
ప్రభుత్వం ఇటీవల ఒక లక్ష కోట్ల రూపాయల నిధితో ఒక నూతన పరిశోధన, అభివృద్ధి, నవీకరణ(ఆర్డీఐ) పథకానికి ఆమోదం తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్ (ఏఐ) వంటి ప్రగాఢమైన సాంకేతిక రంగాల్లో నవీకరణ, వాణిజ్యపరమైన పరి శోధన–అభివృద్ధి (ఆర్–డి)లో ప్రైవేటురంగ పెట్టుబడులను పెంపొందించే ఉద్దేశంతో ఈ నిధిని నెలకొల్పింది. దీర్ఘకాలిక రుణ సదుపాయాల కల్పనకు లేదా తక్కువ వడ్డీ రేట్లపై రీఫైనాన్సింగ్‌కు ఈ నిధులను వినియోగిస్తారు.
జాతీయ లక్ష్యమైన స్వావలంబన సాధనకు చేయూతనందించదలచుకున్న ప్రైవేటు కంపెనీలు ఆర్–డి, టెక్నాలజీ అభివృద్ధి స్థాయిని పెంచాలనుకున్నప్పుడు వృద్ధి, రిస్క్ క్యాపిటల్ రూపంలో ఈ నిధులు అందుతాయి. కీలకమైన లేదా వ్యూహాత్మకంగా ప్రాధాన్యం ఉన్న టెక్నాలజీల సమీకరణతో ప్రమేయం ఉన్నవాటితోపాటు, ‘టెక్నాలజీ సంసిద్ధత స్థాయి’ని హెచ్చుగా కనబరచిన ప్రాజెక్టులకు రుణాలు ఇస్తారు.
పరిశోధనలో ఎక్కడున్నాం?
‘ఆర్–డి’లో పెట్టుబడులు తక్కువగా ఉండటం, ప్రైవేటు రంగ వాటా పేలవంగా ఉండటంతో నూతన నిధిని సృష్టించవలసిన అవసరం ఏర్పడింది. ఆర్–డిపై స్థూల వ్యయాన్ని (జీఈఆర్డీ)గా పిలుస్తారు. ఇది ఎంత ఉందనేదానిని బట్టే పరిశోధనల పట్ల సదరు దేశపు నిబద్ధతను అంచనా వేస్తారు. భారతదేశపు జీఈఆర్డీ అత్యల్పంగా 0.64 శాతంగా ఉంది. ఎదుగు బొదుగు లేకుండా ఉండి పోయిన ఈ సంఖ్య, వాస్తవానికి, 2019–20 నుంచి ఇంకా తగ్గిపోవడం ప్రారంభించింది.
అయితే, స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.)లో పెరుగు దలతోపాటు ఆర్–డి కాసుల మూట కూడా కాస్తోకూస్తో బరువు పెరుగుతూ రావడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. ఆర్–డిపై వ్యయంలో భారత్ స్థానం ఎక్కడా చెప్పుకోతగినదిగా లేదు. ఈ విషయంలో అమెరికా 784 బిలియన్ల డాలర్లతో 2023లో మొదటి స్థానంలో నిలిచింది. చైనా (723 బిలియన్ల డాలర్లు), జపాన్ (184 బిలియన్ల డాలర్లు), జర్మనీ (132 బిలియన్ల డాలర్లు), దక్షిణ కొరియా (121 బిలియన్ల డాలర్లు), బ్రిటన్ (88 బిలియన్ల డాలర్లు), ఇండియా (71 బిలియన్ల డాలర్లు) ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయని ‘వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్’ వెల్లడిస్తోంది.
చైనాతో సహా ఆర్–డిపై అధికంగా వెచ్చిస్తున్న దేశాల్లో ప్రైవేటు రంగమే దానికి సారథ్యం వహిస్తున్నట్లు తెలుస్తుంది. భారతదేశంలో మాత్రం జీఈఆర్డీకి ప్రభుత్వ రంగమే ప్రధాన చోదక శక్తిగా నిలుస్తోంది. మన దేశంలో ఆర్–డిపై మొత్తం వ్యయంలో ప్రైవేటు రంగ వాటా 36.4 శాతంగానే ఉంది.
ప్రభుత్వ ఊతంతోనే ఎదుగుదల!
ఉన్నత సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ప్రైవేటు రంగ పెట్టుబడిని నష్ట ప్రమాదం లేకుండా మార్చేందుకు ఈ రకమైన ప్రోత్సాహక చర్యకు శ్రీకారం చుట్టడం ఇదే మొదటిసారేమీ కాదు. ప్రపంచీకరణ యుగంలో సాఫ్ట్‌వేర్, బయోటెక్నాలజీ విప్లవాలు బాగా ప్రాచుర్యం పొందాయి. అవి విజయవంతమైన ఉదాహరణలుగా నిలవడం వెనుక ప్రభుత్వ ప్రాయోజిత పథకాల మూల నిధులు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ (ఎస్టీపీ) అనే కొత్త ఐడియానే తీసుకుందాం.
ఉపగ్రహ డాటా–లింక్ సదుపాయాలు పంచుకోవడం, సరసమైన ధరలకు కార్యాలయాల స్థలాన్ని పొందడం, పన్నుల్లో భారీ వెసులుబాట్ల రూపంలో ఔత్సాహిక సాఫ్ట్‌వేర్ సంస్థలకు ఎంతో అవసరమైన సహాయం ఎస్టీపీ ద్వారా లభించింది. అలా ఉత్సాహం చూపిన చాలా సంస్థలు కోట్లాది డాలర్ల బృహత్ సంస్థలుగా రూపాంతరం చెందాయి. ఆర్–డి, ప్రాడక్ట్ డెవలప్‌మెంట్ ఔట్‌సోర్సింగ్ లోకి అవి విస్తరించాయి. భారతదేశపు జి.డి.పి.లో సాఫ్ట్‌వేర్ రంగ వాటా ప్రస్తుతం సుమారు 8 శాతంగా ఉంది.
శాంతా బయోటెక్నిక్స్, భారత్ బయోటెక్ మొట్టమొదటి బయో టెక్నాలజీ, వ్యాక్సీన్ కంపెనీలు అదే కోవలో లబ్ధి పొందినవే. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలో నెలకొల్పిన టెక్నాలజీ అభివృద్ధి బోర్డు (టి.డి.బి.) ఆ రెండు సంస్థలకు ఉదారంగా నిధులు అందించింది. అవి కూడా నిధులను సద్వినియోగం చేసుకుని, హైదరాబాద్‌ను భారతదేశపు వ్యాక్సీన్ రాజధానిగా అవతరించేటట్లు చేశాయి.
విద్యాసంస్థలతో కలిసి నడిస్తేనే...
ఆర్–డిపై ఆసక్తి ఉన్న ప్రైవేటు రంగాన్ని తీసుకురావడంలోఇంతవరకు గడించిన అనుభవాన్ని ఆధారం చేసుకుని ఇంకా పైకెద గడం, ఇంతకుముందు తెచ్చిన పథకాల్లోని లోటుపాట్లను సరిదిద్దు కోవడం తెలివైన పని అనిపించుకుంటుంది. మొట్టమొదటగా, అటు వంటి పథకాల అమలులో, అధికార యంత్రాంగం నుంచి ఎదు రయ్యే జాప్యాలను తలచుకుని ప్రైవేటు రంగం ఎప్పుడూ జంకుతూ ఉంటుంది. కనుక, పాలనాపరమైన జోక్యం వీలైనంత తక్కువగాఉండేటట్లు చూడాలి.
కొత్త ఆర్డీఐ పథకం పాలనాపరంగా పీడకలకు కారణమయ్యే దిగా కనిపిస్తోంది. ఈ పథకానికి ‘వ్యూహాత్మక దిశా నిర్దేశం’ చేసేందుకు ప్రధాన మంత్రి అధ్యక్షతన గల ‘అనుసంధాన్ నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్’ (ఎ.ఎన్.ఆర్.ఎఫ్.) గవర్నింగ్ బోర్డ్ పెద్ద తలకాయలా ఉంటుంది. ఎ.ఎన్.ఆర్.ఎఫ్. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మార్గదర్శక సూత్రాలను ఆమోదించి, నిధులు ఇవ్వదగిన ప్రాజెక్టుల పరిధి, తరహాలపై సిఫార్సు చేస్తుంది. క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన కార్యదర్శుల సాధికార బృందం ఒకటి ఉంటుంది.
ఏయే రంగాల్లో, ఏయే తరహా ప్రాజెక్టులకు నిధులు సమకూర్చవచ్చునో ఈ బృందం సిఫార్సు చేస్తుంది. వాటి పనితీరుపై సమీక్ష నిర్వహిస్తుంది. ఈ అధికార యంత్రాంగపు పిరమిడ్‌కు అట్టడుగున వైజ్ఞానిక, సాంకేతిక శాఖ ఉండి ఈ పథకాన్ని అమలుపరుస్తుంది. రెండు అంచెల వ్యవస్థ ద్వారా నిధుల ప్రవాహం సాగుతుంది. ఎ.ఎన్.ఆర్.ఎఫ్. లోపల స్పెషన్ పర్పస్ ఫండ్ (ఎస్.పి.ఎఫ్.) అని ఒకటుంటుంది. అలాగే, ద్వితీయ స్థాయి ఫండ్ మేనేజర్లు కొందరుంటారు.
కొల్లేటి చాంతాడు లాంటి అధికార యంత్రాంగాన్ని అలాఉంచితే... రూ. 10,000 కోట్ల నిధులతో డీప్ టెక్ ఫండ్ ఆఫ్ పంఢ్స్ పేరుతో ఆర్డీఐ లాంటి పథకం ఇప్పటికే ఒకటి ఉంది. అయినా, కొత్త దానికి ఎందుకు రూపకల్పన చేశారో అర్థం కాదు. స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతో, ఏఐ, బయోటెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూ టింగ్ వంటి రిస్క్ ఎక్కువ ఉన్న రంగాల్లో వ్యాపారాల తొలి అభివృద్ధి దశల్లో పెట్టుబడులకు డీప్ టెక్ ఫండ్ సాయపడాల్సి ఉంది. బహుశా, ఒకే రకమైన పథకాలు రెండింటికి రూపకల్పన చేశామని గ్రహించినందువల్లనే కాబోలు, డీప్ టెక్ ఫండ్‌కు ఆర్డీఐ నిధులు తరలించవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది.
ఒక నిధి మరో నిధికి నిధులిస్తే, ఇక అది ఏ ప్రయోజనాలను నిర్వర్తించనున్నట్లు? టెక్నాలజీ అభివృద్ధిని ప్రైవేటు రంగం చేపట్టాలని మనం కోరు కుంటున్నట్లయితే, విద్యా సంస్థలతో కలసి పనిచేయడమనే ప్రాథ మిక సూత్రం ఉండనే ఉంది. వాటితో కలసి అడుగులు వేస్తే, ఐడి యాలలో పురోగతిని త్వరగా అందిపుచ్చుకునేందుకు కంపెనీలకు వీలవుతుంది. పీహెచ్‌డీ హోల్డర్లు, సుశిక్షితులైన రిసెర్చర్లు, ఇంజనీర్లు తగినంత సంఖ్యలో అందుబాటులో ఉంటారు.
పరిశోధనా దశనుంచే సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుంటే, వస్తువులను అభివృద్ధిపరచ గల సమయాన్ని కంపెనీలు కుదించుకోగలుగుతాయి. దీనికి, విద్యా సంస్థల్లో పరిశోధనను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీల్లో ముందడుగులో ఉన్న దేశాలు అదే చేశాయి.
-వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
-దినేశ్ సి. శర్మ