
అమెరికాలో కొత్త ప్రభుత్వ సమర్థతను మదింపు చేసేందుకు సాధారణంగా, అధ్య క్షుడి మొదటి 100 రోజుల పాలనను లెక్క లోకి తీసుకుంటారు. కానీ, ట్రంప్ రెండవ విడత పాలన మొదలై 180 రోజులు గడు స్తున్నా వాణిజ్య వివాదాలకు పరిష్కారం ఒక కొలిక్కి రాలేదు. ఉక్రెయిన్, గాజాలలో సైనిక కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయి. వ్యూహాత్మక భాగస్వామి అమెరికా, ముఖ్య మైన ఆర్థిక పోషక దేశం చైనాలతో సంబంధాలలో సమతూకం పాటించేందుకు ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథొని ఆల్బనీస్ జూలై నెల మధ్యలో 6 రోజుల పర్యటనపై చైనా వెళ్ళారు.
దౌత్యం, వాణిజ్యంతో వ్యవహరిస్తున్న భారత దౌత్యవేత్తలు కూడా అలాంటి సందేహ డోలనే ఎదుర్కొంటున్నారు. ‘బ్రిక్స్’ శిఖ రాగ్ర సభలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆ మధ్య బ్రెజిల్ వెళ్ళారు. ఆయన భారత్‌కు తిరిగి వచ్చే మార్గ మధ్యంలో ఉన్నప్పుడే బ్రెజిల్ అధ్యక్షుడు లూల డ సిల్వా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మధ్య వాగ్వాదం నెలకొంది. వారి మధ్య మాట మాట పెరగడానికి విదేశాంగ విధానంపై అభిప్రాయ భేదాలు కారణం కాదు.
బ్రెజిల్ ఆంతరంగిక వ్యవహారాలలో ట్రంప్ బాహాటంగా జోక్యం చేసుకోవ డమే తగాదాకు దారితీసింది. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జాయిర్ బొసొనారొపై విచారణకు స్వస్తి పలకాలని ట్రంప్ డిమాండ్ చేశారు. దీనిపై అమెరికా జోక్యాన్ని లూల తిరస్కరించారు. అమెరికా దండి స్తున్నట్లుగా సుంకాలు విధిస్తే తామూ ప్రతీకార చర్యలకు దిగాల్సిఉంటుందని హెచ్చరించారు.
చైనాతో సవ్యంగా లేకపోయినా...
ఆ విధంగా, ప్రజానీకం నేడు రెండు ధ్రువాల ప్రపంచాన్ని ఎదు ర్కొంటోంది. ‘నాటో’ దేశాల మద్దతు ఎంతవరకు లభిస్తుందో తెలియకపోయినా, వాటిని తోడు చేసుకుని అమెరికా ఒక ధ్రువంగా ఉంది. చైనా–రష్యా ఇరుసు రెండవదిగా ఉంది. ప్రచ్ఛన్న యుద్ధం నాటి స్థితితో పోలిస్తే, ఒక్కటే తేడా కనిపిస్తోంది. చైనా–అమెరికా ప్రత్యర్థులే కావచ్చు కానీ, వాణిజ్యం, సాంకేతికతల విషయంలో అవి ప్రస్తుతం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి.
ప్రచ్ఛన్న యుద్ధ ప్రత్యర్థులైన సోవియట్ యూనియన్, అమెరికా మధ్య అప్పట్లో అలాంటి సంబంధాలు ఉండేవి కావు. దాంతో, బ్రెజిల్, భారత్ లాంటి ప్రవర్ధమాన దేశాలకు ఈ రెండు ధ్రువాల మధ్య సమతౌల్యం పాటించడం కష్టంగా మారుతోంది. చైనాతో మనకు సరిహద్దు వివాదం ఉండటం, మనల్ని చైనా ఒక బలమైన ప్రత్యర్థిగా చూస్తూండటం వల్ల, మన పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది.
ఆగస్టు 1లోగా, ఏదో ఒక అంగీకారానికి రాకపోతే, ‘ప్రతిగా ఎదురు కాగల సుంకాలను’ తప్పించుకునేందుకు అమెరికాతో ఒక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడం భారత్‌కు తక్షణ సమస్యగా ఉంది. అధ్యక్షుడు ట్రంప్ సుంకాలపై తడవకో మాట మాట్లాడుతున్నారు. ఇదంతా అనిశ్చితిని పెంచుతోంది. ‘విముక్తి దినం’గా ప్రకటించిన ఏప్రిల్ 2 నుంచి రెండు డజన్లకు పైగా పర్యాయాలు సుంకాలపై తలకిందుల ధోరణిని చూశాం.
సుంకాల పేరిట అమెరికా బెదిరింపులు పరిపాటిగా మారడంతో కాబోలు,అంతర్జాతీయ మార్కెట్లు కూడా వాటిని పెద్దగా లెక్కలోకి తీసు కోవడం మానేశాయి. ‘90 రోజులలో 90 ఒప్పందాలు’ అంటూట్రంప్ చేసిన వాగ్దానం నీటిమీద రాతగా మారింది. ఒక్క వియత్నాం, బ్రిటన్‌లతోనే వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. చైనాతో పాక్షికంగా మాత్రమే అవగాహన కుదిరింది.
వాణిజ్య ఒప్పందం కొరవడిన నేపథ్యంలో, ఆగస్టు 1 తర్వాత, అమెరికా 30% సుంకాల బెదిరింపును అమలు జరిపితే తామువిధించగల ప్రతీకార సుంకాల జాబితా సిద్ధంగా ఉందని యూరోపి యన్ యూనియన్ వెల్లడించింది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొని ఆల్బనీస్ బాటనే భారత్ కూడా అనుసరించింది. షాంఘై సహకార సంస్థ సమావేశాలలో పాల్గొనేందుకు బీజింగ్ వెళ్ళిన భారతవిదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, భారత్–చైనా సంబంధాలను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు.
అయితే, వాస్తవాధీన రేఖ వద్ద సేనల ఉపసంహరణ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా, పాకిస్తాన్‌కు చైనా క్రియాశీల సహాయం అందించిన సంగతి తెలిసిందే. వీటికితోడు, దలైలామా 90వ పుట్టిన రోజు ఈ సమయంలోనే వచ్చింది. దలైలామాకు క్రియాశీల మద్దతు ఇవ్వడం ద్వారా, టిబెట్‌పై తమ పట్టును తగ్గించడంలో భారత్ తోడుదొంగగా వ్యవహరిస్తోందని చైనా భావిస్తోంది. అదే సమయంలో, ట్రంప్ కల్లోలిత ప్రపంచంలో, భారతీయ మార్కెట్ ప్రాధాన్యాన్ని చైనా గ్రహించింది.
పాకిస్తాన్‌కు అమెరికా స్నేహహస్తం
అమెరికాతో తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసు కునేందుకు భారత్ కడపటి ప్రయత్నాలలో ఉంది. భారతీయదృక్కోణం నుంచి చూసినప్పుడు వ్యావసాయిక, పాడిపరిశ్రమ మార్కెట్లను సంరక్షించుకోవడం ప్రాధాన్యంగా ఉంది. ఎలాన్ మస్క్ సంస్థ ‘టెస్లా’ ముంబయిలో తన మొదటి షోరూమ్ తెరవడం, సాధారణ పరిస్థితులలోనైతే, సానుకూల సంకేతంగానేఉండేది. కానీ, ఆయనకు, అధ్యక్షుడు ట్రంప్‌కి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. భారత్–అమెరికా వాణిజ్య వివాదాన్ని పరిష్క రించడంలో మాట సాయం చేయగల స్థితిలో లేనని మస్క్ చేతులు ఎత్తేయవచ్చు.
భారత్ దౌత్యపరంగా పెద్ద సవాల్‌నే ఎదుర్కొంటోంది. అమె రికాతో పెంచిపోషించుకుంటూ వచ్చిన సన్నిహిత సంబంధాలు ఏ మేరకు ప్రతిఫలాలు చూపగలవో తెలియడం లేదు. పాకిస్తాన్‌కు అమెరికా చాస్తున్న స్నేహ హస్తమే ఇందుకు నిదర్శనం. జైలులో ఉన్న పాకిస్తాన్ తెహ్రీక్–ఏ–ఇన్సాఫ్ నాయకుడు ఇమ్రాన్ ఖాన్‌తో సయోధ్య కుదుర్చుకోవలసిందిగా పాక్ సైన్యాన్ని అమెరికా ప్రభుత్వం ముందుకు తోస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అమెరికా నిర్దేశించిన 50 రోజుల గడువు లోగా ఉక్రెయిన్‌తో రష్యా కాల్పుల విరమణకు రాకపోతే, రష్యా నుంచి చమురు కొనే అన్ని దేశాలను అమెరికా లక్ష్యం చేసుకోగల కత్తి కూడా భారత్ మెడపై వేలాడుతోంది.
చైనాకు దగ్గరయ్యేందుకు ఆస్ట్రేలియా ప్రధాని చేసిన ప్రయత్నం చూసిన అమెరికా, ఆస్ట్రేలియాతో (బ్రిటన్‌తో కలుపుకొని) ఉన్న వ్యూహాత్మక త్రైపాక్షిక పొత్తును సమీక్షిస్తామని సంకేతాలుపంపుతోంది. ఆ పొత్తు ప్రకారం ఆస్ట్రేలియాకు అణు జలాంత ర్గాములు అందవలసి ఉంది. తైవాన్ విషయంలో చైనాతో సైనిక ఘర్షణ తలెత్తితే, తమకు అండగా ఉంటామంటూ హామీ ఇవ్వాలని జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలను పెంటగాన్ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఒకపక్క వివిధ దేశాలపై ఏకపక్షంగా సుంకాలు విధించు కుంటూపోతున్న అమెరికా, ఒకవేళ చైనాతో ఏదైనా ఘర్షణ తలెత్తితే, వ్యూహాత్మక మిత్ర దేశాల నుంచి క్రియాశీల సైనిక మద్దతు ఆశించడం కష్టమన్న వాస్తవాన్ని మాత్రం విస్మరిస్తోంది.
అయితే, ట్రంప్ తాను మొదలెట్టిన వాణిజ్య యుద్ధానికి తానే త్వరలో ఒక పరిష్కారం కనుగొనక తప్పని స్థితిలో పడవచ్చు.ఎందుకంటే, లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఎప్‌స్టైన్‌కు సంబంధించిన పత్రాలు ప్రస్తుతం అమెరికా న్యాయ శాఖ వద్ద ఉన్నాయి. ఆ నేరాలతో మరికొందరు ప్రముఖుల పేర్లు కూడా ముడిపడి ఉన్నాయి. వాటిలో ట్రంప్ పేరు కూడా ఉందని మస్క్ వెల్లడించారు. ట్రంప్ ఆ రొంపి నుంచి బయటపడే హడావిడిలో కూడా ఉన్నారు. అమెరికా నుంచి చమురు కొనుగోళ్ళను భారత్ ఇప్పటికే పెంచింది.
భారత్ తమ నుంచి రక్షణ సామగ్రిని ఎక్కువ కొనుగోలు చేయాలని అమెరికా కోరుకోవడం మరో సమస్యగా ఉంది. కానీ, సైనిక పరంగా అమెరికాపై మితిమీరి ఆధారపడటం వ్యూహాత్మకంగా పెద్ద పొరపాటు అవుతుంది. ప్రస్తుత ప్రపంచ రాజకీయ–ఆర్థిక స్థితిగతులు ‘ప్రతి ఒక్కరినీ ఊహాగానాలకు లోను చేస్తు న్నాయి’ అని ఎకనామిస్ట్ మ్యాగజైన్ ఇటీవల వ్యాఖ్యానించడంలో వింతేముంది?
-వ్యాసకర్త విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)
-కె.సి. సింగ్