
రైతుల ఆదాయానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం
జూలైలో రికార్డు స్థాయిలో 19.93% మిశ్రమం
బయోఫ్యూయెల్ ప్రాజెక్టుల స్థాపనకు రూ.1,969 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఇథనాల్‌తో కలిసిన పెట్రోల్‌ను ఇంధనంగా వాడటం వల్ల రైతుల ఆదాయం పెరగడమే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. 2014–15 నుంచి 2025 జూలై వరకు రైతులకు రూ.1.25 లక్షల కోట్లు నేరుగా చెల్లించగా, దేశానికి రూ.1.44 లక్షల కోట్ల విదేశీ మారకాన్ని ఆదా చేసినట్లు ఆయన వివరించారు. అలాగే 736 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్‌డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గి, 244 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు అవసరం తక్కువైందని ఇటీవల పార్లమెంట్ వేదికగా వెల్లడించారు.
ఇథనాల్ మిశ్రమం పెరుగుదల
పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 2022 జూన్‌లోనే 10% లక్ష్యాన్ని చేరింది. తర్వాత ఇది 2022–23లో 12.06%, 2023–24లో 14.60%, 2024–25లో జూలై 31 నాటికి 19.05%గా నమోదైంది. కేవలం జూలై నెలలోనే 19.93% సాధించడం విశేషమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇథనాల్ ఉత్పత్తి కోసం ముడి సరుకుల విస్తరణ, పన్ను రాయితీలు, వడ్డీ సబ్సిడీ పథకాలు, సహకార చక్కెర కర్మాగారాలకు మల్టిఫీడ్ స్టాక్ ప్లాంట్లకు ఆర్థిక సాయం వంటి చర్యలు తీసుకున్నామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వివరించారు.