చైనాలో ఇంత అభివృద్ధి ఎలా? | Sakshi Guest Column On How China developed | Sakshi
Sakshi News home page

చైనాలో ఇంత అభివృద్ధి ఎలా?

Jul 23 2025 12:10 AM | Updated on Jul 23 2025 12:10 AM

Sakshi Guest Column On How China developed

అభిప్రాయం

చైనా పేరు వినగానే సర్వసాధారణంగా తోచే ప్రశ్నలు కొన్నున్నాయి. అక్కడ ఇంతటి అభివృద్ధి ఎందుకు? మార్క్సిజం, సోషలిజం పరిస్థితి ఏమిటి? ప్రజలకు స్వేచ్ఛలు ఉంటాయా? వంటివి. ఇవి ఎంత ముఖ్యమైన ప్రశ్నలో వాటన్నింటి మధ్యగల పరస్పర సంబంధం కూడా అంత ముఖ్యమైనది. ఈ విషయాల గురించి ఎంతో చదువుతుంటాం, వింటుంటాం. కానీ అక్కడి పరిస్థితులను కళ్లారా చూడటం, వారితో మాట్లాడి తెలుసుకోవటం వేరు. చైనాలో కొద్ది వారాల పాటు పర్యటించిన తర్వాత కలిగిన అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి.

రెండు శతాబ్దాలు
అభివృద్ధి గురించి మాట్లాడేవారు గుర్తించనిది ఏమంటే, ఈ భావనకు, అభివృద్ధి చెంది తీరాలన్న పట్టుదలకు మూలాలు చరిత్రలో ఉన్నాయి. అవి 1949 నాటి కమ్యూనిస్టు విప్లవంతో మొదలయ్యాయి. వారిలో విప్లవం కోసం ఎంత తపన ఉండేదో, బలమైన అభివృద్ధి కోసం అంత ఉండేది. ఆ మేరకు వారి ఆలోచనలు ఏమిటి? చైనా, భారతదేశం గొప్ప చరిత్ర, సంస్కృతి, ఆర్థికాభివృద్ధి ఉండిన దేశాలు. 

విదేశీయుల ఆధిపత్యం, దోపిడీ వల్ల దెబ్బ తిన్నాయి. చైనాకు సంబంధించి 1839 నాటి మొదటి నల్లమందు యుద్ధంతో మొదలై సరిగా 110 సంవత్సరాల తర్వాత 1949లో కమ్యూనిస్టు విప్లవం విజయవంతమయే వరకు గల కాలాన్ని కమ్యూనిస్టులు ‘అవమానాల శతాబ్దం’ (సెంచరీ ఆఫ్‌ హ్యూమిలియేషన్‌) అన్నారు. తమ నాయకత్వాన ఆ తర్వాతి నూరేళ్లు 1949 నుంచి 2049 కాలం ‘పునరుజ్జీవన శతాబ్దం’ (సెంచరీ ఆఫ్‌ రిజువనేషన్‌) కావాలని గట్టిగా తీర్మానించుకున్నారు.

చైనా చరిత్రను, సంస్కృతిని విస్తారంగా అధ్యయనం చేసినట్లు పేరున్న మావో కాలంలో జరిగిన ఈ తీర్మానం ప్రకారం ఈ రోజు వరకు అన్ని ప్రభుత్వాలు కూడా ఏకదీక్షతో పనిచేస్తూ వస్తున్నాయి. తమ లక్ష్యం సాధనకు అవసరమైన అవగాహనలు, ప్రణాళికలు, వాటి అమలులో పట్టుదల, అందుకు కావలసిన ఆర్థిక, శాస్త్ర–సాంకేతిక, మానవ వనరులు అన్నీ వారికున్నాయి. ప్రజల సహకారం ఉంది. అందువల్లనే, ‘పునరుజ్జీవన శతాబ్దం’ 1949లో మొదలై ఇప్పటికి 75 సంవత్సరాలు గడిచి ఇంకా 25 సంవత్సరాలు మిగిలి ఉన్న దశకు చేరేసరికి, చైనా ఇంతటి అభివృద్ధిని సాధించగలిగింది. 

ఈ లక్ష్య సాధన కోసం వారు చేస్తున్న గమనార్హమైన ప్రయత్నం మరొకటి ఉంది. కమ్యూనిస్టు విప్లవానికీ, అవమానాల శతాబ్దం, పునరుజ్జీవన శతాబ్దం అనే భావనలకూ బీజాలు ఏ విధంగానైతే వారి చరిత్ర, సంస్కృతులలో ఉన్నాయో, అదే ప్రకారం ఆ చరిత్ర, సంస్కృతి, జాతీయ భావన, దేశభక్తి భావనల పునాదిగా ప్రజలను పాజిటివ్‌గా సమీకృతం చేస్తూ, వారిని ఈ అభివృద్ధి మహా యజ్ఞంలో భాగస్వాములను చేయగలుగుతున్నారు. ఆ అభివృద్ధి ఫలాలను మొత్తం మానవజాతి చరిత్రలోనే ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఇది సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి మాట.

కళ్లకు కట్టిన అభివృద్ధి
ఇక ఆ అభివృద్ధి తీరుతెన్నులపై అనేక కథనాలు తరచు వెలువడుతున్నవే అయినందున, ఆ వివరాలు, గణాంకాలలోకి ఇక్కడ వెళ్లటం లేదు. వాటిలో పేర్కొననివి, నేను స్వయంగా చూసి సంభ్రమం చెందినవి కూడా అనేకం ఉన్నాయి. అందులో ఒకటి మాత్రం చెప్తాను. నేను బీజింగ్‌ నుంచి శియాన్‌ నగరానికి వెళ్లిన హైస్పీడ్‌ రైలు వేగం గంటకు 350 కి.మీ.లు. 

అది గాక 450 కి.మీ. రైలు మరొక మార్గంలో ఉంది గానీ అందులో ప్రయాణించలేదు. అయితే, 600 కి.మీ.ల రైలుపై ప్రయోగాలు జరుగుతున్నట్లు విన్నాను. చైనా నుంచి ఇండియా చేరిన తర్వాత 48 గంటలలో వచ్చిన వార్త ఆ ప్రయోగం విజయవంతమైందని, ఆ రైలు వేగం 620 కి.మీ.లకు చేరిందని. అక్కడి హైస్పీడ్‌ రైళ్లు ఏవీ నేలపై నడవవు. 

వందల, వేల కి.మీ.లు ఎలివేటెడ్‌ కారిడార్లలోనే (హైదరాబాద్‌ మెట్రో తరహాలో) నడుస్తాయి. చైనా అభివృద్ధి లక్ష్యం 2049 నాటికి ప్రస్తుత రెండవ స్థానం నుంచి మొదటి స్థానానికి చేరాలని. అవమానాల శతాబ్ది, పునరుజ్జీవన శతాబ్దిగా మారాలన్న లక్ష్యం ఆ విధంగా నెరవేరగలదన్నది ఆలోచన. ప్రచారంలోకి రాలేదు గానీ ఈ ఆలోచన మావో కాలంలోనే మొదలై నేటికీ కొనసాగుతున్నది. ఆ రోజులలో అందుకు సవాళ్లు పలు అభివృద్ధి చెందిన అన్ని దేశాల నుంచి ఉండేవి. ఇపుడు మిగిలింది అమెరికా ఒక్కటే. ఇది అన్నింటికి మించిన సవాలు. 

ఇక్కడి తరహా లోనే...
ప్రస్తుతానికి మాత్రం చైనా అభివృద్ధికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు సజావుగానే సాగుతున్నట్లు కనిపిస్తున్నది. అందువల్లనే ఆర్థికంగా రెండవ స్థానానికి చేరింది. పర్చేజింగ్‌ పవర్‌ పేరిట (సమానమైన సరకులు, సర్వీసులకు అయే ఖర్చు అమెరికా కన్న చైనాలో తక్కువ కావటం)లో అమెరికాను 2017లోనే మించిపోవటం, నౌకా బలంలో అమెరికాను దాటడం, వైమానిక శక్తిపై పెట్టుబడులు, ఆధునిక పరిశోధనలు గణనీయంగా పెంచుతుండటం, సైన్స్‌–టెక్నాలజీ రంగంలో దరిదాపులకు వస్తుండటం, కొన్నింటిలో ఇప్పటికే అమెరికా కన్న ముందుకు పోవటం వంటివి ఇప్పటికే కనిపిస్తున్నాయి. 

ఏక ధ్రువ ప్రపంచం నుంచి బహుళ ధ్రువ ప్రపంచం అనే నినాదం, బ్రిక్స్, బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బిఆర్‌ఐ) వంటి సంస్థలు, ఇతర దేశాలతో అమెరికా కూటమికి భిన్నంగా విన్‌–విన్‌ పాలసీ (మీరు, మేము ఉభయులమూ లాభపడాలి) అనే ఆర్థిక సంబంధాలు, మీ అంతర్గత విషయాలలో అమెరికా కూటమి వలె జోక్యం చేసుకోబోమనే రాజకీయ విధానం, సైన్స్‌ – టెక్నాలజీ బదిలీలు మొదలైనవి దీర్ఘకాల ఆర్థిక – రాజకీయ వ్యూహాలు అవుతున్నాయి. 

అందుకు ఒక మంచి ఉదాహరణను చెప్పాలంటే, నేను చైనాలో ఉన్న రోజులలోనే బ్రిక్స్‌ సమావేశాలు బ్రెజిల్‌లో జరిగాయి. ఆ సంస్థలో చేరే దేశాలపై పెద్ద ఎత్తున అదనపు సుంకాలు విధించగలమని గతం నుంచి హెచ్చరిస్తుండిన ట్రంప్, అదే హెచ్చరిక తిరిగి చేశారు. కానీ, అదేమీ లెక్క చేయకుండా ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాల నుంచి మరొక 16 దేశాలు కొత్తగా  చేరాయి. ఇవన్నీ అమెరికా పలుకుబడిని తగ్గించి చైనా పలుకుబడిని పెంచేవి. చైనా 2049 నాటికి అగ్రరాజ్యమయ్యేందుకు తోడ్పడగలవి.

ఇవే రంగాల గురించి తెలుసుకోగలది ఇంకా చాలా ఉంది గానీ అదంతా ఇక్కడ చెప్పుకోలేము గనుక మొదట ప్రస్తావించిన ప్రశ్నలలో రెండు ముఖ్యమైన వాటి గురించి కొద్దిగా చూద్దాము. అక్కడ మార్క్సిజం, సోషలిజం, క్యాపిటలిజం పరిస్థితి ఏమిటన్నది ఒకటి. ప్రజలకు గల స్వేచ్ఛలు ఏమిటన్నది రెండవది. క్యాపిటలిజం పెట్టుబడులు, వ్యాపారం, లాభాలు అక్కడి ప్రభుత్వపరంగా, సంపన్నులైన చైనీయులపరంగా, బయటి దేశాలతో ఉమ్మడి పెట్టుబడుల పరంగా బాగా వర్ధిల్లుతున్నాయి. 

ఈ విధానాలు డెంగ్‌ శియావో పింగ్‌ సంస్కరణలు, 2001లో డబ్ల్యూటీవోలో చైనా చేరటం నుంచి మొదలై సాగుతున్నాయి. ఆ విధంగా ఒనగూరే లాభాలు, సమాజంలో కింది స్థాయి వరకు లభిస్తున్న ఆదాయాలూ క్లాసికల్‌ సోషలిజానికి ప్రత్యామ్నాయంగా మారాయి. సోషలిజం విత్‌ చైనీస్‌ క్యారక్టరిస్టిక్స్‌ అన్న డెంగ్‌ సూత్రీకరణకు రూపం, సారం ఇదేననుకోవాలి. 

అడుగడుగునా కెమెరాల నిఘాలు, మౌలికంగా వ్యవస్థకు వ్యతిరేకమైన చర్యలను సహించక పోవటం, ఒకే పార్టీ వ్యవస్థల వల్ల ఎన్నికలు గ్రామస్థాయిలో తప్ప ఇతరత్రా లేకుండటం మినహా, ఇక్కడ ఉన్న స్వేచ్ఛలన్నీ అక్కడా కనిపించాయి. చదువులు, ఉద్యోగ వ్యాపారాలు, దేశ విదేశాలకు ప్రయాణాలు, సంపాదనలు, ఖర్చులు, అవినీతి, విలాసాలు, కోరుకున్నట్లు బట్టలు వేసుకోవడం, కొన్ని అవలక్షణాలు, సంప్రదాయికమైన నమ్మకాలు, ఆచారాలు అన్నీ ఉన్నాయి. చివరకు నైట్‌ లైఫ్‌ వీధులు, మసాజ్‌ పార్లర్లు, సెక్స్‌ టాయ్‌ షాపులు సహా. సగటు మనిషికి ఇంతకన్న కావలసిన స్వేచ్ఛలేమిటి?

టంకశాల అశోక్‌  
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement