కనీసం 5 బస్తాల యూరియా ఇవ్వాలంటున్న రైతులు
కొన్ని జిల్లాల్లో సగటున ఎకరా మొక్కజొన్నకు 10 బస్తాల వినియోగం.. ఇప్పటివరకు మొక్కజొన్న,వరి కలిపి సాగైంది 10 లక్షల ఎకరాల్లోనే..
రైతులు కొన్న యూరియా 3.54 లక్షల మెట్రిక్ టన్నులు
విరివిగా వాడకం.. కొరత భయంతో ముందస్తు కొనుగోళ్లు
‘సార్.. నేను ఐదెకరాల్లో మక్కలేసిన. అవి మొలుస్తున్నయ్. యూరియా కావాలని సొసైటీకి పోతే ఎకరానికి 3 బస్తాలే ఇస్తమంటున్నరు. ఎకరానికి ఇప్పుడు 5 బస్తాలు కావాలె. అవి పెరిగినంక మల్ల 5 బస్తాలు కావాలె. మీ ఆఫీసర్లేమో పంట మొత్తానికి 3 బస్తాలే ఇస్తం అంటున్నరు’ అంటూ వ్యవసాయశాఖలో కీలక స్థానంలో పనిచేస్తున్నఓ అధికారికి నిజామాబాద్‌కు చెందిన ఓ రైతు ఫోన్ చేశాడు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విచ్చలవిడిగా యూరియా వినియోగం పెరిగిందనడానికి ఈ ఫోన్‌కాల్ ఓ ఉదాహరణ. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే కాదు.. దాదాపు అన్ని జిల్లాల్లో యూరియా వినియోగం ప్రమాదకర రీతిలో పెరిగిపోయింది. ఓ వైపు ఎరువుల వినియోగం తగ్గించాలని పర్యావరణ వేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా... యూరియాతోపాటు ఇతర ఎరువుల వాడకం తగ్గడం లేదు. రాష్ట్రంలో యాసంగి ఇంకా పూర్తిస్థాయిలో మొదలు కాకముందే.. ఈ సీజన్‌లో వినియోగించే యూరియాలో 50 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. యూరియాతోపాటు కాంప్లెక్స్, డీఏపీ ఎరువు కూడా ఇప్పటికే 50 శాతానికి పైగా కొనుగోలు చేశారు. యూరియా, ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నా, జిల్లాల్లో యూరియా కోసం జనాలు పీఏసీఎస్‌లు, సొసైటీల వద్ద క్యూలు కడుతుండడం గమనార్హం.
సాగు అంచనా 68.67 లక్షల ఎకరాలు..సాగైంది 13.89 లక్షల ఎకరాలు
యాసంగిలో యూరియా వినియోగం ప్రధానంగా వరి, మొక్కజొన్న పంటలకే ఎక్కువ. అయితే రైతులు కూరగాయల నుంచి ఇతర అన్ని పంటలకు యూరియాను వినియోగించడం పరిపాటిగా మారింది. గత ఐదు సంవత్సరాల సగటు ఆధారంగా ఈ యాసంగి సీజన్‌లో రాష్ట్రంలో 52 లక్షల ఎకరాల్లో వరి, 7 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇవి కాకుండా మిగతా అన్ని పంటలు కలిపి 69 లక్షల ఎకరాల వరకు సాగయ్యే అవకాశం ఉందని లెక్కలు కట్టింది. కాగా జనవరి 1వ తేదీ వరకు వ్యవసాయ శాఖ జిల్లా నోడల్ అధికారి నివేదిక ప్రకారం వరి 4 లక్షల ఎకరాల్లో సాగవగా, మొక్కజొన్న 5.50 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది.
సాగుకు సంబంధం లేకుండా కొనుగోళ్లు
కేంద్ర ప్రభుత్వం యాసంగిలో 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించింది. అందులో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకుగాను ఇప్పటి వరకు 5.78 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసింది. వానాకాలం సీజన్‌లో 133 లక్షల ఎకరాల్లో పంటలు సాగయితే, యాసంగిలో అందులో 60 శాతం మాత్రమే సాగవుతాయి. ఇప్పటికే రైతులు ఏకంగా 3.54 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొనుగోలు చేశారు. సాగుతో సంబంధం లేకుండా రైతులు యూరియాను అడ్డగోలుగా కొనుగోలు చేసి, నిల్వ చేసుకోవడం ఒకటైతే... అవసరానికి మించి యూరియాను వాడడం మరో సమస్యగా మారింది. మొక్కజొన్న పంటకు ఏకంగా ఎకరానికి 10 బస్తాల యూరియాను వాడుతున్న విషయం తమ దృష్టికి వచ్చినట్టు ఓ వ్యవసాయ అధికారి ‘సాక్షి’తో చెప్పడం గమనార్హం.
డీఏపీ, కాంప్లెక్స్ వినియోగం కూడా అధికమే
యూరియా తర్వాత అధికంగా వినియోగించే ఎరువుల్లో కాంప్లెక్స్, డీఏపీ. ఈ యాసంగి కోసం కేంద్రం 7 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు కేటాయించగా, ఇప్పటి వరకు 3.84 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా అయ్యాయి. అందులో 1.21 లక్షల మెట్రిక్ టన్నులు రైతులు కొనుగోలు చేశారు. ఇందులో ఇప్పటి వరకు 1.21 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ వినియోగించగా, ఇంకా డీలర్లు, సొసైటీలు, మార్క్‌ఫెడ్ వద్ద కలిపి 2.63 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ ఉంది. డీఏపీ కూడా 1.45 ఎల్‌ఎంటీకిగాను 1.36 ఎల్‌ఎంటీ సరఫరా కాగా, దాదాపు లక్ష మెట్రిక్ టన్నులను రైతులు కొనుగోలు చేశారు. 


