
మాధవ్ శింగరాజు
ఇరవై అంటే ఇరవయ్యే నిముషాల ఇంటర్వ్యూ కోసమని నన్ను నమ్మించి తన స్టూడియోకి రప్పించుకున్నాడు విక్కీ లల్వాని! గంటా ఇరవై నిముషాలు అయింది. ఎంతకూ వదలడు.రెండో ప్రశ్న వెయ్యడు.
‘‘ఒక్కమాట చెప్పండి ప్రహ్లాద్‌జీ! ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ ఏ క్షణమైనా విడిపోవచ్చునంటారా?’’ అంటాడు.
ఏ క్షణమైనా జరిగేవి లోకంలో కొన్ని మాత్రమే ఉంటాయి. విలయాలు, విపరీతాలు, ప్రళయాలు, ప్రకంపనాలు! ఆ జాబితాలోనే ఇప్పుడు ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్‌ల విడాకులను కూడా చేర్చినట్లున్నాడు అతడు.
‘‘చెప్పండి ప్రహ్లాద్‌జీ, వాళ్లిద్దరూ విడిపోకుండా ఏ శక్తీ ఆపలేదంటారా?’’ అన్నాడు మళ్లీ!
నా డెబ్బై ఐదేళ్ల వయసులో ఇలాంటి ఒక ప్రశ్నకు నేను సమాధానం ఇవ్వవలసిన భాగ్యం నాకు దక్కుతుందని విధి నన్ను ముందే ఆశీర్వదించి కిందికి పంపిందా?!
బాంద్రాలోని లామెర్ బిల్డింగులో ఐశ్వర్య తల్లి బృందా రాయ్ ఉండే ఫ్లాట్ పక్కనే నేనుండే ఫ్లాటు ఉంటుంది. అందుకే నన్నతడు పట్టి పీడిస్తున్నాడు.
‘‘వాళ్లు విడిపోతారని మీకెందుకు అనిపిస్తోంది విక్కీ? వారిలో మీరు చూడ కూడనిది ఏం చూశారు? చూడవలసినది ఏం చూడకుండా ఉండిపోయారు?’’ అని అడిగాను.
‘‘ప్రహ్లాద్‌జీ! ఈమధ్య ఐశ్వర్య తన అత్తగారిల్లు జుహూలో కాకుండా, బాంద్రా లోని తన తల్లిగారి ఇంట్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారని విన్నాను’’ అన్నాడు విక్కీ.
తల్లి గారింట్లో ఎక్కువగానా! తల్లిగారింట్లో ఎంత ఎక్కువ మాత్రం ఎక్కువవుతుంది కూతురికి!
ఐశ్వర్య ప్రతి రోజూ ఆరాధ్యను అంబానీ స్కూల్‌లో డ్రాప్ చేసి, తిరిగి ఒంటిగంటకు పికప్ చేసుకోటానికి మళ్లీ స్కూల్‌కి వెళ్తుంది. ఆ మధ్యలో మూడు గంటలు గడవాలి కనుక ఆ మూడు గంటలూ, ఆ దగ్గరలోనే ఉండే తల్లితో ఉంటుంది. ఆ విషయమే చెప్పాను విక్కీకి.
విక్కీ కడుపు నిండినట్లు లేదు.
‘‘మరి ఐశ్వర్య, అభిషేక్ ఎందుకని బయటెక్కడా కలిసి కనిపించటం లేదు ప్రహ్లాద్ జీ?’’ అంటాడు!
భార్యాభర్తలు అనేవాళ్లు కలిసి జీవిస్తారు కానీ, కలిసి కనిపించరు. ఇంట్లో కూడా ఒకరు హాల్లో ఉంటే, ఒకరు బాల్కనీలో ఉంటారు. ఒకరు టీవీ ముందు ఉంటే ఇంకొకరు కిచెన్‌లో ఉంటారు. ఇక బయటైనా వాళ్లెందుకు కలిసి కనిపించాలి? ఐశ్వర్య, అభిషేక్ కూడా భార్యాభర్తలే కదా!
అయితే విక్కీతో నేనామాట అనలేదు. అన్నానంటే – ‘‘వాళ్లు విడిపోతున్న మాట నిజమేనన్న మాట!’’ అని సంతృప్తిగా నా కళ్లలోకి చూస్తాడు. అతడికి ఆ సంతృప్తిని నేను ఇవ్వదలుచుకోలేదు.
‘‘ఐశ్వర్య, అభిషేక్ కలిసి కనిపించకుండా ఎప్పుడున్నారు విక్కీ! ఈ మధ్యే కదా కూతురుతో కలిసి వాళ్ల 18వ పెళ్లి రోజును కూడా జరుపుకొన్నారు’’ అన్నాను.
విక్కీ తన ఆశలు కోల్పోలేదు.
‘‘మరైతే ప్రహ్లాద్‌జీ, ‘డివోర్స్’ మీద ఎవరిదో ఆర్టికల్‌కు సోషల్ మీడియాలో అభిషేక్
ఎందుకు లైక్ కొట్టారంటారు?’’ అన్నాడు.
నీరసంగా మూలిగాన్నేను.
ఎవరు ఏ పోస్టుకు ఎందుకు లైక్ కొడతారో ఎవరు చెప్పగలరు! నేను అనుకో వటం అభిషేక్ లైక్ కొట్టింది ఆ ఆర్టికల్‌కి అయివుండదు. ఆ ఆర్టికల్‌కు ఇన్‌పుట్స్ ఇచ్చిన డాక్టర్ జిరక్ మార్కర్‌కి అయివుంటుంది. జిరక్ ఐశ్వర్య స్నేహితుడు. ఇద్దరూ జై హింద్ కాలేజ్‌లో కలిసి చదువుకున్నారు.
‘‘ఏమిటి ఆలోచిస్తున్నారు ప్రహ్లాద్‌జీ? అభిషేక్ ఆ పోస్ట్‌కి లైక్ ఎందుకు కొట్టారంటారు?’’– విక్కీ వదలటం లేదు.
పైకి కనిపించే లైక్‌లను మాత్రమే లోకం చూడగలదు. బహుశా ఆ లైక్... ఐశ్వర్యకు అభిషేక్ – ఎవరికీ కనిపించకుండా కొట్టిన లైక్ ఎందుకు అయివుండ కూడదు?!