
అన్ని వ్యక్తిగత జీవిత, ఆరోగ్యబీమా పాలసీలపై 18 శాతం జీఎస్‌టీ రేటును మినహాయిస్తూ జీఎస్‌టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదిగా బీమా పరిశ్రమ పేర్కొంది. వైద్య ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో తాజా నిర్ణయం పౌరులకు ప్రయోజనం కలిగిస్తుందని, కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని జబాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో తపన్ సింఘాల్ అభిప్రాయపడ్డారు.
వినియోగదారుల కోణం నుంచి చూస్తే కొనుగోలు ధర దిగొస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ ఈడీ, సీఎఫ్‌వో సమీర్ షా తెలిపారు. ‘పన్ను రేట్లు తగ్గించడం వల్ల ప్రీమియం రేట్లు దొగిస్తాయన్న అంచనాలున్నాయి. కానీ, తాజా రేట్ల తగ్గింపు ప్రయోజనం ఏ మేరకు లభిస్తుందన్నది ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) లభ్యతపైనే ఆధారపడి ఉంటుంది. రానున్న రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుంది’ అని షా వివరించారు. ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో సుబ్రత మోండల్ స్పందిస్తూ.. జీఎస్‌టీని తొలగించడం వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు స్థోమత పెరుగుతుందని, మరిన్ని వర్గాల ప్రజలకు బీమా రక్షణ విస్తరిస్తుందని అభిప్రాయపడ్డారు.
రేట్ల క్రమబద్దీకరణ దూరదృష్టితో తీసుకున్న చర్య. వ్యక్తిగత జీవిత బీమా పాలసీలపై జీఎస్‌టీ ట తొలగించడం పౌరులు అందరికీ జీవిత బీమాను చేరువ చేసేందుకు, 2047 నాటికి అందరికీ బీమా లక్ష్యాన్ని సాధించే దిశగా వేసిన అడుగు. –ఆర్.దొరైస్వామి, ఎల్‌ఐసీ సీఈవో, ఎండీ