
కామెంట్
భారత దేశపు అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ అనేది తెలిసిన విషయమే. ఎన్నో చర్చలు జరిపి, ఎంతో పరిశీలన చేసి, ఆ తర్వాతే ఈ అవార్డు ఎవరికి ఇవ్వాలో నిర్ణ యించాల్సి ఉంటుంది. సంబరాల్లో చమ్కీల్లా వెదజల్లితే (‘పందుల ముందు ముత్యాలు పోసినట్లు’ అని ఇంగ్లీష్ వాళ్లంటారు, నేను ఆ సామెత ఉపయోగించడం లేదు) దాని విలువ క్షీణిస్తుంది. ఆ పురస్కారం అభాసు పాలు అవుతుంది. ఏమైనా ఈ అవార్డు ఇస్తున్న తీరుపై చర్చ జరగాల్సిందే. వాస్తవాలు మీ ముందుంచుతాను, పరిశీలించండి.
1954లో పద్మ అవార్డులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 53 మందికి భారత రత్న ప్రదానం చేశారు. వీరిలో నా లెక్క ప్రకారం 31 మంది రాజకీయ నాయకులు. అంటే దాదాపు 60 శాతం. ఈ గణాంకాలు పరికిస్తే, ప్రతిభా పాటవాల గుర్తింపుగా కాకుండా వ్యూహాత్మక రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఈ అవార్డు ఇస్తున్నట్లు అనిపించడం లేదా? కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ నాయకులకు పార్టీ లోని వారి సహచరులు ఈ పురస్కారం ప్రకటించి తమ భక్తిని చాటుకున్నారు. అది అవార్డు ఔన్నత్యాన్ని దిగజార్చడం కాదా? కచ్చితంగా అంతే.
బతికున్నప్పుడు కదా గుర్తించాలి!
మరో కలవరపరిచే వాస్తవం ఏమిటంటే, 18 మంది తమ మర ణానంతరమే భారత రత్నకు ఎంపికయ్యారు. బతికున్నప్పుడు వారిని గుర్తించకపోవడం అలక్ష్యం చేసినట్లే అనుకోవాలి. అలా అని మరణానంతరం దశాబ్దాలు గడిచిన తర్వాత ఆ తప్పిదం సరి చేద్దా మనుకోవడం కూడా కరెక్టు కాదు. అది అవమానం కాకపోవచ్చుగానీ అవివేకం అవుతుంది. వల్లభ్ భాయ్ పటేల్‌నే తీసుకోండి... మరణానంతరం 41 ఏళ్లకు ఆయన ఈ పురస్కార గ్రహీత అయ్యారు.
వాస్తవానికి భారతరత్న ప్రవేశపెట్టక మునుపే ఆయన చనిపోయారు. బి.ఆర్.అంబేడ్కర్, మౌలానా అజాద్ తమ మరణానంతరం 34 ఏళ్లకు ఈ గౌరవం పొందారు. కర్పూరీ ఠాకూర్ చనిపోయిన 36 ఏళ్లకు ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు. మదన్ మోహన్ మాలవీయకు అయితే 69 సంవత్సరాల తర్వాత ఇచ్చారు. నిజానికి ఆయన ఇండియాకు స్వతంత్రం రాక మునుపే కన్ను మూశారు. ఈ అర్హులందరకూ ఇవ్వగా లేనిది మహాత్మా గాంధీని మాత్రం ఎందుకు విస్మరించాలి?
ఇక ఈ 53 మందిలో ఎంతమంది ఈ ఇండియా అత్యున్నత పురస్కారానికి అర్హులు? మీరు నాతో ఏకీభవించకపోవచ్చు. మనందరికీ ఎవరి అభిప్రాయలు వారికి ఉంటాయి. నా అంచనా ప్రకారం కనీసం 14 మంది గ్రహీతలకు ఈ అవార్డు పొందే అర్హత లేదు.
గోవింద్ బల్లభ్ పంత్, జాకీర్ హుస్సేన్, వి.వి. గిరి, కె.కామరాజ్,ఎం.జి.రామచంద్రన్, రాజీవ్ గాంధీ, మొరార్జీ దేశాయి, గుల్జారీలాల్ నందా, గోపీనాథ్ బోర్డోలాయి, ప్రణబ్ ముఖర్జీ, నానాజీ దేశ్ ముఖ్, కర్పూరీ ఠాకూర్, లాల్ కృష్ణ అద్వానీ, చౌధరీ చరణ్ సింగ్... వీరంద రికీ భారత్ రత్న ఇచ్చి ఉండాల్సిందేనా?
ఈ ముగ్గురూ అర్హులే!
ఈ అవార్డుకు తగినవారు లేరని కాదు. తప్పకుండా ఉంటారు. అలాంటి వారిలో కనీసం ఇద్దరి పేర్లు నేను చెప్పగలను. మొదటి వ్యక్తి ‘ఫీల్డ్ మార్షల్’ ఎస్.హెచ్.ఎఫ్.జె.మానెక్‌శా. ఆయన నిస్సందేహంగా దేశం గర్వించదగిన మిలిటరీ హీరో. మనం తిరుగులేని విధంగా గెలి చిన ఏకైక యుద్ధాన్ని (1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధం) నడిపింది ఆయనే. ఫీల్డ్ మార్షల్ ర్యాంకు ఇచ్చిన మాట నాకు తెలుసు. కానీ మానెక్‌శా వంటి వ్యక్తికి భారత రత్న కూడా ఇచ్చి ఉండాల్సింది. ఆయన ఇప్పుడు లేరు కదా అనే వాదన చెల్లదు. అలా చెప్పి నిరాకరిస్తే, అది ద్వంద్వ ప్రమాణాలు పాటించడం, కపటత్వం అవుతుంది.
నేను చెప్పబోయే రెండో వ్యక్తి కూడా ఈ అత్యున్నత పురస్కారం ప్రదానం చేయదగిన వ్యక్తే. మరి మన ప్రభుత్వానికి అంతటి దార్శనికత, వివేకం ఉన్నాయా? నేను ప్రస్తావిస్తున్న ఆ వ్యక్తి దలై లామా. ఈ దేశంలోనే ఉంటున్న దలై లామా తనను తాను భారత పుత్రుడిగా భావిస్తారు. ఆయన ఔన్నత్యాన్ని ప్రపంచం గుర్తించినా, మనం మాత్రం గుర్తించలేక పోతున్నాం. లేదంటే చైనాను నొప్పించడం మనకు ఇష్టం లేదా?
1989లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.అంటే మనం ఇప్పటికే 36 ఏళ్లు వెనుకబడ్డాం. వాస్తవానికి, నోబెల్ కమిటీ కంటే ముందే మనం ఆయన్ను ఈ అవార్డుతో సత్కరించి ఉండాల్సింది. దలై లామా ఇటీవలే తన 90వ పుట్టిన రోజు జరుపుకొన్నారు.
ఇదొక మైలురాయి వంటిది. కనీసం దీన్నయినా ఒక అవకాశంగా మార్చుకుని ఆయనకు భారత రత్న ప్రకటించాలి. తద్వారా మన పోరబాటును దిద్దుకోవచ్చు. మీరేమంటారు? దలై లామాకు ప్రదానం చేయడం ద్వారా భారత రత్న ఔన్నత్యం పెంచినట్లు కూడా అవుతుంది.
మనం ఈ పురస్కారానికి పరిశీలించవలసిన వ్యక్తి మరొకరు కూడా ఉన్నారు. ఆయన అమితాబ్ బచ్చన్. ఆయన కంటే ముందు కూడా గొప్ప నటీనటులు ఉన్నారన్న వాస్తవాన్ని నేను కాదనడం లేదు. వారు ఈ గౌరవం పొందకుండానే పరమపదించారు. బచ్చన్ నేటికీ మన మధ్యే ఉన్నారు. ఆయన లెజెండ్‌లా భాసించారు.
చాలా మంది దృష్టిలో ఇప్పటికీ కూడా లెజెండే. 1992లో భారత రత్న వరించిన సత్యజిత్ రాయ్, లేదా 2001లో ఈ సత్కారం పొందిన లతా మంగేష్కర్ అంత గొప్పవాడు. ఆయనకు భారత రత్న ఎందుకు ఇవ్వకూడదు? నటనలో ఇప్పటి వరకు ఎవరికీ ఈ అవార్డు లభించ లేదు. ఆ చరిత్ర సృష్టించిన తొలి వ్యక్తి అమితాబ్ బచ్చన్ ఎందుక్కాకూడదు?
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్