
సందర్భం
నాకెందుకో నిమిష ప్రియకు మరణ దండనను అమలుపరచకపోవచ్చు అనిపిస్తోంది. ఇరాన్ అండదండలున్న హూతి దళాల పాలనలో ఉన్న యెమెన్‌లోని భాగంలో షరియా చట్టం అమలులో ఉంది. కేరళకు చెందిన 38 ఏళ్ళ నర్సు నిమిష ప్రియ ఆమె వ్యాపార భాగస్వామిని హత్య చేసిందంటూ అక్కడి చట్టం ఆమెకు మరణ దండనను విధించింది.
హూతీల రాజకీయ, న్యాయ పాలనా సౌధంలో ప్రతి ఒక్కరు ఆ శిక్షను ధ్రువపరచేశారు. పాలక్కాడ్‌లో జన్మించిన ఆ క్రైస్తవ మతస్థురాలు అరెస్టు అయి, శిక్షపడినప్పటి నుంచి ఇప్పటికి అనేక నెలలుగా ఫైరింగ్ స్క్వాడ్ ను ఎదుర్కోవలసిన స్థితిలో ఉంది. మరణ దండనను అమలుపరచేందుకు యెమెన్‌లో కాల్పులు జరిపి చంపే విధానం అమలులో ఉంది.
నాలుగు ఆశలు
వర్తమాన భౌగోళిక, రాజకీయ పరిస్థితుల్లో భారతదేశానికున్న ప్రాధాన్యం వల్లనైతేనేమి లేదా నిమిష కేసు దాదాపుగా మొత్తం ప్రపంచ దృష్టిని ఆకర్షించడం వల్లనైతేనేమి లేదా మరణ దండనకు వ్యతిరేకంగా ఇరాన్, సౌదీ అరేబియాలు యెమెన్‌కు నచ్చజెప్పడం వల్లనైతేనేమి ఆ దేశం బుల్లెట్లకు ఇంకా పనిచెప్పలేదు. నిమిషను కాపాడేందుకు ‘సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ కౌన్సిల్’ పేరుతో కొందరు ఒక సంఘంగా ఏర్పడ్డారు.
నిమిష లీగల్ డిఫెన్స్‌ను సమన్వయపరచుకుంటూ ఆ కౌన్సిల్ పనిచేస్తోంది. కేరళలోని ఇస్లామిక్ మత పెద్దలు, ప్రసిద్ధ స్కాలర్లు బహిరంగంగా, తెర వెనుక మార్గాల ద్వారా శిక్షను ఆపు చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఈ ప్రయత్నాలు వృథా పోవని అనిపిస్తోంది. మరణ దండనకు గురిచేయకుండా ఆమెను విడిచిపెట్టవచ్చుననడానికి నాకు మరో నాలుగు కారణాలు తోస్తున్నాయి. ఒకటి– షరియా అమలులో ఉండటం నిజం. హతుని కుటుంబ ఆగ్రహం కూడా అర్థం చేసుకోదగిందే. నమ్మశక్యం కాకపోయినా, కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతాన్ని ప్రపంచం అసహ్యించుకుంటుందని సానా(యెమెన్ రాజధాని) లోని అధికార వర్గాలకు తెలియదనుకోలేం.
రెండు– యెమెన్‌లోని ఆ భాగంలో ఉన్న అధికారులు మానవ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ నిబంధనలకు జవాబుదారులు ఏమీ కారు. గతంలో మరణ దండనలను గణనీయంగానే అమలు జరిపి ఉండవచ్చు. అంతమాత్రాన, ప్రపంచ మనోభిప్రాయాన్ని లెక్క చేయనివారుగా బాహాటంగా కనిపించకూడదని వారు అనుకుంటూ ఉండవచ్చు.
మూడు– జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వంటి సమర్థులు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉన్నారు. పరాయి దేశంలో బందీగా ఉన్న ఒక భారతీయ మహిళను కాపాడలేకపోయినదిగా కనిపించడం భారత ప్రభుత్వానికి ఇష్టం ఉండదు. నిమిష ప్రాణాలను కాపాడేందుకు హంగు ఆర్భాటాలు లేకుండా ఎంత ప్రయత్నించాలో అంతా న్యూఢిల్లీ చేస్తుంది.
నాలుగు– హతుని కుటుంబం దోషిని క్షమించినందుకు పరిహారంగా ఇచ్చే నగదు(బ్లడ్ మనీ) మొత్తంపైనే ఇపుడు సంప్రదింపులు సాగుతున్నట్లు చెబుతున్నారు. వాటిలో ప్రభుత్వం పాల్గొన్నా పాల్గొనకపోయినా ప్రపంచంలోనే నాల్గవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ నగదు కొరతతో బాధపడుతున్నదిగా ముద్రపడలేదు.
ఒకవేళ ఆశలు అడియాసలైతే...
పైన పేర్కొన్న కారణాలన్నింటివల్ల నిమిష ప్రియను కాపాడారు అనుకుందాం. అదృష్టం బాగుండి ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది అనుకుందాం. ఆమెకు ఘన స్వాగతం లభిస్తుంది. ఆమె ప్రాణాలను కాపాడిన ఘనత తమదేనని చెప్పుకునేవారూ చాలా మంది ఉంటారు. కానీ, నా ఈ అంచనాలన్నీ ఘోరంగా తలకిందులు కావచ్చు. సానాలోని పాలకులు నిమిష ప్రియకు మరణ దండనను అమలుపరిస్తే, నేను పైన చెప్పిన విషయాలన్నీ బుద్ధి హీనమైనవిగా తేలతాయి. నిజంగానే, ఘోరం జరిగితే, భారత్ ఏం చేయవలసి ఉంటుంది?
భారత్ తన అసంతృప్తిని సానాకు తెలిపి తీరాలి. ‘‘ఇది టెర్రరిజం కేసు కాదు కదా. ఆ పని భారత్‌ను ఉద్దేశించి చేసింది కాదు. ఆ చర్య భారత రాజ్య వ్యవస్థకు లేదా ప్రజానీకానికి వ్యతిరేకంగా తీసుకున్నది కాదు’’ అని ఎవరూ అనుకోకూడదు. ఎందుకంటే, సానాలోని రాజకీయ వ్యవస్థ చట్టబద్ధమైనదని ప్రపంచం గుర్తించలేదు.
అటువంటి వ్యవస్థ తమ దేశంలో ఉంటున్న ఒక భారతీయురాలి జీవితాన్ని అంతమొందిస్తే మనం మౌనంగా చూస్తూ ఊరుకోవాలా? అందులోనూ ఆమె సేవా భావంతో నిండి ఉండే నర్సింగ్ వృత్తిలో ఉన్న వ్యక్తి. ఆమెకు అలాంటి గతి పట్టవచ్చా? అనేక దేశాలలో వివిధ వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్న భారతీయులు సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వారిలో నర్సులు గణనీయమైన వర్గం కిందకు వస్తారు. ఆ యా దేశాలు అన్నింటి దృష్టిలో మనం చులకన అయిపోమా?
నిమిష చేసిన నేరం తక్కువదేమీ కాదు. దాన్ని గర్హించకుండా ఉండటమో లేదా ఉపేక్షించడమో చేయలేం. దాన్నలా ఉంచినా, హతుని దేహాన్ని ఆమె ముక్కలు చేసిన తీరు ఇంకా ఘోరం. కానీ, ఆమె హంతకురాలిగా మారడానికి పురికొల్పిన అంశాలను కూడా విస్మరించలేం. అటువంటి నేరమే భారతదేశంలో జరిగి ఉంటే, దిగువ కోర్టు ఉరి శిక్ష విధించినా సంబంధిత హైకోర్టు లేదా సుప్రీం కోర్టు దాన్ని జీవిత ఖైదు శిక్షగా తగ్గించే అవకాశాలు ఎక్కువ. కోర్టులన్నీ మరణ దండనను సమర్థించినా, క్యాబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రసాదించి శిక్షను తగ్గించే అవకాశమూ ఉంది.
అసంతృప్తిని చాటి తీరాలి!
సరే. అది ఇపుడు అప్రస్తుతం. దేశపు చట్టబద్ధమైన ప్రభుత్వంగా గుర్తింపు పొందని కొన్ని శక్తుల నియంత్రణలో ఉన్న యెమెన్‌లోని ఒక భూభాగంలో ఫైరింగ్ స్క్వాడ్ నిమిషను కాల్చి చంపితే, ఇండియా ఎలా స్పందించాలి? ఆపరేషన్ రాహత్ కింద, ఆ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో భారతీయులను భారత ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చింది. యెమెన్‌లోని ఆ ప్రాంతంలో ఇప్పటికీ కొద్ది వేల మంది భారతీయులు ఉన్నారని చెబుతున్నారు.
వారినందరినీ ఏకమొత్తంగా వెనక్కి తీసుకొచ్చే అంశాన్ని భారత్ పరిశీలించవలసి ఉంటుందా? వారిలో కొంత మందికి స్వదేశానికి రావడం ఇష్టం లేకపోయినా ప్రభుత్వం ఆ పని చేయాలా? దానివల్ల యెమెన్‌కు వాటిల్లే నష్టం ఏమైనా ఉంటుందా? అక్కడున్న భారతీయుల భద్రత పట్ల భారత్‌కు నమ్మకం కలగడం లేదనే అంశాన్ని మనం వెల్లడించి తీరాలి. యెమెన్‌లోని ఆ ప్రాంతంతో వాణిజ్యాన్ని (అది లెక్కలోకి వచ్చేది కాకపోయినా) మనం తీవ్రంగా పరిమితం చేయాలి.
సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానాన్ని మనం ఈ విషయంలో అనుసరించినా తప్పు లేదు. కానీ, నేను మొదట ధైర్యంగా అనుకుంటున్నదే నిజమవ్వాలని ఆశిద్దాం. ఇలాంటి స్పందనలకు వెళ్ళాల్సిన అవసరం రాకూడదనే ప్రార్థిద్దాం. ఈ సందర్భంగా భారత్ చేసి తీరవలసిన పని మరొకటుంది.
పాకిస్తాన్‌లో మరణ దండనను ఎదుర్కొంటున్న కులభూషణ్ జాధవ్‌ను స్వదేశానికి తిరిగి రప్పించాలన్న మన డిమాండ్‌ను ఇది మరింత బలోపేతం చేయాలి. నిమిష కేసును (ఒకవేళ ఆమె శిక్షను మనం నిలువరించలేకపోతే) ఆసరాగా చేసుకుని, జాధవ్‌కు కూడా అటువంటి గతి పట్టించే సాహసం పాకిస్తాన్ అధికారులకు కలుగకుండా మనం ప్రతిఘటించి తీరాలి. ఇది చాలా ముఖ్యం.
అన్నింటికన్నా మించి, అరుదైన కేసుల్లోనే విధిస్తున్నప్పటికీ, మన దేశంలోనూ ఉరి శిక్షకు అవకాశం కల్పిస్తున్నాం. శిక్షా స్మృతికి సంబంధించి నీతి నియమాలు పరిణామం చెందుతున్న పరిస్థితులలో, ఆ రకమైన (ఉరి) శిక్ష తగినది కాదని మనం గ్రహించవలసి ఉంది.
గోపాలకృష్ణ గాంధీ
వ్యాసకర్త పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, ఆధునిక భారతదేశ
చరిత్ర విద్యార్థి (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)