
కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటన
అధికారికంగా ధ్రువీకరించని భారత విదేశాంగ శాఖ
సనా: భారతీయ నర్సు నిమిష ప్రియకు ఎట్టకేలకు మరణశిక్ష నుంచి విముక్తి లభించింది. యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న ఆమెకు గతంలో విధించిన మరణశిక్షను శాశ్వతంగా రద్దుచేసినట్లు భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ మత ప్రబోధకుడు కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదలచేసింది.
అయితే భారత విదేశాంగ శాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆమెకు మరణశిక్ష రద్దుచేయాలంటూ వస్తున్న అభ్యర్థనలను పరిశీలించేందుకు యెమెన్ రాజధాని సనా సిటీలో ఒక అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉత్తర యెమెన్ అధికారులు, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.