సాక్షి, హైదరాబాద్: మతిస్థిమితం లేని వ్యక్తికి చట్టప్రకారం మరణశిక్ష విధించడం సాధ్యంకాదని హైకోర్టు స్పష్టం చేసింది. తాను చేస్తున్నది తప్పు, చట్టవిరుద్ధమని గ్రహించలేని స్థితిలో చేసిన నేరానికి శిక్ష విధించలేమని అభిప్రాయపడింది. 2021లో తన సొంత బిడ్డను నరబలి ఇచ్చిన బానోత్ భారతికి సూర్యాపేట కోర్టు విధించిన మరణశిక్షను ఉన్నత న్యాయస్థానం శుక్రవారం రద్దు చేసింది. చిన్నారి మరణానికి దారితీసిన చర్య భౌతికంగా నిందితురాలి కారణంగానే జరిగినప్పటికీ ఘటన సమయంలో ఆమె తీవ్ర మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని హైకోర్టు పేర్కొంది.
దీంతో ఆమెకు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 84 కింద రక్షణ వర్తిస్తుందని చెప్పింది. అప్పీలుదారురాలైన నిందితురాలే నేరానికి పాల్పడినప్పటికీ అది చట్టం దృష్టిలో నేరం కాదని.. నిర్దో షిగా విడుదల చేసేందుకు ఆమె అర్హురాలని తేలి్చచెప్పింది. సెషన్స్ కోర్టు గతేడాది ఏప్రిల్‌లో మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పు చట్ట ప్రకారం చెల్లదంటూ రద్దు చేసింది. అప్పీల్‌ను అనుమతిస్తూ బాధితురాలిని చంచల్‌గూడ జైలు నుంచి ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని చంచల్‌గూడ జైలు సూపరింటిండెంట్‌ను ఆదేశించింది.
గత ఏప్రిల్‌లో మరణశిక్ష..: సూర్యాపేట జిల్లా మోతే మండలం మేకలపాటి తండాలో 2021 ఏప్రిల్ 15న భారతి అనే మహిళ తన ఇంట్లో ప్రత్యేక పూజలు చేస్తూ ఏడు నెలల తన కన్నబిడ్డ గొంతు, నాలుక కోసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో బిడ్డ మృతిచెందింది. దేవుళ్లకు నరబలి ఇచ్చి తన సర్పదోషాన్ని పోగొట్టుకున్నట్లు భారతి కుటుంబ సభ్యులకు చెప్పింది. ఈ కేసులో భారతిని అరెస్టు చేసిన పోలీసులు సూర్యాపేట కోర్టులో హాజరుపరచగా వాదనల అనంతరం గతేడాది ఏప్రిల్‌లో కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పును ఆమె హైకోర్టులో సవాల్ చేసింది.


