
అదృష్ట సూచిక నిన్న ఉన్నట్లుగా నేడు ఉండదు. నేడు ఉన్నట్లుగా రేపు ఉండదు. కానీ, నిన్న – నేడు – రేపు కూడా మనం ఒకేలా ఉండాలి! ఒక అదృశ్య సూచికలా, ఒక నిశ్శబ్ద వీచికలా. కష్టకాలాన్ని ఎలాగైనా దాటుకుని వెళ్లొచ్చు. గొప్ప వైభోగాన్ని పట్టించి, ధనరాశులను దట్టించి, కీర్తి ప్రతిష్ఠల్లో ఊరేగిస్తున్న కాలాన్ని తట్టుకుని నిలబడటానికే మనిషికి శక్తి కావాలి. తలపై కిరీటం ఉన్నా లేకున్నా తల ఎప్పుడూ తలలా ఉండాలి. కిరీటంలా ఉండకూడదు.
బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్‌లో నేను బిలియనీర్‌ని అయ్యానని తెలియగానే, ‘ఇంప్రెసివ్’ అని ట్వీట్ చేశారు ఎలాన్ మస్క్! ముకుళిత హస్తాల సింగిల్ ఎమోజీతో నేనూ వెంటనే ఆయనకు ధన్యవాదాలను ట్వీట్ చేశాను. మితభాషణ మనుషుల్ని మరింతగా దగ్గర చేస్తుంది. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్‌లో నా బిలియనీర్ స్టేటస్ మారుతూ ఉంటుంది. కానీ, ఎప్పటికీ మారని స్టేటస్ సుందర్ పిచాయ్ అనే నా ఐడీ.
సక్సెస్ మీట్‌లో ఉన్నాం కంపెనీ స్టాఫ్ అందరం. నేను వేదిక మీద ఉన్నాను.
‘‘స్టేటస్‌లో ఒక్కోసారి కిందికి జారిపోతాం. ఆ ఫెయిల్యూర్‌ను కూడా చొక్కా జేబుకు ధరించదగిన గౌరవప్రదమైన బ్యాడ్జిలానే భావించాలి’ అన్నాన్నేను.
‘‘బట్, మిస్టర్ పిచాయ్... ఫెయిల్యూర్ అన్నది సంతోషించ తగిన విషయమైతే కాదు కదా? ఎలా ధరించగలం ఆ బ్యాడ్జిని?’’ అని, టీమ్‌లోకి కొత్తగా వచ్చిన అబ్బాయిలు, అమ్మాయిలు!
వాళ్లనేది నిజమే. కానీ, ఒక వ్యక్తి సంతోషంగా ఉండటం అంటే ఆ వ్యక్తి జీవితంలో ప్రతిదీ సరిగ్గా ఉందని అర్థం కాదు. జీవితంలో ప్రతిదాని పట్ల ఆ వ్యక్తి వైఖరి సరైనదిగా ఉందని. ఆ మాటే చెబుతూ, ‘‘సంతోషం మనం చూసేది కాదు, మనకు కనిపించేది’’ అన్నాను.
‘‘అర్థం కాలేదు మిస్టర్ పిచాయ్’’ అంటూ ఆడియె¯Œ ్సలోంచి ఓ గర్ల్ ఇంటర్న్!
ఒక్కసారిగా నవ్వాన్నేను. ఆ అమ్మాయి మాటలకు నాకు అంజలి గుర్తొచ్చింది.
కాలేజ్‌లో అంజలి సరిగ్గా ఇలానే అంటుండేది... ‘‘అర్థం కాలేదు సుందీ...’’ అని!
అర్థం కాకపోవటానికి అంతగా నేను అర్థం కాకుండా ఏం మాట్లాడేవాడినో నాకు అర్థం అయ్యేది కాదు.
‘‘మీ మాటల్ని కూడా తమరు నా చేతే మాట్లాడించే వారు కదా. అందుకే తమర్ని మళ్లీ మళ్లీ మాట్లాడించటం కోసం ‘అర్థం కాలేదు సుందీ’ అంటుండేదాన్ని అని మా పెళ్లయ్యాక ఆ రహస్యాన్ని విప్పింది అంజలి!
ఖరగ్‌పూర్ ఐఐటిలో మా ఇద్దరిదీ సేమ్ బ్యాచ్. నాది మెటలర్జికల్ ఇంజినీరింగ్. తనది కెమికల్ ఇంజినీరింగ్. నేనుండేది నెహ్రూ హాల్. తనుండేది ఆల్ గర్ల్స్ హాస్టల్. తనకు తెలియకుండా నేను తనను చూస్తుండే వాడిని. తర్వాత తెలిసింది నాకే తెలియకుండా నేను తనని ప్రేమిస్తున్నానని.
క్యాంపస్‌లో ఒక రోజు తనకి పట్టుబడిపోయాను. ‘‘ఏంటి చూస్తున్నావ్? హా!’’ అంది అంజలి నా ముందుకొచ్చి, నా ముఖంలోకి వచ్చి!! తననే చూస్తూ ఉండిపోయాను. ‘‘ఓయ్ సుందీ, మాటలొచ్చా?’ అంది కోపంగా చూస్తూ. నా క్లాస్‌మేట్స్ నన్నలాగే పిలుస్తారు... ‘సుందీ’ అని. తను కూడా నన్ను ‘సుందీ’ అంటోందంటే? ఎస్, అర్థమైంది నాకు!
కోపంగా నా వైపు చూస్తున్న అంజలిలో ఆ చూపు నిజం, ఆ కోపం అబద్ధం.
‘మిస్టర్ పిచాయ్, మీటింగ్ హాల్ బయట మిసెస్ అంజలీ మీ కోసం వేచి ఉన్నారు, పూలగుచ్ఛంతో’’ అన్నారు థామస్ కురియన్, వేదిక మీదకు వచ్చి నా చెవికి దగ్గరగా! కురియన్ గూగుల్ క్లౌడ్ సీఈవో. బయటికి వెళ్లేందుకు వేదిక దిగబోతూ,ఆ గర్ల్ ఇంటెర్న్‌తో మళ్లీ అదే మాట చెప్పాను... ‘‘సంతోషం మనం చూసేది కాదు గైస్, మనకు కనిపించేది’’ అని నవ్వుతూ చెప్పాను.
మాధవ్ శింగరాజు