ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. . ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల నేపథ్యంలో అరెస్టైన నిరసనకారుడు ఇర్ఫాన్ సోల్తానికి విధించిన మరణశిక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అమెరికా తమ దేశంపై దాడి చేస్తుందనే భయంతోనే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి.
గత కొద్దిరోజులుగా ఇరాన్‌లో తీవ్రనిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. నిరసన కారులపై కాల్పులు జరిపితే తాము రంగంలోకి దిగుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయినప్పటీకీ ఇరాన్ తన తీరును మార్చుకోలేదు. నిరసనకారులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపింది. ఈ దాడులలో దాదాపు రెండువేల మందికి పైగా మృతిచెందారు. ఈనేపథ్యంలో అమెరికా ఇరాన్‌పై దాడి చేయడం ఇక తప్పదని అంతా భావించారు. అయితే సడెన్‌గా పరిస్థితి యూటర్న్ తీసుకుంది.
అరెస్టు చేసిన నిరసనకారులకు ఉరితీసే ఆలోచనను ప్రస్తుతానికి పక్కనబెట్టినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా నిరసనకారుడు ఇర్ఫాన్ సోల్తానీ మరణ శిక్షను రద్దుచేస్తూ ఆదేశాలిచ్చింది. ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరిపినందుకు గానూ జనవరి 10న ఇర్పాన్ సోల్తానీని అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది.
అనంతరం నిన్న( జనవరి14న)న మరణశిక్ష అమలు జరపడానికి ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో ఆయన ఉరిశిక్ష వాయిదా వేస్తున్నట్లు ప్రకటించగా తాజాగా ఆయన మరణశిక్షను రద్దుచేస్తూ ఆదేశాలిచ్చింది. కాగా ఇరాన్‌లో జరుగుతున్న నిరసనలకు ట్రంప్ మద్ధతుగా నిలిచారు. వారిపై దాడి చేస్తే అమెరికా జోక్యం చేసుకుంటుందంటూ హెచ్చరించారు. తాజాగా ఇరాన్ చల్లబడడంతో ట్రంప్ సైతం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయంపై ట్రంప్ స్పందిస్తూ "ముఖ్యమైన వర్గాల నుంచి నాకు సమాచారం అందింది. నిరసనకారులపై హింసాత్మక చర్యలు నిలిపేశారని అలాగే మరణశిక్షలు వాయిదా వేసినట్లు తెలిసింది. అని వాషింగ్టన్‌లో ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. ప్రస్తుతానికి వేచిచూసే ధోరణి అవలంభించుకుంటున్నాం" అని ట్రంప్ అన్నారు.


