
భారతదేశం నేడు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొంటోంది. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చేందుకు ఎంతవరకు కృషి చేస్తున్నామో మనం ప్రశ్నించుకోవాలి. 2024 ప్రపంచ ఆకలి సూచిక ప్రకారం, భారతదేశం 127 దేశాలలో 105వ స్థానంలో ఉంది. ‘సర్వైవల్ ఆఫ్ ద రిచెస్ట్: ది ఇండియా స్టోరీ’ అనే శీర్షికతో ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ తాజా నివేదిక భారతదేశంలో గణనీయమైన ఆదాయ అసమానతను పేర్కొంది.
అత్యంత ధనవంతులైన 1% మంది ఇప్పుడు దేశ మొత్తం సంపదలో 40% కంటే ఎక్కువ కలిగి ఉన్నారు. దిగువన ఉన్న 50% మంది కేవలం 3% మాత్రమే సంపద కలిగి ఉన్నారు. వీటితో పాటు 2024లో ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ‘కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్’ ప్రకారం భారతదేశం అవినీతి అవగాహన సూచికలో 180 దేశాలలో 96వ స్థానంలో ఉంది.
2025 నాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై చేసే మొత్తం వ్యయం జీడీపీలో 4.64%గా ఉంటుందని ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. అయితే ఇది నూతన విద్యా విధానం –2020 నిర్దేశించిన 6% లక్ష్యం కంటే తక్కువగా ఉండటం గమనార్హం. 2025–26 కేంద్ర బడ్జెట్‌లో, భారతదేశం ఆరోగ్య రంగానికి రూ. 99,859 కోట్లు కేటాయించింది. ఇది గత సంవత్సరం సవరించిన అంచనాలతో పోలిస్తే 11% పెరుగుదలను సూచిస్తుంది.
మొత్తం ఆరోగ్య బడ్జెట్‌లో 96%తో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు ఎక్కువ కేటాయింపులు లభించాయి. అయితే ఇది వార్షిక బడ్జెట్ కేటాయింపులు, విధాన మార్పుల ఆధారంగా మారవచ్చు. ఆర్థిక వ్యవస్థలో రెడ్ టేపిజం ఇప్పటికీ తన ప్రభావాన్ని చూపుతోంది. బంధుప్రీతి దాదాపు అన్ని రంగాలలో కనిపిస్తోంది. ఇప్పటికీ మనం వరకట్నం, ఆడ శిశువుల హత్య, లింగ అసమానత, గృహ హింస, అంటరానితనం వంటి సాంఘిక దురాచారాలతో కునారిల్లడం బాధాకరం.
అయితే మన దేశం ఎన్ని ఆటంకాలు ఎదురైనా విభిన్న రంగాలలో చాలా అభివృద్ధిని సాధించింది. మానవ వనరులలో (జనాభా) భారతదేశం మొదటి స్థానంలో ఉంది. భారతదేశం ప్రపంచంలోనే పాలు, పప్పుధాన్యాలు, జనపనార ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. బియ్యం, గోధుమలు, చెర కు, వేరుసెనగ, కూరగాయలు, పండ్లు, పత్తి ఉత్పత్తిలో రెండవ అతిపెద్ద దేశంగా ఉంది.
భారతదేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్యలో అమెరికా, చైనాల తర్వాత మూడవ స్థానంలో ఉంది. ప్రపంచంలో 10వ అతిపెద్ద దిగుమతిదారుగా, 16వ అతిపెద్ద ఎగుమతిదారుగా నిలిచింది. 2024లో, భారతదేశం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స్వీకరించడంలో ప్రపంచవ్యాప్తంగా 15వ స్థానంలో నిలిచింది.
సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణల నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా అనుసరిస్తున్న ట్రంప్ విధానాల నుండి, యుద్ధాల నుండి రక్షించుకోవడం కోసం నిరంతర ఆర్థికాభివృద్ధి, విభిన్న సంక్షేమ కార్యక్రమాలతో స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తిని మనం కొనసాగించాలి. అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలపై అవగాహన ఉన్న పౌరుల భాగస్వామ్యంతోనే స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తిని అందుకుని అభివృద్ధి సాధించగలం.
– డా‘‘ పి.ఎస్. చారి, కామర్స్– మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో ప్రొఫెసర్