
మాధవ్ శింగరాజు
‘‘మీరిద్దరూ ఒకే గదిలో కలిసి కనిపించటం ఎంతో బాగుంది మిస్టర్ అండ్ మిసెస్ ఒబామా’’ అన్నారు క్రెయిగ్, నవ్వుతూ.
క్రెయిగ్ ‘ఐఎంఓ’ పాడ్ కాస్ట్ హోస్ట్.
‘ఇన్ మై ఒపీనియన్’ అనే ఆ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలలో క్రెయిగ్ తన సుతిమెత్తనైన చిరునవ్వులతో గెస్టుల గుండె కవాటాలను తెరుచుకుని ఏ విధమైన అనుమతి, ఆహ్వానం లేకుండానే లోపలికి చొరబడతారు.
‘‘మేమిద్దరం ఒకే గదిలో కలిసి ఉండటం అనే విషయానికి మీరిస్తున్న ప్రాధాన్యం దేనిని సంకేతపరుస్తున్నట్లుగా నేను భావించవచ్చు మిస్టర్ క్రెయిగ్?’’ అన్నాను, నవ్వుతూ.
ఆ మాటకు క్రెయిగ్ తగు మోతాదులోనే నవ్వారు కానీ, అక్కడే ఉన్న నా హస్బెండ్ బరాక్ ఒబామా... ఆ చిన్న పాడ్‌కాస్ట్ స్టూడియో మొత్తం అదిరిపడేంతగా నవ్వారు.
అంతలా నవ్వటం ద్వారా ఆయన ఆ స్టూడియో వాళ్లకి ఏం తెలియపరచాలని అనుకుంటున్నారు? ‘‘నిజమే, మేమిద్దరం ఒకే గదిలో కలిసి ఉండటం లేదు’’ అనా? ‘‘ఉండక పోవటానికి కారణం నా వైఫ్’’ అనా?
భర్తలు భార్యలకు తలనొప్పిగా మారటానికి పెద్ద పెద్ద కారణాలు అక్కర్లేదు. చిన్న చిన్న అకారణాలు చాలు.
‘‘ఏమీ లేదు’’ అని బరాక్ చెప్పటం, ‘‘ఏదో ఉంది’’ అనుకునేలా ఉంటుంది!
‘‘వెల్, చెప్పండి మిస్టర్ ఒబామా... మీరిద్దరూ ఒకే గదిలో కలిసి ఉండలేని ‘యుగాంతం’ వంటిదొకటి మీ దాంపత్య జీవితంలోకి ఒక దుర్భరమైన శీతాకాలంలా అడుగుపెట్టిందని అమెరికన్ ప్రజలంతా అనుకోవటానికి కారణం ఏమై ఉంటుందని మీరు ఊహిస్తున్నారు?’’ అని అడిగారు క్రెయిగ్... ‘యుగాంతం’ అన్న మాటను మృదువుగా నొక్కి వదులుతూ.
బరాక్ కొద్ది క్షణాలు మౌనంగా ఉన్నారు. ఆయన ఏం చెబుతారా అని ఆ కొద్ది క్షణాలూ నేను టెన్షన్‌తో చచ్చిపోయాను.‘‘మిస్టర్ క్రెయిగ్... మీరంటున్నది నేనూ, మిషెల్ ఒకే ‘గది’లో కలిసి ఉండక పోవటం గురించా లేక, ఒకే ‘ఇంట్లో’ కలిసి ఉండక పోవటం గురించా? ఎందుకంటే, ఇంట్లో గది ఉంటుంది కానీ, గదిలో ఇల్లు ఉండదు కదా’’ అని పెద్దగా నవ్వారు.
నేను కోపంగా బరాక్ వైపు చూశాను.
ఏమిటతని ఉద్దేశం? ఒకే ఇంట్లో ఉంటున్నాం కనుక ఒకే గదిలో లేకుంటే మాత్రం ఏమిటని ప్రశ్నించటమా? లేక, ‘‘అవును, మేము ఒకే గదిలో ఉండటం లేదు’’ అని నిర్ధారణ చేసి చెప్పటమా?
క్రెయిగ్, చిరునవ్వుతో నన్నే గమనిస్తూ ఉన్నారు. ఆయన ‘ఐఎంఓ’ పాడ్ కాస్ట్ హోస్ట్ మాత్రమే కాదు. నా సొంత అన్నయ్య కూడా.
బరాక్ అంటే క్రెయిగ్‌కి చాలా రెస్పెక్ట్. నేనంటే అంతకు మించిన ఇష్టం. బరాక్ మీద ఉండే రెస్పెక్ట్‌నీ, నేనంటే ఉండే ఇష్టాన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక ఔట్‌సైడర్‌గా మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు క్రెయిగ్.
‘‘మీరు చెప్పండి మిసెస్ ఒబామా.
కొంతకాలంగా మీరు మిస్టర్ ఒబామాతో కలిసి బయటెక్కడా కనిపించలేదు. మీ దాంపత్య జీవితం హ్యాపీగానే ఉందని మీరు చెప్పగలుగుతారా?’’ అన్నారు క్రెయిగ్.
‘‘ఎస్, అఫ్‌కోర్స్ మిస్టర్ క్రెయిగ్! హ్యాపీగా ఉన్నాం. ఇక మీదటా హ్యాపీగా ఉంటాం. ఎప్పటికీ హ్యాపీగా ఉంటాం. నా భర్తను వదిలేయాలని నేను ఏ క్షణమూ అనుకోలేదు. మాకు చాలా కష్టాలు ఎదురయ్యాయి, అయినా ఒకటిగా ఉన్నాం’’ అని చెప్పాను.
‘‘అవును, నా భార్య నన్ను మళ్లీ స్వీకరించింది’’ అన్నారు ఒబామా, హఠాత్తుగా మధ్యలోకి వచ్చి!
దేవుడా! ఈయనెందుకు అడగని విషయాలన్నీ చెబుతుంటారు?! భర్తలంతా ఇంతేనా, బరాక్ ఒబామా ఒక్కరే ఇలానా?
నయం, ఇద్దరూ కూతుళ్లే అయ్యారు! కొడుకు కూడా ఉండుంటే, ఊపిరి ఆడకుండా ప్రేమగా నా మెడను చుట్టేయటానికి ‘మరొక బరాక్’ తయారై ఉండేవాడు!