
మాధవ్ శింగరాజు
శ్రీ మోదీజీకి, నాకు ఈ ఏడాదితో 75 నిండుతాయి. నేను ఆయన కన్నా ఓ ఆరు రోజుల ముందు డెబ్బై ఐదును దాటేస్తాను. డెబ్బై ఐదేళ్లు పూర్తయిన వాళ్లు పదవి నుంచి హుందాగా తప్పుకుని, తర్వాతి వాళ్లకు సగౌరవంగా దారివ్వాలనేమీ ఆరెస్సెస్‌లో రూలు లేదు, రాజ్యాంగమూ లేదు కనుక, రిటైర్మెంట్ ప్లాన్‌ల గురించి చింతపడే అవసరం డెబ్బై ఐదు దాటిన ఆరెస్సెస్ చీఫ్‌లకు ఏ రోజూ ఉండదు.
‘ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్’ అంటారు! ఆరెస్సెస్‌లో ఏజ్ అసలు నంబరే కాదు. బాలాసాహెబ్ దేవరస్ డెబ్బై ఐదు దాటాక కూడా మూడేళ్లు ఆరెస్సెస్ చీఫ్‌గా ఉన్నారు. రజ్జూ భయ్యా డెబ్బై ఐదు దాటాక కూడా ఐదేళ్లు చీఫ్‌గా ఉన్నారు. కేఎస్ సుదర్శన్ డెబ్బై ఐదు దాటాక కూడా మూడేళ్లు చీఫ్‌గా ఉన్నారు.
బీజేపీలో కూడా ఈ డెబ్బై ఐదు అన్నది అసలు ఒక నంబరే కాకపోయేది. కానీ శ్రీ మోదీజీ వచ్చి అత్యవసరంగా దానికొక నంబర్ హోదాను కల్పించారు.
డెబ్బై ఐదు దాటిన అద్వానీని, మురళీ మనోహర్ జోషిని, జశ్వంత్ సింగ్‌ని మార్గదర్శకులుగా మార్చి, రాజకీయాల నుంచి వీడ్కోలు ఇప్పించారు. డెబ్బై ఐదు దాటిన ఎవరికైనా ‘‘నో టిక్కెట్’’ అన్నారు. డెబ్బై ఐదు దాటాయని గుజరాత్ సీఎం ఆనందీబెన్ పటేల్‌ను మధ్యలోనే కుర్చీలోంచి లేపేశారు. ఇప్పుడా డెబ్బై ఐదు అటు తిరిగి ఇటు తిరిగి శ్రీ మోదీజీ వైపే ఒక గ్రహ శకలంలా రాబోతోంది.
ఆ గ్రహ శకలం ఆయన్ని ఢీ కొంటుందా, లేక ఆయనే ఆ గ్రహ శకలాన్ని ఢీ కొంటారా అన్నది సెప్టెంబర్ 17న కానీ తెలీదు. ఆ రోజు శ్రీ మోదీజీ బర్త్ డే.
‘‘డెబ్బై ఐదు అన్నది మోదీజీ నిర్ణయమే తప్ప, ఆయన పెట్టిన నియమం కాదు’’ అని అమిత్ షా ఎప్పటికప్పుడు పార్టీని, ప్రతిపక్షాలను నెట్టుకొస్తున్నారు. అందుకు ఆయనను అభినందించాలి.
ఆరెస్సెస్ వందేళ్ల వేడుకలకు మార్చిలో శ్రీ మోదీజీ నాగపుర్ వచ్చినప్పుడు ఆయన ఎంతో భావోద్వేగంతో కనిపించారు. ఆరెస్సెస్‌ను ఒక పెద్ద మర్రిచెట్టుతో పోల్చారు.
ఆరెస్సెస్ కూడా శ్రీ మోదీజీని చూసి అదే స్థాయిలో భావోద్వేగానికి గురైంది. ముఖ్యంగా నేను గురయ్యాను. పదవిలో ఉండగా ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని శ్రీ మోదీజీ!
అటల్‌జీ ఓడిపోయి, బీజేపీ నిర్వేదంలో మునిగి ఉన్నప్పుడు, పార్టీకి ప్రధాని అభ్యర్థిగా నేను చేసిన ఎంపికే శ్రీ నరేంద్ర మోదీజీ. నేను నాటిన మహా మర్రి ఆయన.
శ్రీ మోదీజీ నాగపుర్ వచ్చి ఢిల్లీ వెళ్లిపోగానే ఇక్కడ ముంబైలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మొదలు పెట్టేశారు! ‘‘డెబ్బై ఐదు నిండాక కూడా ప్రధానిగా కొనసాగేందుకు పర్మిషన్ కోసం మోదీ నాగపుర్ వచ్చి, మోహన్ భాగవత్‌ను కలిసి వెళ్లారు’’ అని!!
నిజానికి శ్రీ మోదీజీ, నేను ఆ రోజు మాట్లాడుకున్నది భారత స్వాతంత్య్ర దినోత్సవానికి 2047లో రానున్న వందేళ్ల గురించే కానీ, 2025లో భారత ప్రధానికి నిండనున్న డెబ్బై ఐదేళ్ల గురించి కాదు.
ఆరెస్సెస్ సిద్ధాంత కర్త మోరోపంత్ పింగ్లే అనేవారు... డెబ్బై ఐదు దాటాయని మీకెవరైనా శాలువా కప్పితే దానర్థం మీరిక విశ్రాంతి తీసుకోవాలనీ, కొత్తవారికి అవకాశం ఇవ్వాలనీ!
పింగ్లేకి డెడికేట్ చేసిన ఒక సభలో మొన్న నేను ఈ మాట గుర్తు చేసుకున్నప్పుడు, వెంటనే కాంగ్రెస్ నా మాటను బంతిలా క్యాచ్ పట్టేసింది. ‘‘చూశారా, మోదీని దిగిపొమ్మని మోహన్ భాగవత్ ఎంత సంకేతంగా చెబు తున్నారో...’’ అని ప్రచారం మొదలు పెట్టింది.
అదే రోజు వేరొక సభలో అమిత్ షా – తను రిటైర్ అయ్యాక వేదాలు, ఉపనిషత్తులలో పడిపోతానని, ప్రకృతి వ్యవసాయం చేస్తానని అన్నారు! సహకార సంఘాల మహిళలతో మాట్లాడే సందర్భంలో ఆయన అలా అన్నారు.
నేనైనా, అమిత్ షా అయినా సందర్భాన్ని బట్టే మాట్లాడాం. అయితే మా రెండు సందర్భాలూ... ఏ మాత్రం సమయం,సందర్భం కానీ టైమ్‌లో వచ్చిపడ్డాయంతే!