
రియాక్టర్ల పేలుళ్లు, రసాయనాల లీకేజీలు, షార్ట్ సర్క్యూట్స్, అగ్ని ప్రమాదాలు ఇవన్నీ కూడా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు సరిగ్గా లేకనే తరచూ జరుగుతున్నాయి. వీటన్నింటికీ ప్రధాన కారణం పరిశ్రమ యాజమాన్యాల తీవ్ర నిర్లక్ష్యమే. గడచిన ఐదేళ్లలో 600కు పైగా జరిగిన పారిశ్రామిక ప్రమాదాల్లో 1,116 మంది మృత్యువాత పడ్డారు, ఇంకా ఎంతో మంది క్షతగాత్రులై జీవచ్ఛవాలుగా బతుకు లీడుస్తున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రిపోర్ట్ తెలియజేస్తోంది.
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో పాశ మైలారం పారిశ్రామిక ప్రాంతంలో ‘సిగాచి’ పరిశ్రమలో జరిగిన పేలుడు ప్రమాదంలో 46 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా పదుల సంఖ్యలో ఆసుపత్రిలో చికిత్సలు పొందు తున్నారు. కనీస భద్రత లేని పరిస్థితుల్లోనే కార్మికులు పనిచేసినట్లు, యాజమాన్యపు తీవ్ర నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి ప్రధాన కార ణమని ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఈ ప్రమాదంపై నిపు ణుల కమిటీ ఇచ్చిన నివేదిక సిగాచి కంపెనీ సరైన రక్షణ చర్యలు తీసుకోలేదని తేల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేయా లనే సూచనను కూడా కమిటీ చేసింది.
అంతేకాదు ఆయా కంపెనీల్లో పని చేసే వలస కార్మికుల వివరాలు కార్మిక శాఖ దగ్గర ముందే ఉండాలనే కీలక సూచన చేయడం అభినందించదగ్గ అంశం. పారిశ్రామిక, వ్యవసాయ, నిర్మాణ రంగంలో వలస కార్మికులు లేనిదే పనులు జరగని పరిస్థితి ఈనాడు దేశంలో ఉంది. దేశ నిర్మాణంలో వీరిదే కీలక పాత్ర. స్థూల జాతీయోత్పత్తిలో 10% వలస కార్మికుల శ్రమ నుంచే వస్తుందని లెక్కలు చెబుతున్నాయి. ఇలాంటి వలస కార్మికుల పరిస్థితి నేడు అత్యంత దయనీయంగా మారింది.
పర్మినెంట్ కార్మికుల కంటే ఏడు రెట్లు అధికంగా వలస కార్మికులు ఉన్నట్లు జాతీయ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ వెల్లడించిన గణాంకాల మాట. ముఖ్యంగా పరిశ్రమలలో పనులకు కుదిరిన వలస కార్మికులను బానిసల కంటే దారుణంగా పరిశ్రమల యజమానులు ఉపయోగించుకుంటున్నారు. అతి తక్కువ వేతనాలు ఇచ్చి, భద్రత లేని పని ప్రదేశాల్లో అధిక గంటలు పనిచేయిస్తూ ఉత్పత్తులను పెంచుకుంటున్నారు.
రసాయన, ఔషధ పరిశ్రమలోనే ఎక్కువగా ప్రమాదాలు జరగ టానికి కారణం నిపుణులను నియమించుకోవలసిన చోట వారిని కాదని తక్కువ వేతనాలకు దొరికే వలస కార్మికులను నియమించుకోవడమే. వీరికి తక్కువ నైపుణ్యాలు ఉండటంతో నిర్వహణ లోపాలు జరిగి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎన్ని ప్రమాదాలు జరిగినా పరిశ్రమల యాజమాన్యాలను అధికారులు దోషులుగా ఎప్పుడూ నిలపలేదు, వారికి శిక్షలు పడింది కూడా లేదు.
ప్రమాదం జరిగిన ప్రతి సారీ కార్మికుల నిర్లక్ష్యం మూలంగానే ప్రమాదం జరిగిందనే నెపం వారి మీదనే వేస్తూ యాజమాన్యాలు తప్పించుకుంటు న్నాయి. ఇక ప్రమాదాల్లో చిక్కుకొని మరణించినవారికీ, క్షతగాత్రులుగా మిగిలిన వారికీ చెల్లించే పరిహారం విషయంలో కూడా వలస కార్మికులకు తీరని నష్టం జరుగుతోంది.
వలస కార్మికులు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నారు. ఈ వలసలను నివారించాలంటే ఆ యా ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలి. కానీ అలాంటి అలోచనలు పాలకులు చేయడం లేదు. రానున్న ఐదేండ్లలో భారతదేశంలో 70 శాతం కొలువులు నగరాలలోనే పోగుబడనున్నాయని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక వెల్లడిస్తోంది.
దీంతో చదువుకున్న వారూ, చదువు కోని వారూ గ్రామాలను వదిలి నగరాలకు వలస వెళ్లే సంఖ్య మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు వలస కార్మికుల సంక్షేమానికి తగిన చట్టాలు చేసి తమ వంతు బాధ్యతను నెరవేర్చాలి.
– పి.వి. రావు ‘ సీనియర్ జర్నలిస్ట్