
సందర్భం
పార్టీ మార్పిళ్ల నిరోధక చట్టానికి సుప్రీం కోర్టు తాజా తీర్పు పదును తెచ్చింది. తెలంగాణలో పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల అనర్హతపై పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను, ఎట్టి పరిస్థితుల్లో మూడు నెలలు దాటకుండా పరిష్కరించాలని స్పీకర్‌కు గడువు నిర్దేశిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. చాలా కాలంగా ఏర్పడిన ఒక రాజ్యాంగ ప్రతిష్టంభన దీంతో తొలగిపోయినట్టయింది.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్పీకర్లు,మండలి చైర్మన్ల నిర్ణయ జాప్యం, తాత్సారం వల్ల చట్టం స్ఫూర్తికి ఇన్నాళ్లూ తూట్లు పడుతూ వచ్చింది. తాజా తీర్పుతో పార్టీ మార్పిళ్ల నిరోధక చట్టానికి జవం, జీవం వచ్చినట్టయింది. ఇప్పుడిక, తెలంగాణలో పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదా? అదే జరిగితే బీఆర్‌ఎస్ ఆశిస్తున్నట్టు ఉప ఎన్నికలు తప్పవా? ఆ ఉప ఎన్నికలను తమ ఏడాదిన్నర పాలనకు రెఫరెండమ్‌గా స్వీకరించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందా?
ఇదివరకటి రాజ్యాంగ ధర్మాసనాలు ఇదే అంశంపై వెల్లడించిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, భారత అత్యున్నత న్యాయస్థానం వెల్లడించిన తాజా తీర్పు పార్టీ మారిన పదిమంది తెలంగాణ శాసన సభ్యులను కలతకు గురిచేసేదే! శాసన వ్యవస్థ గొడుగు కింద రాజ్యాంగం తమకు కల్పించిన విశేష రక్షణ (ఇమ్యూనిటీ) ఈ విషయంలో వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన అన్వయం స్పీకర్లకు పాఠమే! ‘అనర్హత పిటిషన్ల విషయంలో ఎప్పటిలోగా నిర్ణయం ప్రకటించాలో న్యాయస్థానాలు తమకు గడువు విధించజాలవు’ అన్న స్పీకర్ల వాదన ఇక నిలువదు.
ఎన్నికలు ముగిసిన స్వల్ప కాలంలోనే బీఆర్‌ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్), తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), దానం నాగేందర్ (ఖైరతాబాద్) లను పార్టీ మార్పిళ్ల నిరోధక చట్టం (1985) కింద అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి (హుజూరా బాద్), కె.పి.వివేకానంద (కుత్బుల్లాపూర్) స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
స్పీకర్ స్పందించక పోవడంతో వారు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఒక పార్టీ నుంచి గెలిచి, కనీసం ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీ తరఫున దానం నాగేందర్ సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేయడాన్ని తప్పుపడుతూ బీజేపీ శాసన సభాపక్ష నేత అయిన మహేశ్వరరెడ్డి విడిగా న్యాయ స్థానంలో మరో పిటిషన్ వేశారు.
అదే క్రమంలో మరో ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి (బాన్సువాడ), ఎం. సంజయ్ కుమార్ (జగిత్యాల), కాలె యాదయ్య (చేవెళ్ల), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్‌చెరు), టి.ప్రకాశ్ గౌడ్ (రాజేంద్ర నగర్), ఆరెకపూడి గాంధీ (శేరిలింగం పల్లి) కూడా విపక్ష బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ శిబిరం చేరారు.
చట్టంలోని ఒక నిబంధన ప్రకారం ఒక రాజకీయ పార్టీలోని ప్రజాప్రతినిధుల్లో మూడింట రెండొంతుల మంది వేరొక పార్టీలో చేరితో దాన్ని ‘విలీనం’ కింద ప్రకటించుకోవచ్చు. అప్పుడు వారికి అనర్హత వర్తించదు. అంటే, 26 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు (ఎన్ని కైన 39లో మూడోవంతు) కాంగ్రెస్‌లోకి మారితే అది ‘విలీనం’ అవుతుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్‌లో తగ్గిన సంఖ్య తర్వాత అది 25కి తగ్గుతుందన్నా మరో 15 మంది (ఇప్పటికే పార్టీ మారిన పదిమందికి తోడు) మారాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అయ్యే పని కాదు.
పార్టీ మారిన పదిమందిని అనర్హులుగా ప్రకటించకుండా స్పీకర్ ముందు మరే ప్రత్యామ్నాయమైనా ఉందా? బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్‌ను తిరస్కరించవచ్చు. ఆ నిర్ణయం ఆధారంగా వారు మళ్లీ న్యాయస్థానాన్ని సంప్రదిస్తారు. అప్పుడది కోర్టుల న్యాయ సమీక్షకు నిలబడాలి. ఒక్క నాగేందర్ తప్ప మిగతా సభ్యులు, తాము పార్టీ మారనే లేదు, ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని, స్పీకర్ తమను వ్యక్తి గతంగా సంప్రదించినపుడు చెప్పొచ్చు. తనపై లేనిపోని దుష్ప్రచా రాలు చేస్తున్నారు తప్ప, తాను పార్టీయే మారలేదని కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల) ఇదివరకు ఇలా ప్రకటించారు.
ఎవరి ఎత్తుగడ ఏముంటుందో?
ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నిక తెచ్చి తీరాలని విపక్ష నేత కె. చంద్రశేఖర రావు పట్టుదలగా ఉన్నారు. పదిమంది పార్టీ మారి కాంగ్రెస్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు, తమ పార్టీ విప్‌ను ధిక్క రించినట్టు నిరూపించే ఆధారాలను స్పీకర్‌కు సమర్పించవచ్చు. పార్టీ మార్పిళ్ల నిరోధక చట్టంలో గతంలో మూడింట ఒక వంతు సభ్యులు బయటకు వచ్చి ఇతర పార్టీలో చేరినా వారిని ‘చీలిక’ వర్గంగా గుర్తించే వెసులుబాటుండేది.
కానీ 2003లో జరిగిన ఒక రాజ్యాంగ సవరణ ద్వారా ఆ నిబంధనను తొలగిస్తూ, చట్ట సవరణ చేశారు. దాంతో ‘చీలిక’ను గుర్తించే వీలు లేదు. పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల అనర్హత కోరిన పిటీషన్లను స్పీకర్ తిరస్కరించే సాహసా నికి పార్టీ నాయకత్వం ఒడిగడుతుందా? అన్నది అనుమానమే! సుప్రీం కోర్టు తాజా తీర్పు, సమయ, నిర్బంధం దృష్ట్యా దేశ వ్యాప్తంగా అందరి దృష్టీ తెలంగాణ స్పీకర్ నిర్ణయంపైనే ఉంటుంది.
ప్రజా న్యాయస్థానాల్లో పార్టీ ఫిరాయింపుదారులకు ఎప్పుడూ చుక్కెదురే! 2014, 2018 ఎన్నికల్లో ఇతర పార్టీలో గెలిచి, తన పార్టీ లోకి వచ్చిన ఎందరో ఎమ్మెల్యేలకు కేసీఆర్ తర్వాత ఎన్నికల్లో టిక్కె ట్లిచ్చినా, వారిని ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఏపీలో ప్రత్యర్థి వైఎస్సార్సీపీలో గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్ని చంద్రబాబు నాయుడు తన పార్టీలోకి తీసుకొని తర్వాత ఎన్నికల్లో టిక్కెట్లిచ్చినా, వారికీ ప్రజాకోర్టుల్లో ఘోరంగా చుక్కెదురైంది.
స్పీకర్లు ఇంకా రోగుల్ని చంపలేరేమో?
‘వీలయినంత త్వరగా మూడు నెలలు మించకుండా పిటిషన్లను పరిష్కరించాల్సిందే’ అని తీర్పిస్తూ సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ పరిస్థితుల్లో మేం ఏ నిర్దేశం ఇవ్వకుంటే రాజ్యాంగంలో పదో షెడ్యూల్ పొందుపరిచిన లక్ష్యమే చిన్నబోతుంది’’ అని వ్యాఖ్యానించింది.
‘‘తాము ఏ నిర్దేశమూ ఇవ్వకుంటే, ‘చికిత్స విజ యవంతమైంది, కానీ, రోగి చచ్చాడు’ అన్న పంథాలో స్పీకర్లు/ చైర్మన్లు సాగించే ప్రక్రియను మేం అనుమతించినట్టవుతుంది’’ అని కూడా అన్నది. తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు సముచితంగా ఉండిందని, హైకోర్టు ధర్మాసనమే సదరు తీర్పులో కల్పించు కోవాల్సిన అవసరమే లేకుండిందని పేర్కొంది.
చట్ట సభాపతుల నిర్ణయాలకు కాలపరిమితి విధించవచ్చో? లేదో అన్న ఇన్నినాళ్ల సందేహాలను పటాపంచలు చేస్తూ ఒక అంశం వెల్లడించింది. అన ర్హత పిటిషన్లను పరిష్కరించే క్రమంలో స్పీకర్/చైర్మన్‌లు న్యాయా ధికారులుగా, రాజ్యాంగ పదో షెడ్యూల్, పేరా 6(1) ప్రకారం, ట్రిబ్యునల్ హోదాతో, అధికరణం 226, 227 కింద, హైకోర్టు పరిధి లోకి, అధికరణం 136 కింద సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తారని స్పష్టం చేసింది.
‘రాజేంద్రసింగ్ రాణా’ కేసుతో సహా పలు కేసుల్లో రాజ్యాంగ ధర్మాసనాలు వెల్లడించిన అభిప్రాయాల ప్రకారం న్యాయా ధికారులుగా వ్యవహరించేటప్పుడు స్పీకర్లు/చైర్మన్లకు రాజ్యాంగంలోని అధికరణాలు 122, 212 కింద రక్షణ లభించదనీ స్పష్టం చేసింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అనుచిత జాప్యాలకు కారణ మవుతున్న సభాపతులకు సుప్రీం తాజా తీర్పు గట్టి పాఠమే!
దిలీప్ రెడ్డి
వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,
పీపుల్స్ పల్స్ రిసెర్చ్ సంస్థ డైరెక్టర్