
విశ్లేషణ
‘కళ్ల ముందు హింస జరుగుతుంటే, దానిని చూస్తూ మౌనంగా ఉండటం కూడా హింసలో భాగమే’ అన్నారు మహాత్మా గాంధీ. ప్రపంచానికి అహింసా సిద్ధాంతాన్ని అందించి ప్రపంచ మానవాళి సుఖసంతోషాలతో ఉండాలంటే అదొక్కటే ఏకైక మార్గమని ఆయన నిరూపించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యుద్ధోన్మాదానికి రక్తపుటేరులై పారుతున్న ‘గాజా’ను చూస్తూ కూడా ప్రపంచంలోని అత్యధిక బలమైన దేశాలు నోళ్లు కుట్టేసుకున్నట్లు ప్రవర్తించడమే నెతన్యాహు హింస కంటే బీభత్సంగా గోచరిస్తోంది.
‘గాజా’ మొత్తం ఛిద్రం అయింది. 75,000 మంది ఇప్పటివరకు మట్టిలో కలిసిపోయారన్నది అధికారిక లెక్క. అంతకు మించిన సంఖ్యలో అక్కడి ప్రజలు, సైనికులు హతం అయ్యారన్నది అనధికార అంచనా. అంకెలను బట్టి చూస్తే, గతంలో హిట్లర్, ముస్సోలినీ నెలకొల్పిన రికార్డులన్నింటినీ నెతన్యాహు తిరగరాసినట్లే ఉంది.
మొదటి ప్రపంచ యుద్ధం సమయంలోగానీ, రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు గానీ బాధితులకు, క్షతగాత్రులకు రెడ్‌క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థలు అందించిన సాయాన్ని అడ్డుకొన్న దాఖలాలు లేవు. కానీ, నేడు అంతర్జాతీయ సమాజం అందిస్తున్న సాయంపై ఇజ్రాయెల్ సైనికులు ఆంక్షలు పెట్టారు. ఇంతటి అమానవీయం కనివిని ఎరుగం. 22 నెలలు గడిచినా ‘గాజా’లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఏ దేశమూ చొరవ చూపడం లేదు.
ఆ ఒక్క యుద్ధం సరిపోదన్నట్లుగా... ఇరాన్‌లో అణ్వస్త్రాయుధాలు, శుద్ధి చేసిన యురేనియం నిక్షేపాలు ఉన్నాయనే మిషతో ఆ దేశంపై కూడా విరుచుకుపడి పశ్చిమాసియాలో కల్లోల పరిస్థితులు సృష్టించి ఏ ఒక్కరికీ కంటి మీద కునుకు లేకుండా చేశారు నెతన్యాహు. వియన్నా డిక్లరేషన్‌ను అనుసరించి యుద్ధంలో పాల్గొనే దేశాలు... సామాన్య పౌరులను చంపకూడదు. జన సామాన్యం, నివాస ప్రాంతాలపై దాడులు చేయరాదు. ఈ నిబంధనను ఇజ్రాయెల్ అటకెక్కించింది.
అలాంటి నాయకులేరీ?
‘వసుధైక కుటుంబం’ అన్నది భారతదేశం ప్రవచించిన మహత్తరమైన భావన. దానిని భావనగానే ఉంచకుండా ఆచరణలోకి తేవడానికి చిత్తశుద్ధితో కృషి చేసింది కూడా భారతదేశ నాయకత్వమే. గాంధీజీ, నెహ్రూ, అంబేడ్కర్, లోహియా, వినోబాభావే మొదలైన నాయకులతో పాటు, ఆ తర్వాత తరానికి చెందిన ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, అబ్దుల్ కలాం వంటివారు ప్రపంచ శాంతికి, ప్రపంచ దేశాల ఆర్థిక సామాజిక పురోగతికి కృషి చేశారు.
కెన్నెడీ, చౌ ఎన్ లై, మార్షల్ టిటో, నాజర్ మొదలైన వివిధ దేశాల నాయకులు సైతం ప్రపంచశాంతికి కృషి చేశారు. మానవజాతి వినాశనానికి దారితీసే యుద్ధాల నివారణకు ఎందరో నేతలు గతంలో తాపత్రయ పడ్డారు. వివిధ దేశాల నడుమ ఘర్షణలు చెలరేగినప్పుడు ఆ ఉద్రిక్తతలను తగ్గించడంలో, సంప్రదింపుల ద్వారా, ఒడంబడికల ద్వారా యుద్ధాలను నివారించడాన్ని అనుభవంలో చూశాం.
కానీ ఇప్పుడా చొరవ ఒక్క నాయకుడూ చేయడం లేదు. ‘నేను– నా పొట్ట’ అనే రీతిలో, ‘నేను– నా దేశం’ అనే విధంగా మాట్లాడటం తమ దేశీయ ప్రయోజనాలను పరిరక్షించుకోవడం గానూ, తమ దేశాభి వృద్ధిని కాంక్షించే జాతీయ విధానంగానూ భావిస్తున్నారు తప్ప... అటువంటి విధానం వల్ల దేశాల మధ్య పరస్పర సహకారం, సహజీవనం, శాంతి సౌభాగ్యాలకు విఘాతం కలుగుతుందని ఆలోచించడం లేదు.
అప్పుల కోసం, ఆయుధాల కోసం నేడు అనేక దేశాలు... ఆగ్రదేశాల ముందు సాగిలపడుతున్నాయి. బదులుగా అగ్రదేశాలు ఏం చేసినా... ‘తానా అంటే తందాన’ అంటున్నాయి. ఈ ధోరణి ఇప్పటికిప్పుడు అలవాటు చేసుకొన్నది కాదు. దాదాపు 3 దశాబ్దాలుగా కొనసాగుతున్నదే. ఇప్పుడది పరాకాష్ఠకు చేరింది.
ఐక్యరాజ్యసమితి కోరల్ని ఎప్పుడో పీకేయడంతో ఆ సంస్థ అస్తిత్వం నామమాత్రంగా మారి యుద్ధాలను నివారించడంలో ఎటువంటి పాత్రనూ పోషించలేకపోతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను ఆపగల చొరవ ఎవరు తీసుకొంటారు? ఆ శక్తి ఎవరికి లేకపోవడం అటుంచి... అలాంటి ప్రయత్నం చేయాలన్న తపన కొరవడటమే అత్యంత బాధాకరం.
ద్వంద్వ ప్రమాణాలు
యుద్ధోన్మాదులు దేశాధినేతలైతే, ఆ దేశ ప్రజల భవిష్యత్తే కాదు... యావత్ ప్రపంచ భవిష్యత్ తారుమారవుతుందని గత అనుభవాలు తెలియజేస్తున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసిన కొన్ని గంటల్లోనే అంతర్జాతీయ చమురు ధరలు అమాంతం పెరిగిపోయాయి.
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న సుదీర్ఘ యుద్ధం కారణంగా వాతావరణంలోకి ప్రవేశించిన ప్రమాదకర ‘ధూళి’ యూరప్‌తో సహా పొరుగునున్న పలు దేశాలలో ప్రతికూల ఫలితాలు చూపిస్తోందన్న వార్తలు వెలువడుతున్నాయి.
దేశాల మధ్య ఏర్పడుతున్న ఉద్రిక్తతల కారణంగా తమ తమ గగనతలాలను మూసివేయడం, నౌకాయాన మార్గాలను దిగ్బంధనం చేయడం వంటి దుందుడుకు చర్యల ఫలితంగా మానవాళికి జరుగుతున్న నష్టం, కాలహరణం ఊహాతీతమైనది.
ప్రపంచంలో మూడు బలమైన దేశాలు అమెరికా, రష్యా, చైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా యుద్ధాల్లో పాల్గొనడం లేదా మిత్రదేశాలకు యుద్ధాల్లో సాయపడటం విరమించుకోనంత వరకు ప్రపంచంలో శాంతి స్థాపన జరగడం కష్టం. నిజానికి ఈ దేశాల ప్రజలకూ, ఆ మాటకొస్తే ఉత్తరకొరియా ప్రజలకు సైతం యుద్ధం అభిలషణీయం కాదు. ప్రజలెప్పుడూ అభివృద్ధిని ఆశిస్తారు. సుఖశాంతులను కోరుకుంటారు. కయ్యానికి కాలు దువ్వే మనస్తత్వం మెజారిటీ ప్రజలకు ఉండదు.
ప్రజల ఆశలు, ఆకాంక్షలకు భిన్నంగా, తమ ప్రతిష్ఠను పెంచుకోవడానికీ, తమ దేశ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని చాటుకొని అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికీ కొందరు ప్రపంచ నేతలు హ్రస్వదృష్టితో అనుసరిస్తున్న విధానాల వల్లనే... యుద్ధాలు ముగింపు లేకుండా కొనసాగుతున్నాయి. యుద్ధం పేరుతో బలహీనులపై అన్ని రకాల దారుణాలూ జరుగుతున్నాయి.
స్వార్థమే యుద్ధకారణం
కళింగ యుద్ధంలో గెలిచిన తర్వాత అశోక చక్రవర్తిలో పశ్చాత్తాపం కలుగుతుంది. ప్రత్యర్థులకు కలిగిన నష్టం కంటే మన నష్టం కొంచెం తక్కువ... అంతే... ఇది విజయం కాదు... పరాజయం... మానవత్వానికి తీరని మచ్చ అని మథన పడతాడు. యుద్ధాలకు స్వస్తి పలికి శాంతి కాముకుడిగా మారి శాంతిని విశ్వజనీనం చేయడానికి తన జీవితాన్ని ధారపోస్తాడు.
ప్రపంచాన్ని జయించాలనుకున్న అలెగ్జాండర్ కథ కూడా చివర్లో విషాదంగానే ముగిసింది. ఈ ఉదంతాల నుంచి గుణపాఠాలు నేర్చుకొనే విశాల దృక్పథం నేడు నాయకుల్లో కరువైంది. వారి స్వార్థం నుంచే యుద్ధాలు మొదలవుతున్నాయి. అవి అంతిమంగా మానవత్వాన్ని మింగేస్తున్నాయి. ఉక్రెయిన్‌లో కావొచ్చు, గాజాలో కావొచ్చు... జరుగుతున్న పరిణామాల పట్ల ప్రపంచ దేశాలు నిర్లిప్తంగా, ఉదాసీనంగా, శిలాసదృశంగా మారిపోయాయి. వీటి ప్రతికూల పరిణామాలు ఊహిస్తేనే భయంగా ఉంటుంది.
డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన పరిషత్ సభ్యులు