్లు, ఎగ్జాస్ట్ వ్యవస్థల్లో తుప్పుకు దారితీస్తుంది.
రబ్బరు, ప్లాస్టిక్ క్షీణత: ఇథనాల్ గ్యాస్‌కెట్లు, గొట్టాలు, దానిని తట్టుకునేలా రూపొందించబడని సీళ్లను నాశనం చేస్తుంది.
పనితీరు సమస్యలు: పైకారణాల వల్ల ఇంజిన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ దెబ్బతిని మైలేజ్‌పై ప్రభావం ఏర్పడవచ్చనే వాదనలున్నాయి.
ఈ20 మైలేజీని ప్రభావితం చేస్తుందా?
కొన్ని సందర్భాల్లో ఇది మైలేజీపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అది వాహనం ఈ20 కంపాటబుల్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ10 వాహనాల్లో ఈ20 ఇంధనం వాడితే 1–2% మైలేజ్ తగ్గవచ్చని చెబుతున్నారు. నాన్ క్యాలిబ్రేటెడ్ వాహనాలు 3–6% మైలేజ్ నష్టపోయే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే దీన్ని విభిన్న వాదనలున్నాయి.
దేశంలో తగినంత ఇథనాల్ ఉత్పత్తి అవుతుందా?
2025-26 సంవత్సరానికి చెరకు ఆధారిత ఇథనాల్‌పై ఉత్పత్తి పరిమితులను తొలగించారు. ఈ ఏడాది రుతుపవనాల అనుకూల పరిస్థితులు, ఆంక్షలను ఎత్తివేయడంతో చక్కెర మిల్లులు, డిస్టిలరీలు స్వేచ్ఛగా ఉత్పత్తిని పెంచుకోవచ్చు. ఈ విధాన మార్పు ఇథనాల్ లభ్యతను గణనీయంగా పెంచుతుంది. 2025 నాటికి భారతదేశంలో 20% మిశ్రమ ఇథనాల్ ఇంధనాన్ని వాడాలని, సమీప భవిష్యత్తులో దీన్ని 30%కు పెంచాలని యోచిస్తున్నారు.
ఇదీ చదవండి: బీమా అందరికీ చేరువ