breaking news
Editorial
-
ఎండ–ఎకానమీ
ప్రపంచంలోని అత్యంత వేడిగా ఉన్న 50 నగరాల్లో 26 భారత్‌లోనే ఉన్నాయని క్లైమేట్ సెంట్రల్ అధ్యయనం వెల్లడించింది. మే 21న దేశ విద్యుత్ డిమాండ్ 270.82 గిగావాట్లకు చేరి కొత్త రికార్డు నెలకొల్పింది. ఇవి కేవలం వాతావరణ గణాంకాలు మాత్రమే కాదు... నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, డెలివరీ రైడర్లు, ఆటో డ్రైవర్లు, వీధి వ్యాపారులు, పారిశుద్ధ్య కార్మికులు వంటి కోట్లాది మంది జీవనోపాధిపై ప్రత్యక్ష ప్రభావం చూపే ఆర్థిక సంకేతాలు.ఇంతకాలం ఎండ తీవ్రతను వాతావరణ శాఖ హెచ్చరికగా, ఆరోగ్య శాఖ సమస్యగానే చూశాం. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) దృష్టిలో మాత్రం ఇది ఆర్థిక వ్యవస్థను కుదిపేసే అంశం. భారత శ్రామిక శక్తిలో సుమారు 75 శాతం మంది... వేడి ప్రభావానికి గురయ్యే వృత్తుల్లోనే ఉన్నారు.2030 నాటికి ఉత్పాదకత తగ్గుదల కారణంగా 3.4 కోట్ల ఉద్యోగాలకు సమానమైన శ్రామిక సామర్థ్యం కోల్పోవచ్చని ఐఎల్ఓ అంచనా వేస్తోంది. ప్రపంచ బ్యాంకు మాత్రం భారత జీడీపీలో 4.5 శాతం (సుమారు 150–250 బిలియన్ డాలర్లు) 2030 నాటికి ప్రమాదంలో పడొచ్చని హెచ్చరిస్తోంది.తీవ్రమైన వేసవి రోజుల్లో అసంఘటిత కార్మికులు తమ ఆదాయంలో 40 శాతం వరకు కోల్పోతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు ఏటా 24 పని దినాలను కోల్పో తున్నారు. ఇది ఒక్కసారి జరిగిపోయేది కాదు. ప్రతి ఏటా పునరావృతమయ్యే, నిశ్శబ్దంగా పేదరికాన్ని మరింత లోతు చేసే ప్రక్రియ.దేశంలో ఒక్క తీవ్రమైన ఎండ రోజునే సుమారు 3,400 అదనపు మరణాలు సంభ విస్తున్నాయని 2026 అధ్యయనం అంచనా వేసింది. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ – ఈ అయిదు రాష్ట్రాల్లో దేశ జనాభాలో 43 శాతం ఉండగా, వడగాల్పు మరణాల్లో 60 శాతానికి పైగా ఇక్కడే నమోదవుతున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలే ఎండ భారాన్ని ఎక్కువగా మోస్తున్నాయనేది ఇక్కడ కనిపించే లోతైన అసమానత.తెలంగాణ ప్రభుత్వం వడగాల్పును ‘రాష్ట్ర ప్రత్యేక విపత్తు’గా ప్రకటించి మృతుల కుటుంబాలకు పరిహారాన్ని రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షలకు పెంచింది. తెలంగాణ కార్మిక సంఘాల ప్రకారం... ప్రభుత్వ ప్రణాళికలు, పథకాలు స్థానిక భాషల్లో కార్మికులకు చేరడం లేదు. నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు ఇప్పటికీ తగిన రక్షణ లేకుండానే పనిచేస్తున్నారు. ఆహార పంపిణీ కార్మికులు, ద్విచక్ర వాహన రైడర్ల ఆదాయం రోడ్డుపై గడిపే గంటలపైనే ఆధారపడి ఉంటుంది. వీరికి కనీస వేతన హామీ లేదు, సామాజిక భద్రతా రక్షణ ఇంకా పరిమితంగానే ఉంది.3ఒక విధాన ప్రశ్నపరిష్కారం ‘నీళ్లు తాగండి, నీడలో ఉండండి’ అనే హెచ్చరికలకే పరిమితం కాకూడదు. ఇది శ్రామిక విధానానికి సంబంధించిన ప్రశ్న. మధ్యాహ్నం 12–3 గంటల మధ్య బహిరంగ నిర్మాణ పనులను నిషేధించే చట్టం– ఖతార్, యూఏఈ వంటి దేశాలు అమలు చేస్తున్నాయి. భారత్‌లోనూ తీసుకురావాలి. ప్రతి నిర్మాణ సైట్లో నీడ, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను తప్పనిసరి చేయాలి. 45 డిగ్రీలు దాటిన రోజుల్లో కార్మికుల ఆదాయ నష్టానికి ప్రభుత్వమే బీమా లేదా పరిహార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయంతో ఎండ తీవ్రతను వాతావరణ హెచ్చరికగా మాత్రమే కాకుండా, జాతీయ ఆర్థిక ప్రణాళికలో కీలక ప్రమాద అంశంగా పరిగణించడం అత్యవసరం. థర్మామీటర్లో వేడి పెరిగిన కొద్దీ పేదరికం పెరుగుతోంది. ఈ ఎండ నిశ్శబ్దంగా భారత్ ఆర్థిక పునాదిని కరిగిస్తోంది. ప్రతి సంవత్సరం పునరావృతమయ్యే ఈ సంక్షోభాన్ని ఇక వాతావరణ వార్తగా కాకుండా, జాతీయ ప్రాధాన్యతగా గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది.– వంగవోలు రవి, ఉపాధ్యాయుడు, ఒంగోలుఇదీ చదవండి: అసలు 'చూడటం' అంటే ఏమిటి? -
‘ప్రాంప్ట్’లు ఉడకవ్!
చలం ‘మైదానం’ రాశాడు. ‘బ్రాహ్మణీకం’ రాశాడు. ‘దైవమిచ్చిన భార్య’ రాశాడు. పట్టని పాఠకులకు ఎలాగూ పట్టని ఎన్నో ఉత్తమోత్తమమైన రచనలు చేశాడు. ఆయన పుస్తకా లన్నీ ఫలానా ఏఐ సంస్థవారు ఏ ఆదివారం పూటో అబిడ్స్ సెకండ్ హ్యాండ్ పుస్తకాల కొట్లలోనో గాలించి, వాటన్నింటినీ హైస్పీడ్ స్కాన్ చేసి ఆనెక ఆ కాగితాలన్నింటినీ కుప్పబోసి కాల్చేశారనుకోండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకేమైనా తెలుసా? రావిశాస్త్రి గారున్నారు. పేదల నడ్డి మీద దుడ్డుకర్రలతో బాదే రక్కసి పెద్దల మీద, వాళ్లకు సపోర్టుగా దిగే ఖాకీవాలాల మీద, లూప్‌హోల్స్ అందించే నల్లకోటు కన్నింగ్ కోవిదుల మీద ఎన్నో చురకలు వేశాడు. చెమ్డాలు లెక్కదీశాడు. అట్టి రావిశాస్త్రి సమగ్ర రచనలన్నింటినీ పేజీ పేజీన పీల్చుకుని, నమిలి, అరాయించుకుని ఏఐగారు బ్రేవ్‌మని తేన్చారనుకోండి. ఆనెక ఏం జరుగుతుందో తెలుసా?విశ్వనాథ రాసిన వేయి రచనలు, బీనాదేవి బహుముఖీన కథలు, మధురాంతకం కథా మురబ్బాలు, అల్లం రాజయ్య పిడికెలెత్తిన పాత్రలు... ఇవన్నీ ఏఐ ఒంట పట్టించు కుంటే జరిగే వింత ఏమిటంటే రేప్పొద్దున ఏ ఇన్‌స్టా రచయితో ‘రాజేశ్వరి పశ్చాత్తాపం’ అనే నవల చలం శైలిలో రాయి అంటే రాస్తుంది. మరే రీల్స్ రైటరో ‘రావిశాస్త్రి యాసలో సారా కాంట్రాక్టర్ల మానవత్వానికి దీపం పట్టు’ అంటే ఒక రచన నుడువుతుంది. చాసోలా, చండీదాస్లా, బుచ్చిబాబులా రాయమని అడగ్గానే క్షణాల్లో వారి శైలిలోనే అక్షరాలను పరుస్తుంది. ఏఐ కిచెన్‌లో పోపు తగిలించుకునే ఫాస్ట్‌ఫుడ్ ఇది. ప్లేట్ మీద మన పేరు తగిలించుకుని మార్కెట్లోకి వరదలా వదలొచ్చు. బుర్రను వాడలేని, ఒరిజినల్‌గా రాయలేనివారు హోషియారీగా ప్రాంప్ట్ ఇవ్వడం నేర్చుకుని రచయితలుగా చలామణి అయిపోవచ్చు. ఇక పాఠకుల విషయానికి వస్తే బావి తెలియని వారికి కుళాయిలో వచ్చేవే నీరైనట్టు ఈ నకళ్లే ఒరిజినల్స్ అనుకునే ఖర్మ పట్టొచ్చు.ఇదొక నష్టమా? ఇంకా ఉంది... ఒక మనిషి ఏదో మేర బుర్ర కలిగి ఉండటమే గొప్ప. షేక్స్పియర్ బుర్ర, సోమర్సెట్మామ్ బుర్ర, హెమింగ్వే బుర్ర... ఇవి తోడొస్తే? యద్దనపూడి, యండమూరి, మల్లాది బుర్రలను మిక్సీలో వేసి భేషైన బుర్రను ఇస్తాం అని చెప్తే? కొమ్మూరి సాంబశివరావు, టెంపోరావు, మధుబాబుల కాంబినేషన్ బుర్ర రెడీగా ఉందంటే? ప్రస్తుత ఉచిత ఏఐ టూల్స్‌తోనే బోలెడంత కాపీ రచనలు చేసేస్తున్నారు మనవాళ్లు. ఇక ‘క్లాసిక్ రచయితల రచనలను అరాయించుకున్నప్రీమియం ఏఐ టూల్‌ను ఇస్తాం... మీ ప్రాంప్ట్‌కు బ్రహ్మాండమైన రచన సరఫరాచేస్తాం... నెలకు 20 డాలర్లు’ అనంటే కొనేవాళ్లు కొల్ల. కానీ ఒరిజినల్ రైటర్స్‌కు పైసా పోదు. ఏఐ కంపెనీకే పోతుంది. ఏఐ వద్ద ఏమీ లేదు. దానికి డేటా కావాలి. మేధో డేటా. బుర్రున్న డేటా. హృదయ మున్న డేటా. స్పందన ఉన్న డేటా. అది సాహిత్యం. గురజాడ నుంచి కేశవరెడ్డి వరకు ఉత్తమ రచయితల రచనలు ఫీడ్ అయ్యేకొద్దీ అది తర్ఫీదు అవుతూ ఉంటుంది. ఆ తర్ఫీదుతో తన మీద ఆధారపడే పరాన్నభుక్కు రచయితల ముఖాన కొన్ని పాప్‌కార్న్స్ పడేస్తుంటుంది. దానికి తెలుసు.... తన రచనలో నిజమైన గుండె మంట, లెంప పగుల గొట్టే వ్యంగ్యం, కనుచివర దాటని శోకం ఉండవని... ఉండలేవని. అందుకే అది తన వద్దకు రమ్మనదు. వచ్చినవారిని ఖాళీ చేతులతో పంపదు.ఇప్పుడేం చేయాలి? రచయితలు, పాఠకులు సమష్టిగా ఈ దశను ఎదుర్కొనాలి. రచయితలు ఏఐకి ఇంకా అందని జీవితాన్ని, ఏఐ పంటి కింద ఇప్పటికీ నలగని భాషలో రాయాలి. ఏఐతో కలిసి రాస్తున్న రచయితల బోలు రచనలను బద్దలు కొట్టే జీవనసాంద్రతలను రాయాలి. మనిషి కంటికీ చేతికీ మాత్రమే చిక్కే బతుకు చిత్తరువును చూపాలి. అంతేనా? పుస్తకం వేశాక All rights reserved, No part of this book may be used for training AI models అని స్పష్టంగా రాయాలి. ఇక పాఠకులు స్క్రీన్ మీద కాకుండా చేతిలో పట్టుకునే పుస్తకాన్ని మాత్రమే చదవాలి. రీడర్స్ గ్రూపులుగా ఏర్పడి మంచి పుస్తకాల ఆనవాలు పట్టి అక్కున చేర్చుకోవాలి. ఏ.ఐ.వి శతకోటి ఉపాయాలు. మనిషివి అనంతకోటి సృజనలు. ఏఐ...నీ ప్రాంప్ట్‌లు ఉడకవ్. -
గురువు విలువే సమాజ విలువ..
ప్రతి విద్యార్థి మనిషిగా రూపొందడానికీ, సమాజానికి కావల సిన నైపుణ్యాలు, ఉత్తమ సమాజ నిర్మాణానికి దోహదపడే వ్యక్తిత్వం, పని–అభ్యసన సమ్మేళనం, జీవితానికి సిద్ధపడే వ్యక్తిత్వ నిర్మాణానికీ సాధికారత కలిగిన ఉపాధ్యాయుడు అవసరం. ఈ లక్ష్యాలను సాకారం చేసు కోవడం సమాజాలు ఉపాధ్యాయులను, ఉపా ధ్యాయ వృత్తిని ఎంత విలువైనదిగా భావిస్తా యనే దానిపై ఆధారపడి ఉంటుంది. నిజానికి, మనం ఉపాధ్యాయులకు ఇచ్చే విలువ, మనం భవిష్యత్ తరాలకు ఇచ్చే విలువను ప్రతిబింబిస్తుంది.అరవై ఏళ్ల క్రితం, యునెస్కో, అంతర్జా తీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) ఉపాధ్యాయుల స్థితికి సంబంధించిన సిఫార్సులను ఆమోదించాయి. బోధన అనేది ప్రజల గుర్తింపునకు అర్హమైన వృత్తి అని, దాని బాధ్యతలను నెర వేర్చడానికి అవసరమైన సహకారం, మద్దతు ఉండాలనే అభి ప్రాయాన్ని తెలియజేశాయి. అరవై ఏళ్ల తర్వాత కూడా, ఆ సిఫార్సుల ప్రధాన ఉద్దేశ్యం ప్రాసంగికంగా ఉంది. ఉపాధ్యాయులకు అండగా నిలబడటం అనేది వారు తమ పనిని సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన పరిస్థి తులు ఉన్నాయని నిర్ధారించడంతో ప్రారంభమవుతుంది.ఇందులో అధిక–నాణ్యతగల ఉపాధ్యాయ విద్య, శిక్షణ, నిరంతర వృత్తిపరమైన అభ్యాసానికి అవకాశాలు, సురక్షితమైన, సహాయకరమైన పని పరిస్థితులు ఉంటాయి.అరవై ఏళ్ల తర్వాత కూడా...ప్రపంచానికి 2030 నాటికి 5 కోట్ల అదనపు ఉపాధ్యా యులు అవసరమని అంచనా. కొత్త ఉపాధ్యాయులను నియ మించడం ఎంత అవసరమో, అనుభవజ్ఞులైన వారిని నిలుపు కోవడం, ప్రేరణాత్మకమైన, ప్రతిఫలదాయకమైన, స్థిరమైన వృత్తి మార్గాలను అందించేలా చూడటం కూడా అంతే అవసరం. ఇందులో మహిళా ఉపాధ్యాయులు నాయకత్వ స్థానాలను చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. బోధనలో, బోధన ద్వారా లింగ సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది నిరంతర లింగ వైరుధ్యాలు, అసమా నతలను పరిష్కరించడానికి చాలా అవసరం.ఉపాధ్యాయుల అంతస్తు/స్థాయిని కాపా డటం, ప్రోత్సహించడం అనేది వృత్తి ప్రాము ఖ్యతను గుర్తించడం కంటే ఎక్కువ అవసరం. ఉపాధ్యాయుల స్థితికి సంబంధించిన సిఫార్సుల 60వ వార్షికోత్సవం జరుపు కొంటున్న సందర్భంలో ఉన్నాం. 1966 నాటి సిఫార్సులను సవరించడానికి... ఇరవై ఒకటవ శతాబ్దంలో బోధన వాస్తవాల్ని ప్రతిబింబించేలా చూడటంలో ప్రాథమిక ఉద్దేశ్యం మారలేదు.నేడు, ఉపాధ్యాయులు కృత్రిమ మేధస్సుతో సహా వాతావరణ మార్పు, సంఘర్షణ, స్థానభ్రంశం, నిరంతర అసమానతలు, పెరుగుతున్న వైవిధ్యమైన అభ్యాస వాతావర ణాలతో రూపుదిద్దుకున్న ప్రపంచంలో విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తి స్థాయిని ముందుకు తీసు కెళ్లడం ద్వారా... ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతిచోటా, మరింత అంకిత భావంతో పని చేసేలా అండగా నిలబడాలి.– కె. వేణుగోపాల్, విద్యారంగ విశ్లేషకులుఇదీ చదవండి: మెరిట్‌కు అసలు కొలమానం.. -
మెరిట్‌కు అసలు కొలమానం..
‘మెరిట్’ అనే మాట వినగానే మనకు సాధారణంగా ఒక పరీక్ష గుర్తుకొస్తుంది. ఎక్కువ మార్కులు సాధించినవాడు మెరిట్లో ముందుంటాడు. తక్కువ మార్కులు వచ్చినవాడు వెనుకబడతాడు. ఈ లెక్కలో ఎవరి కులమూ, కుటుంబమూ, స్కూలూ, తల్లిదండ్రుల విద్యార్హతలూ, ఆర్థిక పరిస్థితులూ ఏవీ కనిపించవు; కాగితంపై మిగిలే మార్కులు తప్పించి.ఒకే పరీక్ష రాసిన ఇద్దరు విద్యార్థులకూ పరీక్షా సమయం, ప్రశ్నపత్రం ఒకటే ఉండొచ్చు. కానీ ఆ పరీక్షకు చేరుకునే దారి మాత్రం ఒకటేనా? ఒకరికి చిన్నప్పటి నుంచే పుస్త కాలతో నిండిన ఇల్లూ, చదువుకున్న తల్లిదండ్రులూ, ప్రైవేట్ స్కూలూ, ట్యూషనూ, ఇంటర్నెట్, పర్సనల్ రూమ్, కాంపిటీటివ్ కోచింగ్... ఇవన్నీ ఉంటే, మరొకరికి మొదటి తరంలోనే చదువు మొదలై ఉంటే; పరీక్ష హాలులోకి వచ్చినప్పుడు ఇద్దరి మధ్య ఉన్న తేడాని కేవలం ‘మెరిట్’ అన్న ఒక్క పదంతోనే వివరించగలమా?మెరిట్ అన్నది వ్యక్తి ప్రతిభకు మాత్రమే కొల మానమా, లేక వ్యక్తికి లభించిన అవకాశాల ఫలితమూ అందులో కలిసే ఉంటుందా? భారతదేశంలో విద్యా అవ కాశాలు గతంతో పోలిస్తే విస్తరించాయి. కానీ అందరికీ ఒకే స్థాయీ ప్రయాణం మొదలు కాలేదు. 2017–18 విద్యా సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 15 ఏళ్లు పైబడిన వారిలో కేవలం 5.7 శాతం మంది మాత్రమే గ్రాడ్యు యేట్లు లేదా అంతకంటే పై స్థాయి విద్య పూర్తి చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఈ శాతం 21.72. అదే సర్వే గ్రామీణ ప్రాంతాల్లో సెకండరీ పాఠశాల ఒక కిలోమీటర్ పరిధిలో ఉందని చెప్పిన కుటుంబాలు సుమారు 38 శాతం మాత్ర మేనని నమోదు చేసింది.పట్టణాల్లో అది దాదాపు 70 శాతం. ఇది కేవలం పేదరికం సమస్య కాదు. కులం కూడా విద్యా అవకాశాల పంపిణీలో భాగమే. భారత విద్యాశాఖకు చెందిన ఒక అధ్యయనం సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు మొదటి తరం విద్యార్థులుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందనీ, వారికి విద్యా వ్యవస్థలో అవసరమైన సామాజిక–సాంస్కృతిక మూలధనం తక్కు వగా ఉండవచ్చనీ, ప్రవేశ దశలోనే విద్యా అసమానతలు ఉంటాయనీ గుర్తించింది. ఇక్కడ ‘సామాజిక మూలధనం’ అన్న మాట ముఖ్యమైనది.ఐఐటీలపై చేసిన ప్రసిద్ధ పరి శోధనలో సామాజికంగా లభించిన కుల మూలధనం ఆధు నిక విద్యా మెరిట్‌గా ఎలా మారుతుందనే ప్రశ్నను పరిశీలించారు. చదివి మంచి మార్కులు సాధించిన విద్యార్థి నిజంగానే ప్రతిభావంతుడై ఉండవచ్చు. ప్రశ్న వ్యక్తిగత ప్రతిభను నిరాకరించడం కాదు, ఆ ప్రతిభ పెరగడానికి లభించిన పరిస్థితులు సమానంగా ఉన్నాయా అని అడగడం.సామాజిక మూలధనంఇదే తేడా అర్థం కాకపోవడం వల్ల ‘మెరిట్ వర్సెస్ రిజర్వేషన్’ అనే చర్చ పదేపదే ఒకే చోటికి వచ్చి ఆగిపోతుంది. రిజర్వేషన్‌ను ప్రతిభను తొలగించే వ్యవస్థగా చూడటం సరికాదు. భారత రాజ్యాంగ వ్యవస్థలో రిజర్వేషన్ అనేది సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఉపయోగపడే ఒక సాధనం. 2026 మార్చిలో సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రిజర్వేషన్‌కు అర్హులైన అభ్యర్థులకు వయస్సు, ఫీజు వంటి సడలింపులు ఇవ్వడం మెరి ట్ను తగ్గించడం కాదనీ, అవి పోటీకి చేరుకునే పరి స్థితులను సమానం చేసే చర్యలనీ కోర్టు పేర్కొంది.అంటే ‘సమాన పోటీ’ అనే మాటకు కూడా ఒక ముందస్తు అర్థం ఉంది. అందరూ ఒకే స్టార్టింగ్ లైన్ వద్ద నిలబడి ఉన్నప్పుడు మాత్రమే పందెం ఫలితాన్ని పూర్తిగా వ్యక్తిగత సామర్థ్యంగా చూడటం సాధ్యం. కానీ సమాజంలో స్టార్టింగ్ లైన్లే వేర్వేరుగా ఉంటే? అప్పుడు చివర్లో వచ్చిన మార్కును మాత్రమే చూసి ‘ఎవరు ఎక్కువ మెరిట్?’ అని అడగటం అనేది ఫలితాన్ని కొలవడం మాత్రమే అవుతుంది; ఫలితం ఏర్పడిన సామాజిక ప్రక్రియను కొలవడం కాదు.అయితే అవకాశాల అసమానతలను తగ్గించడానికి రిజర్వేషన్ ఒక్కటే సరిపోతుందా? పిల్లవాడు పోటీ పరీక్షకు వచ్చేలోపు పది సంవత్సరాల విద్యలోనే అసమానతలు ఏర్పడితే, చివర్లో సీట్లను పంచడం మాత్రమే సమానత్వం ఎట్లా అవుతుంది? ప్రభుత్వ పాఠశాలల నాణ్యత, ఉపాధ్యా యుల లభ్యత, ప్రాథమిక విద్య, భాషా సామర్థ్యం, డిజి టల్ సదుపాయాలు, పోటీ పరీక్షల ఉచిత శిక్షణ, మొదటి తరం విద్యార్థులకు మార్గదర్శకత్వం– ఇవన్నీ బలపడాలి. అందువల్ల ‘మెరిట్’ను సామాజిక నేపథ్యం లేని స్వచ్ఛమైన వ్యక్తిగత ప్రతిభగా ఊహించడం మాత్రం సమస్య. ‘మెరిట్ ఎవరిది?’ అనే ప్రశ్న కంటే ముందు ‘మెరిట్ ఏర్పడటానికి అవకాశం ఎవరికెంత దొరికింది?’ అన్న ప్రశ్న వేయాలి.- బాలాజీ పోతుల, వ్యాసకర్త ఉపాధ్యాయుడుఇదీ చదవండి: కంచె చేను మేస్తుంటే, కాపు గాచేదెవరు? -
కంచె చేను మేస్తుంటే, కాపు గాచేదెవరు?
‘‘ఇది భస్మ సింహాసనంబు, ఇది పిశాచులతో నిటలేక్షణుండు గజ్జె కదిలించియాడు రంగస్థలంబు’’. నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా శ్మశానం మీద రాసిన పద్యం తెలియని తెలుగువారు ఉండకపోవచ్చు. విగతజీవుల అంత్యక్రియలు శ్మశాన ధర్మం. కానీ రక్షణ కల్పించవలసిన పోలీస్ వ్యవస్థే భస్మ సింహాసనంగా మారి బతికున్నవారి ప్రాణాలు బలిగొంటే? శవాలను కాల్చి బుగ్గిచేస్తే..? శవదహనాల తర్వాత కుటుంబ సభ్యులకు చితాభస్మం దొరుకుతుంది. కానీ పోలీసులు చేసే దహనాల్లో సాక్ష్యం ఉండకూడదు కనుక, అది కూడా దొరకదని తేలిపోయింది. ‘‘బతికుంటే నా కొడుకు జాడ చెప్పండి, చంపేసి ఉంటే కనీసం అతడి బూడిదైనా ఇవ్వండ’’ని ఆ తల్లి ఎంత ప్రాధేయపడిందో! బూడిద కూడా లేదని తెలిసిన తర్వాత ఆ కన్నపేగు ఎంత అల్లాడిందో!గద్దెమీదనున్న పెద్దలు పోలీసు బలగాన్ని ప్రైవేట్ సైన్యంగా వాడుకోవడం మొదలుపెడితే రక్షకభట నిలయాలు భక్షకభట ఠాణాలకు మారుతాయనడానికి తాజా ఉదాహరణ విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్. గాదె సాయికృష్ణ అనే యువకుడి లాకప్ డెత్ విషయంలో పోలీస్ యంత్రాంగం పై నుంచి కింది దాకా పీకల్లోతున దిగబడి వున్నదనే సందేహాలు బలపడుతున్నాయి. వాటికి రుజువులూ బయటపడుతున్నాయి. సాయికృష్ణ మీద ఉన్న పాతకేసుల్లో భాగంగా ఆయనపై కోర్టు వారెంట్ మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి కృష్ణలంక పోలీసు లకు అప్పగించారని ఇప్పటి వరకు నిర్ధారణైంది. వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల పాత్ర కూడా ఉన్నది కనుక, వారు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పని చేస్తారు కనుక... కృష్ణలంక పోలీసులు నెరవేర్చింది స్వామికార్యమా, స్వకార్యమా? అన్నది తేలవలసి ఉన్నది.నేరారోపణున్న వ్యక్తి లాకప్‌లో చనిపోతే అంత తీవ్ర విషయంగా పరిగణించవలసిన అవసరం లేదనే వైఖరిని ఏపీ లోని కొన్ని రాజకీయ శక్తులూ, మీడియా సంస్థలూ తీసుకోవడం ఆశ్చర్యకరంగా ఉన్నది. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ (ఏడీఆర్) అనే సంస్థ రిపోర్టు ప్రకారం ఏపీ పాలక కూటమి ఎమ్మెల్యేల్లో 79 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 56 శాతం మంది మీద హత్య, కిడ్నాప్, మహిళల్ని అవమానించడం వంటి తీవ్రమైన కేసులున్నాయి. సాయికృష్ణ స్థానంలో వీరిలో ఎవరైనా ఉంటే ఈ శక్తులు ఎట్లా స్పందిస్తాయి? లాకప్ డెత్‌లను నాగరిక సమాజం తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తుంది. కంచే చేనును మేయడాన్ని హేయమైన విషయంగా భావిస్తుంది. భారత సర్వోన్నత న్యాయస్థానం కూడా లాకప్ హింసాకాండపై పలుమార్లు తీవ్రంగా స్పందించింది. న్యాయస్థానాలు, చట్టాలు మాత్రమే కాదు, సమాజం కూడా లాకప్ హింసను బలంగా వ్యతిరేకించిన చరిత్ర ఉన్నది. ప్రజాందోళనల ధాటికి ముఖ్య మంత్రి స్థాయి వ్యక్తులు కూడా రాజీనామా చేసిన అనుభవాలున్నాయి.ఒకనాడు గొప్ప చైతన్య స్రవంతిగా పేరున్న ఆంధ్ర పౌరసమాజంలో ఇప్పుడెందుకో ఒక స్తబ్ధత కనిపిస్తున్నదనే అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణ ఘాతుకం మాత్రమే కాదు; పోలీసుల పిలుపు రాగానే గతంలో అనుభవించిన చిత్రహింసలు గుర్తు చేసుకొని క్రాంతికుమార్ అనే దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా ఈ మధ్యనే జరిగింది. అయినా అలనాటి అభ్యుదయవాడలైన బెజవాడ వీధుల స్పందన మంద్రస్థాయిలోనే కనిపించింది. ఇతరత్రా సామాజిక, రాజ కీయ కారణాలతోపాటు మీడియా దిగజారుడుతనం కూడా ప్రజల చైతన్యస్థాయిపై ప్రభావం చూపిస్తుండవచ్చు. అప్పు డెప్పుడో జంధ్యాల పాపయ్య శాస్త్రి రాసిన ‘‘చెక్కు చెదరని ఏనాడు మొక్కవోని ఆంధ్ర పౌరుషమిప్పుడు అధ్వానమాయె, మరల ఒకమారు వెనుకకు తిరిగి చూసి దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి’’ అనే పద్యపాదానికి ఇప్పుడు మరింత ఔచిత్యం ఏర్పడిందేమో!సాయికృష్ణ ఘటనకు సంబంధించి న్యాయస్థానం ముందు సిట్ పొందుపరిచిన సమాచారాన్ని బట్టి మే 6వ తేదీన టాస్క్‌ఫోర్స్–కృష్ణలంక పోలీసుల ఉమ్మడి బృందం సాయి కృష్ణను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకొచ్చింది. నాన్–బెయిలబుల్ వారెంట్ అమలులో భాగంగా ఆయన్ను కోర్టు ఎదుట హాజరుపరచాల్సి ఉండగా, ఆ పని పోలీసులు చేయలేదు. కృష్ణలంక స్టేషన్లో పనిచేసే ఒక సబ్ ఇన్స్పెక్టర్ మాత్రం తాను సాయి కృష్ణను స్టేషన్లో మే 8వ తేదీన చూసినట్టు తెలియజేశాడు. సాయికృష్ణ తల్లి కూడా స్టేషన్లో తన కుమారుడి అరుపులు వినిపించాయనీ, లాకప్ గదిలో అతడిని తాను చూశాననీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఆమె హైకోర్టులో జూన్ 4న హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన హైకోర్టు సాయి కృష్ణను కోర్టు ఎదుట హాజరు పరచాలని సిటీ పోలీస్ కమీష నర్‌ను ఆదేశించింది. పది రోజుల తర్వాత (జూన్ 15న) సాయికృష్ణ ఆచూకి తెలియలేదని పోలీసు యంత్రాంగం కోర్టుకు విన్నవించింది.ఈలోగా సాయికృష్ణను లాకప్‌లో చంపి ఉంటారనే వార్తలు సంచలనం కావడం, ప్రతిపక్ష నేత సాయికృష్ణ ఇంటికి వెళ్లి తల్లిని పరామర్శించడంతో అదే రోజు (జూన్ 19) పోలీసులు సాయికృష్ణ లాకప్ హత్య అభియోగంపై కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. రెండు రోజుల తర్వాత, ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేశారు. విజయవాడ ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో మే 1 నుంచి జూన్ 1 వరకు సీసీ టీవీ ఫుటేజీ మొత్తం మాయమైందని సిట్ తెలియజెప్పింది. ఈ విషయం తెలిసిన తర్వాత కేసు సక్రమ దర్యాప్తుపై అన్ని వర్గాల్లోనూ తీవ్రమైన సందేహాలు తలెత్తాయి. నాన్‌బెయిలబుల్ వారెంట్‌లో భాగంగా తీసుకొచ్చిన నిందితుడిని కోర్టులో హాజరు పరచకపోవడం, అతడు అదృశ్యం కావడం అనే విషయాలు ఉన్నతాధికారులకు తెలియకుండా ఉండే అవకాశమే లేదని తెలుస్తున్నది. పైగా సాయికృష్ణ అరెస్టులో టాస్క్‌ఫోర్స్ పోలీసుల పాత్ర ఉండటం వల్ల ఈ వ్యవహారం కమిషనర్‌కు తెలియక పోవడమనే ప్రసక్తే ఉండదని చెబుతున్నారు.ఏ4 నిందితుడైన సురేశ్ రిమాండ్ రిపోర్టులో మే 12వ తేదీనే సాయికృష్ణను చంపేసి శ్మశాన వాటికలో దహనం చేసినట్టు ‘సిట్’ పేర్కొన్నది. కానీ జూన్ 15వ తేదీన కూడా సాయికృష్ణ ఆచూకీ తెలియలేదని న్యాయస్థానానికి పోలీసుల తరపున చెప్పడం ఇక్కడ గమనార్హం. ఈ నేపథ్యంలోనే మొత్తం ఘటనపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని సాయికృష్ణ తల్లి హైకోర్టులో పిటీషన్ వేశారు. తన అనుమతి లేకుండానే పిటీషన్‌ను ఉపసంహరించుకున్నారంటూ మరోమారు సీబీఐ దర్యాప్తు కోరుతూ ఆమె అనుబంధ పిటీషన్ వేశారు. ఈ కేసులో పోలీసు ఉన్నతాధికారులైన డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, విజయ వాడ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, విజయవాడ సౌత్‌జోన్ ఏసీపీ ఎం.మానసలను నిందితులుగా చేర్చాలని పార్లమెంట్ సభ్యుడు మద్దెల గురుమూర్తి విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదుపై వాంఙ్మూలాలను నమోదు చేసేందుకు కోర్టు నిర్ణయించింది. దీంతో ఉన్నతాధికారులు హైకోర్టుకు వెళ్లి, విజయవాడ కోర్టు నిర్ణయాలపై స్టే తెచ్చుకున్నారు. ఈ కేసులో నిజంగా వీరి పాత్ర లేనట్టయితే స్టే తెచ్చుకోవలసిన అవసరమేమిటన్నది ఇప్పుడు కీలకమైన ప్రశ్నగా మారింది.హైకోర్టు స్టేపై గురుమూర్తి సుప్రీంకోర్టుకు వెళ్లడం, సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించడం తెలిసిందే. డీజీపీ, విజయవాడ సీపీ, సౌత్‌జోన్ ఏసీపీల పాత్రపై దర్యాప్తు జరగాల్సిందేనని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ఉన్నతస్థాయి అధికారులకు తెలియకుండా జరిగే అవకాశం లేదని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. నెల రోజులపాటు సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోతే పర్యవేక్షణాధికారులు నిద్రపోతున్నారా అని కూడా ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. విజయవాడ కోర్టు ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై బెంచ్ స్టే విధించింది. హైకోర్టులో సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన పిటీషన్, సీబీఐ దర్యాప్తు కోరుతూ వేసిన అనుబంధ పిటీషన్ల స్థితిగతులను తమకు తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది.లాకప్ హత్యల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం స్పందిస్తున్న తీరు, తీసుకుంటున్న నిర్ణయాలు బాధితుల పక్షానే ఉంటున్నాయి. ఈమధ్యకాలంలోనే జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం బాధితుల అప్పీళ్లపై స్పందించి సీబీఐ దర్యాప్తులకు ఆదేశించడం గమనార్హమని న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి. మధ్యప్రదేశ్‌లో దేవ్ పార్థీ అనే యువకుడు పోలీస్ లాకప్‌లో చనిపోయాడు. దర్యాప్తులో స్థానిక పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఎనిమిది నెలల కాలంలో ఒక్క అరెస్ట్‌ను కూడా స్థానిక పోలీసులు చేయలేదు. పైగా ప్రత్యక్ష సాక్షిగా ఉన్న దేవ్ పార్థీ బంధువుపై బెదిరింపులకు దిగారు. దాంతో దేవ్ పార్థీ తల్లి సుప్రీంకోర్టు తలుపు తట్టింది. కేసు వివరాలు ఆసాంతం పరిశీలించిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం ‘తన సొంత కేసులో ఏ వ్యక్తీ జడ్జీగా ఉండరాదన్న’ న్యాయ సూత్రాన్ని ఉటంకిస్తూ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. తమ సహచర సిబ్బందిపై వచ్చిన ఆరోపణల విషయంలో స్థానిక పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించగలరని భావించలేమని ధర్మాసనం అభిప్రాయపడింది.అతని వద్ద ఆరు లీటర్ల కాపుసారా ఉందన్న ఆరోపణతో ఛత్తీస్‌గఢ్ పోలీసులు శ్రావణ్ సూర్యవంశీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, లాకప్ నుంచి బిలాస్పూర్ జైలుకు తరలించారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయనక్కడ చనిపోయాడు. గాయాల తీవ్రత వల్లనే శ్రావణ్ చనిపోయాడని పోస్ట్‌మార్టం రిపోర్టు, జ్యుడీషి యల్ విచారణ నివేదికలు స్పష్టం చేశాయి. దీనిపై శ్రావణ్ కుటుంబానికి లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలని మాత్రమే హైకోర్టు తీర్పునిచ్చింది. పోలీసులపై విచారణకు ఆదేశించలేదు. దీనిపై సుప్రీంకోర్టులో జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం పోలీసుల పాత్రపైనే కాక, జ్యుడీషియల్ రిపోర్టుపై చర్యలు తీసుకోని అధికార యంత్రాంగంపై కూడా విచారణకు ఈ ఆగస్టు నెలలోనే ఆదేశాలు జారీ చేసింది. ఈ మధ్యకాలంలోనే ఇటువంటి మరికొన్ని ఉదాహరణలను ఉటంకించవచ్చు.మూడు దశాబ్దాల క్రితం ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించి 10 మంది ‘పంజాబ్ మిలిటెంట్ల’ ఎన్కౌంటర్ విషయంలోనూ సుప్రీంకోర్టు ఇదే తరహాలో స్పందించింది. దీనిపై స్థానిక పోలీసులు చిత్తశుద్ధితోనే విచారణ చేస్తారని భావించినా కూడా, వారి సహచరుల మీద విచారణను వారికి అప్పగించడం సమ్మతం కాదని న్యాయస్థానం అభిప్రాయపడి, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. సహచర సిబ్బందిపై విచారణ బాధ్యత స్థానిక పోలీసులే చేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించడం లేదన్నది ఈ కేసుల ద్వారా తేటతెల్లమవుతున్నది. ఈ కోణంలో చూసినప్పుడు సాయికృష్ణ లాకప్ మృతిపై సీబీఐ దర్యాప్తు తప్పక పోవచ్చనీ, ఈ విచారణ నుంచి ఉన్నతాధికారులు తప్పించుకోవడం కూడా సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయాలు న్యాయవాద వర్గాల్లో వినిపిస్తున్నాయి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఉన్నత ‘మిథ్య’
దేశవ్యాప్తంగా ప్రభుత్వాలనుంచి తీవ్ర ప్రతిఘటన వస్తున్నా, ఒక్కోసారి దౌర్జన్యం జరుగుతున్నా కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కార్యకర్తలు ప్రాథమిక పాఠశాలలు సందర్శించి అక్కడి దారుణ పరిస్థితుల్ని చాటుతున్నారు. ఉన్నత విద్య సైతం ఈ దేశంలో అలాగే అఘోరించిందని ఇటీవల విడుదలైన ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక కుండబద్దలుకొట్టింది. ఒకపక్క ప్రపంచంలో ఏ దేశానికీ లేని స్థాయిలో మనకు యువశక్తి పుష్కలంగా ఉన్నదని డబ్బా కొట్టుకొంటున్నా... ఆ యువత తమ సత్తా చాటడానికి అవసరమైన సదుపాయాలేమీ లేవని సీజేపీ విడుదల చేస్తున్న వీడియోలు, ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ఏక కంఠంతో చెబుతున్నాయి. మరి స్వాతంత్య్రానంతరం ఇన్ని దశాబ్దాల్లో ప్రభుత్వాలు ఏం సాధించినట్టు? మనది శరవేగంతో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని మొన్న జూలైలో అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సంస్థ ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మన వృద్ధి రేటు 7.8 శాతం. రిజర్వ్ బ్యాంక్ అంచనా 7.0 శాతం కన్నా ఇది అధికం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ప్రస్తుతం మనం ఆరో స్థానంలో ఉండగా... మరో పాతికేళ్లలో భారత్ తొలి స్థానానికి ఎగబాకుతుందని అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ ఆర్థికవేత్త జెఫ్రీ శాక్స్ ఇటీవల అంచనా వేశారు. గర్వపడాల్సిందే. కానీ ప్రాథమిక విద్య మొదలు ఉన్నత విద్య వరకూ అంతా నాసిరకంగా ఉన్నప్పుడు ఇదంతా ఎలా సాధ్యమన్న ప్రశ్న ఎవరికైనా వస్తుంది... పాలకులకు తప్ప! మనం అమెరికా, చైనాలను అధిగమించబోయే క్రమంలో ఉన్నాంగనుక ఆ రెండు దేశాల్లోనూ విద్యావ్యవస్థలెలా వున్నాయో తెలుసుకోవటం అవసరం. అమెరికా యూని వర్సిటీలు 2024లో ఉన్నత విద్యకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి కోసం 11,770 కోట్ల డాలర్ల నిధులు పొందాయని ఒక నివేదిక చెబుతోంది. ఇందులో ప్రభుత్వాలనుంచి వచ్చింది 6,460 కోట్ల డాలర్లు. మన దగ్గర ప్రభుత్వాలే కాదు... వాటినుంచి ఎకరా 99 పైసలకు వందల ఎకరాలు పొందే ప్రైవేటు సంస్థలు సైతం ఉన్నత విద్యకు నిధులు రాల్చటం లేదని దీన్నిబట్టి తెలుస్తుంది.చైనాలో పరిశోధన, అభివృద్ధి రంగాలకు 2024లో కేటాయించిన మొత్తం దాని వృద్ధి రేటులో 2.69 శాతం. అదే కాలంలో ఉన్నత విద్యారంగంలో మన వ్యయం జీడీపీలో కేవలం 0.84 శాతం. ఉన్నత విద్య వరకూ అన్ని దశలూ ప్రజలకు అందుబాటులో ఉండటం, మౌలిక సదుపాయాలపై అపారంగా వ్యయం చేయటం, వ్యూహాత్మక పరిశోధనకు పెద్ద మొత్తంలో నిధులు వ్యయం చేయటం, పటిష్టమైన ప్రభుత్వ సమన్వయం చైనా ప్రత్యేకతలు. మనం ఆ స్థాయికి చేరుకోవటానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది?మన యూనివర్సిటీలు, కళాశాలలు... వాటిల్లో చేరే విద్యార్థుల సంఖ్య గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరిగిన మాట వాస్తవమే అయినా, వీరికి బోధించేందుకు అవసరమైన సిబ్బంది లేరు. దాదాపు మంజూరైన అధ్యాపక పోస్టుల్లో అన్నిచోట్లా మూడోవంతు ఖాళీగా పడివున్నాయి. ప్రస్తుత ఉన్నత విద్యా సంస్థల సంఖ్య 64,756 కాగా, 2014తో పోలిస్తే వీటి వృద్ధి 47 శాతం. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 4.5 కోట్లు. అధ్యాపకులసంఖ్య కూడా 2013–14 మధ్య ఉన్న 13.7 లక్షలనుంచి 17.3 లక్షలకు చేరింది. కానీ ఇంకా 34 శాతం పోస్టులు ఖాళీ. ప్రొఫెసర్ల స్థాయిలో ఈ ఖాళీలు 54 శాతం. కనీసం పెరిగిన సంఖ్యకు తగినట్టయినా ప్రమాణాలు పెంచటం, పరిశోధన రంగాన్ని పటిష్ట పర్చటం, యూనివర్సిటీలను పరిశ్రమలతో అనుసంధానించటం వంటివి చేయనట్టయితే మన యువతకు బంగారు భవిష్యత్తు ఎలా?ప్రపంచశ్రేణి అభ్యసన పద్ధతుల్ని తీసుకొచ్చి మరింత సామర్థ్యంతో, లోపరహితంగా పరీక్షలు నిర్వహించటానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఏర్పడింది. అంతవరకూ ఆ బాధ్యతల్ని చూస్తున్న సీబీఎస్ఈ, ఏఐసీటీఈ, వివిధ యూనివర్సిటీలను కాదని ఎన్టీఏకు అప్పగించారు. సీజేపీ ఆవిర్భావానికి ఎన్టీఏ నిర్వాకమే దారితీసిందంటే తన కప్పగించిన బాధ్యతను అది ఎంత దివ్యంగా నిర్వహించిందో గ్రహించవచ్చు. ప్రతిభను పాడె ఎక్కించే విధానాలనూ, నిర్లక్ష్యాన్నీ, నిరాసక్తతనూ ఇప్పటికైనా ప్రభుత్వాలు విడ నాడాలి. ప్రాథమిక విద్య మొదలు ఉన్నత విద్యవరకూ సమూల ప్రక్షాళనకు సంసిద్ధం కావాలి. లేనట్టయితే సాధించిన, సాధించబోయే అభివృద్ధి అర్థరహితమవుతుంది. -
మళ్లీ ఉన్మాద ఛాయలు!
కొన్ని హఠాత్సంఘటనలు అరుదైన వ్యక్తులనూ, మనుషుల్లోని అసాధారణతనూ ప్రపంచం ముందు ఆవిష్కరిస్తాయి. బుధవారం ఒక దుండగుడి హైజాక్ యత్నంలో చిక్కుబడి, ప్రమాదపుటంచుల్లోపడిన ఫ్లై దుబాయ్ విమానం తిరిగి నిలదొక్కుకున్న ఉదంతంలో ఆ విమానం పైలెట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ పేరు ఇప్పుడు ప్రపంచం మూలమూలనా మార్మోగటానికి ఆయన ప్రదర్శించిన తెగువ, సాహసాలే కారణం. కో కెప్టెన్ దాడితో శరీరంనిండా కత్తిపోట్లున్నా, నెత్తురోడుతూ అపస్మారకంలోకి పోతున్నా కెప్టెన్ మచ్ఛర్ ఏమాత్రం జంకక సమయస్ఫూర్తితో, విమానాన్ని రక్షించి తీరాలన్న పట్టుదలతో కాక్‌పిట్ తలుపు లాక్ తెరవడం చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే సన్నివేశం. ఆయన స్ఫూర్తిదాయక వ్యవహారశైలి దేశదేశాల్లోని పైలెట్లకు, మొత్తం విమానయాన సిబ్బందికి భవిష్యత్తులో ఒక అధ్యయనాంశంగా మారుతుంది.సరిగ్గా పాతికేళ్లనాడు అమెరికాలో నాలుగు విమానాల్ని దారిమళ్లించి కూల్చివేసి, వేలాదిమంది మరణానికి కారణమైన ఉగ్రవాద ఉన్మాదంనుంచి ప్రపంచ దేశాలింకా సరైన గుణపాఠం నేర్చుకోలేదని ఈ హైజాక్ యత్నం రుజువుచేసింది. అది ఆత్మాహుతి దాడా... మరేదైనానా అన్నది తేల్చాల్సివున్నదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో సహా పలువురు చెబుతున్నా, దీనివెనక ఇరాన్ హస్తమున్నదని బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్ ఆరోపిస్తున్నారు. ఈ దుండగానికి కారకుడైన కో పైలెట్ ఒమన్ జాతీయుడు. 174 మంది ప్రయాణిస్తున్న ఆ విమానం ఎన్నో అవాంతరాలెదురైనా చివరకు సురక్షితంగా సౌదీ అరేబియాలో అడుగుపెట్టింది. కెప్టెన్ మచ్ఛర్‌పై కో పైలెట్ దాడి,వారి పెనుగులాట... అనుకోకుండా కాక్‌పిట్ తలుపు లాక్ తెరుచుకోవడం వంటి వరస పరిణామాలు అందులో ప్రయాణిస్తున్న వారందరినీ దిగ్భ్రాంతిలో పడేశాయి. ఈమధ్యలోనే విమానం నియంత్రణ కోల్పోయి నిమిషంలోపే 34,000 అడుగుల ఎత్తునుంచి 17,000 అడుగులకు పడిపోవటంతో ప్రయాణికులంతా ప్రాణభయంతో కేకలు వేయటం వీడియోలో రికార్డయింది. మరో 2,000 అడుగుల కిందకు జారాక అది మళ్లీ క్రమేపీ గాల్లోకి లేవడం ఒకరకంగా అదృష్టమని చెప్పాలి. ప్రయాణికుల్లో కొందరు చొరవగా లోపలికెళ్లి జరిగిందేమిటో గ్రహించి కోపైలెట్‌ను అదుపు చేయటం, ప్రయాణికుల్లో ఒకరైన డెంటిస్టు రక్తస్రావం కాకుండా కెప్టెన్‌ను కాపాడటం ప్రశంసించ దగ్గ పనులు. ఇంకా ఆశ్చర్యకరమైన సంగతేమంటే... అనుకోకుండా ఆ విమానంలో రిలీఫ్ పైలెట్లు ఉండటం. అత్యవసర సమయంలో విమానం నడపాల్సిన కో పైలెటే నేరగాడు కావటం, పైలెట్‌కు స్పృహ లేకుండా పోవడం వంటి పరిణామాల మధ్య ఆ రిలీఫ్ పైలెట్లు లేకుంటే ఏం జరిగివుండేదో ఊహించుకుంటేనే వణుకొస్తుంది. అమెరికాలో జరిగిన ఉగ్రదాడి తర్వాత పైలెట్ లేదా కో పైలెట్ కోరుకుంటే తప్ప కాక్‌పిట్ తలుపు తెరుచుకోకుండా విమానాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బయటినుంచి తెరిచే ప్రయత్నం దుర్లభమయ్యేంత పటిష్టంగా ఆ తలుపుంటుంది. హైజాక్ యత్నం, బెదిరింపులు వంటివి క్యాబిన్లో మాత్రమే జరుగుతాయనీ,కాక్‌పిట్ సురక్షితంగా ఉండేలా చూస్తే సరిపోతుందనీ ఈ సాంకేతికత తీసుకొచ్చారు. కానీ తాజా ఉదంతంలో ప్రమాదం క్యాబిన్లో కాకుండా, కాక్‌పిట్‌లోనే పొంచివుండటం గమనించదగ్గది. వీటి సంగతలావుంచి అసలు దుబాయ్‌లో కో పైలెట్ చాకుతో విధులకు ఎలా రాగలిగాడు? అంటే భద్రత విషయంలో మునుపటి అప్రమత్తత సన్నగిల్లిందన్నమాట! నిత్యం వేలాదిమంది ప్రయాణించే దుబాయ్ విమానాశ్రయంలో ఇలాంటి భద్రతాపరమైన లోపం చోటుచేసుకోవటం ఊహకందనిది. ప్రపంచం కక్షలు, కార్పణ్యాలతో భయానకంగా మారింది. ఇప్పుడు జరిగిన ఉదంతానికి పురిగొల్పిన పరిణామాలేమిటన్నది ఇంకా తెలియాల్సే వున్నా ఇజ్రాయెల్ గాజాలో సాగిస్తున్న మారణకాండకు ప్రతీకారంగా కో పైలెట్ ఆ దేశ పౌరులు అధికంగా వున్న విమానాన్ని కూల్చేయదల్చుకున్నాడన్న కథనాలు వెలువడుతున్నాయి. ‘కంటికి కన్ను...’ సిద్ధాంతం మనిషిని ఉన్మాదిగా మారుస్తుంది. సహేతుక పోరాటాలపై నీలినీడలు కమ్మేలా చేస్తుంది. ఒక ఉన్మాదానికి మరో ఉన్మాదం ఎప్పటికీ జవాబు కాదు. -
జైశంకర్ నిర్మొహమాటం
సంక్షోభ కాలంలో తటస్థంగా ఉండటం, మర్యాదలు పాటిస్తూ మంచితనం ఒలకబోయటం కుదరదు. అది అవతలిపక్షానికే లబ్ధి చేకూరుస్తుంది. అమెరికా తీరుపై దౌత్య మార్గాల్లో మన దేశం లోగడ అసంతృప్తి తెలిపిందా అన్నది తెలియదుగానీ... తాజాగా విదేశాంగ మంత్రి జైశంకర్ నిర్మొహమాటంగా మాట్లాడారు. న్యూయార్క్‌లో సోమవారం జరిగిన ఆసియా సొసైటీ పాలసీ ఇనిస్టిట్యూట్(ఏఎస్పీఐ) సదస్సులో మన వైఖరేమిటో తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండోసారి ఏలుబడిలో కొచ్చాక మనతో తేడాగా ప్రవర్తిస్తున్నారు. భారత్‌వంటి అతి పెద్ద మార్కెట్ కావాలి. తన ఉత్పత్తులు నచ్చిన ధరకు విక్రయించుకోవాలి. లాభాలు గడించాలి. అదే సమయంలో పాకిస్తాన్‌తో అంటకాగుతూ, ఆకాశానికెత్తుతారు. దాన్ని బుజ్జగిస్తారు. రోగికి పత్యం రుచించనట్టు మనం చెప్పేది ఆయనకు నచ్చదు. నిజానికి ఇది ట్రంప్‌కు మాత్రమే పరిమితమైన వింత కాదు. ఆయన ముందున్న పాలకులు... వారే పార్టీ వారైనా ఇలాగే ప్రవర్తించారు. కాకపోతే దౌత్య మర్యాదలు పెద్దగా తెలియని, ఖాతరుచేయని మనిషి గనుక ట్రంప్ బాహాటంగా ప్రవర్తిస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వంలోని భారత్... తనతో కాక నాటి సోవియెట్ యూనియన్‌తో సన్నిహితంగా మెలగటం అమెరికాకు కంటగింపైంది. అందుకు విరుగుడుగా పాకిస్తాన్‌ను చేరదీసింది. భారత్, పాక్మధ్య జరిగిన నాలుగు ప్రధాన యుద్ధాల్లోనూ, ఘర్షణల్లోనూ దాని పరోక్ష హస్తం ఉంది. నిజమైన మిత్రదేశంతో ఎలా మెలగాలో అమెరికాకు ఏనాడూ తెలియదు.ఉగ్రవాదంలో పాకిస్తాన్ పాత్రపై స్పష్టమైన సమాచారం ఉన్నా కంటితుడుపు చర్యగా దానికి విడుదల చేయాల్సిన నిధుల్ని ఆపినట్టు నటించటం, కొన్నాళ్లకే ఏదో ఒక సాకుతో విడుదల చేయటం దశాబ్దాలుగా రివాజైంది. ఆయుధ సామగ్రి విషయంలోనూ అంతే. ఉగ్రవాద చేష్టలతో ఆర్థికవ్యవస్థ సర్వనాశనమై దివాళా స్థితిలో పడిన పాకిస్తాన్‌ను ఆర్థికంగా ఆదుకోవాల్సిందే. కానీ అందుకు షరతులుండాలి. ఆ నిధుల్ని ఉగ్రవాదానికి ఊతమందించటానికి మళ్లించకూడదు. ఇందువల్ల మనకొస్తున్న ఇబ్బందులేమిటో అమెరికాకు పట్టదు. అలాగే వాణిజ్య ఒప్పందం పేరిట తాను విధించే షరతులు స్థానిక వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చేకూర్చగల నష్టం దానికి లెక్కలేదు. ఈ విషయంలో భారత్ అభ్యంతరాలు ఆయన బేఖాతరు చేస్తారు. అంతా తన నిర్దేశానుసారం అమలు కావాల్సిందేనన్నది ట్రంప్ పట్టుదల. వాణిజ్య ఒప్పందం ఖరారైపోయిందంటూ పలుమార్లు ఆయన ఏకపక్షంగా ప్రకటించారు. మొన్న ఫిబ్రవరిలో సైతం ఇక సంతకాలే తరవాయి అన్నారు. కానీ భారత్‌నుంచి స్పందన లేకపోవటంతో అదనపు సుంకాలు విధించారు. ఈ బాపతు సుంకాలకు కోర్టులో చుక్కెదురైంది. కానీ అధిక సుంకాల పాటపాడుతూ బెదిరించడం మానుకోలేదు. మరోపక్క ఉగ్రవాదంవల్ల భారత్ నష్టపోతున్న వైనం తెలిసినా పాక్‌ను కట్టడి చేయరు. మనపట్ల సహానుభూతి చూపటం ధర్మమనుకోరు.భారత్–పాక్‌ల వైరం సంగతలా వుంచి ప్రపంచం ఇంతటి సంక్లిష్ట స్థితికి చేరుకోవటంలో అమెరికా పాత్ర ఎవరికీ తెలియంది కాదు. ఇరాన్‌పై అమెరికా దుందుడుకు చర్యలవల్ల హార్మూజ్ జలసంధిలో రవాణా నిలిచిపోయింది. ఉక్రెయిన్ను యూరప్ దేశాలద్వారా రెచ్చగొట్టి రష్యాను యుద్ధంలోకి నెట్టింది కూడా అమెరికాయే. ఈ రెండు పరిణామాల కారణంగా అంతర్జాతీయ వాణిజ్యం దెబ్బతింది. ముడి చమురు, ఎరువులు, ఆహార ధాన్యాల రవాణా నిలిచిపోయి ప్రపంచ దేశాలన్నీ సంక్షోభంలో పడ్డాయి. చాలా దేశాల ఆర్థికవ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనికి సూపర్ ఎల్‌నినో రూపంలో వచ్చిపడిన ప్రకృతి వైపరీత్యాలు తోడవుతున్నాయి. అందుకే రానున్న కాలంలో ప్రపంచ ప్రజలు కనీవినీ ఎరుగని పెను సంక్షోభం ఎదుర్కొనబోతున్నారని జైశంకర్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమెరికాకు నేరుగా మన అసంతృప్తి తెలియజేయటం, చేస్తున్న తప్పుల్ని దిద్దుకోమని చెప్పటం... ప్రపంచం మునుపట్లా లేదని, ఏకచ్ఛత్రాధిపత్యం రోజులు అంతరించాయని చెప్పడం అత్యవసరం. దీన్ని సకాలంలో నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, తడబాటులేకుండా తెలిపినందుకు ఆయన్ను అభినందించాలి. -
అలసత్వంపై ‘సుప్రీం’ కొరడా
నలుగురు గుమిగూడి నిరసనకు దిగితే అతిగా స్పందించటం అలవాటైన ఢిల్లీ పోలీసులకు ఇటీవల అక్కడ వరసగా చోటుచేసుకున్న లైంగిక నేరాల గురించి పట్టింపు లేనట్టు కనబడుతోంది. మొన్న ఆగస్టులో గ్రేటర్ నోయిడా నుంచి కశ్మీరీ గేటువరకూ 47 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన బస్సులో ఒక మైనర్ బాలికపై దుండగులు అత్యాచారానికి ఒడిగట్టారు. వారంరోజుల క్రితం ఆగ్నేయ ఢిల్లీలోని ఆస్తా కుంజ్ పార్క్ దగ్గర మరో మైనర్ బాలికపై ముగ్గురు లైంగిక నేరానికి పాల్పడి హత్యచేశారు. దానికి సమీపంలోని లేడీ శ్రీరాం కాలేజీ విద్యార్థినులైతే తమకు లైంగిక వేధింపులు నిత్యకృత్యమయ్యాయనీ, ఫిర్యాదులు చేసినా ఫలితం ఉండటం లేదనీ చెబుతున్నారు. ఢిల్లీ–ఎన్సీఆర్ పరిధిలో ఈనెల మొదటివారం మొదలుకొని ఇప్పటివరకూ డజను వరకూ లైంగిక నేరాలు వెలుగులోకొచ్చాయని మీడియా కథనాలు చెబుతున్నాయి.అందుకే సోమవారం సర్వోన్నత న్యాయస్థానం పోలీసులపైనా, అధికార యంత్రాంగంపైనా ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇవన్నీ 2012 నాటి నిర్భయ ఉదంతాన్ని గుర్తుకు తెస్తున్నాయని వ్యాఖ్యానించించటంతోపాటు శాంతిభద్రతల్ని మెరుగుపరచడానికి నాలుగు సూచనలు చేసింది. వీటిని వచ్చేనెల 5 లోగా అమల్లోకి తీసుకురావాలని ఆదేశించింది. డీఎస్పీ ర్యాంకుకు తక్కువకాని అధికారులతో జిల్లాలవారీగా ఎక్కడెక్కడ ప్రమాదకర ప్రాంతాలున్నాయో గుర్తించాలన్నది అందులో మొదటి సూచన. అక్కడి పార్కులు, విద్యాసంస్థలు, శివారు ప్రాంతాలు వగైరాలను ఇందుకోసం కూలంకషంగా పరిశీలించాలని తెలిపింది. అలాగే ఇలాంటి ప్రాంతాల్లో రోజంతా గస్తీ ఉండేలా చూడాలని కోరింది. నిఘా కెమెరాల పనితీరు ఎలావుందో తరచు తనిఖీలుచేసి, అవసరమైన మరమ్మత్తులు చేయించాలని, చీకటి ప్రాంతాలు ఎక్కడా ఉండటానికి వీల్లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. వాహనాల కిటికీలకు నల్లటి తెరలు, ఫిల్ములు లేకుండా చూడాలని ఆదేశించింది. నిజానికి వీటిల్లో కొన్ని నిర్భయ ఉదంతం తర్వాత ఏర్పాటైన జస్టిస్ జేఎస్ వర్మ కమిషన్ సిఫార్సుల్లో కూడా ఉన్నాయి. 2012లో నిర్భయ ఉదంతం తర్వాత దేశ వ్యాప్తంగా పెల్లుబికిన నిరసనలతో యూపీఏ ఆధ్వర్యంలోని కేంద్రం వెంటనే స్పందించి ఈ కమిషన్ ఏర్పాటుచేసింది. అది నివేదిక ఇవ్వడానికిముందే ఉరిశిక్షతోసహా కఠిన శిక్షలకు ఆస్కారం కల్పించే నిర్భయ ఆర్డినెన్స్ కూడా తెచ్చింది. అప్పట్లోనే ఆ ఆర్డినెన్స్ పైనా, దాని స్థానంలో వచ్చిన చట్టంపైనా మానవహక్కుల సంఘాలు, మహిళా సంఘాలూ పెదవి విరిచాయి. కేవలం కఠిన శిక్షలు నిర్దేశించినంత మాత్రాన నేరాలు ఆగబోవనీ, వెంటవెంటనే స్పందించే యంత్రాంగం, పకడ్బందీ దర్యాప్తు, న్యాయ స్థానాల్లో వేగంగా విచారణ, శిక్షలు ఉంటేనే నేరం చేయాలంటే భయపడే పరిస్థితులుంటాయనీ ఆ సంఘాలు తెలిపాయి. ఇటీవల ఐపీసీ బదులుగా తీసుకొచ్చిన భారతీయ న్యాయసంహితలో అత్యాచార నేరానికి విధించే శిక్షను ఏడేళ్లనుంచి పదేళ్లకు పెంచారు కూడా. దాదాపు పదిహేనేళ్లు గడిచాక చూస్తే పరిస్థితి మొదటికొచ్చింది. కళాశాల విద్యార్థినులు ఫిర్యాదులు చేస్తున్నా పోలీసులకు తీరిక లేకపోయింది. కనీసం ఆ ప్రాంతంలో గస్తీ పెంచాలన్న ఆలోచన కూడా రాలేదు. దాని పర్యవసానంగానే బాలిక బలైపోయింది. మహిళలపై సమాజంలో శతాబ్దాలుగా పేరుకుపోయిన భావనలు, జెండర్ వివక్ష, బాధ్యతాయుత స్థానాల్లో ఉండేవారి వ్యవహారశైలి, ప్రభుత్వాల అలసత్వమూ ఇలాంటి నేరాలను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నాయని జస్టిస్ జేఎస్ వర్మ కమిషన్ చేసిన వ్యాఖ్య గమనించదగ్గది. ఉదంతం జరిగినప్పుడల్లా బాధితుల్నే తప్పుబట్టే సంస్కృతి దేశంలో ఇంకా పోలేదు. వాస్తవానికి నిర్భయ ఉదంతం తర్వాత వెనువెంటనే చర్యలుంటాయన్న భరోసాతో ఫిర్యాదులు చేసేవారి సంఖ్య పెరిగింది. కానీ ఎప్పట్లానే అలసత్వమూ, ఫిర్యాదు ఇచ్చినవారినే తప్పుబట్టే ధోరణి గమనించాక చాలామంది వెనక్కి తగ్గటం మొదలైంది. అసలు నమోదైన కేసుల దర్యాప్తులో పోలీసులు నిరాసక్తత సమస్యను మరింత పెంచుతోంది. నిరుడు వెలువడిన గణాంకాల ప్రకారం ఢిల్లీ పరిధిలో రోజుకు అయిదు అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. పరిస్థితి మరింత జటిలం కాకముందే పోలీసులు మేల్కొనాలి. సుప్రీంకోర్టు సూచనలను తక్షణమే అమల్లోకి తీసుకురావాలి. -
ముక్త(సరి) కంఠం!
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిలు శనివారం సమావేశమై ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయాలన్నీ ఏకగ్రీవమేనని ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. తమ మధ్య విభేదాలున్నాయన్న కథనాలను తోసిపుచ్చారు. అలా ప్రకటించటానికి రెండు రోజులు పట్టిందంటేనే గృహచ్ఛిద్రాలు దండిగా వున్నాయని అర్థం. మీడియాతో నేరుగా మాట్లాడితే దొరికిపోతామన్న బెరుకు వారిలో ఉన్నదని తాత్పర్యం. దేశవ్యాప్తంగా ప్రజల్లో, పార్టీల్లో ఎన్నో సందేహాలూ, భయాందోళనలూ రేకెత్తించిన వ్యవహారం నాలుగు పేజీల ప్రెస్ నోట్‌తో, ముగ్గురు కమిషనర్ల గ్రూప్ ఫొటోతో సరిపెట్టుకోమంటే ప్రజాస్వామ్యంలో చెల్లదు. వ్యవస్థలు అంతర్గత కలహాల్లో కొట్టుమిట్టాడాలని ఎవరూ కోరుకోరు. కానీ మీడియా కథనాలకు స్పష్టమైన వివరణ ఉండాలా, వద్దా? పారదర్శకంగా, ప్రామాణికంగా ఎన్నికలు నిర్వహించాల్సిన సంస్థ దాపరికంతో ఉందంటే దాని విశ్వసనీయత, కార్యకలాపాలూ ప్రశ్నార్థకం కావా? ఇద్దరు కమిషనర్లూ లేవనెత్తిన ప్రశ్నలు వారి వ్యక్తిగత తగవు కాదు. అది ఓటు హక్కు కోల్పోయిన కోట్లాదిమంది పౌరుల జీవన్మరణ సమస్యతో ముడిపడి వున్నది. ఈసీ వంటి ఒక కీలక వ్యవస్థలో నిబంధనలు బేఖాతరవుతూ ఇష్టారాజ్యం నడుస్తున్నదన్న అభిప్రాయం కలిగించిన ప్రశ్నలవి.ఈసీ ప్రకటన తీర్చిన సందేహాలకన్నా, రేకెత్తించిందే అధికం. సంధూ, వివేక్ జోషిలిద్దరూ పది నెలల వ్యవధిలో ఏకంగా 14 సార్లు రికార్డుపూర్వకంగా అభ్యంతరం చెప్పారని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం అంటున్నది. ఎందుకలా జరిగిందో, వారి అభ్యంతరాలేమిటో ఈసీ చెప్పొద్దా? ఈసీఐనెట్ పోర్టల్‌లో ఫామ్–6కి చేసిన సాంకేతిక మార్పులకు చట్టబద్ధత లేదంటూ వారిద్దరూ వేలెత్తిచూపారని కథనం. అది జరగనేలేదని ఈసీ ప్రకటన ఎక్కడా పేర్కొనలేదు. ఫామ్–6కు జతచేసిన డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించిందని ప్రకటన చెబుతోంది. అది బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) సాగుతున్న సందర్భం వరకూ వాస్తవం. కానీ అటుపై చేసిన మార్పులపై కదా రగడ! దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత లేదా? ఢిల్లీలో సాగిన ‘సర్’పై సమాచార హక్కు కార్యకర్త అంజలీ భరద్వాజ్, అమృత జోహ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై గత మంగళవారం విచారణ సందర్భంగా ఆ ప్రక్రియ యాంత్రికంగా సాగిందన్న అభిప్రాయం కలుగుతున్నదని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. అక్కడున్న 97 లక్షల మందికి పైగా ఓటర్లలో 47 లక్షలమంది పేర్లు జాబితాల నుంచి తొలగించారు. ఇందులో 33 లక్షలకుపైగా మందికి ‘తార్కిక వ్యత్యాసాల’ పేరిట నోటీసులు జారీ అయ్యాయి. ఇదంతా ఈ ముగ్గురి సమష్టి నిర్వాకమో... లేక మీడియా కథనం అంటున్నట్టు మైనారిటీ నిర్ణయం పర్యవసానమో సంజాయిషీ ఇవ్వొద్దా? డేటా నిర్వహణ విషయంలోనూ, కేంద్ర కేబినెట్ కార్యదర్శికి రాసిన లేఖ విషయంలోనూ ఇదే దాపరికం! జాతీయ మీడియాలో కథనాలు వెలువడి అల్లరైంది గనుక ఈమాత్రం వివరణైనా ఇచ్చారు. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(వైఎస్సార్సీపీ) ఫిర్యాదుచేసినా, ప్రతినిధి బృందం కలిసినా జవాబు లేదు. ఆ ఎన్నికలు ఆద్యంతమూ బరితెగింపే. ఎన్నికలకు ముందు కూటమి సలహాతో అధికారుల్ని మార్చడం మొదలుకొని వేకువజామువరకూ పోలింగ్ సాగటం, అర్ధరాత్రి లక్షలమంది ఓటేయటం, నిబంధనలకు విరుద్ధంగా వీవీ ప్యాట్ స్లిప్‌లు, సీసీ కెమెరా ఫుటేజ్‌లు ధ్వంసం చేయడంవరకూ ఈ దుర్నీతి యథేచ్ఛగా సాగింది. అదేమంటే మౌనమే సమాధానం. ఇందువల్ల టీడీపీ దండిగా లాభపడింది. అందుకే ‘ఎక్స్‌ప్రెస్’ కథనాల తర్వాత అపోహలు తొలగించాలంటూ ఒక మాయదారి ప్రకటన చేసి... ఈసీ ‘వివరణ’ వెలువడిన మరుక్షణమే సందేహనివృత్తి అయిందంటూ ఆ పార్టీ కొనియాడింది. ఆ వివరణ రాజ్యాంగ సంస్థల నిజాయతీ, విశ్వసనీయతల్ని పునరుద్ఘాటించిందంటూ సీఎం చంద్రబాబు సిగ్గుమాలిన ప్రకటనొకటి చేశారు. అవేమిటో అంశాల వారీగా చెబితే అందరూ విని తరిస్తారు. మౌనంతోనో, అరకొర వివరణతోనో వంచించటం ఎల్లకాలమూ సాగదనీ, తీరు సరిగా లేనపుడు జనం నిలదీస్తారనీ ఈసీ తెలుసుకోవాలి. -
పుస్తకం ‘ఉత్త’ భూషణం
‘తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్’ అంటూ సరస్వతీ ప్రార్థనతో ఒక చాటుపద్యం ప్రారంభమవుతుంది. ‘నువ్వు నా మనసులో నిలిచి, మంచి, అందమైన మాటల్ని ధారగా ఇష్టంగా నాతో పలికించ’మని ఆ పద్యకవి ఆమెను ప్రార్థిస్తాడు. ‘జగత్తునే మోహపెట్టేదిగా, విప్పారిన కన్నులూ, పూర్ణచంద్రునివంటి ముఖమూ కలిగినదిగా’ ఆమెను సంబోధిస్తాడు. మరో కోణంలో ఈ పద్యం పుస్తకమెలా ఉండాలో చెబుతోంది– అది వాగ్ధారతోనే కాక, ఆ వాక్కులు మంచివిగానూ, అందంగానూ ఉండాలంటోంది. సరస్వతికి ఉపయోగించిన విశేషణాలను పుస్తకానికి కూడా అన్వయిస్తే, అది పాఠకజగత్తును మోహపెట్టేలా, వారి చూపుల్ని విశాలపరిచేలా, పూర్ణచంద్రుడిలా ఆహ్లాదం గొలిపేలా ఉండాలి. పుస్తకమెలా ఉండాలో చెప్పడమంటే, ఎలా ఉండకూడదో చెప్పడమే. పుస్తకాన్ని దేవతతో ముడిపెట్టడమంటేనే, దానికి పవిత్రతను ఆపాదించడం! అందం, ఆహ్లాదం, పవిత్రతా వగైరాలనలా ఉంచితే, పుస్తకంపట్ల కనీసమైన భక్తి శ్రద్ధలను, బాధ్యతను చాటుకుంటున్నామా? తొలినాటి వాగ్రూపదశ దాటి, లేఖనంతో మొదలైన తాళపత్రాలు, భూర్జపత్రాలదశలోకీ కాగితం దశలోకీ అడుగుపెట్టి అక్కడి నుంచి తాజాగా ఆడియో పుస్తకాల రూపంలో మరోసారి వాగ్రూపానికి చేరుకున్న ఇన్ని వందల, వేల సంవత్సరాల వ్యవధిలో కూడా పుస్తకరచననూ, ప్రచురణనూ ఉన్నత ప్రమాణాలు కలిగిన ఒక వ్యవస్థగా మనం పూర్తిగా అభివృద్ధి చేసుకోగలిగామా? సినిమా వంటి నిన్నమొన్నటి జనమాధ్యమాలతో పోటీపడే స్థాయిలో పుస్తకాన్ని జనసామాన్యంలోకి తీసుకెళ్ళగలిగామా? కవులు, రచయితలకిచ్చే గుర్తింపును– నటులకు, నాయకులకు ఇచ్చే గుర్తింపులో సగానికైనా పెంచగలిగామా? ఇప్పుడు మరింత ఎక్కువమందికి అందు బాటులోకి వచ్చిన పుస్తకం ద్వారా జ్ఞాన, విజ్ఞాన, సారస్వతవ్యాప్తిలో మరింత పురోగ మనాన్ని సాధించే బదులు తిరోగమనాన్ని చిత్తగించిన దాఖలాల సంగతేమిటి?! సరస్వతిలానే ప్రకృతి కూడా తల్లే. ఆ తల్లి జీవపరిణామ క్రమంలో మనిషికి మెదడు నిచ్చింది; ఆ మెదడు జ్ఞాన, విజ్ఞాన, సారస్వతావిష్కారాల వైపు మనిషిని నడిపించింది; మెదడుకు సమాంతరంగా ప్రకృతి ప్రసాదించిన మాట ఆ జ్ఞాన, విజ్ఞానాదులను తోటి మనిషితో పంచుకునే సౌలభ్యమిచ్చింది. అప్పటినుంచీ జ్ఞాన, విజ్ఞానవ్యాప్తిలో మనిషి మడమ తిప్పింది లేదు. వాక్కునే జ్ఞానవాహిక చేసుకుని మాటలల్లి, వాటికి ఆటపాటలు జోడించి జనంలోకి తీసుకెళ్ళి భావి కావ్యేతిహాసాలకు బీజావాపం చేసిన చరిత్ర మనిషిది. ఆదికవి నన్నయ భట్టు తన ఆంధ్రమహాభారత కృతిభర్త రాజరాజనరేంద్రుని ఆస్థానాన్ని వర్ణిస్తూ– అపార శబ్దశాస్త్రపారగులైన వైయాకరణులు, భారతరామాయణాద్యనేక పురాణ ప్రవీణులైన పౌరాణికులు, నవార్థవచనరచనా విశారదులైన మహాకవులు, సమస్తశాస్త్ర సాగర గరీయ ప్రతిభులైన తార్కికులు మొదలైన విద్వజ్జనాలు ఆయనను పరివేష్ఠించి ఉన్నారంటాడు. శ్రీనాథ మహాకవి విజయనగరంలో ప్రౌఢదేవరాయల ఆస్థాన పండితు డైన గౌడడిండిమ భట్టును శాస్త్రవాదంలో ఓడించి అతని కంచుఢక్కను పగులగొట్టించడం మరో ప్రసిద్ధ ఉదాహరణ. ఏ జ్ఞానరంగంలోనైనా అపశబ్దాలు, అపరిణతులు, అతర్కాలు, కుతర్కాలు చోటు చేసుకోకుండా ఆనాటి గురువులతోపాటు, పండితపరిషత్తులు అంకుశంలా పనిచేస్తూ జ్ఞానస్వచ్ఛతను పరిరక్షించడానికి ప్రయత్నించాయి. ఇప్పటి పుస్తక ప్రచురణ భాషలో చెప్పాలంటే ‘పరిష్కర్త’ పాత్రను నిర్వహించాయి. అటువంటిది, కాగితమూ, అచ్చుయంత్రమూ అందుబాటులోకి రావడంతో పుస్తకరూపం ధరించిన జ్ఞానం పండిత పరిషత్తు లనూ, రాజాస్థానాలను దాటి వందల సంవత్సరాల క్రితమే ప్రజాస్థానంలోకి అడుగు పెట్టినా, మనదేశంలో ఇప్పటికీ పుస్తకప్రచురణ ఉన్నత ప్రమాణాలు కలిగిన వ్యవస్థగా అభివృద్ధి చెందకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పుస్తకమూ, పుస్తక రచనా ప్రజాస్వామికమవుతూ అన్ని వర్గాలకూ అందుబాటులోకి రావడం శుభపరిణామ మను కుంటే; ‘పరిష్కర్త’ రూపంలో అంకుశం లోపించి నాణ్యత అడుగంటడాన్ని ఎలా చూడాలి? దాంతో పుస్తకాలు అనేకం అమ్ముకునే స్థాయికి చేరకుండా ఉచితంగా పంచి పెట్టే స్థాయిలోనే ఉండిపోతున్నాయి. దాని ప్రభావం మంచి పుస్తకాలపైనా పడుతోంది. ఇప్పటికైనా మేలుకుని ప్రచురణ రంగాన్ని ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుకోకపోతే హస్తభూషణం కావలసిన పుస్తకం ‘ఉత్త’ భూషణంగానే ఎప్పటికీ ఉండిపోతుంది. -
కుక్కకాటుకు తగిన చెప్పుదెబ్బ
రేబీస్... నేటికీ నిర్దిష్టమైన చికిత్స విధానం లేని అత్యంత ప్రాణాంతకమైన జూనోటిక్ వ్యాధి. (జంతువుల నుంచి మనుషులకు, అలాగే మనుషుల నుండి జంతువులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్స్ అంటారు). లూయీ పాశ్చర్ 1885లో తొలిసారిగా రేబీస్ నిరోధక టీకాను అభివృద్ధి చేశారు.ఆయన అందించిన ఈ ఆవిష్కరణే నేటికీ మానవాళికి రేబీస్ బారినుంచి రక్షణ కల్పించే ఏకైక ఆయుధంగా ఉపయోగపడుతోంది. లూయీ పాశ్చర్ వర్ధంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28న ‘ప్రపంచ రేబీస్ దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ‘కలిసికట్టుగా... మరింత బలంగా’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 59 వేల మంది రేబీస్‌తో మరణి స్తున్నారు. ఇందులో 95 శాతానికి పైగా మరణాలు ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోనే సంభవిస్తున్నాయి. భారత దేశంలో ఏటా సుమారు 5,700 మంది మరణిస్తున్నారని జాతీయ అధ్యయ నాలు స్పష్టం చేస్తున్నాయి. బాధితుల్లో ఎక్కువ శాతం 15 ఏళ్లలోపు పిల్లలే ఉండటం విచారకరం. ఈ నేపథ్యంలో 2030 నాటికి కుక్కల కాటు వల్ల సంభ వించే రేబీస్ మరణాలను పూర్తిగా నిర్మూలించాలనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ జంతు ఆరోగ్య సంస్థలు నిర్దేశించుకున్న ‘జీరో బై 30’ ప్రధాన లక్ష్యం.ఏడాది తర్వాతా బయటపడొచ్చు!రేబీస్ అనేది ‘లైసావైరస్’ అనే వైరస్ ద్వారా వ్యాప్తి చెంది కేంద్ర నాడీ వ్యవస్థపై దాడి చేసే తీవ్రమైన వ్యాధి. మానవుల్లో నమోదయ్యే రేబీస్ కేసుల్లో దాదాపు 99 శాతం కుక కాటు ద్వారానే వస్తున్నాయి. వ్యాధిగ్రస్థ కుక్కలతో పాటు పిల్లులు, నక్కలు, తోడేళ్లు, గబ్బిలాలు వంటి జంతువుల లాలాజలం ద్వారా కూడా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది.రేబీస్ సంక్రమించినప్పుడు జంతువు విపరీతమైన కోపంతో కనిపిస్తుంది. కనపడిన ప్రతి వస్తువును చివరికి చెక్కముక్కలు, రాళ్లను కూడా కొరుకుతుంది. నోటి నుంచి విపరీతంగా లాలాజలం (సొల్లు) కారుస్తుంది. మొరిగే స్వరం మారుతుంది. తన యజమానిని కూడా గుర్తించ లేని స్థితిలో దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. కొన్ని సంద ర్భాలలో వ్యాధిగ్రస్థ కుక్క లేదా జంతువు నిశ్శబ్దంగా ఉండి, అంటు డొక్కలు పడి, వెలుతురును కూడా చూడలేని స్థితిలో ఆహారం, నీరు తీసుకోకుండా ఏదైనా ఒక చీకటి లేదా మరుగు ప్రదేశంలో ఉండి దాదాపు వారంలో చనిపోతుంది. దీనినే ‘డంబ్ రేబీస్’ అంటారు.అలాగే మనుషులు పిచ్చికుక్క కాటుకు గురైన తర్వాత 2–3 నెలల నుండి ఏడాది లోపు ఎప్పుడైనా రేబీస్ లక్షణాలు కనపడవచ్చు. కొన్ని అరుదైన సందర్భాల్లో సంవత్సరం తర్వాత కూడా ఈ వ్యాధి సంక్ర మిస్తుంది. మనుషులు వ్యాధిగ్రస్థులు అయినపుడు కుక్క కాటు పడిన చోట దురద, మంట, జ్వరం మొదలవుతాయి. వ్యాధి ముదిరిన తర్వాత నీటిని చూస్తే గొంతు కండరాలు బిగుసుకుపోయి భయ పడటం (హైడ్రోఫోబియా), గాలి తగిలినా వణికిపోవడం (ఏరో ఫోబియా), తీవ్రమైన ఆందోళన వంటి నాడీ సంబంధిత సమస్యలు కనిపిస్తాయి. మనిషి గొంతుక మారిపోయి కుక్క వలె అరుస్తూ దాడి చేసేందుకు ప్రయత్నిస్తారు. చివరకు కోమాలోకి వెళ్ళి మరణిస్తారు.నీటుగా కడగటం అతిముఖ్యంజంతువు కరిచిన వెంటనే గాయాన్ని ధారాళమైన నీటిధార (రన్నింగ్ వాటర్) కింద సబ్బుతో కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు రుద్ది కడగాలి. సబ్బులోని క్షారగుణం వైరస్ పైపొరను నాశనం చేసి, వైరస్ తీవ్రతను దాదాపు 70–80 శాతం అక్కడే తుడిచి పెట్టేస్తుంది. అలాగే గాయంపై కారం, పసుపు, సున్నం, కాఫీ పొడి, ఆకుల పసర్లు వంటివి ఉపయోగించి తమకు తోచిన నాటువైద్యం చేయకూడదు. గాయంపై గట్టిగా కట్టుకట్టడం గానీ, వైద్యుడి సలహా లేకుండా వెంటనే కుట్లు వేయడం గానీ చేయరాదు. ప్రథమ చికిత్స అనంతరం పోవిడోన్ అయోడిన్ వంటి యాంటీ సెప్టిక్ ద్రావణాన్ని పూసి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లి టీకాలు వేయించుకోవాలి.ఇంట్రామస్కులర్ పద్ధతిలో 0, 3, 7, 14, 28వ రోజుల్లో మొత్తం ఐదు డోసులు ఇస్తారు. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందు బాటులో ఉన్న ఇంట్రాడెర్మల్ పద్ధతిలో 0, 3, 7, 28వ రోజుల్లో... మొత్తం నాలుగు మోతాదులుగా టీకాలు వేస్తారు. టీకాలు క్రమం తప్పకుండా వేయించుకోవడం ద్వారా మాత్రమే రేబీస్ నుండి రక్షణ పొందవచ్చు.దీని నిర్మూలన ఒక్క వైద్య, ఆరోగ్య శాఖతోనే సాధ్యం కాదు. పశు సంవర్ధక శాఖ, స్థానిక సంస్థలు, పెంపుడు జంతువుల యజమానులు, బ్లూ క్రాస్ తదితర జంతుసంక్షేమ సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలి. ఇళ్లలో పెంచు కునే కుక్కలు, పిల్లులకు వాటి యజమానులు మూడవ నెల వయసులోనే మొదటి మోతాదు రేబీస్ టీకా వేయించాలి. ఆ తర్వాత ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా బూస్టర్ డోస్ ఇప్పించి రికార్డు లను భద్రపరచాలి.వీధి కుక్కల నియంత్రణలో భాగంగా స్థానిక సంస్థలు గ్రామ, నగర స్థాయిలలో పెద్ద ఎత్తున ‘యానిమల్ బర్త్ కంట్రోల్’ (ఏబీసీ), సామూహిక రేబీస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలి. వీధి కుక్కలను రాయితో కొట్టడం, వాటి ఆహారాన్ని కదిలించడం లేదా నిద్రిస్తున్నప్పుడు వాటిని భయపెట్టడం చేయకూడ దని పిల్లలకు స్పష్టంగా చెప్పాలి. జంతువుల ఆరోగ్యం, మానవ ఆరోగ్యం పరస్పరం ముడిపడి ఉన్నాయనే ‘వన్ హెల్త్’ విధానమే రేబీస్ రహిత సమాజానికి ఏకైక పరిష్కారం.– కె. బాలబ్రహ్మం, వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ (రిటైర్డ్), ఏపీ పశు సంవర్ధక శాఖ (రేపు ప్రపంచ రేబీస్ దినం) -
‘తొత్తు’ మారితే ‘విత్తు’ మారునా?
కంచుకోట అనుకున్నాం. అలా అనుకోవాలని మీడియా శాసించింది. అది శత్రు దుర్భేద్యమని భజన గీతాలు పాడింది. జెన్ జీ యువతరం గురిచూసి పేల్చిన ఫిరంగి గుండు ధాటికి కోటలో కలవరం మొదలైంది. కాక్రోచ్ల దండు సింహాసనానికి ముచ్చె మటలు పట్టించింది. సరిగ్గా రెండు నెలలకే ఔర్ ఏక్ ఢక్కా. ఈ దెబ్బకు కోట కుతంత్రం సాక్ష్యాధారాలతో బట్టబయలైంది. మీడియా ప్రపంచంలో ఒకనాటి వైభవాన్ని కోల్పోయి, మిణుకు మిణుకుమంటున్న ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ తాజా సంచలనానికి వాహకమైంది. రితికా చోప్డా అనే జర్నలిస్టు నెలల తరబడి శ్రమించి రాసిన పరిశోధన కథనం స్వతంత్ర ఎన్నికల వ్యవస్థ హైజాకింగ్‌కు గురైన వైనాన్ని నగ్నంగా నిలబెట్టింది. ఒక భయ నిశ్శబ్దాన్ని కాక్రోచ్లు నిర్భయంగా ఛేదిస్తే, తన పరిశోధ నతో రితిక ఒక రణన్నినాదాన్నే ప్రజాస్వామిక శక్తులకు ప్రసాదించింది.ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసి, మీడియాను మచ్చిక చేసుకుంటే ఆడింది ఆట పాడింది పాట కాగలదని అధికారోన్మత్తులు భావిస్తే భంగపాటు తప్పదని ఈ పరిణామాలు నిరూపిస్తు న్నాయి. ఎవరూ ఊహించని సమూహాల నుంచి కూడా ప్రతిఘటనా శక్తులు ప్రభవించగలవని మరోమారు రుజువైంది. నవభారత నిర్మాత, పండిత నెహ్రూ, రాజ్యాంగ స్రష్ట బాబా సాహెబ్ అంబేడ్కర్ మొదలైన స్వతంత్ర భారత తొలితరం నాయకులు వేసిన ప్రజాస్వామ్య పునాదులను కూలదోయడం అంత సులభం కాదు. మోదీ ‘మ్యాజిక్’తో కకావికలమై ఉన్న ప్రతిపక్షాలు ఇప్పుడు కాలూ, చెయ్యీ కూడదీసుకుంటున్నాయి. ఐక్యపోరాటాలకు సిద్ధమవుతున్నాయి. బెంగాల్లో మూడు దశా బ్దాల వైరాన్ని పక్కనపెట్టి తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం నేతలు మాట్లాడుకుంటున్నారు. ఇండియా కూటమి వెలుపల ఉన్న పార్టీలు కూడా ఐక్య ఉద్యమంలోకి కలిసి రావాలని కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలనేది ప్రతిపక్షాల ప్రధాన డిమాండ్. ఆయన రాజీనామా చేయకపోతే తొలగించాలని, ‘సర్’ కార్యక్రమాన్ని నిలిపివేయా లని ప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నది. పార్లమెంటులో అభిశంసన తీర్మానానికి కూడా సన్నద్ధమయ్యారు. స్వతంత్రంగా వ్యవహరించవలసిన సీఈసీ వంటి అత్యున్నత పదవిలో జ్ఞానేశ్‌కుమార్ లాంటి అధికార పార్టీ తొత్తు కొనసాగడం వాంఛనీయం కాదు. అతనికి ఉద్వాసన పలకాలని కోరడం సమంజసమే. అతను తప్పుకున్న తర్వాత జరిగేదేమిటి? జ్ఞానేశ్ స్థానంలో శేషన్ రాడు కదా! రెండో జ్ఞానేశుడు వస్తాడు. విద్యామంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ప్రహ్లాద్ జోషీ వచ్చాడు. ఇద్దరి మధ్యన సిద్ధాంత విభేదాలు ఏమీ లేవు కదా!ఎన్నికల కమిషనర్ల నియామకంపై 2023లో చేసిన సవరణ చట్టం ప్రకారం ప్రధాని, హోంమంత్రి, ప్రతిపక్ష నేతలతో కూడిన ఎంపిక కమిటీ ఎన్నికల కమిషనర్లను నియమిస్తుంది. ఈ త్రిసభ్య సంఘంలో ప్రభుత్వానిదే మెజారిటీ. ఛీఫ్ ఎలక్షన్ కమిష నర్ స్థానం ఖాళీ అయినప్పుడు, ఉన్నవారిలో సీనియర్‌ను ఎంపిక చేయాలనే నిబంధనేమీ ఈ చట్టంలో లేదు. ఈ స్థానాన్ని కూడా ఎంపిక కమిటీ బయటి వ్యక్తులతో భర్తీ చేయవచ్చు. కనుక ఈ విషయంలో అప్రజాస్వామిక ధోరణికి మూలం భారత ప్రధాన న్యాయమూర్తి బదులు ఎంపిక కమిటీలో ప్రధానితో పాటు మరో కేంద్రమంత్రిని చేర్చడం. వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సమస్యకు మూలమైన ఈ అంశాన్నే తన ట్వీట్లో ప్రస్తావించారు. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయ మూర్తితో కూడిన త్రిసభ్య ఎంపిక కమిటీని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానితో పాటు మరో కేంద్ర మంత్రిని నియమించుకోవడాన్ని ‘విద్యార్థే స్వయంగా తన ఎగ్జామినర్’ను ఎంపిక చేసుకోవడంగా ఆయన ఎద్దేవా చేశారు. ఆరోపణలకు ప్రత్యారోపణలు కాకుండా, ఎన్నికల సంఘంలో వ్యక్తమైన అభ్యంతరాలేమిటి, వాటిపై తీసుకున్న చర్యలేమిటి అనేవి పారదర్శకంగా ప్రజలకు వెల్లడి కావాలని ఆయన కోరారు. ఈ వివాదంపై మిగిలిన ప్రతిపక్షాలకు భిన్నంగా జగన్ ఆచరణాత్మకమైన వైఖరి తీసుకున్నారు. జ్ఞానేశ్‌ను తొలగించాలి, అరెస్ట్ చేయాలనే ఉద్వేగపూరితమైన ధోరణి ప్రధాన ప్రతి పక్షంలో కనపడింది. జ్ఞానేశ్ వ్యవహారంపై విచారణ జరగ వలసిందే. దోషిగా తేలితే శిక్షపడవలసిందే. కానీ దానివల్లనే సమస్యను పరిష్కారం దొరకదు. జ్ఞానేశ్‌కుమార్ కేంద్రంలోని పెద్దల వద్ద భృత్యుడుగానే పనిచేశారు. తొత్తురాయుడిగానే విధేయత కనబరిచారు. అయితే ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయకపోవడం అనేది ఆయనతోనే ప్రారంభం కాలేదు. ఆ మాటకొస్తే ఎన్డీఏ హయాంలోనే మొదలుకాలేదు. ఏదో ఒక స్థాయిలో కేంద్ర కార్యనిర్వా హకవర్గం కనుసన్నల్లోనే ఎన్నికల సంఘాలు మొదటినుంచీ పనిచేశాయి. ఒక్క శేషన్ హయాంలో తప్ప. ఆ సమయంలో రుషితుల్యుడైన పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నందువల్ల వ్యవస్థలన్నీ వాటి పరిధిలో స్వేచ్ఛగా పనిచేసుకొనే వెసులు బాటు కలిగింది. మన్మోహన్ సింగ్ హయాంలో రాజకీయపర మైన నిర్ణయాలన్నీ యూపీఏ చైర్పర్సన్ కనుసన్నల్లోనే జరిగేవి కనుక పీవీ హయాంతో పోల్చితే కొంత తేడా కనబడింది.కేంద్ర సర్కార్‌లో సెక్రటరీ స్థాయిలో పనిచేస్తూ జ్ఞానేశ్ కుమార్ బీజేపీ పెద్దల నమ్మకాన్ని చూరగొన్నారని చెబుతారు. ఫలితంగా 2024 ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి కొద్ది రోజుల ముందు ఎన్నికల కమిషనర్‌గా ఆయన నియమితు లయ్యారు. రాజీవ్ కుమార్ సీఈసీగా ఉన్నారు. జ్ఞానేశ్ ప్రవేశా నికి ఐదారు రోజుల ముందు మరో ఈసీ అరుణ్ గోయల్ రాజీనామా చేయవలసి వచ్చింది. ఆయన వ్యక్తిగత కారణాలని చెప్పినప్పటికీ అంతకుమించి ఏదో బలవత్కారణం ఉందని అధికార వర్గాల్లో ప్రచారం ఉన్నది. గోయల్ రాజీనామాకు కొన్ని రోజుల ముందే మరో ఈసీ అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ చేశారు. రాజీవ్‌తో పాటు గోయల్ ఒక్కరే ఈసీగా ఉన్నారు. నోటిఫికేషన్‌కు రెండు వారాల ముందు ఆ ఒక్కగా నొక్క ఈసీ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. కానీ అత్యవసర సమయంలో ఆయన హఠాత్తుగా తప్పుకోవడం, జ్ఞానేశ్ కుమార్ అడుగు పెట్టడం రాజకీయ నిర్ణయాలేనని అధికార వర్గాల నిశ్చితాభిప్రాయం.అప్పుడు సీఈసీగా ఉన్న రాజీవ్ కుమార్‌కు కూడా పాలక కూటమికి విధేయుడనే పేరున్నది. అతి విధేయుడైన జ్ఞానేశ్ కుమార్ ఆయనకు తోడయ్యారు. 2024 ఎన్నికల్లోనే చాప కింద నీరులా రహస్య ఎజెండా అమలైందన్న సంగతిని కొన్ని స్వచ్ఛంద సంస్థలతో పాటు పలువురు మేధావులు గుర్తించారు. వారి అనుమానాలను ఉటంకిస్తూ ఆధారాలతో కూడిన లేఖలను పంపించినా ఎన్నికల సంఘం నుంచి స్పందన రాలేదు. ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ దేశవ్యాప్తంగా విస్తృతంగా అధ్య యనం చేసి పోలైన ఓట్లపై ఎన్నికల సంఘం వేసిన పిల్లి మొగ్గల్ని ఎండగట్టి వాస్తవాలను జనం ముందుంచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ సమయం ముగిసిన తర్వాత భారీ స్థాయిలో ఓట్లు పడినట్టు వారం రోజుల తర్వాత ఈసీ ప్రకటించడాన్ని వీఎఫ్‌డీ ఎత్తి చూపింది.ఆంధ్రప్రదేశ్‌లో 12.54 శాతం, ఒడిశాలో 12.49 శాతం ఓట్ల పెరుగుదలలోని ఔచిత్యాన్ని వీఎఫ్‌డీ ప్రశ్నించింది. సాధారణంగా పోలింగ్ రోజు ప్రకటించే పోల్ శాతానికీ, మరుసటి రోజు తుది ప్రకటనకూ మధ్య ఒకటి రెండు శాతం కంటే ఎక్కువ వ్యత్యాసం ఉండదు. కానీ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అస్సాం, మహారాష్ట్ర మొదలైన రాష్ట్రాల్లో ఈ పెరుగుదల అసాధారణ స్థాయిలో ఉన్నది. ఒక్క ఏపీలోనే ఈ ఓట్ల పెరుగుదల 50 లక్ష లని ఆ సంస్థ లెక్క గట్టింది. ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ చేసిన పరిశోధన ఫలితాలు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. ఏపీలోని 3,500 పోలింగ్ బూత్ లలో ఎన్నికల సంఘం ప్రకటించిన లెక్కల ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఈ బూత్‌లలో 5 గంటల నుంచి 8 గంటల మధ్య పడిన ఓట్లు 34 వేలు మాత్రమే. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత, పోలింగ్ కేంద్రం ముందు క్యూలో నిలబడ్డ వారికి స్లిప్స్ పంచి ఓటు హక్కు కల్పిస్తారు. ఆ విధంగా 8 గంటల వరకు 34 వేల మంది (3,500 బూత్‌లలో) ఓట్లు వేశారనుకుందాం. హఠాత్తుగా రాత్రి 11 గంటల 45 నిమిషాల నుంచి 2 గంటల మధ్య కనీవినీ ఎరు గని స్థాయిలో 17 లక్షల మంది ఓటేసినట్టు ఈసీ లెక్కలు చెబు తున్నాయని ప్రభాకర్ విశ్లేషించారు.సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా వీవీ ప్యాట్లను కాల్చేయడం, కౌంటింగ్ రోజు దాకా ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ 90 శాతానికి పైగా ఉండటం వంటి అనుమానాలపై కూడా ఎన్నికల సంఘం స్పందించలేదు. నిస్సందేహంగా 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు అపహరణకు గురైంది. ఫలితాలు ప్రకటించిన తొలి రోజు నుంచే ప్రతిపక్షంపై రెడ్ బుక్ టెర్రర్ను ప్రయోగించి ఫలితాల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నాలను టీడీపీ ప్రారంభించింది. పోలింగ్ ముగిసిన సాయంత్రం నుంచే పోలీసు అధికార యంత్రాంగం తెలుగుదేశం కనుసన్నల్లో పని చేయడం ప్రారంభించిందంటేనే ఎంత పథకం ప్రకారం ఈ ఓట్ చోరీ కుట్రను అమలు చేశారన్నది అర్థమవుతున్నది.జ్ఞానేశ్ కుమార్ 2025 ఫిబ్రవరిలో ఛీఫ్ ఎన్నికల కమిషనర్ అయ్యారు. అత్యంత వివాదాస్పదమైన ‘సర్’ ప్రక్రియకు ఆయనే శ్రీకారం చుట్టారు. సార్వత్రిక ఓటు హక్కు అనే రాజ్యాంగ ఆశ యాన్ని తుంగలో తొక్కి వీలైనంత మందిని ఓటు హక్కుకు దూరం చేసే అప్రజాస్వామిక విధానం ఆయన హయాంలో జరుగుతున్నది. ఇప్పటికి 13 కోట్ల మంది తమ ఓటు హక్కును కోల్పోయారు. ఈసీ తలతిక్క విధానాల వల్ల ఓటు హక్కు కోల్పోతున్న వారిలో ప్రధానంగా మైనారిటీలు, పేదలు, వలస కార్మికులు ఉంటున్నారు. అధికారంలో ఉన్న కూటమికి మేలు జరిగేలా సర్ ప్రక్రియను అమలు చేస్తున్నారనడంలో సందేహం లేదు. పాలక పార్టీకి తొత్తుగా మారి ప్రజాస్వామ్యానికి పాతర వేస్తున్న జ్ఞానేశ్ తప్పుకోవలసిందే. అంతకంటే ముఖ్యమైనవి ఎన్నికల సంఘ వ్యవహారాల్లో పారదర్శకత, ఎన్నికల సంఘ సభ్యుల నియామకం ప్రజాస్వామికబద్ధంగా జరగడం. లేకపోతే ఒక తొత్తును మార్చినంత మాత్రాన అలాంటి మరో విత్తు మొల కెత్తకుండా ఉండదు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
సహజీవన రాగం సాధ్యమా?
ఆర్థిక రంగం మొదలు కృత్రిమ మేధ (ఏఐ) వరకూ అన్నిటా పరస్పరం హోరాహోరీ తలపడుతున్న బలమైన ప్రత్యర్థులు అమెరికా, చైనాలు నాలుగు నెలల వ్యవధిలో రెండోసారి కరచాలనం చేసుకున్నాయి. మొన్న మేలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్ చైనాలో పర్యటించగా... మూడు రోజుల దౌత్య పర్యటన కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ బుధవారం వాషింగ్టన్ వచ్చారు. ఆయనకు రెండురోజులూ ఘనసత్కారాలే దక్కాయి. కెమెరాల ఎదుట అధినేతలిద్దరూ చిరునవ్వులు చిందించటం కూడా చూడముచ్చట గానే ఉంది.కానీ రెండు దేశాల మధ్యా ఉన్న సమస్యలు గానీ,వాటి కారణంగా ఇప్పటికే పేరుకు పోయిన విభేదాలు గానీ చిన్నవేం కాదు. అవి సంక్లిష్టమైనవి, సామరస్య పరిష్కారానికి ఓపట్టాన లొంగనివి. 60వ దశకంలో నాటి రష్యా అధినేత నికితా కృశ్చేవ్ ప్రతిపాదించిన ‘మూడు శాంతుల’ ప్రతిపాదనలో ఒకటైన ‘శాంతియుత సహజీవనం’ సూత్రాన్ని గుర్తుకు తెచ్చేలా సంఘర్షణకన్నా సహకారమే ఇద్దరికీ లాభదాయకమని షీ జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. అప్పట్లో కృశ్చేవ్‌కు రానట్టే జిన్‌పింగ్‌కు కూడా ట్రంప్‌నుంచి అనుకూల స్పందనేమీ రాలేదు. కానీ ఇరుపక్షాలూమరింత సమతూక వాణిజ్య సంబంధాలు నెలకొల్పుకోవటానికి కలిసి పనిచేస్తున్నాయని ట్రంప్ అన్నారు. ఎగుమతులు పెంచటానికీ, ఆర్థికాభివృద్ధి సాధించటానికీ చైనా ప్రభుత్వం అక్కడి తయారీ రంగ పరిశ్రమలకు భారీయెత్తున సబ్సిడీలిస్తోంది. దాంతో చవగ్గా కార్లు, సౌరశక్తి ప్యానెళ్లు, ఖనిజాలు, ఉక్కు, ఇతర రకాల సరుకులు పాశ్చాత్య మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఈ వ్యూహం అమెరికానూ, పాశ్చాత్య దేశాలనూ తీవ్రంగా దెబ్బ తీస్తోంది. దీన్ని తగ్గించేందుకు తొలి ఏలుబడిలో ట్రంప్ చేసిన ప్రయత్నాలు కొంత వరకూ ఫలితాన్నిచ్చాయి. నిరుడు దీన్ని మరింత నియంత్రించేందుకు 25 శాతం అదనపు సుంకాలు విధించారు. వాటి కారణంగా సరుకుల వరద తగ్గిన మాట వాస్తవమే అయినా, దాదాపు 40 పాశ్చాత్య దేశాల మీదుగా ఆ వస్తువులు వెల్లువెత్తటం ట్రంప్‌కు తలనొప్పిగా మారింది. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగానే చైనా ఇదంతా చేస్తోంది. ఎవరెంతగా మొత్తుకుంటున్నా విదేశాలతో నిరుడు చైనా వాణిజ్య మిగులు లక్ష కోట్ల డాలర్ల పైమాటే. ఈమధ్యే అమెరికా మాజీ ఆర్థికమంత్రి జానెట్ ఎలెన్ అంతంతమాత్రంగా ఉన్న అమెరికా పారిశ్రామిక రంగం ‘చైనా షాక్’తో మరింత కుంగటం ఖాయమని చేసిన హెచ్చరిక వర్తమాన స్థితికి అద్దం పడుతోంది. చైనా సరుకులపై వ్యామోహంతగ్గించుకోమంటూ జనానికి చేసే హితబోధలేమీ పనిచేయటం లేదు. ‘మాగా’ పేరు చెప్పి ఆవేశంతో ఊగిపోయేవారు సైతం ఈ విషయంలో ట్రంప్ మాటల్ని బేఖాతరు చేస్తున్నారు. దాంతో దిక్కుతోచని స్థితిలో చైనాపై గత నెలలో 12.5 శాతం అదనపు సుంకాలు విధించారు. కానీ వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుకోవాలన్న అవగాహన కుదిరాక గత నెలలో కొన్ని వస్తువులకు దీన్నుంచి మినహాయింపునిచ్చారు. నవంబర్‌తో ముగియాల్సిన ఆ వెసులుబాటును తాజాగా వచ్చే జనవరి 10 వరకూ పొడిగించారు. అమెరికాతో సంఘర్షణ ముదిరితే జరిగే పర్యవసానాలేమిటో చైనాకు తెలియంది కాదు. అందుకే అది ద్విముఖ వ్యూహం అనుసరిస్తోంది. సుంకాలవల్ల అమెరికాలో కోల్పోయే నష్టాన్ని యూరోప్ దేశాల్లో భర్తీచేసుకుంటోంది. అలాగే తమవల్ల నష్టపోయే దేశాల్లో పరిశ్రమలు స్థాపిస్తామని, పెట్టుబడులు పెడతామని ప్రతిపాదిస్తోంది. ఆ దేశాల్లో భారీయెత్తున ఉద్యోగావకాశాలొస్తాయని ఊరిస్తోంది. ఈ వంకనే ప్రపంచాన్ని మభ్యపెట్టి నిలువు దోపిడీచేసిన చరిత్రగల అమెరికా, యూరోప్ దేశాలు వీటిని అంత తేలిగ్గాఅంగీకరిస్తాయా? ఈ విషయమై చైనాతో ఈయూ వచ్చేనెలలో చర్చించబోతోంది. కానీ ఫలితం ఉంటుందన్న ఆశ మాత్రం లేదు. అమెరికా–చైనా ఘర్షణలు ముదిరితే బాగుండు నని అవి కోరుకుంటున్నాయి. ఆ మాటెలా వున్నా ట్రంప్, జిన్‌పింగ్‌లిద్దరూ చైనాలోనవంబర్లో జరిగే ఆసియా పసిఫిక్ ఎకనామిక్ ఫోరం, డిసెంబర్లో అమెరికాలో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సుల సందర్భంగా కలుసుకోబోతున్నారు. అప్పటికల్లా వాణిజ్య సమస్య ఉపశమించాలని రెండు దేశాలకూ కోరికైతే ఉంది. కానీ పరస్పర విరుద్ధ శక్తుల మధ్య అదంత సులభం కాదని చరిత్ర చెబుతోంది. -
నియంత పోకడలు తగునా?!
ఇల్లిల్లూ తిరిగి, అర్హతగలవారికి ఓటు హక్కు కల్పించే దశాబ్దాల ఒరవడికి గండికొట్టి, వారిని అనుమాన దృక్కులతో చూస్తూ ఓటుకు ఎసరుపెట్టే దిక్కుమాలిన నిబంధనలు తెచ్చినవారి బండారం భళ్లున బద్దలైంది. ఎన్నికల సంఘం (ఈసీ)లో సాగుతున్న ఏకపక్ష పోకడలపైనా, అమలవుతున్న నిర్ణయ ప్రక్రియపైనా ఆంగ్ల దినపత్రిక ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వెలువరిస్తున్న కథనాలు దేశ ప్రజలను దిగ్భ్రాంతిలో ముంచాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్... త్రిసభ్య సంఘంలోని మిగతా ఇద్దరు కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిల అభ్యంతరాలను బేఖాతరు చేయటం, కొన్నిసార్లు వారికి తెలియకుండా కూడా నిర్ణయాలు తీసుకోవడం వంటి అప్రజాస్వామిక ధోరణులకు పాల్పడుతున్నారని సాక్ష్యాధారాలతో ఆ పత్రిక బట్టబయలు చేసింది. ‘ఏ సంస్థలోనైనా భిన్నాభిప్రాయాలుంటాయ’ంటూ దీన్నంతటినీ సమర్థించుకోజూస్తున్న ఈసీ బరితెగింపు సిగ్గుచేటు. ఇవి కేవలం భిన్నాభిప్రాయాలా? దీనివల్ల ఒక నిరుపేద కూలీ, వృద్ధాప్య సమస్యలతో ఇబ్బందిపడే బడుగుజీవి, పెళ్లయ్యాక ఉన్న ఊరూ, ఇంటిపేరూ మార్చు కోవాల్సి వచ్చిన ఒక సగటు మహిళ, అంతంతమాత్రం అక్షరాస్యతతో అవస్థలుపడే మరొక సాధారణ వ్యక్తి ఎన్ని ఇబ్బందులు పడ్డారో, పడతారో... వారి జీవితాలు ఎంతగా తలకిందులయ్యాయో జ్ఞానేశ్‌కు తెలుసా? ఎన్ని లోటుపాట్లున్నా స్వతంత్ర సంస్థగా వ్యవహరిస్తూ 1952 నుంచి సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ చేస్తూ వచ్చి ప్రపంచ దేశాల్లో ప్రశంసలు పొందిన చరిత్ర మన ఈసీకుంది. కానీ జ్ఞానేశ్ రాకతో అదంతా గంగలో కలిసింది. బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట ‘స్వచ్ఛ ఓటర్ల జాబితా’ రూపకల్పన కోసమంటూ తెచ్చిన నిబంధనలూ, వాటి పర్యవసానాలూ అందరి ఎరుకలోకీ వచ్చినప్పటినుంచి దాని ప్రాభవం కొడిగట్టడం మొదలైంది. అయినా దేశంలోని ఇతర రాష్ట్రాలన్నిటా సర్ కొనసాగుతూనే ఉంది. అమల్లోవున్న నిబంధనలు హఠాత్తుగా మార్చిన వైనంగానీ, ఆన్లైన్, ఆఫ్లైన్లకు అనుసరించిన భిన్న విధానాలుగానీ గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కొత్తగా ఓటుహక్కు పొందదల్చుకునేవారు ఆన్లైన్లో పంపాల్సిన ఫామ్–6 ఇందుకొక ఉదాహరణ. వారి తల్లిదండ్రుల పేర్లు 2002 నాటి సర్ జాబితాలో ఉంటే పేర్కొనాలన్నది కొత్తగా తీసుకొచ్చిన నిబంధన సారాంశం. ఆన్లైన్లో కాక, నేరుగా అందించే ఫామ్‌లో ఇది లేదు. అయినా చెల్లుతుందట! దీన్ని మిగతా ఇద్దరు కమిషనర్లూ వ్యతిరేకించి 1950 నాటి ఓటింగ్ నిబంధనల్లో సవరణ తీసుకొస్తే తప్ప ఇలా చేయటం కుదరదని చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఇక తాము అనుసరించిన పనికిమాలిన సాఫ్ట్వేర్, అక్షర క్రమంలో వచ్చే తేడాలు బెంగాల్లో 27 లక్షలమంది ఓటర్ల హక్కును హరించా యంటే... పరిష్కరించాల్సిన ట్రిబ్యునళ్లకు వ్యవధిలేక వారంతా ఈ ఎన్నికల్లో ఓటేయలేకపోయారంటే జ్ఞానేశ్ నిర్వాకం ఎలాంటిదో అర్థమవుతుంది. అక్కడే కాదు... తెలంగాణలో దాదాపు 93 లక్షల మందిని, ఏపీలో 44 లక్షల మందిని జాబితాల్లో మాయం చేసింది. దేశవ్యాప్తంగా ఇలా 13 కోట్లమందిని అయోమయంలోకి నెట్టారు. దీనర్థం ఏమంటే... వారి కుటుంబాల్లో తదనంతర తరాలు సైతం ఓటుహక్కుకు దూరమవుతాయి. పదినెలల వ్యవధిలో సర్ నిబంధనలకింద ఓటర్ల రిజిస్ట్రేషన్, పేర్ల తొలగింపు, ఓటర్ల జాబితా భద్రత వ్యవహారాలపై సంధూ, వివేక్ జోషిలిద్దరూ 14 అభ్యంతరాలు వ్యక్తంచేసినా దిక్కులేని స్థితి ఏర్పడిందంటే ఏమనాలి? జ్ఞానేశ్ ప్రధాన ఎన్నికల కమిషనరే కావొచ్చు. కానీ మిగతా ఇద్దరి అభ్యంతరాలను బేఖాతరు చేసేంత అదనపు అధికారం ఆయనకేమీ లేదు. ఆ పదవి ఆయనకు వరస క్రమంలో తొలిస్థానాన్నిస్తుంది తప్ప నిర్వహణకు సంబంధించి ముగ్గురూ సమానులు. టీఎన్ శేషన్ కేసులో చాన్నాళ్ల క్రితం సుప్రీంకోర్టే ఈ సంగతి స్పష్టం చేసింది. కానీ ఈ జ్ఞానం ఆయనకున్నట్టులేదు. జనం మనోభీష్టాన్ని ప్రతిబింబించే ఎన్నికలు అతి కీలకమైనవి. వాటి నిర్వహణ ఒక అసిధారా వ్రతం. దాన్ని భ్రష్టుపట్టించటం ఖండనార్హం. ప్రజాస్వామ్యమంటే భయమూ లేక, భక్తీ లేక ఇష్టారాజ్యం చలాయించే, నియంతృత్వ పోకడలు అనుసరించే బాపతు వ్యక్తులు ఇంతటి కీలక బాధ్యతల్లో కొనసాగటం అవాంఛ నీయం, అభ్యంతరకరం. -
అజేయుడు పుతిన్!
ఎన్నికల బాదరబందీ లేకుండా, ఓటర్ల చుట్టూ ప్రదక్షిణ చేసే ‘ఖర్మ’ పట్టకుండా దేశాధినేతలుగా చలామణి అయ్యేవారు ప్రపంచంలో ఇప్పటికీ చాలామందే ఉన్నారు. ఆ దేశాల్లో ఇలాంటివారికి మీడియా, సామాజిక మాధ్యమాలూ భజన చేస్తున్నా... ప్రపంచంలో వేరేచోట్ల వారికి నియంతలన్న అపకీర్తి ఉంటుంది. చైనా, ఉత్తర కొరియా వంటి దేశాల్లో మార్క్సిజం పేరు చెప్పి ఈ ఏకపక్ష స్వామ్యం సాగిపోతుంటుంది. రష్యాను దీర్ఘకాలంనుంచి ఏలుతున్న అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సాధించిన అఖండ విజయం మరోసారి ఆయనదైన ముద్ర చూపింది. తన పదవికి ఎసరుపెట్టే అవకాశం ఉందని భావించిన వారెవరినీ ఆయన వదల్లేదు. ఏమాత్రం ప్రభావితం చేయలేనివారు పోటీలో ఉన్నా పట్టించుకోలేదు. ఆయన వ్యతిరేకులు అనుమానాస్పద స్థితిలో మరణించ టమో, జైళ్లకు పోవటమో రివాజు. ఈనెల 18 నుంచి 20 వరకూ రష్యా పార్లమెంటు డ్యూమాకు జరిగిన ఎన్నికల్లో ఆయనకే చెందిన ‘యునైటెడ్ రష్యా’ పోలైన ఓట్లలో 57.83 శాతం దక్కించుకుంది. 2021లోని 49.82 శాతంతో పోలిస్తే ఇది అధికం. 95 శాతం ఓట్ల లెక్కింపు జరిగాక బుధవారం ఎన్నికల సంఘం ప్రకటించిన ప్రాథమిక ఫలితాలనుబట్టి దానికి 355 స్థానాలు వచ్చాయి. గత ఎన్నికల్లో ఆ పార్టీ బలం 343. ఒకప్పుడు అవిచ్ఛిన్నంగా దేశాన్నేలిన వారసత్వంగల కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ రష్యన్ ఫెడరేషన్ పార్టీకి 13.8 శాతం ఓట్లు, దాదాపు 40 స్థానాలు లభిస్తాయని తేలింది. 2021లో ఆ పార్టీకి 18.93 శాతం ఓట్లు, 57 సీట్లు లభించాయి. ఉక్రెయిన్ యుద్ధాన్ని వ్యతిరేకించిన ఏకైక పార్టీ యాబ్లొకొ పార్టీపై అనర్హత వేటుపడింది.ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించి నాలుగున్నరేళ్లు దాటడం, ఆంక్షల పర్యవసానంగా దేశ ఆర్థికవ్యవస్థ కుంగిపోవటం, ధరలు ఆకాశాన్నంటడం, ప్రత్యర్థి దేశం డ్రోన్ దాడుల పరంపరతో చమురు క్షేత్రాలు ధ్వంసం కావటంతో జనం యునైటెడ్ రష్యాను వ్యతిరేకించటం ఖాయమని కొందరు అంచనా వేశారు. రష్యా ఎదుర్కొంటున్న సంక్షోభం సామాన్యమైనది కాదు. చమురు క్షేత్రాల ధ్వంసంవల్ల ఉత్పత్తి నిలిచి, పెట్రోల్ బంకుల వద్ద వేలాది వాహనాలు బారులు తీరాయి. చివరకు తాను విక్రయించిన చమురునే మళ్లీ భారత్‌నుంచి కొనుగోలు చేయకతప్పలేదు. రష్యాలో సంక్షోభం ఏ స్థాయిలో ఉందంటే, మరిన్ని ‘త్యాగాలకు’ సిద్ధపడాలని కొత్త ప్రభుత్వం పౌరుల్ని కోరవచ్చంటు న్నారు. ఆరోగ్య పరిరక్షణ, విద్య వగైరా వ్యయాలను కట్టిపెట్టి యుద్ధంపైనే సర్వశక్తులూ కేంద్రీకరించాలని పుతిన్ చాన్నాళ్లుగా భావిస్తున్నారు. ‘యుద్ధ ఆర్థిక వ్యవస్థ’లో సర్వం లయంకావటం సహజమే. ఎన్నికల ప్రక్రియను ఏమార్చటం రష్యాలో సాధారణమే అయినా, ఓట్లేసినవారిలో అత్యధికులు దేశభక్తి, జాతీయత వంటి వ్యామోహాల్లో పడ్డారని కొందరి వాదన. తనకు దేశంపై పూర్తి స్థాయి పట్టు ఉందని... ఎన్నికలైనా, వ్యవస్థలైనా విశ్వసనీయమైనవని చూపటానికి పుతిన్ తాపత్రయపడ్డారు. ‘త్యాగాలకు’ సిద్ధపడాలని పిలుపునిచ్చే ఆర్థిక దుఃస్థితి లేనేలేదని, ఇదంతా గిట్టనివాళ్ల ప్రచారమని ఎన్నికలకు ముందు ఆయన ప్రకటించారు. కానీ ఇచ్చిన మాట నిలుపుకుంటారా అన్నది చెప్పలేం.ఈ ఎన్నికలు బూటకమని, వీటిని తిరస్కరించాలని బ్రిటన్, కెనడా, నార్వే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. అయితే సార్వజనీనంగా ఆమోదించిన ప్రజాస్వామ్య నమూనా అంటూ ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నదని చెప్పుకుంటున్న దేశాలు ఆ పదానికి తమ తమ సొంత భాష్యాలు ఇచ్చుకుంటున్నాయి. క్రమం తప్పని ఎన్నికలు, నిర్ణీత వ్యవధిలో చట్టసభల సమావేశాలు, వాటిల్లో అధికార విపక్షాల వాగ్యుద్ధాలు, పరస్పర ఆరోపణలు... ఇవన్నీ ప్రజాస్వామ్యమని చాలా దేశాల్లో జనం నమ్ముతారు. రష్యా వరకూ చూస్తే 2006లో మరణించిన అలెగ్జాండర్ లిత్వినెంకో, అన్నా పొలిటికోవ్స్క్యా, 2013లో చనిపోయిన బోరిస్ బెరెజోవ్స్కీ, 2015లో విగతజీవుడైన బోరిస్ నెమ్సోవ్, రెండేళ్ల క్రితం మరణించిన అలెక్సీ నవాల్నీ అక్కడ ప్రజాస్వామ్యం ఏపాటో చెబుతారు. వీరిలో ఇతరులంతా ఖండాంతరాల్లో అనుమానాస్పదంగా చనిపోతే, నవాల్నీ బందీఖానాలో కన్నుమూశారు. ఏదేమైనా 2031లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పుతిన్ గెలుపు ఖాయమని ఈ ఎన్నికలు నిరూపించాయి. -
సాహిల్ ప్రాణం తీసిందెవరు?
సవాళ్లు ఎదురైనప్పుడూ, సంక్షోభాలు తలుపుతట్టినప్పుడూ తగినవిధంగా స్పందిస్తేనే అవి పరిష్కారమవుతాయి. వాటిని ఎదుర్కొనడం చేతగానప్పుడు ఎన్ని తెలివితేటలుండి ఏం ప్రయోజనం? దేశంలో అత్యుత్తమ శ్రేణి ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో అగ్రభాగాన ఉండే బాంబే ఐఐటీలో ఈ నెల 18న దళిత విద్యార్థి సాహిల్ వాకొడే ఆత్మహత్యకు పాల్పడిన వైనం ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఏడు నెలల వ్యవధిలో అక్కడ చోటు చేసుకున్న నాలుగో మరణమిది. అక్కడే కాదు... దేశవ్యాప్తంగా ఉండే ఉన్నత శ్రేణి విద్యాసంస్థలన్నిటిలోనూ ఇలాంటి విషాద ఉదంతాలు తరచు కనబడుతున్నాయి. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసి, వీటిని అరికట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేసి చాన్నాళ్లవుతోంది. చూడటానికి బలవన్మరణాలు మానసిక ఒత్తిళ్లలో, నిరాశా నిస్పృహల్లో కూరుకు పోయినవారి వ్యక్తిగత నిర్ణయాలుగా కనబడతాయి. కానీ ఆ విషాద నిర్ణయాల వెనక వ్యక్తుల, వ్యవస్థల, సమాజాల ప్రభావం ఉండి తీరుతుంది. ఉన్నతశ్రేణి విద్యాసంస్థల వరకూ చూస్తే అక్కడ కులవివక్ష జాడ్యం ఉందన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఇప్పుడు సాహిల్ విషయంలోనూ గత మూడు నెలలుగా అదే జరిగిందని కుటుంబ సభ్యుల ఆరోపణ. బాంబే ఐఐటీ సాహిల్ విషయంలో ప్రవర్తించిన తీరు ఆ ఆరోపణను బలపరిచేదిగా ఉంది. ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోగానే అతను పరీక్షలో చాట్ జీపీటీ ఉపయోగిస్తూ పట్టుబడ్డాడని, కెరీర్‌పై దాని ప్రభావం ఏమీ ఉండబోదని నచ్చజెప్పారని, ఆ తర్వాత ఈ దురదృష్టకర ఘటన జరిగిందని ఒక సంతకంలేని ప్రకటన ద్వారా బాంబే ఐఐటీ తొలుత ప్రకటించింది. ఆ తర్వాత నాలిక కరుచుకుని దాన్ని ఉపసంహరించుకుంది. కాపీ చేశాడన్నది కేవలం ఒక ఆరోపణ. దానికదే తీర్పు కాదు. అది ‘క్రమశిక్షణ’ కూడా కానేరదు. ఏటా వేలమంది పట్టభద్రుల్ని రూపొందిస్తున్న ఉన్నతశ్రేణి సంస్థకు ఈ మాత్రం తెలియదనుకోవాలా? పైగా తనను తాను సమర్థించుకునే స్థితిలో లేనివారిపై, ఆరోపణలోని నిజానిజాలేమిటో నిర్ధారణ కాకుండా ఇలా ప్రకటించవచ్చా? బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ఒక కేసులో అయిదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం 1970లో తీర్పునిస్తూ ఒక విద్యార్థికి నోటీసు అందజేయకుండా, తన వాదన చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా తీసుకునే ఎలాంటి చర్య అయినా సహజన్యాయం అనిపించుకోదని స్పష్టం చేసింది. విద్యార్థులందరూ ఒకే విధంగా ఉండరు. ఎవరైనా అమల్లో ఉన్న నిబంధనలు ఉల్లంఘించారనుకుంటే చర్య తీసుకునే అధికారం విద్యా సంస్థలకుంటుంది. ఆరోపణల్ని విచారించటానికి కమిటీ ఏర్పాటు, విచారణ, అది తగిన చర్యకు సిఫార్సు చేయటం వంటివన్నీ జరగాలి. ఆ తర్వాతే ఏ చర్య అయినా. అంతేతప్ప కాపీ చేస్తున్నారనో, ఇంకేదో జరిగిందనో అవమానించి, సస్పెండ్ చేశామనటం తప్పుడు చర్య. సాహిల్ పట్ల ఎలా ప్రవర్తించారనేది ఎటూ విచారణలో తేలుతుంది. కానీ ఆ క్యాంపస్‌లో ఎప్పుడూ ‘తక్షణ న్యాయం’ అమలవుతుందని బాంబే ఐఐటీ పూర్వ విద్యార్థులు చెబుతున్నారు. తదుపరి సెమిస్టర్‌కు అనర్హత మొదలు హాస్టల్ నుంచి గెంటేయటం వరకూ అన్నింటా ఇదే తంతని వారి వాదన. ఇంతకూ సాహిల్ విషయంలో తొలుత విడుదల చేసిన ప్రకటన ఎవరిని కాపాడ టానికి? ఈ ఆత్మహత్య విషయంలో ఎటూ అలజడి రేగుతుందని, దాన్ని ఎదుర్కొనాలంటే ముందే ఇలాంటి ఆరోపణ చేయటం అవసరమని అనుకున్నవారెవరు? ఆత్మహత్య ఉదంతం జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదయ్యేలా చూడాలని మొన్న జనవరిలో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. బాంబే ఐఐటీకి ఈ జ్ఞానం ఉండొద్దా? అధ్యాపక వర్గం తరఫున ప్రకటనలిచ్చినవారికైనా తెలియొద్దా? విద్యావరణం రూళ్లకర్ర మాదిరిగా ఉండ కూడదు. మూర్ఖత్వంతో నిండిపోకూడదు. నిరంకుశంగా కనబడకూడదు. అయినవాళ్ల ప్రేమకు దూరంగా ఉంటూ, చదువుపరంగా అనునిత్యం ఒత్తిళు ఎదుర్కొంటూ లక్ష్య సాధనకు తపించే టీనేజ్ పిల్లల విషయంలో ఉండాల్సింది సహానుభూతి, మానవీయత, భావోద్వేగపరమైన మద్దతు. ఇవన్నీ కొరవడటంవల్లే 2018–2023 మధ్య 103 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. ఈ అవాంఛనీయ ధోరణులు ఇంకా ఇంకా కొనసాగుతుండటం సిగ్గుచేటు. -
ఇదా ‘సర్’ నిర్వాకం!
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట ఓటర్ల జాబితా సవరణలో చోటుచేసుకుంటున్న చిత్ర విచిత్ర విన్యాసాలు బయటపడుతూనే ఉన్నాయి. బిహార్‌లోనో, బెంగాల్లోనో, మరోచోటనో కష్టాలు పడటం సామాన్యుల వంతయింది. ప్రముఖులకు ఆ తాకిడి పెద్దగా లేదు. కానీ ఢిల్లీలో ఉంటూ రాజ్యంలోని వివిధ వ్యవస్థల్లో కీలకపాత్ర పోషించిన, పోషిస్తున్న వారికి కూడా చుక్కలు చూపించగలమని ఎన్నికల సంఘం (ఈసీ) రుజువు చేసింది. మాజీ ప్రధాని ఎల్.కె. అడ్వాణీ, ఆయన కుమార్తె, కోడలు, విదేశాంగ మంత్రి జైశంకర్, కాగ్ చీఫ్ కె. సంజయ్‌మూర్తి, సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, బీఆర్ గవాయ్, మాజీ ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్, సైనిక దళాల మాజీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీ, సెబీ చీఫ్ తుహిన్‌కాంత పాండేలకు నోటీసుల జారీ వైనం మీడియాలో మోతమోగుతోంది. ఆఖరికి ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎస్ ఎస్ సంధూ పేరు కూడా ఉందంటే ఈ ప్రక్రియ ఎంత దివ్యంగా సాగుతోందో అర్థమవుతుంది. వీరిలో 2002 నాటి సర్‌తో ‘మ్యాపింగ్’ కాలేదని కొందరికీ, పేర్లలో ‘తార్కిక వ్యత్యాసాలున్నా’యని మరికొందరికీ, మీకూ... మీ తండ్రికీ/తాతకూ మధ్య వయో భేదం ‘తక్కువుంద’ని ఇంకొందరికీ వర్తమానం పంపారు. సంధూ పేరును ఇప్పటికే చేర్చామని ఈసీ వివరణనిచ్చింది. ఆమధ్య భారతరత్న ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావుకు సైతం తాఖీదు వచ్చిందని మీడియాలో ప్రముఖంగా రాగా, ఆయన పేరు అప్పటికే జాబితాలో చేర్చామని ఈసీ ఆదరాబాదరాగా జవాబిచ్చింది. మొన్న ఆగస్టు 31న ఢిల్లీకి సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన మూడు వారాలకు తాజా తాఖీదులు జారీ అయ్యాయి. నోటీసులు అందుకున్న వారందరికీ ఆన్లైన్లో తప్పులు సరిచేసుకునే అవకాశా లిస్తున్నామని ఈసీ చెబుతోంది. వాదన వినిపించుకునే అవకాశం ఇచ్చి మాట్లాడాకగానీ ఎవరి పేరూ తొలగించబోమని కూడా ఎంతో పెద్ద మనసుతో చెబుతోంది. మెచ్చుకోదగ్గ విషయమే. కానీ కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే ఇంత పనికిమాలిన ప్రక్రియను కోట్లాది రూపాయలు వ్యయంచేసి, ఎందుకు అమలు చేస్తున్నట్టన్న సందేహం సంస్థ సారథులకే తడుతుంది. ప్రముఖులకు ఏమైనా జరిగితే ‘అయ్యో... ఇదేం చోద్యమ’నేవారు చాలా మందే ఉంటారు. మీడియాలో కావలసినంత రచ్చ జరుగుతుంది. కనుక డాక్టర్ సంధూ మాదిరే వీరిలో అందరికందరూ తుది జాబితాకెక్కుతారు. అందులో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. మరి సామాన్యుడి గతేమిటి? సర్‌లో చోటు దొరక్కపోతే ఓటు కోల్పోవడం ఒక్కటే సమస్య కాదు. ఏదో ఒకరోజు మీరు ఈ దేశ పౌరులు కాదని అలాంటి వారందరూ వర్తమానం అందుకునే ప్రమాదం లేకపోలేదు.పింఛన్ అందుకునే వారికి ప్రతియేటా ఒక తప్పనిసరి తంతు సాగుతుంటుంది. ‘లైఫ్ సర్టిఫికెట్’ పేరుతో ఎవరికి వారు తాము బతికేవున్నట్టు ధ్రువీకరణ పత్రం సమర్పిస్తేనే తదుపరి నెల పింఛన్ అందుతుంది. అంటే ఏడాదిలో మిగతా 364 రోజులూ ఆ పేరుతో ఎవరు తీసుకున్నా పట్టించుకోరు. ఆ ఒక్కరోజూ మాత్రం ‘నిరూపించు కోవాలి’. సర్ ప్రక్రియ అందుకు భిన్నమేమీ కాదు. ఇంతకూ గతంలో ఉన్నత పదవుల్లో పనిచేసి నిష్క్రమించినవారికీ, ఆ పదవుల్లో కొనసాగుతున్నవారికీ ఈసీ నోటీసులిచ్చి అడగటం, ఆపై ఆ సంగతి మీడియాలో ప్రముఖంగా వచ్చేలా చూడటంలోని మర్మమేమిటి? ‘మేం నిష్పాక్షికంగా ఉంటున్నాం. సాధారణ పౌరులైనా, మరొకరైనా మాకొకటే’ అని ప్రకటించుకోవటమేనా? ఆ మాటేమోగానీ సర్ ప్రక్రియ ప్రహసనం గమనించి, ఇందుకా కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్నారన్న ప్రశ్న అయితే సాధారణ పౌరుల్లో తలెత్తుతుంది. ఢిల్లీ వరకూ చూసినా అక్కడ గత జాబితాలోని 33 శాతంమంది పేర్లు గల్లంతయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇతరచోట్లా 2024 నాటి ఎన్నికల్లో ఈవీఎంల లీలల గురించి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలూ, మేధావులూ ప్రశ్నిస్తున్నా గంభీర మౌన ముద్ర దాలుస్తూ, తప్పించుకు తిరుగుతున్న ఈసీ... ఈ దేవతా వస్త్రాల నేత పనిలో ఎందుకంత బిజీగా ఉంటున్నది? ఈసీ సారథులే చెప్పాలి. సర్ ప్రక్రియలో నిండా మునిగి, ఆ సంస్థ తన ఇతరేతర కర్తవ్యాల సంగతి ఎటూ వదిలేసింది. కనీసం ప్రజలకైనా వేరే పనులుంటాయని తోచొద్దా? -
అసలు నకిలీ
మార్లిన్ మన్రో అంటే దాదాపుగా హాలీవుడ్ దేవత. జాన్ స్టెయిన్బెక్ ఏమో నోబెల్ గౌరవానికి నోచుకున్న నవలా రచయిత. సహజంగానే రచయితలకంటే నటీమణులకే క్రేజ్ ఎక్కువన్నది ఏ ప్రాంతానికైనా వర్తించే సత్యం కాబట్టి, అమెరికా కూడా అందుకు మినహాయింపు కాదు. స్టెయిన్బెక్ భార్య తరఫు మేనల్లుడైన ఓ 17 ఏళ్ల కుర్రాడు మార్లిన్ ‘బానిస’. అలాంటివాడికి మార్లిన్‌ను స్టెయిన్బెక్ కలిశాడనే ‘ఘోరమైనతప్పిదం’ మేనత్త చేసిందట. ఆ కుర్రాడు దాన్ని నమ్మకపోయినా మామగారి పట్ల అతడి ‘మర్యాద’ ఆకాశాన్నంటింది. ఇక తప్పదన్నట్టుగా, ఆటోగ్రాఫ్ చేసిన ఒక ఫొటోను పంపమంటూ 1955లో న్యూయార్క్ నుంచి మార్లిన్కు ఓ లేఖ రాశాడు స్టెయిన్బెక్. భాష, శైలి, చమత్కారం వల్ల పదేపదే వైరల్ అయ్యే ఈ లేఖను ఈమధ్యే ప్యాట్రిక్ ఓషానెసీ అనే వ్యాపారవేత్త ‘ఎక్స్’లో పంచుకున్నాడు. దీన్నే శశి థరూర్ ఓ నాలుగేళ్ల కింద షేర్ చేశాడు. అయితే, ఇందులోని శైలి స్టెయిన్బెక్దే అయినా, నిజంగా ఆయనే రాశాడనేందుకు ఆధారాలు లేవనే సందేహాలూ ఉన్నాయి. స్టెయిన్బెక్ది కాకపోతే స్టెయిన్బెక్ అంతటివాడు ఆవహించి రాసినదై ఉండాలి.చరిత్రలో కొన్ని అబద్ధాలు ఎంత అందంగా ఉంటాయంటే అవి నిజమైతే బాగుండనిపిస్తుంది. ఒక మహానుభావుడి చేతిరాత కనిపిస్తే, ఒక నియంత రహస్య డైరీ దొరికితే, ఒక గొప్ప కవి ప్రేమలేఖ చేతికి చిక్కితే– అవి నిజం కాదనే అనుమానమే అన్యాయంగా తోస్తుంది. అందుకే చరిత్రలోని కొన్ని మోసాలు కేవలం మోసాలుగా మిగిలిపోలేదు. సాహిత్యాన్నీ, జర్నలిజాన్నీ, పరిశోధననూ, మనుషుల ఊహాశక్తినీ పరీక్షించిన అద్భుతమైన కథనాలుగా మిగిలిపోయాయి. 1983లో జర్మన్ పత్రిక స్టెర్న్ 1932 నుంచి 1945 వరకు అడాల్ఫ్ హిట్లర్ రాసినట్లుగా చెప్పిన దాదాపు అరవై సంపుటాల డైరీలు దొరికాయని ప్రకటించింది. యుద్ధం చివరి దశలో హిట్లర్ వ్యక్తిగత వస్తువులను తరలిస్తున్న విమానం కూలిపోవడంతో ఆ డైరీలు బయటపడ్డాయని కథనం. కానీ ఫోరెన్సిక్ పరీక్షలు కాగితం, సిరా రెండో ప్రపంచ యుద్ధం తర్వాతివని తేల్చాయి. కోన్రాడ్ కుజావు అనే చిత్రకారుడి సృజనాత్మక మోసం అలా బయటపడింది. ముందు వాటిని అసలువని ఎందుకు నమ్మారు? అవి నిజమైతే బాగుండనే భావన మనుషులను అమాయకులను చేయడంవల్ల. ఇదే బలహీనత అబ్రహాం లింకన్ ప్రేమలేఖల ఉదంతంలోనూ కనబడుతుంది. 1928లో అమెరికా పత్రిక అట్లాంటిక్ మంత్లీలో ‘లింకన్ ద లవర్’ పేరుతో ఆన్ రట్లెడ్జ్కు లింకన్ రాసినట్టుగా చెప్పిన లేఖలు ప్రచురితమయ్యాయి. కానీ వాటి భాష, శైలి, ఆ కాలపు పదప్రయోగాలు అనుమానాస్పదంగా తోచాక రచయిత్రి విల్మా ఫ్రాన్సిస్ మైనర్ చేసిన సాహిత్య మోసం బయటపడింది. ఇక 18వ శతాబ్దం చివర్లో లండన్‌లో విలియం హెన్రీ ఐర్లాండ్ అనే కవి ఏకంగా షేక్స్పియర్ స్వహస్తాలతో రాసిన లేఖలు, అన్నే హాత్వేకి రాసిన ప్రేమలేఖలు, కింగ్ లియర్, హామ్లెట్ వంటి రచనల చేతిరాత ప్రతులతోపాటు షేక్స్పియర్ సరికొత్త నాటకం ‘వాటిగెర్న్ అండ్ రొవెనా’ను ‘కనుగొన్నాడు’. ఇంత కష్టపడి ఎందుకు నకిలీవి సృష్టిస్తారంటే దానికున్న మార్కెట్, సంచలన యావ, సరదా. అంతెందుకు, సాంస్కృతిక వారసత్వపు వెన్నువిరవకుండా భారతదేశాన్ని జయించలేమని ప్రచారంలో ఉన్న 1835 ఫిబ్రవరి 2 నాటి లార్డ్ మెకాలే ప్రసంగం కూడా ఉత్తిదేనని కథనాలు వెలువడ్డాయి. భావజాల పరంగా మెకాలే అలాంటివాడే కావొచ్చుగానీ ఆ లేఖ మీద మాత్రం వివాదం లేకుండా లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే, స్టీఫెన్ థేలర్ అనే ఏఐ పరిశోధకుడు ‘ఎ రీసెంట్ ఎంట్రన్స్ టు ప్యారడైజ్’ అనే చిత్రాన్ని డాబుస్ ఏఐ టూల్‌తో గీయించి, ఆ చిత్ర సృష్టికర్తగా దాన్నే అంగీకరించాలని పెట్టుకున్న కాపీరైటు అర్జీని భారత ప్రభుత్వ కాపీరైట్ కార్యాలయం ఇటీవలే కొట్టేసింది. దాన్ని ఒరిజినల్ వర్క్‌గా అంగీకరిస్తూనే, మానవ ప్రమేయం లేని ఈ కళకు కాపీరైట్ ఇవ్వడానికి తిరస్కరించింది. తనను సృష్టికర్తగా చెప్పుకోవడానికి థేలర్ అంగీకరించలేదు. కృత్రిమ నకిలీల కాలంలో ఆ మేరకు ఆయన సహజ అభినందనకు అర్హుడు. -
గండం గడిచేదెట్లా గణేశా!
అగ్నికి ఆజ్యం తోడైంది. ఎల్‌నినో వైపరీత్యానికి ప్రభుత్వ ఉదాసీనత జత కలిసింది. ఫలితంగా గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ ఎరుగనంత తీవ్ర కరువు పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్నది. ఎల్‌నినో మాత్రమే కాదు, ‘యెల్లో నినో’ కూడా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నదని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు విమర్శించారు. 628 మండలాలు లోటు వర్షపాతం వల్ల కరువు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయనీ,అందులో 332 మండలాలు తీవ్ర క్షామంలో చిక్కుకున్నాయనీ పక్కా సమాచారంతో ఆయన ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 51 శాతం లోటు వర్షపాతంతో సీజన్ ముగిసిపోతున్నప్పటికీ కరువు మండలాలను ఎందుకు ప్రకటించలేదని ప్రభుత్వాన్ని జగన్ నిల దీశారు. తక్షణమే కరువు మండలాల ప్రకటనతో పాటు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న మరో డజనుకు పైగా అంశాలపై ఉద్యమ కార్యాచరణను కూడా ఆయన ప్రకటించారు. జగన్ నుంచి ఉద్యమ పిలుపు వెలువడిన వెంటనే ప్రభుత్వంలో హడావిడి మొదలైంది. కరువు మండలాల జాబితా రూపొందించాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. ఈరోజు (శని వారం) స్వయంగా సీఎం సమీక్షకు దిగారు. 513 మండలాల్లో కరువు ఛాయలు నెలకొన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసు కొచ్చారు. 268 మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నదని కూడా చెప్పినట్టు సమాచారం. ఎక్కడా పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చా రట. ముందస్తు చర్యలు ఇప్పుడా? వేలాది ఎకరాల్లో ఇప్పటికే పంటలు ఎండిపోయాయి. అనేక ప్రాంతాల్లో ఎండిన పంటల్ని రైతులు ట్రాక్టర్లతో దున్నేశారు. ఏటా సాగయ్యే సగటు విస్తీర్ణంలో 20 లక్షల ఎకరాల కోతపడింది. అక్కడ విత్తనాలు కూడా పడలేదు. అందుకే ఇది కంటితుడుపు సమీక్ష. రైతాంగ ఉద్యమ హెచ్చరికకు జడిసి పెట్టుకున్న ఆదరాబాదరా సమావేశం.నిజంగా దుర్భిక్ష పరిస్థితులపై ప్రభుత్వానికి సరైన అవగా హన, చిత్తశుద్ధి ఉన్నట్లయితే పది రోజుల క్రితం జరిగిన కలెక్టర్ల సమావేశంలోనే విస్తృతంగా చర్చించేవారు. అప్పటికే పరిస్థితి విషమిస్తున్నట్లు వార్తలు వస్తున్నా ఈ అంశానికి సమావేశంలో పెద్దగా ప్రాధాన్యత లభించలేదు. ముఖ్యమంత్రి ప్రసంగం ప్రధానంగా పొలిటికల్ గవర్నెన్స్ గురించే సాగింది. బ్యూరోక్ర టిక్ పరిపాలన కుదరదని, తమ రాజకీయ నిర్ణయాలకు పూర్తిగా సహకరించాలని, ప్రతిపక్షం చేసే విమర్శలను కూడా అధికా రులు తిప్పికొట్టాలని కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదే శించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటినుంచే ఈ ధోరణి మొదలైనా ఇప్పుడు మరింత ముదిరినట్లు కనిపిస్తున్నది. ఫలి తంగా బ్యూరోక్రసీలో క్షేత్రస్థాయి సమస్యలపై చొరవ మందగించింది. కరువు బారిన పడి అల్లాడుతున్న ప్రజానీకాన్ని గాలి కొదిలేశారు. రాజకీయ నాయకత్వం ట్రెజర్హంట్లో పోటీలు పడుతున్నది. గతంలో కనీవిని ఎరుగని పరిణామాలను కూడా ఈ కరువు కాలంలో చూడవలసి వస్తున్నది. వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఎక్కడా నీటిచుక్క లేక నెర్రెలు బారిన చెరువుల్లోనే వది లేస్తున్న వార్తలు, ఫొటోలు ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తు న్నాయి. రాయలసీమ ప్రాంతం నుంచి ఈ సమాచారం ఎక్కు వగా వస్తున్నది. కోట్లాదిమంది ప్రజలు ఆచరించే ఉత్సవాల పట్ల కూడా ముందస్తు ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వ యంత్రాంగం ఏ గుడ్డిగుర్రానికి పళ్లు తోముతున్నట్టు? ఇంకో నాలుగు రోజుల్లో నిమజ్జనాలు ముగుస్తాయి. పెద్ద సంఖ్యలో విగ్రహాలను నిమ జ్జనం చేయవలసి ఉంటుంది. ఉత్సవాలలో కళకళలాడే పాత కడప చెరువు నేడు మైదానాన్ని తలపిస్తున్నది. ఏలినవారు ఏ ప్రత్యామ్నాయాన్ని ఆలోచించారో తెలియదు.వినాయక ఉత్సవాలపై మంత్రి లోకేశ్ బాబు ఈమధ్యన చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. ‘నిమజ్జనోత్సవాల్లో డీజే వాహనాలకు అనుమతిలీయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. హోంమంత్రి, డీజీపీ ఆ వాహనాలకు అనుమతులు లభించేలా చర్యలు తీసుకోవాలని’ ఆయన ట్వీట్ చేశారు. కేబి నెట్‌లోని ఒక మంత్రి తన సహచర మంత్రికి ఏ హోదాతో ఆదేశా లిస్తారని కొందరు విద్యావంతులు దీనిపై స్పందించారు. ఇది పూర్తిగా వేరే విషయం. లోకేశ్ ట్వీట్‌కు హోంమంత్రి స్పందన చూద్దాం. మార్గదర్శకాలకు అనుగుణంగా డీజే వాహనాలకు అనుమతులివ్వాలని పోలీసులకు అదేశాలు జారీ చేశామని ఆమె చెప్పారు. హిందూధర్మ సంప్రదాయం నుంచి వైదొలగకుండా ఈ ఉత్సవాలు వినాయక చవితి స్ఫూర్తిని చాటి చెప్పాలని కూడా ఆమె ఆకాంక్షించారు. ఈమధ్యకాలంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి పలువురు మంత్రులు, కూటమి నేతలు హిందూ ధర్మం, సనాతన ధర్మం గురించి సందర్భం ఉన్నా లేకపోయినా మాట్లాడుతున్న సంగతిని గమనిస్తున్నాము. అదే ఒరవడిలో హోంమంత్రి స్పందన కూడా ఉన్నది. ఇంతగా హిందూ ధర్మం గురించి మాట్లాడే కూటమి సర్కార్ వినాయక చవితి పండుగలో ఒక ముఖ్యమైన నిమజ్జన ఘట్టం గురించి ఎందుకు ముందస్తు చర్యలు చేపట్ట లేకపోయిందనేది ఇప్పుడు అర్థం కాని విషయం. కేవలం మెజారిటీ ప్రజలను మభ్యపెట్టడానికే ఈ ధర్మపన్నాలు వల్లిస్తున్నారనుకోవలసి వస్తున్నది. మనది సెక్యు లర్ రాజ్య వ్యవస్థ. హిందూ ధర్మమే కాదు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనే ఏ మతానికి చెందిన ఉత్సవాలకైనా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు ప్రభుత్వం చేయడం కనీస ధర్మం.పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 44 వేల క్యూసెక్కు లను తరలించే స్థాయిలో ఒక నెల రోజుల పాటు (జూలై– ఆగస్టు) శ్రీశైలం రిజర్వాయర్‌లో నీళ్లున్నాయి. తుంగభద్రలో నీళ్లు లేకపోయినా ముచ్చుమర్రి పాయింట్ దగ్గర శ్రీశైలం నీళ్లను కేసీ కెనాల్లోకి మళ్లించుకోవచ్చు. నీళ్లున్న రోజుల్లో చేష్టలుడిగి కూర్చోకుండా ఉన్నట్లయితే కేసీ కెనాల్‌తో పాటు, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టుల కింద కొన్ని చెరువులను నింపుకునే అవకాశం ఉండేదని సీమవాసులు విమర్శిస్తున్నారు. అలా చేసి ఉన్నట్లయితే వినాయక నిమజ్జనా నికి నీళ్లు లేని ఈ దుఃస్థితి రాయలసీమకు వచ్చి ఉండేది కాదు. ఒక్క నిమజ్జనం విషయమే కాదు. ఈ క్షామానికి సంబంధించిన హృదయ విదారక దృశ్యాలు పల్లెల్లో చాలా కనిపిస్తున్నాయి. ఒకనాడు నిండు కుండల్లా తొణికిసలాడిన బావుల్లోకి తొంగి చూస్తే కన్నీటి చుక్కలు రాలాల్సిందే తప్ప, బావిలో నీటి చెమ్మ మాత్రం కనిపించడం లేదట.నీరెండిన చెరువుల్లో కుప్పలు తెప్పలుగా చచ్చిపడిన చేపలు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. నంద్యాల జిల్లాలో ధాన్యం దిగు బడి ఎన్నడూ ఎరుగని కనిష్ఠ స్థాయికి పడిపోయే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. వరి, వేరుశనగ, పత్తి చేలను కలియ దున్నడమే కాదు, రాయలసీమలో అక్కడక్కడా పండ్ల తోటలను నరికేస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. సన్న రకాల ధాన్యాన్ని పండించే ప్రాంతాలన్నీ కరువుపోటుకు గురయ్యాయి. ఫలితంగా రానున్న రోజుల్లో కిలో బియ్యం ధర వంద రూపాయలకు చేరినా ఆశ్చర్యం లేదనే మాటలు వినబడు తున్నాయి. బాపట్ల జిల్లాలో సన్న ధాన్యం పండించే ఒక రైతు నారు కొనడానికి 3 వేలు, నారు పీకడానికి 3 వేలు, నాట్లు వేయడానికి 4 వేలు... మొత్తం 10 వేలు ఖర్చు పెట్టాడు. కనీసం ఒక్క తడినైనా ఇవ్వడానికి గంటకు 350 రూపాయల చొప్పున ఇంజన్, పైపులను అద్దెకు తెచ్చుకున్నాడు. కరెంటు సరిగ్గా లేక పది గంటలు పారించడానికి రెండు రోజులు పట్టింది. 3,500 ఒక్క తడికే ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ఆ రైతు వాపోయాడు.ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాల్లో సాగుభూములు మైదనాల్లా కనిపిస్తున్నాయి. కృష్ణా జిల్లాలో బీళ్ళను తలపిస్తున్న చేలు దర్శనమిస్తున్నాయి. ఖరీప్ సాధారణ సాగు 77 లక్షల ఎకరాలకుగానూ ఈసారి 56 లక్షల ఎకరాల్లోనే విత్తనాలు పడ్డాయని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇందులో దాదాపు 35 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా ఎండిపోవడమో, ఎండిపోయే స్థితికి చేరుకోవడమో జరిగింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఈ సమస్యపై సమీక్ష జరిపారు. అదీ ప్రతిపక్ష నేత హెచ్చరించిన తర్వాత. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం ఎటు వంటి కార్యాచరణ రూపొందిస్తుందో, రైతాంగాన్ని ఎలా ఆదుకుంటుందో చూడాలి.సమీక్షలో భాగంగా రైతులను ప్రకృతి సేద్యంవైపు ప్రోత్స హించాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారట. ప్రకృతి సేద్యం గోవు కేంద్రకంగా సాగుతుంది. మరి గోవుల గ్రాసం సంగతి? పచ్చిగడ్డి చూద్దామన్నా ఎక్కడా కనిపించడం లేదు. ట్రాక్టర్ పన్నెండు వేలుండే ఎండుగడ్డి కొన్ని ప్రాంతాల్లో పాతిక వేలు పలుకుతున్నదట. పశుగ్రాసం సమకూర్చలేకనే మూగ జీవాల్ని కొందరు రైతులు తెగనమ్ముకుంటున్నారు. గ్రాసం సంగతే కాదు, మెట్ట ప్రాంతాల్లో కొన్నిచోట్ల పశువుల దాహం తీర్చే దారి కూడా కనిపించడం లేదు. ఈ కరువు ఫలితంగా పాల దిగుబడి కూడా బాగా పడిపోయింది. ప్రైవేట్ డెయిరీల వాళ్లు చైనా పాలపొడిని దిగుమతి చేసుకొని, దాంతో తయారు చేసిన పాలను మార్కెట్లో విక్రయిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.పాడి–పంటల పరిస్థితి ఒక ఎత్తయితే ప్రజల తాగునీటి ఎద్దడి మరో ఎత్తు. విశాఖ నగరంలో ఇప్పటికే నీటి ఎద్దడి అదుపు తప్పింది. ప్రజలు, పరిశ్రమల అవసరాలకు కలిసి రోజుకు 145 మిలియన్ గ్యాలన్ల నీరు నగరానికి అవసరం. ఇప్పుడు సరఫరా అవుతున్నవి 88 మిలియన్ గ్యాలన్లు. నీటి కటకటతో ప్రజలు ఇప్పటికే రోడ్లమీదికి వస్తున్నారు. రిజర్వా యర్లను ముట్టడిస్తున్నారు. విశాఖ నీటి పరిస్థితి ఇప్పటికే అదుపు తప్పింది. ముఖ్యమంత్రి శనివారం నాడు ఒక సభలో మాట్లాడుతూ పోలవరం ఎడమ కాల్వ ద్వారా విడుదల చేసిన నీళ్లు అనకాపల్లి దాకా వచ్చాయని, రేపోమాపో విశాఖ చేరుకుంటాయని చెప్పారు. రేపటిదాకా ఎదురుచూద్దాం. అనంతరం అధికారులతో విశాఖ నీటి పరిస్థితిపై సమీక్ష జరిపి, ఈ విషయంపై ఒక క్రమ పద్ధతిలో ముందుకు వెళ్ళాలనీ, ఏలేరు సహా మిగిలిన రిజర్వాయర్లలో పూడిక తీయించాలనీ ఉపదేశించారు. వారెవ్వా... పొద్దున్నే లేచి వీధి నల్లాల దగ్గర బిందెడు నీళ్లకోసం ఎదురుచూస్తున్న విశాఖ ప్రజలారా పూడికలు తీసిందాకా వేచి ఉండండి!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మణిపూర్‌ను చక్కదిద్దలేరా!
గత మూడేళ్లుగా అనుచిత కారణాలవల్లే ఎప్పుడూ వార్తల్లో ఉంటున్న మణిపూర్ మళ్లీ ప్రతీకారేచ్ఛతో రగులుతోంది. 2023 మేలో మొదలైన జాతుల ఘర్షణలు ఎప్పుడూ పెద్దగా ఆగిందేమీ లేదుగానీ... మీడియాలో ప్రముఖంగా వచ్చేంత పెద్ద సంఘటనలు జరగలేదు. కానీ ఆ స్వల్పకాల నిశ్శబ్దం కాస్తా గత ఆదివారం బద్దలైంది. ఆ రోజు తమెంగ్లాంగ్ జిల్లాలోని టోలెన్ గ్రామంలో వేకువజామున ఒక మహిళతో సహా నలుగుర్నిదుండగులు కాల్చిచంపారు. అటుతర్వాత సాయంకాలం అదే జిల్లాలో లోంగ్పి అనే గ్రామంలో ఒక యువకుణ్ణి, మహిళను కాల్చిచంపారు. మొదటి దాడి కుకీ ప్రాబల్య గ్రామంలో నాగాలే లక్ష్యంగా జరిగితే, రెండో దాడి నాగాలు మెజారిటీగావున్నచోట కుకీలపై జరిగింది. 1992–97 మధ్య కుకీ–నాగాల ఘర్షణల్లో బలైనవారి స్మారకార్థం ఆదివారం కుకీలు ‘బ్లాక్ డే’ పాటించిన రోజునే ఈ రెండు దాడులూ చోటుచేసుకోవడం గమనించదగింది. మణిపూర్ పలు జాతులకు నిలయం. ఇన్ని దశాబ్దాల పాలనలో భిన్న రాజకీయపక్షాల నాయకులు గద్దెనెక్కినా, ఏ ఒక్కరూ ఆ జాతులమధ్య సామరస్య వాతావరణాన్ని నెలకొల్పలేకపోయారు.2023 నాటి ఘర్షణల సమయంలో అప్పటి బీజేపీ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రధాన తెగలైన మెయితీ–కుకీల మధ్య పరస్పర హననం సాగుతుంటే, దాన్ని భద్రతా బలగాలకూ, కుకీ మిలిటెంట్లకూ మధ్య సాగుతున్న ఘర్షణగా చిత్రించే యత్నం చేశారు. చివరకు భద్రతా బలగాలే బీరేన్ సింగ్ ప్రకటనను ఖండించాల్సి వచ్చింది. ఆ ఘర్షణల్లో దాదాపు 300 మంది మరణించగా, 60,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ వారిలో చాలా మంది సహాయ శిబిరాల్లోనే బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తోంది.కొందరు ఇప్పుడిప్పుడే గ్రామాలకు వెళ్తున్న తరుణంలో మళ్లీ హింస చెలరేగింది. మెయితీల ఆధిక్యతగల ఇంఫాల్ లోయలో 2023లో వారివైపు నుంచి హింస మొదలైనప్పుడు అదుపు చేయగలిగి ఉంటే సమీప కొండ ప్రాంతాల్లోని కుకీలు రెచ్చిపోయేవారు కాదు. అయితే మూడేళ్లనాటి హింసకూ, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సాగుతున్న హింసకూ మౌలికంగా వ్యత్యాసం ఉంది. అప్పట్లో వందలమంది గుంపులుగా ఊళ్లపైబడి దాడులు చేశారు. ఇళ్లకు నిప్పంటించటం, మహిళలపై అత్యాచారాలకు పాల్పడటంవంటివి చోటు చేసుకున్నాయి. కానీ ఇప్పుడు చడీచప్పుడూ లేకుండా వచ్చి దాడులు చేసి పోతున్నారు. అలాగే మొన్నటివరకూ ప్రధానంగా మెయితీ–కుకీ తెగలమధ్యే ఘర్షణలుండగా, మూడు దశాబ్దాల క్రితం నాటి ఉదంతాలను గుర్తు తెస్తూ ఇప్పుడు కుకీ–నాగా జాతులమధ్య వైరం సాగుతోంది. మెయితీలు తమను సైతం గిరిజనులుగా గుర్తించాలని డిమాండ్ చేయగా, దాన్ని కుకీలు వ్యతిరేకించారు. ఇప్పుడు కుకీలు, నాగాలూ క్రైస్తవులే అయినా వారిమధ్య భూమి విషయంలో కొట్లాటలు సాగుతున్నాయి. బీరేన్ సింగ్ ప్రభుత్వం పోయి, కొన్నాళ్లు రాష్ట్రపతి పాలన కొనసాగి మొన్న ఫిబ్రవరిలో ఖేమ్‌చంద్ సింగ్ ఆధ్వర్యంలో కొత్త సర్కారు ఏర్పడింది. నిండా రెండునెలలు కూడా ప్రశాంతత లేకుండా నాగా–కుకీలమధ్య ఘర్షణలు మొదలయ్యాయి. ఒక మహిళపై అత్యాచారం కూడా చోటుచేసుకుంది. ఇవన్నీ సహాయ శిబిరాల్లో జరిగినవే. ఈ ఉదంతాలపై సమగ్ర నివేదిక కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మరణాలపై లోగడే సర్వోన్నత న్యాయస్థానం త్రిసభ్య సంఘాన్ని నియమించగా, ఆ సంఘం 25 అసహజ మరణాలను ప్రస్తావించింది.వీటిపై జూన్ 11నుంచి వివరణ కోరుతున్నా, ఇంతవరకూ జవాబులేదని ఆ సంఘం చెప్పటంపై ధర్మాసనం దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. మృతుల వారసులకు అరకొర ఆర్థికసాయం అందించటంపైనా నిలదీసింది. మొత్తంగా 8 జిల్లాల్లోని శిబిరాల్లో 640 మంది మరణించగా, అందులో 34 మంది మరణాలు అసహజమైనవని తేలింది. కానీ 25 మృతదేహాలకు మాత్రమే పోస్టుమార్టం జరిపించారు. ఈ వరస చూస్తుంటే పాలకులు మారినా మారిందేమీ లేదని అర్థమవుతోంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్రాలు సమగ్రంగా చర్చించుకుని తగిన కార్యాచరణకు దిగనట్టయితే అక్కడ శాంతిభద్రతలు మరింత క్షీణించటం ఖాయం. -
‘నూరుశాతం’ తప్పుడు చర్య
తీసుకునే నిర్ణయాలన్నీ వికటిస్తున్న వైనం కనబడుతూనే ఉన్నా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు తత్వం బోధపడలేదు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధాన్ని నిలువరించే పేరిట ఆ దేశంపై మరిన్ని ఆంక్షలు విధించటానికీ... దాన్నుంచి ముడి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తూ ఆర్థికంగా తోడ్పడుతున్న భారత్, చైనాలపై వంద శాతం సుంకాలు విధించటానికీ అనుమతించే బిల్లును ఆయన ప్రభుత్వం ప్రతినిధుల సభలో ఆమోదింపజేసుకుంది. గత నెల ఇదే బిల్లుకు సెనేట్ ఓకే చెప్పింది. తాజా ఆమోదంతో ఈ ఆంక్షల బిల్లుకు అమెరికన్ కాంగ్రెస్ అంగీకారం తెలిపినట్టయింది. దీనిపై ట్రంప్ సంతకం చేశాక చట్టంగా మారుతుంది. ఆ అధికారాన్ని ట్రంప్ వినియోగిస్తారా లేదా అన్నది చూడాల్సివుంది. రెండోసారి అధికారంలోకొచ్చాక రష్యాపై ట్రంప్ విధించ దల్చుకున్న ఈ ఆంక్షలు అత్యంత కీలకమైనవి. ఈసారి ఆంక్షలన్నీ రష్యా ఇంధన, రక్షణ రంగాలే లక్ష్యంగా రూపొందించారు. తన అభీష్టానికి విరుద్ధంగా ఇరుగు పొరుగు దేశాలు నిర్ణయాలు తీసుకుంటే వాటితో ద్వైపాక్షిక వాణిజ్యంతోసహా వివిధ బంధాలన్నిటినీ తెంచుకోవటం ఏ ప్రభుత్వమైనా చేసే పని. కానీ ‘తన చావు జగత్ప్రళయమ’న్న రీతిలో ఆ పనే అందరూ చేసితీరాలనే డిమాండ్ మూర్ఖత్వం. అంతర్జాతీయంగా 80 ఏళ్ల క్రితం కుదిరిన ఒడంబడిక ప్రకారం దురాక్రమణ యుద్ధాలకు పాల్పడే దేశంపై ఎలాంటి చర్యలు అవసరమో ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి నిర్ణయిస్తాయి. రష్యా తప్పు చేస్తున్నదని అమెరికా భావిస్తే ఆ వేదికలద్వారా ఒత్తిళ్లు తీసుకురావాలి. అలా చేయలేననుకుంటే తనవరకూ ఇష్టానుసారం చేసుకోవచ్చు. అసలు ట్రంప్ అత్యుత్సాహంతో అమలు చేస్తున్న సుంకాల విధానంపై అమెరికాలోనే ఏకాభిప్రాయం లేదు. రష్యాపై కఠిన చర్యల్ని సమర్థిస్తున్న డెమోక్రాట్లు సైతం ట్రంప్‌కు అతిగా అధికారాలు కట్టబెట్టడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఏకపక్ష అధికారాలు అప్పగిస్తే దేశ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు.మన దేశం గతంకన్నా దృఢంగా వ్యవహరించటం హర్షించదగ్గది. ప్రస్తుత విధానాన్ని విడనాడబోమనీ, మార్కెట్ చలనాలను నిర్దేశించే ధరవరలు, సరఫరా, డిమాండ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని భిన్న మార్గాల్లో చమురు కొనుగోలు చేయడం కొనసాగిస్తామనీ స్పష్టంచేసింది. వంద శాతం సుంకాలపై అమెరికా చర్యకు దిగితే ద్వైపాక్షిక సంబంధాలపై వాటి ప్రభావం పడుతుందని ఇప్పటికే అమెరికాకు తెలియ జేశామని తెలిపింది. అసలు ఈ తీర్మానం చేసే నైతిక హక్కు అమెరికన్ కాంగ్రెస్‌కు ఉందా? ఈ ఆంక్షలు ఒక్కరోజు ఆలస్యమైనా ఉక్రెయిన్‌లో మరింతమంది ప్రజలు మృత్యువుకు బలి అవుతారని తీర్మానం చెప్పడం వంచన. ఈ సూత్రం తనకు వర్తించదా? ఇరాన్‌పై ఇజ్రాయెల్ సాగించిన దురాగతాలను నిలువరించకపోగా, తానూ అందులో పాలుపంచుకుని దేశాధినేతతోసహా అనేకమంది పౌర, సైనిక ముఖ్యుల్ని హతమార్చటం... ఇప్పటికీ పౌర ప్రాంతాలపై బాంబులేస్తూ పదులకొద్దీ మందిని నిత్యం హతమార్చటాన్ని కాంగ్రెస్ ఎలా చూస్తుంది? తీర్మానం చేసేముందు తమ పాలకుడి నిర్వాక మేమిటన్న స్పృహ ఉండొద్దా? తాము అధర్మయుద్ధం కొనసాగిస్తూ ధర్మపన్నాలు వల్లించటం, వేరొకరిని వేలెత్తిచూపటం, అందరూ తననే అనుసరించాలనటం ఏం సబబు?వచ్చేవారం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికా సందర్శనకు రాబోతున్నారు. ఇరు దేశాలమధ్యా శిఖరాగ్ర సమావేశం జరగబోతోంది. ఇలాంటి సమయంలో ఆంక్షల తీర్మానం తీసుకురావటం, బెదిరింపులకు దిగటం తెలివిమాలిన చర్యగా అమెరికా గుర్తించకపోవటం ఆశ్చర్యకరం. ఇప్పటికే ఏఐ విషయంలో సమష్టిగా కదలాలన్న అమెరికా ప్రతిపాదనను చైనా తోసిపుచ్చింది. ఆ విషయంలో ఇరు దేశాలమధ్యా భిన్నాభిప్రాయాలున్నాయని బయటపడింది. ఈ నేపథ్యంలో మరో వివాదాన్ని రగల్చటం వల్ల ఒరిగేదేమిటి? తన పెత్తందారీ పోకడలతో విసిగిన ప్రపంచం ఇప్పటికే దూరం జరిగిందని అమెరికా గ్రహించటం లేదు. ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడటంలో తెరవెనక తాను నడిపించిన ఎత్తుగడలే కారణమని గుర్తులేదా? అంతర్జాతీయ వేదికల ప్రమేయం లేకుండా ప్రపంచ దేశాలపై ఒత్తిడి తేవటం చట్టవిరుద్ధమని అమెరికా తెలుసుకోవాలి. -
బ్రిటన్‌లో వేర్పాటు భేరి!
బ్రిటిష్ వలస పాలకులు తాము తప్పుకున్న మరుక్షణం భారత్ చిన్నాభిన్నం కావటం ఖాయమని జోస్యం చెప్పారు. ఇప్పుడు ఆ దేశమే ముక్కలయ్యే స్థితి ఏర్పడింది. మొన్న సోమవారం స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ ఫస్ట్ మినిస్టర్లు(మన దగ్గర సీఎంల హోదాతో సమానం) అనధికార సమావేశం జరిపి, తమ స్వాతంత్య్ర ఆకాంక్షను వ్యక్తం చేసే ప్రకటనపై సంతకాలు చేశారు. దేశం కలిసుండాలా, విడిపోవాలా అనేది... అందుకు అనుసరించాల్సిన పద్ధతేమిటన్నది లండన్‌లోని జాతీయ పార్లమెంటు మాత్రమే నిర్ణయించాల్సిన అంశం కాబట్టి, ఇప్పటికప్పుడు దీనివల్ల జరిగేదేమీ ఉండదు. కానీ ఆర్థిక సంక్షోభాలు అగ్రరాజ్యాల్ని సైతం ఎలా కుదిపేస్తున్నాయో చెప్పడానికి తాజా పరిణామం ఉదాహరణ. అమెరికాపై పాతికేళ్లనాడు ఉగ్రదాడి జరిగినప్పుడు 3,000 మందిని పొట్టనబెట్టుకోవడం మినహా ఆ ఉగ్రవాదులు సాధించిందేమిటన్న ప్రశ్న వినబడింది. అటు తర్వాత అమెరికా సవ్యంగావుంటే ఉగ్రవాదం అంతరించేది. కానీ జరిగిందంతా అందుకు భిన్నం. అప్పట్లో అందరినుంచీ అమెరికాకు మద్దతు లభించింది. కొత్తగా అధికారంలోకొచ్చిన రష్యా అధినేత పుతిన్ అమెరికా ప్రారంభించిన ‘ఉగ్రవాదంపై యుద్ధా’నికి సంపూర్ణ మద్దతు ప్రకటించి, తాలిబన్ల వేటకు మధ్య ఆసియాలోని పూర్వపు సోవియెట్ సైనిక స్థావరాల వినియోగానికి ఉదారంగా అనుమతించారు. నాటో ఆవిర్భవించి అప్పటికి యాభైయ్యేళ్లు దాటగా... అందులోని మొదటి క్లాజు ‘సమష్టి రక్షణ’ను తొలిసారి ఉపయోగించి ఆ సంస్థ అమెరికాకు బాసటగా నిలిచింది. ఇలా చిన్నా పెద్దా దేశాలన్నీ తాలిబన్ల వేటకు తోడ్పడ్డాయి. కానీ దీన్ని అమెరికా దుర్వినియోగం చేసింది. మానవహక్కుల ఉల్లంఘన సంగతలా వుంచి ఇరాక్ మొదలు పలు దేశాలపై విరుచుకుపడి ధ్వంసరచనకు, మారణహోమాలకు పాల్పడింది. లక్షల కోట్ల డాలర్లను మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేసింది. ప్రతీకారేచ్ఛ క్రమంలో తాను దివాలా తీస్తున్నాననీ, నమ్ముకున్న వారిని నట్టేట ముంచుతున్నాననీ, చైనాపై కన్నేసి వుంచాలన్న సంగతి మరిచాననీ గ్రహించలేక పోయింది. ఉగ్రదాడికి ముందు మిగులు బడ్జెట్లో ఉన్న అమెరికా ఇప్పుడు 40 లక్షల కోట్ల డాలర్లకుపైగా అప్పుల్లో కూరుకుపోయింది. కరోనా మహమ్మారి పాత్ర కూడా ఇందులో ఉండొచ్చు గానీ... విచక్షణారహిత యుద్ధాల పరంపరే దాన్ని ఈ స్థితికి చేర్చింది. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్టు యుద్ధాల్లో పాలుపంచుకున్న నాటో బలహీన పడింది. అన్ని దేశాలూ ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్నాయి. ఈ కష్టాల పరంపరనుంచి గట్టెక్కటం కోసమే ఆరేళ్ల క్రితం ఈయూ నుంచి బ్రిటన్ బయటికొచ్చింది. బ్రెగ్జిట్ రిఫరెండమ్‌లో దీన్ని నార్తర్న్ ఐర్లాండ్, స్కాట్లాండ్ ప్రజానీకం తిరస్కరించారు. కానీ వారి అభీష్టానికి విలువ లేకుండాపోయింది. ఇప్పుడు బ్రిటన్నుంచి విడిపోవటంతోపాటు ఈయూలో చేరటం కూడా ఈ ముగ్గురు అధినేతల ఎజెండా. చారిత్రకంగా మన రాష్ట్రాల కన్నా వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్, స్కాట్లాండ్ భిన్నమైనవి. వేల్స్‌ను 13వ శతాబ్దంలో ఇంగ్లండ్ ఆక్రమించుకుంది. రాచరికాలు చుట్టరికం కలుపుకోవటంతో స్కాట్లాండ్,ఇంగ్లండ్ కలిసి ప్రయాణించి వందేళ్ల తర్వాత కలిసి 1703లో గ్రేట్ బ్రిటన్‌గా ఏర్పడ్డాయి. 1801లో దానిలో చేరిన ఐర్లాండ్ 1921లో విడిపోయింది. కానీ ఉత్తర ప్రాంతంలోని ఆరు కౌంటీలు యూకేలోనే కొనసాగుతామన్నాయి. బ్రిటన్ తప్పుడు నిర్ణయాలతో అన్ని ప్రాంతాలనూ భ్రష్టు పట్టించటంతోపాటు, వాటి అధికారాలను కుదిస్తూవచ్చింది. పన్నుల ఆదాయాన్ని సరిగా పంచక 90 దశకం చివర్లో హామీ ఇచ్చిన స్వయంప్రతిపత్తి హోదాకు ముప్పు తెస్తోందన్నది వాటి అభిప్రాయం. నిరుద్యోగం, జనాభా క్షీణతపై తమకు సరైన నిర్ణయాధికారాలు లేవని వాటి ఫిర్యాదు. సంక్షోభాలు చుట్టుముట్టినప్పుడైనా సక్రమంగా వ్యవహరించటం చేతకాకపోతే అవి మరింత ముదురుతాయి. ఫెడరల్ వ్యవస్థను నీరుగార్చి ప్రశాంతంగా మనుగడ సాగించా లనుకోవటం చెల్లదని బ్రిటన్ పాలకులు గుర్తించకపోతే... ఇప్పటికి కేవలం రాజకీయ హెచ్చరికగానే తలెత్తిన ఈ నిరసన ఆ ప్రాంత జనాభాను తాకడానికి ఎన్నాళ్లో పట్టదు. అప్పుడు బ్రిటన్ లండన్‌గా మిగిలిపోక తప్పదు. చేసిన పాపాలు శాపాలై వెంటాడ తాయంటారు. మనతో సహా అనేక దేశాలను పీల్చిపిప్పిచేసిన బ్రిటన్ ఇప్పుడు ఇల్లు చక్కదిద్దుకోగలదా అన్నది వేచిచూడాలి. -
బ్రిక్స్ సూపర్ సక్సెస్!
చేరుకోవాల్సిన లక్ష్యంపై స్పష్టత, అందుకు అనుసరించాల్సిన మార్గంపై ఏకాభిప్రాయం సాధించగలిగితే శిఖరాగ్ర సమావేశాలు విజయవంతమవుతాయి. ఆ రెండూ లేకుంటే ఉత్త లాంఛనప్రాయ సమావేశాలుగా మిగులుతాయి. ఆ కోణంలో శని, ఆదివారాల్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఘన విజయం సాధించినట్టు లెక్క. అలాగని ఈ సమావేశాలు సమీప భవిష్యత్తులో బ్రిక్స్ కరెన్సీని తీసుకురావాలని నిర్ణయించలేదు. అలాగే ఎడాపెడా సుంకాలు విధిస్తున్న అమెరికాను నిలదీయలేదు. పశ్చిమాసియా కల్లోలానికి నువ్వే కారణమని వేలెత్తి చూపలేదు. ఈ అంశాల్లో లౌక్యం ప్రదర్శిస్తూనే చేయదల్చుకున్నది చేయటంలో బ్రిక్స్ సఫలీకృతమైంది. ఇవి మాత్రమే కాదు... పరస్పరం కలహించుకుంటున్న ఇరాన్, దాని ప్రత్యర్థులు యూఏఈ, సౌదీలను సమావేశాలకు రప్పించగలిగింది. పైగా ఇరాన్, యూఏఈ మధ్య ప్రత్యక్ష చర్చలు జరిగాయి. దక్షిణ చైనా సముద్రం విషయంలో విభేదాలున్న చైనా, ఫిలిప్పీన్స్ కూడా సదస్సుకు హాజరయ్యాయి. భారత్, చైనాల వివాదం సరేసరి. ఇలా పరస్పర విరుద్ధ ప్రయోజనాలు గల దేశాలన్నీ ఒక ఉమ్మడి డిక్లరేషన్ ప్రకటించటం చిన్న విషయం కాదు. అతిథేయ దేశంగా భారత్ ప్రత్యేక కృషి ఇందులో కనబడుతుంది. సభ్య దేశాలతో ఓపిగ్గా చర్చించాలి. ఒప్పించాలి. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన టీమ్ ఆ పని చేయగలిగినందుకు అభినందించాలి.ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో దక్షిణార్ధ గోళ దేశాల స్వరం వినిపించటంలో ఏదోమేరకు కృషి చేసిన అలీనోద్యమ సంస్థతో బ్రిక్స్‌కు పోలికలున్నాయి. కానీ వాటిమధ్య వ్యత్యాసం కూడా ఉంది. అప్పటి ద్విధ్రువ ప్రపంచంలో స్వతంత్రంగా మనగలగటానికి అవసరమైన ఆర్థిక సంపత్తి అలీనోద్యమానికి లేదు. బ్రిక్స్ అలా కాదు. అందులో పూర్తి స్థాయి సభ్యత్వంగల 11 దేశాలను చూసినా వాటి ఉమ్మడి దేశీయోత్పత్తి (జీడీపీ) వాటా ప్రపంచ జీడీపీలో 40 శాతం. ప్రపంచ జనాభాలో సగం ఈ దేశాల్లోనే ఉంది. ప్రపంచంలో చైనా రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థ. రష్యావద్ద అపారమైన చమురు నిక్షేపాలు, ఆయుధ నిల్వలు ఉన్నాయి. మనతోసహా బ్రిక్స్ దేశాలన్నీ ఆర్థికంగా చురుగ్గా ఎదుగుతున్న దేశాలు. బ్రెజిల్ అయితే దక్షిణమెరికా ఆర్థిక వ్యవస్థల్లో అతి పెద్దది. ఇవన్నీ సమష్టిగా దక్షిణార్ధ గోళ దేశాలను ఆర్థికంగా, రాజకీయంగా ప్రభావితం చేయగల స్థితిలో ఉన్నాయి. ఇన్ని అనుకూలాంశాలున్నా అమెరికాపై నేరుగా ధిక్కార స్వరం వినిపించనప్పుడు ప్రయోజనమేమిటన్న సందేహం వస్తుంది. ఆ ప్రక్రియ క్రమబద్ధంగా సాగాలి. భద్రతా మండలి, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు తదితర సంస్థల్లో వర్ధమాన దేశాలకు మరింత మెరుగైన చోటీయాలని బ్రిక్స్ కోరుతోంది. కానీ అది అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించే డిమాండ్‌గా మారకుండా సదస్సు జాగ్రత్తపడింది. డాలర్ వాడకాన్ని క్రమేపీ తగ్గించుకునే ప్రక్రియలోనూ అదే ఎత్తుగడ పాటించింది. ఆ దిశగా అడుగులేస్తే బ్రిక్స్ దేశాలపై వంద శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయటానికి ముందే 2024 డిసెంబర్లో డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఆ బెదిరింపుల్ని ఆయన అడపా దడపా కొనసాగిస్తూనే ఉన్నారు. అంతర్జాతీయ కరెన్సీగా డాలర్ ఉనికిలో లేకుంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది మరి! అందుకే కావొచ్చు... ఆ విషయంలో బ్రిక్స్ సంయమనం పాటించింది. అది వేరే రూపంలో ఇప్పటికే అమలవుతోంది. చైనా, రష్యా 90 శాతం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని తమ తమ కరెన్సీల్లో జరుపుకొంటున్నాయి. రష్యా చమురు విక్రయాలకు మన దేశం రూపా యిల్లో చెల్లించింది. డాలర్ రద్దు చేయకుండానే దాని వాడకాన్ని తగ్గించటం బ్రిక్స్ దేశాలు ఎంచుకున్న పద్ధతి. ఐఎంఎఫ్ డేటా ప్రకారం ఇప్పటికీ ప్రపంచ విదేశీ మారకద్రవ్య నిల్వల్లో డాలర్ వాటా 56.77 శాతం. యూరో కరెన్సీ వాటా 20.25 శాతం. చైనా కరెన్సీ రెన్మిన్బి(ఆర్ఎంబీ) వాటా కేవలం 1.95 శాతం. డాలర్ నిల్వలు పుష్కలంగా ఉన్న చైనా మరో కరెన్సీని వినియోగించాలనుకున్నా దానికే నష్టం. మనకూ ఆ సమస్యవున్నా, అమెరికా ఆధిపత్యం స్థానంలో చైనాను అంగీకరించటానికి సిద్ధపడలేం. ఈ బహుళ ధ్రువ ప్రపంచంలో ఎవరి జాగ్రత్తలు వారివి. ఈ దశలో అస్పష్టతతోనైనా బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన వెలువరించటం దానికదే ఘన విజయం. -
ఆహార నిర్వేదం
ఆరోగ్యకరమైన జీవనానికి ఆహారం అత్యంత ముఖ్యం. జీవులు ప్రాణాలు నిలుపుకోవ డానికి ఆహారం అవసరం. సరైన ఆహారం ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆహారం మితిమీరినప్పుడు, ఆహారంలో శుచి శుభ్రతలు లోపించినప్పుడు ఆరోగ్యం వికటించి నానా వ్యాధులూ కలుగుతాయి. ‘ఆహార సంభవో వస్తుః రోగాస్త్వాహార సంభవాః’ అని మన తొలి ఆయుర్వేద గ్రంథం ‘చరక సంహిత’ చెబుతోంది. ఆరోగ్యానికైనా, అనారోగ్యానికైనా ఆహారమే మూలమనే అవగాహన మనవాళ్లకు చరకుడి కాలం నుంచే ఉండేది. దాదాపు అదే కాలంలో పాశ్చాత్య ప్రపంచంలోనూ ఆహారంపై ఈ అవగాహ ఉండేది. ‘మనం బతకడం కోసం తినాలి, తినడం కోసం బతకడం కాదు’ అని రోమన్ తత్త్వవేత్త సిసిరో చెప్పాడు. ఆరోగ్య స్పృహతో ఆహారం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా, జిహ్వచాపల్యం మనిషికి గల నానా బలహీనతల్లో మొదటి వరుసలో ఉంటుంది. జిహ్వచపలురను తిండిపోతులుగా జనాలు ఆడిపోసుకుంటారు గాని, వారు మాత్రం తమను తాము భోజనప్రియులుగా ప్రకటించుకుంటూ ఉంటారు. సుష్టుగా షడ్రసోపేతమైన భోజనాన్ని ఆరగించడాన్ని భోజనప్రియులు ‘ఉదరపూజ’గా అభివర్ణి స్తారు. ‘పొట్టతో వాదించడం చాలా కష్టం. దానికి చెవులు ఉండవు’ అని గ్రీకు తత్త్వవేత్త ప్లూటార్క్ భోజనప్రియత్వాన్ని గురించే చమత్కరించాడు.నాగరికతలకు మునుపు మనుషులు కూడా మిగిలిన జంతుజాలం మాదిరిగానే దొరికినదేదో తింటూ బతికేవారు. ప్రపంచవ్యాప్తంగా నాగరికతలతో పాటు పాకకళ అభివృద్ధి చెందింది. పాకకళతో పాటు రుచులు మరిగిన నోటికి జిహ్వచాపల్యం, భోజన ప్రియత్వం పెరుగుతూ వచ్చాయి. ఆరోగ్యానికైనా, అనారోగ్యానికైనా ఆహారమే మూల మనే సంగతి మనుషులకు అనుభవపూర్వంగా తెలిసివచ్చింది. ఆహార మహిమ బోధ పడిన తర్వాత ఆయుర్వేదం సహా రకరకాల ప్రాచీన వైద్యవిధానాలు అభివృద్ధి చెందాయి. ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికీ ఒక ఆహార సంస్కృతి ఉంటుంది. ఆహార సంస్కృతి ఆ ప్రాంత అస్తిత్వంలో అవిభాజ్య భాగంగా ఉంటుంది. అందుకే ప్రపంచంలోని ఏ భాషకు చెందిన సాహిత్యంలోనైనా ఆహార వర్ణన కనిపిస్తుంది. తెలుగు సాహిత్యానికి సంబంధించి మన ఆహార వైవిధ్యాన్ని గ్రంథస్థం చేసిన పూర్వకవులలో శ్రీనాథుడు అగ్రగణ్యుడు. ‘శృంగార నైషధం’లో శ్రీనాథుడు ఎన్నో వంటకాలను వర్ణించాడు. వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు రాసిన చాటువుల్లోనూ శ్రీనాథుడు ఆ ప్రాంతాల్లోని ఆహార వైవిధ్యాన్ని వర్ణించాడు. జిహ్వకు హితవైన వాటిని పొగిడాడు, నోటికి వెగటైన వాటిని వెటకరించాడు. తెలుగు కవులలో అన్నమాచార్యుడు, శ్రీకృష్ణదేవరాయలు, అల్లసాని పెద్దన వంటివారు కూడా తమ కవిత్వంలో ఆహార వైవిధ్యాన్ని, వైభవాన్ని కళ్లకు కట్టారు. భారతీయుల తొలి పాకశాస్త్ర గ్రంథం ‘పాకదర్పణం’. దీని అసలు గ్రంథకర్త ఎవరో తెలీదు గాని, కర్తృత్వాన్ని పురాణ పురుషుడైన నల మహారాజుకు ఆపాదించారు. ‘భుజ్యతే యేన యత్నేన/ తస్యారోగ్యం భవేద్ధ్రువమ్/ వాతజం పిత్తజం రోగం/ శ్లేష్మజం హన్తి సర్వదా’ అని– అంటే, ఇందులో వివరించిన ఆహార పదార్థాలను భుజించేవారికి వాత పిత్త కఫ జనిత రోగాలన్నీ నశిస్తాయని ‘పాకదర్పణం’ ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. ‘పాకదర్పణం’ కేవలం వంటల పుస్తకం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యశాస్త్ర గ్రంథం కూడా! ఆహార పదార్థాల్లోని షడ్రుచుల గురించి; భక్ష్య భోజ్య లేహ్య చోష్య పేయాది పంచభక్ష్యాల గురించి; అష్టవిధ ఆహార దోషాల గురించి; వంటచేసే పాచకునికి ఉండ వలసిన లక్షణాల గురించి; రుతువులకు అనుగుణంగా తీసుకోవలసిన ఆహార పదార్థాల గురించి విపులంగా వర్ణించిన గ్రంథమిది. ఆనాటి జనాలు ఆరోగ్యసూత్రాలను పాటిస్తూనే ఆహారాన్ని ఆస్వాదించేవారు. ఆహారకల్తీ బెడద ఉండేది కాదు. ఈనాటి జనాల్లో ఆరోగ్య స్పృహ పెరిగినా, బయట దొరికే ఆహార పదార్థాల్లో ఏవి కల్తీవో, ఏవి మంచివో గుర్తించలేని పరిస్థితి ఉంది. ప్యాకెట్లలో దొరికే ఆహార పదార్థాలలో ఆరోగ్యానికి చేటు కలిగించే చక్కెర, ఉప్పు, కొవ్వులు వంటి పదార్థాలు ఏమేరకు వాడుతున్నారో తెలియజెప్పే హెచ్చరిక లేబుల్స్‌ను తప్పనిసరిగా ముద్రించాలని భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆహార తయారీ సంస్థలను ఆదేశించాల్సిన దుఃస్థితి దాపురించింది. -
చేవ ఉంటే... చావు డప్పెందుకు?
స్పీకర్ స్థానం అనేది చట్టసభల్లో ఒక సమున్నతమైన గౌరవ ప్రదమైన రాజ్యాంగబద్ధ హోదా. ఈ పదవిని అధిరోహించడానికి సామాజిక, ఆర్థికపరమైన రిజర్వేషన్లేమీ ఉండవు. యోగ్యత, అనుభవం ప్రాతిపదికలపైనే స్పీకర్‌ను ఎన్నుకుంటారని భావిస్తాము. ఆ స్థానంలో కూర్చున్న తర్వాత ఆ వ్యక్తి స్పీకర్ మాత్రమే. దళిత స్పీకర్, బీసీ స్పీకర్, ఓసీ స్పీకర్ అనే తేడాలుండవు. లోక్‌సభలోనైనా శాసన సభల్లోనైనా సభావ్యవహారాలకు సంబంధించినంత వరకు స్పీకర్‌దే అత్యున్నత స్థానం. సభ్యులందరూ ఆ స్థానాన్ని గౌరవించవలసిందే. ఉన్నత స్థానాలకు చేరుకున్న పీడిత వర్గాల ప్రతినిధుల నుద్దేశించి పదేపదే వారి సామాజిక నేపథ్యాన్ని పదవికి జోడించి పిలవడం కొందరు నాయకులకు ఒక అలవాటుగా మారింది. ఈ మొరటుతనపు సంబోధనల ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలనేది వారి తాపత్రయం. తెలుగుదేశం నాయకుడు గంటి మోహనచంద్ర బాలయోగి గతంలో లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. ఒక దళితుడిని ఆ పదవిలో కూర్చోబెట్టామని చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు ఇప్పటికీ వల్లెవేస్తూనే ఉంటారు. కావలి ప్రతిభా భారతి విషయంలో కూడా అంతే. ‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా’ అని ప్రశ్నించిన సామాజిక దృక్పథం కలిగిన వ్యక్తి చంద్రబాబు. కనుక దళిత స్పీకర్, ముస్లిం రాష్ట్రపతి అంటూ పిలవడాన్ని అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గత సోమ వారం నాడు ప్రారంభమయ్యాయి. కరెంటు కోతలతో రోడ్డెక్కు తున్న రైతుల గుండెమంటలను మరిపించే తీవ్రమైన రాజకీయ వేడిని రగిలించాలని ఎవరు అనుకున్నారోగానీ, ఆ సంకల్పాన్ని మీడియా విజయవంతంగా నెరవేర్చింది. ‘దళిత స్పీకర్’ను బీఆర్ఎస్ అవమానించిందని ముఖ్యమంత్రి సహా మంత్రులు ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో కూడా ‘దళిత స్పీకర్’ పదబంధంతోనే దండెత్తారు. చివరకు స్పీకర్ కంటతడి పెట్టు కునేదాకా ఈ ప్రసంగాల ధోరణి కొనసాగింది. ఆ రోజు అసలేం జరిగింది? ఎందుకు ఉద్రిక్తతలు తలెత్తాయనే విషయం కంటే ‘దళిత స్పీకర్’కు అవమానం అనే పాయింటే మీడియా స్థలాన్ని, సమయాన్ని ఎక్కువగా ఆక్రమించింది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి సోమవారం నాడు సమావేశాలకు హాజరయ్యేందుకు బీఆర్ఎస్ సభ్యులు నల్లదుస్తులతో అసెంబ్లీ దగ్గరికి చేరుకున్నారు. వారిని అడ్డుకోవడానికి ముందుగానే పెద్ద ఎత్తున పోలీస్ బలగాన్ని మోహరించారు. ఎన్నడూ లేనివిధంగా మహిళా పోలీసుల్ని ముందు వరుసలో నిలబెట్టారని బీఆర్ఎస్ సభ్యులు ఆరోపించారు. నల్ల టీషర్టులపై నినాదాలు రాసి ఉన్నందున మీకు సభలోకి అను మతి లేదని వారిని అడ్డుకున్నారు.కొద్దిసేపు వాదోపవాదాలు, తోపులాటల తర్వాత హరీశ్ రావు, మరికొందరు నినాదాలు వున్న టీషర్టులను విప్పేసి ఇప్పుడు వెళ్లనివ్వండి అసెంబ్లీకి అంటూ ఒత్తిడి పెంచారు. మహిళా కానిస్టేబుళ్ల ఎదుట చొక్కాలు విప్పినందుకు, హరీశ్ రావు, కేటీఆర్ సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల ఆరోపణతో పాటు పలు సెక్షన్లకింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ పక్షం ఎంత ముందస్తు వ్యూహంతో ఉన్నదో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. తోపులాట సందర్భంగా మాజీమంత్రి జగదీశ్ రెడ్డిని కిందపడేసి తొక్కారనీ, ఫలితంగా ఆయనకు కొద్దిసేపు ఊపిరాడని పరిస్థితి ఏర్పడిందనీ బీఆర్ఎస్ ఆరోపించింది. జగదీశ్ రెడ్డి విజువల్స్ కూడా బయటికొచ్చాయి. ఒక పోలీస్ తన ప్యాంట్‌ను పట్టుకొని లాగడంతో ఆవేశపడ్డానని ఎమ్మెల్సీ తాతా మధు చెప్పారు. ‘ఇలా చేయమని స్పీకర్ చెప్పారా మీకు’ అంటూ రెండుసార్లు గట్టిగా అడిగిన తర్వాత ఏ ..... చెప్పాడు మీకు అంటూ ఒక రాయకూడని మాటను వాడినట్టు సమాచారం. ఆ మాటల్ని యథాతథంగా చూస్తే స్పీకర్‌ను ఉద్దేశించినట్టుగా కనిపించదు. కానీ అంతకుముందు స్పీకర్‌ను అన్నారు కనుక ఇది కూడా స్పీకర్‌కే వర్తిస్తుందన్నది కాంగ్రెస్ వాదన.తాతా మధు సామాజిక నేపథ్యాన్నిబట్టి ఫ్యూడల్ అహంకారంతో, దళితులంటే చిన్నచూపుతోనే అట్లా మాట్లాడారని కొందరు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. విద్యార్థిగా వామపక్ష ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న మధుకు ఫ్యూడల్ అహంభావం ఉన్నదంటే నమ్మడం కష్టమే. తాతా మధు నిజంగానే అహంభావంతో మాట్లాడి వుంటే అతనిమీద చర్యలు తీసుకోవడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ కేసీఆర్ ఆదేశాల మేరకే ‘దళిత స్పీకర్’ను దూషించారని ఆరోపిస్తూ ఆయన నివాసముంటున్న వ్యవసాయ క్షేత్రం దగ్గర చావుడప్పు కొట్టాలని కొందరు కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఒక శాసనసభ్యుడు బహిరంగంగానే తాము కేసీఆర్ చావు కోరుకుంటున్నామని చెప్పాడు. కేసీఆర్‌ను కేవలం ఒక రాజకీయ పార్టీ అధ్యక్షునిగానో, మాజీ ముఖ్యమంత్రిగానో, రాజకీయ ప్రత్యర్థిగానో పరిగణిస్తే పప్పులో కాలేసినట్టే. ఇప్పటికీ లక్షలాదిమంది తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ‘తెలంగాణా బాపు’గా పరిగణిస్తారు. వ్యక్తిగతంగా ఆయన్ను కించపరిస్తే మెజారిటీ ప్రజల మనో భావాలు దెబ్బతింటాయి. గత ఎన్నికలకు ముందున్న పరిస్థితి వేరు. ప్రత్యక్ష ప్రజాసంబంధాలకు దూరమై, తెలిసో తెలియకో ఆయన చుట్టూ ఒక ఇనుపకంచె ఏర్పడిన స్థితిలో కేసీఆర్ ‘దొరతనం’ మీద కాంగ్రెస్ చేసిన ప్రచారం కొన్ని వర్గాల్లో – ముఖ్యంగా యువతలో పనిచేసింది. ఇప్పుడా పరిస్థితి లేదు. పైగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే తనది ఫ్యూడల్ కుటుంబమనీ, తమ ఇంటిముందు నుంచి వెళ్లేవాళ్లు చెప్పులు విడిచి నడిచే వారనీ ఒక సందర్భంలో చెప్పుకున్నట్టు గుర్తు.ఇటువంటి ఫ్యూడల్ జ్ఞాపకాల నుంచి ఆయన బయటకు వచ్చి ఉన్నట్లయితే కులంకార్డు ఎత్తుగడలతో కీలక సమస్యలను దారి మళ్లించే ప్రయత్నాలు చేసేవారు కాదు. స్పీకర్‌పై చేసిన వాఖ్యల మీద మధు వివరణ తీసుకొని, తప్పుచేసినట్టు రుజువైతే ఆయనపై చర్యలకు పరిమితం కావాల్సింది. కేసీఆర్ నివాసం ముందు చావుడప్పుకు పిలుపునివ్వడం ఎంతవరకు సమంజసం? అక్కడేం జరిగింది? భువనగిరి, ఆలేరు, దుబ్బాక, సిద్ధిపేట, గజ్వేల్ ప్రాంతాలకు చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు డప్పు కళాకారులను వెంటబెట్టుకుని కేసీఆర్ నివాసానికి సమీపం దాకా వెళ్లారు. ఈ బృందానికి మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, డీసీసీ ఛీఫ్ అంక్షా రెడ్డి, స్థానిక నాయకులు నరేందర్ రెడ్డి, అశోక రెడ్డి, నాయని యాదగిరి, సర్దార్ ఖాన్, రవీందర్ రెడ్డి వగైరాలు నాయకత్వం వహించారు. వీరిని కొంతసేపటి తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు.కేసీఆర్ నివాసం సమీపంలో డప్పు కొట్టడాన్ని నిరసిస్తూ కొద్దిమంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ తర్వాత అక్కడ పసుపునీళ్లు చల్లారు. దళితులు ఆందోళన చేసిన చోట పసుపు నీళ్లు చల్లు తారా? ఇది దళిత వ్యతిరేకత కాదా? దీనిపై రాష్ట్ర వ్యాపితంగా ఆందోళన చేస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఆందోళనకు నాయకత్వం వహించి అరెస్టయిన ఆ కాంగ్రెస్ నేతలంతా దళితులేనా? కావాలంటే పోలీసు రికార్డులను పరిశీలించు కోవచ్చు. పసుపు నీళ్లు చల్లుతున్న బీఆర్ఎస్ అభిమానుల ఫొటోలు కూడా మీడియాలో వచ్చాయి. అందులో ఓ పదిమంది ఉన్నట్టున్నారు. వారిలో సిద్ధిపేట బీఆర్ఎస్ కార్యకర్త దళిత వర్గానికి చెందిన సాయిప్రేమ్ కూడా ఉన్నారు. కనుక ఆందోళన చేసిన వాళ్లంతా దళితులు కాదు. పసుపునీళ్ళు చల్లిన వాళ్ళంతా ఆధిపత్య కులాల వాళ్ళు కాదు. చర్య కాంగ్రెస్‌ది, ప్రతిచర్య బీఆర్ఎస్ది అంతే!అసెంబ్లీ ముందు జరిగిన ఘటనలో మరో అమానుషమైన ఉదంతాన్ని మరుగు పరిచే ప్రయత్నం కూడా ఈ చావు డప్పు ఉదంతంలో ఉన్నదేమోననిపిస్తున్నది. అది మరుగున పడకుండా ఉండేందుకు, ఆ విషయంలో న్యాయం జరగాలనే సంక ల్పంతో బీఆర్ఎస్ మహిళా నేతలు ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్‌ను, మానవ హక్కుల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. సీనియర్ రాజకీయ నాయకురాలు, ఉమ్మడి రాష్ట్రంలోనే తొలి మహిళా హోంమంత్రి, వైఎస్సార్‌కు దేవుడిచ్చిన చేవెళ్ల చెల్లెమ్మగా ప్రసిద్ధురాలైన సబితా ఇంద్రారెడ్డి గొంతు నులిమే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలను, మరో మాజీమంత్రి, సీనియర్ శాసన సభ్యులు సునీతా లక్ష్మారెడ్డి చీరను లాగే ప్రయత్నాలకు సంబంధించిన ఫొటోలను ఫిర్యాదులతో జత పరిచినట్టు సమాచారం. ఈ ఫొటోలను చూసిన తర్వాత మహిళా కమిషన్ చైర్పర్సన్ తీవ్రంగా స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు సమాచారం. అసెంబ్లీ వేదికను ఉపయోగించుకొని ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు వారి సమక్షంలోనే ప్రభుత్వం సమాధానం చెప్ప గలిగి ఉంటే ప్రభుత్వానికి అంతో ఇంతో మంచి పేరు వచ్చేది. అట్లా కాకుండా స్పీకర్ భుజం మీద తుపాకి పెట్టి ప్రతిపక్షాన్ని తరిమేయడం, ఫ్లాష్ సర్వేలో తమకే ఎక్కువ మార్కులు పడ్డాయని సంతోషపడటం వల్ల ప్రయోజనం లేదు. క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కరెంట్ సరఫరా సరిపోక పంటలు ఎండిపోతున్నాయి. రైతులు రోడ్లెక్కుతున్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల దాకా ఇస్తున్నట్టు చెబుతున్నటికీ మధ్యలో బ్రేకులతో ఐదు నుంచి 8 గంటలే కరెంటు ఉంటున్నదని రైతులు వాపోతున్నారు. సబ్స్టేషన్లను ముట్టడిస్తున్నారు. 22ఎ నిషేధిత జాబితా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే సుమారు లక్షన్నర డోర్ నంబర్లు ఈ జాబితాలో పడిపోయాయని చెబుతున్నారు. వేలాది మంది రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా సరైన సమాధానం చెప్పే నాథుడే కరువయ్యాడు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం నాడు ఇచ్చిన వివరణ ప్రతిపక్షాన్ని కూర్చోబెట్టుకొని ఇవ్వాల్సింది. వారి సవాళ్లను ధీటుగా ఎదుర్కోవలసింది. అలా కాకుండా ఒంటిచేతి చప్పట్లతో ప్రభుత్వానికి కలిగే ప్రయోజనం ఏం ఉంటుంది? జరిగిన పరిణామాలను బట్టి చర్చించే చేవలేకనే చావుడప్పులకు ఒడిగట్టారని ఎవరైనా అనుకుంటే తప్పెలా అవుతుంది?వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
సమష్టి స్వరం సాధ్యమేనా!
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో ఇరాన్‌తో అమెరికా లడాయి, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా విధిస్తున్న సుంకాలు వగైరాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని ఊపిరాడకుండా చేస్తున్న తరుణంలో న్యూఢిల్లీలో శని, ఆదివారాల్లో బ్రిక్స్ దేశాల 18వ శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ రాగా... చైనా అధ్య క్షుడు షీ జిన్‌పింగ్ శనివారం చేరుకుంటారు. ఆయన ఏడేళ్ల తర్వాత మన దేశం వస్తున్నారు. ఇక ఇరాన్ అధ్యక్షుడొకరు భారత్‌కొచ్చి ఎనిమిదేళ్లవుతుండగా, పెజెష్కియాన్ అడుగుపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీతో పుతిన్ ద్వైపాక్షిక సమావేశం జరగటం,ఆ వెంటనే పెజెష్కియాన్ కూడా ఆయనతో ద్వైపాక్షిక భేటీ కావటంతో పాటు, తదనంతరం జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం సమావేశంలో కూడా పాలుపంచుకోవటంతో దౌత్య సందడి ముందే మొదలైనట్టయింది. ఆవిర్భవించిననాడు బ్రిక్స్వి బుడి బుడి అడుగులే. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాల విదేశాంగమంత్రులు 2006లో తొలిసారి సమావేశమై కూటమిగా ఏర్పడాలని నిర్ణయించారు. 2009లో తొలి శిఖరాగ్ర సమావేశం జరిగింది. దక్షిణాఫ్రికా 2011లో చేరాక చివరిలో ‘ఎస్’ చేరి బ్రిక్స్ అయింది. అటుపై వరసగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఇండొనేసియాలు వేర్వేరు సంవత్సరాల్లో చేతులు కలిపాయి. మొత్తంగా ఇది 20 దేశాల కూటమిగా రూపొందింది. ప్రపంచ జనాభాలో బ్రిక్స్ దేశాల వాటా 49.5 శాతం. ప్రపంచంలోని నాలుగోవంతు భూభాగం దీని సొంతం. ప్రపంచ జీడీపీలో దాదాపు 30 శాతం వాటా. వాణిజ్య ఎగుమతుల్లో 21.6 శాతం, దిగుమతుల్లో 17.3 శాతం వాటా ఈ దేశాలదే. ప్రపంచ ఇంధన ఉత్పత్తిలో బ్రిక్స్ వాటా 40 శాతం. కొనుగోలు శక్తిలో జీ7 దేశాలకన్నా బ్రిక్స్ దేశాలదే అధికం. ప్రపంచ బ్యాంకుకు ప్రత్యా మ్నాయంగా పేద దేశాలకు తోడ్పడే సుస్థిర పట్టణాభివృద్ధి ప్రణాళిక, మౌలిక సదుపాయా లపై సూచనలివ్వటం, వాటి వ్యయానికి నిధులు సమకూర్చటం తదితరాలను చైనాలోని షాంఘైలో ప్రధాన కార్యాలయం ఉన్న బ్రిక్స్‌కు చెందిన న్యూ డెవెలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) చూస్తోంది. సభ్యదేశాల జాతీయ కరెన్సీల్లో వాణిజ్యం నెరపుతూ డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవటం, చెల్లింపులకోసం స్విఫ్ట్ వంటి పేమెంట్ విధానంలోకాక ‘బ్రిక్స్ పే’ ద్వారా లావాదేవీలు జరపటం ఇప్పటికే మొదలయ్యాయి. ఇన్నివిధాల సహాయ సహకారాలు కొనసాగే బ్రిక్స్ ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందా అనే సంశయం చాలా మందికి ఉంది. ఎందుకంటే ఈ కూటమిలోని దేశాలే వేరే కూటముల్లో ఉన్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ అమెరికా కనుసన్నల్లో నడుస్తాయి. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు సహకరిస్తూ ఇరాన్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి. భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదాలు సరేసరి. అయితే ఆగిపోవటం కన్నా అడుగు ముందుకేయటమే అందరికీ ప్రయోజనకరం. కలిసి పనిచేసే సంస్కృతి పెంపొందటంవల్ల అపోహలు తొలగే అవకాశం ఉంటుంది. దగ్గరయ్యేందుకు వీలుంటుంది. సమష్టి కార్యా చరణ అవసరమైన రంగాలు చాలానే ఉన్నాయి. ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ, ఐక్యరాజ్యసమితిని బహుళ ప్రాతినిధ్య సంస్థగా చేయాలన్న డిమాండ్ వగైరాల్లో ఈ దేశాలు సమష్టిగా పనిచేయొచ్చు. వాతావరణం, విద్య, ఇంధనం, డిజిటల్ పేమెంట్ వేదికలు వగైరాల్లో సహకరించుకోవచ్చు. అలాగని కల్లోల కాలంలో కూటములు మనుగడ అంత సులభమేమీ కాదు. తమపై అమెరికా ప్రకటించిన దురాక్రమణ యుద్ధాన్ని బ్రిక్స్ ఖండించాలని ఇరాన్ బలంగా కోరుకుంటోంది. అదే సమయంలో తమపై ఇరాన్ సాగిస్తున్న దాడుల్ని కూడా వ్యతిరేకించాలని సౌదీ, యూఏఈ ఆశిస్తాయి. అందుకే బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన అంత సులభమేమీ కాదు. ఇటీవల బిష్కెక్లో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు నేరుగా అమెరికానూ, ఇజ్రాయెల్‌నూ ప్రస్తావించకుండా ఇరాన్‌పై దాడిని ఖండించింది. అక్కడైతే సౌదీ, యూఏఈ సభ్యదేశాలు కాదు. ఇక్కడ పరిస్థితి వేరు. ఈ సమస్యను బ్రిక్స్ ఎలా పరిష్కరించుకుంటుందో చూడాల్సివుంది. ఆ దేశాలకూ, ఇరాన్‌కూ మధ్య ఏదోమేర సామరస్యం సాధించగలిగితే, సమష్టి స్వరం వినిపించగలిగితే బ్రిక్స్ బలం మరింత పెరుగుతుంది. -
ఇది స్వయంకృతం!
జర్మనీ పాలకపక్షం క్రిస్టియన్ డెమాక్రటిక్ యూనియన్(సీడీయూ) అధినేత, చాన్స్‌లర్ ఫ్రెడెరిక్ మెర్జ్‌కు ఇది దుర్వార్త. ఆయనకే కాదు... దశాబ్దాలుగా జర్మనీని ఏలిన మధ్యేవాద, వామపక్షాలకు సైతం మింగుడుపడని విషయం. ఆ మాటకొస్తే యూరప్ ఖండమంతా ‘కింకర్తవ్యమ’ంటూ కలవరపడుతోంది. ఉన్నట్టుండి సంభవించిన ఈ ‘రాజకీయ భూకంపాన్ని’ జీర్ణించుకోలేకపోతోంది. తూర్పు జర్మనీ ప్రాంతంలోని సాక్సోనీ– అన్హల్ట్ రాష్ట్రంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తీవ్ర మితవాద పక్షం ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (ఏఎఫ్‌డీ) సాధించిన విజయమే వీరందరికీ నిద్రలేని రాత్రులు మిగిల్చింది. జర్మనీలోని 16 రాష్ట్రాల్లో సాక్సోనీ–అన్హల్ట్ ఒకటి. దాదాపు 21 లక్షల 36 వేల జనాభాగల ఈ రాష్ట్రంలో ఏఎఫ్‌డీ ఇతరచోట్లకన్నా బలంగా ఉందని అందరూ భావించినా... 83 స్థానాలున్న పార్లమెంటులో 39 స్థానాలు, 43.8 శాతం ఓట్లు సాధించి మెజారిటీ పక్షంగా అవతరిస్తుందని ఊహించలేదు. అక్కడి ప్రస్తుత పాలకపక్షం మధ్యేవాద మితవాద సీడీయూ రెండో స్థానంలోకి పోవటమే కాదు, దాని ఓట్ల శాతం 17.2కి పడిపోయింది. మిగిలిన తొమ్మిది పార్టీల తీరెలావుందో చెప్పనవసరం లేదు.రెండో ప్రపంచ యుద్ధానంతరం జర్మనీలో తీవ్ర మితవాద పక్షాలు నామమాత్రంగా ఒకటి రెండు సీట్లు గెల్చు కోవటం తప్ప ఎప్పుడూ అధికారం అంచులవరకూ రాలేదు. ఇప్పుడైనా కనీస మెజారిటీకి మూడు తక్కువొచ్చిన ఏఎఫ్‌డీని అధికారంలోకి రానిస్తారా అనే సంశయం అందరిలో ఉంది. చేతులు కలిపేందుకు వేరే పార్టీలు ముందుకు రాకున్నా, కొందరు ఎంపీలు ఫిరాయించే అవకాశం కనబడుతోంది. అన్ని పక్షాలూ అంటరాని పార్టీగా పరిగణించిన ఏఎఫ్‌డీ కొన్నేళ్లుగా జర్మనీలో తన ఉనికి చాటుకుంటోంది. కానీ సాక్సోనీ– అన్హల్ట్లో అది వేగంగా ఎదగటాన్ని అందరూ గుర్తించారు. వలసలను వ్యతిరేకించటం మొదలుకొని అనేక అంశాల్లో దూకుడుగా పోతున్న ఆ పార్టీని జర్మనీ నిఘా విభాగం ‘తీవ్ర మితవాద పక్షం’గా నిర్ధారించింది. పది రోజుల్లో మెక్లిన్బర్గ్ పొమెరేనియా రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఎలాంటి ఫలితాన్నిస్తాయో... మరో మూడేళ్లలో జరిగే జాతీయ ఎన్నికల నాటికి ఏమవుతుందోనని వేరే పార్టీలు వణుకుతున్నాయి. ఏఎఫ్‌డీ విజయానికి ఇతర పార్టీలు తమను తామే నిందించుకోవాలి. దశాబ్దాలుగా దేశాన్నేలినా జనం మౌలిక సమస్యల్ని పరిష్కరించటంలో, దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దటంలో అవన్నీ విఫలమయ్యాయి. వెల్లువలా వచ్చిపడే వలసలను నివారించలేకపోయాయి. గతంలో జర్మన్ డెమాక్రటిక్ రిపబ్లిక్ (జీడీఆర్)గా వామపక్షాల పాలనలో ఉన్న తూర్పు ప్రాంతం... పశ్చిమ ప్రాంతంతో పోలిస్తే అన్నివిధాలా వెనకబడి వుంది. అందువల్ల అక్కడి సమస్యలు మరిన్ని రెట్లు అధికం. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తెచ్చిన అనిశ్చితి వీటికి అదనం. రష్యాతో అనవసర వివాదం తెచ్చుకోకూడదన్నది ఏఎఫ్‌డీ అభిప్రాయం. ఈసారి ముమ్మరంగా పోలింగ్ జరగటం, ఏఎఫ్‌డీ విజయం దీని పర్యవసానమే. మిగిలిన పార్టీలతో పోలిస్తే ఏఎఫ్‌డీ సామాజిక మాధ్యమాల్లో చురుకు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడును అన్నివిధాలా పుణికిపుచ్చుకుంది. సీడీయూనూ, ఇతర పక్షాలనూ విమర్శలతో చీల్చిచెండాడుతుంటే అటు నోట మాటలేదు.ఇన్నాళ్లూ అమెరికా అడుగుజాడల్లో నడిచి, ఉగ్రవాదంపై యుద్ధం పేరిట అది సాగించిన వృథా యుద్ధాల్లో పాలుపంచుకుని ఇతర యూరప్ దేశాలతోపాటు జర్మనీ కూడా ఆర్థికంగా కుంగిపోయింది. ఆ యుద్ధాలు తెచ్చిన సంక్షోభంతోనే పలు ముస్లిం దేశాలనుంచి వలసలు అధికమయ్యాయి. అమెరికా సలహాతో యూరప్ దేశాలు ఉక్రెయిన్ను ఎగదోయకుంటే రష్యాతో లడాయి ఉండేది కాదు. సాక్సోనీ–అన్హల్ట్ ఫలితం గమనిస్తే మెజారిటీ ప్రజలు ఆ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారనీ, అధికార సీడీయూ విధానాలపై అసంతృప్తి చెందారనీ అర్థమవుతుంది. అయితే వేరే దేశాల్లోని తీవ్ర మితవాద పక్షాల్లాగే ఏఎఫ్‌డీ కూడా పర్యావరణ విధ్వంసాన్ని అబద్ధమంటుంది. ఎల్జీబీటీక్యూ హక్కులకు ఆ పార్టీ పూర్తి వ్యతిరేకం. వలసలు సరేసరి. జర్మన్లకు మాత్రమే దేశం సొంతమనీ, అన్యులను రానీయొద్దనీ దాని నినాదం. నాజీ పాలనలో విద్వేషాన్నీ, మారణహోమాల్నీ చూసిన జర్మనీలో తిరిగి ఆ మాదిరి పార్టీ అందలం ఎక్కే స్థితి ఏర్పడటానికి కారణమేమిటో ఆ దేశంతోపాటు ఫ్రాన్స్, స్పెయిన్ వగైరా యూరప్ దేశాలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. -
నిరంకుశత్వంపై ధర్మాగ్రహం
ఒకసారంటూ జనం ఓట్లతో గద్దెనెక్కాక ఇష్టారాజ్యంగా పాలించవచ్చునని భావించే పాలకులకూ, వారి అడుగులకు మడుగులొత్తే ఉన్నతాధికారులకూ అలహాబాద్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు చెంపపెట్టు. అక్రమమో, సక్రమమో... ఒక కేసులో అరెస్టయ్యాక, పాలకులు తల్చుకుంటే ఎన్నాళ్లయినా చెరసాలపాలు కాకతప్పదన్న భయాందోళనలు ప్రజల్లో వ్యాపింపజేయటానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటాయి. ఇటీవలి సంవత్సరాల్లో ఆ జాడ్యం మరింత ముదిరింది. జనాన్ని సంఘటితపరిచే వారితో కఠినంగా వ్యవహరిస్తే ఇతరులు బెదిరిపోతారనీ, అంతా ‘పరిష్కారం’ అవుతుందనీ ప్రభుత్వాలనుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగ న్యాయస్థానాల వైఖరెలా ఉండాలో, ప్రాథమిక హక్కుల అమలుకు ఎంతగా ప్రాధాన్యమివ్వాలో జస్టిస్ అతుల్ శ్రీధరన్, జస్టిస్ అచల్ సచ్‌దేవ్‌లతో కూడిన ధర్మాసనం చూపించింది. ఈ నిరసనల్లో పాల్గొన్న న్యాయశాస్త్ర విద్యార్థిని ఆకృతి చౌధరీపైనా, మరికొందరిపైనా మొన్న ఏప్రిల్‌లో జాతీయ భద్రతా చట్టాన్ని (ఎన్ఎస్ఏ) ప్రయోగించి గౌతమ్ బుద్ధనగర్ జిల్లాలోని కస్నా జైలుకు పంపారు. తగిన కారణం లేకుండా, ఏకపక్షంగా ఎన్ఎస్ఏ వంటి కఠినమైన చట్టాన్ని ప్రయోగించటంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసి, ఆమెకు రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలనీ, ఈ మొత్తాన్ని జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్) మొదలు పోలీస్ స్టేషన్ ఇన్చార్జి వరకూ అందరి జీతాల్లోనూ కోతబెట్టి అందించాలనీ ఆదేశించింది. కేసు పూర్వాపరాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా పరిసర ప్రాంతాల్లోని ఫ్యాక్టరీ కార్మికులకు రోజూ 10 నుంచి 12 గంటలు పనిచేస్తే నెలకు రూ. 10,000 నుంచి రూ. 13,000 వరకూ వేతనం లభిస్తుంది. హరియాణాలోనూ, దాని పరిధిలోకొచ్చే పొరుగునున్న గురుగ్రామ్‌లోనూ ఈ తరహా కార్మికుల కనీస వేతనాన్ని 35 శాతం పెంచి రూ. 15,000గా నిర్ధారించారు. తమకూ వేతనాలు పెంచాలనీ, అది రూ. 20,000వరకూ ఉండాలనీ నోయిడా కార్మికులు డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగారు. ఇందులో ఏం వైపరీత్యం ఉంది? వారు డిమాండ్ చేసినంతా ఇవ్వటం సాధ్యం కాకపోవచ్చు. చర్చలకు పిలిస్తే కలిగే నష్టమేమిటి? ఈ కార్మికులకు వేతనం ఒక్కటే సమస్య కాదు. నియామక పత్రాలుండవు కనుక అదనపు చాకిరీకి అదనంగా ఏమీ రాదు. వారాంతపు సెలవులుండవు. పీఎఫ్, ఆరోగ్య బీమా వంటివి లేవు. నిర్దిష్టంగా ఒక తేదీకి వేతనాలు, భద్రతా ప్రమాణాలు కనబడవు. మహిళా కార్మికుల స్థితి మరింత ఘోరం. కార్మికులకొచ్చే వేతనాల్లో కాంట్రాక్టర్ల అక్రమ కోతలు సరేసరి. 58.2 శాతం మందికి అసలు నియామక పత్రాలే లేవు. 47 శాతం మందికి వేతనంతో కూడిన సెలవు లేదు. అరకొరగానైనా రోజులు గడిచినంత కాలం ఎవరూ ప్రశ్నించలేదు. కానీ గడ్డురోజులు దాపురించాక మౌనంగా ఉండలేకపోయారు. ఇవన్నీ ప్రభుత్వ పెద్దలకు తెలియదని కాదు. అయినా ఎడాపెడా కేసులు పెట్టి జైళ్లకు పంపితే అంతా సమసిపోతుందని భావించారు. ఆకృతి తదితరులు నిరసనలో హింసకు కుట్ర పన్నారని, జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని చెప్పడానికి వాట్సాప్ మెసేజ్‌లు లేదా ఇతరత్రా ఆధారాలు చూపలేకపోయారని ధర్మాసనం వ్యాఖ్యానించటం గమనార్హం. న్యాయమైన కోర్కెల్ని శాంతియుతంగా తెలపడానికి శాంతిభద్రతలకు విఘాతం సాకుతో అవకాశం ఇవ్వకపోవటం నిరంకుశ పాలనకు దారితీస్తుందని అభిప్రాయపడింది. విధుల్ని సక్రమంగా నిర్వర్తించే అధికారుల్నీ, పోలీసులనూ జనం దేవతలే అసూయ పడేంతగా నెత్తినపెట్టుకుంటారనీ, అక్రమ చర్యలకు పాల్పడితే అందుకు విరుద్ధమైన ఫలితాలొస్తాయనీ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్ ఒక్కటే కాదు... పలు రాష్ట్రాల్లో పోలీసులు అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలనూ, కార్యకర్తలనూ, సామాజిక మాధ్యమాల బాధ్యులనూ అక్రమ కేసులతో వేధిస్తున్నారు. నెలల తరబడి జైళ్లపాలు చేస్తున్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా మార్పు లేదు. కానీ ఎల్లకాలమూ ఇది సాగదు. ఇదే వరస కొనసాగితే ఏపీలోనూ కఠిన చర్యలు తీసుకునే స్థితి ఏర్పడుతుంది. అప్పుడు పాలకులూ, వారి రెడ్ బుక్‌లూ అధికారుల్ని రక్షించటం అసాధ్యం. -
ఇవి అచ్చంగా హత్యలే!
పీడలా వెంటాడుతున్న పేదరికంనుంచి తప్పించుకుందామని... మెరుగైన జీవితాన్ని అందుకుందామని చదువుల కోసం, కోచింగ్ కోసం, చిన్నా చితకా కొలువుల కోసం దేశ రాజధాని నగరం వచ్చే లక్షలమంది యువతకు అక్కడ అడుగడుగునా మృత్యువు పొంచివుంటుందని తెలియదు. బడాయి కబుర్లుచెప్పి గద్దెలెక్కే నేతలకు ఇలాంటివేమీ పట్టవని అసలే తెలియదు. అందుకే ఆదివారం మధ్యాహ్నం ఉన్నట్టుండి కుప్పకూలిన ఢిల్లీ సత్యనికేతన్ కాలనీ పీజీ హాస్టల్లో ఏడుగురు యువకులు తనువు చాలించారు. శిథిలాల్లో చిక్కుకున్నవారు మమ్మల్ని కాపాడండని ఆర్తనాదాలు చేస్తున్నా అవి అరణ్యరోదనలే అయ్యాయి. ఆలస్యంగా మొదలైన సహాయక చర్యల్లో కొందరు ప్రాణాలతో బయటపడినా తీవ్ర గాయాలపాలయ్యారు. ఢిల్లీకి ఇలాంటి విషాదకర ఉదంతాలు కొత్తగాదు. గత పదేళ్లకాలంలో చూసుకున్నా వీటి సంఖ్య ఎక్కువే. మొన్నటికి మొన్న మే నెలాఖరు, జూన్ మొదటివారం మధ్య రెండుచోట్ల ఇటువంటివే చోటు చేసుకున్నాయి. అయిదంతస్తుల భవంతి కూలిన ఘటనలో ఆరుగురు మరణించగా,20 మంది గాయపడ్డారు. మరో మూడు రోజులకు ఒక హోటల్ మంటల్లో చిక్కుకుని 23 మంది మరణించారు. అక్కడ ఆరు గదులకు అనుమతి తీసుకుని ఏకంగా 26 గదులు నిర్మించి అద్దెకిచ్చారు. కుప్పకూలేందుకు సిద్ధంగా ఉండే భవంతుల్ని పోల్చుకోవటం పెద్ద కష్టం కాదు. అవేమీ బయటకు రాజమహళ్ల మాదిరిగా కనబడవు. నాచుపట్టిన గోడలతో, పెచ్చులూడిపడుతూ, కరెంటు వైర్లు వేలాడుతూ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతూ ఉంటాయి. లోపలికెళ్తే ఇరుకిరుకు గదులు, విరగడానికి సిద్ధంగా ఉండే మంచాలు, టేబుళ్లు, పెద్దగా ధ్వని చేసుకుంటూ ఎప్పుడు మీదపడతాయో తెలియని ఫ్యాన్లు దర్శనమిస్తాయి. ఎక్కడికక్కడ నల్లా గొట్టాలు చిట్లి నీళ్లు లీకవుతుంటాయి. కానీ ఓట్ల కోసం ఇల్లిల్లూ తిరిగే నాయకులకు ఇవేమీ కనబడవు. గెలిచాక అసలే పట్టవు. అధికార గణానికీ, సిబ్బందికీ ఇలాంటి భవంతులు అదనపు ఆదాయ మార్గాలు. వివిధ పట్టణాల్లో, నగరాల్లో చదువుల్లో టాపర్లుగా ఉంటూ, పోటీ పరీక్షల్ని సునాయాసంగా గెలుచుకునే పిల్లలు ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని 90 కళాశాలల్లో చేరడానికి వస్తారు. వీటిల్లో చేరే లక్షన్నరమందిలో అత్యధికులు బయటివారే. కానీ కేవలం 20 కళాశాలలకు మాత్రమే హాస్టల్ సదుపాయం ఉంది. అవి 3,000 మందికి మించి చోటిచ్చే అవకాశం ఉండదు. ఢిల్లీలో రాష్ట్ర, కేంద్ర పరిధుల్లోని యూనివర్సిటీలు, ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు మొత్తంగా 38 ఉంటాయి. వీటిల్లో 5 లక్షలమంది విద్యార్థులుంటే ఇందులో మూడింట రెండొంతులమంది బయటివారే. దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి సాధిస్తోందని గంభీరోపన్యాసాలిచ్చే వారికి ఇవేమీ కనబడవు. కనీసం నెలకు పదో పదిహేనో భవంతుల్ని తనిఖీ చేసి నివాసయోగ్యం కాని, అగ్నిప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నవాటిని గుర్తించి తక్షణం ఖాళీ చేయించేలా తనిఖీ బృందాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉండదు. పదే పదే చోటుచేసుకునే ఉదంతాల్ని చూశాకైనా కళ్లు తెరవాలని తోచదు. ఒకప్పుడు జనావాసంగా ఉన్న ఈ ప్రాంతంలో అనేక ప్రైవేటు హాస్టళ్లకు అనుమతించారు. ఈ మహానగరంలో మనుగడ సాగించటానికి ఉన్నంతలో అవే దిక్కని మధ్యతరగతి, దిగువమధ్యతరగతి పిల్లలు వస్తారు. కానీ అవి సురక్షితమో కాదో, కట్టడం నాణ్యత ఏ మేరకుందో చూసే నాథుడుండడు. సొమ్ము వచ్చిపడేసరికి ఉదారంగా అనుమతులీయటం ఒక్కటే అధికారులకు తెలుసు. చిత్రమేమంటే... సాధారణ సమయాల్లో వీటిపై ఏమాత్రం శ్రద్ధపెట్టని నేతలు ఏదైనా జరిగాక పరామర్శకొస్తారు. ఇకపై ఇలాంటివి జరగబోవని ఉదారంగా హామీ ఇస్తారు. ఎన్నడో 2007లో రూపొందించిన నిబంధనల్లో ఇలాంటి భవంతుల్ని వెంటవెంటనే గుర్తించి ఖాళీ చేయించాలని ఉన్నా తమకు పట్టింపులేకపోయిందన్న సంగతి తెలియనట్టు ప్రవర్తిస్తారు. ఇంతకూ నలుగురు అధికారుల్ని సస్పెండ్ చేశామని చెప్పడం ఎవర్ని వంచించటానికి? ఇవి ప్రమాదాలు కాదు... అవినీతి, నిర్లక్ష్యం కలగలిసిన పర్యవసానంగా జరిగిన హత్యలు. ఇందుకు బాధ్యత కేవలం ఆ అధికారులదేనా? పాలకులకు జవాబుదారీతనం ఉండదా? -
నిజరూప పట దర్శనం!
మాటలు కావొచ్చు, చేతలు కావొచ్చు– ఏవీ శూన్యంనుంచి ఊడిపడవు. అనుద్దేశపూర్వకంగా, యథాలాపంగా ఏవీ ఉండవు. వాటిని ఉపయోగించేవారికి ఆ సంగతి తెలియొచ్చు... తెలియకపోవచ్చు. ఒక్కోసారి బాధితులకు కూడా అర్థం కాకపోవచ్చు. కానీ వివక్షను ఎత్తిచూపినప్పుడు సరిదిద్దుకోవటం సంస్కారం. ఈ విషయంలో వ్యక్తుల్ని కొంతవరకూ క్షమించవచ్చు. కానీ ప్రపంచ దేశాల సారథి ఐక్యరాజ్యసమితిని క్షమించగలమా? ప్రపంచ పటంలో మా ఖండాన్ని చిన్నబుచ్చుతున్నారని ఆఫ్రికా దేశాలు దశాబ్దాలుగా ఎత్తిచూపుతున్నాయి. అయినా దాన్ని సరిదిద్దుకోవటానికి దీర్ఘకాలం పట్టింది. ఎట్టకేలకు మొన్న శుక్రవారం దాన్ని సవరించుకుంది. ఏకంగా 164 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఒటేస్తే, ఎప్పట్లానే అమెరికా ఉలిపికట్టె ధోరణి ప్రదర్శించింది. ఎప్పుడో పదహారో శతాబ్దంనాటి మాట. భౌగోళిక పటాల రూపకర్త గెరార్డస్ మెర్కేటర్ తొలిసారి 1569లో ప్రపంచ పటాన్ని రూపొందించాడు. దక్షిణార్ధ గోళ దేశాలను, ముఖ్యంగా భూమధ్య రేఖ సమీప దేశాలను వాటి వాస్తవ పరిమాణంకన్నా తక్కువగా చూపాడాయన. అప్పటికున్న పరిజ్ఞానం పరిమితుల్లో అలా చేశాడని సరిపెట్టుకోవటానికి లేదు. అదే నిజమైతే ఉత్తరార్ధ గోళ దేశాలనూ, ధ్రువాలకు సమీపంలో ఉన్నవాటినీ పెంచి ఎలా చూపగలిగాడు? ఏమైతేనేం... ప్రపంచపటం ఇన్నాళ్లకు సక్రమమైంది. ఖండాలను వాటి నిష్పత్తికి అనుగుణమైన వైశాల్యాల్లో రూపొందించారు. కానీ ఆ క్రమంలో మన జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ భూభాగంలోని కొన్ని ప్రాంతాలను ఆ పటం చైనా, పాకిస్తాన్లకు ‘పంచిపెట్టింది’. మన విదేశాంగ శాఖ చెప్పినట్టు ఇదేమీ దేశాల హద్దుల్ని అధికారికంగా నిర్ధారించేది కాకపోవచ్చు. కానీ ఒక తప్పును సరిదిద్దుకునే క్రమంలో కొత్త తప్పుల్ని చేయరాదన్న ఇంగిత జ్ఞానం లోపించింది. అమెరికాలో కొంత భూభాగాన్ని వేరేవాళ్ల ఖాతాలో వేసి ఉంటే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఊరుకునేవారా? అవతలివారిపై ఆధిక్యతాభావం మనిషి నరానరాల్లోనూ వ్యాపించిన జాడ్యం. దీనికి భౌగోళిక హద్దులేమీ లేవు. అది జాత్యహంకారంగా, వర్ణవివక్షగా, ఆర్థికంగా అధికులమనే భావనగా వ్యక్తం కావటం ఎవరికీ తెలియంది కాదు. కులాన్నిబట్టి, మతాన్నిబట్టి మేం అధికులం, అన్యులు అల్పులన్న భావన ప్రబలంగా ఉండటం మన అనుభవంలో ఉన్నదే. తెల్లతోలు ఉన్నవాళ్లు అసాధారణ మానవులు, మిగిలినవాళ్లంతా అల్పులనే భావన పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికీ పోలేదు. హిట్లర్ హయాంలో యూదుల్ని జర్మనీ వెంటాడి, వేటాడి హతమార్చటం వెనుకా... ఎనిమిది దశాబ్దాలపైగా పాలస్తీనాలో మారణహోమాన్ని సాగిస్తున్న అమానుష ఇజ్రాయెల్ వెనకా ఈ జాడ్యం తాలూకు ఛాయలే కనబడతాయి. అమెరికాలో కనబడే శ్వేతజాతి అహంకారం కూడా ఈ బాపతే. మనిషి అంతరాంతరాల్లో ఇలాంటివి గూడు కట్టుకున్నప్పుడు వారి వ్యవహార శైలిలో అది ప్రతిబింబించక మానదు. ఒక ప్రాంత భౌగోళిక వైశాల్యం ఎంతో చెప్పే పటాలు చూడటానికి అన్నిటికీ అతీతంగా, అలీనంగా కనబడతాయి. కానీ పటాల రూపకల్పనలో చోటుచేసుకునే రాజకీయాల గురించి 2020లో కార్నెల్ వర్సిటీ అధ్యాపకురాలు క్రిస్టిన్ లూయెన్బెర్గర్ చాలా సంగతులే చెప్పారు. దృగ్గోచరమయ్యే రాజకీయాలతో పాటు, ప్రచ్ఛన్నంగా, గుట్టుగా ఉండిపోయే రాజకీయాలు కూడా ఈ పటాల రూపకల్పనలో ఉంటాయని ఆమె అభిప్రాయం. ప్రతి పటమూ చూపవల్సినంతగా చూపుతూనే, దాచాల్సింది దాస్తుందనీ, నిర్దిష్ట సమూహం కోసమే ఇదంతా జరుగుతుందనీ క్రిస్టిన్ అంటారు. గుండ్రంగా ఉండే భూమిని చదునైన కాగితంపై చూపితే కొంత వక్రీకరణ ఎలాగూ తప్పదు. కానీ గ్రీన్‌ల్యాండ్ కన్నా 14 రెట్లు పెద్దదైన ఆఫ్రికా... దాని ముందు చిన్నబోవట మేమిటి? యూరప్, అమెరికాలు కూడా తమ వాస్తవ విస్తీర్ణంకన్నా అధికంగా కనబడ తాయెందుకు? ఆఫ్రికాతోపాటు దక్షిణ అమెరికా, భారత్‌లు చిన్నగా ఉంటాయి. కాగితాల్లో తప్పుడు గీతలు గీసి అధికులమనుకోవటం... తరగతి గదుల్లో రూపుదిద్దుకునే తరాలకు అజ్ఞానాన్ని బట్వాడా చేయటం సిగ్గుచేటు కాదా? సమితికి ఇంతకన్నా ప్రాధాన్యం గలవి చాలా ఉన్నాయని ట్రంప్ ఉవాచ. అందుకే తీర్మానాన్ని వ్యతిరేకించారట. నిజమే... ప్రాధాన్యం గలవి ఇంకా ఉన్నాయి. ఆ లెక్కలు కూడా తేలిస్తే అమెరికా వంచన మరింత తేటతెల్లమవుతుంది! -
దేవుడి సిలబస్
దేవునికి తెలిసిన అచ్చులు, హల్లులు చాలా తక్కువ. మొదటి అచ్చు బతుకు. రెండో అచ్చు బతకనివ్వు. ఈ రెండు అచ్చుల మీదనే ఆయన సృష్టిని నిలబెట్టాడు. ఆయన ఇచ్చిన హల్లులు మూడే. మొదటి హల్లు ఆకలి. రెండో హల్లు నొప్పి. మూడో హల్లు ప్రేమ. ఈ ఐదు అక్షరాలను కల్పించడంతో ‘సృష్టి’ అనే పదం పూర్తవుతుంది. అంతకుమించి సిలబస్ పెంచదలుచుకోలేదు. అంతలోనే సుఖమైన ఉనికి ఉందని దేవునికి తెలుసు. చూడగా ఈ అక్షరమాలను ప్రకృతి బాగా ఒంటపట్టించుకున్నట్టు ఉంది. ఈ అచ్చులు, హల్లులు వల్లె వేయడంలో దాని నిష్ఠకు తిరుగు కూడా లేదు. అక్షరాలు నేర్చి అది సృష్టించిన పదాలు మధురం. వాటిలో మొదటిది ‘ఇవ్వడం’. అవును... ఇవ్వడం మాత్రమే. చెట్టు తన పండును తాను తినదు. నది తన నీటిని తాను తాగదు. మేఘం వర్షాన్ని తన కోసం కురిపించుకోదు. దేవుడి బడి నుంచి ప్రకృతి సృష్టించిన మరో మాట ఉంది... ‘ఓర్పు’. విత్తనం మొలకెత్తడానికి నెలలు ఆగుతుంది. చెట్టు నరికితే ఓర్పు వహించి మళ్లీ చిగురిస్తుంది. సుదీర్ఘ కరవును ఓర్పుతో ఎదుర్కొని ఒక్క పెనువానతో జవాబు చెప్తుంది. ప్రకృతి నిత్య వ్యవహారిక పదాలు... ‘సహజీవనం’, ‘సమతుల్యత’. మరి ప్రకృతి చేతిలో ఉన్న బుల్లి డిక్షనరీలో ఎంచేతనో ‘ద్వేషం’, ‘అసూయ’ లేవు.భూమ్మీద దేవుడి అనుక్షణ అవతారమైన ‘బాల్యాని’కి దైవ అక్షరమాలే తెలుసు. నవ్వు, నమ్మకం, మరుపు... ఇవే బోసినోళ్లు పలికే పదాలు. పిల్లలు పలకపై దిద్దే మరోమాట ‘అచ్చెరువు’. చీమ పాకినా, నాలుక తియ్యగా మారినా, చెట్టునీడ చల్లగా ఉన్నా, వేలికి రంగు అంటినా... ఎంత ఆశ్చర్యమో. ఆశ్చర్యపడటం మానేసిన క్షణం నుంచే నిరక్షరాస్యత మొదలవుతుందని పిల్లలకు తెలుసు. ఈ సృష్టిలోని సకారాత్మక, కరుణాత్మక అనంత సంకేతాలను చూస్తూ కన్నులింతింత చేసుకుని ఆశ్చర్యపోవడానికే జీవితకాలం సరిపోదనీ తెలుసు. అందుకే వారి వాచకంలో చాలా పరిమితమైన అర్థాలున్న ‘మతం’, ‘కులం’ అనే మాటలు ఉండవు. మనిషి తన ప్రాథమిక వాచకాన్ని ఎప్పుడు పారేసుకున్నాడోగానీ వాడి అతి తెలివిని కాకులకు పెట్టా... ఎన్నెన్ని పదాలు సొంత అక్షరమాల నుంచి పుట్టించాడో. ‘అధికారం’, ‘లాభం’, ‘మార్కెట్’... ఇవే అతని జీవితానికి పునాది అట. ఈ పునాదిని స్థిరపరిచే బడులూ తెరిచాడు. మొదటి బడి రాజకీయం. ఇది బాగా డిమాండ్ ఉన్న బడి. ఇందులో మతం, కులం అనే రెండు సబ్జెక్టుల్లో డాక్టరెట్ చేయడం నేర్పుతారు. మనిషిని ‘ఓటు’గా మలచాలంటే ఏం చేయాలో క్రాష్‌కోర్సులు ఉంటాయి. రెండో బడి బిజినెస్. ఇది సూటూ బూటూ బడి. టీచర్ పేరు ‘లాభం’. ప్రతి మనిషిని వస్తువుగా, ప్రతి సంబంధాన్ని లావాదేవీగా చేసే చదువు ఇక్కడ కర్కశంగా నేర్పుతారు. ఆకలికి స్పందన అమ్మకమే అనే గొప్ప సిద్ధాంతాన్ని బీరు పోనీరు. ఇక మూడో బడి సోషల్ మీడియా. పది వేళ్లున్న రెండు చేతులున్న ప్రతి మనిషి ఇందులో అడ్మిషన్ పొందవచ్చు. ఇది ‘ద్వేషం’ అనే ఉద్గ్రంథం బోధించడానికి మనిషికి సెల్ఫోన్లు ఇచ్చి పాయిఖానాల చుట్టూ తిప్పుతూ ఉంటుంది. లావెటరీయే క్లాస్రూమ్. స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు ఉన్నంత మాత్రాన మనిషిని అక్షరాస్యుడిగా నమ్మమని జబర్దస్తీ చేస్తే కష్టం. యుద్ధం చేసే పాలకుడు, బాంబు తయారు చేసే సైంటిస్టు, రోగి శవం మీద పేలాలు ఏరుకునే వైద్యుడు, కల్తీ చేసి జనం అనారోగ్యం మీద భూములు కొనే వ్యాపారస్తుడు, అన్యాయానికి వత్తాసు పలికే న్యాయవాది, పేదవాడిపై జులుం చేసే పోలీసు, సాటివాడికి సాయం చేయని శ్రీమంతుడు, ఇంట్లో బుక్‌షెల్ఫ్ లేని టీచర్, వంద కోట్లు మంచం కింద దాచే అధికారి... వీరిని అక్షరాస్యులని అనడం దైవ అక్షరమాలకు ద్రోహం చేయడం. గొప్ప సాహిత్యం, సంస్కృతి, కళలు విరాజిల్లి అవి జాతిగా మారి, ఆ జాతి నుంచి మానవీయ సమాజం ఏర్పడినప్పుడు, కళ్లెదుట సిగ్గుతో చితికిపోయే స్థాయిలో ఉన్న హెచ్చుతగ్గులు నశించిపోయినప్పుడు, ప్రకృతీ మనిషీ సమాన వాటాదారులై మనగలిగి నప్పుడు, పౌరుడూ ప్రభుత్వమూ జ్ఞానశీలాలతో వర్ధిల్లినప్పుడు, కల్లాకపటం ఎరుగని గ్రామీణుడి మల్లె... కొండ మనిషి మల్లె ప్రతి మనిషి మారినప్పుడు... మన పిల్లలకు మన సమాజాన్ని చూíపి ‘నేను గర్వపడుతున్నాను’ అని చెప్పగలిగినపుడు నిజమైన అక్షరాస్యత వచ్చినట్టు. సెప్టెంబర్ 8... అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం. మన సరైన చదువును మొదలెడదామా? -
పాలకుల కామెడీ... ప్రజల కంటతడి!
‘‘ఏదో తెలియని ఓ యుద్ధం తరిమేసిన శరణార్థులు వీరు’’. ‘అభివృద్ధి’ ప్రాజెక్టుల కోసం నిర్వాసితులయ్యే ప్రజలను గురించి ప్రముఖ రచయిత్రి–సామాజిక కార్యకర్త అరుంధతీ రాయ్ చేసిన వ్యాఖ్యానమిది. యుద్ధం ఏనాటికైనా ముగిసి పోతుంది. మళ్లీ ఏదో ఒకనాడు తమ ఇంటికీ, తమ ఊరికీ వెళ్లిపోవచ్చుననే ఆశ యుద్ధ శరణార్థుల్లో లేశమాత్రంగానైనా ఉంటుంది. టెర్రరిజం తరిమేసిన కశ్మీరీ పండిట్లు ముప్ఫయేళ్ల తర్వాత ఇప్పుడు తమ సొంత ప్రాంతానికి వెళ్లిపోతామంటూ చెబుతున్న మాటల్ని కూడా వింటున్నాము. అభివృద్ధి ప్రాజెక్టుల నిర్వాసితులకు మాత్రం ఇటువంటి ఆశ ఉండే అవకాశమే లేదు. ‘అభివృద్ధి’ కోసం నిర్వాసితులయ్యే ప్రజలు కోల్పోయేది కేవలం తలదాచుకునే కొంపనో, చారెడు చెలకనో మాత్రమే కాదు. వారు తమ జీవన విధానాన్నే కోల్పోతారు. కనుక, వారి జీవితాన్ని పునర్నిర్మించి ఇవ్వాలనే వాదన అంతర్జాతీయంగా చాలా బలంగా ఉన్నది. ప్రాజెక్టుల కోసం అప్పులిచ్చే ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, ఐఎంఎఫ్ వంటి సంస్థలు కూడా ఇటువంటి భావనకు అనుగుణంగానే పునరావాస పథకాలను రూపొందించాలని షరతులు పెడుతున్నాయి. ఐక్యరాజ్యసమితి నిర్వాసితుల విషయాన్ని మానవ హక్కుల సమస్యగా పరిగణిస్తున్నది.పల్లెలో మన ఇల్లంటే కేవలం నాలుగు గోడలే కాదు. తర తరాలుగా ఆ ఇంటితో పెనవేసుకున్న బంధం. కష్టసుఖాల కలబోత జ్ఞాపకాలు. సాగు నేలపై గుండెల్లో దాచుకున్న మమకారం. ఆ నేల మీద తాతలు–తండ్రులు తర్పణ చేసిన ఘర్మజలం. ఊరుమ్మడి బతుకుల్లో చిగురించిన తోడు–నీడలు, కలిసి చేసుకున్న పండుగలూ పబ్బాలు, ఊరి బడి, గుట్టమీది గుడి, చెట్టూ–పుట్టలతో కుదిరిన చిన్ననాటి స్నేహం, ఉపాధి– ఉద్యోగం... వీటన్నింటినీ నిర్వాసితులు కోల్పోతారు. అభివృద్ధి అనే ఎజెండాను అమలు చేయడం కోసం జీవితాలను త్యాగం చేస్తున్న ప్రజలకు తిరిగి అటువంటి సంపూర్ణ జీవనాన్ని పొందే హక్కు ఉన్నదని అప్పులిచ్చే అంతర్జాతీయ సంస్థలు కూడా చెబుతున్నాయి. అయితే సమాజ విస్తృత ప్రయోజనాల కోసం ప్రాజెక్టులు తప్పనిసరి కనుక, వాటిని డిజైన్ చేసేటప్పుడే నిర్వాసితుల సమస్య ఉత్పన్నం కాకుండా ఆలోచించాలనీ, కుదరకపోతే వారి పునరావాస పథకానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనేది ప్రపంచవ్యాప్తంగా నేడు అంగీకారయోగ్యమైన అంశంగా మారింది.మొన్నటి సోమవారం నాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక భావోద్వేగపూరిత రసాభినివేశాన్ని రక్తి కట్టించడానికి చాలా ప్రయాసపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టు జంట సొరంగాల నుంచి నల్లమలసాగర్ ఫీడర్ ఛానల్‌కు కృష్ణా నీటిని విడుదల చేస్తూ ఆ జలాలకు సాష్టాంగ ప్రణామాన్ని ఆచరించారు. ముప్ఫయ్యేళ్ల కింద ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది తానేనని, ఇప్పుడు పూర్తి చేసింది కూడా తానేనని ఆయన ప్రకటించుకున్నారు. 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు సుమారు నెల రోజుల ముందు (బహుశా మార్చిలో) కమ్యూ నిస్టు పార్టీల ఆందోళన కారణంగా శంకుస్థాపన రాయిని చంద్రబాబు వేశారు. ఎన్నికలు ముగిసిన కొద్ది కాలానికే కనిగిరిలో జరిగిన ఒక సభలో వెలిగొండ ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాదని కూడా చంద్రబాబు ప్రకటించిన వైనాన్ని అదే కమ్యూనిస్టు నేతలు ఎత్తి చూపుతున్నారు. దాదాపుగా అదే కాలంలో యర్రగొండపాలెం సభలో వ్యవసాయం దండగ అంటూ చంద్రబాబు చేసిన ప్రకట నను అప్పట్లో ఆ సభను కవర్ చేసిన సీనియర్ పాత్రికేయులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. వ్యవసాయం దండగ అనే మానసిక ధోరణితో పాటు వెలిగొండ ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాదనే అభిప్రాయం బాబులో బలంగా ఉన్నందువల్లనే, ఆ తర్వాత ఎనిమిదేళ్లు అధికారంలో కొనసాగినా వెలిగొండపై ఒక్క అడుగూ ముందుకేయకుండా చాపచుట్టేశారు.వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించడానికి కంకణం కట్టుకున్న రాజశేఖరరెడ్డే వెలిగొండ ప్రాజెక్టు ఆచరణ సాధ్యమేనని నిరూపించడానికి సంకల్పం చెప్పుకున్నారు. ఒక్క సొరంగాన్ని తవ్వితే ప్రాజెక్టు ద్వారా ఆశించిన ప్రయోజనం నెర వేరదని భావించి జంట సొరంగాలను ఆయన డిజైన్ చేశారు. రెండు సొరంగాలు కలిపి మొత్తం నిడివి 37 కిలోమీటర్లు. ఇందులో ఇరవై కిలోమీటర్లకు పైగా వైఎస్సార్ జమానాలోనే పూర్తయింది. ఈ ముప్ఫయేళ్లలో పదిహేనేళ్లకు పైగా ముఖ్య మంత్రిగా ఉన్న చంద్రబాబు కాలంలో సొరంగ మార్గం ఏడు కిలోమీటర్లు మాత్రమే సాగింది. ఆ తర్వాత ఐదేళ్లు సీఎంగా ఉన్న జగన్ హయాంలో పది కిలోమీటర్లకు పైగా సాగి సొరంగ మార్గం పూర్తయింది. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జంట సొరంగాలు ప్రధానమైన భాగం. ఈ ప్రధాన భాగాన్ని పూర్తి చేసినందుకు గుర్తుగా జగన్మోహన్ రెడ్డి అక్కడొక పైలాన్‌ను ఆవిష్కరించారు.పైలాన్ వేసినందుకు జగన్‌ను ఎద్దేవా చేస్తున్న ముఖ్యమంత్రి ఈ 27 నెలల కాలంలో ఏం ఘనకార్యం చేశారని వెలిగొండను పూర్తి చేశాననే ఖ్యాతిని తగిలించుకుంటున్నారు! ఇతరులు చేసిన పనిని తన ఖాతాలో వేసుకునే క్రెడిట్ చోరీ తాపత్రయంగా ఈ వ్యవహారాన్ని పరిగణించవలసి వస్తున్నది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ముఖ్యమైన పనులన్నీ అంతకుముందే పూర్తయ్యాయి. రిజర్వాయర్ సిద్ధంగా ఉన్నది. జంట సొరంగాల నుంచి నల్లమల సాగర్‌కు నీటిని తరలించే ఫీడర్ చానల్ పూర్తయింది. సాగర్ దిగువన నీటిని తరలించే మూడు ప్రధాన కాలువలు కూడా ఎప్పుడో సిద్ధమయ్యాయి. ఇక ఈ కాల్వల నుంచి పంటపొలాలకు నీటిని తరలించే డిస్ట్రిబ్యూట రీల తవ్వకం మాత్రం ఇంకా మిగిలి ఉన్నది. అన్నిటికంటే అతి ముఖ్యమైన పునరావాస పథకం కింద జగన్ హయాంలోనే మెరుగైన ప్యాకేజీ సిద్ధమైంది.అంతకుముందు నిర్ణయించిన నష్టపరిహారాన్ని భారీగా పెంచుతూ జగన్ సర్కార్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 11 గ్రామాల్లో 7,318 కుటుంబాలను నిర్వాసితులుగా గుర్తించి అందులో 96 కుటుంబాలకు పునరావాసాన్ని కూడా పూర్తి చేశారు. మిగిలిన 7,222 కుటుంబాల కోసం 1,301 కోట్ల రూపా యలను విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అదే సమయంలో పునరావాసం కోసం ఏర్పాటైన కాలనీల్లో రోడ్లు, విద్యుత్ లైన్లు వంటి మౌలిక వసతులను కల్పించారు. ఈలోగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ పునరావాస కార్యక్రమాలను అట కెక్కించి 26 నెలలు కాలయాపన చేసింది. సోమవారం నాడు వెలిగొండ భుజకీర్తులను చంద్రబాబు తగిలించుకోవడానికి సరిగ్గా వారం రోజుల ముందు అరకొర పరిహారంగా 760 కోట్లను ముట్టచెప్పి తక్షణమే వారంతా ఊళ్లు విడిచిపోవాలని బలవంతం చేశారు. ఖాకీసేనను రంగంలోకి దించారు. అనా రోగ్యంతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారిపైన కూడా కనికరం చూపలేదు.పునరావాస కాలనీల్లో కనీసం ఒక చిన్న గూడు వేసుకునే అవకాశాన్ని కూడా నిర్వాసితులకు ఇవ్వలేదు. ప్రభుత్వం స్వయంగా ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. కొంతమంది మార్కాపురం, దాని పరిసర ప్రాంతాల పరిచయస్తుల పంచన తాత్కాలిక సర్దుబాటు చేసుకున్నారు. ఎక్కువ మంది మాత్రం ఎక్కడికి వెళ్లాలో తెలియక కాలనీల్లో తమకు కేటాయించిన ప్లాట్ల దగ్గర సామాన్లు పెట్టుకొని, గొడ్డూగోదాను అక్కడే కట్టేసుకొని వర్షం పడితే దేవుడే దిక్కనుకుంటూ మూడు నాలుగు రోజులు పడిగాపులు పడ్డారు. వేలాది బతుకులు నడివీధిన పడిన ఇంతటి మానవతా సంక్షోభంలో సర్కార్ వైపు నుంచి పట్టించు కున్న నాథుడే లేడు. యుద్ధ శరణార్థులు కూడా ఇంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొని ఉండరు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పంచిన నష్టపరిహారం సొమ్మును నిర్వాసితులు ఎంతకాలం నిలబెట్టుకో గలరు? ఈమధ్య కాలంలో పద్దెనిమిదేళ్లు దాటిన వారిని, పెళ్లిళ్లు చేసుకొని ఏర్పడిన కొత్త కుటుంబాలను పరిగణనలోకి తీసు కోకుండా అదనంగా ఇంకో రెండు లక్షలిస్తామనే వాగ్దానం మాత్రం చేశారు. అసలు పరిహారానికే ఎసరుపెట్టిన సర్కార్ ఈ కొసరు వేస్తుందన్న నమ్మకం నిర్వాసితుల్లో ఏమాత్రం కనిపించడం లేదు. ఆగమేఘాలమీద నిర్వాసితుల్ని తరిమేసి ప్రభుత్వం సాధించదలుచుకున్నదేమిటో తెలుసా?... క్రెడిట్ చోరీ! రైతులకు ఇప్పు డప్పుడే నీళ్లిచ్చే అవకాశమే లేదు. ఎప్పుడో పూర్తయిన కాల్వలకు అవసరమైన మరమ్మతులు చేయకుండా, అసలు డిస్ట్రిబ్యూట రీలే తవ్వకుండా పంట చేలకు నీళ్లెట్లా ఇస్తారు? ప్రాజెక్టు తొలి దశకు నీళ్లివ్వడానికి ఎంతలేదన్నా ఏడాదికి పైగా పడుతుందని విశ్వసనీయ సమాచారం. ఈలోగా రిజర్వాయర్‌లోకి ఒకటో రెండో టీఎమ్సీల నీళ్లను వదిలి ఫొటోలు తీసి వెలిగొండ వెలుగులివిగో అంటూ ప్రచారం చేసుకుంటారు. ఈ నకిలీ క్రెడిట్ కోసం వేలాది కుటుంబాలను నిర్దయంగా వీధిపాల్జేశారు. మానవీయ విలు వల్ని ఉక్కుపాదాలతో నలిపేశారు. పోలవరం ప్రాజెక్టు నుంచి ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసినట్టు రాష్ట్ర సర్కార్ మరో నాటకాన్ని రక్తి కట్టించింది. పోల వరం ప్రాజెక్టు పూర్తయిందని ఇప్పుడు యావదాంధ్ర జనులు నమ్మాలన్నమాట. పోలవరం ప్రాజెక్టుకు దిగువన ఇప్పటికే ఉన్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా వైఎస్సార్ తవ్వించిన ఎడమ కాల్వలోకి 3,500 క్యూసెక్కుల ప్రవాహాన్ని ఎత్తిపోశారు. ఇదే పోలవరం నెత్తిన చల్లుకోండని సెలవిస్తున్నారు. పాయక రావుపేటలో కూడా చంద్రబాబు గోదావరి జలాలకు సాష్టాంగ ప్రణామాన్ని ఆచరించారు. అక్కడక్కడా కొన్ని అక్విడెక్టులు, బ్రిడ్జీలను నిర్మించడం మినహా ఎడమ కాల్వ పనుల్ని ఈ సర్కార్ ముందుకు తీసుకొని పోయిందేమీలేదు. లక్షలాది ఎకరాలకు సాగునీటితోపాటు విశాఖ నగరం మంచినీటి అవసరాలనూ, పారిశ్రామిక అవసరాలనూ ఎడమకాల్వ తీర్చవలసి ఉన్నది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా దీనిపైనే అధారపడి ఉన్నది. భారీ గంగాళంలో చెంబెడు నీళ్లుపోసి ఉత్తరాంధ్ర ప్రజలను పండుగ చేసుకొమ్మని సెలవిస్తున్నారు. పాయకరావుపేట దాకా కాల్వ సమీపంలోని జలాశయాలకు నీటిని తరలించడానికి అవసరమైన పాసేజ్‌లు కూడా సిద్ధంగా లేవని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రకమైన నాటక్ బాజీ సర్కార్ చర్యలను విదూషకత్వమనాలో, క్రూరత్వం అనాలో అర్థం కావడం లేదు. వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ప్రమాద ఘంటికలు
ఎంతసేపూ అభివృద్ధి, లాభార్జన, ఆర్థికప్రగతి గురించి మాత్రమే హోరెత్తే ప్రపంచంలో వాతావరణం ఎలావుందో, అది మున్ముందు ఎలా పరిణమిస్తుందో హెచ్చరించే సంస్థలు కూడా ఉన్నాయి. పరుగులు ఆపి సరిచూసుకోనట్టయితే ఈ భూగోళమే పెను ప్రమాదంలో పడుతుందని ఆ సంస్థలు మరోసారి హెచ్చరించాయి. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ), ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్ఈపీ)లు ఒకరోజు తేడాలో తమ నివేదికలు విడుదల చేశాయి. ‘అత్యంత బలమైన’ ఎల్‌నినో విరుచుకుపడటం, అది వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ కొనసాగటం తథ్యమని డబ్ల్యూఎంఓ చెబుతోంది. అందువల్ల ఉష్ణోగ్రతల్లో తీవ్ర మార్పులు చోటుచేసుకోవటంతోపాటు వర్షాభావ పరిస్థితులు ఏర్పడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆ సంస్థ వివరించింది. ఈ దశాబ్దం చివరినాటికి ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని యూఎన్ఈపీసంస్థ హెచ్చరించింది. ప్రభుత్వాల విధానాలు ఇప్పుడున్న విధంగానే కొనసాగితే2100 నాటికి ఉష్ణోగ్రతలు 2.6 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతుందని అది జోస్యం చెప్పింది. కానీ పారిస్ ఒప్పందంలో పూచీపడిన విధంగా ప్రభుత్వాలు కర్బన ఉద్గారాలు తగ్గించుకుంటే అది 1.8 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితమయ్యే అవకాశం లేకపోలేదని వివరించింది. ఈ రెండు సంస్థలూ చెప్పాయని కాదు... రాబోయే రోజులెలా ఉండబోతు న్నాయో ప్రస్తుత పరిస్థితులే చెబుతున్నాయి. ఇటీవల నేపాల్‌లో వచ్చిన మెరుపు వరదల వల్ల దాదాపు 1,300 మంది చనిపోగా, అనేకులు ఆచూకీ లేకుండా పోయారు. ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. కనీవినీ ఎరుగని విధ్వంసం చోటుచేసుకుంది. పర్యావరణ పరిరక్షణతో సమస్త జీవుల మనుగడ ముడిపడివుందని ప్రపంచంగ్రహించి దాదాపు అరవయ్యేళ్లవుతోంది. కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వంటి పాలకుల పుణ్యమా అని ఇప్పటికీ వివాదాస్పద అంశంగానే ఉంటోంది. పర్యావరణ ధ్వంసం అమెరికా అభివృద్ధి గిట్టనివారి సృష్టి అని ఆయన అభిప్రాయం. తమ ప్రయోజనాలకు విఘాతం కల్గిస్తుందంటూ ఏకంగా పారిస్ ఒప్పందం నుంచి నిష్క్రమించారు. విషాదమేమంటే ఆ ఒప్పందంలో కొనసాగుతూ కూడా, దాని లక్ష్యాలను విస్మరిస్తున్న దేశాలున్నాయి.అభివృద్ధి పేరిట ఇష్టానుసారం ప్రాజెక్టులకు అనుమతు లీయటంవల్ల పర్యావరణం దెబ్బతింటోందని, కాలుష్యం పెరుగుతున్నదని పర్యావరణ ఉద్యమకారులు వాదిస్తుంటే... మరి అభివృద్ధి మాటేమిటన్నది ప్రభుత్వాల ప్రశ్న. పారిశ్రామిక విప్లవంకంటే ముందునాటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే 2030 నాటికి సగటు ఉష్ణోగ్రత పెరుగుదల కనీసం 1.5 డిగ్రీల సెల్సియస్ లోపులో ఉంచాలని, ఎట్టిపరిస్థితు ల్లోనూ అది 2 డిగ్రీలు దాటరాదని పారిస్ ఒప్పందం నిర్దేశించింది. ఇందుకోసం గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను 42 శాతం మేర తగ్గించాలి. కానీ ప్రపంచవ్యాప్తంగా దేశాలు పాటిస్తున్న విధానాలేవీ దానికి అనుగుణంగా లేవు. అందువల్లే ధ్రువప్రాంతాల్లో వేగంగా మంచు కరగడం, సముద్ర మట్టాలు పెరగడం, పెను తుపానులు, కరువుకాటకాలు, అత్యధిక ఉష్ణోగ్రతలు సర్వసాధారణమయ్యాయి. చారిత్రకంగా చూస్తే 1850 నుంచి ఇంతవరకూ 25 శాతం ఉద్గారాలతో అమెరికా ప్రథమ స్థానంలో ఉంటే దాదాపు 22 శాతం వాటాతో యూరప్ దేశాలు, దాదాపు 7 శాతంతో రష్యా ఉన్నాయి. కానీ ఏటా వెలువరించే కర్బన ఉద్గారాల్లో చైనా ఇప్పుడు అగ్రభాగాన ఉంది. తలసరి ఉద్గారాల్లో ఇప్పటికీ మనం ప్రపంచ సగటుకన్నా తక్కువగానే ఉన్నాం. పునరుత్పాదక ఇంధన రంగానికి మారడానికి అవసరమైన సాంకేతికతలనుపొందాలంటే భారీ మొత్తంలో నిధులు అవసరమవుతాయన్న అంచనా ఉంది. అయితే అభివృద్ధి చెందిన దేశాలు ఈ సాంకేతికతల్ని చవగ్గా అందిస్తే మనం మాత్రమే కాదు... చాలా దేశాలు వీటిని పొందగలుగుతాయి. నిరుడు బ్రెజిల్‌లోని బెలెమ్‌లో జరిగిన కాప్–30 సదస్సులో కొత్త సాంకేతికతల కోసం 2035 నాటికి 31,000 కోట్ల డాలర్లు అవసరమవుతాయని అంచనా వేశారు. భూగోళమే ప్రమాదంలో పడిందని సమితిసంస్థలు రెండూ చెబుతున్న నేపథ్యంలోనైనా సంపన్న దేశాలు లాభార్జన దృష్టి విడనాడాలి. లేకుంటే మూకుమ్మడిగా అందరం మునిగే ప్రమాదం ఉంటుందన్న స్పృహ తెచ్చుకోవాలి. -
మూడో దశకూ మారని ‘సర్’
ఎవరెన్ని అభ్యంతరాలు చెప్పినా... మీడియా సాక్షిగా ఎలాంటి అవకతవకలు బయట పడుతున్నా ‘స్వచ్ఛమైన’ ఓటర్ల జాబితా రూపకల్పన పేరిట ఎన్నికల సంఘం(ఈసీ) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియలో మూడో దశ పూర్తయింది. ఈసారి 16 రాష్ట్రాలూ, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 36.73 కోట్లమంది ఓటర్ల జాబితా లను జల్లెడబట్టి 6 కోట్లమందిని తొలగించినట్టు ఈసీ ప్రకటించింది. ఈ ప్రక్రియకు తొలి దశలో వచ్చినంత వ్యతిరేకత మలి దశలో లేదు. న్యాయస్థానాలు ఏవో కొన్ని ఆదేశాలీయటం మినహా ప్రక్రియను ఆపింది లేదు. మొదటి రెండు దశలతో పోలిస్తే మూడో దశ పెద్దగా అభ్యంతరాలు లేకుండానే పూర్తయినట్టు లెక్క. మొత్తంగా ఈ మూడు దశల్లోనూ 13 కోట్లమంది గల్లంతయ్యారు. దానర్థం వీరంతా అసలే లేకుండా పోయారని కాదు. జాబితాలో లేనివారు అభ్యంతరాలు చెబితే... ఈసీ అడిగిన పత్రాలు సమర్పించు కుంటే మళ్లీ చోటు దక్కించుకునే చాన్స్ ఉండొచ్చు. కానీ ఆ పత్రాల కోసం దూర ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే ఓపిక ఉండాలి.అందుకు కావలసిన తీరిక, సహనం ఉండాలి. ఖర్చు పెట్టగలిగే స్థోమత ఉండాలి. వారం, పదిరోజులు పనికి వెళ్లకున్నా కుటుంబం గడుస్తుందన్న భరోసా ఉండాలి. ఇంత చేసినా వచ్చే ఎన్నికల్లో ఓటేసే యోగం దక్కుతుందని అనుకుంటే అమాయకత్వమే. బెంగాల్లో ఒక అక్షరం ఇటూ అటూ అయినా జాబితాల్లో చోటుదక్కని వారు లక్షల్లో ఉన్నారు. ‘తార్కిక వ్యత్యాసాల’ పేరిట జాబితాల నుంచి వీరందరినీ వెళ్లగొట్టగా, 38 లక్షలమంది 19 ట్రిబ్యునళ్ల ముందు అప్పీల్ చేసుకున్నారు. ఇందులో కేవలం 82,000 మందికి ఊరట దొరికింది. పరిష్కరించిన అప్పీళ్లలో 90 శాతం మందికి తిరిగి చోటు దక్కింది. కానీ ఏం ప్రయోజనం... రాబోయే ఎన్నికల్లో తప్ప వీరు ఓటేయలేరు. వేలాది కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పు తీసుకుని ఎగ్గొట్టే వారిపై దయ చూపి ‘హెయిర్ కట్’ పేరిట మాఫీ చేస్తారు. ఓటర్ల జాబితాలకు ఈసీ చేసే ఈ ‘హెయిర్ కట్’ నిరుపేదలతో నిర్దయగా వ్యవహరిస్తుంది. వారిని కష్టాలపాలు చేస్తుంది.బిహార్‌లో ‘సర్’పై విచారణ సందర్భంగా ‘విపక్షాలు హడావుడి చేస్తున్నాయి... మరి స్వల్ప సంఖ్యలో మాత్రమే అభ్యంతరాలు ఎందుకొస్తున్నా’యని ధర్మాసనం ప్రశ్నించింది. సహేతుకమైన సందేహమే. కారణాలనేకం. తమ ఓటరు కార్డు కేవలం ఎన్నికల సమయంలోనే అక్కరకొస్తుందని అనేకులు అనుకుంటారు. పోలింగ్ రోజున వెళ్లినప్పుడు మాత్రమే ఓటు గల్లంతయిందని తెలుస్తుంది. ఇదంతా మన పాలకుల నిర్వాకం. అవిద్య రాజ్యమేలేచోట ఏ ప్రచారమూ జనానికి పూర్తిగా చేరదు. ‘నిజాయితీగల’ ఓటర్లమేనని నిరూపించుకునే భారం ప్రజలకు వదిలితే ఎక్కడైనా జరిగేది ఇదే! చిన్న చిన్న లోపాలు మినహా అంతా సవ్యంగా చేశామని ఈసీ స్వోత్కర్షలకు పోతోంది. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది వేరు. ఇందుకు ఒక ఆంగ్ల దినపత్రికలో జార్ఖండ్ గురించి వచ్చిన కథనమే తార్కాణం. అక్కడ గొడ్డా జిల్లాలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా జాబితా ప్రకటించాక ఫలానా వారి పేర్లు తొలగించాలంటూ బీజేపీ ఏజెంట్లు ఫామ్–7 పత్రాలు సమర్పించినట్టు ఆ పత్రిక వెల్లడించింది. ఒక కేంద్రంలో ఇలాంటివి 25 దాఖలయ్యాయి. వారిలో ఒకే ఒక్కరు మూణ్ణెల్లక్రితం మరోచోట కూలీ పని కోసం వెళ్లారు. మరోచోట ఒక బీజేపీ ఎమ్మెల్యే 75 ఫామ్‌లు సమర్పించారు. చిత్రమేమంటే... అవన్నీ మైనారిటీల ఓట్లు. వాటిలో అత్యధికం 2003 జాబితాతో మ్యాపింగ్ అయ్యాయి. ఇక వేరే జిల్లాల్లో ఏం జరిగిందో... అసలు ‘కొత్తగా చేరుతున్న’ వారెవరో తెలియదు. ఓటు లేకపోవటం మరణంతో సమానమని అనేకులు నమ్ముతారు. బీఎల్ఓ వెళ్లినప్పుడు ఇంట్లో లేనంత మాత్రాన ఓటరే ఉనికిలో లేడన్న నిర్ణయానికి రావటం క్రూరం. ఎందుకంటే ఈసారి ఓటు పోవటమంటే సంక్షేమ పథకాలు ఆగిపోవటం,ముందూ మునుపూ పౌరసత్వం కూడా మాయం కావటం. కొన్ని ప్రభుత్వాలు సంక్షేమా నికి ఓటర్ల జాబితా గీటురాయి కాబోదని హామీ ఇస్తున్నాయి గానీ... అది దయాధర్మ బిక్షంగా మారటం సాధారణ పౌరుణ్ణి అవమానించటం. రేపన్న రోజున అలాంటి వారందరికీ పథకాలు ఆపేయాల్సిందేనంటూ ఆదేశాలు జారీ కాబోవని చెప్పలేం. ఆ మాటెలా వున్నా ఓటరును పోలింగ్ కేంద్రం వైపు రాకుండా ఇంత చక్కని మార్గం ‘కనిపెట్టిన’ ఈసీని అభినందించి తీరాలి! -
అమెరికా ఘోర తప్పిదం
గత నెల రోజులుగా ప్రశాంతంగా వున్న పశ్చిమాసియాలో మళ్లీ చిచ్చురేగింది. తాజాగా అమెరికా మొదలెట్టిన క్షిపణి దాడులు, ఇరాన్ సాగిస్తున్న ప్రతిదాడులతో అది భగ్గున మండుతోంది. దక్షిణ ఇరాన్‌లోని సిరిక్ ప్రాంతంలో పెళ్లి వేడుకలు జరుగుతున్న ఇంటిపై అమెరికా క్షిపణి పడి అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. వేరేచోట జరిగిన దాడిలో నలుగురు ఇరాన్ రెవల్యూషనరీ గార్డులు చనిపోయారు. ఈ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్, జోర్డాన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. ఇజ్రాయెల్‌తో కలిసి అకారణంగా తానే ప్రారంభించిన ఈ యుద్ధంలో అమెరికా సర్వభ్రష్టమైంది. దీన్నుంచి బయటపడటానికి చేసిన యత్నాలన్నీ విఫలంకాగా... ప్రపంచ దేశాలతో ఇరాన్ ఆర్థిక లావాదేవీలన్నిటినీ ‘కనీవినీ ఎరుగని రీతిలో’ దెబ్బతీసే ఆర్థిక దిగ్బంధం ప్రారంభించామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించి వారం రోజులవుతుండగా తాజా దాడులు మొదలయ్యాయి. రోజులు మారాయని, తన ఆధిపత్య విధానాలకు కాలం చెల్లిందని అమెరికా గ్రహించుకోలేక ఈ నిరర్థక యుద్ధానికి తెరలేపింది. ఇది సోవియెట్‌తో పోటీపడుతూ ఆధిక్యత సాధించటానికి ప్రయత్నించిన ’60ల, ’70ల కాలం కాదు. సోవియెట్ పతనం తర్వాత కొన్నాళ్లపాటు సాగిన ఏకధ్రువ ప్రపంచం కూడా కాదు. కనీసం ట్రంప్ తొలి ఏలుబడినాటి పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు. ఇరాన్ ఆర్థిక దిగ్బంధం గురించి గత నెల 25న ట్రంప్ ప్రకటన చేసిన వెనువెంటనే చైనా, ఖతార్‌లు ఈ చట్టవిరుద్ధ, ఏకపక్ష ఆంక్షల్ని గుర్తించదల్చుకోలేదని చెప్పడాన్ని బట్టే వర్తమాన పరిస్థితులేమిటో అర్థమవుతాయి. ఉక్రెయిన్ యుద్ధంలో పీకల్లోతు మునిగిన రష్యా కూడా ఈ ఆంక్షల్ని పాటించే స్థితిలో లేదు. అమెరికా ఆంక్షల వల్ల 2018లో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కొంతమేర దెబ్బతిన్న మాట వాస్తవమే. కానీ దాన్ని పూర్తిస్థాయిలో ధ్వంసం చేయటం, చమురు ఎగుమతుల్ని సంపూ ర్ణంగా నిలిపేయటం అమెరికాకు సాధ్యం కాలేదు. కనీసం అప్పుడున్న అంతర్జాతీయ, ప్రాంతీయ పరిస్థితులు ఏదోమేర ఆంక్షలు అమలుకు దోహదపడ్డాయి. అప్పట్లో సౌదీ, యూఏఈ, బహ్రైన్, ఈజిప్టులు ఖతార్‌తో సంబంధాలు తెంచుకున్నాయి. కువైట్, ఒమన్‌లు మాత్రం దానితోనే కలిసి నడిచాయి. కానీ 2021 తర్వాత ఈ పరిస్థితి మారింది. ఎడమొహం, పెడమొహంగా ఉండే సౌదీ, ఇరాన్‌లు సంబంధాలు పునరుద్ధరించు కున్నాయి. ప్రాంతీయంగా గల్ఫ్ దేశాలన్నిటిమధ్యా ఇప్పుడు అవగాహన కుదిరింది. నిరుడు సెప్టెంబర్ 9న దోహాపై ఇజ్రాయెల్ సాగించిన దాడి వీటి కళ్లు తెరిపించింది. ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్‌పై మొదలెట్టిన యుద్ధాన్ని గల్ఫ్ దేశాలు వ్యతిరేకించక పోవచ్చుగానీ... పాలస్తీనా ఏర్పాటుకు అనువైన రాజకీయ పరిష్కారం దొరికే వరకూ ఇజ్రాయెల్‌తో సాధారణ సంబంధాలు అసాధ్యమని సౌదీ స్పష్టంగా తేల్చిచెప్పింది. ఈలోగా ఆంక్షల్ని అధిగమించటానికి అంతర్జాతీయంగా ఇరాన్ ఇప్పటికే ఏర్పర్చుకున్న నెట్వర్క్ అమెరికా ఆటల్ని సాగనివ్వటంలేదు. తాజా పరిణామాలన్నీ గల్ఫ్ దేశాల కళ్లు తెరిపించాయి. అమెరికాకు స్వప్రయోజనాలు తప్ప తమ భద్రత గురించి పట్టదని వాటికి అర్థమైంది. సైనిక స్థావరాలకు అమెరికాను అనుమతించినప్పుడు గల్ఫ్ దేశాల ఆలోచన వేరు. ఆ స్థావరాలుంటే ఎవరూ తమవైపు కన్నెత్తిచూడబోరని అవి అమాయకంగా విశ్వసించాయి. కానీ తనపై దాడి జరిగినప్పుడల్లా ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడులతో ఆ స్థావరాల సంగతటుంచి, తమ మౌలిక సదుపాయాలు ధ్వంసమవుతున్నాయని గల్ఫ్ దేశాలు లబోదిబోమంటున్నాయి. ఈమధ్య మూడు సౌదీ కంపెనీలు షేర్ల జారీకి ప్రయత్నించి, తాజా దాడులతో ఆ ప్రతిపాదనను పక్కనబెట్టాయి. యూఏఈ శాఖను ప్రారంభించదల్చుకున్న ప్రముఖ సంస్థ విన్ రిసార్ట్స్ ఆ ఆలోచనకు స్వస్తి చెప్పింది. వివిధ ప్రభుత్వ విభాగాలకు ఖతార్ నిధులు కత్తిరించింది. ఎఫ్ 1 రేసులు, పలు సదస్సులు, వేలాదిమంది హాజరయ్యే దోహా ఫోరం, క్రిప్టో సదస్సు వంటివన్నీ ఆర్నెల్లుగా మూలనబడ్డాయి. రియల్ ఎస్టేట్ స్తంభించింది. వేలాదిమంది అమెరికన్లు వీటన్నిటా పెట్టుబడులు పెట్టి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తమ ఆర్థికవ్యవస్థల గురించి లేశమాత్రమైనా ఆలోచించకుండా ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు గల్ఫ్ దేశాలను కలవరపరుస్తోంది. అందుకే ఇప్పటికైనా ట్రంప్ తన పోకడలకు స్వస్తిచెప్పాలి. -
విస్తరణ చాలదు... బలపడాలి!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడుతో అన్ని దేశాలూ కొత్త కొత్త దారులు వెదుక్కుంటున్నాయి. ఉన్న కూటములు విస్తరిస్తున్నాయి. సైనిక సహకార ఒప్పందాలు పుట్టుకొస్తున్నాయి. మంగళవారం ముగిసిన రెండు రోజుల షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశాలు దీన్నే నిరూపించాయి. 2001లో అయిదు సభ్యదేశాలతో మొదలైన ఆ సంస్థ 2017లో మనదేశంతోపాటు పాకిస్తాన్‌ను కూడా చేర్చుకోగా... 2023లో ఇరాన్, ఆ మరుసటి ఏడాది బెలారస్ కూడా సంస్థలోకి ప్రవేశించాయి. ఈసారి తుర్కియే, అజర్బైజాన్, ఆర్మేనియా, మంగోలియా, లావోస్, టోగో, నేపాల్, మాల్దీవులు, బహ్రెయిన్, శ్రీలంక తదితర 14 దేశాలు ‘సంభాషణ భాగస్వాములు’గా ఇందులో పాలుపంచుకున్నాయి. ఎస్సీఓ పాతికేళ్ల ప్రస్థానాన్ని జాగ్రత్తగా గమనిస్తే అది క్రమేపీ రష్యా పరిధినుంచి చైనా పరిధిలోకి జారుకుంటున్నదన్న అభిప్రాయం కలుగుతుంది. ఇప్పటికైతే మధ్య ఆసియాలోని పూర్వపు సోవియెట్ ప్రాంతాలైన కజఖ్‌స్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్కుమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్లు భద్రత, సంస్కృతి, సంస్థాగత, వ్యూహాత్మక అంశాల్లో ఇంకా రష్యాకు సాన్నిహిత్యంగానే ఉన్నాయి. అది కొనసాగుతుంది కూడా. కానీ మరోపక్క ఈ దేశాల్లో చైనా ఆర్థిక ప్రాబల్యం పెరుగుతోంది. అది ఈసారి సమావేశాల్లో బాహాటంగానే కనబడింది. చైనాను పశ్చిమాసియా, యూరప్, పశ్చిమాసియాలతో అనుసంధానించే బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్(బీఆర్ఐ) బృహత్తర ప్రాజెక్టు ద్వారా వచ్చే రోడ్లు, రైల్వేలు, పైప్లైన్లు, పోర్టులు వగైరాలు తమ ప్రాంత ఆర్థిక చిత్రాన్ని సమూలంగా మార్చేస్తాయని ఆ దేశాలు భావిస్తున్నాయి. చైనా వీటికి ఆయుధ సామగ్రి విక్రయాన్ని కూడా మొదలెట్టింది. అసలే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉండే రష్యా ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగి మరింత నష్టపోయింది. ఈ దశలో చైనాతో భాగస్వామ్యం కలిసొస్తుందని పూర్వపు సోవియెట్ దేశాలు భావించటంలో వింతేమీ లేదు. ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో ఈ విషయంలో చైనాతో విభేదించే ఓపిక, తీరిక రష్యాకు లేవు. అందుకే ఈ పరిణామాలను మౌనంగా వీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో మన దేశం కూడా ఆచితూచి అడుగేయటం అవసరం. ప్రధాని నరేంద్ర మోదీ సెక్యూరిటీ (భద్రత), కనెక్టివిటీ (అనుసంధానం), ఆపర్చ్యునిటీ (అవకాశం) అనే మూడుస్తంభాలుగా ఎస్సీఓ దేశాలమధ్య సహకారం పటిష్టపడాలనీ... అది కొలవగలిగే ఫలితాల సాధన దిశగా ఉండాలనీ సదస్సులో పిలుపునివ్వటం గమనించదగింది. చైనా మాదిరే ఆ సంస్థ ఛత్రఛాయలో మనం కూడా ఎదగటానికి, ఆర్థికంగా విస్తరించటానికి మరింతగా ప్రయత్నించాల్సి వుంది. ఇందుకు అవరోధాలు తక్కువేం లేవు. సంస్థలోని రెండు సభ్య దేశాలు రష్యా, ఇరాన్ యుద్ధాల్లో కూరుకుపోయాయి. వాటితో ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలపై అమెరికా ఆంక్షల కత్తి వేలాడుతోంది. భారత్, పాకిస్తాన్ మధ్య వైరం అలాగే ఉంది. అమెరికా ఒత్తిళ్ల కారణంగా ఇరాన్ నుంచి మన దేశం చమురు కొనుగోళ్లను గణనీయంగా తగ్గించుకుంది. ఏడేళ్ల తర్వాత ఇటీవలే ముడి చమురు దిగుమతి చేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో రాగల కాలంలో ఆ దేశంతో మరిన్ని రంగాలకు వాణిజ్యాన్ని విస్తరించదల్చుకున్నట్టు మోదీ చెప్పారు. ఇరాన్‌పై మహా ఆర్థిక దిగ్బంధనాన్ని అమలు చేస్తామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో ఇది కీలక వాగ్దానం. భిన్న ప్రయోజనాలున్న, వివిధ రాజకీయ వ్యవస్థలున్న దేశాలమధ్య అర్థవంతమైన సహకారం విస్తరించటం అంత సులభమేమీ కాదు. ఈ పాతికేళ్లలో గణనీయంగా పెరిగిన ఎస్సీఓ... ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనాలన్న చైనా ప్రతిపాదనకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నా, ఆచరణలో అదేమీ అమలుకావటం లేదు. మన దేశంలో ఉగ్రవాద దాడుల వెనక తన హస్తం లేదని దబాయించటంతోపాటు తమ దగ్గర జరిగే అలాంటి దాడుల్లో భారత్ ప్రమేయం ఉందని పాకిస్తాన్ ఎదురు ఆరోపిస్తోంది. ఇలాంటి డ్రామాలు కట్టిపెట్టి సభ్యదేశాలు చిత్తశుద్ధితో వ్యవహరించినప్పుడే ఏ సంస్థలైనా లక్ష్యసాధనలో విజయం సాధిస్తాయి. ఎస్సీఓ విస్తరణ మంచిదే... దాని మాటెలావున్నా ఆ సంస్థ బలపడాలంటే పెడ ధోరణులను అరికట్టడం తప్పనిసరి. -
మెటాకు మరమ్మత్తు!
సామాజిక మాధ్యమ టెక్ కంపెనీల్లో అగ్రభాగాన వున్న మెటా సంస్థ తనపై న్యాయ స్థానంలో దాఖలైన కేసుల్లో రాజీకొచ్చి 1,800 కోట్ల డాలర్లు చెల్లించటానికి అంగీకరించటం కీలకమైన పరిణామం. దీంతో గత నెల 18న ఓక్లాండ్ న్యాయస్థానంలో మొదలైన విచారణ అసంపూర్ణంగా నిలిచి పోయినట్టయింది. అదే జరిగుంటే మెటా చీఫ్ మార్క్ జూకర్బర్గ్ కోర్టు బోనెక్కి ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు పిల్లలకూ, టీనేజర్లకూ హాని కలిగించే విధానాలను అవలంబిస్తున్నట్టు వచ్చిన ఆరోపణలపై సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చేది. న్యాయవాదులు ఒక్కో ఉదంతమే వివరించి, ఆ సంస్థలు పసిమనసుల్ని ఎంత కలుషితం చేశాయో సోదాహరణంగా వివరిస్తూ, నిలదీస్తుంటే ఆయనకు ముచ్చెమటలు పట్టేవి. అమెరికాలోని 48 రాష్ట్రాలు, కొలంబియా జిల్లా, మరో మూడు ప్రాంతాలూ ఈ వ్యాజ్యాలను దాఖలు చేశాయి. ఇంతవరకూ వచ్చిన తీర్పుల్ని చూస్తే కోర్టు వెలుపల కుదిరిన ఈ రాజీ ఒప్పందం పర్యవసానంగా మెటా చెల్లించవలసిన మొత్తం చాలా పెద్దగానే కనబడుతుంది. భద్రత విషయంలో పక్కదోవపట్టించిన కేసులో న్యూమెక్సికో న్యాయస్థానం ఆదేశించిన 37.5 కోట్ల డాలర్ల పరిహారమే ఇంత వరకూ అతి పెద్ద మొత్తం. అయితే దాదాపు లక్షన్నర కోట్ల డాలర్ల మార్కెట్ విలువగల మెటా సంస్థ నిరుటి వార్షికాదాయం 20,097 కోట్ల డాలర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఏటా ఈ ఆదాయం 24 శాతం వరకూ పెరుగుతోంది. ఇప్పుడు చెల్లించదల్చుకున్న మొత్తానికి కూడా బోలెడు మెలికలున్నాయి. వచ్చే పదేళ్లకాల వ్యవధిలో ఈ పరిహారం చెల్లిస్తుందట. ఈ వాయిదాలను 15 శాతం డిస్కౌంట్‌తో లెక్కిస్తే ప్రస్తుత విలువ ప్రకారం మెటా సంస్థపై పడే భారం 800 కోట్ల డాలర్లకన్నా తక్కువే ఉంటుందని ఒక ఆర్థిక రంగ నిపుణుడు లెక్కగట్టారు. అత్యధిక జరిమానాలు చెల్లించిన టాప్–20 కంపెనీల జాబితాలో కూడా మెటా ఉండకపోవచ్చన్నది ఆయన విశ్లేషణ. అన్నిటికన్నా వింతైన విషయం–మెటా చెల్లించాల్సిన పరిహారంలో 530 కోట్ల డాలర్ల మొత్తానికి ఉన్న మెలిక. తన ప్రత్యర్థి సంస్థలు టిక్‌టాక్, యూట్యూబ్‌లు సైతం తన మాదిరే టీనేజర్లు యాప్‌లో గడిపే సమయాన్ని పరిమితం చేసుకుంటేనే... అవి కూడా ఇంతే మొత్తాన్ని చెల్లిస్తేనే ఈ పరిహారం బాధ్యత నెరవేరుస్తానని చెప్పడం తోకే కుక్కను ఆడించిన చందంగా కనబడుతోంది.మెటా సంస్థ మాజీ ఉద్యోగులూ, విజిల్బ్లోయర్లూ దానిపై చేసిన ఆరోపణలు చిన్నవేమీ కాదు. వీరు న్యాయస్థానాల్లోనూ, పార్లమెంటరీ కమిటీల ఎదుటా ఎన్నో అంశాలు ఏకరువు పెట్టారు. తన ఉత్పత్తుల్ని సురక్షితంగా మార్చటానికి అంతర్గతంగా అవకాశాలున్నా... వినియోగదారులు అధిక సమయం గడిపేలా చూసేందుకే సంస్థ ప్రాధాన్యమిచ్చిందని చెప్పారు. లాభార్జనే ముఖ్యమనుకున్నదని వివరించారు. ఇన్స్టాగ్రామ్ వల్ల టీనేజ్ బాలికలు తమ శరీరాకృతిపై తీవ్ర ఆందోళన చెందటం, అనోరెక్సియా(ఆకలి చంపుకోవటం) అనే తీవ్ర మానసిక రుగ్మత బారిన పడటం, మానసిక ఒత్తిళ్లకు లోనుకావటం వంటివి సంభవిస్తున్నాయని అంతర్గత సర్వేల్లో బయటపడినా వెల్లడి కానీయలేదన్నది వారి ఆరోపణ. అలాగే 13 యేళ్లలోపు పిల్లల డేటాను వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండా సేకరించటమంటే... ఆన్లైన్ వేధింపులకూ, నేరగాళ్లు వలవేయటానికి తోడ్పడే వాతావరణంలోకి వారిని నెట్టడమేనని చెప్పారు. టీనేజర్లు ఏమేరకు హానికర విషయాల ప్రభావంలో పడ్డారన్న గణాంకాలను తగ్గించిచూపే ప్రయత్నాలు జరిగాయని సాక్ష్యాధారాలు సమర్పించారు. సంస్థ తీసుకునే భద్రతా చర్యలు అతి స్వల్పమని తెలిపారు. వీటిని ఎత్తిచూపిన సిబ్బందిపై వేధింపులకూ, బెదిరింపులకూ పాల్పడ్డారని కూడా చెప్పారు. ఇవన్నీ న్యాయస్థానంలో నిగ్గుదేలితే సామాజిక మాధ్యమాలు సక్రమంగా వ్యవహరించకతప్పని స్థితి ఏర్పడేది. అయితే ఈ రాజీ ఒప్పందం పిల్లల ఆన్లైన్ భద్రతకు సంబంధించి సరైన చట్టం ఏర్పడని మనలాంటి దేశాలకు నమూనాగా ఉపయోగపడుతుంది. తగిన కట్టుదిట్టాలతో మెరుగైన చట్టం రూపొందించటానికి పనికొస్తుంది. ఇప్పుడు మెటా విషయంలో కుదిరిన ఒప్పందం సామాజిక మాధ్యమాల చరిత్రలో తొలి అడుగే. కాలక్రమంలో ఇది మరింత పదునుదేరితే వాటి ఆగడాలకు కాస్తయినా అడ్డుకట్ట పడుతుంది. -
ప్రశ్న–జవాబు
భాషలోని వైచిత్రిని గమనించారా... బహుశా అన్ని భాషల్లోనూ అంతేనేమో! సృష్టితో మొదలుపెట్టి, భూమ్యాకాశాలూ, అందులో భాగమైన మానవజీవితం వరకూ– వందల కోట్ల సంవత్సరాల ఈ జగత్తు అస్తిత్వంలో లోతైన, సారవంతమైన మాటలు సాధారణంగా రెండు, మూడు అక్షరాల్లోనే ఉంటాయి! ఉదాహరణకు, కాలం, కర్మం, ధర్మం, అధర్మం, జ్ఞానం, అజ్ఞానం, సుఖం, దుఃఖం, చావు, పుట్టుక, తెలివి, ఎరుక వగైరా ఎన్నిటినైనా చెప్పుకోవచ్చు! అలాంటిదే ‘ప్రశ్న’ అనే మాట కూడా; విశ్వమూ, ప్రకృతీ; ఆపైన మనిషితో సహా జీవుల మనుగడ గురించిన ఆనుపానులు తెలుసుకునే ప్రయత్నానికి ‘ప్రశ్నే’ నాంది అయింది. ప్రశ్న ఎప్పుడైతే పుట్టిందో, అది విధిగా జవాబు వైపు పయనించి తీరుతుంది; చూశారా, మళ్ళీ ‘జవా’బనే మాట మూడక్షరాలే! మనిషి మేధస్సు వేసే తొలి అడుగు ప్రశ్నయితే, రెండో అడుగు జవాబు; ఆ రెండడుగులే కాలగతిలో లక్షల మైళ్ళకు విస్తరించే జ్ఞాన, విజ్ఞానయాత్రగా పరిణమించాయి! ఆ యాత్రనే కనుక ఒక ప్రవాహంగా ఊహించుకుంటే, ప్రశ్న–జవాబు అనేవి, అది ఒరుసుకుంటూ పారే రెండు తీరాలన్నమాట! మానవ చరిత్రలోకి వెడితే, సృష్టి గురించి, సృష్టికర్త గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస ప్రశ్నగా మారి భగవతి, లేదా భగవంతుడనే జవాబును సృష్టించింది; వారిని ఎలా కొలుచుకోవాలనే ప్రశ్న భక్తీ, మతమూ, మతపరమైన తంతులనే సమాధానాన్ని రాబట్టింది; అసలు తనెవరన్న ప్రశ్న అంతర్ముఖుల్ని చేసి ఏకంగా తత్వశాస్త్రమనే గొప్ప జవాబుకు దారితీసింది; ఆపైన, కనిపించే భౌతిక ప్రకృతి గురించిన అసంఖ్యాకమైన ప్రశ్నలు అనేకానేక శాస్త్రవిజ్ఞాన శాఖల రూపంలో సమాధానాలను ఆవిష్కరించాయి. యాపిల్ ఎందుకు కింద పడుతుంది; భూమికీ, ఆకాశానికీ ఉన్న సంబంధమేమిటి, గ్రహాలను సూర్యుడి చుట్టూ పరిభ్రమింపజేసే అదృశ్య శక్తి ఏమిటన్న ప్రశ్నలే– మూడు చలన సూత్రాలనూ, సార్వత్రిక గురుత్వాకర్షణ శక్తి సూత్రాన్నీ ప్రతిపాదించే దిశగా ఇజాక్ న్యూటన్ను పురిగొల్పాయి. ఆ తర్వాత, కాంతి గురించీ, గురుత్వాకర్షణ గురించీ తలెత్తిన ప్రశ్నలు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ను ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతమూ, సాధారణ సాపేక్ష సిద్ధాంత ప్రతిపాదనలవైపు ప్రోత్సహించాయి. క్రీస్తుపూర్వ కాలానికి వెడితే, ప్రశ్నించడాన్ని ఒక పద్ధతిగా అభివృద్ధి చేసిన వ్యక్తిగా గ్రీకు తత్వవేత్త సోక్రటీస్‌ను చెబుతారు. జనం మాట్లాడే మాటల్ని, వ్యక్తపరిచే అభిప్రాయా లను, అనుసరించే నమ్మకాలను ప్రయోగాల బల్ల మీద ఉంచి తర్కమూ, హేతువూ అనే పదునైన చిరుకత్తులతో నరికి వాటిలోని అసంబద్ధతను, అతార్కికతను, అహేతుకతను ఎత్తిచూపి, చివరికి ‘నాకు తెలిసిందల్లా, ఏమీ తెలియదని తెలియడం మాత్రమే’నని అవతలి వ్యక్తి చేత అనిపించడం ఆయన అనుసరించిన పద్ధతి. అది కూడా ఏకపక్షమైన ప్రసంగాలు, ప్రవచనాల ద్వారా కాదు; సంభాషణ ద్వారా! యువతలో ప్రశ్నించే ‘దుర్లక్షణా’న్ని ప్రోత్సహిస్తున్నాడన్న ఆరోపణతో విచారణను ఎదుర్కొన్నప్పుడు, మరణ శిక్షను తప్పించుకునే అవకాశం తనకున్నప్పటికీ, దానిని నిరాకరించి విషసేవనంతో తన ప్రాణాన్ని ధారపోసి, ప్రశ్నించే తత్వానికి ప్రాణం పోసిన ధీరోదాత్తుడాయన! ఇది జరిగి వేల ఏండ్లు దాటినా ఇప్పటికీ... ప్రశ్న–జవాబు అనే ఒడ్లను ఒరసుకుంటూ సాగించే వైజ్ఞానిక ప్రవాహయానానికి మానవాళి పూర్తిగా అలవాటుపడలేదు. పాఠ్యపుస్తకాలలో ముందే సిద్ధంచేసి అందించిన ప్రశ్న–జవాబులను బట్టీపట్టించి పరీక్షలలో రాయించి మార్కులు వేయడమే తప్ప; స్వయంగా ప్రశ్నలను ముందుకు తెచ్చుకుని జవాబులను అన్వేషించే జిజ్ఞాసతో కూడిన విద్యాభ్యాసాన్ని విద్యార్థులకు అలవరిచే వ్యవస్థ సంపూర్ణంగా పాదుకోలేదు. ప్రత్యేకించి మన విషయానికొస్తే, జ్ఞానాన్ని ప్రశ్నోత్తరాల రూపంలో అన్వేషించే అభ్యాసం మనకు ఉపనిషత్కాలంనుంచీ ఉండేది. క్రమంగా ఇక్కడ కూడా, ‘ప్రశ్నలు అడక్కు, చెప్పింది విను’ అన్న అనుశాసనం తరతమ భేదాలతో పాతుకుని కొనసాగుతూ వచ్చింది. ఇది విద్యారంగానికే పరిమితమైనదీ కాదు; ప్రజాజీవనంతో ముడిపడిన అన్ని రంగాలలోనూ కనిపిస్తుంది. పైగా పరిస్థితి పెనం మీంచి పొయిలో పడినట్టు, అసలు దేనినైనా ప్రశ్నించడాన్నే దేశద్రోహంగా పరిగణించి నోరునొక్కే ధోరణులూ ప్రబలుతున్నాయి. ప్రశ్నను రక్షిస్తే ప్రశ్న మనల్నీ, జ్ఞానాన్ని కూడా రక్షిస్తుంది. లేకపోతే ఎదురుగా అంతా అజ్ఞానమూ, అంధకారమే! -
అచ్చ కాంగ్రెస్‌లో పచ్చ మీడియా చిచ్చు
తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ ఎపిసోడ్ ముగిసినట్లేనా? ఇంకా సశేషంగానే ఉన్నాదా? ప్రస్తుత రాజకీయ పరిశీల కుల మెదడుకు మేత వేస్తున్న ప్రశ్న ఇది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై లోతైన అవగాహన ఉన్నవారు మాత్రం మరోరకంగా ఆలోచిస్తున్నారు. వాళ్లను తొలుస్తున్న ప్రశ్నావళి సురేఖ ఉదంతం కంటే విస్తృతమైనది. రాష్ట్ర కాంగ్రెస్‌లోగానీ, ఎమ్మెల్యేలు, మంత్రి వర్గ సహచరుల్లోకానీ నిజంగానే రేవంత్‌రెడ్డికి మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నాదా? ఆయన పాలనపై అధిష్టానం వైఖరి ఏమిటి? ప్రభుత్వ పనితీరు మీద ప్రజల్లో కనిపిస్తున్న పెదవి విరుపు ఎక్కడికి దారితీయనున్నది? అసలు తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతున్నది? ఇటువంటి ప్రశ్నలు తలెత్త డానికి సహేతుకమైన కారణాలే కనిపిస్తున్నాయి. కారణాలు న్నాయి కనుకనే యెల్లో మీడియా కలవరపాటుకు లోనవు తున్నది. ఆవేదన వెళ్లగక్కుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పార్టీ–ప్రభుత్వ వ్యవహారాల్లో పూర్తి స్వేచ్ఛనివ్వడం లేదని కాంగ్రెస్ అధిష్టానంపై యెల్లో మీడియా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నది. రేవంత్ నాయకత్వా నికి కంట్లో నలుసుగా వుండే నేతలను ఏరిపారేసి ఆయన్ను బలోపేతం చేయకుంటే కాంగ్రెస్ పార్టీకి పోగాలం దాపురిస్తుందని హెచ్చరించడానికి కూడా యెల్లో మీడియా వెనుకాడటం లేదు. తెలుగుదేశం పార్టీకి యెల్లో మీడియా అనుబంధ పరిశ్ర మగా పని చేస్తు్తన్నదని కొత్తగా చెప్పుకోనవసరం లేదు. కాంగ్రెస్ వ్యతిరేకతే పునాదిగా తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారన్నది నిజం. కేంద్రంలో రాజీవ్ సర్కార్‌ను గద్దెదించడం కోసం నేషనల్ ఫ్రంట్‌కు ఎన్టీఆర్ రూపశిల్పిగా మారిన సంగతి కూడా నిజం. అటువంటి తెలుగుదేశం పార్టీకి, దాని అనుబంధ యెల్లో మీడియాకు తెలంగాణ కాంగ్రెస్‌పై ఇంతటి అవ్యాజమైన వాత్సల్యం కుదరడానికి కారణమేమిటి? ఇది కూడా బ్రహ్మరహస్యమేమీ కాదు. తెలుగు ప్రజలంద రికీ తెలిసిన విషయమే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణపై పెత్తనం చేయాలనే కోరిక చంద్రబాబుకు చావ లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓట్ల కొనుగోలుకు ప్రయ త్నిస్తూ ఆడియో సాక్షిగా చంద్రబాబు, వీడియో సాక్షిగా అప్పటి ఆయన సహచరుడు రేవంత్‌రెడ్డి క్యాష్తో సహా దొరికిపోవడం, ఫలితంగా హైదరాబాద్‌ను వదిలేసి చంద్రబాబు పారిపోవడం తెలిసిన కథే. తామేదో రహస్యంగా దొంగతనం చేయబోతే అన్యాయంగా పట్టుకుని కేసీఆర్ అల్లరి పెట్టాడనే కోపం అప్ప ట్నుంచే చంద్రబాబుకూ, రేవంత్‌కూ ఉన్నది. చంద్రబాబుకు జలుబు చేస్తే ముక్కు చీదే అలవాటున్న యెల్లో మీడియా కూడా నాటినుంచే కేసీఆర్‌ను శత్రువుగా ప్రకటించుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు రాజశేఖరరెడ్డి చేతిలో ఓటమి పాలైన చంద్రబాబు, జగన్ రాజకీయ జీవితాన్ని మొగ్గలోనే తుంచేయడం కోసం పదిహేనేళ్ల కిందనే కాంగ్రెస్ అధిష్టానంతో స్నేహం నెరపడం ప్రారంభించారు. సిద్ధాంత రాద్దాంతాలు, విశ్వసనీయత వగైరాలతో తనకు ఏ రకమైన సంబంధం లేదని కొన్ని డజన్లసార్లు చంద్రబాబు నిరూపించుకున్నారు. అందువల్లనే ఎన్డీయేతో బహిరంగ స్నేహం, కాంగ్రె స్తో రహస్య ప్రేమ ఏకకాలంలో ఆయన నడపగలిగారు. ఆ స్నేహం ఉపకరించి వర్తమాన రాజకీయ పరిస్థితికి బాటలేసింది. ఎన్నికల సమయం నాటికి కూడా అత్యధిక ప్రజామోదం కలిగిన నేతగా కేసీఆర్ ఉన్నప్పటికీ బీఆర్ఎస్కు ఓటమి తప్పలేదు. కర్ణుడి చావుకు కారణాలు అనేకం. తవ్వుకోవడం అనవసరం.వ్యవహార దక్షత, ఎన్నికలకు అవసరమయ్యే వనరులను సమీకరించగలిగే సామర్థ్యం రేవంత్‌రెడ్డికి సహజంగానే ఉన్నా యని చెబుతారు. దానికోసం యెల్లో మీడియా, తెలుగుదేశం పార్టీల సంపూర్ణ మద్దతు ఉండనే ఉన్నది. బీజేపీ వ్యతిరేకత మొత్తం బీఆర్ఎస్ మీదనే కేంద్రీకృతమవడంతో అటువైపునుంచి కూడా రేవంత్ కాంగ్రెస్‌కు ఇబ్బంది లేకుండా పోయింది. అధికా రంలోకి వచ్చిన తర్వాత మొన్నటి అమెరికా పర్యటనను అడ్డు కోవడం మినహా ఇతరత్రా రేవంత్ సర్కార్‌ను బీజేపీ ఇబ్బంది పెట్టిన ఘటనలు లేకపోవడం ఆశ్చర్యమే. కాంగ్రెస్ పార్టీలో తనకో సొంత వర్గాన్ని తయారు చేసుకోవడం కోసం తెలుగు దేశం పార్టీ తెలంగాణా అవశేషాలను కాంగ్రెస్‌లోకి రేవంత్ బదిలీ చేయగలిగారు. ఇప్పుడీ అవశేష తెలుగుదేశం శ్రేణులకే పెత్తనం దక్కాలనే వాంఛ యెల్లో మీడియాలో కనిపిస్తున్నది. దశాబ్దాల చరిత్ర కలిగిన కొందరు కాంగ్రెస్ నాయకులను ఈ కారణాల వల్లనే యెల్లో మీడియా టార్గెట్ చేస్తున్నదనీ, వారిమీద నెగెటివ్ ముద్రలు వేస్తున్నదనే ఆరోపణలు కాంగ్రెస్ శ్రేణులనుంచి వినపడుతున్నాయి. కొండా సురేఖ వివాదం నలుగుతున్న సందర్భంగా ఒకరోజు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి వస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడున్న మీడియాతో మాట్లాడవలసి వచ్చింది. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియాపై పేరు పెట్టి మరీ ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీలో మీక్కావలసిన ఎవరినో బలోపేతం చేయడం కోసం నాలాంటి నిజాయితీపరు లైన నాయకుల మీద నిందలేస్తున్నారని ఆయన దుమ్మెత్తి పోశారు. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. వర్తమాన కాలంలోని సగటు రాజకీయ నాయకులకు భిన్నంగా జనసామాన్యంలో మంచి పేరున్న నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గత ఇరవయ్యేళ్లుగా తన తల్లి పేరుమీద ఏర్పాటు చేసిన ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏం వ్యాపారాలు చేస్తారో ఎక్కడ చేస్తారో తెలి యదు కానీ, నియోజకవర్గంలో మాత్రం కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు రాజగోపాలరెడ్డి వెనుకాడరని స్థానిక ప్రజలు చెబుతారు. సొంత అసెంబ్లీ నియోజకవర్గం మునుగోడులోనే కాకుండా భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలోని అన్ని నియోజక వర్గాల్లో కోమటిరెడ్డి సోదరులకు అనుచరగణం, పలుకుబడి ఉన్నాయని చెబుతారు. కాంగ్రెస్ పార్టీలో ఇమడలేని పరిస్థితి ఏర్పడినప్పుడు తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి మరీ రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారు. ఆ పార్టీతో భావసారూప్యత పొసగక తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఇటువంటి నేపథ్యం ఉన్న తనపై అవాకులు చవాకులు ప్రచారం చేస్తున్నదని మీడియాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని తప్పు పట్టగలమా? పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌పై కూడా ఆ మధ్యన ఒక టీవీ ఛానల్ ధారావాహిక దాడికి పాల్పడింది. ముఖ్యమంత్రికి సన్నిహితులైనవారు ఈ ఛానల్‌ను నడిపిస్తారని చెబుతారు. మహేష్‌గౌడ్ మూడున్నర దశాబ్దాల కిందనే ఎన్ఎస్యూఐ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. యూత్ కాంగ్రెస్ నాయకునిగా, సేవాదళ్ కార్యకర్తగా పని చేస్తూ ఏనాడూ కాంగ్రెస్ జెండాను భుజం మీదినుంచి కిందకు దింపలేదు. వందలాది ఎకరాల సాగుభూములున్న కుటుంబం నుంచి వచ్చిన మహేశ్‌గౌడ్‌కు ఏనాడూ అవినీతి మకిలి అంటింది కూడా లేదు. అటువంటి వ్యక్తిని అయోగ్యుడిగా చిత్రించడానికి సదరు టీవీ ఛానల్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే ఇవి. కొండా సురేఖ తాజా వివాదానికి ఆమె కుమార్తె సుష్మిత ముఖ్యమంత్రిపై చేసిన ఘాటు వ్యాఖ్యలే కారణమనే సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై సుష్మిత ఉపయోగించిన పరుష పదజాలాన్ని ఎవరూ హర్షించరు. ఆమె చేసిన వ్యాఖ్యలకు కారణమెవరు? వరంగల్ జిల్లా పరకాల నియోజక వర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో కూడా రేవూరి ప్రకాశ్‌రెడ్డి పోటీ చేస్తారని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ స్థానంపై ఎప్పటి నుంచో దృష్టి పెట్టిన సుష్మిత ఘాటుగా స్పందించారు. సుష్మిత సంగతి పక్కన పెడితే కాంగ్రెస్ కల్చర్‌లో అభ్యర్థులను ముందు గానే ముఖ్యమంత్రి నిర్ణయించే సంప్రదాయం ఉన్నదా? అంతే కాకుండా ఇంకో పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని కూడా రేవంత్‌రెడ్డి పలుమార్లు ప్రకటించారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ సీఎం స్థానం నిజంగా అంత బలంగా ఉన్నట్లయితే సురేఖ మీద చర్య తీసుకోవడానికి ఇంత తతంగం ఎందుకు? మొదట 20 మంది శాసనసభ్యులతో ప్రెస్ మీట్, సురేఖను తప్పించాలని క్రమశిక్షణ కమిటీ సిఫార్సు, దాన్ని హైకమాండ్‌కు పంపించడం, సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ రాకకోసం నిరీక్షణ... ఇదంతా అవస రమా? సీఎం తలుచుకుంటే ఏ మంత్రినైనా తప్పించే అధికారం రాజ్యాంగబద్ధంగానే ఉన్నది. ఆ అవకాశాన్ని వినియోగించు కోలేని అశక్తత ఎందుకొచ్చింది? గత ఎన్నికల సందర్భంగా రేవంత్‌ను ఫోకస్ చేయడం కోసం నల్లగొండ గద్దర్ నర్సన్న పాడిన ఒక పాట పాపులరయింది. ‘‘మూడు రంగుల జెండా పట్టి... సింగమోలే కదిలినాడు... మన రేవంతన్న’’ అని సాగు తుందా పాట. ఎక్కడ ముఖ్యమంత్రి సభ జరిగినా ఆ రికార్డు పెట్టడం రివాజు. గత కొంత కాలంగా గాంధీ భవన్లో జరిగే కార్యకర్తల సమావేశంలాంటి కార్యక్రమాల్లో ఆ పాట వినిపించ కూడదనే ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. పరకాల సంగతేమోగానీ కొండా సుష్మిత కాంగ్రెస్ పార్టీలోకి ఒక కొత్త పదబంధాన్ని తెచ్చారు. ‘అచ్చ కాంగ్రెస్–పచ్చ కాంగ్రెస్’ అనే మాటపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది. యెల్లో మీడియా ట్రాప్‌లో పడి ‘అచ్చ’ కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తూపోతే కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనుకోవడం భ్రమ. ఒక పక్కన ప్రభుత్వ పాలనపై జనసామాన్యంలో పేరుకొంటున్న తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని సమైక్యంగా నడిపించ డంపై దృష్టి పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో దారుణమైన పరాజ యాన్ని మూట కట్టుకోవలసి వస్తుందని గ్రహిస్తే మంచిది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ట్రంప్‌కు ఎదురుగాలి!
రెండో దఫా అధికార పీఠం అధిరోహించి కూడా రెండేళ్లు కావస్తున్నా అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్‌కు దౌత్యనీతి ఒంటబట్టలేదు. తాను నిర్దేశించినదాన్ని అంగీకరించటమే తప్ప మరోవిధంగా మాట్లాడే హక్కు, అధికారం ఏ దేశానికీ లేదని ఆయన ఇప్పటికీ నమ్ముతున్నారు. ఆయన దృష్టిలో కేవలం అదే దౌత్యం. భారత్ నుంచి కెనడా వరకూ... ఇరాన్ నుంచి వెనిజులా వరకూ ఆయనది ఇదే బాణీ. ట్రంప్‌ను నేరుగా ప్రతిఘటించే వారుండొచ్చు, పరోక్షంగా చెప్పిచూద్దామనుకునే వారుండొచ్చు... మార్గాలు వేరైనా ట్రంప్ షరతులకు తలొగ్గబోమని చెప్పడమే వీరందరి సారాంశం. చాన్నాళ్లుగా విసుగెత్తి ఉన్నారేమో... కెనడా ప్రధాని మార్క్ కెర్నీ చాలా కరకుగానే వ్యవహరించారు. ఒకదాని వెంబడి మరో గొంతెమ్మ కోర్కెతో చీకాకుపరుస్తున్న అమెరికా తీరును నిరసిస్తూ వాణిజ్య ఒప్పందంపై చర్చలు సాగిస్తున్న తమ ప్రతినిధి బృందాన్ని వెనక్కురావాలని ఆదేశించారు. ఒప్పందం దాదాపు ఖరారై సంతకాలు జరపడమే తరువాయి అనుకునే దశలో ఎదురైన ఈ ఊహించని పరిణామం అమెరికాను అయోమయంలోకి నెట్టింది. ఇలాంటి భంగపాట్లే ఇరాన్ దగ్గర ఎదురయ్యాయి. మన దేశంతో చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని అమెరికా అనేకమార్లు ప్రకటించింది. కానీ అదేమీ జరగలేదు. వెనిజులా అధ్యక్షుడు మదురోను ట్రంప్ తన సైన్య బలంతో ఈ ఏడాది మొదట్లో అపహరించి, అమెరికాలో ఆయనపై విచారణ తంతు సాగిస్తున్నారు. ఇకపై అది తమ భూభాగమని అమెరికా చెప్పడం ఆ దేశ ప్రజల్ని మాత్రమే కాదు... అత్యధిక దేశాలను ఆగ్రహోదగ్రుల్ని చేస్తోంది. ఇక ఇరాన్ సంగతి చెప్పనవసరం లేదు. యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపేశామని చెప్పటం నుంచి హార్మూజ్ తమదేనని ప్రకటించటం వరకూ ట్రంప్ ఎన్ని చేసినా ఇరాన్ నిబ్బరంగా ‘నీ లెక్కేమిట’న్నట్టే వ్యవహరిస్తోంది. మిత్ర దేశమైన దక్షిణ కొరియాదీ అదే వైఖరి. ఏటా 11 రోజులపాటు అమెరికా, దక్షిణ కొరియాలు ఉమ్మడి సైనిక విన్యాసాలు జరుపుతాయి. ఈసారి అయిదో రోజుకల్లా అమెరికా సైనికులు తట్టా బుట్టా సర్దుకుని తిరుగుముఖం పట్టారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్‌తో చెలిమి కోసం ట్రంప్ తహతహలాడటంపై ఆగ్రహించి దక్షిణ కొరియా ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు. ఈ విన్యాసాల ఉద్దేశం ఉత్తర కొరియాను భయపెట్టడం. తీరా ఆ దేశంతోనే అమెరికా చేతులు కలుపుతుంటే... ఈ విన్యాసాలకు అర్థమేమిటన్నది దక్షిణ కొరియా ప్రశ్న. వాస్తవానికి ఉత్తర కొరియా పూర్తి స్థాయి అణ్వస్త్ర దేశంగా మారింది. ఆ దేశం దగ్గర ‘చాలా శక్తిమంతమైన’ ఆయుధా లున్నాయని ట్రంపే కొద్దికాలం క్రితం ప్రకటించారు. దాన్ని మరిచి కొత్త చుట్టరికాలు కలుపుకుందామని ట్రంప్ ప్రయత్నించినంత మాత్రాన ఆ దేశం నమ్మే అవకాశమేమీ లేదు. ఇరాన్తోసహా అన్ని దేశాలతోనూ దౌత్యపరంగా వరస వైఫల్యాలు తప్పడం లేదు గనుక ఉత్తర కొరియాకు దగ్గరై అమెరికా జనాన్ని ఆశ్చర్యపరచాలని ట్రంప్ భావిస్తున్నట్టు కనబడుతోంది. కానీ వేరే దేశాలతో పెంచుకున్న వైరం వికటిస్తున్న విధంగానే ఉత్తర కొరియాతో చెలిమి సైతం బెడిసికొట్టే అవకాశం లేకపోలేదు. చివరకు ఉత్తర కొరియాఏం చేస్తుందన్నది అలావుంచితే... ఆసియా–పసిఫిక్ దేశాలన్నిటా ట్రంప్ అంతరంగంపై ఇప్పటికే ఉన్న సందేహాల్ని మరింతగా పెంచింది. ఈ దేశాలన్నీ చైనా దూకుడువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి సమయంలో తమకు అండగా నిలిచి, చైనాకు కళ్లెం వేయాల్సిన అమెరికా ఆడుతున్న వింతనాటకాలు వాటికి మింగుడుపడటం లేదు.అందుకే దక్షిణ కొరియా, జపాన్ ఇటీవల సాన్నిహిత్యమవుతున్నాయి. ఆ రెండింటిమధ్యా ఇబ్బందికర చరిత్రవున్నా ట్రంప్ వింత చేష్టలు వారిని సన్నిహితం చేశాయి. కెనడా ఉత్పత్తులపై 50 శాతం అదనపు సుంకాలు వేయాల్సివస్తుందని ట్రంప్ ప్రకటించగా, దానికి ప్రతిగా వచ్చే నెల 8 నుంచి అమెరికా ఉత్పత్తులపై 15 నుంచి 50 శాతం వరకూ సుంకాలు విధిస్తామని కెర్నీ ప్రకటించారు. అమెరికా అదనపు సుంకాల విలువ 2,000 కోట్ల డాలర్లయితే, కెనడా సుంకాలు 2,760 కోట్ల డాలర్లు. ఈ ప్రపంచం తనకు భయపడటం మాట అటుంచి... జాలి కూడా చూపబోదని ట్రంప్‌కు ఎంత త్వరగా తెలిస్తే అమెరికా ప్రజలకు అంత మేలు. -
ఈ విలయం ఎవరి పాపం?
హిమవత్పర్వత శ్రేణి రాళ్లూ రప్పల సమూహం కాదు... అది ప్రకృతి చెక్కిన ఒక అద్భుత దృశ్యకావ్యం. ఈ సౌందర్యం కాస్తా రెప్పపాటులో మృత్యుగీతం ఆలపిస్తుంది. జనావాసాలను క్షణంలో శ్మశాన వాటికలుగా మారుస్తుంది. బుధవారం నేపాల్–టిబెట్ సరిహద్దుల్లో అతి పెద్ద మంచుఖండం విరిగి భోటే కోశీ నదిలో పడటంతో మెరుపు వరదలు సంభవించి 350 మంది వరకూ మరణించారని అంటున్నారు. 30కిపైగా దేశాలకు చెందిన 1,300 మంది గల్లంతయ్యారు. వారిలో 290 మంది భారతీయులు. నది దిగువనవున్న అనేక జనావాసాలు, డజను జలవిద్యుత్ ప్రాజెక్టులు, వంతెనలు, రహదార్లు కొట్టుకు పోయాయి. హిమాలయాల్లో ఇలాంటి ఉదంతాలు రివాజుగా మారినా, ఈసారి ఉత్పాతం అతి పెద్దదని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఈ దారుణానికి కారణమేమిటో స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. రిక్టర్ స్కేల్‌పై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించటంవల్లే ఇలా జరిగిందని తొలుత వార్తలొచ్చాయి. అయితే దాన్ని నిర్ధారించే ఉపగ్రహ చిత్రాలేమీ లేకపోవటంతో తీవ్ర వాతావరణ స్థితిగతులవల్లే మంచుఖండం కరిగి విరిగిపడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరగటంవల్ల భూమి నానాటికీ వేడెక్కుతోంది. కాలుష్యకారక దేశాల్లో తొలి స్థానం అమెరికాది. అటు తర్వాత స్థానం చైనాది కాగా, మూడో స్థానం మనది. నాలుగో స్థానం యూరోప్ దేశాలది. కర్బన ఉద్గారాల విడుదలలో నేపాల్ స్థానం 95. అంటే ప్రపంచాన విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో ఒక శాతంలో పదో వంతు వాటా మాత్రమే నేపాల్‌ది. వాతావరణ మార్పుల తాకిడికి నష్టపోయే దేశాల్లో మాత్రం ఆ దేశానిది ఆరో స్థానం. అతి తక్కువ కాలుష్యానికి కారణమవుతూ అతి ఎక్కువ మూల్యం చెల్లిస్తున్న దేశంగా నేపాల్‌ను చెబుతారు. ఇప్పుడంటే సూపర్ ఎల్‌నినో వచ్చిపడిందిగానీ... గత దశాబ్దకాలంగా ప్రకృతి వైపరీత్యాలు వేధిస్తూనే ఉన్నాయి. వాటిని ముందుగా పసిగట్టే సాంకేతికతలు అనుకున్నంతగా అభివృద్ధి చెందకపోయినా, గతంతో పోలిస్తే ఎంతో మెరుగైన ఉపకరణాలు అమెరికా, చైనాలవద్ద ఉన్నాయి. తమ కారణంగా యేటా భారీ నష్టాన్ని చవిచూస్తున్న నేపాల్‌కు ఆ సాంకేతికతల్ని ఉచితంగా ఇచ్చి ఆదుకోవటం తమ నైతిక ధర్మమని అవి రెండూ అనుకోవు. ఫలితంగా చెప్పాపెట్టకుండా మెరుపు వరదలు విరుచుకుపడటం నేపాల్‌లో మామూలు విషయంగా మారింది. భోటే కోశి నది టిబెట్‌లో మొదలవుతుంది. కొడారి దగ్గర ఒక పాయ, రసువా దగ్గర మరో పాయ నేపాల్‌లోకి ప్రవేశిస్తాయి. నిరుడు సైతం ఆ నదికి ఇలాగే వరదలొచ్చాయి. గత నెల 8న రసువా దగ్గరొచ్చిన వరదల్లో 18 మంది చనిపోగా, అనేక జలవిద్యుత్ ప్రాజె క్టులు, వంతెనలు, విద్యుత్ పంపిణీ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. వర్షపాతం, వరదనీటి ప్రవాహాల గురించిన డేటా చైనా ఎప్పటికప్పుడు అందిస్తే ప్రాణనష్టాన్ని నివారించే వీలుంటుంది. దేశంలోకి వరద నీరు ప్రవేశించటం మొదలయ్యాకే పౌరుల్ని హెచ్చరించే స్థితి ఉండటం నేపాల్‌కి విషాదం మిగులుస్తోంది. కొన్నిసార్లు మంచుపలకలు విరిగి భోటే కోశి ప్రవాహ మార్గాన్ని కప్పేస్తాయి. అప్పుడు దిగువన నేపాల్‌లో నది నిండుకుంటుంది. దాన్నొక ముందస్తు హెచ్చరికగా తీసుకుంటారు. ఇలాంటి వైపరీత్యాలు జరిగినప్పుడు మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం తప్పదు. నిరుడు బేత్రావతి–రసువాగడి కారిడార్‌ను వరదలు ముంచెత్తి భారీ నష్టం జరిగింది.అతి కష్టంపై వాటన్నిటినీ పునర్నిర్మించారు. అవన్నీ తాజా వరదల్లో మళ్లీ కొట్టుకు పోయాయి. పదిపదిహేనేళ్ల డేటా అందుబాటులో ఉండి అధ్యయనం చేయగలిగితే నది నడత అంచనాకు, దానికి అనుగుణంగా కనిష్ఠ స్థాయి నష్టం మాత్రమే ఉండేలా నిర్మాణాలు చేపట్టడానికి కొంతవరకూ వీలవుతుంది. భారీ జననష్టం, ఆస్తినష్టం కలగజేసే వైపరీత్య సమాచారం సైతం సరిహద్దుల ఆవలే నిలిచిపోతే మానవాళి సాధించిన అభివృద్ధికి అర్థం ఉండదు. దానికన్నా ముందు సంపన్న దేశాలు తమ అభివృద్ధి నమూనాలను మార్చుకోవాలి. వైపరీత్యం వచ్చిపడ్డాక సాయం చేయటానికి ముందుకు రావటం మెచ్చదగిందే అయినా, దాని నివారణకు తమ వంతు చేయాల్సిందేమిటో అవి గుర్తెరగాలి. బాధ్యతారహిత ప్రవర్తన ఏదో ఒకరోజు తమను కూడా ధ్వంసించగలదని తెలుసుకోవాలి. -
వికసిత్ భారత్ సాధ్యమేనా!
మన చదువులు వర్తమాన అవసరాలకు తగినట్టు ఉండటం లేదని చాన్నాళ్లుగా నిపుణులు ఘోషిస్తున్నారు. చివరకు చదువయ్యాక అందించే నైపుణ్యాలు కూడా ఎందుకూ కొరగావటంలేదని తాజాగా నీతి ఆయోగ్ నివేదిక చెప్పడం ఆందోళన కలిగించే అంశం. దాని ప్రకారం ఉన్నత విద్యావంతుల్లో కేవలం 8.25 శాతం మందికి మాత్రమే విద్యార్హతకు తగిన ఉద్యోగం లభిస్తోంది. 2014–15 నుంచి ఇంతవరకూ రూ. 34,000 కోట్లు వెచ్చించి 7.67 కోట్లమందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణనిచ్చినా ఫలితం అంతంతమాత్రమేనని నివేదిక చెబుతోంది. 15–29 యేళ్ల మధ్యవయస్కులైన 8.7 కోట్లమందైతే చదువు, పని, శిక్షణల్లో అన్నింటికీ దూరంగా ఉండిపోయారంటున్నది.వీరు నిరుపేద వర్గాలవారు. మొన్న మార్చిలో విడుదలైన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ (పీఎల్ఎఫ్) సర్వే ప్రకారం యువతలో వీరు 25 శాతం. నైపుణ్యాభివృద్ధి గురించి మాట్లాడటం మొదలై రెండు దశాబ్దాలు దాటుతున్నా, ఆ కోర్సులపై తమకు స్పష్టత లేదని 40 శాతంపైగా యువత చెప్పారని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. ఇంత సమాచార లోపం ఉన్నప్పుడు ఎన్ని పథకాలు పెట్టి ఏం ప్రయోజనం?ప్రపంచ దేశాల్లో యువజనం అధికంగా గల దేశాల్లో భారత్ ఒకటి. మన జనాభాలో 65 శాతంమంది 35 యేళ్ల లోపువారు. సక్రమంగా వినియోగించుకోగలిగితే వీరు దేశానికి అపురూపమైన సంపద. ప్రపంచంలో చాలా దేశాలు వృద్ధ జనాభా ఎక్కువై దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. కానీ మనకు దండిగా యువత ఉన్నా వారికి ఉపాధి కల్పనలో విఫల మవుతున్నాం. ఏటా సమర్పించే వార్షిక బడ్జెట్లో గణాంకాలు ఘనంగా కనబడతాయి. కేటాయింపులు కళ్లు చెదిరేలా ఉంటాయి. కానీ ఫలితాలు చూస్తే ఇలా బావురుమంటాయి. ఉండాల్సినంత లేకున్నా ఉన్నత విద్యాసంస్థల విస్తరణ గతంతో పోలిస్తే పెరిగింది. ఈ సంస్థలు యేటా లక్షలాదిమంది పట్టభద్రుల్ని తయారుచేస్తున్నాయి. కానీ అభ్యసన ఫలితాలు గమనిస్తే అవి అంతంతమాత్రమనీ, ఉపాధి సామర్థ్య లోపాలు అపారమనీ నీతి ఆయోగ్ నివేదిక ఒకటి లోగడే చెప్పింది. చదువులో సమాన అవకాశాలు లేకపోవడం ఒక సమస్య అయితే... ఉత్పాదక ఉద్యోగాల కొరత ఏర్పడటం మరో సమస్య. ఈ సమస్యలపై లోతైన అధ్యయనం చేసి, సకాలంలో తగిన పరిష్కారాలు వెదకనట్టయితే అపురూప సంపదగా ఉండాల్సిన మన యువశక్తి కాస్తా ఆర్థిక, సామాజిక ఒత్తిళ్లకు మూలకారణమయ్యే ప్రమాదం ఉంటుంది. ఇన్ని లక్షలమంది ఉన్నత విద్యకెదిగారని అనుకోవటంవల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. వారికుండాల్సిన మౌలిక అభ్యసనాలు, నైపుణ్యాలు, ఉత్పాదకతకు తోడ్పడే ఉపాధి, నిరంతర నైపుణ్యాభివృద్ధి ఉంటేనే మానవ వనరుల్ని మనం సక్రమంగా వినియోగించుకుంటున్నట్టు లెక్క. మన నిరుద్యోగిత 2017–18లో 18 శాతం ఉంటే 2022–23 నాటికి అది 10 శాతానికి తగ్గిందని, నిలకడగా అక్కడే ఉందని గణాంకాలు చెబుతున్నాయి. వీరంతా 15–29 యేళ్ల మధ్యవయస్కులు. కానీ పట్టభద్రులు, అంతకు మించి చదివిన 25 యేళ్ల లోపువారిలో నిరుద్యోగిత 1983 నాటికి 35 శాతమైతే, 2023 కల్లా అది 39 శాతమైంది. అసలు నిరుద్యోగిత రేటు లెక్కగట్టే తీరే లోపభూయిష్టమైనది. ఉపాధి కోరుతున్నవారిలో లభించనివారి శాతమెంతో అది వెల్లడిస్తుంది. అధికారిక సర్వేల్లో నిరుద్యోగులుగా ఉన్న ప్రతి ఒక్కరూ నమోదు చేసుకుంటారనుకోవటానికి లేదు. ఇక మహిళల్ని సర్వేలు సరిగా పరిగణనలోకి తీసుకోవటంలో విఫలమవుతున్నాయని తరచు ఆరోపణలొస్తుంటాయి. వారిని కూడా లెక్కేస్తే ఈ నిరుద్యోగ పటాలం అనూహ్యంగా ఉంటుంది. ఏ ఉద్యమాలు గాల్లోంచి పుట్టుకురావు. దేశాన్ని ఓ కుదుపు కుదిపిన జెన్ జీ ఉద్యమం కేవలం నీట్ ప్రశ్నపత్రాల లీకువల్లే వచ్చిందనుకోవటానికి వీల్లేదు. అది తక్షణ ప్రేరణ అయితే కావొచ్చుగానీ... చదువుకు తగిన ఉపాధి లభించకపోవటం, అసలు చదువులే ప్రామాణికంగా లేకపోవటం మన యువతను నిరాశానిస్పృహల్లో ముంచెత్తు తున్నది. వర్తమాన అవసరాలకు తగిన పాఠ్యాంశాలుండటం, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను అలవర్చటం అవసరం. అలాగే డబ్బుకొద్దీ ప్రామాణిక విద్య అనే ధోరణి మారాలి. నీతి ఆయోగ్ నివేదికైనా ప్రభుత్వాల కళ్లు తెరిపించాలి. విధానాలు సరిచేసుకోవాలి. -
కాక్రోచ్‌లపై దండయాత్రలా!
దేశ రాజధానిలోని జంతర్‌మంతర్‌లో జెన్ జీ సాగించిన ఉద్యమం తర్వాత బీజేపీ, ఆరెస్సెస్‌లతోపాటు రాజకీయ పక్షాలన్నీ మేల్కొన్నాయి. ఆ తరానికి చేరువకావటానికి... దాని ఆశలేమిటో, ఆకాంక్షలేమిటో తెలుసుకోవటానికి ప్రయత్నించటం మొదలెట్టాయి. ఇవన్నీ ఆశావహమైన మార్పులకు సంకేతంగా అందరూ భావించారు. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఈ ఉద్యమాన్ని పాఠశాలలకు సైతం విస్తరించాలని సంకల్పించి, ‘స్కూల్ ఠీక్ కరో’ పేరిట వివిధ రాష్ట్రాల్లో బడుల స్థితిగతులు బయటపెట్టేందుకు నడుం కట్టింది. కానీ చాలాచోట్ల దానికెదురవుతున్న ఆటంకాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. రాజస్థాన్‌లో జైపూర్ సమీపంలోని రాంపురా కన్వర్పురా గ్రామంలో పట్టుమని పదిమంది కూడా లేని సీజేపీ బృందంపై గ్రామస్థులమని చెప్పుకున్నవారు రాళ్లతో దాడిచేశారు. ఒకరి చేయి విరగ్గొట్టారు. మహిళల్ని కూడా మినహాయించలేదు. వాహనాలు ధ్వంసం చేశారు. గొడ్లపాకలో నడుస్తున్న ఈ బడి గురించి ఒక చానెల్లో వచ్చిన కథనంతో జెన్ జీ ఆ గ్రామానికి వెళ్లింది. కొన్ని రోజుల క్రితం పశ్చిమ బెంగాల్లోనూ ఇంతే. ఒక పాఠశాల వీడియో తీసేందుకు అనుమతి కోరిన సీజేపీ కార్యకర్త ఇంటిపై గుంపు దాడిచేసి అతన్ని కొట్టబోగా, అడ్డొచ్చిన అతని తండ్రి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో బడి పిల్లల్ని రెచ్చగొడుతున్నారంటూ పలు జిల్లాల్లో అనేకమందిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. శిథిలావస్థలో ఉన్న బడుల్ని చూపించిన యూట్యూబర్లపై కేసులు పెట్టారు. బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లోనూ సీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి.ఈ పాలకులకు ఏమైంది? బడి బాగులేదంటే, ఉపాధ్యాయుల కొరత ఉందంటే, బడుగుల పిల్లలకు నాసిరకం చదువులే దక్కుతున్నాయంటే వీరెందుకు ఉలిక్కిపడు తున్నారు? బయటి ప్రపంచానికి తెలియకూడదని ఎందుకంత ఆత్రం? నిజానికి జంతర్ మంతర్ ఆందోళన ముగియటానికి కొంచెం అటూ ఇటూగా జెన్ ఆల్ఫా పిల్లలు రోడ్డెక్కారు.లక్నో శివారులో ఒక బడినుంచి వెల్లువలా బయటికొచ్చిన ఆడపిల్లలు రహదారిని దిగ్బంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. పిల్లలు ఏకరువుపెట్టిన సమస్యలు, వారి భావోద్వేగాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. జిల్లా కలెక్టర్ వచ్చి హామీ ఇస్తే తప్ప ఆందోళన విరమించలేదు. ఆ వెంటనే నలుగురు కొత్త టీచర్లొచ్చారు. ఈమధ్య జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిందేమిటి? రాష్ట్రాల్లో పాలకులు చేస్తున్నదేమిటి? ‘ఒక రోజు, ఒక యూనివర్సిటీ’ కార్యక్రమం చేపట్టాలని కేంద్రమంత్రులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు, పనితీరు స్థానిక ప్రతినిధులద్వారా తరచు తెలుసుకోవాలని కోరారు. అదే పని సీజేపీ చేస్తే తప్పేమిటి? సమస్యలేమిటో, పిల్లలు పడుతున్న బాధలేమిటో బయటి ప్రపంచానికి చెప్పడంకాక, వారివల్ల ఇంకేం జరుగుతుందని ప్రభుత్వాలు వణుకుతున్నాయి? స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలవుతున్నా ఒకే ఒక్క గదితో, అయిదు తరగతులకు ఒకే టీచర్‌తో కొన్ని బడులు నడుస్తున్నాయంటే వింతకాదా? దేశంలో ఏకంగా 29 లక్షలమంది పిల్లలు చదువుకునే బడులు ఏకోపాధ్యాయ పాఠశాలలు! బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే కాదు... ఇతరచోట్ల సైతం ఇలాంటి దుఃస్థితే.ఆంధ్రప్రదేశ్‌లో 2019–24 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎవరూ కోరకుండానే రూ. 11,700 కోట్లతో ‘మన బడి: నాడు–నేడు’ కార్యక్రమం కింద వేలాది పాఠశాలలకు సౌకర్యవంతమైన భవంతులు నిర్మించింది. కార్పొరేట్లను తలదన్నే సదుపాయాలు కల్పించింది. 38,059 బడుల రూపురేఖల్ని మార్చింది. మరిన్ని పాఠశాలలకు విస్తరించాల్సివున్న తరుణంలో... కూటమి ప్రభుత్వం వచ్చి కొత్త నిర్మాణాల సంగతలావుంచి, మెరుగుపడిన బడుల్ని కాస్తా నాశనం చేసిపెట్టింది. అందుకే సీఎంలంతా తమ నిర్వాకాన్ని సమీక్షించుకుని దిద్దుబాటుకు సిద్ధపడాలి. లక్ష్య నిర్దేశం చేసుకుని బడుల్ని బాగుచేస్తామని హామీ ఇవ్వాలి. అధికారం ఉందికదా అని పోలీసులతో, రౌడీలతో బెదరగొడదామనుకుంటే ఆ చర్యలు వికటిస్తాయి. మూర్ఖత్వాన్ని వదులుకుని సావధానంగా ఆలోచించటం... రేపటి పౌరుల శ్రేయస్సుకోసం సరైన నిర్ణయాలు తీసుకోవటం అవసరమని గుర్తించాలి. -
బలిపీఠాలవుతున్న ఆస్పత్రులు
రోగికి హాని చేయకుండా ఉండటమే ఆస్పత్రికి ఉండాల్సిన మౌలిక లక్షణమని ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు ఆద్యురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్ ఒక సందర్భంలో చెప్పారు. దురదృష్టవశాత్తూ ఈ లక్షణాన్ని అలవర్చుకోవటంలో మన ఆస్పత్రులు విఫలమవు తున్నాయి. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్న తేడా ఏం లేదు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా ఆసుపత్రిలో సోమవారం వేకువజామున నవజాత శిశు సంరక్షణ యూనిట్లో వెంటిలేటర్ పేలి ముగ్గురు నవజాత శిశువులు చనిపోయారు. ఒకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మూడు విభాగాలుగా ఉన్న ఆ యూనిట్లో 39 మంది నవజాత శిశువులుండగా మిగిలినవారిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. తరచిచూస్తే అసలు ఇలాంటి ఉదంతాలను ప్రమాదాలనవచ్చా అనే సందేహం తలెత్తుతుంది. నెలలు నిండకముందే పుట్టి సరిపడా బరువులేని పిల్లలూ, తీవ్ర అస్వస్థత పాలైన పిల్లలూ ఈ యూనిట్లో ఉంటారు. ఇలాంటివారిని కంటికి రెప్పలా చూసుకోవా ల్సిన ఆసుపత్రిలో వెంటిలేటర్ పేలిందంటే అర్థమేమిటి? అక్కడ రోజువారీ తనిఖీలు సక్రమంగా లేవని, కనీసం నిప్పును ఆర్పే యంత్రాలు కూడా మొక్కుబడిగా మిగిలాయని ఈ ఉదంతం జరిగేవరకూ ఎవరికీ తెలియలేదు. ఫలితంగా ఆ యూనిట్ మొత్తం తగలబడిపోయింది. అందరూ గాఢనిద్రలో మునిగివుండే వేళ పెద్ద చప్పుడుతో వెంటి లేటర్ పేలి, నిప్పు రాజుకున్నప్పుడు ఆ నవజాత శిశువుల తల్లులు మేల్కొని కేకలు పెట్టడంతో సెక్యూరిటీ సిబ్బంది సహా అందరూ వచ్చారు. కానీ తక్షణం మంటల్ని అదుపులోకి తీసుకురాలేని నిస్సహాయస్థితిలో ఎంతమంది ఉండి ఏం ప్రయోజనం? ఇటువంటి సందర్భాల్లో మంటలు వ్యాపించటం కాస్తయినా ఆలస్యమవుతుందిగానీ... వెనువెంటనే దట్టంగా పొగలు అలుముకుంటాయి. ఏం జరుగుతున్నదో, ఎవరెక్క డున్నారో తెలియని అయోమయం ఏర్పడుతుంది. కొందరైనా ప్రాణాలకు తెగించి వెళ్లకపోతే ప్రమాద తీవ్రత మరింత పెరుగుతుంది. వెంటిలేటర్ పనితీరు ఎప్పటికప్పుడు గమనించుకుంటే అది అసాధారణంగా వేడెక్కుతున్నదని సులభంగానే తెలుస్తుంది. విద్యుత్ వైర్ల లోపాన్ని పసిగట్టడానికి, దానంతటదే విద్యుత్ నిలిచిపోవటానికి అవసరమైన సాంకేతికతలు అందుబాటులోనే ఉన్నా ఇలాంటి విషాదం జరిగిందంటే ఎవరిని నిందించాలి?మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఈ ఉదంతంలో బాధ్యుల్ని గుర్తించి చర్యలు తీసుకుంటామంటున్నారు. మంచిదే. కారణాలు దర్యాప్తులో బయటపడతాయి. ఎవరినో బాధ్యులుగా గుర్తిస్తారు. మరి నిత్యమూ పర్యవేక్షించాల్సిన వ్యవస్థల నైతిక బాధ్యత మాటేమిటి? మనకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం ఉంది. నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్బీసీ) ఉంది. ప్రత్యేకించి ఆస్పత్రులకు సంబంధించి అయితే బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణకు నిబంధనలున్నాయి. ఎన్బీసీ ప్రకారం స్థానిక అగ్నిమాపక విభాగం నిశితంగా పరిశీలించి నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) ఇవ్వాలి. ముఖ్యంగా ఐసీయూలాంటి ప్రమాదాలు పొంచివుండే విభాగాలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చూడాలి. రోగి భద్రత, ఆస్పత్రి ఆవరణలో అంటురోగాల నియంత్రణ, అత్యవసర పరిస్థితుల్లో ఆ ఆస్పత్రికుండే సంసిద్ధత వగైరాలను వివిధ గీటురాళ్లతో గుర్తించి ఆస్పత్రులకూ, ఆరోగ్యసేవలందించే ఇతర సంస్థలకూ జాతీయ అక్రిడిటేషన్ బోర్డు ధ్రువీకరణ పత్రం జారీచేస్తుంది. వృత్తిపరంగా ఎలాంటి భద్రతలున్నాయో, సిబ్బంది ఆరోగ్యం, పని పరిస్థితులెలా ఉన్నాయో నిర్ధారించేందుకు ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఇవన్నీ కాగితాల్లో భద్రంగా ఉంటాయి. చెప్పుకోవటానికే ఇవన్నీ. కానీ ఆచరణలో అన్నీ నీరుగారుతున్నాయి. రెండు రోజుల క్రితం మధ్యప్రదేశ్ ఆస్పత్రిలో కూడా అగ్నిప్రమాదం జరిగి ఒక శిశువు చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఆరోగ్యమే మహాభాగ్యమంటారు. పౌరులకు మెరుగైన చికిత్స, ఆరోగ్యం అందించగలిగితే ఉత్పాదకత, సృజనాత్మకత పెరుగుతాయంటారు. అవి అంతిమంగా దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పతాయి. అందుకే ఆరోగ్య సేవ అంగడి సరుకు కాకూడదని చెబుతారు. కానీ మన దేశంలో చదువు మొదలుకొని అన్నీ వ్యాపారమే. ఈ విషయంలో సాక్షాత్తూ సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకునే దిక్కులేదు. పౌరుల ప్రాణాలు ఇలా గాల్లో దీపం కావటం ఎంత సిగ్గుచేటు! -
సహజ భాష
ఒంటరి మానవుడికి మాటతో పనిలేదు. కానీ మరో మనిషితో కలిసి సాగినప్పుడు మాటలాంటిదేదో కావాలి. చూపు, శబ్దం, చేతి కదలిక, ముఖ కవళిక– ఇవన్నీ తొలి సంభాషణా సాధనాలై ఉండాలి. చిరునవ్వు, తల ఊపు, భయం, బిడియం, కన్నీరు, కన్నెర్ర– వాటికి కొనసాగింపుగా మారివుండాలి. అయితే మనుషులు ప్రేమలో పడినప్పుడు అక్కరకొచ్చే మూగబాసలు, మూతివిరుపులది వేరే కథ. వేల ఏళ్ల పరిణామంలో మనుషులు గుంపులుగా పోగయినకొద్దీ, వారి అనుభవాలు విస్తరించిన కొద్దీ, సంకేతాలకు అందని సంక్లిష్టతలు అందులోకి వచ్చిచేరినకొద్దీ భాషలు రూపుదిద్దుకోవడం మొదలై ఉంటుంది. ఎక్కడి సమాజం అక్కడి భాషను, అందులోని పద సంపదను, దానిదైన వ్యక్తీకరణ రీతిని తీర్చిదిద్దుకున్నాయి. అయితే ఈ భాషకు లిపిని కూర్చుకున్నాక మానవ నాగరికత మహత్తరమైన మలుపు తిరిగింది. ఒక తరం సంపాదించిన సమస్త వివేక సారాన్ని మరో తరానికి బదిలీ చేయడం సులభమైపోయింది. భాష అనేది మానవుడి అడుగుజాడ. వేల ఏళ్ల నాగరికతకు సజీవ సాక్ష్యం. భాష మనిషిని తన గతంతో పెనవేస్తుంది. అదే సమయంలో భవిష్యత్తును నిర్మించే సాధనంగానూ ఉపకరిస్తుంది. ప్రాచీన ప్రపంచంలో ఒకప్పుడు 30,000 నుంచి 75,000 భాషల వరకు ఉండేవని ఒక పరిశోధన తెలియజేస్తోంది. కానీ మనుషుల గుంపుల ఏకీకరణ జరిగినకొలదీ, సమాజాలు పెరిగినకొలదీ, రాజ్యాలు విస్తరించిన కొలదీ, ఎన్నో రాజకీయ ఆర్థిక, అణచివేత కారణాల వల్ల కొన్ని భాషలు పెరిగాయి, కొన్ని తరిగాయి, ఇంకొన్ని సమూలంగా అంతరించిపోయాయి. ప్రపంచంలో అది ఎంత చిన్న సమూహమైనా సరే దానికే ప్రత్యేకమైన ఒక భాషను మాట్లాడింది. అంతెందుకు, 19వ శతాబ్దం వరకూ ఠగ్గులు తమదైన రామసీ లేదా రామసీన అనే భాషను మాట్లాడేవారట. వీళ్లు యాత్రికులుగా వెళ్తున్న కాలిబాట ప్రయాణీకుల్లో కలిసిపోయి, వారి నమ్మకం సంపాదించి, సరైన క్షణంలో వాళ్లను చంపి సొమ్ములు ఎత్తుకుని పారిపోయేవారు. ‘రామసీన ఆర్ ఎ వొకాబ్యులరీ ఆఫ్ ద పెక్యులర్ లాంగ్వేజ్ యూజ్డ్ బై ద ఠగ్స్’ పేరుతో డబ్ల్యూ.హెచ్.స్లీమన్ అనే ఆంగ్లేయుడు 1836లో ఏకంగా ఒక పుస్తకం కూడా వెలువరించాడు. ఇప్పుడు ప్రపంచంలో 7,500 భాషలు మాత్రమే మిగిలి ఉన్నాయని అంచనా. కానీ ఇందులో కేవలం పది శాతం భాషల్లోనే సుమారు 90 శాతం ప్రపంచ జనాభా సంభాషిస్తోంది. దానికదే భాషలు ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయో తెలియజేస్తోంది. ఒక భాష అంతరిస్తే మాయమయ్యేది పదాలు కాదు, ఒక ప్రపంచ దృష్టికోణం. ఒక జాతి పాడుకున్న పాట ఇంకెవరికీ వినబడకపోవచ్చు. మరో ప్రాంతం చెప్పుకున్న కథ మరెవరికీ తెలియకపోవచ్చు. అయితే, ఈ సమస్య భాషకా, మనిషికా; అసలు సమస్యేనా అన్నది కొత్త డైలమా. ఆధునిక మానవుడు ఇప్పుడు విచిత్రమైన చౌరస్తాలో నిలబడివున్నాడు. ఇది చరిత్రలో ఎన్నడూ ఎదురవ్వని సందర్భం. భాషతోనే మానవ నాగరికత వర్ధిల్లింది. అయితే ఈ భాష అనే మేతను తింటూనే కృత్రిమ మేధ(ఏఐ) అనే బ్రహ్మరాక్షసి అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పుడున్న స్థితిలో ఈ భాషలను రూపొందించు కోవడానికి మనుషులు వేల ఏళ్లు తపస్సు చేశారు. కానీ నెలల వ్యవధిలోనే వీటన్నింటినీ ఒక్క పెట్టున ఏఐ మింగుతోంది. కృత్రిమ మేధకు మనుషులు బానిసలుగా మారి పోతారేమోననే భయాందోళనలను మహామహా టెక్పండితులే వ్యక్తపరుస్తున్నారు. ఈ స్థితిలో భాషలకు మించి ఏదైనా సామర్థ్యం మనుషులు సంపాదించుకుంటే తప్ప మనుగడ సాగించలేరని ఆధునిక తత్వవేత్త యువల్ నోవా హరారీ హెచ్చరిస్తున్నారు.ఇది ఇంకోరకంగా భాషల పూర్వయుగంలోకి మనుషులను తీసుకుపోనుందా? నాగరికతను మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టడమా లేక మరింత ఉత్కృష్ట స్థితిలోకి భాషను తీసుకుపోవడమా? కృత్రిమ మేధకు అందకుండా మనిషి ఇంకో మనిషితో చేయగలిగే సంభాషణ ఎలా ఉండగలదు? బహుశా అది ప్రేమరూపంలో ఉండొచ్చు, కరుణరూపంలో ఉండొచ్చు. కానీ వివేకం అంతరిస్తున్న కాలంలో, యుద్ధోన్మాదం పెరుగుతున్న యుగంలో అదే చాలా కష్టమైనదేమో! సరికొత్త ‘అక్షరమాల’తో మొదలు పెట్టాల్సివుంటుందేమో! -
ఆటవిక పరిపాలన @ ఏపీ
భారత రాజ్యాంగానికి అతీతులమనే భావన ఆంధ్రప్రదేశ్ పాలకుల్లో బలంగా పాతుకొనిపోయింది. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన చట్టుబండలైన చలనదృశ్యాలు గజ్జెకట్టి మరీ గంతు లేస్తున్నాయి. రక్షకులే భక్షకులుగా మారిన ఆటవిక రాజ్య వికటాట్టహాసం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నది. ప్రాథమిక హక్కుల సంగతి దేవుడెరుగు, ప్రజల ప్రైవేట్ ఆస్తులను సైతం గద్దెలమీదున్న గద్దలు ఇష్టారీతిన ఎగరేసుకు పోవడం రివాజుగా మారింది. ప్రజాప్రతినిధులు కలెక్షన్ కింగ్స్‌గా మారి ప్రైవేట్ ట్యాక్స్‌లను పిండుకుంటున్నారు. ప్రకృతి వనరులను సొంత ఖజానాల్లోకి తవ్వి పోసుకుంటున్నారు. రొచ్చు గుంటల్ని సైతం వదలకుండా చేపలవేటకు బయల్దేరు తున్న నాయకమన్యుల కక్కుర్తి కంపు ప్రజల నాసికాఘ్రాణ సహనాన్ని సవాల్ చేస్తున్నది.యువతరం ఆశల మీద, ఆకాంక్షల మీద పాలకులే పూను కొని గంజాయి మత్తును వెదజల్లుతున్నారనేందుకు సాక్ష్యాలు లభ్యమవుతున్నాయి. నవయువత స్వప్నతరంగాలను దారి మళ్లించేందుకు కుట్ర చేస్తున్నారని బలంగా నమ్మవలసి వస్తున్నది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ‘ఉడ్తా పంజాబ్’ రోజులను గుర్తుకు తెస్తున్నది. పోలీసు వాహనాల్లోనే రాచమర్యాదలతో గంజాయి రవాణా గమ్యంవైపు సాగి పోతున్నది. అనధికార రాష్ట్ర మొక్క హోదాను గంజాయి మొక్క అనుభవిస్తున్నదనుకోవాలేమో! పగల్లేదు, రాత్రి లేదు... ఎనీ టైమ్, ఎనీ సెంటర్, ఎనీ లొకాలిటీ... విచ్చలవిడిగా మద్యం అందు బాటులో ఉంటున్నది.లైసెన్స్డ్ షాపులకు అనుబంధంగా ఏర్పడిన బెల్ట్ షాపులే కాదు, వాటికి మొలతాడు షాపులు కూడా మొలకెత్తి డోర్ డెలివరీ స్టేజికి చేరుకున్నాయి. క్షేత్ర స్థాయిలో ప్రవహిస్తున్న మద్యం క్యూసెక్కుల లెక్కకూ, రాష్ట్ర స్థాయి విక్రయాల లెక్కకూ హస్తిమశకాంతరం కనిపిస్తున్నది. అనధికార కల్తీ సరుకు అంగళ్లను ముంచెత్తుతున్నదనేందుకు ఇదే పెద్ద రుజువు. అనధికార అమ్మకాలకు సంబంధించిన ధరవరలను, వేలం పాటలను ప్రజాప్రతినిధులే దగ్గరుండి నిర్వహించి వాటాలను నిర్ణయిస్తున్నారనే వార్తలు బహిరంగ రహస్యాలుగా చలామణి అవుతున్నాయి. అడ్డుకట్టల్లేని వారుణి వాహిని ఊరూవాడల్ని ముంచెత్తుతుంటే జనజీవనం మీద దాని పర్యవసనాలెలా ఉంటాయో విజ్ఞులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అద్దంకి ఘటన చెబుతున్నదేమిటి? ఆ ప్రాంతంలో గ్రానైట్ తవ్వకాలు చేసే వ్యాపారులు పరిమితిని మించి అక్రమ రవాణాను యథేచ్ఛగా చేసుకోవడానికి అడ్డంకులు లేకుండా ఎవరి వాటాలు వారికి పంచే ఒప్పందం కోసం ఒక పొట్టేళ్ల పార్టీ ఏర్పాటు చేశారట. ఈ పార్టీకి ఒక మంత్రి పీఏ సమన్వయకర్తగా వ్యవహరించారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. గ్రానైట్ వ్యాపారులతో పాటు కొందరు అధికార రాజకీయ నేతలు, అరడజన్ మందికి పైగా ఎస్ఐలు, ఒకరో ఇద్దరో సీఐలు, ఎంపిక చేసుకున్న కొందరు పెంపుడు మీడియా ప్రతినిధులు ఈ పార్టీలో పాల్గొన్నట్టు సమాచారం. ఒక ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల దాకా పార్టీ జరిగింది.లిక్కర్ గ్లాసుల గలగలలూ, పొట్టేళ్ల మాంసం ఘుమ ఘుమల మధ్య చర్చలు, ఒప్పందాలు పూర్తయిన తర్వాత అతిథులను తగురీతిన సత్కరించి గ్రానైట్ వ్యాపారులు వీడ్కోలు పలికారట. అలా బయల్దేరిన ఒక కారుకు సమీపంలోని శంఖవరప్పాడు అనే గ్రామం వద్ద ఆక్సిడెంట్ జరిగింది. చుట్టుముట్టిన గ్రామస్తులు అందులో ప్రయాణిస్తున్న మఫ్టీలో ఉన్న ఇద్దరు ఎస్ఐలను గుర్తించలేదు. డ్రైవర్‌తోపాటు ఈ ఇద్దరూ ప్రయాణంలో కూడా తాగుతున్నట్టుగా గమనించి ఆ కారును అక్కడే నిలిపేశారు. 108 వాహనాన్ని పిలిచి ప్రమాదా నికి గురైన ఆటోలోని ప్రయాణికుల్ని అందులో పంపించారు. కారు డిక్కీలో కూడా మద్యం బాటిళ్లు ఉండొచ్చనే అనుమానంతో తెరవాలని డిమాండ్ చేశారు. ఈలోగా సమాచారం అందుకున్న స్థానిక సీఐ హుటా హుటిన అక్కడికి చేరుకున్నారు. డిక్కీ ఓపెన్ చేయడానికి వీల్లేదని స్థానిక ప్రజలపై బెదిరింపునకు దిగారు. అదే సమయంలో ఒక పాలక పార్టీ నాయకుడిదిగా అనుమానిస్తున్న కారు అక్కడికి చేరుకొని మఫ్టీ ఎస్ఐలను ఎక్కించుకొని వెళ్లిపోయింది. సీఐ బెదిరంపులను లెక్క చేయకుండా స్థానిక ప్రజలు కారు డిక్కీని ఓపెన్ చేసి నిర్ఘాంతపోయారు. పెద్ద మొత్తంలో గంజాయి, ఒక బ్లూ కలర్ బ్యాగ్‌లో భారీ మొత్తంలో నగదు, ఒకటో రెండో ఫారిన్ లిక్కర్ బాటిళ్లు అందులో కనిపించాయి. జరిగిన ఘటనపై స్థానిక డీఎస్పీ, ఎస్పీలు చెరో రకమైన కథను వినిపించారు. దూడ గడ్డి కోసమే తాటిచెట్టు ఎక్కారనేది వారు చెప్పిన కథల సారాంశం. పోలీసు వాహనాల్లోనే యథేచ్ఛగా గంజాయి రవాణా జరుగుతున్నదనే విమర్శలు గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఆ విమర్శలు నిజమేనని అద్దంకి ఘటన రుజువు చేసింది. అక్రమ వ్యాపారులు, రాజకీయ నాయకులు, అధికార యంత్రాంగ గణం ఏకమై వనరుల్ని లూటీ చేసి వాటాలు పంచుకుంటున్నారనే ఆరోపణకు కూడా ఈ ఘటన సాక్ష్యంగా నిలబడింది. ఘటన జరిగి ఇన్ని రోజులైనా ప్రభుత్వ పెద్దలుగానీ, పోలీసు ఉన్నతాధికారులుగానీ, దీనిపై మౌనం వీడకపోవడాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి వ్యవహారాలే ఇప్పుడు ‘ఆర్డర్ ఆఫ్ ద డే’గా అర్థం చేసుకోవలసి వస్తున్నది.డీఎస్సీ – 2025 పరీక్షలను రాష్ట్రప్రభుత్వం ఎంత ప్రహస నంగా మార్చిందో వెల్లడిస్తూ జరిగిన అవకతవకలను చాలా కాలం క్రితమే ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి సాక్ష్యాధారాలతో నిరూపించారు. ఈ పరీక్షలను రద్దు చేయాలనీ, అక్రమాలకు బాధ్యుడైన విద్యామంత్రి లోకేశ్ రాజీనామా చేయాలనీ కోరుతూ రాష్ట్రంలో ఆందోళనలు కూడా ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష నేత చూపెడుతున్న ఆధారాలపై స్పందించకపోగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై ఎదురుదాడికి దిగింది. జగన్ హయాంలో జరిగిన గ్రూప్–1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వ పెద్దలు, యెల్లో మీడియా డైవర్షన్ గేమ్‌ను ఆశ్రయించారు. మొన్న గురువారం నాడు జగన్మోహన్రెడ్డి మరోసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ విసిరారు. గ్రూప్–1 పరీక్షలతో పాటు, డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణకు నేను సిద్ధమే, మీరు సిద్ధమా? అని ప్రశ్నించారు.ఈ సవాల్‌పై రెండు రోజులు గడిచినా పాలకపక్షం నోటమాట పెకల్లేదు. డీఎస్సీలో జరిగిన అక్రమాల గురించి వారికి స్పష్టంగా తెలుసు కనుకనే సీబీఐ విచారణ పేరు వినగానే బాబు, లోకేశ్‌ల నోళ్లు మూతపడ్డాయి. రద్దయిన నీట్ పరీక్షల్లో పేపర్ లీకేజీ అంశం ఒక్కటి మాత్రమే ఉన్నది. డీఎస్సీలో లీకేజీతోపాటు స్పోర్ట్ కోటా పేరుతో మూడొందల పైచిలుకు పోస్టులకు బేరాలు పెట్టడం, డీఎస్సీ పరీక్ష రాయని వారితో ఆ పోస్టులను నింపేయడం, అందుకోసం పాత జీవోల స్థానంలో కొత్త జీవోలను విడుదల చేయడం, పని పూర్తికాగానే పాత నిబంధనలతో మళ్లీ కొత్త జీవోలు ఇవ్వడం అనే కుట్రపూరిత వ్యవహారం ఇమిడి ఉన్నది. ఉన్నత స్థాయి వ్యక్తులు ఉద్దేశ పూర్వకంగా ఆడిన నాటకం, చేసిన నయవంచన అనేందుకు జీవోల ప్రహసనమే తిరుగులేని సాక్ష్యం.నిబంధనలకూ, సంప్రదాయాలకు విరుద్ధంగా డీఎస్సీ పరీక్షల నిర్వహణను, ప్రశ్నాపత్రాల తయారీని ఒకే సంస్థ చేతిలో పెట్టారు. ఆ సంస్థకు సంబంధించిన ఔట్సోర్సింగ్ విద్యార్థికి మొదటి మెరిట్‌లిస్ట్‌లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఒకసారి ప్రశ్నా పత్రం లీకయితే ఒక్కడితోనే ఆగిపోతుందా? ఒక్కడితోనే ఆగిపోతే మాత్రం అది చెల్లుబాటవుతుందా? లీకేజీ జరిగిందని గమనించినందువల్లనే తదుపరి మెరిట్ లిస్ట్ నుంచి సదరు వ్యక్తి పేరును తొలగించి, సర్టిఫికెట్లు సబ్మిట్ చేయకుండా అతని లాగిన్ ఐడీని తీసేశారన్నది నిజం కాదా? అక్రమాలను కప్పి పుచ్చుకోవడానికి ఎంపికయిన టీచర్ అభ్యర్థులను రెచ్చగొట్టి వారి చేత ప్రదర్శనలు చేయించే చౌకబారు ఎత్తుగడలకు సర్కార్ దిగజారింది. ఎంపికైన అభ్యర్థుల్లో ఎక్కువమంది మెరిటోరియస్ అభ్యర్థులే ఉండవచ్చు. సందేహం లేదు. లీక్ కారణంగా రద్దయిన నీట్ పరీక్షలో కూడా చాలామంది మెరిట్ అభ్యర్థులు సెలెక్టయ్యారు. రెండోసారి నీట్ పరీక్ష నిర్వహించినప్పుడు కూడా వారు ఎంపికయ్యారు. కాకపోతే వారికి అనవసర ఆందో ళన, అధిక శ్రమ. అందుకు కారణం మరెవరో కాదు. పరీక్ష నిర్వాహణా వ్యవస్థ నిర్వాకం. ప్రభుత్వ అసమర్థత. డీఎస్సీకి కూడా ఇదే వర్తిస్తుంది.అద్దంకి గంజాయి, డీఎస్సీ అవినీతి బయటకు స్పష్టంగా కనిపిస్తున్న ప్రభుత్వ నిర్వాకాలు మాత్రమే. అన్ని రంగాల్లోనూ రెండేళ్లల్లోనే ఈ సర్కార్ సర్వభ్రష్టత్వాన్ని సాధించింది. జగన్ సర్కార్ మెరిట్ విద్యార్థులకూ, పేద రోగులకూ అందు బాటులోకి తెచ్చిన పదిహేను మెడికల్ కాలేజీలను పీపీపీ జపంలో ఈ సర్కార్ మూలన పడవేసింది. పిల్లలందరికీ న్యాయమైన ఉచిత విద్యను అందించాలని జగన్ సర్కార్ ప్రారంభించిన విద్యారంగ సంస్కరణలకు బాబు సర్కార్ పాతరేసింది. ఫలితంగా ఇప్పటికే ఐదులక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్లను వదిలేసినట్టు అసెంబ్లీలోనే ప్రభుత్వం అంగీ కరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. పీపీపీ ముసుగులో చేస్తున్న ప్రైవేటీకరణ ఎంత దూరం వెళ్లిందంటే ఇకమీదట ఆస్పత్రి సేవలు, తాగునీటి సరఫరా, ఆర్టీసీ సేవలు, చివరకు చెత్త ఎత్తడం కూడా పీపీపీలోకి మారబోతున్నాయి. క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో విచ్చలవిడిగా ప్రభుత్వ ఆస్తులను దోచిపెట్టే లక్ష్యంతోనే పీపీపీ మంత్రాన్ని బాబు సర్కార్ జపిస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరో పక్క ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం మోపడం, యువతరాన్ని మత్తులో జోగేలా చేయడం, రాజీకీయ ప్రత్యర్థులను వేటాడటం, ప్రభుత్వ ఆస్తుల్ని తెగనమ్మడం ప్రధాన ఎజెండాలుగా పాలక కూటమి అమలుచేస్తున్నది. సొంత ప్రయోజనాల కోసం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం మొదలు పెట్టింది. ఇదే అదునుగా కొందరు పోలీసు అధికారులు రెచ్చిపోయి పౌరహక్కులకు పాతరేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఇప్పటికే ఒక్కొక్కడూ వందల కోట్లు వెనకేసుకున్నారని అదే పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేలను చూసి క్షేత్రస్థాయి అధికార యంత్రాంగం అవినీతి కూపంలో మునకలేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు మాత్రం నానాటికీ తీవ్ర సంక్షోభంలో కూరుకు పోతున్నారు. ఇటువంటి ఆటవిక పాలనను ఇంకెంతకాలం భరించాలి? చైతన్యవంతులైన ప్రజలు ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
బ్రెజిల్‌పై అమెరికా పడగ!
లాటిన్ అమెరికా దేశాల్లో నియంతలను గద్దెనెక్కించిన గతకాలపు పోకడలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. వచ్చే అక్టోబర్ మొదటివారం బ్రెజిల్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత దేశాధ్యక్షుడు, మధ్యేవాద వామపక్ష నేత లూలా డి సిల్వాను ఓడించి మితవాద పక్ష నాయకుడు ఫ్లేవియో బోల్సోనారో అధికారంలోకి రాలేనట్టయితే సైనిక జోక్యం చేసుకోవటానికి పథక రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా రెండు నేరస్త ముఠాలు సీవీ, పీసీసీలను ఉగ్రవాద సంస్థలుగా అమెరికా ప్రకటించింది. వీరినుంచి అమెరికాకు ఏర్పడిన ముప్పును తొలగించటంలో బ్రెజిల్ విఫలమైందన్న సాకుతో సైనిక దాడి చేయటమే ఈ పథకం ఆంతర్యం. వెనిజులాలో సైతం నిరుడు ట్రంప్ ఇదే తరహా డ్రామా నడిపించారు. మాదకద్రవ్య ముఠాలు అమెరికా భద్రతకు ముప్పుగా మారాయనీ, వాటిని అధ్యక్షుడు మదురో ప్రోత్సహిస్తున్నారనీ ఆరోపించారు. ఈ ఏడాది జనవరిలో మదురో దంపతుల్ని కిడ్నాప్ చేసి అమెరికాకు తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ అమెరికా కోర్టులో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. లాటిన్ అమెరికా దేశాలన్నిటా 1964 మొదలుకొని రెండు దశాబ్దాలపాటు అమెరికా ఇలాంటి దుర్మార్గాలకే పాల్పడింది. ఇదే బ్రెజిల్లో 1964లో వామపక్ష ప్రభుత్వాధినేత జివావో గౌలార్ట్‌ను సైనిక కుట్రలో తొలగించి హుంబెర్టో కాస్టిలోను గద్దెనెక్కించింది. అదే సంవత్సరం బొలీవియాపై సైతం ఇదే కుట్ర కొనసాగించింది. చిలీలో 1973లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సోషలిస్టు నాయకుడు సాల్వెడార్ అలెండీని సైనిక తిరుగుబాటులో హతమార్చి అగస్టో పినోచెట్‌ను అధినేతగా కూర్చోబెట్టింది. ఇలా ఉరుగ్వే, అర్జెంటీనా, ఎల్ సాల్వెడార్, గ్వాటెమాలా దేశాల్లో సైతం 1985 వరకూ ఈ కుట్రలు సాగుతూనే వచ్చాయి. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో తన పొరుగున ఆనాటి సోవియట్ ప్రభావం పడితే తన ప్రాభవం కొడిగడుతుందన్న భయాందోళనలే ఈ కుట్రలకు కారణం. నియంతల రాకతో లాటిన్ అమెరికా దేశాల ప్రజానీకం భయానక పాలన చవిచూశారు. ఒక్క అర్జెంటీనాలోనే ‘డర్టీ వార్’ పేరుతో పదివేలమంది ప్రాణాలు తీశారు. చిలీలో, ఎల్‌సాల్వెడార్‌లో, గ్వాటెమాలాలో సాగించిన నరమేధాలు దాదాపు యాభైవేలమంది ఉసురుతీశాయి.మళ్లీ ఇన్నాళ్లకు అమెరికా అస్తిత్వ ఆందోళనలో పడింది. మొన్న మే నెలలో జరిగిన కొలంబియా ఎన్నికల్లో ట్రంప్ తెరవెనక సాగించిన కుట్రల ఫలితంగా ఆయన అనుకూలుడు ఎబెలార్డో ఎస్ప్రియెల్లా స్వల్ప ఆధిక్యతతో అధికారంలోకొచ్చారు. అందుకే బ్రెజిల్లో సైతం ఆ పాచిక పారుతుందనుకుంటున్నారు. లూలా బ్రిక్స్ కూటమిలో చురుగ్గా పాలుపంచుకోవటం, చైనాతో సాన్నిహిత్యం పెంచుకోవటం, అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవటం ట్రంప్‌కు కంటగింపుగా మారాయి. తన కీలుబొమ్మ జైర్ బోల్సొనారో 2023 ఎన్నికల్లో పదవీభ్రష్టుడు కావటంనుంచే ట్రంప్ బుసలుకొడుతున్నారు. తిరుగుబాటు కుట్రలో బోల్సొనారోను శిక్షిస్తే తీవ్ర పరిణామాలుంటాయని న్యాయవ్యవస్థను సైతం హెచ్చరించారు. కానీ ఈ ఏడాది మొదట్లో బోల్సొనారోకు 27 యేళ్ల ఖైదు పడింది. ప్రస్తుతం డి సిల్వాతో తలపడేందుకు రంగంలో 13 మంది అభ్యర్థులున్నారు. ఆయనకు 40 శాతం మద్దతుంటే, సమీప ప్రత్యర్థి ఫ్లేవియో 28 శాతంవద్ద ఆగిపోయారు. దీన్నెలాగైనా తారుమారు చేయటానికి అమెరికా పడరాని పాట్లు పడుతోంది. బ్రెజిల్ పాత్రికేయులకూ, వివిధ మాధ్యమాల్లో ప్రభావం చూపగల వారికీ ఉదారంగా వీసాలు మంజూరుచేసి ‘భావప్రకటనా స్వేచ్ఛ’పై పాఠాలు చెబుతోంది. తప్పుడు ప్రచారాలు సాగిస్తోంది. అయినా పరిస్థితి ఆశాజనకంగా లేకపోవటంతో కొత్త ఎత్తుకు తెరలేపింది. ఇరాన్లో ఓటమి ఎదురుకావటం, ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినటం, డాలర్ మనుగడకు ముప్పు ఏర్పడటం ట్రంప్‌ను వేధిస్తున్నాయి. ఇప్పటికే పెరూ, ఎల్‌సాల్వెడార్ దేశాల్లో మితవాదులు గెలిచారు. బ్రెజిల్‌ను సైతం లోబరుచుకోగలిగితే దేశంలో తన కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయని ట్రంప్ భావిస్తున్నారు. పొరుగు దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటంలాంటి అనాగరిక పోకడలకు అమెరికా ఇకనైనా స్వస్తిచెప్పాలి. -
రెండు హత్యలు–ఎన్నో ప్రశ్నలు
మన కళ్లముందే సమాజం ఎంతగా పతనమవుతున్నదో చెప్పటానికి ఈ నెల 11న నల్లగొండ జిల్లాలోని కొండమల్లేపల్లిలో ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యోదంతమే ఉదాహరణ. కేరళలోని అలప్పుజ జిల్లాలో గత శనివారం ఒక వృద్ధుణ్ణి చంపిన ఘటన సైతం దీన్నే పోలివుండటం యాదృచ్ఛికం కాదు. ఆదాయం పేరు చెప్పి ప్రభుత్వాలు మద్యాన్ని విక్రయిస్తున్నాయి. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను నియంత్రించటంలో ఘోరంగా విఫలమవుతున్నాయి. ఇవన్నీ ఏ వయసు వారికైనా సులభంగా లభ్యమవుతున్నాయి. హత్యలు చేయడానికి ఎన్ని మార్గాలుంటాయి, ఎలా తప్పించుకోవచ్చు అనే ప్రశ్నలకు సామాజిక మాధ్యమాల్లో సవాలక్ష సమాధానాలు క్షణాల్లో దొరుకుతాయి. డబ్బుంటే అందుబాటులోకొచ్చే ఖరీదైన ఉపకరణాలు, జల్సాల గురించిన కోట్లాది వీడియోలు అందుబాటులో ఉంటాయి. ఇన్ని ప్రలోభాలు కళ్ల ముందుంటే, ఏం చేసినా ఎవరికీ దొరక్కుండా తప్పించుకోగలమన్న భరోసా కనిపిస్తుంటే... పర్యవసానాలేమిటన్న స్పృహ కొరవడిన తెలిసీతెలియని వయసు పిల్లలు నేరాలవైపు మొగ్గటంలో ఆశ్చర్యమేముంది? హంతకులిద్దరూ పదో తరగతి పిల్లలంటే, ఎనిమిదో తరగతికే వారికి దురలవాట్లు సోకాయంటే దిగ్భ్రాంతి కలుగుతుంది. తొమ్మిదో తరగతిలోనే ఆ పిల్లలు గోవా పోయి జల్సాలు చేసుకున్నారని కూడా చెబుతున్నారు. ప్రిన్సిపాల్ రూపారెడ్డి ఆ ఇద్దరు టీనేజర్ల దగ్గర సెల్ఫోన్లుండటాన్ని, వారు తరచు ఎవరితోనో సంభాషిస్తుండటాన్ని సకాలంలోనే గమనించారు. తల్లిదండ్రుల్ని పిలిపించి వారి దృష్టికి తీసుకొచ్చారు. హాస్టల్ నుంచి పంపించేశారు. పాఠశాలలో ఆ పిల్లలు మత్తు పదార్థాలు తీసుకొంటుండగా ఫొటోలు తీశారు. మళ్లీ తల్లిదండ్రులకు చెప్పిచూశారు. చదువుకుని, ఉన్నతోద్యోగాలు వెలగబెడుతున్నవారికే అలాంటి పిల్లల ప్రవర్తన ఎటు దారితీయగలదన్న స్పృహ కొరవడుతున్నప్పుడు, కూలీనాలీ చేసుకునేవారికి ఏం అర్థమవుతుంది? ఆ క్షణంలో మందలించినా, వారిని సన్మార్గంలో పెట్టడానికి ఎవరిని సంప్రదించాలో తెలిసేదెలా? బాధ్యతను గుర్తించేదెలా? రూపారెడ్డి హత్యోదంతం ప్రముఖంగా వచ్చినరోజే హైదరాబాద్‌లో ద్విచక్రవాహనంపై అయిదుగురు మైనర్లు పెనువేగంతో వెళ్తూ ఇతరుల్ని హడలెత్తించారని మీడియా తెలిపింది. రోడ్డుపైకి వెళ్తే రోజుకి కనీసం ఒకటి రెండుచోట్ల ఇలాంటివారు తారసపడుతుంటారు. అదుపాజ్ఞల్లో ఉంచటం కాదు... ఆ పిల్లలు బడిలో ఏం నేర్చుకుంటున్నారో, వారికి ఏయే అంశాల్లో ఆసక్తి ఉందో నిత్యం గమనించటం తల్లిదండ్రుల బాధ్యత. ఇది కొరవడటంతో పిల్లలు క్రమేపీ హింసాత్మక ప్రవృత్తివైపు జారుకుంటున్నారు. సమాజానికి ఉపద్రవంగా పరిణమిస్తున్నారు.కేరళ ఉదంతంలోనూ దాదాపు ఇవే ఆనవాళ్లు కనబడతాయి. పదమూడేళ్ల బాలిక తన ఫోన్ వాడకంపైనా, మగపిల్లలతో మాట్లాడటంపైనా ఆంక్షలు విధించిన తాతపై కక్ష పెంచుకుంది. అమ్మ, అమ్మమ్మ లేకపోవటం చూసుకుని గత శనివారం రాత్రి స్నేహితురాలింట్లో చదువుకోవాలంటూ తాతకు చెప్పి వెళ్లింది. ముగ్గురు మగపిల్లలకు ఇంట్లోకెలా ప్రవేశించవచ్చునో, ఎక్కడేం ఉంటాయో ముందే చెప్పివుంచింది. వారతన్ని హతమార్చగా, ఆ మర్నాడు ఏం ఎరగనట్టు రెండుసార్లు ఇంటికెళ్లింది. తలుపుకొట్టింది. ఇరుగుపొరుగును పిల్చి తలుపులు బద్దలుకొట్టించింది. నల్లగొండ జిల్లా ఉదంతం మాదిరే ఇక్కడ కూడా తప్పించుకొనేందుకు పిల్లలు గ్లోవ్స్ కొనుక్కున్నారు. కేరళ ఉదంతంలో తమ ఉనికి పోలీసు జాగిలాలు పసిగట్టకుండా కారంపొడి చల్లారు.ప్రశ్నించటాన్ని నేరంగా చూసే ప్రభుత్వాలకు ఇన్ని దుర్వ్యసనాలు పిల్లలకు అందుబాటులోకొస్తున్నాయన్న స్పృహ లేదు. చదువుతోపాటు పిల్లల్ని ఆలోచింపజేసే, ఉత్సాహ పరిచే కార్యకలాపాలేవీ బడుల్లో ఉండవు. తొమ్మిదో తరగతి చదివే పిల్లలు గోవా క్యాసినోల్లో, బీచ్‌లలో గడిపినా వారిని పసిగట్టలేకపోయిన అక్కడి ప్రభుత్వం సిగ్గుపడాలి. గోవాను స్ఫూర్తిగా తీసుకుని వైజాగ్ బీచ్‌కి అలాంటి ‘సరదాలు’ తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోంది. పిల్లలు, యువత నాశనం కావటానికి తోడ్పడేవన్నీ అందుబాటులోకి తెచ్చే ప్రభుత్వాలున్నచోట ఇంటిపెద్దలైనా, ఉపాధ్యాయులైనా నిస్సహాయులుగా మిగలకేం చేస్తారు? -
ట్రంప్ మ్యాప్‌ల సంబరం!
హార్మూజ్ జలసంధిని ‘చాలా త్వరలోనే’ అమెరికా భూభాగంగా మారుస్తానని గతవారం ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పుడు ఇరాన్‌పై మళ్లీ భీకర దాడులకు తెగబడొచ్చని కొందరు అనుమానించారు. తీరా మంగళవారం ఆయన చేసిందల్లా ‘అమెరికా కొత్త భూభాగం’ అని రాసివున్న హార్మూజ్ జలసంధి మ్యాప్‌ను విడుదల చేయటమే. దీంతో ఇరాన్ దౌత్యవేత్తలు ప్రతిదాడికి దిగారు. కాలిఫోర్నియాను ఇరాన్ భూభాగంగా చూపుతూ ఇరాన్ కాన్సులేట్ ఒక చిత్రపటాన్ని విడుదల చేసింది. వేరే దేశాల భూభాగాలు డిమాండ్ చేయటం, వాటిని అమెరికా భౌగోళిక చిత్రపటాల్లో భాగంగా చూపటం ట్రంప్‌కు కొత్తేం కాదు. రెండోసారి అధికారంలోకొచ్చిన వెంటనే గ్రీన్‌లాండ్‌పై ఆయన కన్నుపడింది. అలాగే కెనడాను అమెరికాలో విలీనం చేసుకుని 51వ రాష్ట్రంగా మారుస్తామనీ, పనామా కాల్వ ఇకపై తమదేననీ, గాజాను ‘సొంతం’ చేసుకుంటామనీ కూడా పలుమార్లు చెప్పారు. అందుకు సంబంధించి ఒక వీడియో రూపొందించి విడుదల చేశారు. వెనిజులా మ్యాప్‌లో అమెరికా జెండాను సూచించే రంగులు నింపారు. అలాగే ఇకపై గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా వ్యవహరించాలంటూ ఉత్తర్వులు జారీచేశారు. అట్లాంటిక్ మహాసముద్రంలోని ఈ ప్రాంతం మెక్సికోకు పశ్చిమ, దక్షిణ దిశల్లో, అమెరికాకు ఉత్తరంవైపు, క్యూబాకు ఆగ్నేయంవైపు ఉంది. పేరు మార్చినా ప్రాదేశిక జల పరిధులేమీ మారడంలేదు గనుక మెక్సికో, క్యూబాలు ఈ విషయంలో మౌనంగా ఉండిపోయాయి. ఇక పర్షియన్ గల్ఫ్ పేరును గల్ఫ్ ఆఫ్ అరేబియాగా మారుస్తామని తొలి ఏలుబడిలో 2017లో ప్రకటించారు. దాంతో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ జాగ్రఫీ చదువుకోమని ట్రంప్‌కు సలహా ఇచ్చారు. నిరుడు మే నెలలో సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ పర్యటనకెళ్లే ముందు పేరు మార్పు ఉంటుందని ప్రకటించారు. అటు తర్వాత ఎందుకో దాని జోలికి పోలేదు. ఈ ‘భౌగోళిక చిత్రపట దురాక్రమణల్ని’ చూసి జనం కాలక్షేపానికి నవ్వుకోవచ్చు. ట్రంప్ ప్రదర్శిస్తున్న అమాయకత్వమో, అజ్ఞానమో చూసి జాలిపడే వారూ ఉండొచ్చు. కానీ అగ్ర రాజ్యాల చరిత్ర తెలిసినవారు దాన్నంత తేలిగ్గా వదిలేయరు. ఒక విశాల పాలస్తీనా భూభాగంలోకి కొన్ని దశాబ్దాల్లో భారీయెత్తున యూదుల్ని తరలించి, అక్కడ నరమేధాలకు పాల్పడి ఇజ్రాయెల్‌ను సృష్టించి, అందుకు ఐక్యరాజ్యసమితి ఆమోదాన్ని ‘రాబట్టిన’ చరిత్ర ఆ దేశాలది. కనుక ఇప్పుడు ఉబుసుపోక మాట్లాడే మాటల్లో వేరే అర్థాలు ఉండొచ్చన్న అనుమానాలు రావటం సహజం. రాజకీయావతారం ఎత్తి దాదాపు పదిహేనేళ్లవుతున్నా పూర్వాశ్రమంలో నిర్వహించిన రియలెస్టేట్ వ్యాపార ప్రభావంనుంచి ట్రంప్ బయటపడలేకపోతున్నారన్నది వాస్తవం. రియలెస్టేట్ యజమాని మాదిరే ఆయన భూదాహంతో అల్లాడిపోతున్నారు. ‘మళ్లీ అమెరికాను ఉన్నతంగా చేద్దాం’ అనే నినాదం సారాంశం ఖనిజ సంపద పుష్కలంగా ఉండే ప్రాంతాలను అమెరికాలో విలీనం చేసుకోవటమేనన్న సందేశాన్ని ట్రంప్ పంపుతున్నారు. అందుకే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ గ్రీన్లాండ్ సందర్శనకెళ్లినప్పుడు డెన్మార్క్, గ్రీన్లాండ్ల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. దాంతో చేసేదిలేక ఆమె మధ్యలోనే ఆ పర్యటనను విరమించుకుని వెనక్కిపోవాల్సి వచ్చింది. జనం భావోద్వేగాలు రెచ్చగొట్టి అధికారంలోకొచ్చినవారు వాటిపైనే మనుగడ సాగించాలనుకోవటం సహజం. అలాగైతేనే వారి వైఫల్యాలు మరుగునపడతాయి మరి. ఈ బాపతు నేతలు అందరి దృష్టి తమపైనే ఉండాలన్న తపనతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ట్రంప్ దీనికి భూదాహాన్ని కూడా చేర్చారు. ఈ భౌగోళిక చిత్రపటాల్ని చూసిన ‘మాగా’ జనం నిజంగానే ట్రంప్ వాటిని జయించుకొస్తారన్న భ్రమల్లో ఉంటారు. ఒకపక్క అరేబియా సముద్రంలో లంగరేసిన విమానవాహక నౌక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్‌లో దుర్భర పరిస్థితులున్నాయనీ, కొందరు ఆత్మహత్యా యత్నం కూడా చేశారనీ వార్తలొస్తున్నాయి. అందులో పనిచేసే రక్షణ సిబ్బందిని వెనక్కు పిలిపించాలని వారి కుటుంబాలనుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. అందుకే చవకబారు చిత్రపట వివాదాలు కట్టిపెట్టి ఇరాన్‌తో సంధికి ప్రయత్నించడం అమెరికా శ్రేయస్సుకు, రాజకీయంగా ట్రంప్‌కు మంచిది. -
దారికొచ్చిన జార్ఖండ్!
కేంద్ర విద్యామంత్రి రాజీనామా కోరుతూ వినూత్న తరహా నిరసనలతో, నిరాహార దీక్షలతో ఢిల్లీ జంతర్ మంతర్‌లో ఊహించని విజయం సాధించిన జెన్ జీ... రాంచీలో సైతం ఘన విజయం సాధించింది. జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్–కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (జేఎస్ఎస్సీ–సీజీఎల్) పరీక్షను రద్దు చేయటానికి ఎట్టకేలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అంగీకరించింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటనతో ఉద్యమకారుల శిబిరం ఆనందోత్సాహాలతో పొంగిపోగా... రాష్ట్రంలో గత పన్నెండేళ్ల నుంచీ జరిగిన పరీక్షల్లో అవకతవకలు జరిగాయనీ, వాటిపై కూడా చర్యలు తీసుకోబోతున్నామనీ ఆయన చెప్పటం వేలాదిమంది ఉద్యోగుల జీవితాలను ప్రశ్నార్థకం చేసింది. ఆ నియామకాలన్నీ రద్దు చేస్తారా... చేస్తే దానికి అనుసరించే విధానమేమిటన్న ప్రశ్న ఇప్పుడందర్నీ వేధిస్తోంది. వీరుగాక తమ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారున్నారు. అన్నీ పూర్తయి నియామకాల కోసం ఎదురుచూస్తున్న మరో 1,975 మంది వీరికి అదనం. తగిన విద్యార్హతలు గలవారంతా ప్రభుత్వోద్యోగం కోసం వెంపర్లాడతారు. ప్రయత్నం ఫలిస్తే జీవితంలో శాశ్వతంగా స్థిరపడిపోవచ్చని ఆశపడతారు. ఆ ఉద్యోగ భద్రత అలాంటిది మరి. కానీ ప్రభుత్వోద్యోగాలు వందల్లో ఉంటే, పోటీపడేవారు లక్షల్లో ఉంటారు. అందుకే తమ చదువులు ఎంతవరకూ పనికొస్తాయన్న భయాందోళనలు అభ్యర్థుల్లో సహజంగానే ఉంటాయి. ఈ పరిస్థితిని శిక్షణ సంస్థలు సొమ్ముచేసుకుంటాయి. లక్షలమంది వేలకు వేలు ఖర్చుచేస్తారు. తీరా ప్రశ్నపత్రాలు లీకయ్యాయని తెలిశాక అలాంటివారి గుండె రగిలిపోదా? ఈ ఆగ్రహావేశాలనుంచే జెన్ జీ ఉద్యమం పురుడు పోసుకుంది. కేంద్ర స్థాయిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష అయినా, ఇప్పుడు జార్ఖండ్‌లో జరిగిన ఉద్యోగ నియామకాలైనా వివాదాస్పదంగా మారింది అందుకే. సమాజంలో, జీవితంలో అనిశ్చితి అలుముకున్న వర్తమానంలో అన్యాయం జరిగిందనుకున్నప్పుడు ఉద్యమాలు పోటెత్తడం అనివార్యమని గ్రహించక, యువత డిమాండ్లను అవగాహన చేసుకోక తమకు అలవాటైన పద్ధతుల్లో ఉద్యమాల్ని అణిచేద్దామని ఢిల్లీలోనూ, రాంచీలోనూ పాలకులు ప్రయత్నించారు. రెండుచోట్లా పాలక కూటములు వేర్వేరు. అవి పరస్పరం ప్రత్యర్థి పక్షాలు. అయినా వారి చర్యల్లో సారూప్యత కనబడటం గమనించదగ్గది. రెండుచోట్లా చివరకు పాలకులు వాస్తవం గ్రహించక తప్పలేదు.జార్ఖండ్‌లో ఉద్యోగ నియామక పోటీ పరీక్షలన్నిటినీ టీఎస్సార్ డేటా ప్రాసెసింగ్ ప్రైవేటు లిమిటెడ్(టీడీపీఎల్) నిర్వహిస్తూ వచ్చింది. ఈ సంస్థ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ) కోసం ఇంతవరకూ 10 పరీక్షలు, జెఎస్ఎస్సీకి 5 నిర్వహించింది. వీటిద్వారా బ్లాక్ సప్లయ్ ఆఫీసర్ మొదలుకొని డిప్యూటీ కలెక్టర్, టీచర్, సివిల్ జడ్జీ, ప్రాసిక్యూటర్ వరకూ అనేక పోస్టులు భర్తీ అయ్యాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో త్రిశంకు స్వర్గంలో పడ్డామనీ, జనం దృష్టిలో నేరగాళ్లుగా మిగులుతామనీ వారంతా గొల్లుమంటున్నారు. తమ నిర్లక్ష్యంతో, కొన్నిసార్లు కుమ్మక్కుతో యువత ఆశయాలపై చన్నీళ్లు చల్లుతున్నామని పాలకులు గుర్తించటం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ ఎన్డీయే కూటమి ప్రభుత్వం మొండిగా ప్రవర్తిస్తోంది. టీడీపీ నేతలు క్రీడా ధ్రువీకరణ పత్రాలివ్వటం, సర్కారు ఉద్యోగాలు పంచడం వింత. జాతీయస్థాయి పతక గ్రహీతలు కూడా వారిముందు బలాదూరే! కూటమి భాగస్వామిగా ఉన్న బీజేపీ కళ్లు మూసుకుంది. జార్ఖండ్‌లో ఉద్యమవీరుల పార్టీగా ప్రతిష్ఠ పొందేందుకు నానారకాల ప్రయత్నం చేసిన పక్షమే అక్రమాలెక్కడంటూ దబాయింపులకు దిగుతోంది. దగాపడిన డీఎస్సీ అభ్యర్థులు చానెళ్లలో తమ గోడు వినిపిస్తుంటే... ప్రశ్నపత్రాల లీక్ మొదలుకొని ర్యాంకుల ప్రకటన, నియామకాల వరకూ సర్వం సందేహాలకు తావిస్తుంటే టీడీపీకి ‘తందాన తాన’ పక్షంగా మిగిలింది. పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న వ్యక్తే ఫస్ట్ ర్యాంకర్ అని తెలిసి గుట్టుచప్పుడు కాకుండా అతగాడి పేరు డేటానుంచి మాయం చేయటం దేన్ని సూచిస్తోంది? జార్ఖండ్‌ను చూశాకైనా బుద్ధి తెచ్చుకుని తప్పు గ్రహించక పోతే కూటమి పక్షాలకు ఏపీ జనం టోకున బుద్ధి చెప్పటం ఖాయం. -
కులగణన తేల్చేదేమిటి?
జన గణనలో కుల గణన కూడా చేర్చాలన్న డిమాండ్‌ను నిరుడు ఏప్రిల్‌లో కేంద్రం అంగీకరించగా, అందుకు అనుసరించబోయే విధానంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. పౌరులనుంచి రాబట్టే సమాచారానికి సంబంధించిన 40 ప్రశ్నల్లో కులం కూడా ఒకటిగా ఉండబోతోందని కేంద్రం నోటిఫికేషన్ వెల్లడించింది. అయితే దీనివల్ల ఏ మేరకు ప్రయోజం ఉంటుందన్న సందేహం తలెత్తుతుంది. వివిధ కులాల పేర్లు ఇచ్చి దాన్లో దేనికి చెందుతారో తెలపాలని పౌరుల్ని అడిగితే నిర్దిష్టమైన డేటా వెల్లడవుతుంది. అందుకు బదులుగా వారు చెప్పిన కుల వివరాలు నమోదు చేయటం వల్ల ప్రయోజనం ఉంటుందా? 2011లో యూపీఏ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల గణన అంటూ దేశవ్యాప్తంగా ఒక సర్వే చేసింది. ఎన్నడో 1931లో వలస పాలకుల హయాం తర్వాత దేశంలో కులాలను గణించటం అదే మొదటిసారని అందరూ సంతోషించారు. కానీ ఆ గణనవల్ల ఏ ప్రయోజనమూ కలగలేదు. పౌరులు చెప్పిన వివరాల తర్వాత కులాలు, ఉపకులాలు, అక్షరక్రమంలో తేడాలు తదితరాల ఆధారంగా దాదాపు 46 లక్షల 73 వేల రకాలు నమోదయ్యాయి. కులాలవారీగా వాటిని వర్గీకరించటానికి 2015లో అప్పటి నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియా నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. తీరా కులాల పేర్లలో ఉన్న అనేక వ్యత్యాసాల కారణంగా అయోమయం ఏర్పడి, ఆ డేటాను అధికారికంగా విడుదల చేయలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తగలదన్న సందేహం చాలామందిలో ఉంది. ఏ కులానికి చెందుతారన్నది తెలియజేసేలా జాబితా రూపొందించి ప్రశ్నించటంవల్ల సమాధానం సులభమవుతుంది. అర్థవంతమైన డేటా లభిస్తుంది. ఒక రాష్ట్రంలో ఉన్న కులం వేరే రాష్ట్రంలో ఉండదు. అలాగే ఒకచోట బీసీగా పరిగణించే కులం మరోచోట ఎస్సీగానో, ఎస్టీగానో ఉండే అవకాశం లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కులాల సేకరణకు అనువైన పద్ధతుల్ని ఎంచుకోవాలి. పార్లమెంటులో ఇందుకు సంబంధించి లోతైన చర్చ జరిగివున్నా, రాష్ట్రాలవారీగా సమావేశాలు నిర్వహించి, ఆ యా ప్రాంతాల్లో ఉండే కులాలు, వర్గాల గురించిన జాబితా ఖరారుచేసివున్నా జాతీయ స్థాయిలో ఏ కులాలు ఏ కేటగిరీ కిందకు వస్తాయో, తీసుకురావాలో ఒక అంచనా వచ్చేది. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో మన దేశం కులం నిర్వహించే పాత్ర తక్కువేమీ కాదు.అణగారిన కులాలు స్వాతంత్య్రానంతరం విద్యావకాశాలను అందుకోవటం, ఉన్నతోద్యోగాలు సాధించటంవంటివి సాధ్యమయ్యాయి. ఆ మేరకు చైతన్యం పెరిగి జనాభా దామాషా ప్రాతిపదికన అవకాశాలు దక్కటంలేదన్న అసంతృప్తి ఎక్కువైంది. కులగణన డిమాండ్ వెనక ఈ నేపథ్యం ఉంది. దానికి తగిన డేటా లభించేలా ఈ కుల గణన ఉండొద్దా? ఇప్పుడు పౌరులు అందజేసిన వివరాల ఆధారంగా ఎన్యూమరేటర్లు వర్గీకరించుకుని అయిందనిపిస్తారు. అప్పుడది విశ్వసించదగ్గ డేటా అవుతుందా? తమకు అన్యాయం జరిగిందనీ, తమ కుల జనాభాను తగ్గించి చూపారనీ ఆరోపణలు వెల్లువెత్తే అవకాశం కూడా లేదా?ఆ సంగతి అటుంచి ఇతర ప్రశ్నలు గమనిస్తే ఇప్పుడు సేకరిస్తున్నది జనాభా లెక్కలా, పౌర నమోదు చిట్టానా అన్న సందేహం రాకమానదు. 2011 నాటి జనగణనలో 29 ప్రశ్నలుంటే అవి ఈసారి 40కి చేరుకున్నాయి. వీటిలో తల్లిదండ్రుల పేర్లు, వివరాలతో పాటు ఆధార్, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, మొబైల్ ఫోన్ నంబర్ వగైరాలున్నాయి. ఈ వివరాల వెల్లడి వ్యక్తిగత గోప్యతకు మంచిదేనా? ఇప్పటికే వివిధ విభాగాలవద్ద ఈ వివరాలుంటాయి. మళ్లీ అవసరమా? 2020 ఏప్రిల్‌నుంచి మొదలుకావాల్సిన జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) ప్రక్రియకు కూడా ఈ మాదిరి ప్రశ్నలే ఉన్నాయి. అది జాతీయ పౌర నమోదు చిట్టా(ఎన్ఆర్సీ) కోసమేనని విపక్షాలు ఆరోపించాయి కూడా. అయితే కోవిడ్ అవరోధం కారణంగా అది మూలనబడటంతో వివాదం సద్దుమణిగింది. హిమపాతం అధికంగా ఉండే జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జనగణనలో కీలకమైన ఈ రెండో దశ సోమవారం లాంఛనంగా మొదలైంది. అందుకే కేంద్రం పారదర్శకంగా వ్యవహరించి అన్ని అంశాలూ తేటతెల్లం చేయాలి. ఈ రాష్ట్రాల్లో ఎదురయ్యే సమస్యల ఆధారంగా తగిన సవరణలు తెస్తే వేరే రాష్ట్రాల్లో ఫిబ్రవరిలో మొదలయ్యే జనగణన నాటికి ఒక సమగ్రత ఏర్పడుతుంది. -
స్వస్థత సాధనాలు
మానవాళి ఎరిగిన ఆదిమ కళ సంగీతం. చరిత్రపూర్వయుగంలోనే సంగీతం మొదలైంది. దాదాపు అదే కాలంలో మనుషులు మాటలు నేర్చుకున్నారు. మాటలతో రూపు దిద్దుకున్న భాషలు మానవాళి అనుభవాలకు ఊహలను జోడించి, సాహిత్యాన్ని సృష్టించు కున్నాయి. ఆనంద విషాదాది భావోద్వేగాలను పలికించే స్వరలయలతో రూపుదిద్దుకున్న సంగీతం క్రమంగా శాస్త్రీయతను సంతరించుకుంది. ‘సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం/ ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం’ అనే శ్లోకం ప్రకారం సంగీతం ఆపాత మధురం, సాహిత్యం ఆలోచనామృతం. సంగీత సాహిత్యాల ప్రస్థానం దాదాపు జమిలిగానే మొదలైనా, స్వభావరీత్యా సంగీ తానికే విస్తృతి, వ్యాప్తి ఎక్కువ. సంగీతంతో సరిపోల్చుకుంటే, సాహిత్యానికి పరిమితులు ఎక్కువ. ‘శిశుర్వేత్తి పశుర్వేత్తి గానరసం ఫణిః/ కో వేత్తి కవితా తత్త్వం శివో జానాతి వా నవా’ అనే శ్లోకం ఉండనే ఉంది. శిశువులు, పశువులు– చివరకు పన్నగాలు కూడా సంగీతానికి ఓలలాడతాయి గాని, సాహిత్య సారమైన కవితా తత్త్వాన్ని సాక్షాత్తు ఆ పరమశివుడైనా తెలుసుకోగలడో లేడో అనే శంక ఈ శ్లోకం రాసిన పూర్వకవికే ఉండేదంటే, సాహిత్యానికి గల పరిమితి, సంగీతానికి గల విస్తృతి ఎంతటివో తేలికగానే అర్థం చేసుకోవచ్చు.సంగీతాన్ని ఆస్వాదించడానికి అక్షరజ్ఞానంతో పనిలేదు. సాహిత్య రసాస్వాదనకు అక్షరజ్ఞానం తప్పనిసరి కనీసార్హత. అలాగని లోకంలోని అక్షరాస్యులందరూ సాహిత్యాన్ని ఆస్వాదించగలరనుకుంటే, పొరపాటే! సాహిత్యాన్ని ఆస్వాదించడానికి కించిత్ ఆలోచించే లక్షణం కూడా ఉండాలి. ఆలోచనా సాగరాన్ని మథిస్తేనే తప్ప సాహిత్యామృతం తల కెక్కదు. ఇంతటి ప్రయాస మనకెందుకనే భావనతోనే చదువుకున్న వాళ్లలో కూడా అత్య ధికులు సాహిత్యం జోలికి పోకుండా, నిక్షేపంగా భద్రజీవితం సాగించేస్తుంటారు. అలాంటి భద్రజీవులు కూడా శ్రావ్యమైన సంగీతం వినిపిస్తే, ఆస్వాదించకుండా ఉండలేరు.సంగీతానికి గల విస్తృతిని గుర్తించిన కవులలో కొందరు వాగ్గేయకారులుగా రాణించారు. తాము రచించిన కృతులను, కీర్తనలను సంగీతాన్ని ఆలంబనగా చేసుకుని జనసామాన్యానికి చేరువ చేశారు. ఇదివరకటి కాలంలో ఈ కోవలోనే మన తెలుగువారైన అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు తదితరులు వాగ్గేయకారులుగా ప్రసిద్ధి పొందారు. ఇటీవలి కాలంలో అమెరికన్ వాగ్గేయకారుడు బాబ్ డిలాన్ సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందాడు. సంగీతాన్ని సాధనంగా మలచుకోవడం వల్లనే వీళ్లంతా జనాలకు అంతగా చేరువ కాగలిగారు.మానవాళి స్వస్థతకు సంగీత సాహిత్యాలు రెండూ అవసరమే! మనిషికి అక్షరజ్ఞానం, కొంత ఆలోచనా శక్తి ఉన్నప్పుడే సాహిత్యం తన ప్రభావం చూపుతుంది. సంగీతానికి అలాంటి షరతులేవీ లేవు. బేషరతుగానే ప్రభావం చూపిస్తుంది. సాహిత్యం మనిషి ఆలోచనలను వ్యక్తం చేస్తుంది. అవ్యక్తమైన అనుభూతులను వ్యక్తం చేయడానికి సాహిత్యం చాలదు. అలాంటప్పుడు సంగీతమే శరణ్యం. ‘అవ్యక్తాన్ని వ్యక్తం చేయడానికి నిశ్శబ్దం తర్వాత తగిన సాధనం సంగీతం మాత్రమే!’ అన్నాడు ఇంగ్లిష్ తత్త్వవేత్త ఆల్డస్ హక్స్లీ. సంగీతంలో మాటలకు మించిన మాయాజాలం ఉంది. అది మాటలకు అందనిది. సాహి త్యంలో ఏ ప్రక్రియలోనైనా మాటలే పనిముట్లు. మాటలు లేకుండా సాహితీ సృజన సాధ్యంకాదు. మాటలు లేకున్నా, సంగీతాన్ని పలికించవచ్చు. ‘మాటలు విఫలమైన చోట సంగీతం మాట్లాడుతుంది’ అన్నాడు డేనిష్ రచయిత హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్.సంగీత సాహిత్యాలను చికిత్సా పద్ధతులుగా కూడా ఉపయోగిస్తున్నారు. ఈ పద్ధతుల మూలాలు పురాతన నాగరికతల కాలంలోనే ఉన్నా, ఇవి పంతొమ్మిదో శతాబ్దిలో కొంత వ్యాప్తిలోకి వచ్చాయి. మొదటి రెండు ప్రపంచ యుద్ధాల కాలంలో గాయపడిన సైనికుల మానసిక ఆరోగ్యం కోసం ఆస్పత్రుల్లో గ్రంథాలయాలు నిర్వహించేవారు. వారి కోసం సంగీత కచేరీలు నిర్వహించేవారు. కొన్ని సంస్థలు సంగీత సాహిత్య చికిత్స పద్ధతులపై ‘మ్యూజిక్ థెరపీ’, ‘బిబ్లియోథెరపీ’ కోర్సులను కూడా నిర్వహిస్తున్నాయి. కోర్సుల సంగతి ఎలా ఉన్నా, మానవాళి స్వస్థత కోసం సంగీత సాహిత్యాలు రెండింటినీ కాపాడుకోవడం సమాజం బాధ్యత. -
వెలుగునీడల ‘స్వాతంత్య్రం’
స్వతంత్ర భారతం నేటితో ఎనభయ్యో వసంతంలోకి అడుగుపెడుతోంది. దేశం ఈ 21వ శతాబ్దిలో ఎటు పయనిస్తున్నదని తరచి చూసుకుని, చక్కదిద్దుకోవాల్సిన సందర్భం ఇది. 1947 ఆగస్టు 15 నాటికి ఈ దేశం 565 సంస్థానాలుగా ఉంది. వలస పాలకులు చెప్పి నట్టల్లా ఆడి, ఇక్కడి సంపదను సంస్థానాధీశులు దోచిపెట్టడంతో ఆసేతుహిమాచలం దారిద్య్రం తాండవిస్తున్నది. తలసరి ఆదాయంలో ప్రపంచంలోనే అట్టడుగునున్నాం. ఆహార ధాన్యాల కొరత అంతా ఇంతా కాదు. వీటిని అధిగమించి పురోగమించటం ఎలా అన్న సంశయం అందరినీ పట్టిపీడిస్తున్నవేళ గోరు చుట్టుపై రోకటిపోటులా మతకల్లో లాలు వచ్చిపడ్డాయి. వేలాదిమంది నెత్తుటి తర్పణంతో ఈ గడ్డ తడిసి ముద్దయింది.హిందూ–ముస్లిం ఐక్యత కోసం స్వాతంత్య్రోద్యమ సారథి గాంధీజీ తన ప్రాణాలనే బలిపెట్టాల్సివచ్చింది. ఆ పరిస్థితుల్ని చూసినవారు ఈ దేశం సమైక్యంగా మనుగడ సాధించగలదా అన్న సందేహంలో పడిపోయారు. భిన్న భాషలు, మతాలు, సంప్ర దాయాలు, సంస్కృతిగల ఈ గడ్డ పురోగతి సాధించటం అసాధ్యమని సంశయపడ్డ వారున్నారు. కానీ భిన్నత్వంలో ఏకత్వాన్ని, వైవిధ్యతలో విశ్వాసాన్ని దర్శించగలిగిన సామాన్య జనమే ఈ దేశాన్ని నడిసంద్రంనుంచి తీరానికి చేర్చారు. మరి ఇప్పుడో... బహుళ రంగాల్లో పురోగమించాం. ఆహార ధాన్యాల దిగుమతి స్థాయినుంచి ఎగుమతి చేసే స్థాయికెదిగాం. ప్రపంచంలో అతి వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో మన దేశం కూడా ఒకటి. అతిపెద్ద స్టార్టప్ నెట్‌వర్క్‌లో ప్రపంచంలో మనది మూడో స్థానం. జనగణన పూర్తికాకపోవటంతో తాజా పరిస్థితిపై సాధికారకమైన గణాంకాలు లేకున్నా అక్షరాస్యత 77.7–80 శాతం మధ్య ఉందంటు న్నారు. స్వాతంత్య్రానికి పూర్వం మహిళల్లో అక్షరాస్యత దాదాపు 9 శాతమైతే, ఇప్పుడది 70.3 శాతానికి చేరింది. గతంతో పోలిస్తే మెరుగైన వైద్య సదుపాయాలు సామాన్యులకు అందుబాటులోకి రావటంతో సగటు ఆయుఃప్రమాణం 71.5 సంవత్సరాలకు చేరుకుంది. నవజాత శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. 1951 నాటికి వెయ్యి శిశువులకూ 146 మరణాలు నమోదుకాగా, ఇప్పుడది 17. ప్రపంచంలోనే అత్యధిక పోలియో కేసులున్న దేశంగా ముద్రపడిన భారత్ ఇప్పుడు ఆ వ్యాధిని పూర్తిగా తరమ గలిగింది. ఒకనాడు పేదరికం 60 శాతం ఉండగా, ఇప్పుడది 12 శాతం లోపు. కానీ గణాంకాలు వాటికవే వాస్తవ స్థితిని ప్రతిబింబించలేవు. చివరి వ్యక్తికి సైతం సంక్షేమం అందటమే నిజమైన అభివృద్ధికి కొలమానమని గాంధీజీ ఎప్పుడో చెప్పారు. ఆ విషయంలో సాధించాల్సిందెంతో ఉంది. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావటంవల్ల ధనిక–పేద తారతమ్యం పెరిగింది. పేరుకు డిగ్రీలున్నా మన యువతలో నైపుణ్యాల కొరతవల్ల వారికి సరైన ఉపాధి లభించటం లేదు. అసలు విద్యారంగమే పేద, ధనిక వ్యత్యాసాలతో నిండింది. ప్రామాణికమైన విద్య ఖరీదైంది కావటంతో అత్యధికులు దాన్ని అందుకోలేకపోతున్నారు. ప్రభుత్వాలు ప్రైవేటు మోజులోపడి విద్యావ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నాయి. దేశంలో మొదటిసారి నెలకొల్పిన కొఠారి కమిషన్(1964–66) మొదలుకొని 2020 నాటి జాతీయ విద్యావిధానం వరకూ విద్యకు జీడీపీలో 6 శాతం కేటాయించాలని సిఫార్సు చేస్తూనే ఉన్నాయి. కానీ ఎప్పుడూ అది 4 శాతానికి మించటంలేదు. వైద్యరంగానికీ అంతే. అది ఎప్పుడూ 2.5 శాతం మించదు. మహిళా సాధికారత పెరిగిందనీ, వారు సైతం భిన్న రంగాల్లో నాయకత్వ పాత్ర పోషిస్తున్నారనీ సంబర పడటమే తప్ప మహిళలపై నేరాలను అరికట్టడంలో, జెండర్ వివక్షను నిర్మూలించటంలో ఇంకా వెనకబడే ఉన్నాం. సామాజిక మాధ్యమాల ఆసరాతో మహిళలపై వివక్ష, భావోద్వేగాలు రెచ్చగొట్టడం మరింత పెరిగింది. ఏ పార్టీకీ, సిద్ధాంతానికీ చెందని జెన్ జీ యువత ఇక్కడంతా సవ్యంగా ఉన్నదన్న భ్రమల్ని బద్దలుకొట్టింది. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ జంతర్‌మంతర్ ఉద్యమానికి తక్షణసందర్భం కావొచ్చుగానీ... నాసిరకం విద్య, నిరుద్యోగం, అగమ్యగోచర భవిష్యత్తు వారిని నిరాశానిస్పృహల్లోకి నెట్టాయి. కష్టించే స్వభావమూ, కలల్ని సాకారం చేసుకునే పట్టుదల గల యువత కోసం ఇంకేమి చేయాలో గ్రహించగలిగే వివేకం పాలకుల్లో కలిగినప్పుడే దేశం నిజమైన పురోగతి సాధించగలుగుతుంది. -
‘వాయిదాల’ పార్లమెంటు!
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారైనప్పుడు నీట్ ప్రశ్నపత్రం లీక్ ఉదంతం ఈ స్థాయిలో సభను ముంచెత్తుతుందనీ, వరస గందరగోళ దృశ్యాలతో మొత్తం కార్యకలాపాలే స్తంభించిపోతాయనీ, వాయిదాలతోనే గడిచిపోతుందనీ ఎవరూ ఊహించి వుండరు. నిరవధిక వాయిదా అనంతరం సమావేశాల తీరుతెన్నులెలా ఉన్నాయో చెప్పటం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వంతు. ఆ శాఖను నిర్వహిస్తున్న కిరణ్ రిజిజు లోక్‌సభ 19 శాతం, రాజ్యసభ 39 శాతం కాలాన్ని వినియోగించుకో గలిగాయని ప్రకటించారు. ఇలా జరగటం కొత్తేమీ కాదు. చట్టసభలు నిర్దేశించుకున్న లక్ష్యానికీ, సాధించిన ఫలితానికీ పొంతన లేకపోవటం మనకు రివాజే. దీనికి భిన్నంగా మన పార్లమెంటు సక్రమంగా పనిచేసిందంటే, సంతృప్తికరంగా చర్చలు సాగాయంటే ఆశ్చర్యపడాలి. యూపీఏ హయాంలో 2010లో పార్లమెంటు శీతాకాల సమావేశాల వ్యవధిలో కేవలం 5 శాతం మాత్రమే పనిచేసింది. రాజ్యసభ అయితే కేవలం 2 శాతం! ఆ రికార్డును అధిగమించిన సమావేశాలు ఇంతవరకూ లేకపోవటం జనం అదృష్టం. సమావేశాల కాలానికి ఎప్పుడూ ఏదో సమస్య ఊడిపడటం, అధికార విపక్షాలు పరస్పర కలహాలు తప్పడంలేదు. ఇలా వాయిదాల పరంపరతో ప్రభుత్వ పక్షం కీలకమని భావించిన బిల్లుల్ని మూజువాణి ఓటుతో ఆమోదింపజేసుకోవటం అసలు సమస్య. యూపీఏ హయాంలో లోక్‌సభలో 20 బిల్లులపై కేవలం అయిదంటే అయిదే నిమిషాలు చర్చ జరిగింది. ప్రజల తలరాతల్ని నిర్ణయించే అనేక నిర్ణయాలు ఈ తోవన చట్టాలుగా మారుతున్నాయి. ఇందులో లక్షల కోట్ల విలువైన ఆర్థిక బిల్లులు కూడా ఉంటున్నాయి. ప్రశ్నోత్తర సమయం, జీరో అవర్ వంటివి కొట్టుకుపోతున్నాయి. క్రమశిక్షణాయుత ప్రవర్తనతో ప్రజల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని పెంచాల్సినవారే అందుకు విరుద్ధమైన సందేశం పంపుతున్నారు. విపక్షంలో ఉండగా బీజేపీ ఏం చేసిందో, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలాగే చేయాలనుకుంది. ఈ క్రమంలో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతున్నది. సమావేశాల ఆరంభం రోజున కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిర్వహించిన ‘ఛలో పార్లమెంటు’ ఊహించని పరిణామాలకు దారితీసింది. అసలు సమావేశాల్లో సగభాగం దాని చుట్టూనే తిరిగింది. ఆవిర్భవించిన కొన్ని నెలలకే సీజేపీ ఒక అసాధారణ పరిణామానికి కారణం కావటం దాని ప్రత్యేకత. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవినుంచి తప్పుకోవాల్సివచ్చింది. బీజేపీ అధికారంలోకొచ్చిన ఈ పన్నెండేళ్లలోనూ విపక్షాలన్నీ కట్టగట్టుకుని ఒక్కటైనా ఇలా కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయాయి. టీఎంసీ ఎంపీలు కొందరు బీజేపీలోకి ఫిరాయించటం, ఇండియా కూటమినుంచి డీఎంకే వైదొలగటం విపక్షాలను నైతికంగా దెబ్బతీసే పరిణామాలు. రంగంలో సీజేపీ లేనట్టయితే విపక్షాలు నిస్తేజంగా, నిస్సహాయంగా దిక్కుతోచని స్థితిలో పడివుండేవి. తమ ఉద్యమా నికి ప్రధాన విపక్షంగా కాంగ్రెస్ తోడ్పాటు అందించకపోయినా జెన్ జీ ఆ పార్టీకి చేసిన ఉపకారమిది. సమావేశాల రెండో భాగంలో కాంగ్రెస్ కాస్త మేల్కొని ప్రధాని నివాసం ఎదుట ధర్నాకు దిగింది. జెన్ జీ ప్రస్తావించని పెల్లెట్ల అంశాన్ని ప్రధాన సమస్యగా మార్చింది. కోల్పోయిన ప్రతిష్ఠను కొద్దో గొప్పో కాపాడుకునే ప్రయత్నం చేసింది. రోడ్లపైకొచ్చి ఆందోళన చేస్తే తప్ప చట్టసభలకు తమ సమస్యలు పట్టబోవన్న అభిప్రాయం జనంలో కలగటం మంచి పరిణామమేనా అన్నది పార్టీలు ఆలోచించుకోవాలి. అది శాంతియుత ఆందోళనా, హింసాత్మకమా అన్న విచక్షణలేకుండా ప్రతి సమస్యనూ పోలీసులే పరిష్కరిస్తారన్న అభిప్రాయంతో ఉంటే ఏమవుతుందో జంతర్ మంతర్ నిరూపించింది. సమస్యల్ని చూసే కోణంలోనూ పార్టీల ద్వంద్వప్రవృత్తి వెల్లడవుతోంది. ఢిల్లీలో జెన్ జీ ఉద్యమంపై మొదట్లో అభాండాలేసిన బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు తమ తప్పిదాన్ని గుర్తించాయి. జార్ఖండ్ ఆందోళనలో చురుగ్గా పాల్గొంటున్నాయి. మంచిదే. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన డీఎస్సీ అవకతవకలపై మాత్రం ఈ సంస్థలు నోరెత్తవు. సాక్షాత్తూ అభ్యర్థులే గోడు వినిపిస్తున్నా బుకాయింపులే. ఇలాంటి వైఖరులే పార్టీల నిజాయితీని ప్రశ్నార్థకం చేస్తాయి. మొత్తానికి వర్షాకాల సమావేశాల తీరుతెన్నులపై అన్ని పక్షాలూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. భవిష్యత్తులో ఈ పరిస్థితి తలెత్తకుండా ఏం చేయవచ్చునో ఆలోచించుకోవాలి. -
ఏఐ మనల్ని చింపాజీలను చేస్తుంది!
చాట్‌జీపీటీకి పోటీగా, 2023లో ‘ఎక్స్’ఏఐని స్థాపించిన ఎలాన్ మస్క్ తన ప్రధాన కంపెనీలైన టెస్లా, స్పేస్ ఎక్స్లలో కూడా ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఏఐ అభివృద్ధి, ఏఐ వినియోగాలలో అప్రమత్తంగా లేకపోతే... జీవపరిణామ క్రమంలో మనిషి తన తెలివి తేటల్లో చింపాజీలను మించిపోయినట్లే, కృత్రిమ మేధ పరిణామ కాలంలో ‘ఏఐ చింపాజీలు’ మనిషి మేధస్సును దాటి వెళ్లే ప్రమాదం ఉందని మస్క్ అంటున్నారు. ముఖ్యాంశాలు :2036 నాటికి డబ్బుతో పనుండదు!‘‘నేను ఇంకో ఊహ కూడా చెబుతున్నాను. 2036 నాటికి డబ్బుకు అసలు విలువ ఉండదు. లేదా, డబ్బు అవ సరం ఉండదు. మీకు డబ్బు ఎందుకు కావాలి? వస్తు వులు, సేవలు కొనడానికి. అంటే ఆహారం, ఇల్లు, రవాణా, వినోదం, వైద్యం కోసం. ఒకవేళ హ్యూమ నాయిడ్ రోబోలు (మనిషిలాంటి రోబోలు), ఏఐ కలిసి మనుషులు వాడేదాని కంటే చాలా ఎక్కువ వస్తువులను, సేవలను అందించగలిగితే, ఇక డబ్బుతో ఏం పని ఉంటుంది? మిషన్లే అన్నింటినీ దాదాపు రూపాయి ఖర్చు లేకుండా తయారు చేస్తున్నప్పుడు అవసరాల కొరత అనేది తుడిచిపెట్టుకుపోతుంది. అప్పుడు వస్తు సేవలను పంపిణీ చేయటానికి డబ్బును ఒక సాధనంగా వాడే పద్ధతి పూర్తిగా పనికిరాకుండా పోతుంది. (ఉదా: 10 ఆపిల్స్ మాత్రమే ఉన్నాయి, కానీ 100 మంది మనుషులు ఉన్నారు. ఇప్పుడు ఆ 10 ఆపిల్స్ ఎవరు పొందుతారు? ఎవరి దగ్గర డబ్బు ఉంటే వారు. కానీ ఏఐ, రోబోల వల్ల 10,000 ఆపిల్స్ ఉత్పత్తి జరిగి అందరికీ, అవసరానికి సరిపడా ఉన్నప్పుడు డబ్బు లేనివాళ్లు కూడా వాటిని పొందగలుగుతారు.‘పరిమితి లేని’ ఆర్థిక వ్యవస్థ‘‘కేవలం డిజిటల్ రూపంలోనే కాకుండా రోబోల రూపంలో కూడా టెక్నాలజీ బయటి ప్రపంచంలోకి వచ్చినప్పుడు, అంటే వందల మిలియన్ల హ్యూమనా యిడ్ రోబోలు పనిచేస్తున్నప్పుడు అవి సాఫ్ట్‌వేర్‌ను మార్చే తెలివితేటలు ప్రదర్శించి, మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచాన్ని ప్రభావితం చేయటం ప్రారంభి స్తాయి. ఆర్థికశాస్త్రంలో ఉత్పత్తి అనేది ఎప్పుడూ మను షుల కష్టం, వారి పని సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది. కానీ డిజిటల్ తెలివితేటలతో నడిచే కోట్లాది రోబోలు మనకు అందుబాటులోకి వస్తే, అది ఒక పరి మితి లేని ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తుంది. మనం చూడ బోయే ఈ భారీ మార్పును పోల్చడానికి చరిత్రలో ఎటువంటి ఉదాహరణా లేదు. ఎందుకంటే పరిమితి లేని పనిశక్తిని తట్టుకునేలా మన పాత ఆర్థిక నమూనాలు తయారవ్వలేదు.ధరలు పూర్తిగా పడిపోతాయి!‘‘ప్రభుత్వాలు నేరుగా ప్రజలందరికీ ‘యూనివర్సల్ హై ఇన్కమ్’ (చాలా ఎక్కువ ఆదాయం) చెక్కులను ఇవ్వా లని నేను భావిస్తున్నాను. చాలామంది నన్ను అడుగు తుంటారు: ‘దీనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇష్టమొచ్చినట్లు నోట్లు ముద్రిస్తే తీవ్రమైన ద్రవ్యోల్బణం రాదా?’ అని. కానీ సాధారణంగా వస్తువులు తక్కువగా ఉండి, ప్రజల దగ్గర డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడే ధరలు పెరుగుతాయి. కానీ ఇక్కడ దానికి పూర్తిగా విరుద్ధంగా జరుగుతుంది. రోబోలు తయారుచేసే వస్తువుల ఉత్పత్తి వేగంగా పెరుగుతుంది. కాబట్టి ఎంత భారీగా డబ్బులు ముద్రించినా, వస్తువుల ఉత్పత్తి అంతకంటే వేగంగా పెరుగుతుంది కాబట్టి ధరలు తగ్గడమే జరుగుతుంది.ఏఐతో ఊహకందని సమస్యలు‘‘మనకంటే ఎంతో తెలివైన డిజిటల్ సూపర్–ఇంటెలిజెన్స్‌ను నేను కానీ, లేదా ఏ మనిషి కానీ నియంత్రించగలరని అనుకోవడం మన భ్రమ అవుతుంది. పదేళ్లలో, కృత్రిమ మేధ (ఏఐ) మనుషులందరి ఉమ్మడి తెలివితేటలను దాటిపోతుంది. ప్రకృతిని ఒకసారి చూడండి. మనుషులకు, చింపాంజీలకు మధ్య ఉన్న తెలివితేటల తేడా కంటే, సూపర్–ఏఐకి, మనుషులకు మధ్య ఉన్న తేడా చాలా ఎక్కువై... చింపాంజీలే ప్రపంచాన్ని ఏలితే ఏలా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు మన ముఖ్య లక్ష్యం ఏంటంటే, ఆ సూపర్–ఇంటెలి జెన్స్‌ను మనుషుల శ్రేయస్సుకు, పురోగతికి అనుకూలంగా పనిచేసేలా చూసుకోవడమే.రాజకీయాల్లో కాస్త హద్దు దాటాను! ‘‘నిజం చెప్పాలంటే నేను రాజకీయాల్లో కొంచెం ఎక్కువ జోక్యం చేసుకుని, కాస్త ముందుకు వెళ్లానని అనిపిస్తోంది. అధికారిక రాజకీయ పదవులు చేపట్టడం లేదా ‘డాడ్జ్’ (డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియె న్సీ)ని నిర్వహించడం కంటే, నేను స్పేస్ఎక్స్, టెస్లా, ఏఐ సంస్థలను అభివృద్ధి చేయటంపైనే దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ప్రభుత్వ పనులను సరళీకృతం చేయడం, పన్ను చెల్లింపుదారుల డబ్బు వృథా కాకుండా చూడడం, అవినీతి ఖర్చులను అరికట్టడమే నా ముఖ్యో ద్దేశం. కానీ రాజకీయ రంగం విషపూరితమైనది, అక్కడ నాపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. అది చివరికి నా అసలు లక్ష్యం నుంచి నా దృష్టిని మళ్లించింది.- ఎడిటోరియల్ టీమ్ -
పాత ఒప్పందానికి పాతర
అనిశ్చిత ప్రపంచంలో మరో కొత్త రక్షణ ఒప్పందం ఉనికిలోకొచ్చింది. తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్తాన్‌లు గత శుక్రవారం ‘మక్కా రక్షణ ఒప్పందం’ పేరిట ఒక ఒడంబడిక కుదుర్చుకున్నాయి. పూర్తి పాఠాన్ని బయటపెట్టలేదు గనుక దీని లోతుపాతులు తెలియవు. కానీ పాకిస్తాన్ విదేశాంగ శాఖ ‘ఈ మూడు దేశాల్లో ఏ ఒక్కరిపై దాడి జరిగినా అది అందరిపైనా జరిగిన దాడిగా పరిగణించాల’ని నిర్ణయించుకున్నట్టు ఒక ప్రకటన విడుదల చేసింది. తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయీప్ ఎర్డోగాన్ మాత్రం ‘ఈ ఒప్పందం కింద ఉమ్మడిగా రక్షణ పరిశ్రమ ప్రాజెక్టులు చేపట్టడం, ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో పాలుపంచుకోవటం ఉంటాయ’ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఒప్పందం విషయంలో అమెరికాకు ఆగ్రహం కలుగుతుందని సౌదీ భావించినట్టుంది. అందుకే ‘ఈ మూడు దేశా లకూ ఇప్పటికే ఉన్న ఇతర రక్షణ ఒప్పందాలు దీనికి అడ్డురాబోవ’ని సౌదీ ఉపమంత్రి రేయాద్ క్రిమ్లీ వివరణనిచ్చారు. ఒప్పందంపై కొద్ది నెలలుగా సాగిన చర్చల్లో పాల్గొన్న ఈజిప్టు చివరన ముఖం చాటేసింది. ఇంతకూ ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ (ఓఐసీ) సదస్సులో గతంలో కుదిరిన ‘మక్కా ఒప్పందం’ ఏమైంది?ఈ మూడు దేశాలకూ ఇరుగుపొరుగుతో వాటి వాటి సొంత ఘర్షణలున్నాయి. తమలో తమకున్న పొరపొచ్చాలు వీటికి అదనం. నాటోలో భాగస్వామిగా ఉన్న తుర్కియేకు ఎజియన్ సముద్రంలో మరో సభ్య దేశం గ్రీస్‌తో సరిహద్దు లడాయి వుంది. ఇజ్రాయెల్‌తో వైరం సరేసరి. పాకిస్తాన్ అయితే ఇటు మన దేశంతోపాటు అఫ్గానిస్తాన్‌తో కూడా కలహిస్తోంది. ఇరాన్‌పై అమెరికా దాడుల్ని సమర్థించటమేకాక... దాని అభీష్టం మేరకు ఇజ్రాయెల్‌తో అవగాహన కుదుర్చుకున్న చరిత్ర సౌదీది. పర్యవసానంగా ఇరాన్ నుంచీ, ఎర్ర సముద్రంలో ఇరాన్ మద్దతుదార్లయిన హౌతీలనుంచీ సమస్యలు ఎదుర్కొంటోంది. ఇక 2018లో తుర్కియే గడ్డపై జర్నలిస్టు ఖషోగ్గిని కిరాయి హంతకులతో సౌదీ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ హత్య చేయించారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయంలో రెండు దేశాల సంబంధాలూ దెబ్బతిన్నాయి. అమెరికా ప్రాపకంతో తెరవెనక సర్దుబాట్లు కుదిరినా తుర్కియే ఆగ్రహం చల్లారలేదు.ఇలా ఎవరికి వారు సక్రమంగా లేకుండా, ఎవరిపై దాడి జరిగినా అందరం ఏకమవు తామనటంలోని సహేతుకత ఏమిటో అర్థంకాదు. దేశంలో అమెరికా స్థావరాలుంటే భద్రతకు తిరుగులేదని ఇతర గల్ఫ్ దేశాలతోపాటు సౌదీ కూడా అమాయకంగా అనుకున్నది. అమెరికా వేరేవారిపై దాడి చేస్తే దాని అధునాతన రక్షణ వ్యవస్థవల్ల ఒక్క క్షిపణి కూడా తమ గడ్డపై పడబోదని నమ్మింది. అదంతా ఉత్త భ్రమగా తేలింది. ఇరాన్ వల్లకాడు కావటానికి తోడ్పడుతూ తమ జోలికి మాత్రం అది రాకూడదని కోరుకోవటం అత్యాశ అని అర్థమైంది. అందుకే రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుని అందరినీ హడలెత్తించాలని ఆ దేశం నిర్ణయించుకున్నట్టు కనబడుతోంది. నిరుడు పాక్‌తో కుదిరిన రక్షణ ఒప్పందం తాజా యుద్ధంలో కొరగాకుండా పోయింది. ఇరాన్‌తో అంటకాగిన పాక్... కనీసం సౌదీపై అది చేసిన దాడుల్ని ఖండించటానికి కూడా సిద్ధపడలేదు. తీరు మారకపోతే ఈ త్రైపాక్షిక ఒప్పందానికీ అదే గతి పడుతుంది. ఇస్లామిక్ దేశాలు 2005లో ‘మక్కా ఒప్పందం’ కుదుర్చుకున్నాయి. ఆ సంగతి ముగ్గురిలో ఎవరికైనా గుర్తుందా? పదేళ్లపాటు కొనసాగాల్సిన ఆ ఒప్పందాన్ని మరో పదేళ్లు పొడిగించారు కూడా. దాని అతీగతీ తెలియదు. 21వ శతాబ్దంలో ఇస్లాంకు ఎదురవుతున్న సవాళ్లపై జరిపిన సదస్సులో ఈ ఒప్పందం కుదిరింది. ఇస్లామిక్ ప్రపంచంలో సంయమనం, సౌభ్రాతృత్వం, మానవ హక్కులు, సుపరిపాలన, ఆర్థిక సహకారం, ఘర్షణల నివారణ, పేదరిక నిర్మూలన, ఉన్నత విద్య, శాస్త్ర సాంకేతికతలు, మహిళల హక్కులు దాని ప్రధానాంశాలు. ఇందులో పాలస్తీనా కూడా ఉంది. వినడానికి భేషుగ్గా ఉంది. కానీ ఆచరణ? తాజా ఒప్పందంతో వాటన్నిటినీ పర్షియన్ గల్ఫ్‌లో నిండా ముంచినట్టేనా? ఇతరుల్ని ఇబ్బందుల్లోకి నెడుతూ, వారినుంచి తమకేమీ కాకూడదని ఆశించటం వ్యర్థ ప్రయత్నమని ఈ దేశాలు గుర్తించాలి. ఇందుకు బదులు 2005 నాటి ఒప్పందం అమలుకు చిత్తశుద్ధితో కృషిచేయాలి. అప్పుడు మాత్రమే వాటికి కోరుకున్న శాంతి లభిస్తుంది. -
సోషల్ మీడియాపై రణభేరి!
సామాజిక మాధ్యమాలు వచ్చాక ప్రపంచ పరిణామాలన్నీ వెంటవెంటనే అందరికీ చేరుతున్నాయి. అవి భావవ్యక్తీకరణ విస్తృతిని పెంచి కోట్లాదిమందికి గొంతునిస్తు న్నాయి. ఇన్నాళ్లూ మౌనంగా, నిస్సహాయంగా వీక్షించినవారంతా నిక్కచ్చిగా, నిర్మొహ మాటంగా తమ అభిప్రాయాలు వినిపిస్తున్నారు. కానీ మంచితోపాటే చెడు కూడా ఇందులో కలగలిసివుంది. వాటి కారణంగా అనవసర వదంతులు వ్యాపించి ఎందరో అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మన దేశం వరకే తీసుకుంటే దొంగ లుగా ముద్రపడి కొన్నిచోట్ల, గోవుల్ని తరలిస్తున్నారని ఆరోపణలొచ్చి మరికొన్నిచోట్ల ఉన్మాద గుంపులు దాడులు చేసి హతమార్చిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. టీనేజర్లు, పిల్లల మనసుల్లో ఈ వేదికల దుష్ప్రభావం కూడా నానాటికీ పెరుగుతోంది. మానసిక ఒత్తిళ్లకూ, రుగ్మతలకూ అవి కారణమవుతున్నాయి. అమెరికా అప్పీళ్ల కోర్టులో మెటా, ఆల్ఫాబెట్, స్నాప్‌చాట్, టిక్‌టాక్ తదితర సంస్థలపై సోమవారం 3,000కు పైగా పిటిషన్లు దాఖలు కావటాన్ని ఈ నేపథ్యంలో చూడాలి. ‘పబ్లిక్ న్యూసెన్స్’ కింద దాదాపు 40 రాష్ట్రాలతోపాటు మున్సిపాలిటీలు, పాఠశాలలు, వ్యక్తులు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. వాస్తవానికి మొన్న మార్చిలోనే లాస్ ఏంజెలెస్‌కి చెందిన న్యాయస్థానం సామాజిక మాధ్యమ వేదికల్ని యువతకు హానికరమైన రీతిలో రూపొందించటాన్ని తప్పుబట్టింది. చిన్న వయసులో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లు తనను బానిసగా మార్చాయనీ, ఇందువల్ల తీవ్రంగా నష్టపోయాననీ ఆరోపిస్తూ కోర్టుకెక్కిన 20 యేళ్ల యువతికి 60 లక్షల డాలర్ల పరిహారం చెల్లించాలని ఆ న్యాయస్థానం తీర్పునిచ్చింది. న్యూమెక్సికోలో సైతం మెటాపై ఈ తరహా తీర్పే వెలువడింది. వేదికకు సంబంధించిన భద్రత విషయంలో వినియోగదారుల్ని అది తప్పుదోవ పట్టించిందని న్యాయస్థానం నిర్ధారించింది. 37.5 కోట్ల డాలర్ల పరిహారం చెల్లించాలని సంస్థను ఆదేశించింది. చాన్నాళ్లక్రితమే టీనేజర్లపైనా, పిల్లలపైనా సామాజిక మాధ్యమాల దుష్ప్రభావం ఎలా ఉన్నదో ప్రభుత్వాలు గుర్తించాయి. ఆస్ట్రేలియా పదహారేళ్లలోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల ప్రవేశాన్ని నిషేధించింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకునే బాధ్యతను టెక్ సంస్థలపైనే పెట్టింది. దీన్ని పాటించనట్టయితే దాదాపు 5 కోట్ల ఆస్ట్రేలియా డాలర్లు జరిమానా చెల్లించాలని చట్టం నిర్దేశించింది. బ్రిటన్, ఫ్రాన్స్ సైతం ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. యూరోపియన్ యూనియన్(ఈయూ) హానికర మైన పోస్టుల్ని తొలగించటంలో జాప్యం జరిగితే గ్లోబల్ టర్నోవర్‌లో 6 శాతం మొత్తాన్ని జరిమానా విధించే చట్టం తీసుకొచ్చింది.తెలిసో తెలియకో ఏదైనా వీడియో చూస్తే ఆ వెనువెంటనే అటువంటివే కుప్పలు తెప్పలుగా వచ్చిపడేలా ఆ మాధ్యమాలు అల్గారిథమ్‌లు రూపొందిస్తున్నాయి. తెలిసీ తెలియని వయసులో ఉన్న పిల్లల్ని వ్యామోహాల బారిన పడేస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలొచ్చినప్పుడల్లా ఈ మాధ్యమాలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాము కేవలం ఒక వేదిక మాత్రమే కల్పిస్తున్నామనీ, అందులో వేరెవరో ఉంచే కంటెంట్‌కు తామెలా బాధ్యులమనీ ప్రశ్నిస్తున్నాయి. ఏటా వేలాదికోట్ల డాలర్ల లాభాలు ఆర్జించే ఉద్దేశంతోనే ఈ సంస్థలు జుగుప్సాకర, హింసాత్మక అంశాలున్న వీడియోల్ని చూసీ చూడనట్టు వదిలేస్తున్నాయి. సామాజిక మాధ్యమాలు భావప్రకటనా స్వేచ్ఛకు అనువైనవి. కానీ అవి దుర్వినియోగమైన పక్షంలో కఠినచర్యలుండాలి. మన దేశం ఈ విషయంలో వెనకబడే ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగానో, పాలకుల్ని కించపరిచేవిధంగానో పోస్టులున్నప్పుడే తక్షణ స్పందన కనిపిస్తోంది. తెలంగాణలో ఆన్లైన్ చానెళ్లు నిర్వహిస్తున్న మహిళా పాత్రికేయులపై అత్యంత జుగుప్సాకరంగా పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు లేవు. ఆంధ్రప్రదేశ్‌లో పత్రికల్లో వచ్చిన కథనాలను పోస్టుచేసినందుకే వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల్ని అరెస్టుచేస్తున్న ప్రభుత్వం... ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డినీ, ఇతర నేతలనూ కించపరుస్తూ పోస్టులు పెట్టే టీడీపీ నేతలనూ, కార్యకర్తలనూ చూసీచూడనట్టు వదిలేస్తోంది. అందుకే అమెరికాలో మాదిరి మన దేశంలో కూడా మాధ్యమాల, ప్రభుత్వాల జవాబుదారీతనాన్ని పెంచే చట్టాన్ని తీసుకురావాలి. అప్పుడు మాత్రమే ఇటువంటి పెడధోరణులు ఆగుతాయి. -
జార్ఖండ్‌లో ‘జంతర్ మంతర్’
ఉన్నత చదువులకూ, ఉద్యోగాలకూ పోటీ పరీక్షలు నిర్వహించే ప్రభుత్వాలు వాటిల్లో అవకతవకలు బయపడినప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం, విశ్వసనీయ సంస్థలతో దర్యాప్తు చేయించటానికి మొండికేయటం ఈమధ్య కనబడుతున్న వింత ధోరణి. సోమవారం జార్ఖండ్‌లోని రాంచీలో నిరుద్యోగ యువత, విద్యార్థులు ‘అసెంబ్లీ ముట్టడి’ నిర్వహించినప్పుడు చానెళ్లలో కనబడిన దృశ్యాలు విస్తుగొలిపాయి. హఠాత్తుగా చూసినవారికి అది జంతర్ మంతరో, జార్ఖండో తెలియని స్థితి ఏర్పడింది. జార్ఖండ్‌లో జేఎంఎం నాయకత్వానగల పాలక కూటమిలో కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. కానీ తమ డిమాండ్లు నెరవేరటం కోసం రాంచీలో యువత 16 రోజులుగా పోరాడాల్సి వస్తోంది. ఉద్యమకారుల డిమాండ్లలో 98 శాతం నెరవేర్చామని జార్ఖండ్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. గత నెల 22న ఈ వ్యవహారంలో పదవి నుంచి తప్పుకొన్న జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ) చైర్మన్ ఎల్. ఖియాంగ్టేను తాజాగా అరెస్టు చేశారు. కమిషన్‌లోని ముగ్గురు సభ్యులు గవర్నర్‌కు రాజీనామాలు సమర్పించారు. కానీ ఉద్యమకారుల ప్రధాన డిమాండ్ అయిన సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం ససేమిరా అంటున్నది.నిరుద్యోగ యువతతో ముడిపడి ఉన్న సమస్యలపై ప్రభుత్వాల స్పందనెలా ఉంటుందో జంతర్ మంతర్‌తోపాటు జార్ఖండ్ ఉద్యమం కూడా నిరూపించింది. సర్కారీ కొలువు లభించాలని యువతీయువకులు ఎంతగానో తపిస్తారు. అందుకోసం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచి చదువుల్లో మునిగిపోతారు. శిక్షణ కోసం వేలకు వేలు వెచ్చిస్తారు. తీరా ప్రశ్నపత్రం లీకయిందంటే, అయోగ్యులు పైపైకి ఎగబాకారని తెలిస్తే... ఆ పిల్లలు, వారి తల్లిదండ్రులు చెప్పనలవికాని వేదనను అనుభవిస్తారు. వారి కలల ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలుతుంది. లక్షలాదిమంది జీవితాలతో ఆడుకున్న ఒక పెద్ద కుంభకోణం బయటపడిన వెంటనే చిత్తశుద్ధిగల ప్రభుత్వమైతే సంబంధిత మంత్రి చేత రాజీనామా చేయిస్తుంది. ఆ పరీక్షల నిర్వహణలో పాలుపంచుకున్న వారందరినీ అరెస్టు చేస్తుంది. పరీక్ష ఫలితాలను రద్దుచేస్తుంది. ఇందుకోసం యువత రోడ్డెక్కాల్సి వచ్చిందంటే పాలకులు సిగ్గుపడాలి. తప్పు జరిగిందని తెలిసినా జార్ఖండ్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు డిమాండ్‌ను ఎందుకు తిరస్కరిస్తోంది? అదొక్కటే కాదు... ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కూడా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై, వేలంపాటలపై సీబీఐతో దర్యాప్తు చేయించడానికి మొండికేస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ నిర్వహిస్తున్న నిరసనలపై రౌడీ ఎమ్మెల్యేలతో దాడులు చేయిస్తోంది. ఈ వ్యవహారంలో విద్యామంత్రి లోకేశ్ మీడియాతో మాట్లాడటానికి జంకి, ప్రభుత్వాధికారుల్ని ముందుకు తోస్తున్నారు. మరోవైపు చర్చకు సిద్ధమని సవాళ్లు విసురుతున్నారు. సాక్షాత్తూ అభ్యర్థులే తమకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుతుంటే... ఇలా బీరాలు పోవడం ఆయన గారికి సిగ్గనిపించడం లేదు. కేంద్రంలో తమ కూటమి ఏలుబడే ఉన్నా, సీబీఐ దర్యాప్తు అనగానే ఏపీ సర్కారు నిలువెల్లా వణుకుతోంది. యువత ఉద్యమాల సందర్భంగా రాజకీయ పక్షాల ద్వంద్వవైఖరి తేటతెల్లం అయింది. జంతర్ మంతర్ ఆందోళనపై ముద్రలేసి, దాన్ని నీరుగార్చాలని చూసిన బీజేపీ చివరాఖరికి తన వైఖరిని మార్చుకుంది. కానీ జార్ఖండ్ ఆందోళనలో అది చురుగ్గా పాల్గొంటున్నది. ఢిల్లీ ఉద్యమంలో మౌనప్రేక్షకపాత్ర వహించి ఆఖరి దశలో మేల్కొన్న కాంగ్రెస్... జార్ఖండ్‌లో పాలక కూటమిలో ఉంటూ కూడా ప్రభుత్వానికి నచ్చజెప్పలేకపోయింది. పైగా మీ డిమాండ్లేమిటో చెప్పండని పదిరోజులైనాక కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఉద్యమకారుల్ని అడిగారు. ఏపీలో పాలక కూటమిలో ఉన్న బీజేపీ అక్కడి డీఎస్సీ నియా మకాల స్కామ్‌పై నోరెత్తదు. కానీ జార్ఖండ్‌లో మాత్రం నేనున్నానంటూ ముందు కొస్తుంది. ఇవన్నీ యువత గుర్తించరనుకోవటం ఆ పక్షాల తెలివితక్కువతనం. వెంటనే ప్రభుత్వాలు ఉన్నతస్థాయి దర్యాప్తునకు సిద్ధపడి లీకుల వెనకుండే మాఫియాలనూ, వారికి అండదండలందించే బడా నేతలనూ బయటకు లాగాలి. ఇతర వాగ్దానాల సంగ తలావుంచి కనీసం పరీక్షలైనా సక్రమంగా నిర్వహించలేకుంటే యువత క్షమించదు. -
అడాప్ట్ ఎ రైటర్
ఫ్యూచర్ సిటీలో కొత్త భూమిపూజ. అమరావతిలో అర్ధరాత్రిళ్లు లైట్ల వెలుతురు హడావిడి. పేపరు తెరిస్తే లక్షల కోట్ల పెట్టుబడుల హెడ్‌లైన్స్. పాలన అంటే నిర్మాణమూ లేదా కూల్చడమూ. కాని ఒక సమాజం ఎదిగిందనడానికి ఇటుకలూ కాంక్రీటు దిమ్మెలూ మెడెత్తి చూసే హార్మ్యాలూ తార్కాణాలు కాదు. ఒక గొప్ప కథ, నినాదం కాదగ్గ కవిత, జీవన దర్శనం చేయగల నవల, భాషను తోమి మెరిసేలా చేసే వచనం... ఇవీ నాగరికతకు ఆనవాళ్లు. మరి తెలుగులో అలాంటి ఆనవాళ్లుగా నిలిచే రచనలు ఎన్ని? ఏ కాలంలో అయినా అవి ఎందుకు కొన్ని? నిజమైన సృజనాత్మకతకు సెలవు రోజో, తీరిన సాయం సమయమో చాలదు. నాలుగు గదుల్లో కూచుని చేసే కృత్రిమ ఊహ పాఠకుడికి చీమిణ్ణి చూసిన ఏహ్యత కలిగిస్తుంది. ఆక్రమణకు గురయ్యే అభయారణ్యంలోని నెమలి క్రీంకారాన్ని వినిపించాలన్నా, సోలార్ పలకల దెబ్బకు దగా పడుతున్న పల్లె గుండెల నిట్టూర్పును చిత్రిక పట్టాలన్నా ఫీల్డ్కి వెళ్లాలి. చూడాలి. రోజుల తరబడి కలిసి బతకాలి. మనుషుల్ని తాకాలి. ఆ ఆలోచనల అస్థితిమితత్వంలో నుంచి వాక్యం పుట్టాలి. ఇవన్నీ చేయాలంటే రచయితకు పూర్తి సమయం అవసరం. కాని పొద్దున్నే బయోమెట్రిక్ పంచ్ కొట్టి, సాయంత్రపు ఖర్చుల బెంగతో ఉండే పొట్టకూటి ఉద్యోగైన రచయితకు ఆ తీరిక, ప్రశాంతత ఉండవు. ఆకలితో ఉన్న రచయిత రొట్టె గురించి రాస్తాడు సరే. కాని ఆదరువు ఉన్న రచయిత సమాజం మర్చిపోయిన ప్రశ్నలను, భయపడే నిజాలను, కలలు కనే భవిష్యత్తును రాస్తాడు. అలాంటి రచనలు రావాలన్నా, అలాంటి రచనల కోసం రచయితలు పూర్తి సమయం ఇవ్వాలన్నా సమాజం సరికొత్త తాత్త్విక భూమిక వైపు అడుగులు వేయాలి. అదే ‘రచయితను దత్తత తీసుకోవడం’. ‘అడాప్ట్ ఎ రైటర్’.ఈ ‘దత్తత’ కొత్తదేం కాదు. పూర్వం ‘రాజాశ్రయం’ ఉండేది. పోషకులు ఉండేవారు. నేటి ఆధునిక ప్రజాస్వామ్యంలో బాధ్యత గల కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద వ్యవస్థలు, సంపన్న కుటుంబాలు ఉన్నాయి. పాశ్చాత్య దేశాలలో ఎప్పటి నుంచో ‘రైటర్–ఇన్– రెసిడెన్స్’ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు రచయితలకు ఉచిత వసతితో పాటు భారీ స్టైపెండ్ ఇచ్చి నవలలు రాయడానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తాయి. నార్వే, స్వీడన్ తదితర దేశాలలో ప్రభుత్వాలే ప్రతిభావంతులైన రచయితలకు ‘గ్యారంటీడ్ మినిమం ఇన్ కమ్’ అందిస్తున్నాయి. మన దేశంలో కూడా ఒక కుటుంబం ఒక రచయితను దత్తత తీసుకోవచ్చు. ఒక సంస్థ ఒక సంవత్సరం చేయూత ఇవ్వవచ్చు. ఒక ప్రభుత్వం ‘ఆలోచించేవాడిని మేము గౌరవిస్తాం’ అనే స్పష్టమైన విధానాన్ని తేవచ్చు.అయితే ఇలాంటి ప్రతిపాదన వినగానే ఇటు సాహిత్య పరివారంలో, అటు లౌకిక ప్రపంచంలో కొందరి అవహేళనలు మొదలైపోతాయి. ‘కూర్చోబెట్టి మేపితే రచయితలు సోమరులుగా మారరా?’ అని కొందరు ప్రశ్నించవచ్చు. ఒకటి గుర్తు పెట్టుకోవాలి. దత్తత అనేది రచయితకు లభించే ఉచిత ‘విశ్రాంతి ప్యాకేజీ’ కాదు. అదొక పవిత్రమైన బాధ్యత. నిరూపించుకోవాల్సిన జవాబుదారీతనం. కేవలం దత్తత సొమ్మును అనుభవిస్తూ, ఒక్క పేజీ కూడా రాయకుండా కాలక్షేపం చేసే సోమరులకు దత్తతను రద్దు చేసే హక్కు సమాజానికి ఉంటుంది. ఇది విని ‘అబ్బే... వృథా’ అనేవారూ ఉంటారు. క్షణికానందాన్ని ఇచ్చే వినోదాలకు, ఆర్భాటపు డెస్టినేషన్ పెళ్లిళ్లకు, నాయకుల జన్మదినాలకు, ప్రభుత్వాల ప్రకటనలకు, సినిమాల్లో దిక్కుమాలిన గ్రాఫిక్స్‌కు కోట్లాది రూపాయలు వృథా అవుతున్న చోట రచయితలను రెండేళ్లో, ఐదేళ్లో అడాప్ట్ చేసుకొని ఇచ్చే వేల రూపాయల స్టైపెండ్ ఏ మూల? దాని గురించి మాట్లాడాల్సి రావడమే దురదృష్టం. ఒక రచయితను ఫుల్‌టైమ్ రచయితగా మార్చడానికై ఇచ్చే ఆర్థిక సౌలభ్యం దానం కాదు, భవిష్యత్తు మీద పెట్టుబడి. ఒక రచయిత బాగుంటే పది పుస్తకాలు వస్తాయి. ఆ పది పుస్తకాలు పది వేల మనసులను తాకుతాయి. ఆ పది వేల మనసులు ఒక అద్భుతమైన, ప్రశాంతమైన సమాజాన్ని కడతాయి. ‘గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో’ అన్నాడు దాశరథి. ధార్మికంగా చూసినా ఇది సరస్వతీ అర్చనే. రచయితను దత్తత తీసుకోండి. ఎందుకంటే రచయిత బతికితే సమాజంలో ఆలోచన బతికి ఉంటుంది. -
ప్రమాదంలో ఆదివాసీ భాషలు
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మనం ఆదివాసీల హక్కులు, అడవులు, జీవన విధానం గురించి మాట్లాడుతుంటాం. కానీ అత్యంత విలువైన వారి వారసత్వమైన మాతృభాష గురించి మాత్రం తక్కువగా ఆలోచిస్తాం. ఒక భాష కేవలం సంభాషణ సాధనం కాదు. అది ఒక జాతి చరిత్ర, సంస్కృతి, జానపద విజ్ఞానం, ప్రకృతి పరిజ్ఞానం, జీవన తత్వాన్ని మోసుకెళ్లే సజీవ సంపద. అందుకే ఒక భాష అంతరించిపోతే, ఆ భాషతో పాటు ఒక ప్రపంచ దృష్టికోణం కూడా శాశ్వతంగా కనుమరుగవుతుంది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాల్లో నివసించే కోయల మాతృభాష అయిన ‘కోయతూర్’ నేడు సవాళ్లను ఎదుర్కొంటోంది. గ్రామాల్లో పెద్దలు ఇప్పటికీ కోయతూర్లో మాట్లాడుతున్నప్పటికీ, కొత్త తరం విద్య, ఉపాధి, పట్టణీకరణ ప్రభావంతో తెలుగు, హిందీ లేదా ఆంగ్ల భాషల వైపు మొగ్గు చూపుతోంది. ఇంట్లోనే మాతృభాష వినిపించని పరిస్థితి ఏర్పడితే, ఆ భాషకు భవిష్యత్తు మరింత సంక్లిష్టమవుతుంది. ఇది కేవలం కోయ భాష సమస్య మాత్రమే కాదు. భారతదేశంలో అనేక ఆదివాసీ భాషలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. యునెస్కో ప్రమాదంలో ఉన్న భాషల జాబితాలో భారతదేశానికి చెందిన అనేక భాషలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన కుపియా, గదబ, కొలామి, నాయకి, తోటి భాషా రూపాలు, అలాగే అండమాన్ దీవులలోని గ్రేట్ అండమానీస్, ఓంజీ వంటివారి భాషలు కూడా మాట్లాడేవారి సంఖ్య తగ్గిపోతోంది.ఆదివాసీ భాషలు అంతరించిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. పట్టణాలకు వలసలు, మాతృభాషలో విద్య లేకపోవడం, ప్రభుత్వ వ్యవహారాల్లో స్థానిక భాషలకు తగిన ప్రాధాన్యం లేకపోవడం, ఉద్యోగ అవకాశాల కోసం ఆధిపత్య భాషలను ఎంచు కోవడం వంటి అంశాలు కలిసి ఈ పరిస్థితిని తీసుకొచ్చాయి. భాషను కోల్పోవడం అనేది ఒక్కసారిగా జరిగే సంఘటన కాదు; ప్రతి తరం కొద్దికొద్దిగా దూరమవుతూ చివ రకు ఆ భాష మాట్లాడేవారు లేకుండా పోతారు. ‘‘మాకు వీలై నంతలో భాషను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్ప పూవుతో చాక్లెట్లు, లడ్డూలు చేస్తున్నాం. ఈ ఉత్పత్తులకు ‘పుంగార’ అనే పేరు పెట్టాము. పుంగార్ అంటే మా కోయ భాషలో పువ్వు అని అర్థం’’ అని చెప్పారు భద్రాచలంకు చెందిన స్వయం సహాయక సంఘ మహిళ సమ్మక్క.ఆదివాసీ పిల్లలకు మంచి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడం ఎంత అవసరమో, అంతే అవసరం వారిలో మాతృభాషపై గౌరవాన్ని పెంపొందించడం. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలు నేర్చుకోవడం తప్పు కాదు. కానీ వాటిని నేర్చుకునే క్రమంలో వారి భాషను మరచిపోవడం మాత్రం ఒక సాంస్కృతిక నష్టంగా మిగిలిపోతుంది.ప్రభుత్వాలు ఆదివాసీ ప్రాంతాల్లో మాతృభాష ఆధారిత ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం, వారి భాషలో పాఠ్యపుస్తకాలు, నిఘంటువులు, డిజిటల్ కంటెంట్ రూపొందించడం, భాష తెలిసిన ఉపాధ్యాయులను నియమించడం, జానపద గేయాలు, కథలు, సామెతలను డిజిటల్ రూపంలో భద్రపరచడం వంటి చర్యలు చేపట్టాలి.2020లో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన దివ్య దేవరాజన్ అక్కడి గోండుల సమస్యలు తెలుసుకోవడానికి స్వయంగా ఒక ట్యూటర్ని నియమించుకొని గోండు భాషను నేర్చుకున్నారు. ఆదివాసీ గూడేల్లో వారి అరుగుల మీద కూర్చొని వారి భాషలోనే ఆమె మాట్లాడుతున్నప్పుడు వారంతా వారి కష్టాలన్నీ ధైర్యంగా చెప్పుకునేవారు. దివ్య లాంటి అధికారులు ఆదివాసీ ప్రాంతాల్లో ఉండాల్సిన అవసరం ఉంది. భాషను కాపాడటం అంటే ఒక భాషను మాత్రమే కాదు, ఒక జాతి చరిత్రను, ప్రకృతితో ముడిపడిన జీవన తత్వాన్ని, వేల ఏళ్ల సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటమే. భాష బతికితేనే జాతి బతుకుతుంది.– శ్యాం మోహన్, ఆదివాసీ జీవనంపై అధ్యయనం చేస్తున్న జర్నలిస్ట్ (నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం) -
‘డిజిటల్’ భారం సరికాదు!
ప్రారంభమై పదేళ్లు గడిచాక యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా సాగే డిజిటల్ లావాదేవీలకు వడ్డింపు మొదలుకాబోతోంది. లోక్‌సభలో గురువారం గందర గోళం నెలకొన్నప్పుడు, ఎలాంటి చర్చా లేకుండా ఇందుకు సంబంధించిన బిల్లుఆమోదం పొందిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. తక్షణమే వర్తించకపోయినా భవిష్యత్తులో ఎప్పుడైనా యూపీఐ లావాదేవీలపై రుసుము వసూలు చేసేందుకు ఈ బిల్లు అధికారమిస్తోంది. ఫీజంటూ వసూలు చేస్తే రూ. 2,000కు మించిన లావాదేవీలపై, అది కూడా వార్షిక టర్నోవర్ కోటిన్నర మించే వ్యాపారులకే వర్తిస్తుందని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. విధించబోయే ఫీజు కూడా ఒక్కో లావాదేవీకి 0.25 శాతం లేదా 0.5 శాతం ఉండొచ్చన్నది మరో మాట. సాధారణ యూపీఐ వినియోగదారులు సాగించే లావాదేవీలన్నీ ఎప్పటిలా యధాతథంగా ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని విశ్వసించలేం. ఆదాయం పెంచుకునేందుకు అవకాశం ఉన్నప్పుడు ఆ చట్టానికి ముందూ మునుపూ సవరణలు రాబోవని చెప్పలేం. ఆ సంగతలావుంచి తమపై రుద్దే ఈ చార్జీల్ని వ్యాపారులు వినియోగదారుకే బదిలీ చేస్తారు. ఆ అవకాశం లేకుండా తగిన నియంత్రణలు విధిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వగలదా?దేశంలో ఆర్థిక సంస్కరణల ఆగమనంతోపాటే పాలకులు కొత్త రాగం అందు కున్నారు. ప్రభుత్వాలు పాలించాలి తప్ప వ్యాపారం చేయడమేమిటన్నదే దాని సారాంశం. ఆ వంకన లక్షలాదిమంది సిబ్బంది పనిచేసే దిగ్గజ పబ్లిక్ రంగ సంస్థలు అనేకం కనుమరుగయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు గర్వకారణంగా నిలిచి, ఆసియాలోనే అతిపెద్దదైన నిజాం షుగర్స్ కాస్తా ఆనాటి సీఎం చంద్రబాబు పుణ్యమా అని మూతబడింది. కోట్లాది రూపాయల విలువైన దాని ఆస్తుల్ని కారుచవగ్గా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. నిజాం షుగర్స్ మాదిరిగా మరెన్నో పబ్లిక్ రంగసంస్థలకు తాళాలుపడ్డాయి. వ్యాపారమంటే వదులుకున్నాయిగానీ... ప్రభుత్వాలకు వ్యాపార దృక్పథం పోలేదని యూపీఐ లావాదేవీలపై ఫీజు వసూలు ఆలోచన నిరూపిస్తోంది. యూపీఐ, రూపే వంటివి ఉచిత సేవలు అందించటంవల్ల తమవీసా, మాస్టర్‌కార్డ్ వగైరా ప్లాట్‌ఫాంలు ఎదగటంలేదన్న అమెరికా ఆక్రోశమే తాజా నిర్ణయానికి కారణమని కొందరి ఆరోపణ. బ్రెజిల్‌పై సైతం అమెరికా ఈ మాదిరి ఒత్తిడే తెచ్చినా అది అంగీకరించలేదని కూడా చెబుతున్నారు. వాటి నిజానిజాల సంగతలావుంచి, ప్రభుత్వం చెప్పే కారణాలు మాత్రం ఎప్పటినుంచో వింటున్నవే. యూపీఐ వ్యవస్థ నిర్వహణ తడిసిమోపెడు భారమవుతున్నదని బ్యాంకులూ, పేమెంట్ ప్రాసెసర్లూ గగ్గోలు పెడుతుండటంవల్ల ఇది తప్పడం లేదట! లావాదేవీల నిర్వహణ భారంలోకొంతమేర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. దాంతోపాటు ఈ లావాదేవీలు పెరిగాకబ్యాంకులు తమ సిబ్బందిని తగ్గించుకోలేదా? ఆమేరకు వాటి ఖర్చు తగ్గలేదా? అదీగాక గత దశాబ్దకాలంలో బ్యాంకింగ్ సేవల చార్జీలు, కనీస మొత్తం ఖాతాలో లేదన్న కారణంతో వసూలు చేసే పెనాల్టీ, పరిమితికి మించిన లావాదేవీలపై చార్జీలు, ఎస్ఎంఎస్సందేశాలకని, డెబిట్ కార్డు నిర్వహణ వ్యయమని బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ఇవన్నీ చాలకనా ఈ కొత్త ఆలోచనలు! ఈ పదేళ్లలో డిజిటల్ లావాదేవీలు అపారంగా పెరిగాయి. అయినా ఈ పెరుగుదల తగినంతగా లేదని ఆర్థిక నిపుణులంటున్నారు. గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే వగైరాలు వినియోగిస్తున్నవారు వాటిని బ్యాంకింగ్ సేవలుగా చూడటం లేదు... ఆ యాప్‌లను పర్స్‌గా పరిగణించి లావాదేవీలు జరుపుకొంటున్నారు. అలవాటు చేసినట్టే చేసి,దాన్నుంచి కూడా ఆదాయం పొందాలనుకోవటం సరికాదు. ప్రస్తుతం దేశంలో డిజిటల్ లావాదేవీల వినియోగదారుల సంఖ్య 50 కోట్లని చెబుతున్నారు. అయితే ఒక వినియోగదారు సగటున చేసే లావాదేవీలు చూస్తే ప్రపంచ స్థాయికన్నా తక్కువే. అలాగే లావాదేవీల్లో 86 శాతం రూ.500, అంతకన్నా తక్కువ మొత్తాలేనని అంటారు. మొదట్లో ఉన్నంత వృద్ధి ఇటీవలి సంవత్సరాల్లో కనబడటం లేదని కూడా అంటున్నారు. ఇదంతా ఏం చెబుతోంది? ఎంతో వెసులుబాటుగా, ఉపయోగకరంగా ఉన్న ఈ లావాదేవీలు మరింత విస్తరించాల్సిన తరుణంలో వాటిని నిరుత్సాహపరిచేలా, జనం మళ్లీ నగదు వైపు మొగ్గేలా చేయటం వింతకాదా? ప్రభుత్వం ఆలోచించాలి. -
సంసిద్ధతే వృద్ధాప్యానికి దీర్ఘాయువు
మెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్) ‘ఏజ్ల్యాబ్’ డైరెక్టర్ డాక్టర్ జోసెఫ్ కాఫ్లిన్... వృద్ధాప్యం, దీర్ఘాయువు గురించి ఉన్న అపోహలను పటాపంచలు చేశారు. ఎవరి సహాయమూ లేకుండా స్వతంత్రంగా జీవించడమే అసలైన దీర్ఘాయువు అని అంటున్నారు. మీ దగ్గర ఎంతుందన్నది ముఖ్యం కాదు!వయస్సు పైబడుతున్నప్పుడు డబ్బు ఆదా చేయడం, ఆర్థిక ప్రణాళికలు వేసుకోవటం పైనే ఎక్కువ దృష్టి ఉంటుంది. కానీ మనం ఉండే నివాస స్థలాన్ని బట్టి కూడా సగటు జీవితకాలంలో 9 నుండి 13 సంవత్సరాల తేడా వస్తుంది. నడవడానికి అనుకూలమైన రోడ్లు, నమ్మకమైన రవాణా సదుపాయాలు, తాజా ఆహారం, మంచి మౌలిక సదుపాయాలు కలిగి ఉండటమే మీరు ఎంతకాలం, ఎంత ఆరోగ్యంగా జీవిస్తారో నిర్ణయిస్తాయి తప్ప మీ దగ్గర ఉన్న ‘పొదుపు మొత్తం’ కాదు. ఒకవేళ మీ చుట్టూ ఉన్న వాతావరణం మిమ్మల్ని ఏకాకిగా మార్చితే, మీ బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు ఉన్నప్పటికీ మీ శారీరక, మానసిక ఆరోగ్యం వేగంగా క్షీణిస్తుంది.తరాలుగా మనకు నేర్పించలేదు!జీవితాన్ని నేను 8,000 రోజుల చొప్పున నాలుగు భాగాలుగా చూస్తాను. 0 నుండి 21 సంవత్సరాలు (నేర్చుకునే దశ); 21 నుండి 46 (కెరీర్, కుటుంబం); 46 నుండి 65 (మధ్యవయసులో మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవడం); 65 నుండి 85 పైన (చివరి దశ). ఈ చివరి దశ అనేది పూర్తి అదనపు 8,000 రోజుల ఒక కొత్త అంకం. కేవలం విహారయాత్రలకు వెళ్లడం, లేదా ఖాళీ గదికి రంగులు వేసుకోవడం లాంటి చిన్న చిన్న పనులు మిమ్మల్ని రెండు దశాబ్దాల పాటు ఉత్సా హంగా ఉంచలేవు. జీవితంలో ఈ కొత్త అధ్యాయం కోసం మీకు ఒక పక్కా ప్రణాళిక అవసరం. ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థికంగా ఎలా ఉండాలో నేర్పించ డానికి సమాజం తరతరాలుగా సమయాన్ని వెచ్చించింది. కానీ ఆ ఖాళీ సమయాన్ని ఎలా గడపాలో నేర్పించడానికి మాత్రం దాదాపు సున్నా సమయాన్ని కేటాయించింది.వేసవి రాత్రి ఐస్‌క్రీమ్ తినాలనిపిస్తే?ఫైనాన్షియల్ ప్లానర్లు మీరు వైద్య ఖర్చులను భరించ గలరా అని అడుగుతారు; కానీ నేను చాలా సరళంగా అనిపించే ఒక ప్రశ్న అడుగుతాను. ఒక వేడి వేసవి రాత్రి మీకు ఐస్‌క్రీమ్ తినాలనిపిస్తే, మీరు దాన్ని ఎలా వెళ్లి తెచ్చుకుంటారు? ఉదాహరణకు 50 ఏళ్లు పైబడిన అమె రికన్లలో 70 శాతం కంటే ఎక్కువ మంది నగర శివారు లేదా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అంటే స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్లే శక్తిని పూర్తిగా కోల్పోవడమే. నిజమైన స్వేచ్ఛ అంటే కేవలం జీవించి ఉండటం కాదు; వేరొకరిని లిఫ్ట్ అడగాల్సిన అవసరం లేకుండా, మీకు అనిపించిన వెంటనే చిన్న చిన్న ఆనందాలను పొంద గలిగే రవాణా సౌకర్యాలు ఉండటం. ఒక చిన్న ప్రయాణం కోసం మీరు కొన్ని రోజుల ముందే ప్లాన్ చేసుకోవాల్సి వచ్చినా, లేదా బిజీగా ఉండే మీ పిల్లలపై పూర్తిగా ఆధారపడాల్సి వచ్చినా... మీరు ఇప్పటికే మీ స్వేచ్ఛను పోగొట్టుకున్నట్లే.ఒంటరి హాబీలతో విసుగెత్తిపోతుంది!రిటైర్మెంట్ తర్వాత గార్డెనింగ్ చేస్తాననీ లేదా గోల్ఫ్ ఆడతాననీ పరిచయస్తులు తరచూ నాతో చెబుతుంటారు. కానీ మానవ సంబంధాలు లేకుండా ఒంటరిగా కల్పించుకునే హాబీలు త్వరగా విసుగు తెప్పిస్తాయని కోవిడ్–19 లాక్డౌన్లు నిరూపించాయి. మీకు కేవలం ఆర్థిక ప్రణాళికలు ఉంటే సరిపోదు. ఒక మామూలు మంగళవారం ఉదయం 10:30 గంటలకు మిమ్మల్ని కలిసి లంచ్ చేయడానికి సిద్ధంగా ఉండే మనుషులతో కూడిన ఒక యాక్టివ్ ‘సామాజిక పోర్ట్‌ఫోలియో’ కూడా మీకు అవసరం. మీరు ఉద్యోగానికి దూరమైనప్పుడు, ప్రతిరోజూ లభించే సాధారణ సామాజిక సంబంధా లను, ఒక దినచర్యను కోల్పోతారు. మీరు వేర్వేరు తరాల ప్రజలతో ఉద్దేశపూర్వకంగా సంబంధాలను పెంచుకోకపోతే; మీకు నలుగురితో సంభాషణలు, సామాజిక భాగస్వామ్యం లేకపోతే, అత్యంత అవస రమైన సమయంలోనే మీ సామాజిక ప్రపంచం కుంచించుకుపోయి ఉంటుంది.- ఎడిటోరియల్ టీమ్ -
హసీనా అప్పగింత సాధ్యమా?
రెండేళ్ల క్రితం ఉవ్వెత్తున ఎగిసిపడిన విద్యార్థి ఉద్యమాన్ని అదుపుచేయటం అసాధ్యమని తేలాక హెలికాప్టర్లో అక్కడినుంచి నిష్క్రమించి భారత్‌లో ఆశ్రయం పొందిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సరిగ్గా ఆ తేదీనే ఎంచుకుని తొలిసారి బుధవారం మీడియాతో మాట్లాడారు. వచ్చే డిసెంబర్లో స్వదేశానికి వెళ్లబోతున్నానని గతంలో చెప్పిన మాటనే పునరుద్ఘాటించారు. తనను జైల్లో బంధిస్తారని తెలిసినా, ఉరికంబం తన కోసం ఎదురు చూస్తున్నదని అర్థమైనా తిరిగి వెళ్లటానికే ఆమె సంసిద్ధులవుతున్నారు. దేశానికి సారథ్యంవహించే నాయకత్వానికి పరిణతి లోపిస్తే కక్ష సాధింపులే సమర్థతగా అనిపిస్తాయి.సాధించిన స్వాతంత్య్రం అర్థరహితమవుతుంది. ఇది బంగ్లాదేశ్ ప్రస్తుత నాయకత్వానికి మాత్రమే కాదు... హసీనాతోసహా బంగ్లా మాజీ పాలకులందరికీ వర్తిస్తుంది. ఆ మాట కొస్తే పాకిస్తాన్ పరిస్థితి కూడా మొదటినుంచీ ఇంతే. అదృష్టవశాత్తూ మన దేశంలో స్వాతంత్య్రోద్యమ నాయకత్వం నుంచి తొలి తరం సారథులు రావటంవల్ల కావొచ్చు...ఆ బెడద లేదు. ఇక్కడ సైతం ఆ పోకడలు తలెత్తుతూనే ఉన్నా ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తమై వాటిని తిప్పికొడుతూనే ఉన్నారు. బంగ్లాదేశ్‌లో తనకెదురైన దుఃస్థితికి హసీనా తనను తానే నిందించుకోవాలి. ప్రజలు మెచ్చి అధికారం కట్టబెట్టాక ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారు. జీడీపీ పెరిగింది. అంతక్రితంతో పోలిస్తే ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. కానీ ఆ అధికారాన్ని శాశ్వతం చేసుకోవటానికి ఆమె వేసిన ఎత్తుగడలు అవధులు మీరాయి. వస్తున్న మెజారిటీ చాలదనుకుని ఎన్నికల ఫలితాలు ఏమార్చారు. చివరకు మొత్తం ఎన్నికలే రిగ్గింగ్ చేసే స్థాయికి దిగజారారు. మతోన్మాద శక్తుల ఆటకట్టించేందుకు చర్యలు తీసుకున్నా, సహేతుకమైన అసమ్మతికి సైతం ముద్రలేసి పబ్బం గడుపుకోవాలనుకున్నారు. మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) అధినేత బేగం ఖలీదా జియాను అవినీతి ఆరోపణలతో దీర్ఘకాలం చెరసాలపాలు చేశారు. ఖలీదా సైతం అంతే. తాను రాజ్యమేలిన మూడు దఫాలూ కక్షసాధింపు రాజకీయాల్లోనే మునిగితేలారు. ఆమె కుమారుడు, ప్రస్తుత ప్రధాని తారిఖ్ రెహ్మాన్ ఆ వారసత్వాన్నే కొనసాగించదల్చుకున్నట్టు కనబడుతోంది. హసీనా సర్కార్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పోలీసులు, సైన్యం జరిపిన కాల్పుల్లో 1,400 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి లెక్కలే చెబుతున్నాయి. నిజమే కావొచ్చు. జరిగిన తప్పిదాలకు ఆమె బాధ్యత వహించాల్సిందే. కానీ న్యాయవ్యవస్థను మహ్మద్ యూనస్ సలహాదారుగా ఉన్న తాత్కాలిక ప్రభుత్వం భ్రష్టుపట్టించింది. మతతత్వవాదులు రెచ్చిపోయి హసీనా ఏలుబడిలోని న్యాయమూర్తుల్ని వేధించి రాజీనామాలు చేయించారు. ఉన్నతాధికారుల్ని అరెస్టు చేశారు. హిందూ మైనారిటీల ఇళ్లపై దాడులకు దిగారు. ఇలాంటి వాతావరణంలో జరిగిన విచారణకు విశ్వసనీయత ఉంటుందా?హసీనాను అప్పగించటంలేదన్న ఆగ్రహం బంగ్లాకు ఉంది. ఇదేమీ అసహజం కాదు. కానీ అధికారంలోకొచ్చాక భారత్‌ను రెచ్చగొట్టేలా తారిఖ్ రెహ్మాన్ చర్యలుంటున్నాయి. జూన్‌లో చైనాలో నాలుగు రోజులు పర్యటించి, 17 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ‘2+2 డైలాగ్’ పేరిట విదేశాంగ విధానాన్నీ, భద్రతనూ నిర్ణీత వ్యవధిలో చర్చించుకుంటూ ఉండాలని రెండు దేశాలూ నిర్ణయించుకున్నాయి. అమెరికాతో ఆయన సాన్నిహిత్యం తెలియందేమీ కాదు. బంగ్లాలో అలజడుల వెనక అమెరికా పాత్ర జగద్విదితం. ఇదిగాక భారత్‌కు సన్నిహితమైతే విపక్షమైన జమాతే ఇస్లామీ బలపడుతుందేమోనన్న భయంతో రెహ్మాన్ మనవైపు కన్నెత్తి చూడటానికే సాహసించటం లేదు. ఇలాంటి స్థితిలో హసీనాను భారత్ అప్పగిస్తుందని ఆ దేశం అనుకోవటం హాస్యాస్పదం. అందరి మాదిరే మన దేశం ఎటూ స్వీయప్రయోజనాలు చూసుకుంటుంది. దౌత్యరంగంలో ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవు. బంగ్లా చిత్తశుద్ధితో వ్యవహరిస్తే, ఇంటా బయటా భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలిపే అత్యుత్సాహాన్ని ఆపుకుంటే ఏ సమస్య అయినా తప్పక పరిష్కారమవుతుంది. అంతకన్నా ముందు హసీనా కుమారుడు ఈ మీడియా సదస్సులో ఆరోపించినట్టు బంగ్లా మరో పాకిస్తాన్‌గా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత రెహ్మాన్కుంది. -
చందమామకు గాయం
అనుకున్నట్టే స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ నుంచి విడివడి అదుపుతప్పిన భాగం బుధవారం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.05 నిమిషాలకు చంద మామను ఢీకొట్టింది. రాకెట్‌లోని అడుగుభాగం లోగడే సురక్షితంగా భూమ్మీదకు తిరి గొచ్చింది. అయిదంతస్తుల నిడివుండే రెండో భాగం మాత్రం దారితప్పింది. వాస్తవానికి ఇది కూడా పునర్వినియోగానికి వీలుగా రూపొందిందే. కానీ సరైన సమయంలో నియంత్రించకపోవటంవల్ల అది కాస్తా దారితప్పి చంద్రుడి కక్ష్యలోకి పోయింది. అంతరిక్షంలో మేం సైతం ఉన్నామని చెప్పుకోవటానికి అనేక దేశాలు పోటీపడి అంతరిక్ష నౌకలనూ, ఉపగ్రహాలనూ భూ కక్ష్యలో ప్రవేశపెడుతున్నాయి. అందువల్ల వాతావరణ పరిస్థితులు మొదలుకొని శాస్త్ర, సాంకేతిక, సైనిక రంగాల్లో ప్రగతి సాధించగలుగుతున్నాయి. కానీ ఈ ప్రయోగాల క్రమంలో అనుకోకుండా సంభవించగల ప్రమాదాలేమిటో చెప్పటానికి అదుపు తప్పిన ఫాల్కన్ 9 రాకెట్ విడి భాగమే తార్కాణం. నిరుడు జనవరిలో జరిపిన ఈ ప్రయోగం ఇది మినహా అన్నివిధాలా విజయవంతమైంది. అది గత 18 నెలలుగా భూమితోపాటు సూర్యచంద్రుల గురుత్వాకర్షణ శక్తికి లోనవుతూ, సౌరశక్తిని గ్రహిస్తూ సాగుతోంది. ఇది ఇలా క్రమేపీ వేగం పుంజుకుంటూ చంద్రుణ్ణి ఢీకొడుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారణకొచ్చారు. ఎప్పుడు ఎక్కడ ఢీకొడుతుందో, ఏమేరకు దాని ప్రభావం ఉంటుందో కూడా అంచనా వేశారు. జరిగింది ప్రమాదమే అయినా... దాని గమనం గురించి శాస్త్రవేత్తలు వేసిన లెక్కలన్నీ కచ్చితత్వంతో ఉన్నాయని తేలింది. వేలాది సంవత్సరాలపాటు భూకక్ష్య విశాలంగా, శూన్యంగా ఉండిపోయింది. 1957లో అప్పటి సోవియెట్ నుంచి తొలిసారి నాలుగు రేడియో ఏంటెన్నాలున్న ఒక లోహపు బంతి పెనువేగంతో దూసుకెళ్లి భూకక్ష్యను చేరింది. అది అంతరిక్ష యుగానికి పడిన మొట్టమొదటి అడుగు. భూమ్మీద ఏం జరుగుతున్నదో తెలుసుకోవటానికి విప్పారిన తొలి అంతరిక్ష నేత్రం. మరో నాలుగైదేళ్లలో గుప్పెడు ఉపగ్రహాలు చకచకా అటువైపు కదిలి వెళ్లాయి. 70వ దశకం చివరికల్లా అవి 14,000కు చేరుకున్నాయి. 90ల చివరికి మరిన్ని ఉపగ్రహాలు పయనమయ్యాయి. అప్పటికల్లా వాటి సంఖ్య దాదాపు 20,000. ఇప్పుడిక ప్రైవేటు రంగం కూడా అంతరిక్షంవైపు చూడటం మొదలుపెట్టింది. ఇంకేం... వాటి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. పైగా గతంలో ఒక స్కూల్ బస్ సైజుకు మించని ఉపగ్రహాలు పంపే సంప్రదాయం ఉండగా... స్పేస్ ఎక్స్ మెగా బహుళ ఉపగ్రహాలను ప్రవేశపెట్టే ఒరవడికి 2019లో శ్రీకారం చుట్టింది. తాజాగా 32,000 ఉపగ్రహాలు పెనువేగంతో సంచరిస్తున్నాయి. అదుపుతప్పి పడిపోయిన వాటిని మినహాయించగా తేలిన లెక్క ఇది. ఈ దశాబ్దం ముగిసేసరికి మొత్తం ఉపగ్రహాల సంఖ్య 60,000కు చేరుతుందని అంచనా. పాత ఉపగ్రహాల తాలూకు శకలాలు కావొచ్చు... విడివడిన రాకెట్ల తాలూకు తునకలు కావొచ్చు... ఉపగ్రహాల శకలాలు కావొచ్చు... పెను వేగంతో చక్కర్లు కొడుతున్నాయి. అవి దాదాపు 13 కోట్ల వరకూ ఉంటాయని అంచనా. ఇది మనుషులకూ ముప్పు తెస్తుందని కొందరు నిపుణులంటున్న మాట.మాజీ అంతరిక్ష యాత్రికుడు స్టీవ్ రాబిన్సన్ పలుమార్లు అంతరిక్ష యాత్రలు చేశాడు. ప్రతిసారీ తమ నౌకను ఏదో ఒక శకలం ఢీకొడుతూనే ఉండేదని ఆయన ఒక సందర్భంలో చెప్పాడు. గత నవంబర్‌లో చైనా అంతరిక్ష నౌకను ఆ దేశానికే చెందిన మరో ఉపగ్రహం తాలూకు శకలం ఢీకొట్టడంతో అది కాస్తా పనికిరాకుండా పోయింది. వ్యోమ గాముల్ని వెనక్కు తీసుకురావడానికి మరో నౌక పంపాల్సివచ్చింది. ఇలాంటి ప్రమాదాలపై 1972లోనే అంతర్జాతీయ ఒప్పందం కుదిరింది. పరిహారం ఎలా నిర్ణయించాలన్నది కూడా ఉంది. కానీ నిర్దిష్టంగా ఫలానా శకలంవల్లే ప్రమాదం జరిగిందని గుర్తించటం కష్టం. అందుకే లక్ష్యం పూర్తయ్యాక భూవాతావరణంలో పునఃప్రవేశించినప్పుడు వాటంతటవే ముగిసిపోయే ‘డిజైన్ ఫర్ డిమైజ్’ విధానంలో ఉపగ్రహాలు రూపొందుతున్నాయి. వీటితోపాటు నిర్దేశిత సముద్ర ప్రాంతాల్లో సురక్షితంగా కూల్చి వేసేలా ఆన్‌బోర్డ్ చోదనవ్యవస్థలూ వినియోగిస్తున్నారు. ఏదేమైనా ప్రపంచ దేశాలన్నీ అంతరిక్ష వ్యర్థాలపై దృష్టి పెట్టడం మంచిది. వాటి తొలగింపునకు లక్ష్యం నిర్దేశించుకుని పరిపూర్తి చేసుకోవటం ఉత్తమం. -
‘సహజీవన’ హింస నేరమే!
సహజీవన బంధాల్లో క్రూరత్వాన్ని ఎదుర్కొనే మహిళలకు ఊరటనిచ్చేలా గృహహింస చట్టం పరిధిని విస్తరిస్తూ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం వెలువరించిన తీర్పు మహిళలకు ఊరటనిస్తుంది. యుక్త వయసు వచ్చిన జంట పరస్పర అంగీకారంతో వివాహ వ్యవస్థ వెలుపల కూడా సహజీవనం సాగించవచ్చంటూ గతంలో న్యాయస్థానాలు పలు సందర్భాల్లో తెలిపాయి. అయినా ఇలాంటి బంధాలు తరచు వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా కొన్ని రాష్ట్రాల హైకోర్టులు వేర్వేరు కేసుల్లో ఈ బంధాల్లోని నైతికతను ప్రశ్నిస్తూనే ఉన్నాయి. వివాహ బంధాల్లో ఉండే రక్షణలు సహజీవన బంధాల్లో ఉండబోవని హితోక్తులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘వివాహ స్వభావం కలిగిన’ సహజీవన బంధంలో ఉండే భాగస్వామి నుంచి మహిళ హింసను ఎదుర్కొంటే ఐపీసీ సెక్షన్ 498ఏ(బీఎన్ఎస్ సెక్షన్లు 85, 86) కింద కేసు పెట్టవచ్చని సుప్రీంకోర్టు తాజాగా స్పష్టం చేసింది. పరస్పర అవగాహన ద్వారా ఒక జంట సహజీవనం చేస్తున్నప్పుడు ఆమెను హింసించే పరిస్థితులు తలెత్తినప్పుడు చట్టం ఆమెకు రక్షణగా నిలబడాలి. ఇప్పుడు తాజా తీర్పువల్ల అలాంటి మహిళలకు భద్రత ఉంటుంది. నాలుగు దశాబ్దాల క్రితం చట్టం ఇంత స్పష్టంగా లేదు. అసలు మన చట్టాల్లో సహజీవన సంబంధాలకు ఎప్పుడూ చోటులేదు. కానీ 2005లో వచ్చిన గృహహింస నిరోధక చట్టం తొలిసారి ‘వివాహ స్వభావం’ కలిగిన సంబంధంలో ఉన్న మహిళ సమస్యలు ఎదుర్కొంటున్న పక్షంలో ఆమెను బాధిత పక్షంగా గుర్తించింది. ఆడ, మగ ఒకే ఇంట్లో కలిసివుంటూ జీవితభాగస్వాములన్న అభిప్రాయం సమాజంలో కలిగిస్తే, వారు పెళ్లీడుకొచ్చివుంటే, తగినంతకాలం శారీరక సంబంధంలో కొనసాగుతూవుంటే ఆ బంధాన్ని ‘వివాహ స్వభావం’గల బంధంగా గుర్తించవచ్చని సుప్రీంకోర్టు 2011లోనే ఒక కేసులో చెప్పింది. వారాంతాల్లో కలిసివున్నప్పుడు ఇది వర్తించబోదని తెలిపింది. కానీ సుప్రీంకోర్టు తాజా తీర్పు పెళ్లికానంత మాత్రాన ఒక బంధంలో కొనసాగే పురుషుడు మహిళను హింసిస్తుంటే 498ఏ వర్తించబోదనటం సరికాదని వివరించింది. చట్టంలోని ‘భర్త’ అనే పదాన్ని మరీ సంకుచితంగా తీసుకుని యాంత్రికంగా వర్తింపజేసి బాధిత మహిళకు న్యాయం చేయకపోవటం సరికాదని ధర్మాసనం చెప్పడం గమనించదగింది. లాంఛనంగా పెళ్లి ధ్రువీకరణ పత్రం లేనంతమాత్రాన ఆ బంధంలోని వివాహ స్వభావాన్ని గుర్తించకపోవటం, అక్కడ జరిగే హింసను విస్మరించటం సమాజ పురోగతికి తోడ్పడబోదని కూడా తెలిపింది. ఇద్దరు వ్యక్తులు సహజీవన బంధంలోకి వెళ్లి, వారి మధ్య తలెత్తే విభేదాలు మహిళను హింసించటానికి దారితీస్తే దాన్ని నేరంగా పరిగణించకపోవటం ఎలా చూసినా సరికాదు. సహజీవనంలోవుండే మహిళకు గృహహింస చట్టంకింద ఉన్న రక్షణలు సరిపోతాయనీ, అందువల్ల 498ఏ పరిధిని విస్తరించటం అనవసరమనీ ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం వాదించినా ధర్మాసనం దీన్ని దృష్టిలో ఉంచుకునే తోసిపుచ్చింది. గృహహింస చట్టం కేవలం మనోవర్తి, పరిహారం, ఇంట్లో కొనసాగే హక్కువంటి సివిల్ ఉపశమనాలు మాత్రమే ఇస్తున్నదని... ఆ నేరానికి తగిన శిక్ష ఉండొద్దా అని న్యాయమూర్తులు ప్రశ్నించటం గమనార్హం. ప్రస్తుత కేసులో మహిళ తాను వివాహానికి సిద్ధపడే ఈ సహజీవన బంధంలోకి ప్రవేశించాననీ, కానీ అప్పటికే అతగాడికి పెళ్లయిన విషయాన్ని దాచాడనీ తెలిపింది. సుప్రీంకోర్టు ఈ కేసులోని నిజానిజాల్లోకి పోకుండానే మహిâ¶ క్రూరత్వాన్ని చవిచూస్తుంటే 498ఏ వర్తించితీరాలని తెలిపింది.చట్టాలు చేసే సందర్భాల్లో పార్లమెంటు అవగాహనకు రాని విషయాలు, అప్పటికి అలాంటి పరిస్థితులు లేని సందర్భాలు అనంతర కాలంలో తలెత్తవచ్చు. అంతమాత్రాన సమాజంలో వచ్చిన మార్పుల్ని పరిగణనలోకి తీసుకోకుండా యాంత్రికంగా అన్వయించటంతో సరిపెడితే బాధితులకు ఎప్పటికీ న్యాయం దక్కదు. అయితే సహజీవనానికి సంబంధించి నిర్దిష్టమైన చట్టం లేకపోవటం వల్ల ఇలాంటి బంధాల్లో ఏర్పడే సమస్యల విషయంలో వచ్చే కేసుల్ని న్యాయస్థానాలు పదే పదే విచారించి తేల్చవలసి వస్తున్నది. కనుక వర్తమాన సామాజిక స్థితిగతుల్ని దృష్టిలో ఉంచుకుని ఆ మాదిరి చట్టం అవసరాన్ని ప్రభుత్వం గుర్తించటం అవసరం. -
‘వలస భూతం’ ఎవరి సృష్టి?
యూరప్‌ను వలస భూతం ఇంకా వెన్నాడుతూనే ఉంది. ఆ బెడద గురించి అత్యవసరంగా చర్చించేందుకు యూరోపియన్ యూనియన్(ఈయూ) మంగళవారం సమావేశం కాబోతోంది. గతవారం స్పెయిన్ అధీనంలోని స్యూటా నగరానికి ఒక్కసారిగా పొరుగునున్న మొరాకో నుంచి శరణార్థులు వెల్లువెత్తడంతో ఆ దేశం దిక్కుతోచని స్థితికి చేరింది. 60,000 మంది వచ్చిపడితే అదుపు చేయటమెలాగో స్పెయిన్‌కు అర్థం కాలేదు. స్పెయిన్ దళాల కాల్పుల్లో 72 మంది శరణార్థులు మరణించారు. ప్రస్తుతానికి ఇది ఉపశమించిందని స్పెయిన్ చెబుతున్నా స్వదేశంలోని మితవాదపక్షంతోపాటు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి చెందిన అతి మితవాద పక్షం స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ను తప్పుబడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం స్పెయిన్‌ని నిందిస్తున్నారు. వలసలపై ఆఫ్రికా ఖండ దేశాలను తప్పుబట్టి ప్రయోజనం లేదు. అక్కడి ఆర్థిక వ్యవస్థలు అంతంతమాత్రం కావటం వాస్తవం. యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవటమూ నిజమే. శతాబ్దాల తరబడి అక్కడి సంపదనంతా కొల్లగొట్టిన యూరప్ దేశాలే ఈ దుఃస్థితికి కారణం. అందుకు సిగ్గుపడకపోగా... తాము కష్టపడి సంపద పోగేస్తుంటే ఈ వలసలు తలనొప్పిగా మారాయని వాపోతున్నాయి. కానీ శరణార్థులవి పొట్టకూటి తిప్పలు మాత్రమే. వారు యూరప్ దేశాల్ని దోచుకుతినడానికి రావడంలేదు. నిరుడంతా జెన్ జీ ఉద్యమం మొరాకోను ఊపిరాడనీయకుండా చేసింది. అక్కడ నిరుద్యోగం మాత్రమే సమస్య కాదు. రెక్కలు ముక్కలు చేసుకుంటున్నవారికి సైతం 12 గంటలు శ్రమించినా దక్కేది స్వల్పం. పెరుగుతున్న ధరలకూ, వచ్చే వేతనానికీ మధ్య అగాథాన్ని పూడ్చలేక అర్ధాకలితో బతకడం అక్కడివారికి నిత్య నరకం. అసలు ఆఫ్రికా ఖండంలోని స్యూటా, మెలిల్లా నగరాలతో మధ్యధరా సముద్రం ఆవలనున్న స్పెయిన్‌కు ఏం సంబంధం? అవి భౌగోళికంగా మొరాకోకు చేర్చివుంటాయి. స్పెయిన్ భూభాగంనుంచి జిబ్రాల్టర్ జలసంధి గుండా వెళ్తే స్యూటా 14 కిలోమీటర్ల దూరం. మెలిల్లా నగరమైతే ఏకంగా 150 కిలోమీటర్ల ఆవల ఉంటుంది. ఎప్పుడో 1497లో మెలిల్లానూ, 1668లో స్యూటానూ స్పెయిన్ ఆక్రమించుకుంది. 1956లో మొరాకో స్వాతంత్య్రం పొందినప్పుడు న్యాయంగా అయితే ఆ రెండింటినీ స్పెయిన్ అప్పగించితీరాలి. కానీ ఆధునిక మొరాకో ఏర్పడటానికి వందల సంవత్సరాలక్రితం తమ చేతికొచ్చాయి గనుక, దీన్ని ఆక్రమణగా చూడొద్దని స్పెయిన్ తర్కానికి దిగింది.ఐక్యరాజ్యసమితి 2014లో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ వలస సంస్థ (ఐఓఎం) కనబడకుండాపోయిన శరణార్థుల డేటా సేకరిస్తోంది. మధ్యధరా సముద్రం దాటూతూ ఇంతవరకూ 33,220 మంది అదృశ్యమయ్యారని ఆ డేటా చెబుతోంది. కానీ ఇది సమగ్రం కాదని ఆ సంస్థే అంటోంది. వాస్తవానికి మధ్యధరా సముద్ర దక్షిణ తీరానికి చేరేముందు అత్యంత కంటకప్రాయమైన సహారా ఎడారిలోనే అనేకులు తనువులు చాలిస్తారు. సముద్రాన్ని దాటే క్రమంలో సంభవించే మరణాలతో పోలిస్తే ఆ సంఖ్య చాలా ఎక్కువని ఐఓఎం అంటున్నది. కాలినడకన మూడు రోజులు పట్టే ఆ మార్గంలో మృత్యు ఇసుక తుపాన్లు విరుచుకుపడకపోతే, స్మగ్లర్లు కాల్చిచంపకపోతే మధ్యధరా తీరానికి శరణార్థులు చేరుకోగలుగుతారు. ఆ తర్వాత సైతం రాకాసి అలలనుంచీ, సరిహద్దు దళాలనుంచీ ప్రాణగండమే. ఒక డేటా ప్రకారం 2024 నాటికి శరణార్థులు 30 కోట్ల 40 లక్షలు. వీరందరికీ ఒక దేశాన్ని సృష్టిస్తే అది భారత్, చైనా, అమెరికాల తర్వాత అతి పెద్ద జనాభాగల దేశమవుతుంది. ప్రపంచబ్యాంకు లెక్కలు తిరగేస్తే వీరు తమ కుటుంబాలకు పంపే సొమ్ము 2024 నాటికి 90,500 కోట్ల డాలర్లు! 2014లో అమెరికా, చైనా, జపాన్ల ఉమ్మడి విదేశీ పెట్టుబడులకన్నా అధికం. కనుక శరణార్థుల్ని శత్రువులుగా... ‘దరిద్రగొట్టు’ ఆఫ్రికా దేశాలవల్ల కలిగే అనర్థంగా ఈయూ పరిగణించటం మానుకోవాలి. నిత్యం మృత్యుగీతం వినిపించే ఉక్రెయిన్ యుద్ధం కోసం పారబోసే కోట్లాది డాలర్లలో కొంత శాతమైనా ఆఫ్రికా దేశాల ఆర్థిక ప్రగతికి వెచ్చించగలిగితే అవి ఊపిరిపీల్చుకోవటంతో పాటు తమ గత పాపాలు శాపాలై వెంటాడకుండా ఉంటాయని గుర్తించాలి. ఈయూ అత్యవసర సమావేశం చర్చించాల్సింది దీనిపై! -
కలత పక్షులు
మనిషికీ, పక్షికీ, ఆమాటకొస్తే అన్ని ఇతర జీవులకూ మధ్య పరిమాణంలో, రూపంలో, శక్తియుక్తుల్లో పైకి కనిపించే తేడాలే తప్ప మనుగడతో ముడిపడిన మౌలికమైన తేడాలు లేవు. పక్షులనే తీసుకుంటే, మనిషి గుడిసె కట్టుకుంటే అవి గూడు కట్టుకుంటాయి; మనిషిలానే ఆహారాన్ని వెతుక్కుంటాయి, సంతానాన్ని కంటాయి, కంటికి రెప్పలా వాటిని కాపాడుకోవాలనుకుంటాయి. ఇతరేతర మైన తేడాలకు అతీతంగా ప్రతిజీవీ తన అస్తిత్వాన్ని నిలుపుకోడానికీ, తన పరంపరను కొనసాగించుకోడానికీ ప్రకృతి సమదృష్టితో చేసిన ఏర్పాటు అది. అందుకు ఏ జీవికి ఎంత తెలివి కావాలో అంత తెలివీ ప్రకృతి వాటికిచ్చింది. ఇందులో జీవవైవిధ్యమే తప్ప ఎక్కువ తక్కువలు లేవు. ఉదాహరణకు, మనిషి పక్షిలా ఎగరలేడు, కండబలంలో పెద్ద పులితో, సింహంతో పోటీ పడలేడు; అలాగే, మనిషి చేయగలిన పనులను అనేకమైన ఇతర జీవులూ చేయలేవు. కానీ, తెలివి వికటించిన మనిషి వివేకపు హద్దులు దాటి తనకు ఉనికినిచ్చిన ప్రకృతినే సవాలు చేస్తున్నాడు; ప్రకృతి ప్రణాళికలోనే వేలుపెడుతున్నాడు; తన స్థాయి మరచిప్రకృతిపైనే పైచేయిని చాటుతున్నాడు! దాని పర్యవసానాలు తన మనుగడకే ముప్పు తెస్తాయనే స్పృహ లేకుండా తన తెలివికి తనే తలకొరివి పెట్టుకుంటున్నాడు! ఒక అధ్యయనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పదకొండు వేల వలస పక్షుల రకాల్లో సగం అంతరించే ప్రమాదంలో ఉన్నాయి. మన దేశంలో స్థానికంగా ఉన్న ఇతర పక్షుల కన్నా, ఆర్కిటిక్ వంటి సుదూర ప్రాంతాలనుంచి ఎగిరొచ్చే వలస పక్షులుమరింత త్వరితగతిన క్షీణిస్తున్నాయి. దశాబ్దాలుగా పర్యావరణానికి జరుగుతున్న హానినలా ఉంచి, వలస పక్షుల గురించి తగిన అవగాహన లేమినీ, ఇతర కారణాలనూ ఈ అధ్యయనం దండగుచ్చింది. వలస పక్షులు ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్య పరిరక్షణలో; క్రిమికీటక జనాభా నియంత్రణలో; విత్తనాలు వెదజల్లీ, పరాగ సంపర్కం ద్వారా మొక్కల అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. పర్యావరణ భిన్నత్వం ఉన్న వేర్వేరు ఖండాలలో సైతం ఆహార వ్యవస్థ దెబ్బతినకుండా సాయపడుతున్నాయి. అటువంటిది, సొంత మనుగడకే ముప్పు ముంచుకొస్తున్న పరిస్థితిలో వలస పక్షులు కలత పక్షులవుతున్నాయి. ప్రమాద స్థాయిని అంచనా వేయడానికి మనం దూరదూరాలకు ఎగిరి వెళ్ళనవసరం లేదు. మన నట్టింట ఉన్న కొల్లేరు సరసువైపు దృష్టి సారిస్తే చాలు. వలస పక్షుల శీతకాలపు విడిదిగా, మత్స్యసంపద నిండిన మంచినీటి కొలనుగా ప్రపంచ ప్రసిద్ధినొందిన కొల్లేటి సరస్సుపై ఉత్తరాసియా, సైబీరియా, తూర్పు యూరప్లనుంచి కొంగలు, బాతులు, నేల నెమళ్ళు పెద్దసంఖ్యలో వచ్చి వాలతాయి. క్రమంగా సరస్సు పరిధిలో చేపలు, రొయ్యల చెరువులు విస్తరించడం, రసాయనిక వ్యర్థాలు కలిసి నీరు కలుషితం కావడం, పూడిక పేరుకు పోవడం, ప్రకృతిసిద్ధమైన ఇతర కారణాలూ నీటి నాణ్యతనూ, పరిమాణాన్ని దెబ్బతీసి మత్స్యసంపదను హరించడంతో అతిథి పక్షులకు ఆహారమూ, ఆశ్రయమూ కరువవు తున్నాయి. వాటి సంఖ్యపై అది దుష్ప్రభావం చూపుతోంది. చెట్టూ చేమనే కాక, పక్షీ పామునూ కూడా పూజించి సహజీవనం చేసిన చరిత్ర మనిషిది. రెక్కబలమే ఇంధనంగా దిక్కులు ముడివేస్తూ వేలమైళ్ళ దూరాన్ని అవలీలగా తరించే పక్షిని తనకన్నా మిన్నగా గౌరవించిన ఘనతా అతనిది. వేటగాడు క్రౌంచపక్షుల జంటలో మగపక్షిని చంపి ఆడపక్షికి కలిగించిన శోకమే శ్లోకమై ఆదికావ్యమైన రామాయణమైంది. సీతనెత్తుకెడుతున్న రావణునితో పోరాడి గాయపడి, తనకా సమా చారమందించి కన్నుమూసిన జటాయువుపట్ల కృతజ్ఞతతో రాముడే స్వయంగా దానికి అంత్యక్రియలు జరిపిన అపురూప ఘట్టమూ రామాయణంలో ఉంది. భారతీయ వాఙ్మయంలో పక్షి భాగం కాని ఇతిహాస కావ్యాలే లేవు. భారతీయ దేవీదేవతల చేతుల్నే కాదు, గ్రీకు సహా ఇతర దేవతల హస్తాలనూ అలంకరించిన మహద్వైభవం పక్షిది. అటువంటిది, ప్రకృతిమార్గం విడిచి పెడమార్గం పట్టిన మనిషి, ఒకప్పటి తన ముంజేతి ముద్దులపక్షి మనుగడకే ముప్పుగా మారడం దారుణం. అలా తన మనుగడనే ప్రశ్నార్థకం చేసుకునే దిశగా పడుతున్న అడుగును ఎప్పటికి వెనక్కి తీసుకుంటాడో! సకల జీవులతో ఒకప్పటి తన చెలిమినీ, కూరిమినీ ఎప్పటికి పునరుద్ధించుకుంటాడో!! -
ఏఐ కంటే 'హెచ్ఐ ఎందుకు ప్రత్యేకం'?
మీరు కేవలం ఒక కాలేజీ నుంచి పట్టా పొందడం కాదు, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఒక గొప్ప ఉద్యమంలో భాగమై బయటకు అడుగుపెడుతున్నారు. ఇప్పుడు నేను ఈ రోజుల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన రెండు అక్షరాలు పలకబోతున్నాను: ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్). 2026లో అత్యంత వివాదాస్పదమైన అంశం జాతి, లింగం లేదా వలస పాలన కాదు. ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అవుతుందని ఎవరు ఊహించారు? కానీ నేను నిజానికి ఏఐ గురించి మాట్లాడాలనుకోవడం లేదు. నేను మాట్లాడాలనుకుంటున్నది హెచ్ఐ (హ్యుమన్ ఇంటెలిజెన్స్– మానవ మేధస్సు) గురించి. కృత్రిమ మేధ అద్భుతమైన వేగంతో అభివృద్ధి చెందుతోంది. దాని శక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఏఐ శక్తి ఎంత పెరిగినా, మనుషులు అవసరం లేనివారిగా మారిపోరు.మనిషి మాత్రమే చేయగలిగేది?ప్రతి తరం ప్రపంచాన్ని మార్చేసే కొత్త సాంకేతిక విప్లవా లను చూసింది. ముద్రణ యంత్రం వచ్చింది. ఆవిరి యంత్రం వచ్చింది. విద్యుత్ వచ్చింది. ఇంటర్నెట్ వచ్చింది. ప్రతి కొత్త ఆవిష్కరణ ఒకవైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తే... మరోవైపు భయాన్ని కూడా కలిగించింది. ఇప్పుడు వాటన్నింటికంటే పెద్ద మార్పును తీసుకొస్తున్న సాంకేతికతగా ఏఐ మన ముందుకు వచ్చింది. ఇది వ్యాసాలు రాయగలదు. సంగీతాన్ని సృష్టించగలదు. వ్యాధు లను గుర్తించగలదు. క్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించ గలదు. వీడియోలను రూపొందించగలదు. మనుషుల్లా మాట్లాడగలదు. అందుకే చాలామంది ఒక ప్రశ్న అడుగు తున్నారు: ‘ఇక మనుషులకు మిగిలేది ఏమిటి?’ కానీ బహుశా ఇది తప్పు ప్రశ్న కావచ్చు. అసలు అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే... ఏఐ రావడం వల్ల మనుషుల ప్రత్యేకత ఏమిటో మనకు ఏం అర్థమవుతోంది? మనిషిగా ఉండటం అంటే ఏమిటి? మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టేది ఏమిటి? అనే విషయాన్నిమరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశం ఇప్పుడు మనకు లభించింది. మనుషులు మాత్రమే చేయగలిగే, యంత్రాలు ఎప్పటికీ చేయలేనివి ఏమిటి? ఈ ప్రశ్నకు దొరికే సమాధానం మన భవిష్యత్తుకు ఎంతో విలువైనది. ముందుగా మనిషి మెదడు గురించి ఆలోచించండి. అది నిజంగా ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతం. మనిషి మెదడు బరువు సుమారు ఒకటిన్నర కిలోలే. అది పనిచేయడానికి కేవలం ఇరవై వాట్ల శక్తి సరిపోతుంది. అయితే ప్రపంచంలోని అత్యాధునిక ఏఐ వ్యవస్థలకు శిక్షణ ఇవ్వాలంటే, కోట్లాది వాట్ల విద్యుత్‌ను వినియోగించే భారీ డేటా సెంటర్లు అవసరం. ఆ విద్యుత్‌తో మొత్తం ఒక నగరాన్నే నడప వచ్చు. అదే సమయంలో మీ తలలో ఉన్న మెదడు ఒక ల్యాప్‌టాప్ ఛార్జర్ కంటే తక్కువ శక్తితో నిశ్శబ్దంగా పనిచేస్తూనే ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు మసక వెలుతురులో కూడా ఒక ముఖాన్ని వెంటనే గుర్తుపట్టగలడు. గొంతులోని భావాన్ని అర్థం చేసుకోగలడు. వ్యంగ్యం, సందిగ్ధత, ఆప్యాయత, సిగ్గు, ప్రేమ, హాస్యం, బాధ వంటి భావాలను మనం చాలా సహజంగా అర్థం చేసుకుంటాం. ఒక గదిలోకి వెళ్లగానే అక్కడి వాతావరణాన్ని గ్రహిస్తాం. నిశ్శబ్దంలో కూడా ఉద్రిక్తతను గుర్తిస్తాం. చిరునవ్వు లోని కృత్రిమతను కూడా కనిపెట్టగలుగుతాం. యంత్రాలు విశ్లే షణలో గొప్పవే. కానీ మనుషులు కేవలం విశ్లేషణ చేసే జీవులు కాదు. మనం ఇతర మనుషులతో కలిసి జీవించే సామాజిక జీవులం. ఒక యంత్రం బాధతో కూడిన కవిత రాయగలదు. కానీ అది అంత్యక్రియల్లో కన్నీరు పెట్టుకోలేదు. ప్రేమలేఖ రాయగలదు. కానీ ప్రేమలో పడలేదు. భయం గురించి వివరించగలదు. కానీ అర్ధరాత్రి మేల్కొని తన జీవితాన్ని వృథా చేసుకున్నానేమో అని ఆందోళన చెందలేదు. ఇదే మనిషిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. అసంపూర్ణతే అందంజపాన్ లో ‘వాబి–సాబి’ అనే గొప్ప తత్వం ఉంది. అది అసంపూర్ణతను కీర్తిస్తుంది. అక్కడ చేతితో తయారైన మట్టి పాత్రలు కొద్దిగా వంకరగా ఉండొచ్చు. రంగు సమానంగా లేకపోవచ్చు. అయినా వాటికే ఎక్కువ విలువ ఉంటుంది. ఎందు కంటే, వాటిలో ఒక మనిషి స్పర్శ కనిపిస్తుంది. కొన్నిసార్లు విరిగిపోయిన పాత్రలను బంగారు మిశ్రమంతో అతికిస్తారు. దానిని ‘కింట్సుగి‘ అంటారు. ఆ పగుళ్లను దాచిపెట్టరు. వాటినే అందంగా చూపిస్తారు.ఎందుకంటే, ఆ పగుళ్లు కూడా ఆ పాత్ర జీవితంలో ఒక భాగమే. మనిషి జీవితమూ అంతే. మన గాయాలు, మన వైఫల్యాలు, వాటి నుంచి కోలుకున్న తీరు... ఇవే మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. యంత్రాలు వేలాది దుస్తు లను ఒకే విధంగా తయారు చేయగలవు. అయినా ప్రపంచంలో అత్యంత ఖరీదైన దుస్తులు ఇప్పటికీ చేతితో కుట్టినవే. ఎందుకంటే, వాటిలో యంత్రాల పరిపూర్ణత కాదు, మనిషి నైపుణ్యం కనిపిస్తుంది. మనుషులు ఎప్పుడూ పరిపూర్ణతనే వెతకరు. చాలాసార్లు నిజాయితీని వెతుకుతారు. ఆత్మను వెతుకుతారు. ఏఐ యుగంలో అసలు ప్రమాదం యంత్రాలు మనుషుల్లా మారడంలో లేదు. మనుషులే యంత్రాల్లా మారాలని ప్రయ త్నించడంలో ఉంది. ఇప్పటికే మనం దానిని చూస్తున్నాం. ప్రతి విషయాన్నీ ‘ఆప్టిమైజ్‘ చేయాలని ప్రయత్నిస్తున్నాం. నిద్ర, ఉత్పాదకత, పరిచయాలు, పనితీరు. ప్రతి దాన్నీ సంఖ్యలతో కొలవాలనుకుంటున్నాం. విద్యార్థులు తమ జీవితాన్ని ఒక పరి పూర్ణ బయోడేటాగా మార్చుకోవాలని ఒత్తిడికి గురవుతున్నారు. ఉద్యోగులు అలసట తెలియని అల్గారిథమ్‌లతో తమను తాము పోల్చుకుంటూ భయపడుతున్నారు. కానీ మానవ జీవితం పరిపూర్ణత వల్ల కాదు. మానవత్వం వల్ల గొప్పదవుతుంది. మన జీవితాలను ఎక్కువగా ప్రభావితం చేసే వారు ఎప్పుడూ అత్యంత సమర్థులే కావాల్సిన అవసరం లేదు. వారు అత్యంత మానవత్వం కలిగినవారు. మీపై నమ్మకం ఉంచి ప్రోత్సహించిన ఒక ఉపాధ్యాయుడు, బాధలో మీతో పాటుగంటల తరబడి కూర్చున్న ఒక స్నేహితుడు, మీ కోసం ఎన్నో సంవత్సరాలు త్యాగాలు చేసిన తల్లిదండ్రులు, ప్రాణాలకు ముప్పు వచ్చినా తన ఆశయాన్ని వదలని ఒక సామాజిక కార్యకర్త... ఇలాంటి వారే మన జీవితాలను మార్చుతారు. ఏఐతో లోపం లేని ఒక అద్భుతమైన సంగీతాన్ని రూపొందించవచ్చు. ప్రపంచంలోనే అత్యుత్తమ సంగీత కృతుల్లో ఒకటైన తొమ్మిదో సింఫనీని బీథోవెన్ దాదాపు పూర్తిగా చెవిటి వాడైన తర్వాత స్వరపరిచాడు. ఆ సంగీతాన్ని విన్నప్పుడు మనల్ని కదిలించేది కేవలం స్వరాల అందం కాదు. తాను ఎప్పటికీ వినలేని సంగీతాన్ని సృష్టించాలనే ఒక మనిషి సంకల్పం, అతని బాధ, అతని పట్టుదల. అందుకే మానవ మేధస్సు ఎంతో విలువైనది. దానిలో చైతన్యం ఉంది. భావో ద్వేగాలు ఉన్నాయి. జీవిత అనుభవాలు ఉన్నాయి. మానవత్వమే ముఖ్యంఏఐ వైద్యం, విజ్ఞానం, విద్య, రవాణా, పరిశ్రమలు దాదాపు ప్రతి రంగాన్నీ మార్చబోతోంది. కొన్ని ఉద్యోగాలు మారిపోతాయి. కొత్త ఉద్యోగాలు వస్తాయి. పూర్తి పరిశ్రమలే రూపాంతరం చెందుతాయి. కానీ ఈ మార్పులన్నింటి మధ్య కూడా, మనుషులు కోరుకునేది మాత్రం మనుషులనే. తమ పిల్లలకు బోధించడానికి, అనారోగ్యంలో ధైర్యం చెప్పడానికి, సంక్షోభ సమయంలో నాయకత్వం వహించడానికి, మనిషి జీవితాన్ని ప్రతిబింబించే కళను సృష్టించడానికి... ఇంకా ముఖ్యంగా... ఒకరికి ఒకరు విలువైన వారిగా ఉండడానికి మనుషులే అవసరం. మానవ జీవితం సంబంధాలపై ఆధారపడి ఉంటుంది.నా కోరిక ఒక్కటే. మీరు ఏఐతో పోటీ పడకండి. దాని బలాలను అనుకరించకండి. దానికి బదులుగా మరింత మంచి మనుషులుగా మారండి. నైపుణ్యాన్ని మాత్రమే కాదు, వివేకాన్ని పెంచుకోండి. సమాజంతో కలిసి జీవించడం నేర్చుకోండి. నమ్మకాన్ని సంపాదించడం నేర్చుకోండి. క్షమించడం నేర్చుకోండి. మనస్ఫూర్తిగా నవ్వడం నేర్చుకోండి. ఎందుకంటే... చివరికి మనం అత్యంత విలువైనదిగా భావించేది, లోపాలు లేని తెలివితేటలను కాదు. లోపాలున్నా ప్రేమించగల మానవత్వాన్ని. అవును... వ్యాధులను నయం చేయడానికి, విజ్ఞానాన్ని విస్తరించడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, ఉత్పాదక తను పెంచడానికి... ఇప్పటివరకు అసాధ్యంగా భావించిన సమ స్యలను పరిష్కరించడానికి... ఏఐని తప్పకుండా ఉపయోగించండి. అదే సమయంలో... మనిషి మెదడు ఎంత అద్భుతమో ప్రపంచానికి తెలియజేయడానికి కూడా ఏఐని ఉపయోగించండి. -
మళ్లీ కావేరీ వివాదం
ఎంతో సున్నితమైన నదీజలాల సమస్యను ప్రభుత్వాలు దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా వదిలేయటంవల్ల అది కాస్తా మరింత జటిలమవుతోంది. రాష్ట్రాలమధ్యా, రాష్ట్రాల్లో ప్రాంతాలమధ్యా తరచు తలెత్తుతున్న జలవివాదాలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఎప్పటిలాగే కర్ణాటక, తమిళనాడుల మధ్య తాజాగా కావేరీ నదీజలాల పంపకం విషయంలో చిచ్చు రేగింది. రోజూ 3,500 క్యూసెక్కుల చొప్పున తమిళనాడుకు 4.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కావేరీ నీటి యాజమాన్య ప్రాధికార సంస్థ (సీడబ్ల్యూఎంఏ) కర్ణాటకకు ఇటీవల ఇచ్చిన ఆదేశాలు తాజా వివాదానికి మూలం. ఈ విషయంలో ఏం చేయాలన్న అంశంపై ఈ ఆదివారం కర్ణాటక ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ ఈ సమస్యపై అప్పుడే ఉద్యమం కూడా ప్రారంభించింది. కన్నడ సంఘాలు వచ్చే 13న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ విషయంలో చర్చించేందుకు తమ రాష్ట్రానికి సోమవారం రావాల్సిన తమిళనాడు సీఎం విజయ్ను ‘ప్రస్తుత పరిస్థితుల రీత్యా’ వాయిదా వేసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అభ్యర్థించారు.రాజ్యాంగంలోని 262వ అధికరణం నదీజలాల వినియోగం, పంపిణీ, నియంత్రణ వంటి అంశాల్లో రాష్ట్రాల మధ్య వివాదాలు రాజుకున్నప్పుడూ, ఫిర్యాదులొచ్చినప్పుడూ వాటి పరిష్కారం కోసం తగిన యంత్రాంగాన్ని ఏర్పాటుచేసే అధికారాన్ని పార్లమెంటుకు ఇచ్చింది. దీని ఆధారంగానే కేంద్రం 1956లో నదీజలాల వివాదాల చట్టాన్ని, నదీజలాల బోర్డు చట్టాన్ని తీసుకొచ్చింది. బోర్డు అయితే ఏర్పాటు కాలేదుగానీ... నదీ వివాదాల చట్టంకింద అయిదు ట్రిబ్యునల్స్ ఏర్పడ్డాయి. చిత్రమేమంటే ప్రజా ప్రభు త్వాలు లేని కాలంలోనే... అంటే బ్రిటిష్ వలసపాలకుల హయాంలోనే నదీజలాల ఒప్పందాలు కుదిరాయి. 1924లో అప్పటి మైసూర్ సంస్థానం, మద్రాస్ ప్రెసిడెన్సీలమధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మైసూర్ కృష్ణరాజ సాగర్ డ్యామ్‌నూ, మద్రాస్ మెట్టూర్ డ్యామ్‌నూ నిర్మించుకోవటానికి అవగాహన కుదిరింది. అప్పట్లో కావేరీ జలాల్లో దాదాపు 75 శాతం వాటా మద్రాస్ ప్రెసిడెన్సీకే కేటాయించారు. ఈ ఒప్పందం కాలపరిమితి యాభైయ్యేళ్ల అనంతరం 1974లో ముగిసిపోగా అప్పటికే కర్ణాటకలో నదీజలాల కేటాయింపు విషయంలో తమకు అన్యాయం జరిగిందనే భావన బలంగా నాటుకుంది. ఎగువభాగంలో ఉండటం కారణంగా కర్ణాటక తమ నీటి అవసరాలకు తగ్గట్టు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కూడా చేపట్టింది. వర్షాలు సమృద్ధిగా పడినంతకాలం నదీ జలాల వివాదాలు వచ్చే అవకాశం లేదు. రుతుపవనాలు విఫలమై వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా, కరవు కాటేసినా ఘర్షణలు బయల్దేరతాయి. కావేరీ బేసిన్‌లోని ఆనకట్టలు నిండనప్పుడు తాము బెంగళూరు నగరానికీ, రైతులకూ అవసరమైన నీరు వినియోగించుకోవటంలో తప్పేమిటన్నది కర్ణాటక ప్రశ్న. ఇటు తమవైపు పంటలన్నీ ఎండిపోతున్నాయనీ, న్యాయంగా తమ వాటా నీరు విడుదల చేయాలనీ తమిళనాడు అంటున్నది. అసలే ఈ ఏడాది ‘సూపర్ ఎల్‌నినో’ ప్రభావంతో వర్షాలు సరిగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే వివాదాలు తలెత్తుతాయి. పుదుచ్చేరి కూడా ఈ కావేరీ జలాల వివాదంలో ఉంటుంది. పడమటి కనుమల్లో పుట్టి గోవా దగ్గర అరేబియా సముద్రంలో కలిసే మహాదాయి విషయంలోనూ కర్ణాటక, గోవాల మధ్య ఇలాంటి వివాదాలే తలెత్తుతుంటాయి. ప్రపంచ పునరుత్పాదక జలవనరుల్లో మన దేశం వాటా కేవలం 4 శాతం మాత్రమే. కనుక నీటి కోసం పోటీ తప్పదు. సమస్య తలెత్తినప్పుడల్లా తాత్కాలిక పరిష్కారంతో ప్రయత్నించి, గండం గడించిందనుకోవటం తప్ప శాశ్వత పరిష్కార దిశగా ఎవరూ ఆలోచించటం లేదు. ఘర్షణ పడే రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిద్దా మనుకోవటం లేదు. విపక్షాలనుంచి ఒత్తిళ్లు తప్పవు మరి. నదుల్లో నీరు నిండుకున్న ప్పుడు నీరందక పంటలు ఎండిపోతాయి. దృఢంగా పోరాడి ఆ నష్టాన్ని తగ్గించుకోవటంపైనే వివాదం తలెత్తిన రాష్ట్రాల రైతులు దృష్టి పెడతారు. కావేరీ వివాదం సామరస్య పూర్వకంగా పరిష్కారమయ్యే దిశగా రెండు రాష్ట్రాలూ చిత్తశుద్ధితో కృషిచేయాలి. ఇప్పుడిప్పుడే వరుణుడు కరుణిస్తున్న దాఖలా కనబడుతోంది. కనుక ఈ వివాదం త్వరలో సమసిపోతుందని ఆశించాలి. -
ఈసారి ‘ఆల్ఫా’ వంతు!
జంతర్ మంతర్ వేదికగా జెన్ జీ తరం సృష్టించిన పెను సంచలనం గురించి అందరూ ఇంకా చర్చించుకుంటుండగానే... తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆల్ఫా తరం కూడా తరగతి గదుల్లోంచి బయటికొచ్చింది. ఉత్తరాదిన ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్లతో పాటు మహారాష్ట్రలో సైతం పాఠశాలల్లో మంచినీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, బెంచీలవంటి కనీస సదుపాయాలు కల్పించాలనీ, అన్ని పాఠ్యాంశాలకూ టీచర్లను నియమించా లనీ కోరుతూ సాగుతున్న ధర్నాల వెనక కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సాధించిన విజయాల స్ఫూర్తి ఉన్నదని తెలుస్తూనే ఉంది. పాలకుల్ని నిలదీసిన జెన్ జీ తరాన్ని చూసి అసహ్యించుకున్న ఎంపీ కంగనా రనౌత్ లాంటివారు ఈ ఆల్ఫా తరానికి ఎలాంటి శాపనార్థాలు పెడతారో చూడాల్సివుంది. బిహార్‌లోని గయ జిల్లాలో విద్యార్థులు అతి పెద్ద ధర్నా నిర్వహించడమే కాదు... తమ డిమాండ్లు తెలుసుకోవటానికొచ్చిన ప్రభుత్వా ధికారిని వెనక్కిపంపారు. తాము జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్)తో తప్ప మాట్లాడబోమని చెప్పటంతో ఆయనే రావాల్సివచ్చింది. అన్నిచోట్లా ఒకే రకమైన సమస్యలు. అందరిదీ ఒకే రకమైన కథ. చదువు చుట్టూ ఇన్ని సమస్యలుండగా ‘వికసిత్ భారత్’ ఎలా సాధ్యమో పాలకులు చెప్పాలి. దేశంలో ప్రాథమిక విద్య మొదలు విశ్వవిద్యాలయ విద్యవరకూ అంతా అస్తవ్యస్థంగా ఉంది. ఎక్కడ చూసినా శిథిలాలను తలపించే బడులు, అరకొర సదుపా యాలు వెక్కిరిస్తుంటాయి. సరిపడా ఉపాధ్యాయులుండరు. యాదృచ్ఛికంగానే కావొచ్చు గానీ... రాజ్యసభలో గురువారం పాఠశాల విద్య గురించి అడిగిన ప్రశ్నకు విద్యామంత్రిత్వ శాఖ ఇచ్చిన జవాబు దిగ్భ్రమ గొలుపుతుంది. దేశంలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య 1,00,843 అని ఆ శాఖ సహాయమంత్రి చెప్పారు. అందులో 16,357 పాఠశాలలతో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉంటే జార్ఖండ్(9,827), మహారాష్ట్ర(9,269), కర్ణాటక(8,042), ఉత్తరప్రదేశ్(7,874) తదనంతర స్థానాల్లో ఉన్నాయి. అలాగని మిగిలిన స్కూళ్లు బాగున్నాయని కాదు. రాజస్థాన్‌లోని ఒక పాఠశాలలో కేవలం చరిత్ర, హిందీ పాఠ్యాంశాలకు మాత్రమే టీచర్లున్నారు. మరో పాఠశాలలో 1,2,3 తరగతులకు అసలు టీచర్లే లేరు. తక్షణం టీచర్ల నియామకం జరగకుంటే పాఠశాలకు తాళాలేసి, రహదారి దిగ్బంధిస్తామని పిల్లలు హెచ్చరించారు. చివరకు అప్పటికప్పుడు నలుగుర్ని నియమిస్తూ అధికారులు ఉత్తర్వులిచ్చారు. మరో ముగ్గుర్ని పది రోజుల్లో నియమిస్తామనటంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో లిఖితపూర్వక హామీ దొరికేవరకూ ఇంటర్ విద్యార్థులు ధర్నా కొనసాగించారు. సెకండరీ విద్యలో 2023–24లో ఆడపిల్లల్లో 12.6 శాతంగా ఉన్న డ్రాపౌట్లు 2025–26కు 8 శాతానికి తగ్గాయని పార్లమెంటుకు సమర్పించిన నివేదిక చెబుతోంది. కానీ ఇప్పటికీ 8 శాతంమంది పిల్లలు ఆ స్థాయికొచ్చాక చదువులు మానుకుంటున్నారంటే ఆవేదన కలుగుతుంది. దీన్ని అంకెల్లోకి మారిస్తే లక్షల్లో ఉంటుంది. ఇది మన అధ్వాన్న స్థితికి అద్దం పడుతుంది. పేదరికం మొదలుకొని పాఠశాలలో సదుపాయాల లేమి వరకూ ఇందుకు ఎన్నో కారణాలుండొచ్చు. వాటిని సరిచేయటానికి పూనుకొనే వరకూ ఇలాంటి పిల్లలు చదువులకు దూరంకాక తప్పదని పాలకులు గుర్తించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ బడి పిల్లల వ్యథ మరో రకం. అక్కడ గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 11,700 కోట్లు వ్యయం చేసి ‘నాడు–నేడు’ కింద 38,059 పాఠశాలల రూపురేఖల్ని మార్చింది. కార్పొరేట్ విద్యాసంస్థల్ని తలదన్నేలా 60,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, 10,000 స్మార్ట్ టీవీలు అమర్చి తరగతి గదుల్ని డిజిటల్ లెర్నింగ్ స్పేస్‌లుగా మార్చింది. పిల్లలకు దాదాపు ఆరు లక్షల ట్యాబ్ల్ని అందించి పాఠాల్ని సులభంగా అవగాహన చేసుకునేందుకు తోడ్పడింది. ఇప్పుడు ఉత్తరాదిన వినబడుతున్న డిమాండ్లతోపాటు మరెన్నో నాలుగేళ్ల క్రితమే అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు అందులో చాలా భాగం అటకెక్కాయి. గుక్కెడు మంచినీళ్లు, పరిశుభ్రమైన పరిసరాలు, రుచికరమైన మధ్యాహ్న భోజనం కరువయ్యాయి. గతంలో సకల సదుపాయాలతో వర్ధిల్లిన బడులన్నీ ఇప్పుడు బావురుమంటున్నాయి. అనేకం మూతబడ్డాయి. అందుకే ఉత్తరాది పిల్లల స్ఫూర్తితో రేపో మాపో ఏపీ ఆల్ఫా తరం కూడా తిరగబడినా ఆశ్చర్యం లేదు. -
ప్రకృతి చేస్తున్న హెచ్చరిక
వర్తమానంలో లాభార్జన కోసం భవిష్యత్తును బలిపెట్టే నయా ఉదారవాద విధానాలు ప్రపంచాన్ని ప్రమాదపుటంచులకు తీసుకెళ్తున్నాయి. దశాబ్దాలుగా యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియాల్లో చోటుచేసుకుంటున్న కార్చిచ్చుల్ని పట్టించుకుని పర్యావరణ అనుకూల విధానాలు పాటించని ఫలితంగా ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే 37 కోట్ల ఎకరాల్లోని అడవులు, పొదలు తగలబడ్డాయని ఒక అంచనా. ఇలా కార్చిచ్చులో చిక్కుకున్న ప్రాంతం మంగోలియా దేశ విస్తీర్ణానికి సమానమని చెబుతున్నారు.స్పెయిన్, ఫ్రాన్స్ అటవీప్రాంతాల్లో, కెనడా, రష్యాల్లో గత వారం రోజు లుగా వ్యాపిస్తున్న మంటల వల్ల ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఫ్రాన్స్, స్పెయిన్ కార్చిచ్చులైతే ఊహించశక్యం కానంత స్థాయిలో ఉన్నాయి. వాటిని అదుపు చేయగలిగా మని ఆ రెండు దేశాలూ చెబుతున్నా జనంలో భయాందోళనలు ఉపశమించలేదు. నైరుతి ఫ్రాన్స్‌లో పారిస్‌కు నాలుగు రెట్లు పెద్దదైన విస్తీర్ణంలోని అడవి తగలబడటంవల్లగిరోండ్ ప్రాంతంలోని జనావాసాలనుంచి రెండున్నర లక్షలమంది పౌరుల్ని ఆదరా బాదరాగా తరలించాల్సివచ్చింది.ముఖ్యంగా బోర్డావ్ నగరంవైపు ఆ మంటలు వ్యాపిస్తున్న తీరు జనాన్ని హడలెత్తించింది. అటు స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లోనూ ఇదే పరిస్థితి. అక్కడ లక్షమందిని తరలించారు. దాని శివారు ప్రాంతాల్లో పలు జనావాసాలు తగలబడిపోయాయి. ఆ రెండూ యుద్ధ రంగాన్ని తలపింపజేస్తున్నాయని మీడియా కథనం. జరగాల్సిన నష్టం జరిగాక మంటల్ని ఏదోమేరకు అదుపు చేయటం సాధ్యమే. కానీ వాటివల్ల వ్యాపించే పొగవల్ల గాలి నాణ్యత దెబ్బతింటుంది. కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లతో కూడిన సూక్ష్మ ధూళి కణాలు పీల్చేగాలిలో వ్యాపించి ఊపిరి తిత్తులు, గుండెసంబంధ వ్యాధులతో ప్రజారోగ్యం క్షీణిస్తుంది. అరుదైన వృక్షసంపద, జీవవైవిధ్యం బుగ్గిపాలవుతుంది. దాని కారణంగా వడగాడ్పులు చెలరేగి జనంఅల్లాడిపోతారు. ఈ ఖండాల్లో ఏటా కార్చిచ్చులవల్ల 3,40,000 అకాల మరణాలుసంభ విస్తున్నాయని గణాంకాలు సూచిస్తున్నాయి. 2023లో ప్రపంచ కర్బన ఉద్గారాల్లో కెనడా కార్చిచ్చుల వాటా 23 శాతమని అంచనా వేశారు. యూరప్ ఖండం అత్యంత వేగంగా వేడెక్కుతున్నదని యూరోపియన్ యూనియన్(ఈయూ) పర్యవేక్షణ సంస్థ తాజాగా ప్రకటించింది. ఫ్రాన్స్ కార్చిచ్చువల్ల ఆస్ట్రేలియా, అమెరికా, కెనడాల్లోని పలు ప్రాంతాల్లో పొగ, ధూళితో కూడిన నీటియావిరి వ్యాపించి, అది మేఘాలుగా మారి, ప్రమాదకరమైన పెనుగాలులు, పిడుగుపాట్లు సంభవించాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.సాధారణంగా ఇలాంటి కార్చిచ్చులు మానవతప్పిదాలతోనే మొదలవుతాయి. కానీ వాతావరణ మార్పుల పర్యవసానంగా అవి వేగంగా విస్తరిస్తాయి. ఈ విషయంలో శాస్త్రవేత్తలు స్థూలంగా అంగీకారానికొచ్చినా, తమ నమూనాలు అందుకోలేనంత స్థాయిలో ఇవి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ తీవ్రతను పసిగట్టడానికి కొత్త ఉపకరణాలు అవసరం కావొచ్చన్నది వారి అభిప్రాయం. ఇప్పుడు స్పెయిన్, ఫ్రాన్సుల్లో మంటలు వ్యాపించిన అడవుల్లో పిక్నిక్లు, క్యాంప్ ఫైర్లు ఎక్కువ. అజాగ్రత్తగా ఉండే మనుషులవల్ల నిప్పు రాజుకోవటం, గాలిలో తేమ శాతం తక్కువుండే రాత్రివేళ మోడువారిన చెట్లు, ఎండుటాకులు అంటుకుని మంటలు వేగంగా వ్యాపించడం రివాజు. గత కొన్నేళ్లుగా ఈ కార్చిచ్చులవల్ల ఉత్పత్తయ్యే వేడి, పొగ ఆధారంగా పైరోక్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి వర్షరహిత పెనుగాలులతో కూడిన తుపానులు ఏర్పడుతున్నాయి. తీవ్రమైన ఆ వేడిగాలుల కారణంగా ఎక్కడెక్కడో పడే పిడుగులు మరిన్ని అగ్నిప్రమాదాలకూ, కార్చిచ్చులకూ దారితీస్తున్నాయి. విషపూరిత పొగ, బొగ్గు రేణువులతో ఉండే ఈ మేఘాలు అణు విస్ఫోటంలో వచ్చే పొగ మాదిరే దీర్ఘకాలం వాతావరణంలో అలుముకుని సూర్యరశ్మిని అడ్డుకుంటాయి. 2019–20లో ఆస్ట్రేలియా ఇలాంటి వాతావరణాన్ని చవిచూసింది. దానికి ‘బ్లాక్ సమ్మర్’ అని పేరుపెట్టారు. ఇకనైనా వాతావరణంతో ఆటలాడటం ప్రమాదకరమని ప్రభుత్వాలు గుర్తించాలి. గుప్పెడు కార్పొరేట్ సంస్థల లాభార్జన కోసం వాతావరణాన్ని బలిపెడితే ఊహకందని ఉత్పాతాలు కాటేస్తాయి. పర్యావరణం ధ్వంసమై మానవాళి మనుగడే పెను ప్రమాదంలో పడుతుంది. తాజా పరిణామాలు చేస్తున్న హెచ్చరిక ఇదే. -
నిరసనలకు ‘సుప్రీం’ ఛత్రం!
ఉద్యమించటం, నిరసనలు వ్యక్తం చేయటం నేరమన్న అభిప్రాయం వ్యవస్థల్లో నరనరానా వ్యాపించింది. ఒక బ్యానర్తోనో, ఒక జెండాతోనో, నిర్దిష్టమైన ఎజెండాతోనో జనం రోడ్లపైకి రాగానే లాఠీలు పైకి లేవడం, బాష్పవాయు గోళాలు వర్షించడం... ఉద్యమకారుల్ని ఈడ్చుకెళ్లడం, పిడిగుద్దులు, బూటుకాళ్లతో తన్నడాలు రివాజయ్యాయి. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఉద్యమంలోనైతే పెల్లెట్లనుంచి ఏకే–47 బుల్లెట్ల వరకూ కనబడటం అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. ఈ నేపథ్యంలో సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం శాంతియుత నిరసనలపట్ల ఎలా వ్యవహరించాలో తెలియజేస్తూ మార్గదర్శ కాలు జారీచేస్తామనటం స్వాగతించదగింది. నిరసనలు రాజ్యాంగం ప్రసాదించిన హక్కనీ, వాటిని నిరాకరించటం సరికాదనీ వ్యాఖ్యానించింది. పాలకులూ, వారిని సమర్థించే కొన్ని వర్గాలూ ఈ సంగతి మరిచి చాన్నాళ్లయింది. ఉద్యమాలూ, నిరసనలను ఏవగించుకునే జాతీయ మీడియా చానెళ్లకు కూడా కొదవలేదు. దగ్గర వాటర్ బాటిళ్లు తప్ప మరేం లేని 15, 16 ఏళ్ల పిల్లల్ని... అందునా ఆడపిల్లల్ని గూండాలుగా అభివర్ణించే స్థాయికి అవి దిగజారాయి. ఆడపిల్లల ఛాతీపై చేతులువేసి నెట్టడం, చెంపదెబ్బలు కొట్టడం, లాఠీలతో మోదటం ఏ రకంగా సమర్థనీయం? వారు కనీసం ప్రతిఘటించే ప్రయత్నం కూడా చేయలేదే! విధి నిర్వహణలోవున్న పాత్రికేయుల్నీ, పక్కన నిలబడి చూస్తున్నవారినీ కూడా తలలు పగలగొట్టారు. పెల్లెట్లతో గాయపరిచారు. ఇలా అతిగా ప్రవర్తించిన సిబ్బంది మాస్క్‌లు, స్వెట్టర్లు ధరించి వివరాలు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. డీకే బసు వర్సెస్ పశ్చిమ బెంగాల్ కేసులో వెలువరించిన తీర్పులో చట్టబద్ధమైన విధి నిర్వహణలో ఉండే ప్రతి పోలీసు అధికారి తప్పనిసరిగా తమ గుర్తింపు తెలిసేలా ఉండాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. అటుపై అది సీఆర్పీసీలో 41–బి సెక్షన్‌గా, ఇప్పుడు బీఎన్ఎస్లో సెక్షన్–36గా చేరింది. బలప్రయోగం చేయటానికి రాజ్యానికున్న అధికారం తాలూకు బాధ్యతను నిర్దిష్టంగా గుర్తించదగిన వ్యక్తికి ఆపాదించగలిగేలా ఉండాలన్న రాజ్యాంగపరమైన హామీ ఇది.పెద్దయెత్తున జనం పాల్గొనే ఆందోళనల్లో నేరగాళ్లు చొరబడే అవకాశాలు లేకపోలేదు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడే అవకాశాలు తోసిపుచ్చలేం. అలాంటివారిని గుర్తించి అదుపు చేయటానికే సాధారణ దుస్తుల్లో పోలీసు సిబ్బంది ఉంటారు. అంతకన్నా ముందు నిరసన జరిగే ప్రాంతాన్ని నిరంతరం నిఘా కళ్లు చూస్తుంటాయి. అలాంటపుడు ఊరేగింపు జరపాలని సీజేపీ నిర్ణయించిన రోజు వేకువజామున జంతర్‌మంతర్‌లో పెద్ద పెద్ద రాళ్లతో కూడిన ట్రక్కు, అప్పటికే పూర్తిగా ధ్వంసమైన వాహనం ఎలా చేరాయి? అప్రమత్తంగా ఉన్న కార్యకర్తలు వెనువెంటనే వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అప్పుడైనా చర్యలుంటే పోలీసులపై జరిగాయంటున్న దాడులకు ఆస్కారం ఉండేది కాదు. కానీ అటుతర్వాత విచక్షణారహితంగా ఉద్యమకారుల్ని కొట్టారు. తలలకు గాయాలై నెత్తురోడుతున్నవారు అనేకమంది వీడియోల్లో కనబడ్డారు. కొందరికి చేతులు విరిగాయి. లాఠీచార్జి చేసేటపుడు మోకాలు దాటి పై భాగంలో కొట్టడం చట్టవిరుద్ధం.ఈ నెల 25న బిహార్ బంద్ సందర్భంగా శివాన్ జిల్లాలో ఉద్యమకారులతో ఘర్షణ చోటుచేసుకున్నప్పుడు ఒక కానిస్టేబుల్ ఏకే–47తో కాల్పులు జరుపుతూ కెమెరాలకు చిక్కాడు. 15 యేళ్ల బాలుడితోసహా ముగ్గురు గాయపడ్డారని అంటున్నా పోలీసులు మాత్రం ఆ కాల్పులవల్ల ఎవరూ గాయపడలేదంటున్నారు. నిరాయుధ పౌరులపై మిలిటరీ గ్రేడ్ ఆయుధాలు ఉపయోగించరాదన్న ప్రాథమిక పరిజ్ఞానం కూడా అతగాడికి లేదని అర్థమవుతుంది. అతన్ని సస్పెండ్ చేశారు సరేగానీ... కనీస అవగాహన లేనివారికి ఇటువంటి ప్రమాదకర ఆయుధాలు ఎలా ఇచ్చారన్నది తేల్చాలి. మొన్న శుక్రవారం విజయవాడలో విద్యార్థి, యువజన సంఘాల ‘చలో లోక్‌భవన్’లో సైతం ఇలాంటి దృశ్యాలే దర్శనమిచ్చాయి. ఏపీలో అమలయ్యేది రెడ్ బుక్ రాజ్యాంగం కనుక విద్యార్థి సంఘాల కండువాలేసుకుని మరీ పోలీసులు దాడిచేశారు. యువకుల్ని బూటుకాళ్లతో తన్ని, పిడిగుద్దులు గుద్ది తీవ్రంగా గాయపరిచారు. రోడ్డుపై పడేసి కొట్టారు. ఇలా ఆటవిక ప్రవృత్తి మితిమీరుతున్న దశలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవటం శుభ పరిణామం. -
నెగ్గాల్సిన ఇతర పరీక్షలు
యాభై రోజులుపైగా ఢిల్లీలో మహోధృతంగాసాగి, దేశం మొత్తాన్ని సుడిగాలిలా చుట్టేసిన జంతర్ మంతర్ ఉద్యమం ఉపశమించిన మర్నాడే ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షల సంస్కరణల కోసం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని ఆధ్వర్యాన ఆరుగురు సభ్యుల టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమిస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు. అంతేకాదు... పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పబ్లిక్ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లును లోక్‌సభలో సోమవారం ప్రవేశపెట్టారు. కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మొదలెట్టి చకచకా సాగుతున్న ఈ పరిణామాలు... ఆగ్రహంతో రగులుతున్న జెన్ జీ తరాన్ని దగ్గర చేసుకోవటానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాల పర్యవసానమే. నీట్ పేపర్ లీకయిందనీ, మరోసారి ఆ పరీక్ష నిర్వహణ తప్పదనీ తేలిన వెంటనే ఇంతే వేగంగా స్పందించివుంటే బహుశా ఈ స్థాయిలో ఆందోళన జరిగివుండేది కాదేమో! ఆ మాటకొస్తే ఎన్నో యేళ్లుగా ఈ లీకులు వినబడుతూనే ఉన్నాయి. కానీ వ్యవస్థల్లో కదలిక లేదు. 2024 నీట్ ప్రశ్నపత్రం లీక్ తర్వాత మాత్రం ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటైంది. అది ఇచ్చిన నివేదిక అతీగతీ ఏమైందో తెలియదు. ఇంత నిస్తేజంగా ప్రభుత్వాలున్నప్పుడు ఉద్యమాలు వెల్లువెత్తడంలో ఆశ్చర్యం లేదు. మన దేశంలో సమస్యేమంటే కేంద్రం ఒక్కటే కాదు... రాష్ట్ర ప్రభుత్వాలు సైతం లీకుల విషయంలో నిర్లిప్తంగానే ఉంటాయి. జంతర్ మంతర్ ఉద్యమం ఒకపక్క సాగుతుండగానే పంజాబ్‌లో ఫార్మసీ రిక్రూట్మెంట్ పరీక్షల అక్రమాలు బయటపడ్డాయి. ఇక ఎన్డీయే కూటమి ఏలుబడిలోనే సాగుతున్న ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియే పెద్ద కుంభకోణంగా మారింది. నోటిఫికేషన్ విడుదలనాడే స్పోర్ట్స్ కోటా నియామకాలకు అర్హత పరీక్ష అవసరం లేదంటూ రెండు జీవోలు తీసుకురావటం ఆ ప్రభుత్వ బరితెగింపునకు చిహ్నం. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఏపీ విద్యామంత్రి లోకేశ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ బలంగా వినిపించింది. నందన్ నిలేకని విద్యాధికుడు. ఐటీ రంగంలో పేరెన్నికగన్నవారు. గతంలో మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం దేశంలో సంక్షేమ పథకాల అమలుకోసమంటూ తీసుకొచ్చిన ఆధార్ కార్డుల రూపకర్త ఆయనే. నిలేకని మాదిరే ఇతర సభ్యులు సైతం వారి వారి రంగాల్లో నిష్ణాతులు. పరీక్షల నిర్వహణకు ఇప్పుడ నుసరిస్తున్న విధానాల్లోని లోటుపాట్లు అధ్యయనం చేసి, ఎలాంటి సంస్కరణలు అవసరమో వీరు సూచిస్తారు. అడుగడుగునా చోటుచేసుకోవటానికి ఆస్కారం ఉన్న అవకతవకలనూ, అనైతిక పద్ధతులనూ నివారించటానికి ఏం చేయాలో చెబుతారు. వీటన్నిటికన్నా ముందు అసలు పరీక్ష నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వంటి జాతీయ సంస్థ అవసరమా అనే సంగతి నిగ్గుదేల్చటం అవసరం. ఒక సంస్థకు దాని సామర్థ్యానికీ, వనరులకూ మించిన బాధ్యతల్ని అప్పగించటం సరైందేనా? ఆలోచించాలి. రెండేళ్లనాటి రాధాకృష్ణన్ కమిటీ నివేదికలోని అంశాలేమిటో, దాని సిఫార్సులపై తీసుకున్న చర్యలేమిటో చెప్పాల్సిన బాధ్యత పాలకులకు లేదా? కాక్రోచ్ ఉద్యమం సాగుతుండగానే 2024 నీట్ లీక్ ప్రధాన నిందితుడిపై వచ్చిన ఆరోపణలు రుజువు కాలేదని సీబీఐ ప్రకటించటం మరో వైచిత్రి. ఇక విద్యార్థులపై అత్యంత ఘోరంగా బలప్రయోగానికి పూనుకున్నవారిపైనా చర్యలుండాలి.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఇకపై అవసరమైన చర్యలు నిరంతరం తీసుకుంటూనే ఉంటుందని ప్రధాని చెప్పటం హర్షించదగ్గది. ఇది కేంద్ర స్థాయిలో మాత్రమే కాదు... రాష్ట్రాల స్థాయిలో కూడా జరగాలి. ఇతర రాష్ట్రాల మాటెలవున్నా తమ ఏలుబడిలోని ప్రభుత్వాలైనా జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత ఎన్డీయే పెద్దలకుంది. ప్రధాని హామీ కంటితుడుపు చర్య మాత్రమేనని, రాష్ట్రాల్లో కూడా కాక్రోచ్ల స్థాయిలో ఉద్యమిస్తే తప్ప డీఎస్సీ అవకతవకల వంటివి పట్టించుకోబోరన్న సంకేతాలు వెళ్లరాదు. అందుకే దేశంలో యువత మనసు గెలవాలంటే నెగ్గాల్సిన పరీక్షలు చాలానే ఉన్నాయని కేంద్రం గుర్తించాలి. -
దుర్భిక్ష పర్వం
ఈ ఏడాది వానలు ముఖం చాటేస్తున్నాయి. రైతుల కళ్లల్లో దిగులు మబ్బులు కనిపిస్తున్నాయే గాని, ఎక్కడా చినుకుల సవ్వడి వినిపించడం లేదు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవకుంటే, చాలినన్ని తిండి గింజలు పండక కరవు కాటకాలు తప్పవు. అనావృష్టి తెచ్చిపెట్టే కరవు కాటకాలు సామాన్యుల బతుకులను దుర్భరం చేస్తాయి. ప్రధానంగా మనది వ్యవసాయాధారిత దేశం. వ్యవసాయాన్నే నమ్ముకుని, దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న కర్షక జనాభా వర్షాభావం వల్ల కష్టాల్లో పడితే, యావత్ దేశానికే కష్టాలు తప్పవు. వర్షాల కోసం క్రమం తప్పక యజ్ఞయాగాదులు చేసే సంస్కృతి మనది. వర్ష ప్రాధాన్యం పట్ల ఎరుక కలిగిన జాతి మనది. ‘అనావృష్టి మతీత్యైవ మహతీ వర్షసంతతిః/ భూతానాం సంక్షయం చక్రే దుర్భిక్ష పరిపీడితమ్’ అని విష్ణుపురాణం చెబుతోంది. అనావృష్టి వల్ల పంటలు పండక దుర్భిక్షంతో మనుషులే కాదు, సమస్త ప్రాణులూ సంక్షోభానికి, నాశనానికి లోనవుతాయి. కరవు కాటకాలు మన దేశానికి కొత్త కాదు. వానలు లేక, నేల నెర్రెలు పడిన దుర్భర దుర్భిక్ష వర్ణనలు మన పురాణ సాహిత్యం మొదలుకొని ఆధునిక సాహిత్యం వరకు చాలానే ఉన్నాయి. ‘అదే పెన్న! అదే పెన్న!/ నిదానించి నడు/ విదారించు నెదన్, వట్టి/ ఎడారి తమ్ముడు!’ అంటూ ‘పెన్నేటి పాట’ రాసిన విద్వాన్ విశ్వం ఒకనాటి రాయలసీమ కరవు దృశ్యాన్ని హృదయ విదారకంగా చిత్రించారు. కరవు కాటకాలను ముందుగా తెలుసుకునే సాంకేతికత ఇదివరకు ఉండేది కాదు. అందువల్ల దుర్భిక్షాన్ని దైవఘటనగానే పరిగణించేవారు. ఇటీవలి కాలంలో సాంకేతిక పెరిగింది. అతివృష్టి, అనావృష్టి పరిస్థితు లను; అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫానుల వంటి ప్రకృతి విపత్తులను ముందు గానే గ్రహించి, వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేయగలుగుతున్నారు.పాలకులు బాధ్యతనెరిగిన వారైతే, వాతావరణ శాస్త్రవేత్తల హెచ్చరికలను పట్టించుకుని కార్యాచరణను ప్రారంభిస్తారు. పాలకులు బాధ్యతను మరచి, హాలికులను వారి కర్మానికి వారిని విడిచిపెడితే, దుర్భిక్ష పర్యవసానాలు మరింత దుర్భరంగా ఉంటాయి. ఈసారి ‘సూపర్ ఎల్ నినో’ పరిస్థితులు ఏర్పడనున్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు వేసవిలోనే హెచ్చరికలు చేశారు. ఈ హెచ్చరికలు ఒకవైపు రైతులలో గుబులు పెంచుతుంటే, మరోవైపు చీకటి వ్యాపారులలో, రాజకీయ దళారులలో, అవినీతిలో మునిగితేలే అధికార గణాల్లో సంబరాన్ని పెంచుతున్నాయి. కరవును కూడా సొమ్ముచేసుకోగల సమర్థులు మనకు కొత్త కాదు. ఇలాంటి దౌర్భాగ్యాన్ని గురించే పాత్రికేయుడు సాయినాథ్ ‘ఎవ్రీబడీ లవ్స్ ఎ గుడ్ డ్రౌట్’ పుస్తకాన్ని ముప్పయ్యేళ్ల కిందటే రాశారు.‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అని నేలను నమ్ముకున్న రైతు కలలోనైనా కరవు కాటకాలను కోరుకోడు. రోజువారీ పనులు చేసుకుంటూ అన్నం తిని బతికే సామాన్య ప్రజలు కూడా కరవు కాటకాలను కోరుకోరు. ప్రతి సంక్షోభాన్నీ స్వీయ సంక్షేమ అవకాశంగా మార్చుకొనే దౌర్భాగ్యులే దుర్భిక్షాన్ని కోరుకుంటారు. ‘వార్ధుషికః వణిగ్బంధుః యే చ ప్రభూతమన్న సంగ్రహం/ కృత్వా దుర్భిక్షం వాంఛంతి తే పి వార్ధుషికా’ అని ప్రాచీన సుభాషిత శ్లోకం చెబుతుంది. వర్తకులకు అధిక వడ్డీలకు అప్పులిచ్చి, జనాలను పీడించే వడ్డీ వ్యాపారులు దేశంలో కరవు కాటకాలు రావాలని కోరుకుంటారని ఈ శ్లోక సారాంశం. ఇప్పటి కాలంలో వడ్డీ వ్యాపారులకు జతగా కార్పొరేట్ ఫైనాన్స్ కంపెనీల నిర్వాహకులు, రాజకీయ దళారులు, లంచగొండి అధికారులు కూడా జనాలకు దాపురించారు.వీళ్లందరూ కరవులో అధికమాసం లాంటివారు.ఈ ఏడాది ‘సూపర్ ఎల్ నినో’ కారణంగా భారత్ సహా ఎనభై ఎనిమిది దేశాలు తీవ్ర వర్షాభావంతో అల్లాడనున్నాయి. ఇది కేవలం ప్రకృతి పరిణామం మాత్రమే కాదు, ఇంగితం లేని పాలకుల చర్యలకు పర్యవసానం కూడా! భూతాపం పెరుగుదలపై పర్యావరణవేత్తలు మొత్తుకుంటూనే ఉన్నా, కొందరు దేశా«ధినేతలు యుద్ధ విధ్వంసాల్లో మునిగితేలుతున్నారు. ఇంకొందరు అభివృద్ధి పేరుతో అడవుల నరికివేతకు ఊత మిస్తున్నారు. ఈకాలం దుర్భిక్షం బాధ్యతెరుగని పాలకుల స్వార్థఫలం. -
‘సంపూర్ణ క్రాంతి’ సైరన్!
‘‘పదండి ముందుకు, పదండి తోసుకు – ప్రభంజనం వలె హోరెత్తండి’’... శ్రీశ్రీ కవితావేశానికి దృశ్యరూపంలా కనిపించింది ‘కాక్రోచ్’ల కదనోత్సాహం. ఎండుగడ్డి మైదానంలో నిప్పు రవ్వలా నిద్రాణమైన జన చేతనను రగిలించగలిగింది. 1974లో స్వాతంత్య్ర సమరయోధుడు జేపీ నాయకత్వంలో నడిచిన ‘సంపూర్ణ క్రాంతి (టోటల్ రివోల్యూషన్) ఛాయలు ఈ ఉద్య మంలో ప్రస్ఫుటంగా కనిపించాయి. నిరంకుశ పాలన వైపు అడుగులేస్తున్న అధికార కూటమికీ, పక్షవాతం సోకిన ప్రధాన ప్రతిపక్షానికీ కాక్రోచ్ ఉద్యమం గట్టి సవాల్నే విసిరింది. ఉద్యమ స్వభావాన్ని, దాని గమనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సమయంలోనే గుర్తించగలిగారు. ఫలితంగా శనివారం మధ్యాహ్నం విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ఆయనే వ్యక్తిగతంగానే తీసుకున్నారని జాతీయ మీడియాకు లీకులందాయి. బహుశా ఆయన ప్రతిష్ఠను నిలబెట్టడం కోసం వీటిని ప్రసారం చేసి ఉండవచ్చు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల విజయాల కీలక పాత్రధారుల్లో ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఒకరు. ఆయన గౌరవాన్ని కాపాడటం పార్టీ బాధ్యత కూడా. సంపూర్ణ క్రాంతి ఉద్యమం మాదిరిగా దేశ వ్యాప్తంగా విస్తరించే లక్షణాలను కాక్రోచ్ ఉద్యమంలో గుర్తించి నందువల్ల దీనికి వెంటనే ఫుల్స్టాప్ పెట్టాలని ప్రధాని భావించి నట్టు సమాచారం.ధరేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌ను తొలి దశలో ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రజా ఉద్యమాలకు తలొగ్గి నిర్ణయాలను మార్చుకునే లక్షణం పన్నేండేళ్ల పాలనా కాలంలో ఎన్డీఏకు ఎప్పుడూ లేదు. వ్యవసాయ చట్టాలకు వ్యతి రేకంగా పంజాబ్ రైతులు చేసిన చరిత్రాత్మక పోరాటంపై స్పందించడానికి మోదీ సర్కార్ సుదీర్ఘ సమయాన్ని తీసు కున్నది. అంతర్జాతీయ క్రీడా యవనికపై దేశ ప్రతిష్ఠను ఇనుమ డింపజేసిన మహిళా మల్లయోధుల ఆక్రందన అరణ్యరోదనగా మారింది తప్ప ఎన్డీఏ సర్కార్ చలించలేదు. పౌరసత్వ చట్టం దగ్గర నుంచి అనేకానేక అంశాల్లో కేంద్రం ప్రజా ఉద్యమాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. ‘కాక్రోచ్’ల పార్లమెంట్ ముట్టడి జరిగిన మూడు రోజుల్లోనే ప్రధానమంత్రి రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలను చేపట్టారు.ఈ నెల 23న ఆందోళనపై తొలిసారిగా ఆయన నోరు విప్పారు. పేపర్ లీకేజీ ఘటనల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు లను ఏర్పాటు చేస్తున్నట్టు అర్ధరాత్రి ట్వీట్ చేశారు. విద్యార్థుల సంక్షేమం, వారి భవితవ్యం కంటే ఇంకేదీ ముఖ్యం కాదని కూడా అందులో పేర్కొన్నారు. 24న జరిగిన కేబినెట్ సమావేశంలో ఇటువంటి నేరాలకు సంబంధించి చట్టానికి మరింత పదును పెడుతూ తీర్మానించారు. సీజేపీ ప్రతినిధులు పెట్టిన గడువు లోపల 25 మధ్యాహ్నం మంత్రి రాజీనామా నిర్ణయం వెలువడింది. ఈ మూడు రోజులుగా కేంద్రమంత్రులు సీజేపీ ప్రతి నిధులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. సీజేపీ పెట్టిన డిమాండ్లలో మంత్రి రాజీనామా ముఖ్యమైనది. ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వడం, ఆందోళనలో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేయడం మిగిలిన రెండు డిమాండ్లు. వీటిని కూడా కేంద్రం అంగీకరించినట్టు సమాచారం.విద్యార్థులపై జరిగిన పాశవిక లాఠీచార్జికి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని తాజాగా సీజేపీ డిమాండ్ చేసింది. మంత్రి రాజీనామాతో యువజనోద్యమం ముగిసిపోలేదనీ, విద్యావ్యవస్థ ప్రక్షాళన జరిగేవరకూ కొనసాగు తుందనీ కాక్రోచ్ ప్రతినిధులు విజయోత్సవం సందర్భంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ధర్నా, దీక్షా కార్యక్రమాల విరమణపై నిర్ణయం వెలువడాల్సి ఉన్నది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం కంటే ఎక్కువగా అప్రదిష్ట మూటకట్టుకున్నది గోదీ (పెంపుడు) మీడియా.ఏన్డీఏ కూటమిలో అప్రకటిత భాగస్వాములుగా పెంపుడు మీడియా, యెల్లో మీడియా వగైరాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జూలై 20న జరిగిన కాక్రోచ్ల పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం పెంపుడు మీడియాను దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశం నలుమూలల నుంచి లక్షలాది యువజనం తరలి వస్తారని అది ఊహించలేకపోయింది. పోలీసు దమనకాండకు ఎదురొడ్డి నిలబడతారని కూడా అంచనా వేయలేకపోయింది. ఈ ఉలికి పాటు నుంచి తెప్పరిల్లిన తర్వాత సన్నాయి నొక్కులు ప్రారంభించింది. తరలివచ్చిన ఝంఝూమారుత యువ కెరటాలను ‘నీట్ పరీక్ష’ పరిధిల్లోనే బంధించడానికి తాపత్రయపడింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ ఆందోళన కొనసాగించడంలో అర్థం లేదని ధర్మపన్నాగాలను వల్లె వేసింది. జవాబుదారీతనం ఒక కనీస ప్రజాస్వామిక ధర్మమనే విషయాన్ని విస్మరించి మంత్రి రాజీనామా డిమాండ్‌ను తప్పుపట్టింది. తాడూ బొంగరం లేని పార్టీ పిలుపునిస్తే ఇంత జనసందోహం పోగవడం వెనుకనున్న ‘అదృశ్య శక్తుల’ కోసం ఆరా తీయడం మొదలుపెట్టింది. మీడియా పక్షపాతాన్ని నిలదీసిన యువకులను అరాచక శక్తులుగా చిత్రించారు. నవతరం యువతుల ధైర్యసాహసాలకూ, మొహమాటమెరుగని ముక్కుసూటి తనానికీ వాట్సాప్ యూనివర్సిటీ పెడార్థాలు తీసింది.ఆన్లైన్లో మొదలైన కాక్రోచ్ పార్టీ పిలుపునిస్తే లక్షలాది మంది స్పందించడం పట్ల ప్రభుత్వం, పెంపుడు మీడియాలే కాదు, ప్రతిపక్షం కూడా అవాక్కయింది. పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి సహజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. అయితే పాలక కూటమి అందుకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడింది. యాభయ్యేళ్ల కింద దేశంలో సంపూర్ణ క్రాంతి ఉద్యమంనాటి పరిస్థితులే నేటి యువజనో ద్యమం పరిస్థితులు కూడా. బంగ్లాదేశ్ విమోచన యుద్ధం తర్వాత ఇందిరాగాంధీ ప్రతిష్ఠ పెరిగింది కానీ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. సరకుల ధరలు పెరిగాయి. నిరుద్యోగం ప్రబలింది. రాజకీయ నేతలు, అధికార యంత్రాంగంలో గతంతో పోలిస్తే అవినీతి ప్రబలింది. దీనికి తోడు ఎదురులేదన్న ధీమాతో అధికార పార్టీలో, అధినాయకత్వంలో నియంతృత్వ ధోరణులు ప్రబలాయి. ఈ ధోరణులకు వ్యతిరేకంగా గుజరాత్ విద్యార్థులు ప్రారంభించిన ఆందోళనను బిహార్ అందిపుచ్చుకున్నది.అనంతరం జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో అది సంపూర్ణ క్రాంతి ఉద్యమంగా పరిణామం చెంది ఎమర్జెన్సీ విధింపునకు, తదనంతరం ఇందిరాగాంధీ ఓటమికి దారితీసింది. 1974 నాటి పరిస్థితులు మరింత దారుణంగా ఇప్పుడు పరిణమించాయి. విద్యారంగంలో విచ్చలవిడిగా ప్రైవేటీకరణ ప్రబలింది. ఈ ప్రైవేటీకరణ భూతంలేని ఆ రోజుల్లోనే సంపూర్ణ క్రాంతి డిమాండ్లలో అందరికీ విద్య అందుబాటులో ఉండాలనే అంశం ప్రముఖంగా చోటుచేసుకున్నది. ఇప్పుడు దేశంలో మెజా రిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులో లేని పరి స్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ స్కూళ్లను దిగజార్చుతున్నాయి. 2014 నుంచి నేటివరకు దేశంలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఒక కోటి పద్దెనిమిది లక్షలు తగ్గింది. అదే సమయంలో ప్రైవేట్ స్కూళ్లలో 88 లక్షల మంది పెరిగారు. ఇటువంటి పరిస్థితుల్లోనే నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసింది. ఫలితంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. కొన్ని స్కూళ్లలో నో వేకెన్సీ బోర్డులు పెట్టడం జాతీయ వార్తగా మారింది. వాస్తవాలు ఇలా వుంటే... ఇప్పుడు కొత్తగా లోకేశ్ సారథ్యంలో ప్రభుత్వ స్కూళ్లు నో వేకెన్సీ బోర్డులు పెడుతున్నట్టు రంప చోడవరం సభలో చంద్రబాబు కళ్లార్పకుండా చెప్పేశారు. తల్లికి వందనం ఐడియా కూడా లోకేశ్‌దే నన్నట్టుగా ఆయన మాట్లా డారు. పెద్ద నాయకుడు కాబట్టి సరిపోయింది. ఇంకెవరైనా అలా మాట్లాడితే ‘అతన్నెవరికైనా చూపించండర్రా’ అంటారు. జగన్ మోహన్‌రెడ్డి నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం అనుమతులు తీసుకోకుండా 1,800 మెడికల్ సీట్లను ఏపీ విద్యార్థులకు దూరం చేసి వారి కలలను భగ్నం చేశారు. ఇలాంటి పరిస్థితులే కదా కాక్రోచ్ల పుట్టుకకు దారితీసేది!దేశవ్యాప్తంగా ఉన్నత విద్యారంగం పరిస్థితి కూడా నిరాశా జనకంగానే ఉన్నది. యూజీసీ గ్రాంట్లకు భారీగా కత్తెర వేసి విశ్వవిద్యాలయాల నాణ్యతా ప్రమాణాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ వర్సిటీలకు అనుమతులు పెరిగాయి. అవి కాసుల కోసం పని చేస్తాయి తప్ప పరిశోధనల కోసం పాకులాడవు కదా! ఉన్నత విద్యారంగంలో కూడా ప్రమాణాలు గణనీయంగా పడిపోతు న్నాయి. లక్షల సంఖ్యలో ఉత్పత్తి అవుతున్న నాణ్యతలేని పట్టభద్రులకు ఉద్యోగాలు దొరకడం లేదు. పట్టభద్రుల నిరు ద్యోగితా శాతం దేశంలో ముప్పయి శాతం దాటింది. నాణ్యమైన విద్యను ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో దూరం చేశారు. ప్రైవేట్ సంస్థల్లో కొనలేని పేద, మధ్యతరగతి విద్యార్థులు నిరుద్యో గులుగా మిగిలిపోతున్నారు. విద్యారంగం పూర్తి సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ సంక్షోభంలో కోట్లాది మంది చిక్కుకొని పోయారు.సంక్షోభానికి మరోకోణం అవినీతి. రాష్ట్రాల వారీగా నిక్షేపంగా జరుగుతున్న మెడికల్ అడ్మిషన్ల విధానాన్ని ఉద్దరిస్తామని చెప్పి కేంద్రీకరించారు. వ్యవస్థాగత బలంలేని టెస్టింగ్ ఏజెన్సీకి ప్రతిష్ఠాత్మక సంస్థల అడ్మిషన్ల బాధ్యతను అప్పగించారు. ప్రైవేట్ సంస్థలకు కీలకమైన పనులను ఔట్ సోర్సింగ్ చేసే పద్ధతి వల్ల అవకతవకలకు రాచబాట ఏర్పడింది. ఫలితంగా లక్షలాది విద్యా ర్థుల కలలు కల్లలవుతున్నాయి. ఈ పూర్వరంగంలో ప్రధాన్ రాజీనామాతోనే ఈ సంక్షోభం తొలగిపోదు. సంపూర్ణ క్షాళన కోసం యువతరం ఉద్యమించడం అనివార్యం. ఇవాళ కాక పోయినా రేపైనా ఈ సంపూర్ణ క్రాంతిరథం కదలక తప్పదు.ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ అవకతవకలపై ప్రతిపక్ష నేత అందజేసిన సాక్ష్యాలను యువతరం అందిపుచ్చుకోవలసి ఉన్నది. మెడికల్ సీట్లను రాష్ట్ర విద్యార్థులకు అందకుండా చేసిన నిర్వాకంపై ఎలు గెత్తవలసి ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగం తోడుగా ఉన్నంతవరకు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఏ శక్తీ ఏమార్చ లేదని ఈ పరిణామం రుజువు చేసింది. జెన్జీగా పిలుచుకుంటున్న నవతరం మొబైల్ ఫోన్లలో మునిగిపోయి స్తబ్ధుగా మారిపోయిందనే అభిప్రాయం శుద్ధ తప్పని తేలి పోయింది. అవసరం వస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎలాంటి సవాలైనా ఎదుర్కొనేందుకు వారు సిద్ధపడతారని రుజువైంది. కాక్రోచ్ ఆందోళనకు దేశవ్యాప్త గుర్తింపు రావడానికి దోహద పడిన సోనమ్ వాంగ్‌చుక్, ఒక సెటైర్‌ను వైల్డ్ ఫైర్‌గా మార్చగలిగిన అభిజిత్ దీప్కే, 23 రోజుల నిరాహార దీక్ష అనంతరం కూడా సివంగిలా రణగర్జనలు చేసిన నేహా బోరా, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా పోలీస్ వ్యాన్ ఎదురుగా నిలబడి అమరత్వానికి సిద్ధపడిన రియా అహిర్, వాటర్ కెనాన్లను గేలిచేస్తూ వాటికింద డ్యాన్సులు చేసిన బిహారీ విద్యార్థులు, తోడేళ్ల మంద ఎదుట తొడగొట్టినట్టు లాఠీచార్జీలను సవాల్ చేసిన యువతీ యువకులందరూ ఈ ఉద్యమంలో హీరోలే! రాబోయే సంపూర్ణ విప్లవానికి వేగుచుక్కలు వారే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మహోగ్రంగా బ్రహ్మపుత్ర!
దేశంలో అనేక ప్రాంతాలు వాన జాడలేక ఇబ్బంది పడుతుంటే అస్సాం ఎప్పట్లానే వరద నీటిలో తేలియాడుతోంది. బ్రహ్మపుత్ర నది మహోగ్రరూపం దాల్చి విరుచుకుపడటంతో జనావాసాల్లోకి వరద నీరు ప్రవేశించి 9 లక్షలమందికిపైగా జనం ఇళ్లూ వాకిళ్లూ వదిలి పోవాల్సివచ్చింది. ఇంతవరకూ 47 మంది మరణించగా, దాదాపు 25,000 హెక్టార్ల పంట నీట మునిగింది. మొత్తంగా 11 జిల్లాలు వరదలతో దెబ్బతినగా, శివసాగర్, జోర్హాట్, దిబ్రూగఢ్, చారైదేవ్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. హిమాలయా ల్లోని కైలాసశిఖరిలో పుట్టి, ప్రపంచంలోని అతి ఎత్తయిన ప్రాంతంలో పెను వేగంతో ప్రవహిస్తూ అటు తర్వాత అస్సాం మైదాన ప్రాంతాలకు ఆ నది చేరుతుంది. అక్కడ వేగం తగ్గినా అప్పటికే అది ఒండ్రుమట్టినీ, బురదనూ పోగేసుకొస్తుంది. ప్రపంచంలోని ఏ నదితో పోల్చినా అది తీసుకొచ్చే ఒండ్రుమట్టి, బురద పరిమాణం చాలా ఎక్కువ. ఇదంతా నదీ ప్రవాహ క్రమంలో ఎక్కడికక్కడ మేటలేస్తూ వస్తుంది. కాలం గడిచేకొద్దీ ప్రవాహమార్గం ఇరుకై ఆ నది దారి మార్చుకోవటం మొదలుపెడుతుంది. అందుకే బ్రహ్మపుత్రను స్థానికులు వలస నది అంటారు. ఎగువ ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు ఒక్కసారిగా విరుచుకుపడటం పర్యవసానంగా కుంభవృష్టి, మంచు పర్వతాలు కరిగి పోవటం, భారీ వర్షాలు పడటం అస్సాంకు రివాజు. ఈసారి మేఘాలయ తదితరప్రాంతాల్లో పడిన భారీవర్షాలు వరదలకు కారణమయ్యాయి. బ్రహ్మపుత్ర పరివాహ ప్రాంతం దేశాలూ, రాష్ట్రాలూ దాటి విస్తరించివుంది. ఇది ప్రకృతి శాపమని, ఇందులో మనిషి నిమిత్తమాత్రుడని చెప్పే మాటల్లో నిజం లేదు. వేరే దేశాల సంగతి వదిలి, కనీసం నదీపరివాహ రాష్ట్రాలన్నీ కలసికట్టుగా దృష్టి పెడితే బ్రహ్మపుత్ర కలగజేసే నష్టాన్ని పరిమిత స్థాయికి కుదించవచ్చు. ఇందుకు భిన్నంగా దాన్ని కేవలం ఒక రాష్ట్రానికి చెందిన సమస్యగా పరిగణించటమే చివరికి కష్టనష్టాలన్నీ అస్సాం భరించాల్సివస్తోంది. వరదల్ని కట్టడిచేసేందుకు కరకట్టల నిర్మాణమే సరైందని ఆరాష్ట్రం అనుకుంటోంది. దశాబ్దాలుగా వాటిపైనే కేంద్రీకరిస్తోంది. కానీ నదీ గమనం మారినప్పుడల్లా ఈ కరకట్టలు నిరుపయోగమవుతున్నాయి. పూడికతీత ప్రధాన సమస్యగా మారుతున్నప్పుడు బురద నియంత్రణ విషయంలో ఏం చేయాలన్నప్రశ్న రావాలి. అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ చెప్పినట్టు ఇది కనీవినీ ఎరుగని ఉత్పాతం. ఆ రాష్ట్రానికి ఏటా వరదలు రివాజే అయినా, ఈసారి ముంచెత్తినంత వరద యాభైయ్యేళ్లలో ఎప్పుడూ లేదు. కానీ సహాయ చర్యలు ఏమంత సజావుగా లేవు. వరద ప్రభావం అధికంగా గల శివసాగర్ జిల్లా మొత్తానికి కేవలం 5 బోట్లు మాత్రమే కేటాయించారు. అధికార యంత్రాంగంనుంచి ముందస్తు హెచ్చరికలు లేకపోవటంవల్ల పశువుల్ని రక్షించుకోవటమైనా, తాము సురక్షిత ప్రాంతాలకు తరలడమైనా జనానికి కష్టమై పోయింది. చుట్టూ సముద్రాన్ని తలపించేలా నీరుంటే, అనేకులు పైకప్పులెక్కి నిస్సహా యంగా చూస్తూ ఉండాల్సివచ్చింది. ఆహారం, నీరు అందించటంలోనూ అధికారులు అలసత్వం ప్రదర్శించారన్నది స్థానికుల ఆరోపణ. మొత్తం 872 గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగి దీవుల్ని తలపిస్తున్నాయంటే ఈ తీవ్రత ఎంతగా ఉందో తెలుస్తుంది. అడవుల పరిరక్షణ, అడవుల పెంపకం వంటివి అత్యంత కీలకమైన ప్రాథమిక రక్షణ కవచాలుగా తోడ్పడతాయి. కేవలం అవి మాత్రమే సంపూర్ణంగా నియంత్రిస్తాయను కోవటం సరైంది కాకపోయినా, నదీ పరివాహ ప్రాంతంలో ఉండే పర్వత శిఖరాల్లో దట్టమైన అడవులుంటే చెట్ల వేళ్లు మట్టిని గట్టిగా పట్టి ఉంచటంవల్ల కొండచరియలు విరగటం, వర్షపు నీటితోపాటు మట్టి కొట్టుకుపోవటం తగ్గుతుంది. హిమాలయాలు భూకంప ప్రభావిత జోన్లో ఉండటంవల్ల ఆ ప్రాంతంలోని కొండలు అత్యంత బలహీనమైన నాణ్యత కలిగిన మట్టి, రాళ్లతో నిండి ఉంటాయి. నదీ తీరం పొడవునా వెదురు, గడ్డి జాతుల మొక్కల పెంపకంవల్ల కోతను అరికట్టడం సాధ్యమవుతుంది. ఎన్ని చేసినా తాత్కాలిక ఉపశమనానికీ, నష్టాన్ని నియంత్రించటానికీ మాత్రమే అవి తోడ్పడ తాయి. మనం చేయాల్సిందల్లా పర్యావరణ విధ్వంసాన్ని అరికట్టడం. దాన్ని విస్మరించి చేసే ఏ చర్య అయినా మెరుగైన ఫలితాన్నివ్వలేదు. -
సౌదీలో ‘అణు’కుంపటి
అందరి సలహాలూ బేఖాతరు చేసి ఇరాన్‌పై యుద్ధ భేరి మోగించి పశ్చిమాసియాను అగ్నిగుండంగా మార్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... ఇప్పుడు మరో ప్రమాదకర క్రీడకు సిద్ధపడ్డారు. సౌదీ అరేబియాతో తమకు ‘శాంతియుత అణు సహకార ఒప్పందం’ కుదిరిందంటూ అమెరికా ఇంధన శాఖ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకంపనలు రేపుతోంది. తన నిర్ణయం పర్యవసానాలూ, పరిణామాల గురించి పూర్తిగా తెలిసే ట్రంప్ ఇందుకు సిద్ధపడ్డారా అనే సందేహం అందరిలో తలెత్తుతోంది. ఇది పశ్చిమాసియా అమరికను సంపూర్ణంగా మార్చే... ఇప్పటికే సాగుతున్న ఆయుధ పోటీని మరింత పెంచే ప్రమాదకర నిర్ణయం. 30 యేళ్లపాటు కొనసాగే ఈ ఒప్పందం కింద యురేనియం శుద్ధికి అవసరమైన సామర్థ్యాన్ని సౌదీ సంతరించుకుంటుందని, అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ప్రమాణాలను సాధించటంతోపాటు ప్రాంతీయ భద్రతకూ, అమెరికా భద్రతకూ కూడా తోడ్పడుతుందని అమెరికా అంటోంది. రాగలకాలంలో దేశానికి ఇది వందలకోట్ల వాణిజ్యాన్ని తీసుకొస్తుందనీ... దేశ ఆర్థిక, వ్యూహాత్మక లక్ష్యాలు నెరవేరటానికి దోహదపడుతుందనీ కూడా చెప్పుకుంటోంది. ఒకపక్క తన చర్యల ద్వారా అణ్వాయుధ తయారీకి దోహదపడుతూ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధమే ధ్యేయమని చెప్పటం ఉత్త వంచన. ఈ అణు ఒప్పందం 2008లో మన్మోహన్ సింగ్ తొలి ఏలుబడిలో మన దేశంతో అమెరికా కుదుర్చుకున్న ‘123’ ఒప్పందమే కదా అనిపిస్తుంది. అగ్రరాజ్యాలతోపాటు మనతోసహా పలు దేశాల దగ్గర అణ్వాయుధాలున్నాయి. అదనంగా సౌదీ దగ్గర ఉంటే నష్టమేమిటన్న సందేహాలు కూడా కలుగుతాయి. పైగా ఇది పౌర అణు ఒప్పందమే అనిపిస్తుంది. కానీ తరచిచూస్తే ఇందులో లొసుగులు బయటపడతాయి. సౌదీ అణువిద్యుత్ ప్రాజెక్టులు స్థాపించుకోవటానికే ఇది ఉపయోగపడుతుందని అమెరికా వాదన. ప్రకృతిలో లభించే యురేనియంలోని రెండు ఐసోటోపుల్లో ఒకటైన యూ– 235 మాత్రమే అణు విచ్ఛేదనానికీ, గొలుసు చర్య జరిగి అపారమైన శక్తి విడుదలకూ తోడ్పడు తుంది. యురేనియంను 3 నుంచి 5 శాతంవరకూ శుద్ధి చేస్తే అణు విద్యుత్ ఉత్పాదన సాధ్యమవుతుంది. శుద్ధి 90 శాతానికి చేరితే అణుబాంబు తయారీకి ఉపయోగపడుతుంది. అయితే విద్యుదుత్పాదన తర్వాత వాడేసిన ఇంధనంతో ప్లూటోనియం తయారీ అవకాశం ఎప్పుడూ ఉంటుంది. దాన్ని నిరోధించేందుకే ‘గోల్డ్ స్టాండర్డ్’ పేరుతో అమెరికా కఠినమైన షరతు విధిస్తోంది. దాన్నుంచి సౌదీకి మినహాయింపు ఇవ్వటం పైనే అందరికీ ఆందోళన. ఆ షరతు ఉంటుందని తాజాగా అమెరికా ఇస్తున్న వివరణ నమ్మశక్యంగా లేదు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ)పై ఇరాన్ సంతకం చేసినా, అణుబాంబు తయారీకి వ్యతిరేకంగా అక్కడ ఫత్వా అమల్లో ఉన్నా ఆ దేశం అణు బాంబుకు సిద్ధపడుతోందన్న సంశయాలు అమెరికాకూ, ఇజ్రాయెల్‌కూ ఉన్నాయి. తరచు ఇరాన్‌పై అమెరికా విరుచుకుపడటానికి కారణం అదే. ‘ఇరాన్ ఆ పని చేస్తే... మేం సైతం ఆ బాటలోనే వెళ్తాం’ అని సౌదీ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ గత కొన్నేళ్లుగా పదే పదే చెబుతున్నారు. అలాంటి దేశానికి మినహాయింపు ఇవ్వటమంటే బాహాటంగా దాన్ని అణ్వస్త్ర దేశంగా మారడానికి ప్రోత్సహించటమే అవుతుంది. అమెరికా మిత్రులు ఏం చేసుకున్నా మినహాయింపునిస్తాం... శత్రుదేశాలను మాత్రం నిరుత్సాహపరుస్తాం’ అనే నైజం అత్యంత ప్రమాదకరమైనది. ‘మనిషి అణుబాంబును కనిపెట్టాడు. కానీ ప్రపంచంలో ఏ ఎలుకా ఎలుకలబోను తయారుచేసుకోదు’ అని ఐన్‌స్టీన్ చేసిన వ్యాఖ్య ఆంతర్యం స్పష్టమే. ఇది స్వీయ హననానికి దారితీసే తెలివిమాలిన చర్య. భవిష్యత్తులో అణుశక్తి దేశంగా మారాక సౌదీ, అమెరికా చెప్పుచేతల్లో ఉండదు. తాము చేస్తే తప్పేమిటని ఇరాన్ సైతం ఆ బాట పడుతుంది. చిన్న నిప్పురవ్వ కూడా ఆ ప్రాంతాన్ని ఇప్పుడే భగ్గున మండిస్తుంటే ఇక అణ్వాయుధాలుంటే చెప్పేదేముంది? ఇప్పటికే ఇజ్రాయెల్ స్వీయరక్షణకంటూ అమెరికా దానికి అణ్వాయుధాలు సరఫరా చేసింది. దాని రక్షణ పేరుచెప్పే తరచు ఇరాన్‌పై దాడులు చేస్తోంది. నిజానికి స్వతంత్ర పాలస్తీనా ఆవిర్భవిస్తే ఇజ్రాయెల్‌కు ఇలాంటి రక్షణల అవసరమే ఉండదు. దాన్ని సాకారం చేయకుండా ఈ ప్రాంతాన్ని అణ్వస్త్రాల మయం చేయటం క్షమించరాని నేరం. -
బ్రిటన్‌కు బర్న్‌హామ్ సారథ్యం
బ్రెగ్జిట్ కాలంనుంచీ అస్థిరతకు ఆనవాలుగా మారిన బ్రిటన్‌లో కొత్త ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘనవిజయం సాధించి అధికారంలోకొచ్చిన రెండేళ్లలోనే కీర్ స్టార్మర్ ప్రధాని పదవినుంచి వైదొలగక తప్పలేదు. ‘విదేశీ’ ప్రధానిగా అపకీర్తిపాలైన స్టార్మర్తో పోలిస్తే బర్న్‌హామ్‌కు విదేశాంగ విధానం విషయంలో అనుభవం లేదు. ఆసక్తి కూడా తక్కువే. నెలక్రితం ప్రధాని పదవికి గట్టి అభ్యర్థిగా తొలిసారి పేరు వినబడే నాటికి యూరప్ ఖండంలోనే చాలామందికి ఆయన తెలియదు. కీలక పరిశ్రమలపై ప్రభుత్వాధిపత్యం ఉండాలనీ, నగరాలకూ, ప్రాంతీయ ప్రభుత్వాలకూ అధికారాల వికేంద్రీకరణ జరగాలనీ కోరుకునే రాజకీయ నాయకుడిగా ఆయన దేశంలో అందరికీ తెలుసు. ఉత్తర ఇంగ్లండ్ లోని గ్రేటర్ మాంచెస్టర్‌కు మేయర్‌గా పనిచేసి బర్న్‌హామ్ సాధించిన విజయాలతో ఆయనకు ‘కింగ్ ఆఫ్ నార్త్’గా పేరొచ్చింది. ఆ విజయాల్లో అంతక్రితం ప్రైవేటు రంగానికి పోయిన బస్సు రవాణా విభాగాన్ని ప్రభుత్వ రంగంలోకి తీసుకురావటం వంటివి ఉన్నాయి. గ్రేటర్ మాంచెస్టర్‌కు మేయర్‌గా 2017లో వెళ్లటానికి ముందు ఆయన లేబర్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. చాలా యూరప్ దేశాల మాదిరే పలు సంవత్సరాలుగా అధిక ధరలతో, అరకొర ఆర్థిక వృద్ధితో బ్రిటన్ ఇబ్బంది పడుతోంది. అక్రమ వలసలు మొదలుకొని సక్రమంగా పనిచేయని ప్రభుత్వ సంస్థలవరకూ అనేక సమస్యలున్నాయి. ఈ కారణంగా జనంలో అసంతృప్తి పెరుగుతోంది. ఫ్రాన్స్‌లో మెరిన్ లీ పెన్, జర్మనీలో అలైస్ వీడెల్ వంటి మితవాదపక్ష నాయకుల మాదిరే బ్రిటన్‌లో సైతం దీన్ని తమకనుకూలంగా మార్చు కోవటానికి ప్రయత్నించే జాతీయవాద శక్తులు లేకపోలేదు. 2016లో బ్రెగ్జిట్ మొదలైన దగ్గర్నుంచి దేశాన్ని అస్థిరత పీడిస్తున్న నేపథ్యంలో ఉదారవాద పార్టీలపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోంది. బ్రెగ్జిట్ అనుకూల యూకే ఇండిపెండెన్స్ పార్టీ(యూకేఐపీ) అధినేత నైజెల్ ఫరాజ్ కొత్తగా రిఫామ్ యూకే పార్టీ పేరుతో రంగంలో ఉన్నారు. ఒక దాత నుంచి 50 లక్షల పౌండ్ల విరాళాన్ని తీసుకుని దాన్ని వెల్లడించ లేదన్న ఆరోపణ ఆయనపై రాకపోయి ఉంటే ఈపాటికే ఆయనపై ప్రజల్లో అభిమానం పెరిగేది.అందువల్లే ప్రధాని అయిన వెంటనే బర్న్‌హామ్ ఆర్థిక సుస్థిరత గురించి మాట్లాడారు. దీన్ని సాధించటానికి ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తామన్నారు. అందుకు ముందుగా అవసరమైనది రాజకీయ సుస్థిరత గనుక ఆ విషయంలో ఆయనేం చేస్తారో చూడాల్సి ఉంది. స్టార్మర్ హయాంలో రక్షణ మంత్రిగా పనిచేసి, తన శాఖకు ఆర్థిక మంత్రి తగిన కేటాయింపులు చేయలేదని అలిగిన జాన్ హేలీకి బర్న్‌హామ్ ఆర్థిక శాఖ అప్పగించారు. బస్సు చార్జీలకు పరిమితి విధించటం, అద్దెలపై మారటోరియం, ఇంధన బిల్లుల తగ్గింపు వంటివి అమలు చేస్తామంటూ ఇప్పటికే బర్న్‌హామ్ చెప్పిన నేపథ్యంలో ఆర్థిక శాఖ రాబడి మరింత పడిపోతుంది. ఈ నేపథ్యంలో రక్షణ కేటాయింపులు పెంచటం సంగతలా ఉంచి ఇతరత్రా రంగాలకు హేలీ ఎలాంటి కేటాయింపులు చేస్తారన్నది ప్రశ్నార్థకం. సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వ వ్యయాన్ని ఇంకా పెంచాలని చూస్తే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని వారంక్రితం ఐఎంఎఫ్ హెచ్చరించింది.తన విధానం ‘వ్యాపార అనుకూల సోషలిజం’ అని బర్న్‌హామ్ ప్రవచించారు గానీ... ఆచరణలో అదంత సులభం కాదు. వందరోజుల్లో ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల పెంపు, వ్యాపార వృద్ధి వంటి అంశాల్లో తగిన నిర్ణయాలు తీసుకుంటానన్న ఆయన హామీ నెరవేర్చటానికి హేలీ చాలా కష్టపడాల్సి ఉంటుంది. ప్రభుత్వ వ్యయం పెరగటం కోసం అధికాదాయం ఉన్నవారు తాము చెల్లించే పన్ను స్వల్పంగా పెంచటానికి సహకరించాలని ఇప్పటికే బర్న్‌హామ్ కోరారు. అలా పెంచితే ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్ల పెంపు, వేతన సవరణ వంటి హామీలు నెరవేర్చవచ్చని ఆయన భావన. అయితే లేబర్ పార్టీవల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదని ఈ రెండేళ్ల ఏలుబడికే సర్వత్రా అసంతృప్తి నెలకొన్న స్థితిలో పార్టీకి అనుకూలత తీసుకురావటం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. ఈ విషయంలో ఏ మేరకు బర్న్‌హామ్ విజయం సాధిస్తారో, లేబర్‌ను ఎంతవరకూ గట్టెక్కిస్తారో చూడాల్సి ఉంది. -
నిరసన స్వరాలు వింటారా?
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజైన సోమవారం ఢిల్లీ ఆకాశంలో నిరసన మబ్బులు దట్టంగా అలుముకున్నాయి. రాజవీధులన్నీ వేలాది యువగళాలతో హోరెత్తాయి. పన్నెండేళ్ల బాలిక మొదలుకొని అనేకమంది యువతీయువకులు పోలీసుల లాఠీచార్జిలో గాయపడి నెత్తురోడుతున్న, విలపిస్తూ నిలదీస్తున్న దృశ్యాలు చానెళ్లలో వీక్షించటం చాలామందికి కష్టంగా తోచింది. ఈ దశాబ్ద కాలంలో దేశ రాజధాని ఎన్నడూ చూడని దృశ్యాలివి. నీట్ ప్రశ్నపత్రాల లీక్‌పై గత నెల జూన్ 6 నుంచి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేస్తున్న ఆందోళననూ, మూడు వారాలుగా కొనసాగుతున్న నిరశనలనూ మౌనంగా వీక్షిస్తూ ఉండిపోయిన ప్రభుత్వానికి సోమవారం నాటి ‘చలో సంసద్’ కళ్లు తెరిపించి ఉండాలి. అందుకే కావొచ్చు... కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా ఉద్యమ కార్యకర్తలను చర్చలకు పిలిచారు. అక్కడేమైంది, చివరకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందన్న సంగతలా ఉంచితే ముందు వినడం పాలకులు చేయాల్సిన పని. పదిహేనేళ్ల క్రితం అన్నా హజారే నిరశన మొదలెట్టినప్పుడు ఆనాటి యూపీఏ ప్రభుత్వం మొదట్లో పట్టించుకోకున్నా, ఆ తర్వాత కేంద్ర మంత్రులతో ప్రతినిధి బృందాన్ని పంపింది. దాన్ని సంపూర్ణంగా సమర్థించి, క్రియాశీలంగా పాల్గొని దేశవ్యాప్తంగా ఆ ఉద్యమానికి ఊపూ ఉత్సాహాన్నీ తీసుకొచ్చింది బీజేపీయే. అందుమూలంగా ఇతోధికంగా లాభపడింది కూడా. కానీ అదే పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇప్పుడు నిర్లిప్తంగా ఉండి పోవటం, సమస్యను ఇంత సంక్లిష్టం చేసుకోవటం దిగ్భ్రాంతికరం. ఈ ఆందోళనలో గాయపడిన వారిలో వందమంది వరకూ రాంమనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్సకు చేరగా వారిలో తలలు పగిలినవారూ, కాళ్లూ చేతులూ విరిగినవారూ అనేకులున్నారని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అటు 118 మంది పోలీసులు గాయాలతో ఆస్పత్రుల్లో చేరారని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. పాలకులుగా ఎవరుండాలో ఎన్నికలు చెబితే... వారి పాలన ఎలావుందో నిరసనలు చెబుతాయి. అసమ్మతి అనేది దేశభక్తికి అత్యున్నత రూపం అంటాడు అమెరికా రాజనీతి శాస్త్ర ఆచార్యుడు హోవార్డ్ జిన్. ప్రజాస్వామ్యంలో విభేదించేందుకూ, అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకూ చోటివ్వడం ప్రభుత్వాల బాధ్యత. ఆ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటం విపక్షాల బాధ్యత కూడా. కానీ విషాదమేమంటే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఈ కర్తవ్య నిర్వహణలో విఫలమైంది. జూన్ 17న రాజస్థాన్‌లోని కోటలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒకరోజు ధర్నా చేయటం మినహా చేసిందేమీ లేదు. అన్నా హజారే ఉద్యమ సమయంలో జరిగిందేమిటో గుర్తున్నా తాను చేయాల్సిందేమిటో ఆ పార్టీకి తెలిసేది. ఆ సంగతి ఆలస్యంగా గ్రహించి మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ నివాసం సమీపంలో రాహుల్, ప్రియాంక, ఇతర కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేశారు. ఈ ఉద్యమానికి చెప్పుకోదగ్గ నాయకులంటూ ఎవరూ లేకపోవడం గమనించదగ్గది. నిరశనలో ఉన్న సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు అరెస్టుచేసి ఆస్పత్రిలో చేర్చారు. సీజేపీ నాయకుడు అభిజీత్ దీప్కేను ప్రదర్శన ప్రారంభంలోనే పోలీసులు అరెస్టు చేశారని వార్తలొచ్చాయి. కానీ దాదాపు 50,000 మంది వరకూ ఉన్న ఆందోళనకారులు గుంపులుగా విడిపోయి పార్లమెంటువైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయటం, చాలావరకూ సఫలీకృతం కావటం చిన్న విషయం కాదు. పటేల్ చౌక్, జన్‌పథ్ గేటు మెట్రో స్టేషన్ల వద్ద, అశోకా రోడ్, కన్నాట్‌ప్లేస్ సర్కిల్ వద్ద బైఠాయింపులు, మరో అయిదుచోట్ల వారిపై బాష్ప వాయు గోళాలు ప్రయోగించటం సమస్య తీవ్రతను వెల్లడిస్తుంది. హింసకూ, దౌర్జన్యానికీ దిగినవారిని నియంత్రించటాన్ని ఎవరూ ప్రశ్నించరు. కానీ ఒక్కరిని చేసి ఏడెనమండుగురు పోలీసులు లాఠీలతో మోదటం, ఆడపిల్లలని కూడా చూడకుండా హింసించటం సబబేనా? ‘మీ ఇంట్లో పిల్లలు లేరా? ఇంత దారుణంగా కొడతారా?’ అని ఒక బాలిక ప్రశ్నించటం, తన దుస్తులు చించారని మరొకామె ఆరో పించటం ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచదు. పరీక్షపత్రాలు లీకవటం, కష్టపడి చదివేవారు దగాపడటం తొలిసారి కాదు. ఏళ్లతరబడి ఇలా జరగటంవల్లే పరిస్థితి ఇంతవరకూ వచ్చింది. ఇకనైనా విద్యార్థుల అభీష్టాన్ని వినటం, సానుకూలంగా స్పందించటం ప్రభుత్వ బాధ్యత. లేకుంటే సమస్య మరింత జటిలమవుతుంది. -
స్పానియార్డ్స్ జయకేతనం
ఆటపై అంకితభావం... అవతలి జట్టుపై గెలవటానికి పక్కా వ్యూహం... తిరుగులేని క్రమశిక్షణ... అన్నిటికీ మించి జట్టు మొత్తం ఒక వ్యవస్థగా పనిచేయటం సోమవారం వేకువజామున న్యూజెర్సీ వేదికగా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. సాకర్ ప్రపంచ కప్ సంరంభంలో మొదట్లో ఎవరికీ పెద్దగా అంచనాలు లేని స్పెయిన్ జట్టు అందరినీ అధిగమించి విశ్వవిజేతగా నిలిచింది. క్రీడాభిమానుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఇలాంటి ఘట్టాలు సాకర్ చరిత్రలో బహుశా అరుదుగా నమోదైవుంటాయి. అలాగని స్పెయిన్ తక్కువేం కాదు. అది తొలిసారిగా 2010లో దక్షిణాఫ్రికాలో ప్రపంచకప్ సాధించింది. అంతక్రితం సాకర్ యూరో కప్‌ను మూడుసార్లు – 1964, 2008, 2012లలో గెలుచుకుంది. ఒకరకంగా 2008 నుంచి 2012 వరకూ అది ప్రపంచ ఫుట్‌బాల్‌ను శాసించిందని చెప్పాలి. కానీ అనంతరకాలంలో దాదాపు కనుమరుగయ్యే స్థితికి చేరింది. మొదట్లో స్పెయిన్‌కు విజయపరంపర అందించిన ‘టికి–టాకా’ వ్యూహం (ఆటగాళ్లు బంతిని పాస్‌లు ఇచ్చుకుంటూ తమమధ్యే ఉంచుకోవటం), గోల్ పోస్ట్ వైపు వెళ్లే చొరవ తగ్గటానికి దారితీసింది. ప్రత్యర్థులు సులభంగా అంచనావేసే స్థితి ఏర్పడింది. దిగ్గజా లనదగ్గ జావి, ఇనియెస్టా, కార్లెస్, సెర్గియో రామోస్ వంటి ఆటగాళ్లు వరసగా నిష్క్రమించినప్పుడు ఆ ఖాళీలను భర్తీ చేయటంలో బోర్డు విఫలమైంది. కొత్తగా వచ్చినవారికి అంతర్జాతీయ టోర్నీల ఒత్తిడిని తట్టుకునే అనుభవం లేకపోయింది. అయితే కాలం మారింది. లామిన్ యామాల్ వంటి యువ సంచలనం, ఫెర్రాన్ టోరెస్ వంటి సమర్థుడు చరిత్ర తిరగరాశారు. అటు అర్జెంటీనా అసామాన్యమైనది. నిన్న మొన్నటివరకూ దానివైపు తలెత్తి చూడటానికి కూడా ప్రత్యర్థులు సాహసించనంతటి అరివీరభయంకర జట్టు. మారడోనా, మెస్సీ వంటి సార్వకాలిక మహా దిగ్గజాలను ప్రపంచానికందించిన ఆ దేశం ఎప్పుడూ ఫుట్‌బాల్‌లో తిరుగులేని శక్తిగానే ఉంది. 1978, 1986, 2022లలో అర్జెంటీనా ఆటగాళ్లు మహాద్భుతాలను ప్రదర్శించి దేశాన్ని విశ్వవిజేతగా నిలిపారు. దక్షిణమెరికా ఖండంలో అత్యున్నత టోర్నమెంటు అయిన ‘కోపా అమెరికా’లో ఏకంగా 16 సార్లు ఆ టైటిల్‌ను గెలిచిన చరిత్ర అర్జెంటీనా ఆటగాళ్లది. మెస్సీది అద్భుతమైన నైపుణ్యం. చెప్పాలంటే అతనిది భావోద్వేగంతో ముడిపడివుండే మాయాజాలం. అది ఇన్నాళ్లూ రాణించింది. ప్రత్యర్థులు దరిదాపుల్లోకి రావటం కూడా అసాధ్యమనిపించే రీతిలో పనిచేసింది. కానీ భారమంతా మెస్సీపైనే పడటం ఆ జట్టుకు పెద్ద మైనస్ అయికూర్చుంది. అవతల స్పెయిన్ ఆటగాళ్లు ఉక్కు క్రమశిక్షణతో, అంకితభావంతో ఆడి మ్యాచ్‌పై పూర్తి నియంత్రణ సాధించిన తీరు అర్జెంటీనాను కోలుకోలేని దెబ్బతీసింది. ఒలింపిక్స్ అయినా, సాకర్ వంటివైనా ప్రపంచ దేశాలమధ్య సద్భావనను పెంపొందించే సందర్భాలు. నిన్న మొన్నటివరకూ కలహాలతో చెలరేగిపోయిన దేశాల ఆటగాళ్లు ఆ యుద్ధంరేపిన గాయాలు మరిచి పరస్పరం చేతులు కలపడం గుర్తుంచుకోదగిన క్షణాలవుతాయి. ఈసారి ఆతిథ్య దేశాల్లో ఒకటైన అమెరికా ప్రపంచ దేశాలను అష్ట కష్టాలు పెడుతూ పగబట్టినట్టు ప్రవర్తిస్తూ వచ్చింది. ఆఖరికి సాకర్ సాగుతున్న దశలో కూడా అది ఇరాన్‌పై క్షిపణిదాడులతో చెలరేగిపోయింది. ఆ చీడను ఇరాన్ ఆటగాళ్లకూ పులిమింది. ప్రాక్టీసింగ్ మ్యాచ్‌లు ఇక్కడ కుదరదంటూ విమానాశ్రయంనుంచే వెనక్కి పంపింది. చివరకు వారు మెక్సికోలో బసచేసి, అక్కడే ప్రాక్టీస్ చేసుకోవాల్సి వచ్చింది. ఆట ముగిసీ ముగియగానే మెక్సికో వెళ్లటానికి విమానాశ్రయానికి తరలించేది. అన్ని అవమానాలనూ దిగమింగుకుంటూనే అమెరికా క్రీడాభిమానులుసహా ప్రపంచమంత టినీ ఇరాన్ జట్టు అలరించింది. మొత్తానికి అమెరికా అగ్రరాజ్య దురహంకారానికి కొత్తగా వచ్చిచేరిన జాత్యహంకారం ఈ సాకర్‌లో కొన్ని చేదు అనుభవాలు మిగిల్చింది. పట్టనట్టున్న ఫిఫా దానికి లొంగి స్వీయ ప్రతిష్ఠను కోల్పోయింది. మైదానంలో రిఫరీదే తుది నిర్ణయంకాగా, ట్రంప్ జోక్యంతో దాన్ని మార్చటం ఫిఫా బలహీనతకు చిహ్నం. మొత్తానికి ఫుట్‌బాల్ అందం దాని దిగ్గజాలు ప్రదర్శించే క్రీడా నైపుణ్యంలో ఉంటుంది. భిన్నమైన ఆట శైలులుగల మెస్సీ, రొనాల్డో, ఎర్లింగ్ హాలండ్ వంటివారు అభిమానులకు శాశ్వతంగా మిగిలే ఆనందకర క్షణాలను అందించారు. -
యవ్వన వ్యామోహం
‘పాడు జీవితము యవ్వనం మూడునాళ్ల ముచ్చటలోయి/ అయ్యయ్యో నీదు పరుగు లెచ్చటకోయి’ – ఆరుద్ర ఏనాడో ఒక డబ్బింగ్ సినిమా కోసం రాసిన పాట ఇది. జీవితం, యవ్వనం మూడునాళ్ల ముచ్చటనే మాట చెప్పినది ఆరుద్ర మాత్రమే కాదు, ఆయన కంటే ముందు ఆదిశంకరుడు మొదలుకొని ఎందరెందరో ఆధ్యాత్మికవేత్తలు దాదాపు ఇదే సంగతిని పదే పదే చెప్పారు. జీవితమే క్షణభంగురం అనుకుంటే, అందులో యవ్వనం ఉండేది ఎన్నాళ్లని! క్షణభంగుర సిద్ధాంతాన్ని ఎవరు ఎన్నివిధాలుగా చెప్పినా మనిషికి యవ్వన వ్యామోహం, చిరకాల జీవనేచ్ఛ తీరేవి కావు.‘భోగా న భుక్తా వయమేవ భుక్తాః/ తపోన తప్తం వయమేవ తప్తః/ ‘కాలో న యాతో వయమేవ యాతాః/ తృష్ణా న జీర్ణా వయమేవ జీర్ణాః’ అన్నాడు భర్తృహరి. ఈ శ్లోకానికి అర్థమేమిటంటే, భోగాలను మనం అనుభవించలేదు, భోగాలే మనల్ని అనుభ వించాయి. మనం తపస్సు చేయలేదు, తాపత్రయాలతో మనమే తపించిపోయాం. కాలం గడిచిపోలేదు, మనమే గడిచిపోయాం. కోరికలు నశించలేదు, మనమే నశించిపోయాం. శాస్త్ర పురాణేతిహాసాలు ఎన్ని చెప్పినా, మనిషి స్వభావం మారదు. జరామరణాలు ప్రకృతి సహజాలు అని తెలిసినా, దీర్ఘ యవ్వనాన్ని, చిరంజీవిత్వాన్ని కోరుకోవడం మానవ సహజం. అత్యధికులు జీవించి ఉన్నంత కాలం యవ్వనాన్ని పొడిగించుకోవడా నికి పడరాని పాట్లు పడుతూనే ఉంటారు. చివరకు ఏమీ చేయలేక ప్రకృతిధర్మానికి తల ఒగ్గి కాలధర్మం చెందుతుంటారు. అరుదుగా కొందరు మాత్రం ప్రకృతికి ఎదురెళ్లి మరీ జరామరణాలను జయించడానికి ప్రయత్నిస్తారు.మానవుల్లో తరగని యవ్వన వ్యామోహానికి పురాణాల్లోని యయాతి ఉదంతం ఒక ఉదాహరణ. యయాతి అసురగురుడైన శుక్రాచార్యుడి కుమార్తె దేవయానిని పెళ్లాడాడు. తర్వాత రాక్షసరాజు వృషపర్వుడి కుమార్తె శర్మిష్టను గాంధర్వ వివాహం చేసుకున్నాడు. తన కూతురికి అన్యాయం తలపెట్టాడని కోపించిన శుక్రుడు– యయాతిని శపించాడు. శుక్రాచార్యుడి శాపఫలితంగా యయాతికి అకాల వార్ధక్యం కలిగింది. అప్పటికి యవ్వన భోగాలపై కాంక్ష నశించని యయాతి తన వార్ధక్యాన్ని తీసుకుని, తమ యవ్వనాన్ని తనకు ఇవ్వమని కొడుకులను కోరాడు. దేవయాని కొడుకులిద్దరూ అందుకు నిరాకరించారు. శర్మిష్ఠ ముగ్గురు కొడుకుల్లో ఒకడైన పూరుడు మాత్రమే తండ్రి కోరిక మేరకు అతడికి తన యవ్వనాన్ని ఇచ్చి, అతడి వార్ధక్యాన్ని తాను స్వీకరించాడు. కొడుకు ద్వారా యవ్వనాన్ని పొందిన యయాతి వెయ్యేళ్లు రాజ్యపాలన చేశాడు. పురాణాల్లో పునర్యవ్వన గాథలు మరికొన్ని కూడా ఉన్నాయి. పురాణాల్లో సప్త చిరంజీవులు కూడా ఉన్నారు. వాస్తవ ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ చిరంజీవులు కాలేదు. అంతేకాదు, నిత్యయవ్వనులు కూడా ఎక్కడా కనిపించరు. ఆకాశంలో ఎగరగలిగే విమానాల వంటి పురాణ కల్పనలు అధునాతన కాలంలో వాస్తవరూపం దాల్చడాన్ని మనం ఇప్పటికే చూశాం. వార్ధక్యాన్ని ఇంతవరకు ప్రకృతి సహజ పరిణామంగానే భావిస్తూ వస్తున్నాం. కాని, కొందరు వైద్య పరిశోధకులు వార్ధక్యాన్ని వ్యాధిగా గుర్తిస్తున్నారు. వ్యాధిని గుర్తించాక, దాన్ని నయం చేసే మార్గాన్ని కూడా శాస్త్రవేత్తలు ఏదో రీతిలో ఎప్పుడో ఒకప్పుడు కనుగొంటారు కదా! అందుకే, ఆ దిశగా ప్రయోగాలు సాగిస్తున్నారు.ఈ పరిస్థితుల్లోనే అమెరికన్ సంపన్నుడు బ్రయాన్ జాన్సన్ కొన్నేళ్లుగా జరామరణాలపై యుద్ధం సాగిస్తూ వార్తలకెక్కాడు. ఇతగాడిని కలియుగ యయాతిగా చెప్పుకోవచ్చు. నిత్య యవ్వన ప్రయోగాల్లో భాగంగా పద్దెనిమిదేళ్ల యువకుడైన తన కొడుకు రక్తాన్ని తన శరీరంలోకి ఎక్కించుకోవడం సహా బ్రయాన్ చేయని ప్రయోగాలు లేవు. ప్రయోగాలన్నాక ఒక్కోసారి వికటించడం సహజం. బ్రయాన్ ప్రయోగాలు కూడా వికటించాయి. ఇప్పుడతడు ‘ఆటో ఇమ్యూన్ అట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్’ అనే నయం చేయలేని వ్యాధి బారినపడ్డాడు. వైద్యులు అతడి వ్యాధిని గుర్తించిన వెంటనే, ‘నా కడుపు నన్నే తినేస్తోంది’ అని బ్రయాన్ ప్రకటించాడు. అయినా సరే, తాను దీనిని ఎలాగైనా ఎదుర్కొని జయిస్తానని కూడా ప్రకటించాడు. ఈ కలియుగ యయాతి కథ ఏమవుతుందో చూడాలి! -
ఓవర్ టు ఢిల్లీ!
భారతదేశ చరిత్ర ఇప్పుడొక ప్రమాదకరమైన మలుపును తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నదనే హెచ్చరికలు వినబడు తున్నాయి. ఆ మలుపు తీసుకుంటే ప్రజాస్వామిక అధ్యాయానికి ముగింపు పలికినట్టేనని, రాజ్యాంగబద్ధ పాలనకు తిలోదకాలు వదిలినట్టేనని కొందరు మేధావులు గళం విప్పుతున్నారు.వందలాది సంవత్సరాల భారతీయ వైవిధ్య సహజీవనం ధ్వంస మౌతుందనీ, బహుళత్వ సౌందర్యం భగ్నమవుతుందనీ, భిన్న త్వంలో ఏకత్వ సందర్శనకు బదులు బలవంతపు ఏకీకరణ ప్రత్యక్షమవుతుందనీ కొన్ని వైతాళిక స్వరాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ గొంతుకలకు సంప్రదాయ మీడియా మైకులు పెద్దగా సమకూరడం లేదు. ఫలితంగా ‘ఆవాజ్’ దద్దరిల్లడం లేదు. కానీ, మూగబోవడం కూడా లేదు. అటువంటి వేనవేల స్వరాల్లోని ఒక భా‘స్వరం’ పేరు సోనమ్ వాంగ్‌చుక్.లదాఖ్ పర్వత ప్రాంతీయుడైన సోనమ్ ఒక ఇంజినీర్. స్వయంగా పాఠశాలలు స్థాపించి, విద్యారంగ సంస్కరణలకు నడుం కట్టినవాడు. సమాజానికి ఉపయుక్తమయ్యే వైజ్ఞానిక ఆవిష్కరణలు చేసినవాడు. తన ఆవిష్కరణలకు పేటెంట్ కోర కుండా సమాజానికి అంకితం చేసి ప్రజాస్వామిక ప్రియత్వాన్ని చాటుకున్నవాడు. లదాఖ్ ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు పోరాట రూపమైనవాడు. ఈ నేపథ్యాన్ని గమనించినప్పుడు సోనమ్ వాంగ్‌చుక్ తాజా నిరాహారదీక్ష వెనుక వేరే రాజకీయ ప్రయోజ నాలున్నాయని కొందరు చేస్తున్న ఆరోపణలు ఎంత అసంగతమైనవో అర్థమవుతుంది. భారతదేశంలో విద్యారంగం నానా టికీ సంక్షోభంలో కూరుకుపోతున్నదనే అభిప్రాయం రాజకీయ పరమైనది కాదు. విజ్ఞులైన దేశ ప్రజలందరూ ఆందోళన చెందు తున్న ఒక చేదు నిజం. పోటీ పరీక్షల వ్యవస్థ స్కామ్‌ల పుట్టగా మారిందన్నది కూడా అంతే నిజం.ఒకటా, రెండా? ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ పన్నెండేళ్లలో పోటీ పరీక్షల అవకతవకలకు సంబంధించి 158 ఉదంతాలు రికార్డయ్యాయి. అంతకు ముందు యూపీఏ హయాంలోనూ ఈ దరిద్రం లేకపోలేదు. 2005 నుంచి 2014 వరకు అరవైకి పైగా అవకతవకల కేసులు నమోద య్యాయి. కోట్లాదిమంది యువతీ యువకుల భవిష్యత్తుతో ఆడుకున్న దురంతాలివి. టీచర్ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న లక్షలాదిమంది యువతీయువకుల కలలను ఏపీ సర్కార్ నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఎలా భగ్నం చేసిందో ఇటీవల బైటపడింది. ఈ ఏడాది నిర్వహించిన నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రాల లీకేజీ బయటపడటం వల్ల దాదాపు ఇరవైమంది తెలివైన విద్యార్థులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై ఏర్పడిన కాక్రోచ్ జనతా పార్టీ ఈ అంశంపై ఢిల్లీలో ఆందోళనకు పిలుపునిచ్చింది.విద్యారంగ సంస్కరణలపై ఎలుగెత్తుతున్న సోనమ్ వాంగ్ చుక్ సహజంగానే ఈ ఆందోళనలో భాగం పంచుకోవాలని నిర్ణయించుకొని ఉంటారు. జంతర్‌మంతర్‌లో ఆయన నిరాహార దీక్షకు కూర్చొని మూడు వారాలు గడిచినా కేంద్రం నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. నీట్ పరీక్షల వైఫల్యంతో పాటు సీబీఎస్ఈ పరీక్షల అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది ఆందో ళనకారుల ప్రధాన డిమాండ్. ధర్మేంద్ర ప్రధాన్‌తో సోనమ్‌కు గానీ, ఆందోళనకారులకు గానీ వ్యక్తిగత వైరమేమీలేదు. కానీ లక్షలాదిమంది విద్యార్థుల జీవితాలను సంక్షోభంలోకి నెట్టిన ఘటనపై జవాబుదారీతనాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు. నిజమే కదా, ప్రజాసమస్యలకు బాధ్యత వహించకుండా, జవాబుదారీతనం లేకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తే అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? పరీక్షల వ్యవహారంపై జవాబుదారీతనానికీ, బాధ్యత వహించడానికీ కేంద్ర సర్కార్ మొండిగా నిరాకరించింది. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష ఇరవై ఒకటో రోజున హైకోర్టు ఆదేశాలు పాటిస్తున్నామంటూ పోలీసులు బల వంతంగా ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. కేంద్రంతో పాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాల్లో జవాబుదారీ తనం ఇప్పుడు కనిపించడం లేదు. ప్రజాస్వామికవాతావరణం కూడా క్రమంగా కనుమరుగవుతున్నది. పౌరహక్కులకు న్యాయ స్థానాల నుంచి కూడా పూర్తి రక్షణ లభించడం లేదు. లాఠీ రాజ్యం అమల్లోకి వచ్చింది. ఆధిపత్య భావజాలం అన్నిరంగాలను, అన్ని వ్యవస్థలను పట్టి కుదిపేస్తున్నది. భిన్నాభి ప్రాయాలు, ఆలోచనలపై బుల్డోజర్లు నడుస్తున్నాయి. ఆధిపత్య భావజాలాన్ని ఆధారసహితంగా హేతుబద్ధంగా ఎదుర్కొనేగొంతుకలపైకి బండబూతులతో వందమంది దండెత్తుతున్నారు. సోషల్ మీడియాలోకి ఫాసిజం చొరబడింది. ప్రధాన స్రవంతి మీడియా సర్కార్ల పెంపుడు మీడియాగా మారిపోయింది. వాంగ్‌చుక్ దీక్ష సందర్భంలో మన జాతీయ మీడియా ప్రభుభక్తినే చాటుకున్నది. పదిహేనేళ్ల కిందట జంతర్‌మంతర్‌లో జరిగిన అన్నా హజారే దీక్షను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాము. జాతీయ దినపత్రికలన్నీ రోజుల తరబడి జంతర్‌మంతర్‌ను పతాక శీర్షికల్లో నిలబెట్టాయి. టీవీ ఛానెళ్లు రాత్రింబవళ్లూ కెమెరా లను అక్కడే పాతేసి కార్యక్రమాలు నడిపాయి. ఇప్పుడువాంగ్చుక్ దీక్షకు మాత్రం మొహం చాటేశాయి. ఆనాటి కవ రేజీలో పదోవంతు కూడా దక్కలేదు. ‘త్రీ ఇడియట్స్’ అనే సూపర్ హిట్ సినిమాకు వాంగ్‌చుక్ జీవితమే ఆదర్శమని ప్రచారం జరగడంతో ఆయన ఇమేజ్ పెరుగుతుందని గ్రహించి డ్యామేజీ కంట్రోల్‌కు జాతీయ చానెళ్లు ప్రయత్నించాయి. అమీర్ ఖాన్‌ను రంగంలోకి దించి సినిమాకు ముందు వాంగ్‌చుక్ ఎవరో తమకు తెలియదని చెప్పించారు. అమీర్ ఖాన్ చెప్పింది పచ్చి అబద్ధమని రుజువు కావడానికి కొన్ని గంటలు కూడా పట్టలేదు. ఈ ఎపిసోడ్‌తో మరోసారి రుజువైన అంశం మన దేశంలో మీడియాకు స్వేచ్ఛ లేదని, అది సర్కారీ పెద్దలకు పెంపుడు జీవిగా మారిపోయిందని! దేశ రాజకీయ చరిత్రలో అయోధ్య రామమందిరానికున్న ప్రాధాన్యత ఏమిటో తెలిసిందే కదా? భారతీయ జనతా పార్టీని అధికార పీఠానికి చేరువ చేసిన ఆలయమిది. అటువంటి ఆల యానికి ఇంటిదొంగలే కన్నం వేస్తే మీడియాలో ఎంత రచ్చ జరిగి ఉండాలి! కానీ, అదో చిన్న వార్తే అయిపోయింది. ఆంధ్రాలో అధికార పార్టీ నాయకుడు ఒక మహిళను నడివీధిలో చితకబాదితే పెంపుడు మీడియాలో ఆ వార్తకు చోటు దక్కలేదు. పోలీస్ లాకప్ చిత్రహింసలకు వరసగా ప్రాణాలు పోతున్న ఘటనలు ఏపీ వ్యాప్తంగా జరుగుతున్నాయి. కేరళలో పోలీసు కస్టడీలో ఉన్న రాజన్ మరణిస్తే యావత్ భారతదేశం అట్టుడికి పోయిన రోజులు గుర్తుకొస్తున్నాయి. ముఖ్యమంత్రి కరుణాకరన్ తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. మణిపూర్ అనే రాష్ట్రం ఈ దేశంలోనే ఉన్నదనే సంగతిని కూడా నేటి జాతీయ మీడియా మరిచిపోయినట్టుంది. ఒక మతాన్ని టార్గెట్ చేసి 250కి పైగా ప్రార్థనాలయాలను నేలమట్టం చేస్తే, మనుషుల్ని సజీవ దహనం చేస్తే, ఊచకోత కోస్తే రెండు వర్గాల ఘర్షణలు గానే అప్రధానంగా రిపోర్టయ్యాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వ విధానాలను విమర్శించే వాళ్లపై ఆంధ్ర సర్కార్ దమన నీతిని ప్రదర్శిస్తున్నది. విచ్చలవిడిగా అక్రమ అరెస్టులు చేస్తు న్నారు. లాకప్‌లలో చిత్రహింసలు పెడుతున్నారు. పౌర హక్కు లకు సంబంధించిన ఇటువంటి వార్తలకు మీడియాలో చోటు దొరకడం లేదు. బెంగాల్, బిహార్లలో కూడా ఇటువంటి ఘటనలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. దేశ చరిత్ర ఒక ప్రమాదకరమైన మలుపులో ఉన్నదని కొందరు మేధావులు ఆందోళన చెందడం, జంతర్‌మంతర్‌లో వాంగ్‌చుక్ ఆందోళన, ప్రభుత్వాలు స్వయంగా పౌరహక్కుల హననానికి పూనుకోవడం, ఫోర్త్ ఎస్టేట్ పెంపుడు మీడియాగా మారిపోవడం – వేర్వేరు విషయాలు కాదు. దేశ రాజకీయ వ్యవస్థ గమనానికి సంబంధించిన సూచికలు. ప్రభుత్వాల అప్రజాస్వామిక ధోరణి, మీడియా నిష్క్రియాపరత్వం ఈ గమనాన్ని సుగమం చేసే బాటలు. అధికార పీఠంపై ఉన్న బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్ ఎజెండా ఈ గమనానికి చోదకశక్తిగా దేశంలోని కొన్ని వర్గాలు అనుమానిస్తున్నాయి. దేశంలోని ప్రధాన ప్రతిపక్షం ఎంతటి అసమర్థ స్థితిలో ఉన్నప్పటికీ అధికార రథం ఎంచుకొన్న గమనం నిరాటంకం మాత్రం కాదని జంతర్‌మంతర్ చెబుతున్నది. బలంగానో, బలహీనంగానో ప్రతిఘటన ఉండి తీరుతుందని చెబుతున్నది.భారత రాజ్యాంగం పుట్టినప్పుడే వ్యతిరేకించిన ఆరెస్సెస్‌కు ఇప్పుడు అవకాశం దొరికింది కనుక దాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని ఆ సంస్థ వ్యతిరేకులు శంకి స్తున్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమా వేశాల్లో ఆ దిశగా కొన్ని అడుగులు పడే అవకాశమున్నదని వారు భావిస్తున్నారు. ప్రధానమైన ముందడుగు ఇప్పటికే ‘సర్’ కార్య క్రమంతో మొదలైంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం కాస్త సమగ్ర తొలగింపు కార్యక్రమంగా మారిందనే విమర్శలు కొత్తవి కావు. ఈ విమర్శలకు ఆధారాలు కూడా ఉన్నాయి. పది రాష్ట్రాల్లో పూర్తయిన ‘సర్’లో ఐదున్నర కోట్ల ఓట్లను తొలగించారు. ఇందులో సింహభాగం ఒక వర్గం వారేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని ఆధారాలు సమర్పించి అప్పీల్ చేసుకుంటే ఓటుహక్కును పునరుద్ధరిస్తా మని హామీ ఇచ్చారు. బెంగాల్లో 27 లక్షల మంది తాము స్థానిక పౌరులమనే ఆధారాలు సమర్పిస్తే వారిలో కొన్ని వందల కేసులనే ఇప్పటిదాకా పరిష్కరించారట. ఈ లెక్కన మిగిలిన వారికి ఎన్ని దశాబ్దాల తర్వాత మోక్షం కలగాలి?బిహార్‌లో తొలగించిన 60 లక్షల ఓట్లలో ఐదువందలమందిని ‘విదేశీయులు’గా తేల్చారట. అందులో 350 మంది బిహారీలను పెళ్లి చేసుకున్న నేపాలీ అమ్మాయిలు. నేపాల్‌లో ఉండే మధేశీ తెగ ప్రజలు బిహార్‌లో సరిహద్దు ప్రాంతంలో కూడా ఉంటారు. ఈ మధేశీ ప్రజల పెళ్లి సంబంధాలు కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఇన్ని వందల ఏళ్ల చరిత్రను ఎప్పటికి తవ్వితీస్తారో చూడాలి! ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో ‘సర్’ కార్యక్రమం నడుస్తున్నది.హైదరాబాద్‌లో 30 శాతం ఓటర్లు ఇప్పటికీ మ్యాపింగ్ కాలేదట. అయ్యే అవకాశం కూడా లేదు. నిరక్షరాస్యులు, బతుకుదెరువు కోసం వలసపోయే పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, మైనారిటీలు ఎక్కువసంఖ్యలో ఈ కార్యక్రమం వల్ల ఓట్లు కోల్పోయే పరిస్థితి కనిపిస్తు న్నది. ఈ వర్గాల ఓట్లు తగ్గితే నష్టమెవరికో, లాభమెవరికో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.‘టార్గెటెడ్’ ఓటర్ల తొలగింపునకు అవసరమయ్యే సాకులు కూడా ఈ కార్యక్రమంలో దండిగానే ఉన్నాయి. 2002 జాబి తాతో సరిపోలకపోయినా, అందులో అచ్చుతప్పులు గమనించినా ఓటు హక్కును తృణీకరించవచ్చు. అప్పీల్ చేసుకుంటే ఎప్పటికి న్యాయం జరుగుతుందో చెప్పలేము. ‘సర్’ ద్వారా ఓటు హక్కును కోల్పోయిన వారికి బెంగాల్, బిహార్లలోసంక్షేమ పథకాల వర్తింపును కూడా నిలిపేశారనీ వార్తలు వస్తు న్నాయి. ఇప్పటికే ఆధార్, పాస్‌పోర్ట్‌తో సహా ఏ కార్డూ పౌర సత్వానికి సూచిక కాదని అధికారులు చెబుతున్నారు. సరికొత్త ఓటర్ ఐడీ మాత్రమే పౌరసత్వానికి రుజువని చెబితే పరిస్థితి ఏమిటి? అలా జరగదని సుప్రీంకోర్టు చెబుతున్నది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఏ ఆదేశాన్ని ఎన్నికల సంఘం గానీ, ప్రభుత్వం గానీ పాటించింది? పౌరసత్వం ఉన్నవారికి మాత్రమే రాజ్యాంగంలో ఆర్టికల్ 19 కింద ఉన్న భావప్రకటనా హక్కు, సమావేశ స్వేచ్ఛ... వంటి ఆరు హక్కులు వర్తిస్తాయి. ఈ పౌర హక్కులు న్నప్పుడే అక్రమ నిర్భాంధాలకు గురి చేస్తున్న రాజ్యంలో అవి లేనివారి పరిస్థితి ఏమిటి?రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో కొన్ని రాజకీయ బిల్లులు కూడా ఉండొచ్చని తెలుస్తున్నది. వాటిలో రెండు ప్రమాదకరమైన బిల్లులు కూడా కనిపిస్తున్నాయి. అందులో ఒకటి అధికార పదవుల్లో ఉన్నవారు 30 రోజులపాటు జైలుకెళ్లి వస్తే పదవిని కోల్పోతారనే 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఇందులో న్యాయమూ లేదు, నైతికతా లేదు, రాజ్యాంగ బద్ధతా లేదు. కేవలం ప్రత్యర్థి రాజకీయ పార్టీ నేతలను వేధించి చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ఉద్దేశించింది మాత్రమే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. బిల్లులో ప్రధానిని కూడా చేర్చిన ప్పటికీ, ఏ దర్యాప్తు సంస్థ ప్రధానమంత్రిని అరెస్టు చేస్తుంది? కేవలం ముఖ్యమంత్రులపైకే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పే అవకాశం ఉంటుంది? దర్యాప్తు సంస్థలు అరెస్టు చేసినంత మాత్రాన, అభియోగాన్ని న్యాయస్థానంలో రుజువు కాకుండా పదవి కోల్పోవడమేమిటి? ఇది ప్రతిపక్షాల మీద చట్టబద్ధమైన దాడి. అలాగే ‘ఒక దేశం ఒక ఎన్నిక’ కూడా రాజ్యాంగ ఫెడరల్ స్వభావం మీద ప్రత్యక్ష దాడిగానే న్యాయ నిపుణులు భావి స్తున్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే సవరణ చట్టాలు చెల్లుబాటు కావని గతంలో సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పింది. ఈ రెండు బిల్లులూ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసేవే. అయినా ఇవి చట్టరూపం దాలిస్తే... వీటికి తోడుగా ‘సర్’ కోటాలో కొన్ని కోట్లమంది ఓటు హక్కు కోల్పోతే... సమానత్వం, లౌకికత్వం, స్వాతంత్య్రం పునాదుల మీద నిర్మితమైన రాజ్యాంగబద్ధ పాలనకు ప్రమాదం దాపురించినట్టే. పారాహుషార్!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ట్రంప్ దూసిన వీసా కత్తి!
మితవాద రాజకీయం ఊరకే ఉండదు. నిరంతరం కొత్త శత్రువుల్ని వెదుక్కుంటుంది. తన చర్యల పర్యవసానంగా పుట్టుకొచ్చే సంక్షోభాలనుంచి జనం దృష్టి మరల్చడానికి నానా తంటాలూ పడుతుంది. ఆ రాజకీయంలోనే పుట్టి, దాన్ని మరింత దిగజార్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండో దఫా వచ్చాక వలసలపై కత్తిగట్టారు. అమెరికాలో చదువుకోవటానికొచ్చినవారు గరిష్ఠంగా నాలుగేళ్లకు మించి ఉండటానికి వీల్లేదంటూ తాజాగా తీసుకురావాలనుకుంటున్న నిబంధన ఆ పరంపరలో భాగమే. ఇతరేతర వీసాల సంగతి సరేసరి. ప్రపంచ దేశాల్లోని వారందరికీ ఉన్నత చదువుల గమ్యస్థానం అమెరికాయే. అక్కడ చదువుకుంటే సాఫ్ట్వేర్, ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ) రంగాల్లో మెరుగైన జీతాలతో కొలువులొస్తాయన్న నమ్మకమే అందుకు కారణం. అయితే ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయంవల్ల విద్యార్థులకు మాత్రమే కాదు... అక్కడి విద్యాలయాలు, టెక్ రంగ సంస్థలకు కూడా సమస్యలొస్తాయి. విద్యాలయాల వేల కోట్ల ఆదాయం పడిపోతే, టెక్రంగ సంస్థలకు నిపుణుల కొరత ఏర్పడుతుంది. ఎందుకంటే స్థానికులతో పోలిస్తే విదేశాలనుంచి వచ్చే విద్యార్థులు చదువుల్లో, తెలివితేటల్లో చాలా ముందంజలో ఉంటారు. డిగ్రీ చదువులకొచ్చేవరకూ స్వదేశీయులకు అంతా ఉచితమే అయినా, అటుపై తడిసిమోపెడవుతుంది. వారితో పోలిస్తే నిజానికి విదేశీ విద్యార్థులు రెండు మూడు రెట్లు అధికంగా చెల్లించాలి. ఆ మొత్తంతోనే స్థానికులకు స్కాలర్‌షిప్‌లిస్తారు. వారినుంచి తక్కువ ఫీజు వసూలు చేస్తారు. స్థానికులు హ్యూమనిటీస్, ఆర్ట్స్, బిజినెస్ మేనేజ్మెంట్, లా తదితర కోర్సుల్లో ఆసక్తి కనబరుస్తారు. సాంకేతిక రంగంలో దూసుకెళ్లే అమెరికాకు ‘స్టెమ్’(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) విభాగంలో నిపుణులు అవసరం. విదేశీయులు కఠినమైన వడపోత తర్వాత ఆ కోర్సులు చదవడానికి వెళ్లినవారు గనుక ఆ కోర్సులను సులభంగా ఆకళింపు చేసుకుంటారు. స్టెమ్ కోర్సుల్లో మాస్టర్స్, పీహెచ్డీ స్థాయిలో 70 శాతం సీట్లు విదేశీయులకే లభించటం ఇందుకే. స్థానికుల్ని వారితో పోటీపడేలా తీర్చిదిద్దటానికి తాము చేయాల్సిందేమిటన్న దృష్టి ట్రంప్‌కుగానీ, ఆయన ముందున్న పాలకులకుగానీ లేదు. తగినంతమంది సాంకేతిక నిపుణులు స్థానికంగా లభ్యంకాకపోవటంవల్లనే అమెరికా దిగ్గజ టెక్ సంస్థలు విదేశాలనుంచి వచ్చేవారిని ఎంపిక చేసుకోవాల్సివస్తున్నది. అలా భర్తీ చేసుకోనట్టయితే ఇన్నోవేషన్ రంగంలో ఆ దేశం వెనకబడిపోతుంది. అదిగాక విదేశీ విద్యార్థులు చెల్లించే వేలాది కోట్ల డాలర్ల ఫీజులు, టెక్ సంస్థల విస్తరణ, లాభార్జనల వల్ల మరిన్ని వేలకోట్ల డాలర్లు పన్నుల రూపంలో ఖజానాకు సమకూరుతాయి. ఇతరత్రా సంస్థల సంగతలావుంచి మన భారత సంస్థలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కార్పొరేట్ పన్ను రూపంలోనే నిరుడు 867 కోట్ల డాలర్లు (రూ. 73,000 కోట్లకు పైగా) చెల్లించాయి. మొత్తంగా అన్ని సంస్థలూ 13,008 కోట్ల డాలర్లకు పైగా (రూ. 10,99,166 కోటు్ౖలపైగా) చెల్లించాయి. ఇవిగాక జీఎస్టీ, కస్టమ్స్ సుంకం, ఉద్యోగులు చెల్లించే టీడీఎస్‌లు అదనం. ఇంతగా లాభపడుతూ బాధిత దేశంగా శోకించటం అమెరికాకే చెల్లింది. వీసా వ్యవస్థ దశాబ్దాలుగా దుర్వినియోగమవుతున్నదనీ, దేశ భద్రత ప్రమాదంలో పడిందనీ గొంతుచించుకుంటున్న అమెరికా తాను ఎడాపెడా వర్ధమాన, వెనకబడిన దేశాలనుంచి దశాబ్దాలుగా కొల్లగొడుతున్న సంపద గురించి మాట్లాడదు. ఇందులో ఆ దేశాల పాలకుల తప్పు కూడా ఉంది. మన దేశం సంగతే తీసుకుంటే 2047 కల్లా ‘వికసిత్ భారత్’ తీసుకొస్తామంటారు. కానీ అమెరికా మాదిరిగా కనీసం డిగ్రీవరకూ ఉచిత విద్య, నామమాత్రపు ఫీజులతో ఆపై విద్య అందుబాటులోకి తెచ్చే ఆలోచన చేయరు. జీడీపీలో కనీసం 6 శాతం విద్యకు వ్యయం చేయాలన్న లక్ష్యం పాటించరు. హైస్కూల్ విద్యవరకూ శ్రద్ధ పెడుతున్నట్టు కనబడుతూ ఆపై చదువుల్ని కార్పొరేట్లకు వదిలేశారు. వేలాదిమంది ప్రొఫెసర్ల కొరతతో విశ్వవిద్యాలయాలు దయనీయ స్థితిలో పడినా పట్టదు. కొలువుల సంగతి సరేసరి. ఇలాంటి స్థితిలో ట్రంప్ బెదిరిస్తే, పరిమితులు విధిస్తే నిస్సహాయంగా మిగలటం తప్ప మన యువత చేయగలిగేది ఏముంది? -
ఆంక్షలను ధిక్కరించిన ఉక్కు సంకల్పం
భారతదేశ అణు ప్రయాణం, దాని వెనుక ఉన్న వ్యూహాత్మక నిర్ణయాలు, చారిత్రక సవాళ్ల గురించి అభిజిత్ చావ్డా ఈ ఎపిసోడ్లో మాట్లాడారు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్.పి.టి.) వెనుక ఉన్న వివక్ష, పోఖ్రాన్ పరీక్షల ద్వారా భారత్ సాధించిన విజయం వంటి అంశాలను ప్రస్తావించారు:మొండితనం కాదు, మనుగడ నిర్ణయం‘‘అగ్ర దేశాలు 1968లో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని ఖరారు చేసినప్పుడు, వారు ఒక స్పష్టమైన గీత గీశారు. ‘మా దగ్గర 1967 కంటే ముందే అణ్వాయు ధాలు ఉన్నాయి కాబట్టి మేము వాటిని ఉంచుకుంటాం, కానీ మిగతా వాళ్లు ఎవరూ వాటిని తయారు చేసుకో కూడదు’ అని! నా దృష్టిలో ఇది ఆయుధాలను నియంత్రించే ఒప్పందం కాదు. కేవలం కొన్ని దేశాలకే ప్రాధాన్యం ఇచ్చే ఒక వివక్షతో కూడిన రాజకీయం. మన పొరుగు దేశాలు శత్రువులుగా మారుతున్న సమయంలో, ఇండియా తనను తాను రక్షించుకునే సార్వ భౌమ హక్కును వదులుకుంటూ ఈ ఒప్పందంపై సంతకం చేయాలని వారు ఆశించారు. ఇండియా ఎన్పీటీపై సంతకం చేయకపోవడం మొండితనం కాదు, అది మనుగడ కోసం తీసుకున్న స్పష్టమైన నిర్ణయం.భాభా ‘మరణం’ వెనుక అమెరికా!‘‘1966లో డాక్టర్ హోమీ భాభా మరణం చుట్టూ ఉన్న చీకటి కోణాలను, ఆయన అద్భుతమైన ఆలోచనలను అర్థం చేసుకోకుండా ఇండియా అణు ప్రయాణాన్ని మనం తెలుసుకోలేం. ఆ కాలపు చారిత్రక పరిణామా లను బట్టి చూస్తే, ఆల్ప్స్ పర్వతాలపై జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లయిట్ 101 ప్రమాదంలో భాభా మరణించడం ఒక ప్రమాదం కాదని నేను గట్టిగా నమ్ముతాను. అది ఇండియా అణు సామర్థ్యాలను సాధించడానికి ఎంత దగ్గరగా ఉందో చూసి భయపడిన విదేశీ నిఘా సంస్థలు – ముఖ్యంగా సి.ఐ.ఎ. – పన్నిన ఒక కుట్ర. మనం 18 నెలల్లోనే అణు పరికరాన్ని తయారు చేయ గలమని భాభా బహిరంగంగానే ప్రకటించారు. ఆయనను నిర్మూలించడం ద్వారా, విదేశీ శక్తులు మన అణు పురోగతిని కొన్ని దశాబ్దాల వెనక్కి నెట్టాయి.ఆచితూచిన పేరు ‘స్మైలింగ్ బుద్ధ’‘‘మనం 1974లో పోఖ్రాన్–1 పరీక్షను నిర్వహించి నప్పుడు, దానికి ‘శాంతియుత అణు విస్ఫోటం’ (పి.ఎన్.ఇ.–పీస్ఫుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్) అని పేరు పెట్టి, ‘స్మైలింగ్ బుద్ధ’ అనే రహస్య కోడ్‌ను ఉప యోగించాం. ఈ పేరు పెట్టడం ఆనాటి మన రాజకీయ నాయకత్వంలో ఉన్న తీవ్రమైన భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లను, లోతైన సంకోచాన్ని తెలియజేస్తుంది.ముఖ్యంగా 1971 భారత్–పాక్ యుద్ధంలో పాక్‌కు అను కూలంగా భారత్‌పై ఒత్తిడి తేవటానికి అమెరికా తన ఏడవ నౌకాదళాన్ని (సెవెంత్ ఫ్లీట్) బంగాళాఖాతంలో మోహరించిన తర్వాత, మన సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించాలని అనుకున్నాం. కానీ మనం ఒక అణు దేశ మని బహిరంగంగా ప్రకటించుకునే ధైర్యాన్ని అప్పట్లో ప్రదర్శించలేకపోయాం. ఈ ‘వ్యూహాత్మక అస్పష్టత’ (ఎటూ తేల్చని విధానం) అనే పాలసీ వల్ల 24 ఏళ్లపాటు దౌత్యపరమైన సందిగ్ధతలోనే ఉండిపోయాం. ఆఖరికి 1998లో వాజ్‌పేయి నాయకత్వంలో జరిగిన పోఖ్రాన్ –2 పరీక్షలు మాత్రమే, ఇండియా ఒక అణు దేశం అనే నిజాన్ని ప్రపంచానికి స్పష్టం చేశాయి.‘కల్పక్కం’ మన సత్తాను చాటింది!‘‘కొరతగా ఉన్న యురేనియంకు బదులుగా, మన దేశంలో సమృద్ధిగా ఉన్న థోరియం నిల్వలపై ఆధార పడిన మన ‘మూడంచెల అణు విద్యుత్ కార్యక్రమం’ భారతీయ శాస్త్రవేత్తల స్వయం సమృద్ధికి ఒక గొప్ప నిద ర్శనం. 1974 అణు పరీక్షల తర్వాత పాశ్చాత్య దేశాలు మనపై కఠినమైన ఆంక్షలు విధించినప్పుడు, మన అణు రియాక్టర్లకు ఇంధనం అందకుండా చేసి, మనల్ని లొంగి పోయేలా చేయవచ్చని వారు భావించారు. కానీ వారి అహంకారం పూర్తిగా తిరగబడింది. కల్పక్కం వంటి కేంద్రాల్లోని మన శాస్త్రవేత్తలు ఒంటరిగానే కొత్త ఆవిష్క రణలు చేశారు. మరెవరూ ప్రాధాన్యం ఇవ్వని ‘ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు’, ‘థోరియం వినియోగ చక్రాల’పై పట్టు సాధించారు. ప్రపంచ దేశాలు మనల్ని ఒంటరిని చేసినప్పటికీ, ఇండియా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచే సాంకేతికతను తన సొంత శక్తితో ఎలా నిర్మించు కోగలదో నిరూపించిన గొప్ప విజయ చిహ్నం అది.- ఎడిటోరియల్ టీమ్ -
ఉపేక్షించడం సరికాదు!
సమస్యలనూ, సంక్షోభాలనూ ఉపేక్షిస్తేనో, నిర్లక్ష్యం చేస్తేనో ముగిసిపోవు. మాయంకావు. వాటిని పట్టించుకుని, పరిష్కరించటానికి ప్రయత్నించటం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ఉండాల్సిన బాధ్యత. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) గత నెల 6న మొదలుకొని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లో విద్యారంగ సమస్యలపై ఆందోళన చేస్తోంది. గత 19 రోజులుగా విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తున్నదనీ, మరో రెండురోజులు దీక్ష కొనసాగితే ఆయన ప్రాణానికి ముప్పువాటిల్లే ప్రమాదం ఉన్నదనీ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం వాంగ్చుక్ను ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయిస్తూ, ఆ నివేదికల్నిబట్టి వైద్యపరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని గురువారం కేంద్రానికి సూచించింది. ఉద్యమకారులు ఒక్కరోజు నిరసనకు అనుమతి తీసుకుని అక్కడినుంచి కదలక పోవటం ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే అంశమే. అలాగని ఆ నిరసనపై పాలకులు కన్నెర్ర చేయలేదు. ఈ సంయమనాన్ని మెచ్చుకోవాల్సిందే. బహుశా సామాజిక మాధ్యమాల్లో సీజేపీ స్వల్పకాలంలోనే అనూహ్యంగా రెండుకోట్ల మందికిమించి మద్దతును సాధించటం ఇందుకొక కారణం కావొచ్చు. సరిగ్గా ఈ కారణంతోనే సీజేపీ దీర్ఘకాలిక ఆందోళనకు సిద్ధపడింది. అయితే నిరశనలతో వచ్చే సమస్యేమంటే... ఒక స్థాయికెళ్లాక జరగరానిది జరిగితే ఉద్యమం కాస్తా చేయిదాటే ప్రమాదం ఏర్పడుతుంది. ‘జాతీయ మీడియా’ ఈ ఉద్యమానికి ప్రాధాన్యం ఇవ్వనంతమాత్రాన ఇలాంటివి జరగబోవని చెప్పలేం. అందువల్లే ప్రతిష్ఠకు పోకుండా ప్రభుత్వం చర్చకు ఆహ్వానిస్తే పరిష్కారం సంగతి తర్వాత... ముందు తమ స్వరాన్ని విన్నారన్న సంకేతం వెళ్తుంది. మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేసినప్పుడు ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదనీ, మారిన పరిస్థితుల్లో ఏ సమస్యనైనా ప్రజాస్వామ్య పరిధిలో శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చనీ నక్సలైట్లకు అనేకులు హితవు పలికారు. ఇప్పుడు సీజేపీ ఉద్యమాన్ని ఉపేక్షించటంవల్ల వారిలో ఏ కొందరైనా తమ అభిప్రాయం తప్పన్న భావన కొచ్చే అవకాశం ఉండదా? ఉద్యమాలు వెల్లడించే సమస్యల తీవ్రతను గ్రహించటం పాలకులు చేయాల్సిన పని. ఇటు ఉద్యమకారులు కూడా ప్రభుత్వానికీ, ప్రజలకూ సమస్య తీవ్రతను చాటడం, వాటిని పరిష్కరించమని కోరడం తప్ప అందుకోసం తీవ్ర చర్యలకు పాల్పడటం సరికాదని గుర్తించాల్సివుంది. నెలన్నర నుంచి సాగుతున్న ఈ ఉద్యమంలో కొందరికి ఇప్పటికే ఈ అవగాహన ఏర్పడి ఉండొచ్చు. తనను నిరాహారదీక్ష విరమించుకోమంటున్నవారి కోసం వాంగ్‌చుక్ విడుదల చేసిన సందేశంలో ఒకచోట... ‘నేను దీక్ష విరమిస్తే ప్రభుత్వాలకు జవాబుదారీతనం అవసరం లేదన్న అభిప్రాయం కలగదా?’ అని ప్రశ్నించారు. జరిగిందేమిటో, విరమణ ఎందుకవసరమైందో ప్రజలు గ్రహించలేరనుకోవటం సరికాదు.ఢిల్లీ హైకోర్టు చెప్పినట్టు ఏ పౌరుడి ప్రాణమైనా విలువైనదే. కానీ వాంగ్‌చుక్ లాంటి అంకితభావంగల సామాజిక ఉద్యమకారులూ, భిన్నంగా ఆలోచించి సృజనాత్మక ఆవిష్కరణలు చేయగలిగినవారూ ఈ దేశానికి చాలా అవసరం. లద్దాఖ్ వంటి కఠినమైన భౌగోళిక పరిస్థితులున్న ప్రాంతానికి అనువైన వైవిధ్యభరిత ఆవిష్కరణలు చేసి ఆయన అంతర్జాతీయంగా ప్రశంసలు పొందారు. శీతాకాలంలో నీరు వృథా పోతూ, సాగు కాలంలో నీటి ఎద్దడివుండే ఆ ప్రాంతంలో ఆ సమస్యకు తన మేధస్సుతో శాశ్వత పరిష్కారం చూపారు. సౌరశక్తి ఆధారిత మట్టి ఇళ్ల ఆలోచన కూడా ఆయనదే. సరిహద్దుల్లో గడ్డకట్టే చలిలో విధులు నిర్వహించే జవాన్లకోసం రూపొందించిన సౌరశక్తి టెంట్లు అపూర్వం. తన తండ్రి, జమ్మూ–కశ్మీర్ మాజీ మంత్రి అయిన సోనమ్ వాంగ్యాల్ ఒరవడిలో ఆయన ఉద్యమిస్తున్నారు. లద్దాఖ్‌కు రాష్ట్రప్రతిపత్తి, దాన్ని ఆరో షెడ్యూల్లో చేర్చి రాజకీయ రక్షణ కల్పించడంవంటి డిమాండ్లతో ఈ మూడేళ్లలో పలుమార్లు ఆయన నిరశనలు చేశారు. శాంతియుతంగా మొదలైన ఈ ఉద్యమం అదే రీతిలో ముగియాలని, పట్టుదలకు పోకుండా చర్చలకు ఉపక్రమించాలని అనేకమంది కోరుకుంటున్నారు. అటు సోనమ్ వాంగ్‌చుక్, ఇటు ప్రభుత్వం వినాలి. -
కల్లోల పశ్చిమాసియా!
అమెరికా–ఇరాన్‌ల మధ్య గతవారం రోజులుగా అడపాదడపా సాగుతున్న దాడులు మంగళవారానికల్లా మరింత ఉగ్రరూపం దాల్చాయి. ఇప్పటికే అమెరికా స్థావరాలపై ఇరాన్ చేసిన దాడులు ఇద్దరు భారతీయ నావికుల ప్రాణాలు తీశాయి. దక్షిణ ఇరాన్‌పై అమెరికా సాగించిన దాడుల్లో 30 మంది పౌరులు, ఏడుగురు సైనికులు మరణించటం, దాదాపు 260 మంది గాయపడటం గమనిస్తే గతానికి మించి ఈసారి పౌర ప్రాంతాలను అమెరికా లక్ష్యంగా చేసుకుందని తెలుస్తుంది. అంతేకాదు... అరుదుగా చేసే పగటిపూట దాడులు కూడా మొదలెట్టింది. ఇరాన్ సైతం అమెరికా మిత్ర దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. గత నెల 17న ఇరు దేశాలమధ్యా కుదిరిన శాంతి ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు చిత్తశుద్ధి లేదని అమెరికన్ కాంగ్రెస్‌లోని పాలక, విపక్ష నేతలు గ్రహించారు. యుద్ధం ఎప్పుడో అయిపోయిందని బొంకటం మొదలుకొని కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందని చెప్పడం వరకూ ట్రంప్ ఒక పథకం ప్రకారం నడిపించారు. తన అధికారాలకు పరిమితులు విధిస్తూ యుద్ధ అధికారాల చట్టంకింద సెనేట్‌లోనూ, ప్రతినిధుల సభలోనూ చేసిన రెండు తీర్మానాలతో బెంబేలెత్తిన ట్రంప్ మొదట యుద్ధం ఎప్పుడో ఆగిందని అబద్ధమాడారు. మరికొన్ని రోజులు గడిచాక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని, శాంతి ఒప్పందం దిశగా ఇది తొలి అడుగ న్నారు. తీరా ఇప్పుడు మళ్లీ యుద్ధ భేరి మోగించారు. నిజానికి అమెరికా దాడులు ఆపింది ఎప్పుడూ లేదు. ఏదో వంకతో ఇరాన్‌పై కొనసాగిస్తూనే ఉంది. కేవలం కొంత వ్యవధి గడిచింది గనుకే యుద్ధం మొదలైనట్టు అధికారికంగా కాంగ్రెస్‌కు వర్తమానం పంపారు. పర్యవసానంగా 60 రోజులపాటు మళ్లీ యుద్ధం సాగించవచ్చన్నది ఆయన వ్యూహం. ఇది చెల్లుబాటు కాదనీ, ఈ విషయంలో ట్రంప్ ఇష్టారాజ్యం సాగనివ్వబోమనీ ఇరు పార్టీల ప్రతినిధులూ చెబుతున్నది ఆచరణలో ఎంతవరకూ నెరవేరుతుందో చూడాలి. గ్యాస్ ధరలు అపరిమితంగా పెరగటం, ఇతరేతర సరుకులు సైతం అందుబాటులో లేకపోవటంతో జనం బెంబే లెత్తుతుండగా మరిన్ని దాడులతో ఇరాన్ దారి కొస్తుందని ట్రంప్ కలగంటున్నారు. ఇరాన్‌తో లడాయి మొదలయ్యాక గ్యాస్ కోసం అమెరికా ఇంతవరకూ 5,640 కోట్ల డాలర్లు అదనంగా వెచ్చించిందని డెమాక్రాట్ల ఆధ్వర్యంలోని ఉమ్మడి ఆర్థిక కమిటీ అంచనా వేసింది. తాజా పరిణామాలతో వార్షిక రక్షణ విధాన బిల్లు ప్రవేశించకుండా సెనేట్‌లో 50–46 ఓట్ల తేడాతో నిరోధించటంతో ఆయన దిక్కుతోచని స్థితిలో పడ్డారనే చెప్పాలి. సొంత పార్టీకి చెందినవారే అడ్డం తిరగటంతో బిల్లు సభాప్రవేశానికి అవసర మైన 60 ఓట్లు లభించలేదు. హార్మూజ్ జలసంధి విషయంలో ఏం చేయాలో ట్రంప్‌కు పాలుబోవడం లేదని ఆయన పరస్పర విరుద్ధ ప్రకటనలే చెబుతున్నాయి. ఇకపై హార్మూజ్‌లో నౌకల రాక పోకలు సక్రమంగా జరిగేలా చూడటం తమ బాధ్యతనీ, అందుకు 20 శాతం సుంకం వసూలు చేస్తామనీ ప్రకటించి 24 గంటలు గడవకుండా మాట మార్చారు. దేశదేశాల అధినేతలూ అమెరికాలో వందలకోట్ల డాలర్లు పెట్టుబడి పెడతామనటంతో నిర్ణయం మారిందట! అమెరికా, దాని మిత్రపక్షాలూ ఎప్పటిలాగే స్వేచ్ఛాయుత హార్మూజ్ కొన సాగాలని కోరుతూ రాగా, ఇప్పుడు అందుకు విరుద్ధమైన ప్రకటన రిపబ్లికన్లను సైతం దిగ్భ్రమపరిచింది. అంతర్జాతీయ జలరవాణా మార్గంపై ఏ దేశమైనా ఎలా పెత్తనం చేస్తుందన్న వారి ప్రశ్నకు ట్రంప్ దగ్గర జవాబు లేదు. సాధారణ సమయాల్లో హార్మూజ్‌ను రోజుకు 130 రవాణా నౌకలు దాటేవి. అవికాస్తా సోమవారానికి 10కి పడిపోయాయి. తాజా దాడుల తర్వాత అది పూర్తిగా స్తంభించి పోయింది. యుద్ధాలు, అస్థిరత చమురు కార్పొరేషన్లకు అసాధారణ లాభాలు తెస్తాయి. కానీ చమురు, సహజవాయు దిగుమతులపై ఆధారపడ్డ దేశాలు ఆర్థికంగా కుంగి పోతాయి. పర్యావరణ పరిరక్షణ కోసమైనా పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి కేంద్రీకరిద్దామని ఇన్ని దశాబ్దాలుగా ఏ దేశమూ చిత్తశుద్ధితో అనుకోలేదు. ఎక్కడో ఒకచోట తలెత్తే సంక్షోభానికి ప్రపంచమంతా మూల్యం చెల్లించే ప్రస్తుత విధానం మంచిదో, ప్రత్యామ్నాయ వనరుల ఆసరాతో ఉన్నంతలో మెరుగ్గా మనుగడ సాగించటం ఉత్తమమో ప్రపంచ దేశాలన్నీ తేల్చుకోవటం తప్ప వేరే మార్గం లేదు. -
ఈసీ కొత్త మెలిక!
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరిట దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో ఇప్పటికే దాదాపు అయిదున్నర కోట్లమంది ఓటర్లను జాబితాల్లోంచి తొలగించి రికార్డు సృష్టించిన ఎన్నికల సంఘం(ఈసీ)... కొత్త రికార్డులు నెలకొల్పాలని తహతహలాడుతున్నట్టు కన బడుతోంది. 2002 నాటి ఓటర్ల జాబితాలో గల తమ తల్లిదండ్రుల వివరాలు పొందుపరి స్తేనే కొత్తగా 18 యేళ్లు నిండినవారూ, ఓటుహక్కు పొందదల్చుకున్న ఇతరులూ అర్హులవు తారని విధించిన తాజా నిబంధన ప్రకంపనలు రేపుతోంది. బిహార్‌తో మొదలెట్టి ఇంత వరకూ వివిధ రాష్ట్రాల్లో జరిగిన ‘సర్’లో లేని నిబంధన ఇప్పుడు కొత్తగా అందరి నెత్తినా పడేసింది. 2002 నాటికే తల్లిదండ్రులు మరణించివున్నా... అప్పట్లో సమయానికి ఇంట్లో లేకపోవటంవల్లనో, పనిపాటల కోసం వేరే ప్రాంతంలో ఉండటంవల్లనో వారి ఓటు హక్కు గల్లంతైవుంటే అలాంటి వాళ్ల పరిస్థితేమిటో చెప్పాలన్న స్పృహ కూడా దానికి లేకుండా పోయింది. అలాంటివాళ్లు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చనటం తప్ప మరేమీ వివరణ లేదు! తీరా ఇస్తే ఈ నిబంధన సాకుతో తిరస్కరించటం తప్ప ఒరిగేదేముంటుంది? ఒకరి తర్వాత ఒకరుగా వచ్చిన పాలకుల పుణ్యమా అని ఈ దేశంలో ఇతర చీడలతో పాటు నిరక్షరాస్యత కూడా నిక్షేపంగా ఉంది. 2011 నాటి లెక్కల ప్రకారం అక్షరాస్యత 74.04 శాతం. ఇప్పుడు జాతీయ సగటు 81 శాతమని అంటున్నారు. సంతకం పెట్టగలి గినపాటి జ్ఞానం వచ్చినవారిని అక్షరాస్యులుగా లెక్కేయటంవల్ల ఈమాత్రం కనబడుతోంది. తేలిగ్గా దేన్నయినా చదవగలిగేవారెందరో చెప్పలేం. అలాంటివారు ఇరవైయ్యేళ్ల క్రితం తమ ఓటు ఎక్కడుందో గుర్తుపెట్టుకుని పాత చిట్టాలు వెతకగలరా? ఒకవేళ గుర్తున్నా 2008 పునర్విభజనలో చాలా నియోజకవర్గాల పేర్లు, వాటి పరిధిలోని ఊళ్లు మారాయి గనుక వాస్తవంగా తమ ఓటు ఏ పరిధిలోకి పోయిందో తెలుసుకోలేరు. పైగా ఇది సాగు సీజన్. నాట్లు, యూరియా కొనుగోలు, ఇతరేతర పనుల కోసం రైతులు ఇప్పటికే తిప్పలు పడుతున్నారు. వారి పిల్లలు సైతం ఆ పనులు పంచుకుంటే తప్ప ఒక కొలిక్కి రాదు. జనాన్ని బాధించటానికి ఇంతకన్నా మంచి అదును ఈసీకి దొరకలేనట్టుంది!ఈసీ తీసుకొచ్చిన ఈ ‘సర్’ రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు చెప్పివుండొచ్చు. అందులో చోటు దొరకనివారు ట్రిబ్యునళ్లను ఆశ్రయించవచ్చన్న వెసులుబాటు కల్పించి వుండొచ్చు. కానీ అది నిగ్గుతేలేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. బెంగాల్ సంగతే తీసుకుంటే జాబితాల్లో గల్లంతైనవారు లక్షల్లో ఉండగా... ట్రిబ్యునళ్లు తేల్చిన కేసులు మూడు, నాలుగు వేలు మించలేదు. ఇలాగైతే అంతా తేలేసరికి కనీసం పాతికేళ్లు పడుతుందని న్యాయ నిపుణులు లెక్కేస్తున్నారు. ‘సర్’లో చోటు దొరక్కపోతే పింఛన్లు మొదలు కొని గ్యాస్ సిలెండర్ల సబ్సిడీ వరకూ సమస్తం ఆపేయటం కొన్ని రాష్ట్రాల్లో మొదలైంది. రేపో మాపో మీరు ఈ దేశ పౌరులు కాదు... ఇక్కడ ఉండటానికి అనర్హులని చెప్పినా ఆశ్చర్యం లేదు. పోనీ ఈసీ ‘స్వచ్ఛమైన’ జాబితాను రూపొందించగలుగుతోందా? పరకాల ప్రభాకర్ వంటి సామాజికవేత్తలు చెబుతున్నదాన్నిబట్టి చూస్తే యూపీలో కొన్ని చిరునామాల్లో వందలమంది ఓటర్లు నమోదైవున్నారు. ఇలాంటి ఆరోపణలకు ఈసీ వివరణ ఇచ్చిన దాఖలా లేదు. అసలు అలాంటి బాధ్యత ఉన్నట్టు కూడా అది గుర్తించే స్థితిలో లేదు. ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల టీడీపీ కార్యాలయాల్లో, ఆ పార్టీ నేతల ఇళ్లలో ‘సర్’ దరఖాస్తులు ఎవరికి ఇవ్వాలి... ఎవరికి ఇవ్వకూడదన్న నిర్ణయాలు జరుగుతున్నా యని వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మీడియాలో ఫొటోలు, వీడియోలు వస్తున్నాయి. అయినా ఈసీ ఉలకదు, పలకదు. సంబంధిత బీఎల్ఓలపై చర్యలుండవు. ఈ తంతు గమనిస్తే ఇది ‘తీసివేతల ఈసీ’గా కనబడుతోంది. గతంలో ఓటర్ల జాబితా సవరణలో కొత్తగా ఇన్ని లక్షలమంది జమ అయ్యారని... అందులో మొదటిసారి ఓటుహక్కు వచ్చినవారు ఇంతమంది అని ఈసీ గర్వంగా చెప్పుకునేది. ఇప్పుడు తీసివేతలే గర్వకారణంగా మారింది. ప్రపంచంలోనే అన్నీ డిజిటల్ చేశామని గొప్పగా చెప్పుకునే దేశంలో కాగితాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే స్థితి కల్పించిన ఘనత ఈసీది. మొత్తానికి ఆ సంస్థ మస్తిష్కంలో రేపటి రోజున ఎలాంటి ఆలోచనలు పుడతాయో, ఏం అమల్లోకొస్తుందో అని జనం భయపడే రోజులొచ్చాయి. -
ఆ నేరగాడు చిక్కినట్టేనా!
ఎనిమిదేళ్లుగా ఎన్నికల రుతువులో రాజకీయ పక్షాలు పరస్పరం బురద చల్లుకోవడానికి పనికొచ్చే అంశంగా మిగిలిపోయిన మహదేవ్ యాప్ స్కాంలో ఎట్టకేలకు సూత్రధారుల్లో ఒకడైన సౌరభ్ చంద్రశేఖర్ ఒమన్ పోలీసులకు ఇటీవల చిక్కడం కీలక పరిణామం. ఛత్తీస్‌గఢ్ కేంద్రంగా పలు రాష్ట్రాల్లో అమాయక పౌరులనుంచి రూ. 6,000 కోట్లు అపహరించిన ఈ యాప్ మన ఆర్థికవ్యవస్థ బలహీనతకు ఆనవాలు. ఈ సొమ్మంతా బ్యాంకుల ద్వారానే నేరగాళ్లకు చేరడం చిన్న విషయం కాదు. పలు రాజకీయ పక్షాల నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు, ఉన్నతాధికారుల ప్రమేయంతోనే ఆ యాప్ వేల కోట్లు కొల్లగొట్టిందని జనం చెప్పుకోవటమే తప్ప అందుకు సాక్ష్యాధారాలు లేవు. సీబీఐ, ఈడీ వంటి సంస్థలు అనేకచోట్ల దాడులు చేశాయి. కొంతమందిని అరెస్టు చేశాయి. ఛత్తీస్‌గఢ్ అప్పటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు భూపేష్ బాఘెల్‌కు రూ. 508 కోట్లు ఇచ్చానంటూ 2023 నవంబర్‌లో అక్కడి అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ కేసులో అరెస్టయిన ఆసిమ్ దాస్ అనే వ్యక్తి అంగీకరించాడని ఈడీ ప్రకటించినా... రాజకీయ దుమారం రేగటం మినహా జరిగిందేమీ లేదు. ఆ వెంటనే కాంగ్రెస్ నేతలు తమ వంతుగా బీజేపీ నాయకులపై ఆరోపణలు చేశారు. తనతో బలవంతంగా ఆ మాట చెప్పించారని ఆ నిందితుడు కోర్టుముందు వాంగ్మూలం ఇవ్వడంతో అది కాస్తా చల్లారింది. ఈలోగా ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకొచ్చింది. పూర్వాశ్రమంలో ఒక జ్యూస్ సెంటర్ యజమాని అయిన సౌరభ్ చంద్రశేఖర్ ఎవరి ప్రమేయమూ లేకుండా ఎదిగాడంటే ఎవరూ నమ్మరు.మహదేవ్ యాప్ కొల్లగొట్టిన మొత్తం రూ. 6,000 కోట్లు అంటున్నా అంతకు మించి ఉండొచ్చు కూడా. ప్రపంచమంతా అబ్బురంగా మాట్లాడుకునే బూర్జ్ ఖలీఫాలో అత గాడికి పలు ఫ్లాట్లు ఉన్నాయని చెబుతారు. ఇవిగాక వేరే దేశాల్లో విలాసవంతమైన భవంతులు, హోటళ్లు, వందల కోట్లలో నడిచే ఇతర వ్యాపారాలు సరేసరి. చదువుసంధ్యలు పెద్దగాలేని, మూడు పదులు కూడా దాటని సౌరభ్ స్వల్పకాలంలోనే ఇంత కొల్లగొట్ట డానికి ఊతమిచ్చింది మనుషుల్లోని దురాశ, వ్యవస్థల నిరాసక్తత. ఎన్నికల్లో ఎవరు నెగ్గుతారన్న ఆసక్తి, రేసు గుర్రాల్లో ఏది విజేతగా నిలుస్తుందనే అంచనాలు మహదేవ్ యాప్‌కి పెద్ద మేత. మ్యాచ్ ఫిక్సింగ్‌లు సరేసరి. అరెస్టులూ, పరస్పర ఆరోపణలతో ఇంత దుమారం రేగినా... 2023లో ఆ యాప్‌ను నిషేధించినా, మొన్న ఏప్రిల్‌లో జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొత్త డొమైన్లతో ఆ యాప్ రెండు చేతులా కోట్ల రూపాయలు దండుకుంది. బుకీల ద్వారా పాలకపక్షంగా రాబోతున్న దెవరో, రెండో స్థానంలో ఉండబోయే పక్షానికి ఎన్ని స్థానాలొస్తాయో కాకరేపడం, బెట్టింగ్‌లు జోరందుకోవటం, సొమ్ములు కొల్లగొట్టడం, దక్షిణాఫ్రికా, కెన్యా, బ్యాంకాక్,హాంకాంగ్లనుంచి దీన్నంతా చక్కబెట్టడం ఈ దొంగల నిర్వహణాశైలి. సౌరభ్ పెళ్లికే రూ. 200 కోట్లు ఖర్చయిందనీ, బాలీవుడ్ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు ప్రదర్శనలిచ్చారనీ సీబీఐ ఆరాలో తేలింది. ఇప్పుడు సౌరభ్‌ను పట్టుకున్న ఒమన్‌తో మన దేశానికి నేరస్థుల అప్పగింత ఒప్పందం ఉంది. కానీ ఇక్కడికి రప్పించాలంటే అతనిపై ఉన్న కేసులు, సాక్ష్యాధారాలు, కోర్టు రికార్డులు సమర్పించాలి. ఒప్పందం పరిధిలోకి అవి వస్తాయో రావో అక్కడి న్యాయ స్థానాలు తేల్చాలి. రెండేళ్ల క్రితం యూఏఈలో అరెస్టయినా ఆ దేశంతో నేరస్థుల అప్పగింత ఒప్పందం లేకపోవటంతో విడుదలయ్యాడు. సౌరభ్ సహచరుడు రవి ఉప్పల్ ఆచూకీ లేకుండాపోయాడు. అతగాడు వనౌటులో ఉన్నాడని మన నిఘా సంస్థలు అంచనా వేస్తున్నా, నిర్ధారణగా తేల్చలేకపోయాయి. జూదం దగ్గర మొదలైన దర్యాప్తు... హవాలా రాకెట్, నకిలీ కంపెనీలు, విదేశీ సంస్థల్లో పెట్టుబడులు, స్థిరాస్తులు వగైరాలన్నీ బయటపడ్డాక దాని విస్తృతి పెరిగింది. ఇలాంటి ఆర్థిక నేరగాళ్ల ఆచూకీ రాబట్టడంలో, ఇక్కడికి రప్పించడంలో వ్యవస్థలు విఫలం కావటంవల్ల ఇలాంటివారు మరింత మంది పుట్టుకొస్తున్నారు. సౌరభ్‌ను సత్వరం తీసుకు రాగలిగితేనే నేరగాళ్లలో భయం ఏర్పడుతుంది. అతగాడే కాదు... రకరకాల పేర్లతో పలు రాష్ట్రాల్లో అనేకానేక సంస్థలు వెలుస్తున్నాయి. జనాన్ని నిలువుదోపిడీ చేస్తున్నాయి. దీనికి అడ్డుకట్టవేయడం తక్షణ కర్తవ్యం. -
ఉమ్మడి పౌర ప్రవర్తన
‘ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకూ, పూలిమ్మనీ రెమ్మరెమ్మకూ; ఎంత తొందరలే హరి పూజకు, పొద్దుపొడవకముందె పూలిమ్మనీ’– అంటూ ఆశ్చర్యపోతారు దేవులపల్లి కృష్ణ శాస్త్రి ఓ సినీగీతంలో! నిజమే, పూలిమ్మని రెమ్మరెమ్మనూ ఎవరు శాసించారు, ఏ చట్టం కొట్టి చెప్పింది? సృష్టిలోని సకలజీవులూ ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉమ్మడిగా సుఖజీవనం సాగించడానికి ప్రకృతి చేసిన ఏర్పాట్లలో ఒకటి కదా అది! పట్టిచూస్తే తప్ప అర్థం కాని, మన అవగాహనకు అందని ప్రకృతి విశాల ప్రణాళికలో అది భాగం కదా! బుర్రలేదనుకునే పక్షీ, పశువూ, చెట్టూ, పుట్టా, రాయీ, రప్పా సైతం ప్రాకృతిక న్యాయంలో భాగమైనప్పుడు బుర్ర ఉందనుకునే మనిషి ఎందుకు కాడు?! సంస్కృతీ, నాగరికతా మార్గంలో వేల సంవత్సరాల ప్రస్థానం తర్వాత, ఇప్పటికైనా అయ్యాడా? అందులో ప్రకృతి ప్రణాళికకు పెడగా పడిన అడుగులెన్ని!జీవం మనిషిగా ఎదిగిన మొదట్లో చట్టాలు లేవు; మనుగడలో భాగంగా సాటి మనిషితో జతకట్టాడు, గుంపుగా ఎదిగాడు, అనేక గుంపులతో కలసి సామరస్యంగా సహజీవనం చేసే స్థాయికి చేరాడు. తన అస్తిత్వంలో ఎక్కువకాలం అలిఖిత శాసనాలే మనిషిని నడిపించాయి; మంచీ, మర్యాదా మప్పాయి; నీతీ, రీతీ నేర్పాయి; సభ్యత, శుభ్రత అలవరచాయి. అయినా ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. అవినీతి, అసభ్యత, అక్రమాల అధఃపాతాళపు లోతులు చూస్తూనే ఉన్నాడు. ప్రకృతిమార్గం నుంచి తప్పుకుని సృష్టికి ప్రతిసృష్టి చేసే ప్రావీణ్యం విర్రవీగడమే అందుకు కారణమా?! మానవ జనావాసాలు గుంపు దశనుంచి నగరాలుగా ఎదిగే క్రమంలో లిఖిత శాసనాలు వచ్చాయి. అయిదువేల సంవత్సరాల క్రితం ప్రాచీన సుమేరు నాగరికతా కాలంలో తెచ్చిన ‘ఉర్–నమ్ము’ అనే శిక్షాస్మృతిని తొలి స్మృతిగా చెబుతారు. ఆ తర్వాత క్రీ.పూ. 1750లో, బాబిలోనియా పాలకుడు హమ్మురాబి పేరిట శిక్షాస్మృతి వచ్చింది. ఆ తర్వాత క్రీ.పూ. 451లో ‘లా ఆఫ్ ట్వెల్వ్ టేబుల్స్’ పేరిట రోమన్ చట్టాలు వచ్చాయి. వాటిని క్రోడీకరిస్తూ క్రీ.శ. 529లో జెస్టీనియన్ శిక్షాస్మృతిని తెచ్చారు. ఆధునిక పౌరచట్టాలనూ, వ్యవస్థలనూ అదే ప్రభావితం చేసిందంటారు. మన దగ్గర క్రీ.పూ. 400లో అర్థశాస్త్రం, ఆ తర్వాత మనుçస్మృతితో సహా వివిధ స్మృతులు వచ్చి మానవ ప్రవర్తనను కట్టడి చేయడానికి ప్రయత్నించాయి. కులమతవర్గ భేదాలను దాటుకుంటూ ప్రజాస్వామ్యం దిశగా అడుగువేస్తున్న వర్తమానంలో ఈ ప్రాచీన స్మృతులు మంచి–చెడుల కలబోతగా కనిపించ డంలో ఆశ్చర్యం లేదు. క్రీస్తుశక ప్రారంభంలో మౌర్యచక్రవర్తి అశోకుడు ‘ధర్మస్తంభా’ల పేరిట దేశమంతటా స్థాపించిన లిఖిత శిలాస్తంభాలు జంతుబలుల నిషేధంతో సహా ఆయా విధినిషేధాలను శాసిస్తూనే; సత్కార్యాలను, దయను, దాతృత్వాన్ని, సత్యనిష్ఠను, పరిశుద్ధతను బోధించాయి; క్రౌర్యాన్ని, కోపాన్ని, గర్వాన్ని విడిచిపెట్టమనీ; అన్ని మతా లను, పంథాలను గౌరవించమనీ చెప్పాయి. మనిషి ప్రవర్తనను చట్టాలూ, శిక్షలతోనే కాదు; తగిన హితబోధతో మానసిక పరివర్తన ద్వారా కూడా కట్టడి చేసే ప్రయత్నం ముందునుంచీ జమిలిగా సాగింది. ప్రభుత్వాలు చట్టాలు, శిక్షలతో చేయబోయిందే – వేదాలూ, కావ్యేతిహాసాలు సహా ప్రపంచ వాఙ్మయమంతా హితబోధతో చేయబోయింది. అందుకే ప్రత్యేకించి కావ్యాలను కాంతాసమ్మితాలన్నారు. ‘భగవంతుడు ఆకలిచావును విధించలేదు, తిండి ఉన్నవాడు కూడా చావక తప్పదు; తనకున్నదాన్ని ఇతరులతో పంచుకునేవాడు ఎప్పటికీ అణ గారడు; దాతృత్వం లేనివాడు ఒంటరి అయిపోతా’డంటుంది ఋగ్వేదం. దయ, ధర్మం లేని కొంప కొంపే కాదంటుంది. విజ్ఞతా, వినయాలే తప్ప అహంకారం, ధిక్కారం పని చేయవని మహాభారతంలోని యక్షప్రశ్నల ఘట్టం చెబుతుంది. ఒక యక్షుడికి చెందిన చెరువులో నీళ్ళు తాగబోయి, అతని ప్రశ్నలకు జవాబు చెప్పడానికి నిరాకరించి, ధిక్కరించి తన నలుగురు సోదరులూ స్పృహ కోల్పోయినప్పుడు ధర్మరాజు వినమ్రంగా జవాబు చెప్పి సోదరులను బతికించుకుంటాడు. కనుక చట్టాలకూ, హితబోధకూ మధ్య సమతూకం తప్పనిసరి. ఏది ఎక్కువైనా సత్ప్రవర్తన గల్లంతవుతుంది. చట్టాలే సర్వస్వ మనుకుంటే వాటి ఉల్లంఘనా సర్వసామాన్యమవుతుంది. ఉమ్మడి పౌరస్మృతులతో పాటు హితమార్గంలో ఉమ్మడి పౌర ప్రవర్తనను తీర్చిదిద్దడమూ అంతే అవసరం. -
అనిశ్చితిలో వెలుగురేఖ
‘బలవంతుడ నాకేమని...’ అనుకుంటే దశాబ్దాల తరబడి అమెరికా నిర్మించుకుంటూ వస్తున్న పునాదులు కదిలిపోతాయని ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఇంకా జ్ఞానో దయం కాలేదు. నాటో శిఖరాగ్ర సదస్సుకు పోయి ఈసారి కాస్తంత స్నేహపూర్వకంగా మాట్లాడినా అటువైపునుంచి మునుపటి సాన్నిహిత్యం లేదని తుర్కియేలో ముగిసిన ఆ సదస్సు తీరుతెన్నులు చెబుతున్నాయి. అమెరికాతో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలే ఉన్న మన దేశం సైతం ఆయన తరచు చేసే ప్రకటనల కారణంగా ఇబ్బంది పడుతోంది. హఠాత్తుగా ‘ఇండో–పసిఫిక్’ పేరు మారాక లోలోన అసంతృప్తి సరేసరి. ఈ నేపథ్యంలో ఇండో–పసిఫిక్ విషయంలో మన వైఖరిని తేటతెల్లం చేసేలా, మన చొరవను మరింత పెంచేలా ప్రధాని నరేంద్ర మోదీ ఇండొనేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఆరు రోజుల పర్యటన ఈ నెల 6న మొదలైంది. ఇప్పటికే ఇండొనేసియా, ఆస్ట్రేలియా పర్యటనలు పూర్తి చేసుకున్న మోదీ శుక్రవారం న్యూజిలాండ్ చేరుకున్నారు. అమెరికా, చైనాలతో... వాటి వైఖరులతో సంబంధం లేకుండా భద్రత, వాణిజ్యం తదితర రంగాల్లో భిన్న దేశాల సహకారం అవసరమని మన దేశం భావించబట్టే ఈ పర్యటన ఖరారైంది. ఈ మూడూ సాగరప్రాంత దేశాలు. ఎప్పుడో 1992లోనే రూపుదిద్దుకున్న ‘లుక్ ఈస్ట్’ విధానానికి కొనసాగింపుగా మన దేశం ‘మహాసాగర్’ దార్శనికతను ప్రతిపాదించింది. పరస్పర సంపూర్ణ అభివృద్ధికి ప్రాంతాలవారీ భద్రత, సమగ్రవృద్ధి అవసరమన్నదిదాని సారాంశం. సాధారణ ఆర్థిక సంబంధాలు మొదలుకొని భారీ రక్షణ, ఇంధన భాగస్వామ్యం వరకూ అనేకం దీని పరిధిలోకొస్తాయి. ఆస్ట్రేలియాతో గురువారం కుదిరిన పౌర అణుశక్తి ఒప్పందం చరిత్రాత్మకమైనది. ఇదిగాక ఆధునిక సాంకేతికతలూ, రక్షణ, భద్రత సహకారం, సరఫరా గొలుసు మెరుగు పరచటం తదితరాలకు సంబంధించి మరో 18 ఒప్పందాలు కుదిరాయి. పారిస్ఒప్పందం కింద స్వచ్ఛ ఇంధన లక్ష్యం సాధనకు మన అణు రియాక్టర్లకు నిరంతరాయంగా యురేనియం అవసరమవుతుంది. ప్రస్తుతం ఉన్న 7.7 గిగావాట్ల అణు విద్యుత్‌ను 2047కల్లా 100 గిగావాట్లకు పెంచాలని భారత్ నిర్దేశించుకుంది. ఇందుకోసం ప్రపంచ యురేనియం నిక్షేపాల్లో 28 శాతంగల ఆస్ట్రేలియాతో ఒప్పందం కుదరటం కీలక పరిణామం. ప్రపంచ పరిణామాల కారణంగా హఠాత్తుగా నిలిచిపోతున్న ఇంధన సరఫరా తీరును సరిదిద్దటానికి ఎల్ఎన్జీ, బొగ్గు, డీజిల్వంటి సంప్రదాయ ఇంధన వనరుల విషయంలో పరస్పరం సహకరించుకుంటూ ఇంధన భద్రతను బలోపేతం చేసుకోవాలని రెండు దేశాలూ నిర్ణయించుకున్నాయి. ఏనాటి నుంచో సాన్నిహిత్యంగల ఇండొనేసియాతో మరిన్ని రంగాల్లో సహకారానికి ఈ నెల 6నుంచి 8వరకూ వరసగా మూడురోజులపాటు కొనసాగిన పర్యటనలో ఒప్పందాలు కుదిరాయి. మన బ్రహ్మోస్, అస్త్ర క్షిపణుల్ని కొనుగోలు చేయటానికి ఇండొనేసియా ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు దేశాలూ కలిసి ఇండొనేసియాలోని ఆచే, అండమాన్, నికోబార్ దీవుల్లో నౌకాశ్రయాలను నిర్మించటానికి కూడా అధినేతలిద్దరూ అంగీకరించారు. అలాగే హిందూసముద్రం మొదలుకొని పసిఫిక్ మహాసముద్రంవరకూ పరస్పర సహకారంతో సముద్రజలాల్లో భద్రతను పెంచటానికి ఒప్పందం కుదిరింది. ఇప్పటికే జపాన్, దక్షిణ కొరియాలతో ఉన్న సహకారానికి ఇండొనేసియా కూడా తోడుకావటం వల్ల ఇండో–పసిఫిక్‌లో పటిష్టమైన సమన్వయం ఏర్పడుతుంది. చైనాతో అంటకాగటానికిట్రంప్ ప్రయత్నిస్తున్న దశలో ఇది కీలక పరిణామం. నిరుడు మన దేశంలో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ పర్యటించినప్పుడు ద్వైపాక్షిక రక్షణ సహకార ఒప్పందం కుదిరింది. దాంతోపాటు మొన్న ఏప్రిల్‌లో రెండు దేశాలూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదుర్చుకున్నాయి. దీన్ని మున్ముందు మరింత విస్తృతపర్చుకోవటానికి ఇప్పటికే ఇరు దేశాలూ నిర్ణయించుకున్నాయి. కూటముల్లో చేరే విషయంలో న్యూజిలాండ్‌కు పెద్దగా ఆసక్తి లేదు. అయితే ప్రాంతీయ భద్రతను పెంపొందించుకోవటానికి భారత్, ఆస్ట్రేలియాలతో కలిసి పనిచేయాలని ఇప్పటికే నిర్ణయించుకుంది. మొత్తానికి మోదీ మూడు దేశాల పర్యటన ఇండో–పసిఫిక్‌లో భారత్ పలుకుబడిని మరింత పెంచుతుంది. -
సంక్షోభం ఒక క్రూరమైన గురువు
ఆర్థిక సంక్షోభాల నుండి లభించే జీవిత పాఠాలు, వ్యాపార ప్రయోగాల ద్వారా మానవ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవటం, ఆటోమేషన్ యుగంలో నైపుణ్యాల ప్రాముఖ్యం గురించి కునాల్ షా ఈ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. ఇందులోని ముఖ్యాంశాలు:నిన్నటి కష్టమే నేటి మన నమ్మకం‘‘మా కుటుంబ వ్యాపారం దెబ్బతిన్నప్పుడు, మాకు అండగా నిలిచిన రక్షణ వలయాన్ని పూర్తిగా కోల్పోయాం. అప్పటినుండి బతకటం కోసమే కష్టపడ్డాను. పిల్లలకు ట్యూషన్లు చెప్పాను, ఒక సైబర్ కేఫ్ నడిపాను, పాటల సీడీలు అమ్మాను. మన విద్యావ్యవస్థ కేవలం రూల్స్ పాటించే మంచి ఉద్యోగులుగా తయారు చేయ డానికే శిక్షణ ఇస్తుంది కానీ బతకటానికి కావలసిన ప్రాథ మిక మెళకువలను నేర్పదు. నా 16వ ఏటనే ఈ ప్రపంచాన్ని ‘సప్లయ్ అండ్ డిమాండ్’ కోణంలో చూడటం వల్ల... ‘స్టార్టప్’ అనే పదాన్ని వినటానికి చాలా ముందే, మార్కెట్లో ఉన్న లోపాలను, అవకాశాలను ఎలా గుర్తించాలో నేర్చుకున్నాను. సంక్షోభం ఒక క్రూరమైన గురువు, కానీ అది మిమ్మల్ని ఇతరుల కన్నా ఎక్కువ దృఢంగా మార్చి, ఒక ప్రత్యేకమైన శక్తిని ఇస్తుంది.మార్కెట్‌కు మేధస్సు ఎందుకు?‘‘నన్ను నేను, అనుకోకుండా వ్యాపారవేత్తగా మారిన ఒక తత్వశాస్త్ర విద్యార్థిగా భావిస్తాను. మనుషులు ఏ పనినైనా ఎందుకు చేస్తారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలనే విపరీతమైన ఆరాటం నాలో ఉంది. కేవలం పుస్తకాలు చదవడం, సిద్ధాంతాలను పోగుచేసు కోవడం అనేది మేధోపరమైన అతిశయం మాత్రమే అవుతుంది. నా దృష్టిలో, ఒక కంపెనీని నిర్మించడం అత్యున్నత ప్రయోగశాల. మానవ ప్రవర్తన గురించి నాకో సిద్ధాంతం తోచినప్పుడు, నేను దాని గురించి కేవలం ఒక వ్యాసం రాసి వదిలేయను. ‘ఫ్రీచార్జ్’ లేదా ‘క్రెడ్’ లాంటి ఒక ప్రాడక్ట్‌ను నిర్మిస్తాను. లక్షల కొద్దీ ప్రజలు దానిని ఉపయోగిస్తే, మానవ స్వభావంపై నాకున్న అవగాహన సరైనదని అర్థం. వారు ఉపయోగించకపోతే, నేను తప్పు అని అర్థం. మన ఐడియాలకు ఎలాంటి ఫిల్టర్లు లేకుండా నిజమైన స్కోరును ఇచ్చే ఏకైక రంగం వ్యాపారం మాత్రమే.మిమ్మల్ని కాపాడేది మీ నైపుణ్యమే!‘‘అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో మనం ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడ లేబర్ చౌకగా దొరుకుతుంది కాబట్టి, కేవలం మనుషులకు ఏదో ఒక పని కల్పించడం కోసమే కృత్రిమ లోపాలను/ అవసరాలను సృష్టించాం. లిఫ్ట్‌లో కేవలం బటన్ నొక్క డమే పనిగా ఉన్న మనుషులు కనిపిస్తారు. ఒక స్మార్ట్ కెమెరా చేయగలిగే సెక్యూరిటీ చెకింగ్ పనిని ముగ్గురు వ్యక్తులు చేస్తుంటారు. పెట్టుబడిదారీ విధానం, ఆటోమే షన్ దూసుకుపోతున్న కొద్దీ, ఇలాంటి అనవసరమైన ఉద్యోగాలు రాత్రికి రాత్రే తుడిచి పెట్టుకుపోతాయి. సామర్థ్యం లేకుండా ఉద్యోగాలను మీరు ఎప్పటికీ కాపాడుతూ కూర్చోలేరు. ఇంటర్నెట్కు, ఏఐకి మీ సెంటి మెంట్లతో పని లేదు. వాటికి మీ నైపుణ్యం కావాలి.సంకుచిత ఆలోచన సంపదనివ్వదు!‘‘చాలామంది ‘కొరత మానసిక స్థితి’లో ఉంటారు. వారు ఎవరినైనా కలిసినప్పుడు, ‘ఈ వ్యక్తి నుండి నేను ఏం ఆశించవచ్చు?’ అని ఆలోచిస్తూ గదిలోకి అడుగు పెడతారు. ఆర్థికంగా వెనుకబడే ఉండటానికి ఇది వేగ వంతమైన మార్గం. నాకు తెలిసిన సంపన్నులు ‘సమృద్ధి ఆలోచనా విధానం’తో పని చేస్తారు. తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ విజయపథంలో నడిపించాలనే తపన వారిలో బలంగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వ్యవస్థకు సంబంధించిన మొత్తం లాభాల పరిధిని పెంచడం పైనే మీరు దృష్టి పెడితే, అందులో మీ వాటా సహజంగానే చాలా పెద్దదవుతుంది.- ఎడిటోరియల్ టీమ్ -
భారత్‌కు ‘క్లీన్ చిట్’
మూడేళ్లుగా భారత్‌ను వెన్నాడుతున్న ఒక నీలాపనింద తొలగిపోయింది. కెనడాలో ‘గుర్తు తెలియని వ్యక్తుల’ చేతుల్లో హత్యకు గురైన ఖలిస్తానీ ఉద్యమకారుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ ఉదంతంలో మన ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం లేదని నిగ్గుదేలినట్టు బుధవారం అమెరికా, కెనడా ప్రకటించాయి. భారత అధికారుల కనుసన్నల్లోనే నిజ్జార్ హత్య జరిగిందంటూ కెనడా పార్లమెంటులో 2023లో అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. దాంతోపాటు ఇరుదేశాలూ దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించు కున్నాయి. ట్రూడో ఆరోపణలు దురుద్దేశపూర్వకం, నిరాధారం అని మన ప్రభుత్వం కొట్టిపారేసింది. చివరకు అదే రుజువైంది. కెనడాలో సిక్కు ఓట్లు పొందటం కోసం ఖలిస్తానీవాదుల్ని సంతోషపరచటానికే ట్రూడో భారత్‌పై ఆరోపణ చేశారని అప్పట్లో మన ప్రభుత్వం విమర్శించింది. అయితే భారత్ కేంద్రంగా ఖండాంతరాల్లో మూడు నేరస్త ముఠాలు పనిచేస్తున్నాయని, ఇవి తమ దేశంలోనూ, కెనడాలోనూ, యూరప్‌లోనూ హత్యలకూ, బెదిరింపులకూ, మాదకద్రవ్యాల వ్యాప్తికీ కారణమవుతున్నాయని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ప్రకటించటం మన పోలీసు, నిఘా వ్యవస్థల పనితీరును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఎందుకంటే ఈ నేరాల సూత్రధారుల్లో ఒకడైన లారెన్స్ బిష్ణోయ్ గుజరాత్‌లోని సబర్మతీ జైల్లో ఉన్నాడు. మరొక వ్యక్తి జగ్గూ భగవాన్‌పురియా అస్సాం జైల్లో ఉన్నాడు. వీరిద్దరూ జైళ్లనుంచే చెరో ముఠాకూ నాయకత్వం వహిస్తూ అంతర్జాతీయ కార్యకలాపాలు నడుపుతున్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. మరో వ్యక్తి రవిందర్‌సింగ్ ధండ్సా కెనడాలోనూ... బిష్ణోయ్ ముఠాలోని సతీందర్సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ అమెరికాలోనూ తప్పించుకు తిరుగుతున్నారు. వీరిలో గోల్డీ బ్రార్‌ను పట్టిస్తే 50,000 డాలర్లిస్తామని ఎఫ్‌బీఐ చెప్పడం గమనించదగ్గది. మొత్తంగా 37 మంది నిందితుల్లో 24 మందిని అమెరికా, కెనడా, యూరప్‌లు ఉమ్మడిగా సాగించిన ‘ఆపరేషన్ హార్డ్‌బాల్’లో అరెస్టు చేశారు. వీరంతా అమెరికా, కెనడా, బ్రిటన్, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో కార్యకలాపాలు సాగిస్తున్నారు. ప్రపంచీకరణ తర్వాత ఇతరత్రా అభివృద్ధి మాటేమోగానీ... నేర ముఠాల కార్యకలా పాలు ఊహాతీతంగా విస్తరించాయి. ఖండాంతరాలకు వ్యాపించాయి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు ఏలుబడిలో నక్సలైట్లను అరికట్టే పేరిట నయీం చేసిన అకృత్యా లకు అంతులేదు. అతగాడు తెలంగాణ ఉద్యమకారులనూ, మేధావులనూ బెదిరించటంతో ఊరుకోలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్వరమై ఎదిగిన బెల్లి లలిత అనే యువ గాయని ప్రాణాలు తీశాడు. అనేకమందిని కిడ్నాప్ చేశాడు. వందల ఎకరాల భూముల్ని కబ్జా చేశాడు. కొన్నాళ్ళు జైలు నుంచే కార్యకలాపాలు నడిపాడు. పంజాబ్‌లో పరిస్థితి భిన్నమైనది. అక్కడ హరితవిప్లవ కాలం నుంచీ పోగుపడిన సంపదకు ప్రపంచీకరణ అనంతర పరిణామాలు తోడుకావటంతో అక్రమ వసూళ్ల దందా, సామాజిక మాధ్య మాల్లో ప్రముఖులుగా మారి, విదేశాల్లో సైతం ప్రదర్శనలిచ్చే స్థాయికి ఎదిగిన గ్రామీణ యువ కళాకారుల్ని చెప్పుచేతల్లో పెట్టుకోవటం పెరిగింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షకుల్ని సంపాదించి, విదేశాల్లో ప్రదర్శనలిచ్చిన యువ వాగ్గేయకారుడు సిద్ధూ మూసేవాలను గోల్డీ బ్రార్ ముఠా కాల్చిచంపింది. బిష్ణోయ్ అభీష్టానికి భిన్నంగా ఒక కబడ్డీ జట్టును ప్రోత్సహించటం ఈ హత్యకు కారణం! ఇప్పుడు జైళ్లలోవున్న లారెన్స్, భగవాన్పురియాలతోపాటు ఒక పంజాబీ అమెరికన్ కుటుంబాన్ని హత్య కేసులో ఇరికిస్తామని బెదిరించి, 4 లక్షల డాలర్లు (3.81 కోట్లు) డిమాండ్ చేసిన పంజాబ్ పోలీస్ ఇన్స్పెక్టర్ గురిందర్ సింగ్ నాగ్రాను కూడా అప్పగించాలని అమెరికా కోరుతోంది. భగవాన్‌పురియా ముఠా చేసే పలు నేరాలకు గురిందర్ సహకరిస్తున్నాడన్నది ఎఫ్‌బీఐ ఆరోపణ. ఇవిగాక అమెరికాలో ఉంటున్న ఖలిస్తానీ ఉద్యమకారుడు గుర్పత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడన్న అభియోగాలతో ఎన్నారై నిఖిల్ గుప్తా అమెరికా జైల్లో ఉన్నాడు. వికాస్ యాదవ్ అనే భారతీయ అధికారి ప్రోద్బలంతోనే ఈ కుట్ర జరి గిందని అమెరికా ఆరోపించింది. దేశాన్ని అప్రదిష్టపాలుచేసే ఇలాంటి వారిపట్ల కఠినంగా ఉండాలి. వారి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలి. ఎల్లకాలమూ చట్టానికి దొరక్కుండా తప్పించుకోవటం సాధ్యంకాదని తాజా పరిణామాలు తెలియ జెబుతున్నాయి. -
మళ్లీ మొదటికి...!
అమెరికా–ఇరాన్‌ల మధ్య కుదిరిన అరవై రోజుల అవగాహన ఒప్పందం(ఎంఓయూ) ఇరవై రోజులకే ముక్కలైంది. శాంతి సాధన దిశగా తొలి అడుగు పడిందని అందరూ సంతోషించి ఎంతో కాలం కాకుండానే అది ముగిసిపోయింది. తుర్కియేలో జరిగే నాటో శిఖరాగ్ర సదస్సుకొచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ సంగతి ప్రకటించారు. ఈ రాత్రికి భీకరదాడులుంటాయని కూడా హెచ్చరించారు. నిలకడ తక్కువ... నోటి దురుసు ఎక్కువవున్న ట్రంప్ ఎంఓయూపై సంతకాలైన క్షణంనుంచి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. కిందపడినట్టు ప్రపంచమంతటికీ తెలిసినా తనదే పైచేయి అని చెప్పడానికి తాపత్రయపడ్డారు. ఎంఓయూ తర్వాత ఇలా జరగటం ఇది మూడో సారి. ఈ దాడులకు దీటుగా బదులిచ్చినట్టు, అమెరికా మిత్ర దేశాల్లోని దాని స్థావరాలపై క్షిపణులు ప్రయోగించినట్టు ఇరాన్ చెబుతోంది. ఒప్పందం కుదిరిందన్న మాటేగానీ... పశ్చిమాసియా అంతటా ఒక విధమైన ఉద్రిక్తత, అనిశ్చితి కొనసాగుతూనే ఉన్నాయి. హార్మూజ్ జలసంధినుంచి నౌకలు సురక్షితంగా బయటపడటం అనునిత్యం వార్తే అయింది. శాంతి అనేది వీరోచిత శ్రమనూ, త్యాగాన్నీ కోరుతుందని ఆధ్యాత్మికవేత్త థామస్ మెర్టన్ అంటాడు. పరస్పర అవగాహనతో తప్ప బలప్రయోగంతో శాంతి అసాధ్యమన్నది విఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మాట. వీరత్వమూ, త్యాగమూ ట్రంప్‌కు ఏమాత్రం సరిపడని పదాలు. బలప్రయోగంతోనే శాంతి సాధ్యమన్నది ఆయన కుండే మూఢవిశ్వాసం. గత నెల జూన్ 17న కుదిరిన ఆ ఒప్పందం ఈ స్వల్పకాలం బతికివుందంటేనే ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే సంతకం చేసింది అమెరికానే అయినా, ఆ దేశాన్ని శాసించేది ఇజ్రాయెల్. ఆ రోజే శాపనార్థాలు పెట్టిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ... మధ్యమధ్యలో లెబనాన్‌పై ఏదో వంకన దాడులు సాగిస్తూనే వచ్చారు. నాటో శిఖరాగ్ర సదస్సుకు అంకారా వచ్చిన సందర్భంలో తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ ఇచ్చిన విందుకు హాజరై వెళ్లాక హఠాత్తుగా ట్రంప్ ఈ దాడుల ప్రకటన చేయగానే సభ్య దేశాలు నివ్వెరపోయాయి. హార్మూజ్ జలసంధిలో మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగానే ఇలా చేయాల్సివచ్చిందనీ, ముడి చమురు విక్రయించడానికి ఇరాన్కిచ్చిన లైసెన్సు రద్దయిందనీ ఆయన చెప్పాక పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందని అందరికీ అర్థమైంది. శాంతి కోసం నాటో దేశాలు చేసిందేమీ లేదు గానీ... అది కుదిరితే లబ్ధిపొందడానికి మాత్రం పాకులాడాయి. వేరే దేశాల పర్యటనల మధ్యన యుద్ధానికి దిగమని అధ్యక్షుడు ఆదేశించటం అరుదు. 2011లో బ్రెజిల్ పర్యటనలో ఉండగా అప్పటి అధ్యక్షుడు ఒబామా లిబియాపై దాడులకు ఆదేశించారు. ఆయుధాలపై నాటో దేశాలు ఖర్చుపెట్టాల్సిందేనని పట్టుబడుతున్న ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవటానికి అవి నానా తంటాలూ పడుతున్నాయి. అందులో సింహభాగం అమెరికన్ ఆయుధాలకే వెచ్చిస్తున్నామని చెబితే విని సంతోషపడతారని ఊహించాయి. కానీ ఇరాన్‌పై దాడులు మొదలైనాక సహకరించమని కోరితే జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ నిరాకరించాయన్న కోపం ఆయనకు పోలేదు. ఆ సంగతి ఎర్డోగాన్ చెవిన వేయడంతోపాటు, తుర్కియే కోసమే నాటోలో కొనసాగుతున్నామని కూడా చెప్పారు. కాసేపటికే తాజా దాడుల సంగతి ప్రకటించారు. అవగాహన ఒప్పందం వాలకం చూస్తేనే ఎవరికీ విశ్వాసం కలగలేదు. దానివల్ల ఒరిగిందల్లా హార్మూజ్‌లో నౌకలపై ఇరాన్ దాడులు నిలిపేయటం, ముడి చమురు అమ్ముకోవటానికి అమెరికా ఇరాన్‌ను అనుమతించటం. హార్మూజ్‌లో సుంకాల వసూలు, స్తంభించిన ఇరాన్ ఆస్తుల బదలాయింపు, ఇరాన్ అణు కార్యక్రమం నిలిపేయటం వంటివన్నీ తదుపరి చర్చలకు వాయిదాపడ్డాయి. ఇరాన్ బలంగా కోరుకునే అంశాలన్నీ ఎంఓయూలో ప్రస్తావనకు రాకపోవటంతో మొదట్లోనే చాలామంది పెదవి విరిచారు. ఈ యుద్ధంతో అన్ని దేశాలూ ఆర్థికంగా దెబ్బతిన్నాయి. తాజా దాడుల తర్వాత స్టాక్ మార్కెట్లు కళ్లు తేలేస్తున్నాయి. ముడిచమురు ధర 5 శాతం పెరిగింది. ఇరాన్ మత నాయకుడు ఖమేనీ అంత్యక్రియల పర్వం పూర్తయ్యేవరకూ కూడా ట్రంప్ ఆగలేక పోయారు. తన హామీని తానే ఉల్లంఘించారు. ఎన్నిసార్లు భంగపడుతున్నా ట్రంప్‌కు తత్వం బోధపడక పోవటం విచారకరం. అగ్రరాజ్యాధినేతగా బాధ్యతాయుత ప్రవర్తన అవసరమని ఆయన గ్రహించేదెన్నడో? -
మళ్లీ వరదకష్టాల్లో ముంబై
ఎప్పటి మాదిరే ముంబై మహానగరం భారీ వర్షాలతో తడిసి ముద్దయింది. గత ఆరు రోజుల కుంభవృష్టితో 13 మంది మరణించారు. జనావాసాలు వరద నీట మునగడం, చెట్లు కూలడం, రోడ్ల ఆచూకీ తెలియకుండా పోవటం, ట్రాఫిక్ పూర్తిగా స్తంభించి వాహనదారులు దిక్కుతోచని స్థితికి చేరటం, రైళ్లన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోవటం, విద్యాసంస్థలన్నీ మూతపడటం, పరీక్షలు వాయిదాలు పడటం... ఇవన్నీ దాదాపు ప్రతియేటా ముంబై ప్రజలకు రివాజుగా మారాయి. ఒక పిటిషన్ విచారణ సందర్భంగా మంగళవారం బృహన్ముంబై కార్పొరేషన్(బీఎంసీ)ని అనవసరంగా నిందించవద్దని బొంబాయి హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. భూదురాక్రమణలకు పాల్పడటం, పేవ్మెంట్లు ఆక్రమించటం, చెత్తను ఎక్కడికక్కడ మురికి కాల్వల్లోకి తోసేయటం వంటి ధోరణులే సమస్యల్ని సృష్టిస్తున్నాయని తెలిపింది. అది నిజమే కావొచ్చుగానీ... అలాంటి ధోరణులను అరికట్టే బాధ్యత కూడా బీఎంసీదే. ఆ విషయంలో అది విఫలం కావటంవల్లనే ప్రతియేటా సమస్యలు తప్పడంలేదు. వానాకాలం వచ్చిందంటే ముంబైలో పెనుగాలులు, కుంభవృష్టి ఏకకాలంలో విరుచుకుపడుతుంటాయి. భౌగోళికంగా ముంబై ఉన్న స్థానం అటువంటిది గనుక ఇది అనివార్యమైన పరిస్థితి. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాల్సిందేమిటన్న అంశంపై సమగ్ర దృష్టి సారిస్తే పరిష్కారం లభించకపోదు. ప్రభుత్వాలు ఆ పని చేయవు. బీఎంసీ ఒత్తిడి తీసుకురాదు. ముంబై ఒకప్పుడు ఏడు దీవుల సమాహారం. వాటిమధ్య 1784 నుంచి 1845 వరకూ మట్టి నింపుతూ పోవటం వల్ల ఇప్పుడున్న భౌగోళిక రూపం వచ్చింది. సముద్ర మట్టానికి ఈ నగరం కేవలం 14 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కొన్నిచోట్ల ఒకటి, రెండు మీటర్లకు మించి లేదు. ముంబై వరదనీటì కోసం నాలుగు నదులున్నాయి. నాలాలున్నాయి. వీటి ద్వారా నీరంతా సముద్రంలో కలుస్తుంది. కానీ వర్షాల తీవ్రత వుండి, సముద్రపు పోటు అధికంగా ఉంటే ఇవి అక్కరకు రావు. భూ మాఫియాల పుణ్యమా అని తీరాన ఉన్న మడ అడవులు, చిత్తడి నేలలు మాయమై రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారుతుంటే నిలువరించే వ్యవస్థలు లేవు. బ్రిటిష్ కాలంనాటి డ్రెయినేజీ వ్యవస్థ, కాంక్రీట్ నిర్మాణాలు, మరోపక్క వలసలు సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి.నీటితో కలిసి జీవించటం అలవాటు చేసుకుంటే, అందుకనుగుణమైన జీవన విధానం అలవరుచుకుంటే ఇంత చేటు సమస్య ఉండదు. టోక్యో నగరం ఇందుకు ఉదాహరణ. అక్కడ ప్రతియేటా తుపాన్లు తప్పవు. పర్యవసానంగా వరదనీరు ముంచె త్తుతుంది. దీన్ని అధిగమించటం కోసం 2006లో ప్రపంచంలోనే అతి పెద్ద భూగర్భ వరద నీటి మళ్లింపు వ్యవస్థను నిర్మించింది. నగరం కింద 50 మీటర్ల లోతులో 6.3 కిలోమీటర్ల పొడవునా భారీ టన్నెళ్లు ఏర్పరిచారు. భారీ వరద నీరు ముంచెత్తినప్పుడు అదంతా ఆ టన్నెళ్లకూ, అక్కడినుంచి అయిదు అతి పెద్ద బావుల్లోకీ... వాటినుంచి భారీ భూగర్భ ట్యాంకుల్లోకీ పోతుంది. అక్కడినుంచి శక్తిమంతమైన జెట్ ఇంజన్ పైపులతో ఆ నీటిని తోడి నగరం ఆవలి భాగంలోని ఎడొగావా నదిలోకి పంపుతారు. చైనాలోనూ స్పాంజ్ సిటీల పేరుతో నీటిని ఎప్పటికప్పుడు భూమిలోకి పంపే రంధ్రాలున్న రోడ్లు నిర్మించారు. నగరాల చుట్టూ కృత్రిమంగా చిత్తడి నేలలు ఏర్పరిచారు. ఇవన్నీ వర్షపు నీటిని పీల్చుకుని భూగర్భ జలాలుగా మారుస్తాయి. సాధారణ రోజుల్లో పిల్లలకు ఆట స్థలాలుగా, భారీ వర్షాల సమయంలో తాత్కాలిక చెరువులుగా మారే వాటర్ స్క్వేర్లు నిర్మించి రోటర్డ్యామ్ నగరాన్ని నెదర్లాండ్స్ ప్రభుత్వం కాపాడుకుంది. ముంబై నగరాన్ని ప్రకృతి దయాదాక్షిణ్యాలకు వదిలిపెట్టడం కాక, అందుబాటులోని సాంకేతికతల సాయంతో తగిన ప్రణాళికలు రచించుకుంటే అక్కడి ప్రజలకు ప్రతియేటా ఈ తిప్పలు తప్పుతాయి. మాఫియాలను నియంత్రించటం, మౌలిక సదుపాయాలు... ముఖ్యంగా రవాణాను మెరుగుపరచటం వంటివి చేస్తే నగరం కిక్కిరిసిపోయే పరిస్థితిని నివారించవచ్చు. బ్రిడ్జిల నిర్మాణం, రోడ్ల వెడల్పు పేరుతో భారీ ప్రాజెక్టులు చేపట్టి అవి ఏళ్లతరబడి కొనసాగించటంవల్ల జనజీవనం స్తంభించిపోతోంది. వర్షాకాలం ఇదంతా అనేక రెట్లు పెరుగుతోంది. ఇప్పటికైనా మహారాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలి. -
బరితెగించిన బాబు సర్కార్
తన రాజకీయ జీవితంలో ఏనాడూ సవ్యంగా అధికారంలోకి రావటం అలవాటు లేనట్టే... అందలం ఎక్కినప్పుడల్లా సాధారణ పౌరులకు ఆటవిక పాలన రుచిచూపించే ఆనవాయితీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది.‘హే రామ్... సేవ్ ఆంధ్రప్రదేశ్’ అంటూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్టు బాబు దుష్ట పోకడలకు అద్దం పట్టింది. గూండాలకూ, రౌడీలకూ పార్టీ ముద్రేసి మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేయించటం, చివరకు బాధితుల్నే అరెస్టు చేయటం ఏపీలో మాత్రమే కనబడే వింత పోకడ. అలాగే, నిలదీస్తున్నవారిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు పెట్టడం, బెయిలొచ్చినపక్షంలో మళ్లీ మళ్లీ అరెస్టు చేయటం రివాజుగా మారిన తంతు. ఈమధ్య ఏకంగా పోలీసులే యమ కింకరుల పాత్ర పోషిస్తున్నారు. చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీస్తున్నారు. బూడిద కూడా మిగలకుండా చేస్తున్నారు. ముగ్గురు మహిళల అనుమానాస్పద మరణాలు, ఒక దళిత యువకుడి ఆత్మహత్య ప్రజల్ని నివ్వెరపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ ఈ పోస్టు పెట్టారు. ‘ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి పోలీస్ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణి వైపు నడిపిస్తున్నారు. మీ పాలనలో పుట్టుకొచ్చిన దుష్ట సంప్రదాయాలతో రాష్ట్రంలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారు. అవి మొక్కలై విష వృక్షాలుగా మారుతున్నాయి’ అంటూ జగన్ చేసిన నిశిత విమర్శ చాలా కీలకమైనది. ఇది చంద్రబాబు పాలన తాలూకు డీఎన్ఏ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయనది ఇదే మార్కు ఏలుబడి. ఆ కాలంలో లాకప్ డెత్‌లు, ఎన్‌కౌంటర్లతోపాటు నయీంవంటి వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచిన ప్రైవేటు ముఠాలు పాల్పడిన హింసాత్మక ఉదంతాలకు అంతులేదు. వీటన్నిటి వెనకా చంద్రబాబు సర్కారు ప్రమేయం ఉందన్న ఆగ్రహానికితోడు... పలు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుకు తెగనమ్మడం, కరవుతో బక్కచిక్కిన రైతుల్ని పీడించుకు తినటంవంటి కారణాలతో 2004లో ప్రజలు ఆయన్ను చిత్తుగా ఓడించారు. అలిపిరిలో నక్సలైట్ల దాడిలో గాయపడి, ఆ కట్టుతోనే ఎన్నికల ప్రచారసభల్లో తిరిగినా ఆయనకు సానుభూతి దక్కలేదు. తన నిజస్వరూపం తెలియని ఈ తరానికి తానేమిటో ఇప్పుడు ఆయనే చెప్పక చెబుతున్నారు. గతానికి మించిన అరాచకాన్ని పెంచి పోషిస్తున్నారు. ఎంతో హేతుబద్ధంగా ప్రశ్నించే ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియోలు సైతం సహించలేని దుఃస్థితికి కూటమి సర్కారు చేరుకుంది. ఉస్మానియా యూనివర్సిటీనుంచి గోల్డ్‌మెడల్ అందుకున్న జర్నలిస్టు కేవీఆర్ అనని మాటల్ని అన్నట్టుగా చిత్రించి, ఆ నెపంతో హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఆయన ఇంటిపైబడి అరెస్టు చేశారు. వచ్చినవారు పోలీసులో,గూండాలో తెలియక ఆందోళనపడిన ఆయన భార్యను నెట్టేశారు. అసభ్యంగా ప్రవర్తించారు. ప్రశ్న రావణ్‌ని సైతం ఈ మాదిరిగానే అరెస్టు చేసి తీసుకెళ్లారు. వరసబెట్టి నాలుగు చోట్లా బెయిల్ రావటంతో దిక్కుతోచని కూటమి సర్కారు, ఏకంగా ఉపా చట్టాన్ని ప్రయోగించింది. పోలీస్స్టేషన్లపై జనసేన పేరిట గూండాలు దాడిచేయటం మరో ప్రహసనం.సరిగ్గా రెణ్ణెల్ల క్రితం విజయవాడ పోలీసులు అరెస్టుచేసి, మాయం చేసిన సాయికృష్ణ కేసులో సర్కారీ పోకడలు మానవతకే మాయని మచ్చ. ఆ యువకుణ్ణి మే 6న అరెస్టు చేశాక అతని తల్లి పోలీసు ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతూనేవున్నా ఒక్కరంటే ఒక్కరు పట్టించుకోలేదు. కనీసం బూడిద ఇస్తే అంతిమసంస్కారం చేసుకుంటామని ఆ తల్లి కన్నీరుమున్నీరవుతున్నా అది అరణ్యరోదనే అయింది. పోలీస్‌స్టేషన్ డాబాపై ఎముకలు, బూడిద దొరికాయని హైకోర్టుకే కట్టుకథలు చెబుతున్నారు. సాయికృష్ణ తల్లి డీఎన్ఏతో పోల్చిచూడకుండానే ఇంత బాధ్యతారహితంగా చెప్పడం ఆశ్చర్యకరం. అతని హత్య మాత్రమే కాదు... దళిత యువకుడు క్రాంతికుమార్ ఆత్మహత్యతోపాటు మే, జూన్ నెలల్లో గంగమ్మ, తిరుపతమ్మల లాకప్ డెత్, మరో మహిళ కళావతి ఆత్మహత్య ప్రజానీకాన్ని దిగ్భ్రాంతిపరిచాయి. రాష్ట్రంలో చట్టం చట్టుబండలైన తీరుపైనా, ఈ హత్యోదంతాలపైనా సీబీఐ దర్యాప్తే సరైంది. ఈ విషయంలో న్యాయస్థానాల్లోనూ, వెలుపలా పోరాడితే తప్ప న్యాయం దక్కదు. -
వాట్సప్ జానపదం
‘తోడేలు వచ్చింది’ అని అరిచిన కుర్రాడి కథ మనకు తెలుసు. ఆ అబద్ధం మొదటిసారి ఊరిని నవ్వించింది. రెండోసారి ఊరికి అలవాటు అయ్యింది. మూడోసారి నిజంగానే తోడేలు వచ్చినప్పుడు ఊరు నిద్రపోయింది. గొర్రెలు పోయాయి. కుర్రాడి మాటకు శాశ్వతంగా విలువ పోయింది. అది జానపదం మనకు నేర్పిన మొదటి పాఠం. అబద్ధానికి కాళ్లు ఉండవు. ఉన్నా ఎక్కువ దూరం నడవవు. కానీ, ఈరోజు ఆ కుర్రాడు మనలోని ప్రతిఒక్కరి జేబులో ఉన్నాడు. ప్రతి గ్రూపులో ఉన్నాడు. ప్రతి ఫార్వర్డ్‌లో ఉన్నాడు. వాట్సాప్ ఇప్పుడు కొత్త జానపద వేదిక అయింది. కానీ ఇక్కడున్నది అమ్మమ్మ చెప్పిన కమ్మని కథ కాదు. ఇది భయం కథ, ద్వేషం కథ, అనుమానం కథ. చదివిన వెంటనే గుండె కొట్టుకునేలా చేసి చివర్లో ‘పదిమందికి పంపు’ అని ఆజ్ఞాపించే బెదిరింపు కథ. ఇది జానపదం కాదు, అబద్ధాల జానపదం.మనం సులభాన్ని ఎంచుకున్నాం. ఫలితంగా మన మెదడు అనే కండరం క్షీణించి పోతోంది. ఏది పడితే అది నమ్మే బలహీనమైన మనస్తత్త్వంగా కుంగిపోతోంది. అబద్ధాలతో భయపడేవాడు ప్రశ్నించడు. ప్రశ్నించనివాడు బానిస అవుతాడు. ఒకప్పటి జానపదం ‘భయపడకు... చివరికి మంచే గెలుస్తుంది’ అని ధైర్యం చెప్పేది. ఈ కొత్త జానపదం ‘భయపడు... నువ్వు ఒంటరివి’ అని విషం ఎక్కిస్తోంది. దీంతోపాటు డిజిటల్ ప్రపంచంలో గుర్తింపు కోసం ఆరాటపడే మానసిక పేదల బెడద ఒకటి. నిజజీవితంలో కనీసం మాట విననివాడు గ్రూపులో అడ్మిన్ కావాలని చూస్తున్నాడు. ‘నేను అందరికంటే ముందు పంపాను’ అనే చిన్న కామెంట్ కోసం ఆత్మను తాకట్టు పెడుతున్నాడు. ఇక్కడ సత్యం కంటే స్పందన (రియాక్షన్) ముఖ్యం అయింది. ఒక అబద్ధం పదివేల లైక్స్ తెస్తే ఒక నిజం పది లైక్స్‌కు కూడా నోచుకోవడం లేదు. మనం సంఖ్యలకు అలవాటు పడ్డాం. ఆత్మగౌరవాన్ని సోషల్ మీడియా మెట్రిక్స్‌కు అమ్మేశాం.‘అబద్ధాలకోరుకు శిక్ష ఏమిటంటే అతను నిజం చెప్పినా ఎవరూ నమ్మరు’ అని ఆఫ్రికా సామెత. ఒకసారి నమ్మకం పోతే మళ్లీ తిరిగిరాదు. అదే పడాల్సిన శిక్ష. కానీ శిక్ష అక్కడితో ఆగడం లేదు. ఈ అబద్ధాల జానపదంలో నిత్యమునకలు వేసేవాడి మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటోంది. మొదట అనుమానం... తర్వాత కోపం... ఆ తర్వాత వాస్తవానికి క్రమంగా దూరమవుతాడు. ఆపై డాక్టర్ చెప్పినా, సైన్ ్స నిరూపించినా ‘వాట్సాప్‌లో వేరేగా ఉంది’ అని వాదించే మొండితనం హెచ్చురిల్లుతుంది. రాత్రులు నిద్ర పట్టదు, ఎందుకంటే మెదడు ఎప్పుడూ అలర్ట్ మోడ్‌లోనే ఉంటుంది. ఆఖరిగా నైతికత మొద్దుబారుతుంది. ‘అందరూ పంపుతున్నారు కదా’ అనే సమాధానం లోపలి గిల్ట్‌ను చంపేస్తుంది.ఒకప్పటి జానపదం మనల్ని కలిపింది. ఒకే వెన్నెల్లో రాజు కొడుకు, రైతు కొడుకు కూర్చుని ఒకే కథ విన్నారు. ఒకే పాటకు కన్నీరు పెట్టుకున్నారు. అది సమానత్వ వేదిక. కానీ ఈ అబద్ధాల జానపదం మనల్ని చీలుస్తోంది. ఒకే ఇంట్లో తండ్రి ఒక గ్రూపు, కొడుకు ఒక గ్రూపుగా విడిపోతున్నారు. ఇద్దరూ వేర్వేరు అబద్ధాలు నమ్మి పరస్పరం శత్రువులు అవుతున్నారు. ఇంతకంటే పెద్ద మానసిక, సామాజిక పతనం ఇంకేముంటుంది? దీనికి పరిష్కారం వాట్సాప్‌ను పూర్తిగా చెరిపేయడం కాదు. మన వేలుకు మెదడును అతికించడం. ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయడానికి ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవడం. భయం పుట్టించే ప్రచారాలను అక్కడికక్కడే బ్లాక్ చేయడం. లోకంలోని మంచిని స్వయంగా జానపదం చేయడం. మనిషి ఉన్నంత కాలం కథ ఉంటుంది. కథ ఉన్నంత కాలం మనిషి బతుకుతాడు. రాయి నుండి తాళపత్రానికి, తాళపత్రం నుండి పుస్తకానికి, పుస్తకం నుండి స్క్రీన్ కు వచ్చినట్లే... ఇప్పుడు ఆ కథను స్క్రీన్ నుండి మళ్లీ మనిషి గుండెల్లోకి తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది. మనమే కొత్త కథకులం కావాలి. మానవీయ జానపదం రాయాలి. గుర్తుంచుకోండి, మీరు ఫార్వర్డ్ చేస్తున్నది కేవలం ఒక సందేశం కాదు. అది ఒక తరం మనసు, ఒక జాతి భవిష్యత్తు! బటన్ మీ చేతిలోనే ఉంది. కొత్త కథను మీరే రాయాలి! -
గేటెడ్ కమ్యూనిటీ... గ్రేటర్ రాజధాని!
ఇదొక సదవకాశం. మచిలీపట్నం టు గుంటూర్ వయా విజయవాడ క్లస్టర్‌ను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించాలనే ప్రతిపాదన ఇప్పుడు బలంగా ముందుకొస్తున్నది. ఆచరణాత్మ కమైన, వివేకవంతమైన ఈ ఆలోచనను విజ్ఞులైన ఆంధ్రప్రజలు ఎల్లెడలా సమర్థిస్తున్నారు. ఆంధ్ర సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఇది కీలకపాత్ర పోషించిన ప్రాంతం. జాతీయోద్యమం, సామ్య వాద–హేతువాదాలు, దళిత పోరాటాలకు నాయకత్వాలను సమకూర్చిన ప్రాంతం. తెలుగు సినిమా పరిశ్రమకు నారు పోసింది ఇక్కడే. రఘుపతి వెంకయ్య నాయుడు ఇక్కడివాడే. ఆంధ్రకళా వైభవానికి బుర్రకథతో తిలకం దిద్దిన నాజర్ కూడా ఇక్కడి బిడ్డే.రియల్ ఎస్టేట్ వ్యాపారులు రకరకాల సెంటిమెంట్లను కొనుగోలుదార్లపై ప్రయోగించడం కొత్త విషయం కాదు. అదే పద్ధతిలో అమరావతి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్‌ను యథేచ్ఛగా నిర్వహించుకోవడానికి వీలుగా, దాని చుట్టూ ఒక బలమైన సెంటిమెంట్‌ను ఉత్పత్తి చేయడానికి చంద్రబాబు అండ్ కో గత పదేళ్లుగా శ్రమిస్తున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్’ ప్రాంతంపై అల్లుకున్న భావోద్వేగాలతో పోలిస్తే సోకాల్డ్ అమరావతి సెంటిమెంట్ సముద్రంలో కాకి రెట్టతో సమానం.సెంటిమెంట్ సంగతి వదిలేసి ఆచరణీయత కోణంలో ఆలోచించినా, అమరావతి ప్రాజెక్టు భవిష్యత్తులో ఒక గుది బండగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమరావతి వెంచర్లో కళ్లు చెదిరే లాభాలను ప్రమోటర్లు పిండుకునే అవకాశాలున్నందువల్లనే హితోక్తులను బాబు సర్కారు చెవికెక్కించుకోవడం లేదనేందుకు ఆధారాలున్నాయి. సొంత లాభం కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పులిస్వారీ చేయి స్తున్నారని అమరావతి ప్రమోటర్లపై విమర్శలున్నాయి. మాన్యు మెంటల్ అవినీతికి అమరావతి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ప్రతిపక్షం చాలారోజుల నుంచి ఆరోపిస్తున్నది. ఈ ఆరోపణ నిర్హేతుకమేమీ కాదు.రాష్ట్ర విభజన తర్వాత అవశేషాంధ్రప్రదేశ్కు రాజధానిని సూచించడానికి శివరామకృష్ణన్ కమిషన్‌ను కేంద్రం నియమించింది. వివిధ రంగాల్లో నిష్ణాతులైనవారు సభ్యులుగా ఉన్న ఈ కమిషన్ సూచనలకు పూర్తి విరుద్ధంగా బాబు సర్కార్ నిర్ణయాలు తీసుకొన్నది. పంట భూముల్లో గ్రీన్‌ఫీల్డ్ నగర్ నిర్మాణం అవాంఛనీయమని చేసిన హెచ్చరికను ప్రభుత్వం ఖాతరు చేయలేదు.రాజధాని ప్రాంత ఎంపికలోనూ ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారనే విమర్శలు విస్తృతంగా వినిపించాయి. ముందుగా తన అనుయాయుల చేత భూములు కొనిపించి, ఆ తర్వాత తన పిలుపు మేరకు ల్యాండ్ పూలింగ్‌కు అప్పగించేలా చేశారు. తద్వారా మిగిలిన రైతులమీద ఒత్తిడి పెంచారు. పూలింగ్‌కు భూములు ఇస్తే బంగారంలాంటి నివాస–వాణిజ్య ప్లాట్లను అభివృద్ధి చేసి ఇస్తారని ఊదరగొట్టారు. ఈ మోసపూరితమైన ఎత్తుగడతో సాగిన సమీకరణను ముఖ్యమంత్రి తన వ్యక్తిగత ప్రతిష్ఠకు జోడించుకున్నారు.సింగపూర్ ప్రభుత్వ సహకారంతో సింగపూర్‌లాంటి నగరాన్ని నిర్మిస్తామని సింగపూర్ ప్రైవేట్ కంపెనీలను రంగంలోకి దించారు. తర్వాతి కాలంలో ఇక్కడ చంద్రబాబు అధికా రాన్ని కోల్పోయారు. అమరావతి వ్యవహారంలో ఆయనకు సహకరించిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అవినీతి ఆరోప ణలపై జైలుపాలయ్యారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అవినీతి ద్విగుణీకృతమైందని ప్రతిపక్షం ఆరోపిస్తున్నది. ప్రతిపక్షం సాక్ష్యాలను ముందు పెడుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన శూన్యం.ప్రభుత్వ భవనాల నిర్మాణ వ్యయాలు సగటున చదరపు అడుగుకు పదివేల రూపాయలట. సెక్రటేరియట్ కోసం కడు తున్న ఐకానిక్ భవనాలకైతే చదరపు అడుగు ఖర్చు 19 వేల పైచిలుకట. అదేచోట కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సిబ్బంది నివాస గృహాల నిర్మాణానికి కేంద్రం చేస్తున్న ఖర్చు సగటున నాలుగున్నర వేలు మాత్రమే. ఎందుకింత తేడా? ఈ లెక్కలు ముందుపెట్టి జగన్మోహన్రెడ్డి నిలదీస్తుంటే కూటమి మైకాసు రులు మైకంతో మాట్లాడుతున్నారు.జగన్ లేవనెత్తిన డజన్లకొద్దీ ప్రశ్నల్లో ఒక్కదానికీ ప్రభుత్వం నుంచి ఇంతవరకూ స్పష్టమైన సమాధానం రాలేదు. జగన్ అభివృద్ధికి అడ్డుపడుతున్నాడనే స్టీరియోఫోనిక్ ఎదురుదాడినే కూటమి ఆశ్రయిస్తున్నది. చదరపు అడుగుకు 19 వేల ఖర్చే మిటని జగన్ ప్రశ్నిస్తే, వైసీపీ గొడ్డలి పార్టీ అంటూ చంద్రబాబు బదులిస్తాడు. భూములిచ్చిన రైతులకు ఇంతవరకూ అభివృద్ధి చేసిన ప్లాట్లను ఎందుకీయలేదని జగన్ ప్రశ్నిస్తే జగన్ పాలనలో రాష్ట్రం నాశనమైపోయిందని చంద్రబాబు సమా ధానం చెబుతాడు. కూటమి నేతలు, కూటమి మీడియా అవే మాటలు వల్లిస్తారు. హైదరాబాద్ నగరంలో ఎకరం రెండొందల కోట్లపైగా ధర పలుకుతున్న ప్రాంతాల్లో కూడా రెసిడెన్షియల్ ఫ్లాట్ కొనుగోలుకు చదరపు అడుగుకు పది పదిహేను వేలు దాటడం లేదు. అమరావతిలో మాత్రం భూమి ఖర్చులేకుండా, ఇసుక ఫ్రీగా వచ్చినా చదరపు గజానికి 19 వేలు ఖర్చు చేయడ మేమిటి? ఎందుకింత ఖర్చవుతుందో లెక్కచెబుతూ ఎందుకు సమర్థించుకోలేకపోతున్నారు? అమరావతి వ్యథలో అవినీతి ఒక భాగమైతే అది సాధారణ ప్రజలకు అనుమతిలేని ఒక గేటెడ్ కమ్యూనిటీ కావడం మరో భాగం. పైగా దానికి ప్రజా రాజధాని అనే తోకను తగిలించడం పెద్ద జోక్.అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత తొలుత నాలుగేళ్లు, ఇప్పుడు రెండేళ్లు కలిపి ఆరేళ్లు కూటమి అధికారంలో ఉన్నది. తాత్కాలికంగా నిర్మించిన సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థల భవనాలు తప్ప అక్కడ ఇంకే నిర్మాణాలు పూర్తి కాలేదు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్నది కూడా ప్రభుత్వ భవనాలు, సిబ్బంది గృహ సముదాయాలు, ప్రైవేట్ విద్యాసంస్థల భవనాలు మాత్రమే. ఉపాధి కల్పించే కంపెనీలేవీ అక్కడికి రాలేదు. వచ్చే అవకాశం కూడా కన్పించడం లేదు. భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇప్పటికే అందించలేకపోయారు. కాగితాలపై వేసిన ప్లాట్లు కూడా చెరువుల్లో కుంటల్లో, కాలువల్లో, శ్మశానాల్లో వేశారట.నిర్మాణంలో ఉన్న భవనాలు పూర్తయినా కూడా,సాయంత్రం కాగానే నిర్మానుష్యమయ్యే మరో నయా రాయ్ పూర్ అవుతుంది తప్ప మరో విజయవాడో, గుంటూరో కాబోదు. సాధారణ మధ్యతరగతి ప్రజల నివాసానికి అవసర మయ్యే ఎకోసిస్టమ్ అందుబాటులో ఉండే ఈ నగరాలను,మంగళగిరి–తాడేపల్లిని దాటి అమరావతిలో అక్కడ పనిచేసే వాళ్లు కూడా నివసించడానికి మొగ్గు చూపకపోవచ్చు. ఇప్పటికే ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న 58 వేల ఎకరాలకు తోడు మరో లక్ష ఎకరాలు సమీకరిస్తే తప్ప అమరావతి మహానగరంగా మారడం కష్టమట!రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ అభివృద్ధి చేయడానికే ఎకరాకు 2 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం తన డీపీఆర్‌లో పేర్కొన్నది. ఈ లెక్కన 3 లక్షల కోట్లు ఈ ఏర్పాట్ల కోసమే ఖర్చు చేయాలి. ఇప్పటికే 47 వేల కోట్లు అప్పు చేశారు. 60 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు. నిర్మాణ పనుల కోసం వలస వచ్చిన కార్మికులు, అక్కడి పల్లెల్లో ఉన్న ప్రజలు తప్ప అక్కడెవరూ నివసించడం లేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒక గుదిబండగా మారబోతున్న ఈ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగానే జగన్మోహన్రెడ్డి తాజాగా మావిగన్ ప్రతిపాదన చేశారు.బంగారుగుడ్డు పెట్టే బాతును పాలకులు వదులుకుంటారా? అందుకే ఎదురు దాడికీ, అసత్యాల ప్రచారానికీ పూనుకున్నారు. అమరావతి పేరు మీద చేస్తున్న ఖర్చులో పదిశాతం ఖర్చు చేస్తే చాలు, తక్షణమే ఒక మహానగరం రాజధానిగా అందు బాటులోకి వస్తుంది. ఇందులో అమరావతి గేటెడ్ కమ్యూనిటీ కూడా భాగం కావచ్చు. సాధారణ ప్రజలకు ఎటూ అక్కడ ప్రవేశం లేనందున జూబ్లీహిల్స్‌లాంటి సంపన్న ప్రాంతంగా అమరావతి ఆవిర్భవించవచ్చు. జగన్ ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన మచిలీపట్నం రేవు పనులు త్వరలో పూర్తవుతాయి. పోర్టుతో పాటు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం, విజయ వాడ–గుంటూరు రైల్వేజంక్షన్లు రాజధాని నగరంలో భాగమ వుతాయి. విశాఖకు తోడుగా మరో గ్రోత్ ఇంజిన్‌గా మావిగన్ అందుబాటులోకి వస్తుంది.మచిలీపట్నం రేవుకు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్నది. శాతవాహనుల కాలం నుంచే ఇక్కడినుంచి వర్తకం జరిగింది. గోల్కొండ నవాబుల కాలంలో ఇక్కడినుంచి వజ్రాలను, వస్త్రాలను ఎగుమతి చేసేవారట. హైదరాబాద్ నుంచి సూర్యా పేట, విజయవాడ మీదుగా మచిలీపట్నానికి ఆ రోజుల్లోనే రహదారిని నిర్మించారు. నాలుగొందల ఏళ్ల కిందనే ఇక్కడ డచ్చివారు వాణిజ్య కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈస్టిండియా కంపెనీ భారత్‌లో తొలి అడుగేసింది మచిలీపట్నంలోనే. మచిలీపట్నం, గుంటూరు పట్టణాల్లో స్వాతంత్య్రానికి వందేళ్ల పూర్వమే కాలేజీలు ఏర్పడ్డాయి. కృష్ణా బ్యారేజీ నిర్మాణం తర్వాత గొప్ప వ్యావసాయిక వాణిజ్య కేంద్రంగా గుంటూరు ఎదిగింది. దానికి తోడు అది ప్రఖ్యాత విద్యా కేంద్రం కూడా.దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ సెంటర్లలో విజయవాడ ప్రముఖమైనది. సినీరంగ పరిశ్రమకు చాలాకాలం పాటు అది జీవనాడిగా పనిచేసింది. రాజకీయ కార్యకలాపాలకూ, పత్రికా రంగానికీ ప్రధాన కేంద్రంగా ఉంటూ చాలాకాలం పాటు మరో రాజధానిగా ఖ్యాతిగాంచిన నగరం విజయవాడ. ఇక్కడ 1924లో జరిగిన ఏఐసీసీ సమావేశంలోనే పింగళి వెంకయ్య త్రివర్ణ జాతీయ పతాకం డిజైన్‌ను మహాత్మాగాంధీకి సమర్పించారు. ఈ ప్రాంతంవాడైన కొండా వెంకటప్పయ్య అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగా పనిచేశారు.కృష్ణా పత్రికను స్థాపించిన ముట్నూరి కృష్ణారావు, ఆంధ్ర పత్రికను స్థాపించిన కాశీనాథుని నాగేశ్వరరావు మావిగన్ ప్రాంతంవారే. స్వాతంత్రోద్యమానికి ఆంధ్రప్రాంతాన్ని సమాయత్తం చేసిన పత్రికలవి. గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్న కాసు బ్రహ్మానందరెడ్డి, ఎన్టీ రామారావు, భవనం వెంకట్రామ్ ఏపీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అయ్యదేవర కాళేశ్వరరావు గ్రంథాలయోద్యమాన్ని ప్రారంభించింది విజయవాడలోనే. అంటరానితనానికి వ్యతి రేకంగా హరిజనోద్యమం కూడా ఇక్కడ ప్రారంభమైంది. చరిత్ర ప్రసిద్ధి చెందిన ‘మాలపల్లి’ నవలా రచయిత ఉన్నవ లక్ష్మీ నారాయణ ఇక్కడి వ్యక్తే.దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చల పల్లి సుందరయ్య నెల్లూరు జిల్లాలో పుట్టినప్పటికీ ఆయన గన్నవరం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యేవారు. చండ్ర రాజేశ్వర రావు, కొండపల్లి సీతారామయ్య వంటి కమ్యూనిస్టు దిగ్గజాలకు జన్మనిచ్చింది కూడా ఈ ప్రాంతమే. హేతువాద ఉద్యమంతో ప్రజల్లో చైతన్యం నింపిన త్రిపురనేని రామస్వామి చౌదరి, రైతుబాంధవుడిగా పేరుగాంచిన ఆచార్య ఎన్జీ రంగా జన్మ స్థానం, ప్రధాన కార్యక్షేత్రం కూడా ఇదే. గత వైభవాన్ని తలపోస్తూ, సాంస్కృతిక పునరుజ్జీవానికి పిలుపునిస్తూ గేయాలు, కవితలు రాసిన కవులెందరో ఇక్కడు న్నారు. ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా’ అని పిలుపునిచ్చిన వేములపల్లి శ్రీకృష్ణ, ‘‘నట్టనడి సంద్రాన నావ నిలుచున్నాది. చుక్కాని పట్టరా తెలుగోడా, నావ దరిజేర్చరా మొనగాడా’’ అనే సందేశాన్నిచ్చారు. శ్రీకృష్ణ మూడుసార్లు మంగళగిరి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ‘కనిపింపదే నేడు కాకతీయ ప్రాజ్య సామ్రాజ్య జాతీయ జయపతాక’ అంటూ ఆవేదన వ్యక్తం చేసిన గుంటూరు కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి ‘‘చెక్కు చెదరని యేనాడు మొక్కవోని ఆంధ్ర పౌరుషమిప్పుడధ్వన్నమాయె, తిరిగి వెనుకకు మరలిచూసి దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి’’ అని వేడుకున్నారు. అమరావతి గేటెడ్ కమ్యూనిటీ కోసం కృత్రిమ సెంటిమెంట్ ప్రచారం చేస్తున్న కూటమికి మావిగన్ సెంటిమెంట్‌తో పోలికా? ఆ సెంటిమెంట్‌ను విస్తరించి చెప్పా లంటే మహాగ్రంథమవుతుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
జపాన్‌తో ‘మిత్రలాభం’
శిఖరాగ్ర సమావేశాలకు దౌత్యంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. రెండు దేశాల మధ్య ఆ స్థాయి సమావేశం జరిగిందంటే ఆ దేశాల అధినేతలు నేరుగా మాట్లాడుకుని, సంక్లిష్ట సమస్యల పరిష్కార సాధనకు కృషి చేస్తున్నారనీ, ఈ క్రమంలో ఎంతో జాప్యం చోటు చేసుకునే అధికారస్వామ్య ప్రమేయాన్ని అధిగమించదల్చుకున్నారనీ అర్థం. జపాన్ ప్రధాని సనే తకాయిచి మన దేశంలో మూడు రోజులు పర్యటించి శుక్రవారం వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీతో శిఖరాగ్ర సమావేశం జరిపారు. ఈ పర్యటనలో కృత్రిమ మేధ(ఏఐ), ఇంధనం, రక్షణరంగం, ఖనిజాల వెలికితీత తదితర రంగాల్లో 17 ఒప్పందాలు కుదిరాయి. ఇందులో రక్షణ సాంకేతికతల్లో అత్యంతాధునికమైన ‘యూనికార్న్’ ప్రాజెక్టు ఒప్పందం అన్నివిధాలా ప్రత్యేకమైనది. యుద్ధ నౌకలపై వేర్వేరు అవసరాల కోసం వినియోగించే ఉపగ్రహ కమ్యూనికేషన్, రాడార్, నావిగేషన్, రేడియో కమ్యూని కేషన్ వంటి పనుల కోసం విడివిడిగా యాంటెన్నాలుంటాయి. యుద్ధసమయాల్లో ఇవి చిక్కులు తెస్తాయి. శత్రువుల రాడార్లకు సులభంగా దొరికిపోతాయి. యూనికార్న్ సాంకే తికతలో ఈ యాంటెన్నాలన్నీ ఒకే ఒకదాన్లో ఒదిగిపోతాయి. శత్రు నౌకలకు చిక్కకుండా, వాటి ఆనుపానుల్ని తెలుసుకోవటంలో దీని పని తీరు అద్భుతం. వచ్చిపడే క్షిపణుల్ని చాలా ముందే పసిగట్టడం, ఎదురుదాడికి అవకాశం ఇవ్వటం దీని ప్రత్యేకత. ఈ యూనికార్న్ మాస్ట్‌లను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ద్వారా దేశీయంగా తయారు చేసేందుకు జపాన్ సంసిద్ధత తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం రక్షణ ఎగుమతుల జోలికి పోవద్దని జపాన్ తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవలే తకాయిచీ సడలించారు.అమెరికా విధిస్తున్న అడ్డగోలు సుంకాలు, పశ్చిమాసియాలో ఏర్పడిన అనిశ్చితిరెండు దేశాలనూ సమంగా పీడిస్తున్నాయి. ఈ దశలో పరస్పర సహకారం మరింతగా పెరిగితే ఈ పరిస్థితిని అధిగమించవచ్చునన్న అభిప్రాయం రెండు దేశాలకూ ఉంది. జపాన్‌తో మన సంబంధాలు విలక్షణమైనవి. రెండు దేశాల సంబంధాలను అభివర్ణించ టానికి దౌత్యంలో కొన్ని విశేషణాలుంటాయి. సహజమైన, ప్రత్యేకమైన, విశ్వసనీయ మైన, అనివార్యమైన... వంటివి అందులో కొన్ని. జపాన్‌తో మన సంబంధాల స్థాయిని తెలియజేయటానికి చాలామంది దౌత్యనిపుణులు వీటిని ఉపయోగిస్తారు.కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నం. ఎంత మెరుగైన సంబంధాలున్నా అవి ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందాన ఉన్నాయి. ఇరుదేశాలమధ్యా సుహృద్భావం ఉంది. వేరే దేశాలతో ఏర్పర్చుకునే సంబంధాలకుండే రాజకీయ పరిమితులు కూడా ఇక్కడ లేవు. చైనాతో ఇరు దేశాలకూ ఉండే సమస్యలవల్ల వాటి మధ్య సాన్నిహిత్యానికి అవకాశాలెక్కువ. కానీ ఆసంబంధాలు తగినంతగా ఎదగలేదు. ఇరు దేశాలమధ్యా వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడి చాన్నాళ్లవుతున్నా వ్యాపార సంబంధాలు అంతంతమాత్రం. ద్వైపాక్షిక వాణిజ్యం 2,748 కోట్ల డాలర్లున్నా అందులో మన ఎగుమతుల విలువ కేవలం 600 కోట్ల డాలర్లు. మిగిలిందంతా జపాన్ నుంచి మనకొచ్చే దిగుమతుల వాటాయే. మన దేశానికి 1991 వరకూ జపాన్ అధికారిక అభివృద్ధి సాయం(ఓడీఏ) కింద ఆర్థిక సాయం అందించేది. ఢిల్లీ మెట్రో, ఈశాన్య రాష్ట్రాల సరుకు రవాణా కారిడార్ వంటి మౌలిక సదుపాయాల్లో జపాన్ ముద్ర ఉంది. కానీ పెట్టుబడులు పెట్టడంలో, వాణిజ్య విస్తరణ అంతంతమాత్రం. మన దేశంలో జపాన్ పెట్టుబడులు 4,000 కోట్ల డాలర్లు. కానీ తరచు లడాయివుండే చైనాలో దాని పెట్టుబడులు 13,000 కోట్ల డాలర్ల పైమాటే. చిన్న దేశం వియత్నాంలో కూడా జపాన్ 8,000 కోట్ల డాలర్ల మదుపు పెట్టింది. మన దేశంలో పనిచేస్తున్న జపాన్ సంస్థలు 1,400 మించవు. ఇందుకుభిన్నంగా థాయ్‌లాండ్‌లో జపాన్ సంస్థల సంఖ్య 6,000. మన మొత్తం వ్యాపార కార్యకలాపాల్లో జపాన్ కంపెనీల వాటా ఒక శాతం. అందులో కూడా ఆటోమొబైల్ వాటాయే అధికం. మన జనరిక్ మందులపై జపాన్‌లో అనేక రకాల ఆంక్షలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మన ఫార్మా రంగం ఎన్నో విజయాలు సాధిస్తున్నా అక్కడ సమస్యలు తప్పడం లేదు. ఇలాంటి అవరోధాలు అధిగమించగలిగితే ఇరు దేశాల సంబంధాలూ మరింత మెరుగైన స్థాయికి చేర తాయి. తకాయిచీ పర్యటన ఆ దిశగా మంచి ముందడు గని చెప్పుకోవచ్చు. -
ప్రపంచ శక్తిగా 'యువ భారత్'
ప్రపంచ దేశాల్లో పెరిగిన ఇండియా ప్రాధాన్యం, చైనా ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, ప్రపంచవ్యాప్త జననాల రేటు క్షీణత వంటి కీలక అంశాలను ప్రముఖ ఆర్థికవేత్త టేలర్ కోవెన్ ఈ పాడ్‌కాస్ట్‌లో చర్చించారు. సాంకేతిక రంగంలో ఏఐ అభివృద్ధి వేగానికీ– మానవ వ్యవస్థల నెమ్మదితనానికీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని విశ్లేషించారు:సవాళ్లున్నా అవకాశాలు ఎన్నో!ఇండియా ప్రాథమికంగా లాభదాయకమైన స్థితిలో ఉంది. చైనా కోల్పోతున్న యువ జనాభా బలాన్ని ఇండియా కలిగి ఉంది. ఎంతో నైపుణ్యం ఉండి, ఇంగ్లి ష్లో మాట్లాడగలిగే సాంకేతిక రంగానికి చెందిన భారతీ యులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. చైనాకు వ్యతిరేకంగా ఒక దృఢమైన శక్తిగా ఇండియా విజయం సాధించాలని అమెరికా, దాని మిత్రదేశాలు గట్టిగా కోరు కుంటున్నాయి. అయితే, మౌలిక సదుపాయాల కొరత, ప్రభుత్వ నిబంధనల వల్ల జరుగుతున్న జాప్యం, వందల కోట్ల మంది ప్రజలకు నాణ్యమైన ఉపాధిని కల్పించడం వంటి పెద్ద అంతర్గత సవాళ్లను భారతదేశం ఇంకా ఎదుర్కొంటూనే ఉంది.వృద్ధాప్య సంక్షోభంలో ‘డ్రాగన్’నేను చైనా వైపు చూసినప్పుడు, ఒకప్పుడు అద్భుతమైన వృద్ధిని సాధించి, ప్రస్తుతం అలవిమాలిన నిర్మాణాత్మక సమస్యలను ఎదుర్కొంటున్న దేశం నాకు కనిపిస్తుంది. వారి భారీ రియల్ ఎస్టేట్ మార్కెట్ సంక్షోభం, వేగంగా వృద్ధాప్యానికి చేరుకుంటున్న జనాభా, తీవ్రమైన రాజ కీయ కేంద్రీకరణల వల్ల వారు ఇకపై ఎవరూ ఆపలేనంత వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగే పరిస్థితి లేదు. చైనా ప్రపంచ వ్యవస్థను శాసిస్తుందని అనేవారు ఉంటే ఉండొచ్చు. వాస్తవానికి చైనా తన ఆర్థిక ఒత్తిళ్లు, తగ్గిపోతున్న కార్మిక శక్తిని నెట్టుకురావటం అనే సమస్యలతో సతమతమవుతోంది. వారు ఒక బలమైన శక్తి అనడంలో సందేహం లేదు, కానీ వారిని ఎవరూ ఎదిరించలేనంత మహా బలవంతులుగా భావించాల్సిన అవసరమైతే లేదు.పిల్లలు వద్దనుకుంటున్నారు!విశ్వవ్యాప్తంగా జననాల రేటులో ఒక భారీ క్షీణతను మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇది కేవలం ఆర్థికపరమైన సమస్య మాత్రమే కాదు ఒక సాంస్కృతిక సమస్య కూడా. సమాజాలు మరింత సంపన్నంగా మారి, వ్యక్తు లకు మరింతగా వ్యక్తిగత స్వేచ్ఛ లభిస్తున్న కొద్దీ, పిల్ల లను కనడం వల్ల కోల్పోయే ఇతర అవకాశాలకు ప్రాధాన్యమివ్వటం అనేది విపరీతంగా పెరిగిపోతోంది. ఇది ‘ఎంపికల వల్ల వచ్చిన సంక్షోభం’. ఇది రాబోయే శతాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేయ బోతోంది.ఏఐ వేగాన్ని అందుకోలేకున్నాం!ప్రజలు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్.ఎల్.ఎం.)కు ఉన్న అద్భుతమైన తెలివితేటలను చూసి, మన జీవితా ల్లోని ప్రతిదీ రాత్రికి రాత్రే మారిపోతుందని అనుకుంటారు. కానీ వారు మర్చిపోతున్న విషయం ఏంటంటే, ఏఐ ఇంకా మన ప్రస్తుత ప్రపంచంలోని భౌతిక, ప్రభుత్వ నిబంధనల పరిమితుల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. ఒక వ్యాపార సంస్థ కొత్త ఏఐ పని విధా నాన్ని అమలు చేయాలనుకుంటే, వారు ఇప్పటికీ ప్రభుత్వ నిబంధనల అనుమతులు, పాత సాఫ్ట్వేర్ అప్ డేట్లు, సిబ్బంది అలసత్వం వంటి వాటిని దాటుకుని రావాల్సి ఉంటుంది.‘మనసున మనసై’తేనే విలువఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఎవరికైనా మేధోశక్తి ఉచితంగా, సులభంగా లభించే ఈ రోజుల్లో, సాధారణ ఐక్యూకి పూర్వపు గుర్తింపు, విలువ తగ్గిపోతాయి. సాంకేతిక రంగాలలో సగటు మానవుడి కంటే ఒక యంత్రం మెరుగ్గా ఆలోచించగలిగినప్పుడు, ఇక సమాజంలో అరుదైనదిగా ఏది మిగులుతుంది? నా దృష్టిలో దానికి సమాధానం ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, నమ్మశక్యత, విభిన్న విషయాలను సమన్వయం చేసే నైపుణ్యం, లోతైన మానవ సంబంధాలే. కంప్యూటర్ కోడింగ్ ద్వారా సృష్టించలేనివి లేదా స్క్రీన్ ద్వారా అనుకరించ లేనివి మాత్రమే భవిష్యత్తులో అత్యంత విలువైనవిగా మారుతాయి. - ఎడిటోరియల్ టీమ్ -
కొత్త అవతారంలో నరేగా!
ఎవరెన్ని అభ్యంతరాలు చెప్పినా నిరుడు డిసెంబర్లో పార్లమెంటు ఆమోదించిన వీబీ– జీ రాం జీ చట్టం బుధవారం నుంచి అమల్లోకొచ్చింది. ఇది రద్దయిన ఉపాధి హామీ పథకం (నరేగా)కు సరికొత్త అవతారం. గత పథకంలోని ‘హక్కుల ప్రాతిపదిక’ను మార్చొద్దనీ, రాష్ట్రాలపై ఆర్థిక భారం పడే విధానానికి స్వస్తిచెప్పి, గతంలో మాదిరే కేంద్రమే భరించాలని పౌరసమాజ కార్యకర్తలతోపాటు కొన్ని రాష్ట్రాలు కూడా కోరాయి. అయితే నరేగా కన్నా ఇదెన్నో రెట్లు మేలని కేంద్రం చెబుతోంది. గత పథకంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి వంద రోజుల పని దినాలకు అనుమతించగా, తాము మరో 25 రోజులు పెంచామని... కూలీల వేతనాలు పెరిగాయని, వారానికోసారి చెల్లింపులు, ఇతర సంస్కరణలు తీసుకురావటంతో అవినీతికి ఆస్కారం ఉండబోదని కేంద్రం చెబుతోంది. పాత పథకంలో ప్రతి 15 రోజులకొకసారి చెల్లించాలన్న నిబంధన ఉన్నా, బ్యాంకింగ్ సదుపాయాలు అంతంతమాత్రమే కావటంవల్ల నిరుపేద కుటుంబాలు నెలల తరబడి వేచిచూడాల్సివచ్చేది. ఈలోగా రోజులు గడవటానికి అధిక వడ్డీ రేట్లకు అప్పులు చేసే వారు. ఇప్పుడు వారానికొకసారి వేతనాలిస్తామంటున్నా ఈ లోటుపాట్లు సరిదిద్దకపోతే నిరుపయోగమే. గ్రామీణ కూలీలకు మరో 25 రోజులు పనిదొరకటం, అందువల్ల అదనపు ఆదాయం రావటం హర్షించదగ్గది. అయితే నరేగాకింద గ్రామాల్లో సంబంధిత పక్షాల సమావేశాల నిర్ణయాల ఆధారంగా చేయించాల్సిన పనులు ఖరారయ్యేవి. తాజా చట్టం ప్రకారం అలాంటి పనులేమిటో కేంద్రం ‘వాస్తవ ప్రమాణాల’ ఆధారంగా నిర్ణయిస్తుంది. దాని కయ్యే వ్యయాన్ని కూడా అంచనా వేస్తుంది. అందులో 40 శాతాన్ని రాష్ట్రం భరిస్తే, మిగి లిన 60 శాతం నిధులు కేంద్రంనుంచి వస్తాయి. చేయించాల్సిన పనులు, వాటి అంచనా వ్యయం ఆధారంగా వివిధ రాష్ట్రాలకు వేర్వేరు కేటాయింపులుంటాయి. కేంద్రం నిర్దేశించిన పనులకన్నా అధికంగా చేయించదల్చుకుంటే అందుకయ్యే మొత్తం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. పాత పథకంలో నిధుల దుర్వినియోగం మాట వాస్తవం. కనబడని మనుషుల పేర్లతో కైంకర్యం చేసిన ఉదంతాలు అనేకం బయటపడ్డాయి. అందుకే హిందీ రాష్ట్రాల్లో ‘పిశాచ లబ్ధిదారుల’న్న పేరు కూడా వచ్చింది. అయితే ఇప్పుడున్న సాంకేతికత అప్పుడు లేదు. మొత్తం కాగితాలపైనే వ్యవహారాలన్నీ నడిచేవి. ఆన్లైన్ వ్యవస్థలు, డిజిటల్ చెల్లింపులు వచ్చాక ఆ బెడద తగ్గింది. ‘నరేగా’ను అవినీతి పేరుతో కొట్టిపారేయటం సరికాదు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2006లో ప్రారంభమైన ఈ పథకం తొలి దశాబ్దకాలంలో దాదాపు కోటిన్నరమంది ప్రజలను దారిద్య్రంనుంచి విముక్తుల్ని చేసింది. ఇది చిన్న విషయమేం కాదు. అలాగే సగటున మహిళలకు 50 శాతం పనులు దక్కేవి. ఈ పథకంవల్ల సాగు పనులకు కూలీల కొరత వస్తున్నదన్న ఫిర్యాదులు ఉండేవి. కానీ జాతీయ గణాంకాలు మాత్రం సాగు పనులు ముమ్మరంగా ఉండే సమయంలో ‘నరేగా’కు డిమాండ్ తక్కువేనని చెబుతున్నాయి. కూలీలకు బేరమాడే శక్తి పెరిగిందనీ, వారి కూలీ రేట్లు పెరిగాయనీ అధ్యయనాలు సూచిస్తున్నాయి. కొత్త పథకంలో రాష్ట్రాలు కూడా వ్యయం భరించాల్సిరావటం ఒకరకంగా విషాదం. ‘నిధులు నిండుకుంటే హక్కులు నీరసిస్తాయ’ని ఆర్థికవేత్తలు చెబుతుంటారు. ఈ పథ కానికి కేటాయింపుల కోసం రాష్ట్రాలు ముందుగా సంక్షేమ పథకాలకే... మహిళా సంక్షేమా నికే కోత పెడతాయి. గతంలో నిధులు లేక కాదు... అమలుపై ఆసక్తి కొరవడి అత్యధిక పేదరికం ఉండే బిహార్, ఉత్తరప్రదేశ్‌లు అతి తక్కువ నిధులు వినియోగించాయని గణాంకాలు సూచిస్తున్నాయి. ఇప్పుడు నిధుల లేమితో చాలా రాష్ట్రాలు ఆ తోవన పోయినా ఆశ్చర్యం లేదు. మొన్న ఏప్రిల్ సమావేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, బిహార్‌లతోపాటు జార్ఖండ్, ఉత్తరాఖండ్, తెలంగాణలు నిధుల భారం మోపటాన్ని వ్యతి రేకించాయి. తాజాగా తమిళనాడు సీఎం విజయ్ కూడా గొంతుకలిపారు. ఆశ్చర్యకరంగా ఆంధ్రప్రదేశ్ మాత్రం నిమ్మకునీరెత్తినట్టు ఉండిపోయింది. ఎటూ సంక్షేమాన్ని అరకొరగా చేస్తున్నాం... దాన్ని మరింత కత్తిరిస్తే సరిపోతుందని సీఎం చంద్రబాబు నాయుడు అను కుంటున్నట్టున్నారు. ఏదేమైనా ఆచరణలో వచ్చే సమస్యల్ని అధ్యయనం చేశాకైనా వీబీ– జీ రాం జీ ని మెరుగుపరచటం మేలు. -
ట్రంప్‌కు మళ్లీ భంగపాటు
చరిత్ర తెలుసుకోకుండా, తన పరిమితులేమిటో గ్రహించకుండా ఎడాపెడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశ సుప్రీంకోర్టు నుంచి మరోసారి చుక్కెదురైంది. అమెరికా గడ్డపై జన్మించినంత మాత్రాన పౌరసత్వం ఇవ్వటం కుదరదంటూ నిరుడు జనవరిలో ట్రంప్ తీసుకొచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వును మంగళవారం కొట్టేస్తూ, 6–3 మెజారిటీతో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. తన ఉత్తర్వును ట్రంప్ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందుకే ఈ కేసు వాద ప్రతివాదాల సమయంలో స్వయంగా హాజరయ్యారు. ఒక అమెరికా అధ్యక్షుడు ఇలా రావటం ఇదే తొలిసారి. తమ తప్పుడు నిర్ణయాలవల్ల దేశంలో అస్తవ్యస్థ స్థితిగతులు ఏర్పడినప్పుడు జనం దృష్టి మళ్లించేందుకు లేదా మిన్ను విరిగి మీద పడే అతి గొప్ప చర్యలు తీసుకుంటున్న అభిప్రాయం వారిలో కలిగించేందుకు ఎక్కడైనా ఇలాగే వ్యవహరిస్తారు. అలాంటివారిలో అగ్రగణ్యుడు ట్రంప్. నిజానికి సుప్రీంకోర్టులో రిపబ్లికన్లవైపు మొగ్గుచూపే న్యాయమూర్తుల సంఖ్య అధికంగానే ఉంది. కనుకనే అధ్యక్షుడి కార్యనిర్వాహక అధికార పరిధిని దాటుతూ తీసుకుంటున్న పలు నిర్ణయాలకు అనుకూలంగా ఈ రెండేళ్లలోనూ తీర్పులు వెలువడ్డాయి. అయితే అనేక దేశాలపై అధిక సుంకాల విధింపు, ఇప్పుడు జన్మతః పౌరసత్వం అంశాల్లో మాత్రం ఆయన నిర్ణయాలతో సుప్రీంకోర్టు ఏకీభవించలేక పోయింది. ఇది భవిష్యత్తులో అనేకానేక సమస్యలకు దారి తీస్తుందని గ్రహించింది. ట్రంప్ రెండో ఏలుబడి మొదలయ్యాక న్యాయమూర్తులకు పనిభారం బాగా పెరిగింది. అందుకే హేతుబద్ధత లేకుండా, బహిరంగ విచారణైనా జరపకుండా వారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్న ఉదంతాలున్నాయి. అక్రమ వలసల పేరుచెప్పి జాతి, భాష వంటి కారణాలతో వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుని భయభ్రాంతులకు గురిచేస్తూ వందలమంది భద్రతా బలగాలు విరుచుకుపడటం, అరెస్టులు చేయటం వగైరాలను సుప్రీంకోర్టు నిర్మొహమాటంగా సమర్థించింది. ఆరోగ్య సంరక్షణ గ్రాంట్లపై కోత విధించటం, జాతి, లింగపరమైన మైనారిటీల విషయంలో తీసుకున్న నిర్ణయాలకూ న్యాయమూర్తులు మద్దతుపలకటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆసియాలో మనతో సహా పలు దేశాల్లోనూ... యూరప్, ఆఫ్రికా ఖండ దేశాల్లోనూ జన్మతః పౌరసత్వం ఇవ్వరు. అయితే అమెరికాలో కొన్ని చారిత్రక కారణాలవల్ల ఇందుకు సంబంధించి రాజ్యాంగంలో ఆర్టికల్ 14 పొందుపరిచారు. అమెరికా వలసవచ్చిన వారి తోనే నిర్మాణమైంది. అంతర్యుద్ధం ముగిసి, బానిసత్వం రద్దుకావటం వంటి పరిణామా లతో 1857లో నల్లజాతీయులు అమెరికా పౌరులు కాలేరంటూ సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. నల్లజాతీయుల్ని పీల్చిపిప్పిచేసి సంపద పెంచుకున్న అమెరికా ఇంత కృతఘ్న తతో ఉండటాన్ని ప్రశ్నిస్తూ ఆందోళనలు జరిగాక 1868లో ఈ 14వ రాజ్యాంగ సవరణ తెచ్చారు. నల్లజాతికి చెందిన మాజీ బానిసలు, వారికి పుట్టిన సంతానం దేశ పౌరులే అవుతారని ఈ సవరణ స్పష్టం చేసింది. చైనా వలస కుటుంబానికి ఇది వర్తించబోదని ప్రభుత్వం నిరాకరించినప్పుడు అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరూ ఇక్కడి పౌరులే అవుతారని 1898లో సుప్రీంకోర్టు తెలియజేసింది. ట్రంప్ ఉత్తర్వు ఏడాదిన్నరగా లక్షలాదిమందిని అనిశ్చితిలో పడేసింది. రెండేళ్ల క్రితం అమెరికా సెన్సెస్ బ్యూరో దేశంలో 52 లక్షలమంది భారతీయులున్నారని చెప్పింది. నిరుడు వెలువడిన లెక్క ప్రకారం హెచ్–1బీ వీసాలున్నవారిలో 71 శాతం మంది భారతీయులే. వీరందరికీ తాజా తీర్పు ఊరటనిస్తుంది. అయితే గ్రీన్‌కార్డుకు దరఖాస్తుచేసి ఎదురుచూస్తున్నవారికి ఈ తీర్పువల్ల ఉపశమనం దొరకదు. అక్కడ జన్మించినవారి పిల్లలు దేశ పౌరులుగా మారినా, తల్లిదండ్రులకు ఎదురుచూపులు తప్పవు. తమ వీసా దరఖాస్తుల్లో అబద్ధం చెప్పి దేశంలో ప్రవేశించినవారి ఆచూకీ తెలుసుకోవటం, వారిపై ప్రాసిక్యూషన్ చర్యలు ప్రారంభించటం తమ ప్రాధాన్యతంటూ అమెరికా న్యాయశాఖ చెప్పటం సహజంగానే గుబులు రేపుతోంది. తీర్పు వెలువడ్డాక కూడా కొత్తగా చట్టం తీసుకొస్తానంటూ ట్రంప్ చెప్పటం ఆయన మొండివైఖరికి నిదర్శనం. ఇప్పటికైనా వివేకంతో మెలగటం, అసలైన సమస్యలపై దృష్టిసారించటం అవసరమని ఆయన గ్రహించాలి. -
డేటా సెంటర్లపై బేజారు
చార్లీ చాప్లిన్ అద్భుత దృశ్యకావ్యాల్లో ఒకటైన ‘గోల్డ్ రష్’ నిరుడు శతవసంతాలు పూర్తిచేసుకుంది. 1890ల్లో కెనడాలోని క్లోన్డైక్ ప్రాంతంలో బంగారం గనులున్నాయని వెల్లడై ప్రపంచం నలుమూలలనుంచీ వేలాదిమంది జనం అక్కడికి పరుగులు తీయడం, పోటీపడటం కథాంశం. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కృత్రిమ మేధ(ఏఐ)కి సంబంధించిన డేటా సెంటర్లలో పెట్టుబడుల్ని ఆకర్షించటానికి అలాగే పరుగులు తీస్తున్నాయి. నిరుడు అక్టోబర్‌లో ప్రపంచ ఆర్థిక ఫోరం విడుదల చేసిన విశ్లేషణ డేటా సెంటర్ల సామర్థ్యం మరో నాలుగేళ్లలోనే మూడు రెట్లు పెరుగుతుందని అంచనా వేసింది. అదే సమయంలో తీవ్ర ఉష్ణోగ్రతలు, కరువుకాటకలు, ఇతర వాతావరణ దుష్ఫలితాల కారణంగా డేటా సెంటర్ల వార్షిక ఖర్చులు 2035కు 8,100 కోట్ల డాలర్లనుంచి 2065 నాటికి 16,800 కోట్ల డాలర్లకు పెరుగుతాయని అంచనా వేసింది. ఇప్పటికే క్లౌడ్ కంప్యూటింగ్ నిర్వహించటానికి... ఓటీటీలు, యూట్యూబ్వంటి వాటికోసం లైబ్రరీల నిర్వహణకూ, ఇతరేతర వినియోగానికీ డేటా సెంటర్లున్నాయి. ఏఐ రాకతో ఇవి మరింతగా పెరుగుతున్నాయి. డేటా సెంటర్ల విస్తరణతోపాటే వాటికి సంబంధించిన అవగాహన మొదలైంది. వాటివల్ల కలిగే దుష్పరిణామాల గురించి ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తోంది. ఆన్లైన్ సెర్చ్‌లతో పోలిస్తే ఏఐ ఆధారిత సెర్చ్‌లు పది రెట్లు అధిక విద్యుత్‌ను తీసుకుంటున్నా యని గణాంకాలు తేల్చాయి. ఈమధ్య విడుదలైన ఐక్యరాజ్యసమితికి చెందిన యూనివర్సిటీ అధ్యయన నివేదిక డేటా సెంటర్లను చల్లబరచడానికి బిలియన్లకొద్దీ లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు ఆవిరైపోతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ డేటా సెంటర్ల వల్ల తాగునీటి హక్కులకూ, వ్యవసాయానికీ తీవ్ర విఘాతం కలుగుతోందని హెచ్చరించింది. వీటిని అనుమతించే ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో పునరుత్పాదక ఇంధన వనరు లున్న ప్రాంతాలనే ఎంచుకునేలా చూడాలని సూచించింది. వినియోగిస్తున్న నీరు ఆవిరయ్యే ప్రస్తుత విధానానికి బదులు నీటి అవసరం లేని ఎయిర్ కూలింగ్, లిక్విడ్ ఇమ్మర్షన్ కూలింగ్వైపు మారేలా డేటా సెంటర్లపై ఒత్తిడి తేవాలని ప్రభుత్వాలకు సలహా ఇచ్చింది. డేటా సెంటర్లు తాము వినియోగించే నీరు, విద్యుత్ ఎంతో... విడుదలయ్యే కర్బన ఉద్గారాల పరిమాణం ఎంతో తెలిపే డేటాను అందరికీ అందుబాటులో ఉంచేలా నిబంధనలు రూపొందించాలని తెలిపింది. డేటా సెంటర్లపై అక్కడక్కడా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో ఈ సెంటర్లు పెరగటాన్ని నిరసిస్తూ ఉద్యమాలు జరగటంతో కొత్తవాటిపై కఠిన మైన ఆంక్షలు విధించారు. నెదర్లాండ్స్‌లో కూడా రైతులు, పర్యావరణవేత్తలు ఆందోళ నలు చేశారు. దాంతో హైపర్స్కిల్ డేటాసెంటర్ల నిర్మాణాలను ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించింది. సింగపూర్‌లో పర్యావరణహిత సెంటర్లకు పరిమితమైన అనుమతు లిస్తున్నారు. చిలీలో డేటా సెంటర్ ఏర్పాటుపై జనం తిరగబడటంతో గూగుల్ సంస్థ గాలితో చల్లబరిచే సాంకేతికత దిశగా ప్రాజెక్టును డిజైన్ చేసుకుంది. ఏడాదిలో 365 రోజులూ వేలాది సర్వర్ రాక్‌లూ, డిజిటల్ డేటాను భద్రపరిచే హార్డ్ డ్రైవ్‌లూ, నెట్వర్కింగ్ పరికరాలూ, లక్షలసంఖ్యలో యూపీఎస్‌లు పనిచేస్తుండటంవల్ల వాటిని చల్లబరచటానికి నిరంతరాయంగా నీరు అవసరమవుతుంది. భారీగా విద్యుత్ కావలసివస్తుంది. ఇక ఆ సెంటర్లలోవాడే భారీ కూలింగ్ ఫ్యాన్లు , ఇండస్ట్రియల్ ఏసీల వల్ల ఒకరకమైన ధ్వని తప్పదు. పగలు ఇతర చప్పుళ్లతో ఇది కలిసిపోయినా, రాత్రివేళల్లో మూడు నాలుగు కిలోమీటర్ల మేర ఈ ధ్వని వినబడుతుంది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో, అమెరికాలోని వర్జీనియాలో కేవలం ఈ కారణం వల్లే స్థానికులు కోర్టులకెక్కారు. ప్రజల ఒత్తిళ్లతో ఈమధ్య కాలిఫోర్నియాలోని ఒక మున్సిపాలిటీ కొత్త డేటా సెంటర్లపై నిషేధం విధించింది. వీటన్నిటి నేపథ్యంలో నీటి అవసరం పెద్దగా లేని సాంకేతికతలు వస్తున్నాయి. ఏఐ ఆధారిత సాంకేతికత ద్వారా ఒక్క చుక్క నీరు కూడా అదనంగా వినియోగించకుండా కట్టడి చేస్తున్నారు. ప్రభుత్వాలు పారదర్శకంగా వ్యవహరిస్తే, ఆ సెంటర్లు వినియోగించే పర్యావరణహిత సాంకేతికతల సమాచారాన్నీ, వాటి ఉద్గారాల పరిమాణాన్నీ ప్రజలకూ, పర్యావరణవేత్తలకూ అందుబాటులో ఉంచితే ప్రజల్లో ఉండే ఆందోళన తగ్గుతుంది. -
సెషెల్స్‌తో మరింత బంధం
కేవలం 115 చిన్న చిన్న దీవుల సమాహారం. అందులో నివసించటానికి పనికొచ్చేవి నాలుగంటే నాలుగే. జనాభా చూస్తే లక్షా 30 వేలు. దేశ భూభాగం కేవలం 455 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇంత చిన్న దేశం సెషెల్స్లో ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజులు పర్యటించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో అత్యంత కీలకస్థానంలో ఉన్న ఈ ద్వీపకల్పం ఆఫ్రికా తూర్పు తీరానికి సమీపంలో, హిందూమహా సముద్రంలోని అంతర్జాతీయ నౌకా రవాణా మార్గాలకు సమీపంలో ఉంది. ఇది ఆసియా–ఆఫ్రికా సముద్ర మార్గాల కూడలి కనుక ఆఫ్రికా, యూరప్, పశ్చిమాసియా దేశాలకు వెళ్లే నౌక లన్నీ ఈ ప్రాంతంనుంచే పోవాలి. ఆ నౌకలు నిత్యం ముడిచమురు, సహజవాయు నిక్షేపాలు, ఆహారపదార్థాలు, ముడి సరుకులు మోసుకుపోతుంటాయి. ఆ దేశాధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీ ఈ ఏడాది మొదట్లో మన దేశం వచ్చారు. అటు తర్వాత మన దేశం అక్కడికి 250 టన్నుల ఆహార పదార్థాలు, భవన నిర్మాణాలకు అవసరమయ్యే సిమెంట్, ఇతరమైనవి పంపింది. దానికి కొనసాగింపుగా మోదీ జరిపిన ప్రస్తుత పర్యటనలో ఇరు దేశాలమధ్యా 19 అంశాల్లో అంగీకారం కుదిరింది. తమవంటి ద్వీపకల్ప దేశాల ఆకాంక్షలను ప్రపంచ వేదికలపై ఎలుగెత్తిచాటుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న భారత్‌పై ఆ దేశంలో ఆదరాభిమానాలున్నాయి. 1986లో అప్పటి దేశాధ్యక్షుడైన ఫ్రాన్స్ ఆల్బర్ట్ రెనే సోవియెట్ యూనియన్ పర్యటనకెళ్లినప్పుడు సెషెల్స్లో తిరుగుబాటుకు కుట్ర పన్నిన వైనంపై ముందస్తు సమా చారం అందుకున్న నాటి ప్రధాని రాజీవ్ గాంధీ హుటాహుటీన నావికా దళాన్ని పంపి దాన్ని అణిచేశారు. సెషెల్స్ నిడివి చిన్నదైనా సాగరజలాల్లో దాని ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఎస్‌జెడ్) ఏకంగా 13.7 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే భూభాగంకన్నా దాని సముద్ర వ్యాప్తి దాదాపు 3,000 రెట్లు అధికం. హిందూ మహాసముద్రంలో చైనా క్రమేపీ తన ప్రాబల్యాన్ని విస్తరించుకోవటానికి ముత్యాల తీగ (స్ట్రింగ్ ఆఫ్ పెరెల్స్) పేరిట పాగా వేయాలని చూస్తోంది. ఆఫ్రికా తీరమైన జిబూటిలో ఇప్పటికే సైనిక స్థావరం ఏర్పాటులో బిజీగా ఉంది. కనుక ఈ ప్రాంతంలో తన పట్టు నిలుపుకొనాలంటే సెషెల్స్‌తో భారత్‌కు బలమైన బంధం ఉండితీరాలి. కోస్తా రాడార్ నెట్ వర్క్ పేరిట మన దేశం ఏర్పాటుచేసిన వ్యవస్థ ఆ ప్రాంతంలో ప్రయాణించే ప్రతి నౌక కదలికనూ ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. అక్కడ సముద్ర దొంగల బెడద కూడా ఎక్కువే. దాంతోపాటు మాదకద్రవ్యాల స్మగ్లింగ్, అక్రమ చేపలవేట ఉంటాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనటానికి రాడార్ నెట్ వర్క్ ఎంతగానో తోడ్పడుతున్నది. దీంతోపాటు మన దేశం డోర్నియర్ నిఘా విమానాలనూ, గస్తీ నౌకలనూ బహుమతిగా ఇచ్చింది. వాటిపై సెషెల్స్ రక్షణ సిబ్బందికి శిక్షణనిచ్చింది. 2020లో ఆ దేశ సుప్రీంకోర్టు భవనాన్ని ఉచితంగా నిర్మించి ఇచ్చింది.ప్రసిద్ధ నావికుడు వాస్కోడిగామా 1502లో తొలిసారి ఈ ద్వీపకల్పాన్ని సందర్శించి నప్పుడు ఇక్కడ మానవ సంచారం లేదని చెబుతారు. అటుతర్వాత 1756లో ఫ్రాన్స్ దీన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంది. అప్పటి ఫ్రాన్స్ ఆర్థికమంత్రి జీన్ మోరో సెషెల్స్ పేరిట ఈ ద్వీపకల్పానికి సెషెల్స్గా నామకరణం చేశారు. 1770లో ఇక్కడ వ్యవసాయ పనులకు ఫ్రాన్స్ ఆఫ్రికానుంచి భారీయెత్తున కార్మికులను తరలించింది. అప్పుడు మన దేశం నుంచి కూడా వెళ్లారు. నెపోలియన్ యుద్ధాల్లో ఒకదానిలో ఫ్రాన్స్ ఓడిపోవటంతో 1814లో ఇది బ్రిటన్ అధీనంలోకి వచ్చింది. చివరకు 1976లో దీనికి స్వాతంత్య్రం వచ్చింది. ప్రస్తుత సెషెల్స్ జనాభాలో 12 శాతంమంది మన దేశంనుంచి వలసవెళ్లిన గుజరాత్, తమిళనాడులకు చెందినవారే. హిందూ మహాసముద్ర ప్రాంత ప్రాముఖ్యత రోజురోజుకూ పెరుగుతోంది. అవకాశం దొరికితే కాలూనడానికి చైనాతోపాటు చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రాంతం శాంతియుత మండలంగా ఉండాలని మన దేశం మొదటినుంచీ కోరుకుంటోంది. ఇరు దేశాల సంబంధాలూ భద్రతకే పరిమితం కాకుండా పర్యావరణ పునరు ద్ధరణ, పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధన వనరులు, డిజిటల్ రంగ సదుపాయాలు వగైరాలకు సైతం విస్తరించాయి. ఇరు దేశాల బాంధవ్యం మున్ముందు మరింతగా ఎదుగు తుందని మోదీ పర్యటన నిరూపించింది. -
మహాప్రయాణం
క్రీస్తు పూర్వం 8వ శతాబ్దానికి చెందిన గ్రీకు అంధకవి హోమర్ సృజనగా చెప్పే రెండు ఇతిహాస కావ్యాలు– ఇలియడ్, ఒడిస్సీ. ఇవి పాశ్చాత్య ప్రపంచానికి మన రామాయణ, మహాభారతాల్లాంటివి. పైగా కొనసాగింపు కథలు. ట్రోజన్ యుద్ధం, హెలెన్–పారిస్ ప్రేమ, హెక్టర్ త్యాగం, అకిలీస్ పరాక్రమం, రక్తపాతం, వినాశనాన్ని ఇలియడ్ చూపిస్తే... ఆ యుద్ధం ముగిసిన తర్వాతి కథను ఒడిస్సీ చెప్తుంది. పదేళ్లపాటు జరిగిన ఆ యుద్ధంలో గెలిచిన గ్రీకు వీరుడు, ఇతకా రాజు అయిన ఒడిస్సీస్ (దీన్నే లాటిన్లో ఉలిసేస్ అని ఉచ్ఛరిస్తారు) తిరిగి తన భార్య పెనలోపి, కొడుకు తలామకస్ దగ్గరికి చేరుకోవడానికి పదేళ్లపాటు పడిన కష్టాలే ఈ కావ్యం. ఆ కష్టాల్లో కొన్ని విధివిలాసమైతే ఇంకొన్ని స్వయంకృతం. ఇలియడ్ బాహ్య యుద్ధమైతే, ఒడిస్సీ ఒక అంతర్మథనం. ‘ధైర్యంగా ఉండు నా హృదయమా; నేనొక సైనికుడిని; ఇంతకంటే ఘోరమైన దృశ్యాలనే నేను చూశాను.’‘దేవుళ్లు మానవులకు కష్టాలను ఇస్తారు, తద్వారా రాబోయే తరాలకు చెప్పుకో వడానికి ఒక కథ మిగులుతుంది’ అంటాడు హోమర్. ఒక నాయకుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ, తనను తాను తెలుసుకుంటూ గమ్యాన్ని చేరడం అనే ఇతివృత్తానికి ఒడిస్సీ శ్రేష్ఠమైన నమూనా. ఒడిస్సీస్ కేవలం శారీరక బలం గలవాడే కాదు, దుర్బేధ్య మైన ట్రాయ్‌ని, కొయ్యగుర్రం (ట్రోజన్ హార్స్) పొట్టలో సైనికులను రహస్యంగా పంపి, జిత్తులతో గెలిచినవాడు. అకిలీస్ శౌర్యం కోసం బతికితే, ఒడిస్సీస్కు బతకడమే ప్రధానం. వరాలు, శాపాలు, మాయలు, మంత్రాలతో సాగినప్పటికీ ఒడిస్సీలోని పాత్రలు కేవలం పురాణ బొమ్మలు కావు, అవి మానవ నైజానికి ప్రతీకలు. ఇందులో ఒంటికన్ను రాక్షసుడు పాలిఫేమస్ మన బకాసురుడిని గుర్తుకుతెస్తాడు. కొడుకు పసివాడుగా ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్లిపోయిన భర్త కోసం ఇరవై ఏళ్లు వేచి చూసే పెనలోపి పాత్రలో లక్ష్మణుడి భార్య ఊర్మిళను పోల్చుకోవచ్చు. తండ్రి పెంపకం కరవైనప్పటికీ, తల్లికి తోడుగా నిలిచి, చివరకు తండ్రితో కలిసి శత్రుసంహారం చేసే మంచి కొడుకు పాత్ర తలామకస్ది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒడిస్సీస్ లాంటివాళ్లే. ఆధునిక మానవుడు కెరీర్ అనే సంద్రంలో చిక్కుకుని, ఇంటి (ప్రశాంతత) కోసం వెతుక్కుంటున్నాడు. ఇప్పటికీ ఒడిస్సీ ప్రాసంగితకు అదే కారణం. ‘ఒక మనిషికి తన సొంత దేశం, తన తల్లిదండ్రుల కంటే మధురమైనది ఏదీ లేదు. పరాయి దేశంలో, కన్నవారికి దూరంగా ఎంతటి విలాసవంతమైన భవనంలో నివసించినప్పటికీ అవి దీనికి సాటిరావు’. ఒడిస్సీకి ఆంగ్లంలోనే అరవైకి పైగా అనువాదాలు వచ్చాయని ఒక లెక్క. దాన్ని ప్రేరణగా తీసుకుని వచ్చిన సృజన మరింత విస్తారమైనది. జేమ్స్ జాయిస్ రాసిన చైతన్య స్రవంతి నవల ‘ఉలిసేస్’ మామూలు మనుషుల మహాప్రస్థానాన్ని చెబుతుంది. ‘భువన సుందరి’గా ఇలియడ్, ‘రూపధరుడి యాత్రలు’గా ఒడిస్సీ తెలుగులోకీ వచ్చాయి. తాజాగా ఒడిస్సీని తెలుగు పాఠకులకు చేరువ చేయడానికి వేమూరి వేంకటేశ్వర రావు, వెంకట్ సిద్ధారెడ్డి కూడా ప్రయత్నించారు. ఒడిస్సీ, ఇలియడ్ ఇంతకుముందు చాలాసార్లు తెరకెక్కాయి. ఎన్నిసార్లయినా అంతే ఆసక్తిని పుట్టించాయి. ఈ కాలపు వండర్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ లాంటివాడు దీనిమీద ఆసక్తి కనబరచాడంటే, ప్రపంచం అంతకంటే అమితాసక్తితో జూలై 17న విడుదల కానున్న హాలీవుడ్ ఒడిస్సీ కోసం ఎదురుచూస్తోంది. ‘ఇంటర్స్టెల్లార్’లో అంతరిక్ష ప్రయాణాన్నీ, ‘ఇన్సెప్షన్’లో కలల ప్రయాణాన్నీ చూపించిన నోలన్‌కు ఒడిస్సీకంటే నప్పే కథ మరొకటి ఉండదు. స్థలకాలాలతో ముడిపెట్టి దీన్ని ఎలా చూపిస్తాడనే కుతూహలం అంతటా నెలకొంది. ఇలియడ్ ఆధారంగా వచ్చిన ట్రాయ్ (2004) సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం నోలన్‌కు వచ్చిందట. కానీ అది కుదరలేదు. మళ్లీ ఇరవై ఏళ్ల తర్వాత ఆయన ఒడిస్సీ రూపంలో హోమర్‌కు దగ్గరయ్యాడు. తప్పిపోయిన ఇంటికి ఒడిస్సీస్ 20 ఏళ్ల తర్వాత చేరుకున్నట్టే, నోలన్ కూడా తనకు ఇష్టమైన ఈ సబ్జెక్టును చేపట్టడానికి 20 ఏళ్లు పట్టింది. ఆలస్యం అవడం అంటే ఒడిస్సీస్లా వయసు పెరగడమే; అంటే మరింత పైచూపుతో జీవితాన్ని చూడగలిగే పరిణతి రావడమే! -
ఎన్ని ఓట్లు తొలగిస్తారు సర్!
జూన్ 25వ తేదీని బీజేపీ మాదిరిగా దేశంలో మరే పార్టీ గుర్తుపెట్టుకోలేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఐదు దశాబ్దాల కింద ఇందిరాగాంధి విధించిన ఎమర్జెన్సీ తేదీని ‘సంవిధాన్ హత్యా దివస్’గా ప్రతియేటా బీజేపీ పాటిస్తున్నది. ఈయేడు కూడా బీజేపీ అగ్రనేతలంతా ఆనాటి అకృత్యాలపై ఎలుగెత్తారు. ప్రధానమంత్రి ఒక ప్రకటన చేస్తూ ‘దేశ చరిత్రలో ఆరోజు కాంగ్రెస్ పార్టీ ఒక చీకటి అధ్యాయాన్ని ప్రారంభించింద’ని విమర్శించారు. పురాణాల్లోంచి నాలుగు సంస్కృత పంక్తులను సంగ్ర హించి ఈ సందర్భంగా ఆయన పోస్ట్ చేశారు. ‘స్వాతంత్య్రం ద్వారానే మనిషి నిజమైన సుఖాన్ని పొందుతాడు, ఉన్నతమైన విజయాలను సాధిస్తాడు. స్వేచ్ఛ ద్వారానే మనిషికి మనశ్శాంతి, సంతృప్తి లభిస్తాయి. స్వాతంత్య్రం ద్వారానే అత్యున్నత స్థితికి చేరుకోగలుగుతాము’ అని ఆయన సందేశానికి అర్థం. ప్రధాని చెప్పినట్టుగా ఎమర్జెన్సీ కాలం ఈ దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయమే. లక్షమందికి పైగా ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను, నాయకులను అక్రమంగా నెలల తరబడి నిర్బంధించిన రోజులవి! భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాణప్రదమైన పౌరహక్కులను సమస్త ప్రజానీకం సామూహికంగా కోల్పోయిన అస్వతంత్ర దినాలవి! లాకప్ చిత్రహింసలకు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. కోటిమందికి పైగా బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయగా వారిలో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన పీడకాలం అది. లక్షలాది నిరుపేదల ఆవాసాలను సర్కారీ బుల్డోజర్లు కర్కశంగా చిది మేసిన నిరంకుశ క్షణాలవి. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేని అటు వంటి స్థితిలో మనిషికి నిజమైన సుఖసంతోషాలుండవని ప్రధానమంత్రి ప్రబోధించారు. కాకతాళీయంగా జూన్ 25 మాదిరిగానే జూన్ 24 కూడా భవిష్యత్తు చరిత్రలో గుర్తుంచుకోదగిన రోజుగా మిగిలిపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. భారత రాజకీయాల్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న ఓటర్ల జాబితాల ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్) కార్యక్రమం గత సంవత్సరం జూన్ 24న బిహార్‌లో ప్రారంభమైంది. ఇప్పటికి పన్నెండు రాష్ట్రాల్లో 50 కోట్లకు పైగా ఓటర్ల పరిశీలన పూర్తయింది. వీరిలో ఐదు కోట్ల పైచిలుకు మందిని జాబితాల నుంచి తొలగించారు. చని పోయిన వారిని మినహాయించగా మిగిలిన వారి సంఖ్య ఇది. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా మిగిలిన రాష్ట్రాల్లో 39 కోట్ల మంది ఓటర్ల పరిశీలనా కార్యక్రమం ఈ జూన్‌లో ప్రారంభమైంది. సర్ కార్యక్రమం తొలగింపు సరాసరి లెక్కన ఈ మూడో దశలో కూడా మరో పది శాతం మందిని జాబితాల నుంచి తొల గించే అవకాశం ఉన్నదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ అనుమానాలే నిజమైతే జర్మనీ జనాభాకు ఇంచుమించు సమాన స్థాయిలో మన దేశంలో అనర్హులుగా తేల్చిన ఓటర్ల సంఖ్య ఉంటుంది. వీరి భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది? వారి అప్పీళ్లు ఎప్పుడు పరిష్కారమవుతాయన్నది అగమ్యగోచరం. తమ అనర్హతపై బిహార్‌లో 47 లక్షలమంది, బెంగాల్లో 27 లక్షల మంది చేసుకున్న అప్పీళ్లపై ఇప్పటికీ విచారణే ప్రారంభం కాలేదు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలదీ అదే కథ. ఈలోగా ఎన్ని కలు పూర్తయి కొత్త ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. వయోజను లైన భారత పౌరులందరికీ మన రాజ్యాంగం ఎటువంటి వివక్ష లేకుండా ఓటు హక్కును కల్పించింది. మానసిక స్థితి బాగా లేనివారు, కొన్ని తీవ్రమైన నేరాల్లో శిక్షపడినవారు, విదేశీయు లకు మాత్రమే ఓటు హక్కును తిరస్కరించే అవకాశం ఉన్నది. ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్న ఐదు కోట్లమంది, ఉండే అవ కాశం ఉన్న మరో మూడు కోట్ల మందిని ఏ కేటగిరీలో చేర్చాలి?సార్వత్రిక ఓటు హక్కు అనేది రాజ్యాంగ స్ఫూర్తి. అర్హులైన అందరినీ ఓటర్లుగా నమోదు చేసి వారి జాబితాలను తయారు చేసే బాధ్యతను రాజ్యాంగం ఎన్నికల సంఘం మీద మోపింది. ఇందుకు పూర్తి విరుద్ధంగా ఓటర్లుగా నమోదయ్యే బాధ్యతను, అందుకోసం తన పౌరసత్వాన్ని నిరూపించుకునే బాధ్యతను ప్రజలపైనే ప్రస్తుత ఎన్నికల సంఘం మోపింది. వయోజనులైన ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించడం రాజ్యాంగ ఆశయమైతే, అదే రాజ్యాంగం ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం వైఖరి వీలై నంత ఎక్కువమందిని ఓటు హక్కుకు దూరం చేసేదిగా కనిపి స్తున్నది. రాజ్యాంగ ఆశయానికి అనుగుణంగా ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని (1950) రూపొందించారు. దాంతోపాటు ఓటర్ల నమోదు నిబంధనావళి (1960)ని పార్లమెంట్ తయారు చేసింది.ఈ చట్టం ప్రకారం ప్రతి జనరల్ ఎలక్షన్‌కు ముందు సాధా రణ స్థాయిలో ఓటర్ల జాబితా సవరణ జరగాలి. చనిపోయిన వారు, శాశ్వతంగా వలస వెళ్లినవారి ఓట్లను తొలగించడం, కొత్త ఓటర్లను నమోదు చేయడం వరకు ఈ ప్రక్రియ పరిమిత మవుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం ఓటర్ల జాబితా ‘ప్రత్యేక’ సవరణకు ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 21 (2) అనుమతినిస్తున్నది. అయితే ఆ ప్రత్యేక సందర్భాన్ని ముందుగా ఎన్నికల సంఘం పేర్కొనాలి. ఆ తర్వాత ఈసీఐ అవసరమని భావించిన ఏదైనా నియోజకవర్గంలోగానీ, నియోజకవర్గంలోని కొన్ని భాగాల్లోగానీ ప్రత్యేక సవరణ చేపట్టవచ్చునని చట్టం చెబుతున్నది. ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ అనేది చట్టం పరిధి దాటిన వ్యవహారంగా న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఎన్నికల ముందు చేపట్టే సవరణ సాధారణ సవరణగానే ఉండా లని చట్టం స్పష్టంగా పేర్కొన్నది.పెద్దసంఖ్యలో అక్షరజ్ఞానం లేనివారు, అంతకంటే ఎక్కువ సంఖ్యలో కనీస డిజిటల్ పరిజ్ఞానం లేనివారు, తాత్కాలిక వలస లకు వెళ్లే శ్రమజీవులు, సామాజికంగా వెనుకబడిన వర్గాల ప్రజలున్న దేశంలో ఓటర్ల నమోదు ప్రక్రియ అనేది వీలైనంత సరళంగా ఉండాలి. కానీ సాధ్యమైనంత సంక్లిష్టమైన ప్రక్రియగా ఈ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్చివేసింది. 2002 ఓటర్ల జాబితాను ఆధారం చేసుకొని ప్రస్తుత ఓటర్లను మ్యాపింగ్ చేయడం ఈ ప్రక్రియలో తొలిదశ. అందులో ఉన్న ఓటర్లకు ఇబ్బందేమీ ఉండదు. ఎన్యుమరేషన్ ఫాం నింపితే సరిపోతుంది. నలభయ్యేళ్ల లోపు వయసు వాళ్లకు అప్పట్లో ఓటు ఉండే అవకాశం లేదు కనుక వారు అప్పటి జాబితాలో ఉన్న తండ్రి పేరును, తాత పేరును వెతికి పట్టుకొని సమర్పించాలి. దాంతోపాటు మీరు మీరేనని ధ్రువీకరించే పత్రాన్ని కూడా సమర్పించాలి.2002 జాబితాలో పేరు లేక మ్యాపింగ్ కాని ఓటర్లతోపాటు అప్పటి జాబితాతో పోల్చితే స్వల్ప తేడాలు, స్పెల్లింగ్ తప్పు లున్న మ్యాపింగ్ అయినవారికి కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉన్నది. వారు ఈఆర్వో ముందు హాజరై తాము ఈ దేశ పౌరులమే, ఓటు హక్కుకు అర్హులమే అని నిరూపించుకోవ లసిన బాధ్యత వారిపైనే ఉన్నది. ఇప్పుడున్న సమాచారాన్ని బట్టి తెలంగాణలో 30 శాతం, ఏపీలో 24 శాతం మంది ఓటర్లకు 2002 జాబితాలో మ్యాపింగ్ జరగలేదు. అధికార యంత్రాంగం కనుక కొన్ని సెక్షన్ల ఓటర్లను తొలగించాలనే లక్ష్యంతో పనిచేస్తే మ్యాపింగ్‌లో ఎదురయ్యే చిన్నచిన్న తప్పులను కూడా అవకాశంగా మలుచుకోవచ్చు. బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ విచక్షణాధికారాలన్నీ కేంద్రం నియమించిన ‘సూక్ష్మ పరిశీలకులకు’ సంక్రమించాయి.ఓటర్ల తొలగింపు కార్యక్రమంలో పలురకాల వింతలు చోటు చేసుకున్నాయి. కొద్దిపాటి చరిత్ర జ్ఞానమున్న వారికి సైతం మీర్ జాఫర్ పేరు తెలియకుండా ఉంటుందా? 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో ఈస్టిండియా కంపెనీకి సహకరించి సిరాజుద్దౌలా ఓటమికి కారణమైన వ్యక్తి. ఈ ఘటన దేశ చరిత్ర గతిని మలుపు తిప్పిన సంగతి తెలిసిందే. అతని కుటుంబ వారసులు గత పది పదిహేను తరాలుగా ముర్షిదాబాద్‌లో నివసిస్తున్నారట! ఆ ఖాన్‌దాన్‌కు చెందిన 346 మంది ఓట్లు అనుమానితుల జాబితాలో చేరాయి. వారిప్పుడు తమ పౌర సత్వాన్ని నిరూపించుకోవడమనే అగ్ని పరీక్షను ఎదుర్కోవలసి ఉన్నది. విదేశాంగ శాఖ కార్యదర్శిగా, కామన్వెల్త్ నేషన్స్ డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన కృష్ణన్ శ్రీనివాసన్ పేరు 2002 జాబితాలో ఎందుకు లేదని నోటీసులిచ్చారట! ఉద్యోగ బాధ్యతలో చిరకాలం విదేశాల్లో ఉన్న వ్యక్తిని ఈ ప్రశ్న అడగడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వ్యవస్థకు ఇంగితజ్ఞానం కూడా లేదని నిరూపించే ఇటువంటి విశేషాలు పెద్దఎత్తున వెల్లడవుతున్నాయి.సాధారణ ఎన్నికలు నిర్వహించడానికి దేశం మొత్తానికి ఒకే ఎలక్షన్ కమిషన్ ఉండాలా? లేదంటే జాతీయ స్థాయితోపాటు రాష్ట్రాలకు వేర్వేరుగా కమిషన్లు ఉండాలా అనే అంశంపై కూడా రాజ్యాంగ సభలో చర్చ జరిగింది. ఉద్యోగం, ఉపాధి అవకాశా లను వెతుక్కుంటూ పెద్దసంఖ్యలో ప్రజలు శాశ్వత వలసలకు వెళ్లే అవకాశాలున్నందువలన రాష్ట్రాల కమిషన్లు ఈ వలస ప్రజల పట్ల వివక్ష చూపవచ్చన్న అనుమానంతో దేశమంతటికీ ఒకే ఎలక్షన్ కమిషన్ ఉండాలని రాజ్యాంగ సభ నిర్ణయించింది. సార్వత్రిక ఓటు హక్కుకు ఏరకమైన అవరోధాలు రాకూడదనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నది. రాజ్యాంగ సభ ఆశ యానికీ, ఓటర్ల తగ్గింపే పరమావధిగా పెట్టుకున్న ప్రస్తుత ఎన్ని కల సంఘం వ్యవహార శైలికీ మధ్యన హస్తి మశకాంతరం ఎందుకేర్పడిందో చెప్పవలసిన బాధ్యత ఆ సంఘంపైనే ఉన్నది.ఎన్నికల సంఘం చేపట్టిన సర్ కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు సమర్థించి ఉండవచ్చు. చట్టం పరిధిని మీరినట్టు స్పష్టంగా కనిపి స్తున్న ఎన్నికల సంఘం వ్యవహారం రాజ్యాంగబద్ధమేనని సర్వో న్నత న్యాయస్థానం అభిప్రాయపడి ఉండవచ్చు. ఆధిపత్య శక్తుల ప్రభావం వలన రాజ్యాంగ వ్యవస్థల నడుమ మంచి సమ న్వయం సమకూరి ఉండవచ్చు. దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు లేకుండా జాబితాలను శుద్ధి చేయడమే లక్ష్యమని ఎన్నికల సంఘం చెబుతున్న మాటలు మంచివే కావచ్చు. కానీ ఓటర్ల తొలగింపే ధ్యేయమన్నట్టు సాగుతున్న ఈసీ సంక్లిష్ట కార్యక్ర మాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ సంక్లిష్టత కారణంగా ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉన్నవారిలో పేదవర్గాలు, నిరక్షరాస్యులు, మైనారిటీలు ఎక్కువ సంఖ్యలో ఉండే పరిస్థితిని ఎలా అడ్డుకోగలుగుతాము? ఇప్పటికే బెంగాల్, బిహార్‌లలోని బీజేపీ ప్రభుత్వాలు కొత్త ఓటర్ల జాబితాలను సంక్షేమ పథకా లకు లింక్ చేశాయి. తొలగించిన ఓటర్లందరూ లబ్ధిదారుల జాబితా నుంచి కోతకు గురికాబోతున్నారు.ఈమాత్రం హింట్ చాలదా ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్ చెలరేగిపోవడానికి! ఇటువంటి సావకాశం లేకుండానే అది వీలైనంతవరకు ఎన్నికల హామీలకు ఎగనామం పెట్టింది. అమలు చేస్తున్న పథకాల్లో కూడా లబ్ధిదారుల సంఖ్యలకు కత్తెర వేస్తున్నది. సర్ రూపంలో మరో అవకాశం తరుముకొస్తుంటే ఒడిసిపట్టకుండా ఊరుకుంటుందా? టీడీపీ తరఫున బూత్ లెవెల్ ఏజెంట్లను క్రియాశీలకంగా రంగంలోకి దింపింది. ఎన్ని కల సంఘం తరఫున పనిచేసే బూత్ లెవల్ అధికారుల (బీఎల్ఓ)తో టీడీపీ ఏజెంట్లను పూర్తిస్థాయిలో ‘మ్యాపింగ్’ చేసి నట్టు వార్తలు వస్తున్నాయి. బీఎల్ఓల దగ్గర మాత్రమే ఉండా ల్సిన సమాచారం కూడా టీడీపీ ఏజెంట్లకు అందుబాటులోకి వస్తున్నది. టీడీపీ బీఎల్ఏలు తమ పరిమితికి మించి ఎన్యూమ రేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారని సమాచారం. కొందరు బీఎల్ఓలు అన్ని పార్టీల ఏజెంట్లకూ ఇవ్వాల్సిన హౌస్ విజిట్ సమాచారాన్ని కూటమి ఏజెంట్లకు మాత్రమే చేరవేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం బీఎల్ఏల గ్రూప్ కాల్స్‌లో అధికారులు మాట్లాడుతూ మార్గ నిర్దేశనం చేస్తున్న వ్యవహారాలు కూడా అక్కడక్కడా బయటపడుతున్నాయి. ఇటువంటి ధోరణులకు చెక్ పెట్టే విధానంగానీ, యంత్రాంగంగానీ ఎన్నికల సంఘం దగ్గర లేదు. అసలు ఎన్నికల సంఘం నిష్పాక్షికత పైనే ఎవరికీ నమ్మకం లేని పరిస్థితి ఏర్పడింది. పాస్‌పోర్టు కూడా పౌరసత్వానికి రుజువు కాదని తాజాగా విదేశాంగ శాఖ అధికారి ఒకరు ప్రకటించారు. భారతీయ పౌరులు కానివారికి పాస్‌పోర్టు జారీ చేయరాదని పాస్‌పోర్టు చట్టం స్పష్టంగా చెబుతున్నది. చట్టం చెప్పినదానికీ, అధికారి వివరణకూ మధ్యన ఉన్న వైరుధ్యాన్ని ఎవరు పరిష్కరించాలి? ఆధార్, ఓటర్ ఐడీ, పాన్‌కార్డు ఏదీ కూడా పౌరసత్వానికి రుజువులు కావని గతంలోనే న్యాయస్థానాలు, ప్రభుత్వ శాఖలు స్పష్టం చేశాయి. మరి ఓటరు జాబితాలో నమోదుకు అనర్హు లుగా మిగులుతున్న కోట్లాదిమంది పరిస్థితి ఏం కానున్నది? వారి సమస్యను పరిష్కరించడానికి ఎంతకాలం పడుతుంది? పుట్టి పెరిగిన దేశంలో పౌరసత్వం లేదని నిబంధనలు వెక్కిరి స్తుంటే స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఆ ప్రజలు ఎలా అనుభవించగలరు? సంక్షేమ పథకాల నుంచి తొలగిస్తుంటే బడుగు వర్గాల ప్రజలు సంతృప్తిగా ఎలా జీవించగలరు? ‘స్వాతంత్య్రాత్ సుఖమాప్నోతి/ స్వాతంత్య్రాల్లభతే పరమ్!’ అంటూ ప్రధాని చెప్పిన శ్లోకం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి కౌంటర్‌గా మాత్రమే పనికొస్తుందా? సర్ ఎమర్జెన్సీ మీద సెటైర్‌గా పనికిరాదా?వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మిస్టర్ బీస్ట్ రికార్డు!
జూన్ 12న ‘మిస్టర్ బీస్ట్’, యూట్యూబ్‌లో 50 కోట్ల సబ్స్క్రైబర్లకు చేరుకున్న మొదటి చానల్‌గా రికార్డు సృష్టించింది. ఈ చానల్ కంటెంట్ క్రియేటర్ జేమ్స్ డొనాల్డ్సన్ సంపాదన ఏడాదికి రూ.700 కోట్లకు పైమాటే. -
పాస్పోర్టూ పనికిరాదా?
ప్రపంచంలో ఏ దేశం పాస్‌పోర్టు శక్తిమంతమైందో లెక్కేసిచెప్పే హెన్లే పాస్‌పోర్టు ఇండెక్స్ (హెచ్పీఐ)... మన పాస్‌పోర్టు 75వ స్థానంలో ఉందంటూ ఈ ఏడాది మొదట్లో నిర్ధారించింది. ‘హమ్మయ్య... నిరుటితో పోలిస్తే పదిమెట్లు పైకొచ్చాం’ అని మన పౌరులు గర్వపడి ఆర్నెల్లు కాకుండానే దానికేమీ పెద్దగా విలువలేదనీ, భారత పౌరసత్వానికి అదేమీ రుజువు కాబోదనీ మన విదేశాంగ శాఖ తేల్చిచెప్పి, ఆ సంతోషంపై నీళ్లు చల్లింది. ‘ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు... గత పుష్కరకాలంలోని నిర్ణయం కానేకాదు. 1967 నాటి పాస్‌పోర్టు చట్టమే ఆ మాట చెప్పిం’దని సెలవిస్తోంది. గత కాలపు నిర్ణయం అయినంత మాత్రాన ఏదైనా శిరోధార్యమవుతుందా... దాన్ని సమీక్షించటం, మార్చటం అసాధ్యమా అన్న ప్రశ్నలు సహజంగానే అందరిలో తలెత్తుతున్నాయి. ఈమధ్యకాలంలో ఎన్నికల సంఘం (ఈసీ) ధర్మమా అని పౌరసత్వంపై ప్రజానీకంలో ఆందోళన బయల్దేరింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరిట బిహార్‌లో మొదలై పలు రాష్ట్రాల్లో సాగిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కావలసినంత కలవరపాటును సృష్టించింది.ఇంకా సృష్టిస్తోంది. పౌరులమని నిరూపించుకునే పత్రాలు సమర్పిస్తేనే ఓటు ఉంటుందనటంవల్ల పలు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో పౌరులు ఓటుహక్కు కోల్పోయారు. యూపీలో అలాంటివారు రెండు కోట్ల పైమాటే. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆగిపోవటం తక్షణ ప్రమాదమైతే... దేశంలో నివసించటం అసాధ్యమయ్యే స్థితి ఏర్పడటం మున్ముందు ఎదురయ్యే ముప్పు. ఈ దేశ పౌరులని ఈసీ నమ్మితేనే ఎవరికైనా ఓటుహక్కు లభిస్తుంది. అలాగని ఓటర్ గుర్తింపు కార్డు పౌరసత్వానికి రుజువు కాబోదని ప్రభుత్వమే చెబుతోంది. ఇప్పుడు పాస్‌పోర్టు సైతం ఆ ఖాతాలో చేరింది.పదిహేనేళ్ల క్రితం మహారాష్ట్రలోని తెంబ్లీలో ఆధార్‌ను లాంఛనంగా ప్రారంభించి నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ కార్డే ఇకపై సర్వస్వమనీ, దాని ఆధారంగానే పథకాల వర్తింపు అయినా, పౌరుల గుర్తింపయినా వుంటుందనీ అన్నారు. నిరుపేదలకు ఏ గుర్తింపు కార్డూ లేకపోవటాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాజెక్టు ప్రారంభించామని కూడా చెప్పారు. తీరా సర్ ప్రక్రియ సమయంలో అది చెల్లుబాటు కాబోదని ఈసీ తేల్చి చెప్పింది. అటుపై సుప్రీంకోర్టు అనుమతించిన 12 పత్రాల్లో పాస్‌పోర్టు కూడా ఉండటం చాలామందికి ఊరటనిచ్చింది. ఇప్పుడు పాస్‌పోర్టు కూడా పౌరసత్వాన్ని నిర్ధారించటానికి పనికిరాదనటం సహజంగానే ఆందోళన కలిగిస్తుంది. అవధానాల్లో ఆశువుగా పద్యం చెప్పే అవధానికి ‘నిషిద్ధాక్షరి’ మాటున పృచ్ఛకుడు అడుగడుగునా అడ్డుతగులుతూ, ప్రతి పదంలోనూ అక్షరాలను నిషేధిస్తూ ముప్పు తిప్పలు పెడతాడు. వీటన్నిటినీ అధిగమించి ఛందోబద్ధంగా అందమైన పద్యాన్ని అల్లటం అవధాని పద సంపదకు పరీక్ష. పౌరసత్వం విషయంలో దేశ పౌరులకు ఇలాంటి పరీక్షే ఎదురవుతోంది. ఏ పత్రం దాఖలు చేద్దామనుకున్నా అది పనికిరాదని చెప్పటం తప్ప, పనికొచ్చేదేమిటో పాలకులు నిర్ధారణగా చెప్పరు. ఇందువల్ల సామాన్యుల్లో అభద్రతా భావన ఏర్పడటం తప్ప సాధిస్తున్నదేమిటి? పాస్‌పోర్టు చట్టం సెక్షన్ 6(2)(ఏ) ఈ దేశ పౌరుడుకాని వ్యక్తికి పాస్‌పోర్టు నిరాకరించాలని స్పష్టంగా చెబుతోంది. ప్రభుత్వం జారీ చేసే పాస్‌పోర్టే వేరే దేశాలకు ప్రమాణం. దాన్నిబట్టే వీసాలు జారీ అవుతాయి. అది పనికిరాదంటే ఆ దేశాలు అడుగుపెట్టనిస్తాయా?హెచ్పీఐ ర్యాంకులు సాధారణమైనవేం కాదు. ప్రపంచంలో సింగపూర్ పాస్‌పోర్టును మొత్తం 192 దేశాలు గుర్తించి, వీసా అవసరం లేకుండానే తమ భూభాగాల్లో అడుగు పెట్టేందుకు అనుమతిస్తున్నాయి. అందువల్లే అది ప్రథమ స్థానంలో ఉంది. 187 దేశాల గుర్తింపుతో జపాన్, దక్షిణ కొరియాలు... 186 దేశాల గుర్తింపుతో స్వీడన్, యూఏఈలు 2, 3 స్థానాల్లో ఉన్నాయి. అలా చూస్తే మన పాస్‌పోర్టుకు 56 దేశాల గుర్తింపు మాత్రమే ఉంది. ఇతరచోట్లకు వెళ్లాలంటే వీసా కావాలి. వారు సైతం పాస్‌పోర్టు ఆధారంగానే వీసా జారీచేస్తారు. ఇప్పుడు విదేశాంగశాఖ తకరారుతో అంతర్జాతీయంగా ఎవరైనా తలుపులు మూస్తే మన పౌరుల గతేమిటి? ఎన్నో దేశాల్లో అన్నిటికీ చెల్లుబాటయ్యే కార్డు జారీ విధానం దశాబ్దాల క్రితమే అమల్లోకొచ్చింది. మనం మాత్రం అభద్రతాభావంతో పౌరులకు అడుగడుగునా సమస్యలు సృష్టిస్తున్నాం. ఇది సబబేనా? -
జి రామ్ జి కేటాయింపులు..
విబి–జి రామ్ జి (వికసిత్ భారత్– గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్– గ్రామీణ్) పథకం కింద కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.95,692 కోట్ల ప్రతిపాదిత కేటాయింపులను ప్రకటించింది. ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్, ఆ తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్ పొందాయి. -
రక్షణ వలయాలు రహస్య వ్యూహాలు
దేశాధినేతల భద్రత వెనుక ఉండే అత్యంత రహస్య వ్యూహాలు, కఠినమైన నిబంధనల గురించి మాజీ ఐబీ అధికారి యశోవర్ధన్ ఆజాద్ ఈ ఎపిసోడ్లో మాట్లాడారు. ఒబామా పర్యటన, మోదీ కాన్వాయ్ ఉల్లంఘన; రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ హత్యల వంటి కీలక ఘటనలు భారత భద్రతా వ్యవస్థల పని తీరును ఎలా మార్చిందీ వివరించారు.ముంబైలో ఒబామా పర్యటన‘‘అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముంబైని సంద ర్శించినప్పుడు, ఒక అగ్రరాజ్యంతో కలిసి భద్రతా ఏర్పా ట్లను సమన్వయం చేసుకోవడం ఎంత పెద్ద సవాలో మాకు తొలిసారి అవగాహనకు వచ్చింది. అమెరికా భద్రతా విభాగమైన ‘యూఎస్ సీక్రెట్ సర్వీస్’ పనిచేసే విధానం పూర్తిగా వేరే స్థాయిలో ఉంటుంది. వారు తమ సొంత భారీ రక్షణ కవచం ఉన్న వాహనం ‘ద బీస్ట్’ను ముంబైకి తీసుకొచ్చారు. ఒబామా అడుగుపెట్టే ప్రతి ప్రాంతంలో వ్యూహాత్మక నియంత్రణను తామే చూసు కుంటామని పట్టుబట్టారు. ఒక ఉన్నతస్థాయి భారతీయ ఇంటెలిజెన్స్ అధికారిగా ఆ సమయంలో నాకున్న పెద్ద సవాలు ఏంటంటే... వారి కఠినమైన, వెనక్కి తగ్గని భద్రతా డిమాండ్లను నెరవేరుస్తూనే, మన దేశ సార్వభౌ మాధికారాన్ని గట్టిగా చాటడం! వారి ‘బీస్ట్’ వాహనం మన రోడ్లపై సులువుగా ప్రయాణించేలా చూస్తూనే, మన సొంత గడ్డపై భారతీయ బలగాలే ప్రధాన రక్షణ కవచంగా ఉండేలా మేము భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించాం.పంజాబ్ ఫ్లైఓవర్‌పై మోదీ‘‘ఒక పరిపూర్ణమైన ప్రణాళిక ఎలా విఫలమవుతుందో మీరు అర్థం చేసుకోవాలనుకుంటే, పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ ఒక ఫ్లైఓవర్ మీద నిలిచి పోయినప్పుడు ఏం జరిగిందో చూడాలి. అది నిఘా విభాగం వైఫల్యం కాదు. స్థానిక నిర్వహణ లోపానికి నిలువెత్తు నిదర్శనం. మేము ఒక వి.వి.ఐ.పి. రూట్‌ను ప్లాన్ చేసినప్పుడు, స్థానిక రాష్ట్ర పోలీసులు కచ్చితంగా ‘క్లియరెన్స్ సిగ్నల్’ ఇవ్వడంతో పాటు, ఒక ప్రత్యా మ్నాయ బ్యాకప్ రూట్‌ను కూడా సురక్షితంగా సిద్ధం చేయాల్సి ఉంటుంది. కానీ ఆ సమయంలో, నిబంధనలు పూర్తిగా ఉల్లంఘనకు గురయ్యాయి. నిరసనకారులు దారిని అడ్డుకోవడానికి వీలు కలిగింది. దానివల్ల ప్రధాని ఒక వంతెనపై, కదలకుండా ఆగిపోయిన వాహనంలో 15 నుండి 20 నిమిషాల పాటు ఎలాంటి రక్షణ లేకుండా ఉండిపోవాల్సి వచ్చింది. భద్రత అనేది కేవలం కాగితంపై బాగుంటే సరిపోదని స్థానిక నిర్వహణ కూడా లోపరహి తంగా ఉండాలని ఆ ఘటన స్పష్టంగా నిరూపించింది.రాజీవ్ హత్య నేర్పిన పాఠం‘‘మన ఆధునిక భద్రతను మరింత పట్టిష్టం చేయటానికి మేము తరచూ గతంలో జరిగిన విషాదాలను పరిశీ లిస్తుంటాం. అందులో భాగంగానే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య ఉదంతాన్ని మేము మైక్రోస్కోప్ కింద పెట్టి మరీ విశ్లేషించాం. ఆ నిర్దిష్ట సమయంలో ఆయన కేవలం ఒక అభ్యర్థి మాత్రమేనని, అందువల్ల ఎస్పీజీ రక్షణ వలయం ఆయనకు మునుపటిలా అందుబా టులో లేదనే విషయాన్ని ప్రజలు మర్చిపోతుంటారు. అక్కడ జరిగిన వైఫల్యం మానవ రక్షణ వలయానికి సంబంధించినది. ఆ ఒక్క ఘటనే ఆ తర్వాత నుంచీ మానవ సంబంధాలు, శారీరక సామీప్యత, ప్రవేశ నియం త్రణను నిర్వహించే విధానాన్ని పూర్తిగా మార్చేలా చేసింది. వీవీఐపీకీ, ప్రజలకూ మధ్య కఠినమైన భౌతిక అడ్డంకులను అమలు చేస్తూ, మేము అందరి దృష్టిలో ‘చెడ్డవాళ్లుగా’ మారడానికి కారణం ఆ దుర్ఘటనే.ఇందిర హత్య తర్వాతే ‘ఎస్పీజీ’‘‘1984లో ప్రధాని ఇందిరా గాంధీ తన అంగరక్షకుల చేతిలోనే దారుణ హత్యకు గురైనప్పుడు, అది మన నిఘా, భద్రతా వ్యవస్థలను మూలాల నుండి కుదిపేసింది. ఆ విషాదానికి ముందు, దేశంలో వీవీఐపీల ‘అత్యంత సమీప’ రక్షణ వలయం కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన దళం అంటూ ఏదీ లేదు. ఆ వ్యవస్థాగత వైఫల్యం కేవలం భౌతిక భద్రతలో జరిగిన లోపం మాత్రమే కాదు, అది ప్రధాని అంగరక్షకుల ఎంపిక పరిశీలనలో జరిగిన నిఘా లోపం కూడా. ఈ హత్య తర్వాత, దేశాధినేతను అంతర్గత ముప్పుల నుండి రక్షించడానికి కేవలం సాధారణ పోలీసు పద్ధతులు సరి పోవని గ్రహించాం. ఆ గ్రహింపే బీర్బల్ నాథ్ కమిటీ ఏర్పాటుకు, 1985లో ‘స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్’ స్థాపనకు తక్షణ ఉత్ప్రేరకంగా మారింది. -
పగబట్టిన ప్రకృతి!
శతాబ్ద కాలంలో ఎన్నడూ చవిచూడని పెను ఉత్పాతం గురువారం (స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి) వెనెజులాపై విరుచుకుపడింది. సెకన్ల వ్యవధిలో రెండుసార్లు వచ్చిన భూకంపాలు– మొదట రిక్టర్ స్కేల్‌పై 7.2 తీవ్రతతో, అటుపై 7.5 తీవ్రతతో–ఆ దేశాన్ని కాటేశాయి. వెంటవెంటనే ఇంత తీవ్రతతో భూకంపాలొస్తే జన నష్టం, ఆస్తి నష్టం అపారంగా ఉండే అవకాశాలుంటాయి. అటుపై వరసగా 30 సార్లు ప్రకంపనలు వచ్చాయంటే అదెంత భయానకమో ఊహించవచ్చు. దీంతోపాటే అమెరికాలోని కాలిఫోర్నియాలో, జపాన్‌లో సైతం భూకంపాలు రావటం ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని భయపెట్టింది. వీటికితోడు కశ్మీర్లో కూడా స్వల్పంగా భూమి కంపించింది. భూ అంతర్భాగంలో ఏదో చోటు చేసుకోవటం వల్లే ఇలా జరిగిందన్న ఆందోళన కలిగినా ఇవి యాదృచ్ఛికమైనవేనని శాస్త్రవేత్తలు తేల్చారు. జపాన్‌లో ఎప్పుడూ భూకంపాల తాకిడి ఎక్కువ గనుక అక్కడ కూడా 7.2 తీవ్రతతో భూకంపం వచ్చినా పెద్దగా నష్టం కలగలేదు. ఇక వెనెజులా భూకంపానికి సంబంధించి అధికారిక లెక్కల ప్రకారం ఇంత వరకూ మృతుల సంఖ్య వందల్లోనే ఉన్నా... శిథిలాలు తొలగించాక ఇది వేలల్లోకి చేరినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. స్వల్ప వ్యవధిలోనే భూకంపాలు రావటంతో తప్పించుకునే వ్యవధి లేక చాలామంది శిథిలాల్లో చిక్కుకున్నారు. పీడ పోకుండానే పిశాచం పట్టుకున్న చందాన వెనెజులా వరస కష్టాలు ఎదుర్కొంటున్నది. ఈ ఏడాది జనవరిలో అమెరికా మెరైన్ దళాలు దాడి చేసి దేశాధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్లను అపహరించి తమ దేశానికి తరలించాయి. ఇప్పుడు మదురోపై విచారణ ప్రహసనం నడుస్తోంది. అంతకు చాన్నాళ్ల ముందే అమెరికా ఆంక్షల చట్రంలో ఊపిరాడని దేశ ఆర్థిక వ్యవస్థ 2013 తర్వాత మరింత దెబ్బ తింది. చమురు నిల్వల్లో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా ఉన్న వెనెజులా అమెరికా పీడ లేకుంటే అత్యంత సంపన్నవంతమైన దేశంగా నిలిచేది. కానీ భారీ ద్రవ్యోల్బణం, అవినీతి, అమెరికా ఆర్థిక ఆంక్షల పర్యవసానంగా దాని జీడీపీ 80 శాతం పడిపోయింది. ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్యూజ్ నేతృత్వంలోని ప్రభుత్వం అమెరికా కను సన్నల్లో నడుస్తోంది. దీర్ఘకాలంగా ఉన్న 24,000 కోట్ల డాలర్ల రుణ చెల్లింపును పునర్వ్యవస్థీకరించాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)ను ఆ దేశం కోరింది. ఈ రెండు భూకంపాలవల్లా దేశ ఆర్థికవ్యవస్థకు దాదాపు పదివేల కోట్ల డాలర్ల వరకూ నష్టం సంభవించి ఉండొచ్చని అమెరికా భౌగోళిక సర్వే అంచనా వేస్తోంది. ఆంక్షల వల్ల దశాబ్దాలుగా మౌలిక సదుపాయాల్ని మెరుగుపరచటం ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. వంతెనలూ, రోడ్లు, ఆసుపత్రులు, విద్యుత్ గ్రిడ్లు కాలం చెల్లినవి కావటంతో అవి భూకంపం తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇతరేతర విపత్తులు ముందస్తు సూచనలు అందించి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లడానికి వీలుగా మనిషికి కొద్దిపాటి వ్యవధినిస్తాయి. కానీ భూకంపాలు ఎలాంటి సూచనా అందించవు. ఏం జరిగిందో గ్రహించే లోగానే శిథిలాల గుట్టలతో భీతావహుల్ని చేస్తాయి. ఈసారి కొంత నయం. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో ఉండే యాక్సెలెరోమీటర్ అనే సెన్సర్ అయిదు, పది సెకన్ల ముందు హెచ్చరించటంతో చాలామంది అప్రమత్తమై భారీ భవంతులనుంచి దూరం జరిగి ప్రాణాలు కాపాడుకున్నారు. భూకంపం బయలు దేరినప్పుడు మొదట విడుదలై శరవేగంతో విస్తరించే పీ–వేవ్స్ (ప్రాథమిక తరంగాలు)ను ఆ సెన్సర్ పసిగడుతుంది. ఒకే ప్రాంతంలో అనేక ఫోన్లు ఈ పనిచేసినప్పుడు గూగుల్ క్లౌడ్ సర్వర్‌లోని అల్గారిథమ్ వెనువెంటనే అన్ని ఫోన్లకూ హెచ్చరిక సందేశాన్ని విడుదల చేస్తుంది. ‘భూకంపాల క్రియాశీల దశ’లోకి భూమి చేరుకుని ఉండొచ్చని పదేళ్లక్రితం భూభౌతిక శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేశారు. దానిపై ఇంతవరకూ నిర్ధారణగా చెప్పిందేమీ లేదుగానీ...దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ దేశాలన్నీ ముందు జాగ్రత్తలు తీసుకోవటం మేలు. జపాన్ ఈ విషయంలో చాలా ముందంజలో ఉంది గనుక, ఇతర దేశాలు దాన్ని అనుసరించాలి. అలాగే ప్రకృతికి చేటుతెచ్చే విధానాలు కట్టిపెట్టాలి. ఉన్నంతలో పర్యావరణహిత విధానాలు అనుసరిస్తే ఇలాంటి విపత్తులకు ఆస్కారం తక్కువ ఉంటుంది. -
కేవలం విమానాలే కాదు!
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ యావియేషన్ వద్ద నమోదైన మొత్తం 2,312 మానవ సహిత వాయు వాహనాలలో ఐదింట దాదాపుగా నాలుగో వంతు విమానాలే ఉన్నాయి. మిగతావి హెలికాప్టర్లు, గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లు, అల్ట్రా లైట్ విమానాలు. -
బ్రిటిష్ ‘లేబర్’ గట్టెక్కేదెలా?
అధికారానికి దూరంగా దాదాపు 14 యేళ్ల సుదీర్ఘ నిరీక్షణలో గడిపిన లేబర్ పార్టీని 2024 జూలైలో విజయపథాన నడిపించి, 411 సీట్లు సాధించిపెట్టిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రెండేళ్లు తిరక్కుండా విఫల నేతగా ముద్రపడి నిష్క్రమించబోతున్నారు. ఆయన స్థానంలో పార్టీ నేతగా ఎన్నికై వచ్చేనెల 17 తర్వాత ప్రధాని పగ్గాలు చేపడతారని అందరూ భావిస్తున్న ఆండీ బర్న్‌హామ్ గురించి పార్టీలో అంచనాలు దండిగానే ఉన్నాయి. బర్న్‌హామ్ వాటిని అందుకోగలిగితే 2029లో పార్టీ మరోసారి అధికారంలోకి రాగలుగుతుంది. 1760లో పారిశ్రామిక విప్లవానికి బీజంపడిన ఉత్తర ఇంగ్లండ్‌లోని గ్రేటర్ మాంచెస్టర్‌కు మేయర్‌గా పనిచేసి బర్న్‌హామ్ సాధించిన ఘన విజయాలు తక్కువేమీ కాదు. 2017లో నగర బాధ్యతలు స్వీకరించాక... నాలుగు దశాబ్దాలుగా ప్రైవేటు రంగంలో ఉంటూ, నాసిరకం సేవలతో జనాన్ని ఇబ్బందులపాలుచేసిన బస్సు రవాణాను తిరిగి ప్రభుత్వ రంగ నియంత్రణలోకి తీసుకొచ్చారు. బస్సులు, ట్రామ్‌లు, సైక్లింగ్ మార్గాలను అనుసంధానిస్తూ లండన్ తరహా ‘బీ నెట్ వర్క్’ను ఏర్పాటుచేశారు. ప్రజలకు మెరుగైన, చవకైన ప్రయాణ సదుపాయాన్ని కల్పించారు. గ్రేటర్ మాంచెస్టర్‌ను యూరప్‌లోనే అత్యంత పర్యావరణహిత నగరాల్లో ఒకటిగా మార్చేందుకు కృషి చేశారు. ఈ విజయాలే ఈ నెల మొదట్లో మాంచెస్టర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆయన్ను ఎంపీగా నెగ్గించాయి. బర్న్‌హామ్ ప్రధాని పదవికి పోటీపడగలరని ఎవరూ అనుకోలేదు. పార్లమెంటుకొచ్చి నిండా నెల రోజులు కాకుండానే పార్టీ నాయకత్వానికి సంసిద్ధమని ఆయన ప్రకటించటం, స్టార్మర్ ప్రధాన ప్రత్యర్థిగా అంతవరకూ అనుకున్న మాజీ ఆరోగ్యమంత్రి వెస్ స్ట్రీటింగ్ బర్న్హామ్కే మద్దతిస్తున్నట్టు ప్రకటించటంతో అందరూ విస్మయపడ్డారు. నిజానికి 2024 ఎన్నికల్లో లేబర్ విజయంలో స్టార్మర్ దీక్షాదక్షతలొక్కటే పనిచేయలేదు. అప్పటికే అంతర్గత కలహాలతోవున్న కన్సర్వేటివ్ పార్టీ బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునాక్లను ప్రధానులుగా తెచ్చినా కుదుటపడలేకపోయింది. ఈ రాజకీయ అస్థిరత ఆర్థిక సంక్షోభానికి దారితీసింది. ఇలాంటి దశలో స్టార్మర్ పగ్గాలు చేపట్టి పార్టీని తీవ్ర వామపక్ష విధానాలనుంచి మధ్యేవాద పథానికి తీసుకొచ్చారు. గతంలో లేబర్ నేత టోనీ బ్లెయిర్ ప్రధానిగా దేశాన్ని భ్రష్టుపట్టించిన వైనం జనం మరిచేలా చేసి, తటస్థుల ఓట్లు సైతం రాబట్టారు. అయితే ఎన్నికల్లో నెగ్గటం వేరు... ప్రభుత్వాధినేతగా సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించి, దేశాన్ని సంక్షోభంనుంచి గట్టెక్కించటం వేరు. ఈయూ నుంచి తప్పుకుంటే దేశం బ్రహ్మాండంగా పురోగతి సాధిస్తుందని నమ్మి పదేళ్ల క్రితం దానివైపు మొగ్గిన జనం అన్నివిధాలా నష్టపోయామని ఆలస్యంగా గ్రహించారు. తిరిగి ఈయూలో చేరాలనే స్వరాలు పెరిగాయి. ఈ విషయంలో తన వైఖరేమిటో స్టార్మర్ చెప్పలేదు.అసమానతల్నీ, దారిద్య్రాన్నీ పారదోలటానికి... జనం ఎదుర్కొంటున్న ఆవాస సమస్యను అధిగమించటానికి ఏం చేయాలన్న ప్రణాళికలకు బదులు అంతకంతకూ బలపడుతున్న తీవ్ర మితవాద పక్షం రీఫామ్ యూకే పార్టీని ఎలా ఎదుర్కొనాలన్న అంశంపైనే ఆయన దృష్టి పెట్టారు. నైజెల్ ఫరాజ్ నాయకత్వంలోని ఆ పార్టీని అనుకరించే ప్రయత్నం చేశారు. గాజాలో ఇజ్రాయెల్ సాగించిన నరమేధాన్ని సమర్థించటం, దాన్ని ఖండిస్తూ ఉద్యమించిన పాలస్తీనా యాక్షన్ సంస్థను ఉగ్రసంస్థగా ప్రకటించటం, వలసలపైనా ఆంక్షలు విధించటంలాంటివి చేశారు. ఫరాజ్ పార్టీని కాపీ కొడితేనే దాన్ని ఓడించటం సులభమన్న ఆయన తెలివితక్కువతనం లేబర్ పార్టీకి శాపంగా మారింది. ఉత్తర ఇంగ్లండ్, మిడ్లాండ్స్ వంటి కార్మికులు అధికంగా ఉండే ప్రాంతాల్లో లేబర్ చేతుల్లోవున్న వేలాది కౌన్సిలర్ స్థానాల్నీ, కౌన్సిళ్లనూ ఫరాజ్ పార్టీ కైవసం చేసుకుంది. జాతీయ సర్వేల్లో సైతం ఏకంగా 27 శాతం వరకూ ఓటింగ్ సాధించి లేబర్‌ను మూడో స్థానంలోకి నెట్టింది. దాంతో లేబర్ ఎంపీలంతా వణికిపోయారు. స్టార్మర్ను సాగనంపకుంటే భవిష్యత్తు శూన్యమని గ్రహించారు. నైతికత, సిద్ధాంతాలు లేకుండా గాలివాటు రాజకీయాలకు పాల్పడితే జనం మెచ్చరని స్టార్మర్ ప్రస్థానం నిరూపించింది. బర్న్‌హామ్ ఆయన్నుంచి గుణపాఠం నేర్చుకుని సమర్థ పాలన అందించగలిగితే లేబర్ కోలుకోవటం ఖాయం. -
మళ్లీ మరో విషాదం!
దేశంలో మూడు వారాలలోపే మరో ఘోరం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సోమవారం మధ్యాహ్నం ఒక యానిమేషన్ కోచింగ్ సెంటర్ మంటల్లో చిక్కుకోవటంతో నలుగురు బాలికలతోపాటు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో అత్యధికులు 25 యేళ్ల లోపువారే. మృతుల్లో దాదాపు అందరూ కాలిన గాయాలతోకాక, దట్టమైన పొగలో చిక్కుకుని ఊపిరాడక మరణించిన వారే కావటం గమనించదగ్గది. నివాసగృహ సముదాయాలైనా, వాణిజ్యభవనాలైనా నిర్దిష్ట నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సివుంటుంది. భవన నిర్మాణ సమయంలోనే నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) కోసం దరఖాస్తు చేసుకోవటం, అధికారుల తనిఖీలు నిబంధనల ప్రకారం జరిగితీరాలి. ఒకసారి కాదు... భవనం పూర్తయ్యేలోగా రెండు మూడు సార్లు ఈ తనిఖీలుండాలి. అగ్నిమాపక వ్యవస్థలు సక్రమంగా ఉన్నాయా లేదా... అను కోని విపత్తు ముంచుకొచ్చినప్పుడు తప్పించుకోవటానికి అత్యవసర మార్గాలు ఏర్పాటు చేసుకున్నారా లేదా అనే అంశాలు వీటిల్లో తప్పనిసరి. ఎన్ఓసీకి చెల్లుబాటయ్యే కాలం పూర్తయినాక కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. మళ్లీ అన్ని తనిఖీలూ ఉంటాయి. ఇవన్నీ కాగితాల్లో పొందుపరిచినంతగా ఆచరణలో కనబడవు. సమస్య మూలం అక్కడేవుంది.లక్నోకూ, ఢిల్లీకీ మధ్య ఏమంత దూరం లేదు. ఢిల్లీలో ఈ నెల మొదట్లో జరిగిన రెండు విషాద ఘటనల్లో 30 మంది వరకూ మరణించారు. అనేకులు గాయపడ్డారు. మొదటి ఉదంతంలో అయిదంతస్తుల భవనం కుప్పకూలింది. రెండో ఘటన ఒక హోటల్ మంటల్లో చిక్కుకోవటానికి సంబంధించింది. ఇవి రెండూ మూడు రోజుల వ్యవధిలో జరిగాయి. కానీ ఉత్తరప్రదేశ్ అధికార యంత్రాంగం మన్నుతిన్న పాములా ఉండిపోయింది. ‘విషాదం చోటుచేసుకున్నది ఎక్కడో కదా... మనకేమిటి సంబంధమ’ని భావించే ధోరణి అన్ని వ్యవస్థల్లో పాతుకుపోయిన పర్యవసానంగా ఎక్కడో ఒకచోట ఇలాంటివి తప్పడం లేదు. లక్నోలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఆవాసానికే అనుమతు లున్నచోట వాణిజ్య కార్యకలాపాలు సాగుతుంటే అధికారుల్లో ఏ ఒక్కరికీ పట్టలేదు. లక్నో అభివృద్ధి ప్రాధికార సంస్థ అధికారులు దీన్ని కూల్చటానికి 2016లో నోటీసు లిచ్చినా రెండు నెలల తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు. కారణమేమిటో ఎవరికీ తెలియదు! ఇలా ఏదో ఒక విభాగానికి సర్వాధికారాలూ ఇవ్వటం సమస్యలకు కారణ మవుతున్నది. స్థానిక పోలీసు విభాగం, అగ్నిమాపక విభాగం, విద్యుత్ శాఖ ఇంజినీర్లు, భవన నిర్మాణ నిపుణులు వగైరాలతో కమిటీ ఏర్పరిచి, నిర్దిష్ట వ్యవధిలో అది తప్పని సరిగా సమావేశమయ్యేలా... అనుమతులకూ, నిరాకరణలకూ స్పష్టమైన కారణాలు నమోదు చేసేలా ఉంటే ఇలా లోపాయికారీ వ్యవహారాలు సాగవు. కానీ మన ప్రభు త్వాలు ఆ పని చేయవు. ఘటన జరగ్గానే రావటం, సానుభూతులూ, సంతాపాలూ, ఎక్స్‌గ్రేషియా ప్రకటనలు మాత్రం రివాజు.అగ్నిప్రమాదం గురించి తెలిశాక ఏకంగా 19 అగ్నిమాపక యంత్రాలు వచ్చాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. కానీ చాలాసేపటివరకూ ప్రమాదంలో చిక్కుకున్న భవంతిలోకి వెళ్లటం శక్యం కాలేదు. ఆ భవంతికి ఇరుకైన మెట్ల దారి మినహా మరేం లేకపోవటంతో పక్క భవనాలనుంచి అప్పటికప్పుడు నిచ్చెనలు వేసి ఆ భవనంపైకి చేరుకుని పనిచేయాల్సివచ్చింది. బయటపడే మార్గం లేక వాష్‌రూంలో చేరి నలుగురు పిల్లలు కాపాడమంటూ ఫోన్లలో తమ తల్లిదండ్రులను వేడుకున్నారు. బయటకు వినపడేలా ఆర్తనాదాలు చేశారు. కానీ ఈలోగానే మృత్యుధూమం వారిని కాటేసింది.అవి నివాస భవనాలైనా, వాణిజ్య సముదాయాలైనా తొలినాళ్ల అంచనాకు మించి విద్యుత్ వినియోగం ఉంటుంది. అధిక శక్తిగల విద్యుత్ ఉపకరణాల వాడకం పెరగటం, వాటికి అనుగుణమైన వైరింగ్ లేకపోవటంవల్ల లోడ్ ఎక్కువై షార్ట్ సర్క్యూట్ జరిగిమంటలంటుకుంటాయి. నిర్మాణానికి వాడేవన్నీ మండే స్వభావంగలవి కావటంతో మంటలు పెనువేగంతో వ్యాపిస్తున్నాయి. ఈ రెండేళ్లలో ఒక్క ఢిల్లీలోనే ఆసుపత్రుల్లో 78 అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. నివాసప్రాంతాల్లో వెయ్యికిపైగా ప్రమాదాలు సంభవించాయి. లక్నో విషాదమైనా ప్రభుత్వాల కళ్లు తెరిపించకపోతే అంతకన్నా దారుణం మరోటి ఉండదు. -
నడకదారి ఇక పౌరుల హక్కు
నగరాలు, పట్టణాలు, పల్లెటూళ్లన్న తేడా లేకుండా ఇకపై ప్రతి రహదారికీ పాదచారులు నడవటానికి వీలుగా ఫుట్‌పాత్‌లు ఉండి తీరాలనీ, ఇందుకు సంబంధించి ఒక చట్టం తీసుకురావాలనీ సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం ఇచ్చిన ఆదేశం పౌరులకు ఉపశ మనం కలిగిస్తుంది. ఈ తీర్పు ప్రాముఖ్యతేమంటే... జీవించే హక్కుకు పూచీపడుతున్న రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని, దాంతోపాటు దేశంలో ఎక్కడికైనా వెళ్లే, స్థిరపడే, కలుసుకునే స్వేచ్ఛను వాగ్దానంచేసే అధికరణం 19(1) (ఎ), (బి), (సి), (డి)లను మరింత విస్తృతీకరించటం. దీని పర్యవసానంగా రోడ్లపక్కన ఫుట్పాత్లుండటం ఇకపై పౌరుల ప్రాథమిక హక్కుల్లో ఒకటవుతుంది. అయితే ఈ ఆదేశాలిచ్చే ముందు అసలు ఎన్ని నగరాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో ఫుట్పాత్లున్నాయో... వాటిల్లో ఎన్ని పనికొచ్చే విధంగా ఉన్నాయో గణాంకాలివ్వాలని ధర్మాసనం రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతా లను ఆదేశించాల్సింది. బహుశా అలాంటి ఆదేశం ఇస్తే దీర్ఘకాలం ఎదురుచూపులు చూడటం తప్ప ఫలితం ఉండబోదని న్యాయమూర్తులు భావించి ఉంటారు. న్యాయ స్థానాలు అడిగినప్పుడు ప్రభుత్వాలు తగిన సమాచారం ఇవ్వకపోవటం, వాయిదాలు కోరటం పర్యవసానంగా దేశంలో చాలా కేసులు పెండింగ్‌లో పడుతున్నాయి. వాస్తవానికి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న ఫుట్‌పాత్‌ల సంఖ్యను క్రోడీకరించినట్టు లేదు. ఫుట్‌పాత్‌ల నిర్మాణం, నిర్వహణ సాధారణంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల నిర్వహణలో ఉంటాయి. కేంద్రం తల్చుకుంటే ఈ వివరాలు సేకరించి జాతీయ స్థాయి డేటా రూపొందించగలదు. కానీ ఆ అవసరం ఉందని భావించాలి గదా! ఫుట్‌పాత్‌లు అనేవి మన దేశంలో బ్రహ్మపదార్థం లాంటివి. రోడ్డుపక్కన ఎక్కడో ఒకచోట ఇటుక, సిమెంట్, టైల్స్ శిథిలాలుంటే ఒకప్పుడు ఇక్కడ ఫుట్‌పాత్ ఉండేదని అను కోవటం తప్ప చాలాచోట్ల వాటి జాడ కనబడదు. నగరాలూ, పట్టణాల్లో రోడ్డెక్కిన పాదచారి క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లటం కోసం దారిలో గోతులు, రాళ్లురప్పలూ ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకుంటూ నడవక తప్పని స్థితి. వీటి సంగతలావుంచి ట్రాఫిక్ రద్దీ సమయాల్లో ద్విచక్రవాహనదారులు అసహనంతో ఆ నడకదారులను సైతం కాజేస్తారు. ఇక చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునేవారు సరేసరి. హైదరాబాద్‌లో మెట్రో రైల్ వచ్చాక స్టేషన్లకు అటూ ఇటూ ఫుట్‌పాత్‌లపై రెస్టారెంట్లు వెలిసి పాదచారుల్ని సవాలు చేస్తున్నాయి. తోపుడు బండి లేదా సైకిళ్లపై వ్యాపారాలు చేసుకునేవారిని అప్పుడప్పుడు ట్రాఫిక్ పోలీసులు అదిలించటం కనబడుతుంది. కానీ మెట్రో స్టేషన్ల దగ్గరుండే రెస్టారెంట్ల జోలికి ఎవరూ వెళ్లిన దాఖలా లేదు. ఇక దేశంలోని ఆరు లక్షల గ్రామాల్లో ఫుట్‌పాత్‌ల సదుపాయంగల ఊళ్లు కనీసం వందల సంఖ్యలోనైనా ఉంటాయా అన్నది సందేహమే. వాటి సంగతలావుంచి దేశ రాజధాని నగరంలో 44 శాతం రోడ్లకు ఫుట్‌పాత్‌లు లేవని ఆమధ్య ఢిల్లీ ఐఐటీ నివేదిక తెలిపింది. ఉన్నచోటైనా దాదాపు 28 శాతం మాత్రమే ఇండియన్ రోడ్ కాంగ్రెస్(ఐఆర్సీ) నిబంధనలకు అనుగుణమైనవని ఆ నివేదిక తేల్చిచెప్పింది. ఈ తీర్పు వెలువరించటానికి దారితీసిన కేసు విషాదకరమైనది. అయిదేళ్ల బాలుడిని అతని తండ్రి పాఠశాల సమీపంలో దించి వెళ్తుండగా హఠాత్తుగా వచ్చిన ట్యాంకర్ ఆ బాలుడిపైకి దూసుకెళ్లి ప్రాణాలు తీసింది. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వాలు కదిలితే ఇలాంటి విషాదాలను నివారించవచ్చు. అయితే బాధాకరమైన విషయమేమంటే... ఈ హక్కు అమల్లోకి రావాలంటే పౌరులు నెరవేర్చాల్సిన విధులు చాలా ఉంటాయి. ఫలానాచోట ఫుట్‌పాత్ లేదని సంబంధిత అధికారికి లిఖితపూర్వక ఫిర్యాదు చేసి, ఈ తీర్పును ఉటంకించాలి. అటు తర్వాత దాని సంగతేమైందో కనుక్కోవాలి. అవసరమైతే ఆర్టీఐని ఆశ్రయించాలి. అటు తర్వాత ఫుట్‌పాత్ లేనిచోట పరిస్థితిని తెలిపే ఫొటోతో హైకోర్టులో పిల్ దాఖలు చేయాలి. అందులో తీర్పు వెలువడటానికి దీర్ఘకాలం వేచిచూడాలి. విద్యాహక్కు చట్టం, పనిచేసే హక్కు చట్టంవంటివి ఆచరణలో ఎలా నీరుగారుతున్నాయో కనబడుతూనే ఉంది. ఏ హక్కు అమలు కావాలన్నా పౌరులంతా ఒక్కటై ఉద్యమించటమే, ప్రభుత్వాలపై ఒత్తిళ్లు తీసుకురావటమే మార్గం. -
అరణ్యరోదన
మన ప్రాచీనులు అడవులను దైవంగా ఆరాధించేవారు. అడవులను జీవజాలానికి ప్రాణాధారంగా చూసేవారు. అడవులను పవిత్ర తపోభూములుగా పరిగణించేవారు. అరణ్యాల ప్రస్తావన లేని పురాణేతిహాసాలేవీ మనకు లేవు. ఉద్యాన వర్ణన లేని ప్రబంధాలేవీ మనకు లేవు. అరణ్యకాండ లేని రామాయణాన్ని, అరణ్యపర్వం లేని మహాభారతాన్ని మనం ఊహించుకోలేం. ప్రాచీన వేదర్షులు సైతం వన ప్రాశస్త్యాన్ని ప్రస్తుతించారు. ‘అంజనగంధిం సురభిం బహున్నామ కృషీవలామ్/ ప్రాహం మృగాణాం మాతరమరణ్యానిమశంసిషమ్’ అని ఋగ్వేదంలోని ‘అరణ్యాని సూక్తం’ చెబుతోంది. అంటే, అంజనంలా సుగంధభరితమైనది, అనేక జంతువులకు తల్లివంటిది అయిన అరణ్యదేవతను స్తుతిస్తున్నాను అని అర్థం. ‘దశకూప సమా వాపీ దశవాపీ సమో హ్రదః/ దశహ్రద సమః పుత్రో దశపుత్ర సమో ద్రుమః’ అని ‘పద్మపురాణం’ చెబుతోంది. అంటే, పది బావులకు సమానం ఒక చెరువు, పది చెరువులకు సమానం ఒక సరస్సు, పది సరస్సులకు సమానం ఒక పుత్రుడు, పదిమంది పుత్రులకు సమానం ఒక వృక్షం అని అర్థం. ‘అశ్వత్థమేకం పిచుమందమేకం న్యగ్రోధమేకం దశతింత్రిణీకం/ కపిత్థ బిల్వామలకత్రయాంచ పంచామ్రవాపీ నరకం న వశ్యేత్’– రావిచెట్టు, వేపచెట్టు, మర్రిచెట్టు ఒక్కొక్కటి చొప్పున; పది చింతచెట్లు; మూడేసి వెలగచెట్లు, మారేడుచెట్లు, ఉసిరిచెట్లు; ఐదు మామిడిచెట్లు పెంచినవాడికి నరకం ఉండదు అని స్కాందపురాణం చెబుతోంది. వేద పురాణేతిహాసాలను గమనిస్తే, ప్రాచీనులు చెట్టు చేమలతో నిండిన అడవులకు ఎంతటి విలువనిచ్చేవారో అర్థమవుతుంది.ప్రాచీనకాలంలో రాజులు కూడా అడవుల సంరక్షణను బాధ్యతగా భావించేవారు. ‘ద్రవ్యవనకర్మాంతాశ్చ ప్రయోజయేత్/ ద్రవ్యవనచ్ఛిదాం చ దండం కారయేత్’ అని కౌటిల్యుడి అర్థశాస్త్రం చెబుతోంది. అంటే, అటవీ సంపదనకు సక్రమంగా వినియోగించాలి. అక్రమంగా అడవులను నరికివేసేవారిని శిక్షించాలి అని అర్థం. కౌటిల్యుడు ‘అర్థశాస్త్రం’లో అభయవనాలు, హస్తివనాలు వంటి రకరకాల అడవుల సంరక్షణ కోసం పాటించవలసిన విధి విధానాలను వివరంగా చెప్పాడు. దాదాపు పదివేల ఏళ్ల కిందట– నాగరికతలు మొదలైన కాలంలో భూమ్మీద దాదాపు అరవై శాతం అడవులే ఉండేవి. పద్దెనిమిదో శతాబ్దిలో పారిశ్రామిక విప్లవం మొదలయ్యేంత వరకు అడవుల పరిమాణం దాదాపు ఇదే స్థాయిలో ఉండేది. పారిశ్రామిక విప్లవం నాటి నుంచి అడవులు క్షీణించడం మొదలైంది. ఆధునికత, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ అడవుల విస్తీర్ణాన్ని కబళించడం మొదలైంది. ఇప్పుడు భూమ్మీద దాదాపు ముప్పయి శాతం అడవులు మాత్రమే మిగిలి ఉన్నాయి. పారిశ్రామిక విప్లవం నాటి నుంచి నేటి వరకు భూమ్మీద ఉన్న అడవుల విస్తీర్ణం సగానికి సగం క్షీణించి పోయింది. ప్రస్తుత శతాబ్ది మొదలైన తొలి ఇరవై ఏళ్లలోనే ఏకంగా ఆరు శాతం మేరకు అడవులు తరిగిపోయాయి. మన దేశంలోనైతే, స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు సగానికి సగం అడవులు అంతరించిపోయాయి. ఒకవైపు అడవుల విస్తీర్ణం తరిగిపోతుంటే, మరోవైపు మరుభూముల విస్తీర్ణం పెరుగుతోంది. గడచిన శతాబ్ద కాలంలో సహారా ఎడారి విస్తీర్ణం పది శాతం పెరిగింది. ‘ఒక అడవిని సృష్టించడం కంటే ఒక ఎడారిని సృష్టించడం తేలిక కావడమే విచారకరం’ అన్నాడు ఇంగ్లిష్ శాస్త్రవేత్త, పర్యావరణవేత్త జేమ్స్ లవ్‌లాక్. పనులు తేలిక చేసుకోవడానికి అలవాటుపడ్డ ఆధునికులు అడవులను సృష్టించే శ్రమ తీసుకోకుండా, తేలికగా ఎడారులను సృష్టించుకుంటున్నారు. అడవులు పుడమికి ఊపిరితిత్తులు. ఆధునిక మానవులు వాటికి తూట్లు పొడుస్తున్నారు. పర్యవసానంగా భూతాపం పెరిగి, మనుషులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మనుషులకు ఊపిరాడాలన్నా, సకాలంలో వానలు కురిసి పంటలు పండాలన్నా, ఇంకా ఈ భూమ్మీద మానవాళి మరిన్ని కాలాలపాటు మనుగడ సాగించాలన్నా, మనం ఇప్పటికైనా మేలుకొని అడవులను కాపాడుకోవాలి. అడవులన్నీ నశించాక మానవాళి చేసే ఆక్రందనలు అరణ్యరోదనలే అవుతాయి. -
జై భీమ్... జై సంవిధాన్!
ఏప్రిల్ ఏడో తేదీన దేశంలోని అన్ని దినపత్రికల్లో ఒక వార్త చాలా ప్రముఖంగా రిపోర్టయింది. చిరువ్యాపారులైన తండ్రీ కొడుకులిద్దరినీ కస్టడీలో చిత్రహింసలు పెట్టి వారి చావుకు కారణమైన తొమ్మిదిమంది తమిళనాడు పోలీసులకు మధురై హైకోర్టు బెంచ్ ఉరిశిక్ష విధించింది. మొదట ఈ కేసుపై రాష్ట్ర స్థాయి పోలీసు విచారణకు ఆదేశించారు. దానివలన ఫలితం ఉండదని భావించిన మద్రాసు హైకోర్టు స్వయంగా జోక్యం చేసుకొని సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతో నిజాలు బయట కొచ్చాయి. ఉరిశిక్ష వార్త విన్న తర్వాత లాఠీ ప్రభువుల ఉత్సాహా నికి కొంతకాలమైనా కళ్లెం పడుతుందని ఎవరైనా భావిస్తారు.ఉన్నతస్థాయుల్లో పుష్కలంగా పలుకుబడి, అండదండలు ఉన్న అధికారులకు మాత్రం ఏ వార్తలు విన్నా ఎటువంటి భయాలూ ఉండవని తేలిపోవడానికి ఎంతోకాలం పట్టలేదు. ఉరిశిక్షల వార్త వెలువడిన ఒక్క నెలరోజుల నుంచి మరో నెల గడిచేలోగా ఆంధ్రప్రదేశ్‌లో ఖాకీ తాండవానికి సంబంధించి నాలుగు విషాద ఉదంతాలు వెలుగుచూశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించుకున్న ‘పొలిటికల్ గవర్నెన్స్’ను గుర్తుచేసు కోవడం ఇక్కడ అసందర్భం కాకపోవచ్చు. అదేవిధంగా ఎన్నికలకు ముందే లోకేశ్‌బాబు రచించి, అధికారంలోకి రాగానే అమల్లోకి తెచ్చిన రెడ్‌బుక్ దిశానిర్దేశం గురించి గుర్తుచేయడం కూడా అసంగతమేమీ కాదు. పొలిటికల్ గవర్నెన్స్‌కూ, రెడ్‌బుక్ సందేశవ్యాప్తికీ పోలీసుల ‘ఆఫ్ ద రికార్డు’ సేవలు అవసరమైనప్పుడు, ఉభయ కుశలోపరిగా పోలీసు అధికారులు చిక్కుల్లో పడ్డప్పుడు ఉన్నతస్థాయి సహకారం ఉంటుందని భావించడం సహజం. కూటమి గద్దెనెక్కిన కొద్దిరోజుల్లోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వినుకొండ పట్టణంలో రషీద్ అనే వైసీపీ కార్యకర్తను పబ్లిగ్గా నడిరోడ్డు మీద పరిగెత్తిస్తూ కత్తులతో పొడిచి చంపారు. నో పోలీస్! అదే ఉమ్మడి జిల్లాలోని తెనాలి పట్టణంలో కొద్ది నెలల తర్వాత దళిత, మైనారిటీ యువకులను నడివీధిలో పడుకోబెట్టి సమస్త ప్రజల సమక్షంలో పోలీసులు వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. నో యాక్షన్!! థర్డ్ డిగ్రీ హింసను సుప్రీంకోర్టు నిషేధించింది. కానీ పొలిటికల్ గవర్నెన్స్ వ్యవస్థలో పరస్పర సహకారం వర్ధిల్లుతున్న వేళ న్యాయస్థానాల విధి నిషేధాలను ఎవరు ఖాతరు చేస్తారు?ఈ దేశంలోని ప్రతి పౌరునికీ జీవించే హక్కునూ, వ్యక్తిగత స్వేచ్ఛనూ, ఆత్మగౌరవంతో కూడిన జీవనయాన హక్కునూ భారత రాజ్యాంగంలో 21వ అధికరణం ప్రసాదించింది. చట్టపర మైన విధివిధానాల ద్వారా తప్ప మరేరకంగా ఈ హక్కులో జోక్యం చేసుకునే వీలు లేదని స్పష్టం చేసింది. అయినా పెరిగిపోతున్న పోలీసుల అతి ప్రవర్తన, కస్టోడియల్ మరణాల పట్ల ఉన్నత న్యాయస్థానాలు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేస్తూ పలు మార్గదర్శకాలను విడుదల చేశాయి. ఒక వ్యక్తి పోలీసు స్టేషన్ మెట్లెక్కినంతనే అతని ప్రాథమిక హక్కులు మాయమై పోవని న్యాయమూర్తులు అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. లాకప్ హింస ద్వారా వ్యక్తి జీవించే హక్కును, వ్యక్తిగత గౌర వాన్ని ధ్వంసం చేసే హక్కును లాగేసుకోవడమంటే, అనుల్లంఘనీయమైనవిగా భారత రాజ్యాంగం నిర్వచించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది. కంచె చేను మేయడ మవుతుంది. రాజ్యాంగ ద్రోహమే అవుతుంది.రాజ్యాంగ వ్యవస్థను కూలదోసే లక్ష్యంతో పనిచేసే నక్స లైట్లు రాజ్యాంగ ద్రోహానికి పాల్పడుతున్నారని నిర్ణయించి రాజ్యవ్యవస్థ వారిని ఎన్కౌంటర్ హత్యలు చేసింది. మరి రాజ్య వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్నవారే రాజ్యాంగానికి ద్రోహం తలపెడితే? ఇదిగో ఇలాంటివారే మరింత ప్రమాదకారులని న్యాయశాస్త్ర కోవిదులు వ్యాఖ్యానిస్తున్నారు. తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ చంద్రు అడ్వకేట్‌గా ఉన్నకాలంలో ఈ సూత్రం మీదనే వాదించి ఒక నిస్సహాయ పేద గిరిజనుడి లాకప్ మృతికి ప్రభుత్వాన్ని బాధ్యురాలిగా నిలబెట్ట గలిగారు. సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమా ఇతివృత్తం కూడా ఈ యథార్థ ఘటనే. చంద్రు వాదనల ఫలితంగా మృతుడి భార్యకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడమే కాకుండా, నింది తులకు శిక్షపడేలా చేయగలిగింది.మే 8 నుంచి జూన్ 16 వరకు ఏపీలో జరిగిన నాలుగు పోలీస్ సంబంధిత విషాదాల తర్వాత ప్రభుత్వ పెద్దల స్పందన గానీ, ఉన్నతాధికారుల కార్యాచరణగానీ సందేహాస్పదంగానే కనిపిస్తున్నది. ఒక కేసుకు సంబంధించి విచారణ పేరుతో మార్కాపురంలో పొట్టపోసుకుంటున్న సాయికృష్ణ అనే యువకు డిని విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈనెల 8న అరెస్టు చేసి విజయవాడలోని కృష్ణలంక పోలీసులకు అప్పగించినట్టు ఇప్పటి వరకు అందుతున్న వార్తలను బట్టి తెలుస్తున్నది. కుమారుడిని స్టేషన్లో పెట్టి హింసిస్తున్నారనే సమాచారంతో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నెలరోజులపాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. తన కుమారుడిని కనీసం చూపెట్టాలని కోరినా సీఐ నాగరాజు లక్ష్యపెట్టలేదు. పైగా, ‘మీవాడిని చంపేశాం, వెళ్లి ఫోటోకు దండ వేసుకో పో’ అని కూడా సీఐ అన్నారని విజయలక్ష్మి మీడియా ఎదుటే వాపోయారు. సిటీ పోలీస్ కమిషనర్ దగ్గరకీ, డీజీపీ దగ్గరికీ వెళ్లి బతిమాలుకున్నా న్యాయం జరగలేదని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.హైకోర్టులో విజయలక్ష్మి హెబియస్ కార్పస్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈనెల 29వ తేదీ లోగా సాయికృష్ణను న్యాయస్థానం ఎదుట హాజరుపరచాలని ఆదేశించింది. ఈలోగా ‘సాక్షి’ పత్రికలో వచ్చిన వార్తలు, ఫొటోలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. దీనిపై కొందరు వైసీపీ నాయకులతోపాటు మరికొందరు సామాజిక ఉద్యమ కారులు సాయికృష్ణ ఉదంతంపై గళం విప్పడం ప్రారంభించారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులు గానీ, పోలీసు ఉన్నతాధికారులుగానీ ఈ అంశంపై మాట్లాడేందుకు సాహసించలేదు. రాజమండ్రి ఎస్పీ ఆధ్వర్యంలో ఒక విచారణ సంఘాన్ని వేసి చేతులు దులుపుకొన్నారు.రెండు రోజుల క్రితం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయికృష్ణ ఇంటికి వెళ్లి అతని తల్లిని పరామర్శించి, ఉదంతంపై సీబీఐ ఎంక్వయిరీకి డిమాండ్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చింది. విజయలక్ష్మి గతంలో మొరపెట్టుకున్నా స్పందించని కమిషనర్ వెంటనే ఆమె కుటుంబ సభ్యులను పిలి పించుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారట! ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విజయలక్ష్మిని, ఆమె సోదరులను తన నివా సానికి రప్పించి న్యాయం చేస్తామని చెప్పారట! నిందితులను శిక్షిస్తామని కూడా హామీ ఇచ్చారట! సీఐ నాగరాజును సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అతనిపై హత్య కేసు నమోదు చేసి విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ఓ ఏసీపీని దర్యాప్తు అధికారిగా నియమించారు.ఇక్కడే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాయికృష్ణ హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నట్టయితే దానికి సీఐ ఒక్కడే బాధ్యుడవుతాడా? కిందివారికిగానీ, పైస్థాయి వారికిగానీ ఎవ రికీ తెలియకుండానే నాగరాజు హత్య చేసి శవాన్ని మాయం చేశాడా? సాయికృష్ణను అరెస్టు చేసి తీసుకొచ్చిన టాస్క్‌ఫోర్స్ విజయవాడ కమిషనర్ పరిధిలో పనిచేస్తున్నది. కృష్ణలంక సీఐ నాగరాజు కూడా ఆయన పరిధిలోనే పని చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో రోజువారీ రొటీన్ ప్రకారం డైలీ సిచువేషన్ రిపోర్టు (డీఎస్ఆర్)ను కమిషనర్ కార్యాలయానికి (గ్రామీణ జిల్లాల్లో అయితే ఎస్పీ ఆఫీసుకు) స్టేషన్ హౌస్ ఆఫీసర్ పంపిస్తారు.అందులో ఆరోజు అరెస్టు చేసి తీసుకొచ్చిన వివరాలు కూడా ఉంటాయి. పైగా రోజుకు రెండుసార్లు కమిషనర్‌తో స్టేషన్ అధి కారులకు టెలీకాన్ఫరెన్స్ కూడా ఉంటుంది. ఇందులో కమిషన ర్తో పాటు డీసీపీలు, ఏసీపీలు, సీఐలందరూ పాల్గొంటారు. ఆరోజు ఇరిగిన వ్యవహారాలన్నీ అందులో చర్చకు వస్తాయి. ఇటువంటి పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నప్పుడు పైస్థాయి అధికారులకు సాయికృష్ణ లాకప్ వ్యవహారం తెలియకుండా ఎలా ఉంటుంది? అతను లాకప్‌లో చనిపోతే ఆ విషయం కూడా పైస్థాయి అధికారులకు ఎలా తెలియకుండాపోతుంది? ఓ దళిత యువకుడు క్రాంతికుమార్ కూడా మే 21న ఆత్మహత్య చేసు కున్నారు. ‘సీఐ నాగరాజు వేధింపులను తట్టుకోలేకపోతున్నాను. మళ్లీ పోలీస్ స్టేషన్‌కు రమ్మని పిలుస్తున్నారు. మాదిగ కులంలో పుట్టడమే నేను చేసిన పాపమా’ అని ప్రశ్నిస్తూ లైవ్‌లో ఆత్మ హత్య చేసుకున్న వీడియో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నది. సాయికృష్ణ మృతి, క్రాంతి కుమార్ ఆత్మహత్య దాదాపు ఒక వారం రోజుల వ్యవధిలోనే జరిగి ఉంటాయి. పైస్థాయి తోడ్పా టుపై ఎంత భరోసా లేకపోతే ఆ సీఐ ఇంత విచ్చలవిడిగా వ్యవ హరిస్తాడు? ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసు శాఖ పరిధిలోనే విచారణ జరిపితే న్యాయం జరిగే అవకాశం లేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.నగర పోలీస్ కమిషనర్‌కు సీఐ నాగరాజు వ్యవహారం తెలిసే ఉంటుందనీ, లేకపోతే శవాన్ని మాయం చేయడంగానీ, ఇంతకాలం విషయాన్ని దాచిపెట్టడంగానీ సాధ్యం కాదనేది సహజంగా ఎవరికైనా కలిగే అభిప్రాయం. ఈ నేపథ్యంలో సాయికృష్ణ ఉదంతంపై, నాగరాజు నిర్వాకాలపై సీబీఐ విచారణ జరిగితేనే న్యాయం జరిగే అవకాశముంటుంది. లేకపోతే శవం దొరకలేదు కాబట్టి, లాకప్‌లో చంపారనేందుకు ఎవరూ సాక్ష్యం చెప్పలేదు కాబట్టి కేసును హుష్‌కాకి చేయరని చెప్పలేము. సాయికృష్ణ, క్రాంతికుమార్ ఉదంతాలే కాదు, తెనాలిలో తిరుపతమ్మ అనే మహిళ తాను చేయని నేరాన్ని ఒప్పుకోవాలని పోలీసులు వేధించడం వల్ల గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నది. మే 25న ఈ ఘటన జరిగింది. జూన్ 16న విజయనగరం జిల్లాలో కూడా మరో మహిళ అదే కారణాలతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నది.చేయని నేరాలని అంగీకరించాలని బలహీన వర్గాలను వేధించడం యథేచ్ఛగా జరిగిపోతున్నది. పొలిటికల్ గవర్నెన్స్ కారణంగా ఈ ధోరణి మరింత పెచ్చరిల్లిపోతున్నది. పవర్ చేతిలో ఉన్నప్పుడు బాధిత కుటుంబాల సభ్యులను నయానో భయానో లొంగదీసుకోవడం అధికారులకూ, నేతలకూ పెద్ద కష్టం కాకపోవచ్చు. తమకు న్యాయం జరిగిందని బాధితుల నోటితో చెప్పించినా ఆశ్చర్యపడిపోవలసిన అవసరం లేదు. కానీ రాజ్యాంగ విలువల్ని ధ్వంసం చేసే ఈ దుర్మార్గాన్ని అంతం చేయాలంటే ప్రతి లాకప్ డెత్ కథను, ప్రతి పోలీసు వేధింపు ఉదంతాన్ని జై భీమ్ కథ లాగా ముగించవలసిన అవసర మున్నది. రాజ్య వ్యవస్థను బాధ్యురాలిగా నిలబెట్టవలసిన అవసరం పౌర సమాజం మీద ఉన్నది. అప్పుడే రాజ్యాంగబద్ధ పరిపాలన సాధ్యమవుతుంది. అందుకు తొలిమెట్టుగా విజయ వాడ ఘటనలపై సీబీఐ దర్యాప్తు జరిగేలా ఉద్యమించాలి. జై భీమ్, జై సంవిధాన్!!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
అమెరికా అమిత్ర వైఖరి
ఒకసారంటూ పొరపొచ్చాలు వచ్చాక ఎంత సన్నిహిత మిత్రుల మధ్యనైనా తిరిగి సాధారణ సంబంధాలు ఏర్పడటం అంత సులభం కాదు. ఫ్రాన్స్‌లో జరిగిన జీ–7 దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య బుధవారం జరిగిన ద్వైపాక్షిక సమావేశం తీరుతెన్నులు గమనిస్తే ఈ సంగతి సులభంగా అర్థమవుతుంది. ట్రంప్ గత 16 నెలలుగా అనుసరిస్తున్న అమిత్ర వైఖరి ఇందుకు కారణం. మిత్ర దేశాలని లేదు, ప్రత్యర్థి దేశాలని లేదు – అందరినీ ఒకే గాటన కడుతూ, ఒక దేశాధినేతకు ఉండాల్సిన కనీస ఔచిత్యాన్ని మరిచి ఇష్టానుసారం మాట్లా డటం ఆయనకు అలవాటుగా మారింది. అంతేకాదు – ఎడాపెడా అధిక సుంకాలు విధించటం, తమ సరుకుపై సుంకాలు తగ్గించాలని కోరడం వంటివి మన దేశాన్ని చీకాకు పరి చాయి. ఇలాంటì చేదు అనుభవాలు ఎన్ని ఎదురైనా మన దేశం సంయమనం పాటించింది. నిజానికి మొన్న భారత నావికులు ముగ్గుర్ని హార్మూజ్ జలసంధి వద్ద హత్య చేసిన ఉదంతంతోసహా ఈ 16 నెలల పొడవునా మన దేశం పరుషంగా మాట్లాడింది ఎప్పుడూ లేదు. నోబెల్ శాంతి బహుమతి యావలో భారత్–పాక్ యుద్ధాన్ని తానే ఆపాననీ, ఇద్ద రినీ తీవ్రంగా బెదిరించాననీ మాట్లాడినప్పుడు అందులో ఏమాత్రం నిజం లేదని మన దేశం చెప్పింది. ఆయన ఇలా డప్పుకొట్టుకుంటున్నప్పుడల్లా మొదట్లో ఖండిస్తూనేవచ్చింది. కానీ దీన్ని ఆయన ఒక అలవాటుగా మార్చుకున్నారని తేలాక మిన్నకుండి పోయింది. అయినా ట్రంప్‌లో ఆగ్రహావేశాలు తగ్గలేదని తాజా సమావేశం రుజువు చేసింది. మాటలకేం... ట్రంప్ చాలా మాట్లాడారు. 55 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశం అనంతరం ‘మోదీ మంచిగా కనబడతారు. బాగుంటారు. దేవదూత. కానీ ‘కిల్లర్’. వాణిజ్య, వ్యాపార చర్చల్లో చాలా కఠినంగా, నిక్కచ్చిగా ఉంటారు’ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం ఎవరైనా భారత్‌వైపు కన్నెత్తి చూస్తే వాళ్ల అంతు చూస్తామని కూడా చెప్పారు. వాణిజ్య ఒప్పందం విషయంలో చాలా దగ్గరగా వచ్చేశామని కూడా అన్నారు. కానీ చేతలు చూస్తే అందుకు అనుగుణంగా లేవు. తన ఆధ్వర్యంలోని కమాండ్లలో ఒకటైన ఇండో–పసిఫిక్ కమాండ్‌కు ఆ పేరు పెట్టింది ఆయన ఏలుబడిలోని అమెరికాయే. తిరిగి ఆయనే ఎనిమిదేళ్లనాటి ఆ పేరులో భారత్నుసూచించే ‘ఇండో’ తొలగించి ఇప్పుడు యూఎస్–పసిఫిక్ కమాండ్‌గా మార్చటం, అది కూడా ఈ సమావేశానికి కొంచెం ముందుగా చేయటం యాదృచ్ఛికమేమీ కాదు. ఇటీవల యూఎస్–పసిఫిక్ కమాండ్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను పాకిస్తాన్లో అంతర్భాగంగా చూపటంలోనూ అమెరికా దురుద్దేశం స్పష్టమే. పాకిస్తాన్ పాలకులతో ట్రంప్‌కి ఏర్పడిన కొత్త చుట్టరికం అందరికీ తెలుసు. తూర్పు, దక్షిణ చైనా సముద్ర ప్రాంతాల్లో చైనా దూకుడునూ, ఆధిపత్య ధోరణుల్నీ ఎదుర్కొనటానికి ఆ దేశంతో సమస్యలున్న భారత్‌ను కలుపుకోవాలని నిర్ణయించి 2007లో క్వాడ్‌కు అంకురార్పణ చేసింది అమెరికాయే. హిందూ మహా సముద్రప్రాంతంలో చైనా విస్తరణవాద వైఖరిని ఎదుర్కొనటానికి క్వాడ్, దాంతోపాటు ఇండో– పసిఫిక్ కమాండ్ తోడ్పడతాయని కూడా అప్పట్లో తెలిపింది. కానీ స్వప్రయోజనాలే తప్ప మరేమీ పట్టని అమెరికాను నమ్ముకుని ముందడుగు వేయొద్దని అనేకమంది నిపుణులు అప్పట్లోనే మన దేశాన్ని హెచ్చరించారు. ఇవాళ చైనాతో అంటకాగటానికి రెడీ అయి, ఆ కమాండ్ పేరే మార్చిన అమెరికా కీలక సమయాల్లో ఎలా ఉండగలదో సులభంగానే ఊహించుకోవచ్చు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కిన వెంటనే అందరికన్నా ముందు ఆయనతో వాణిజ్య ఒప్పందంపై చర్చించింది మనమే అయినా... మన తర్వాత వచ్చిన దేశాలు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మనం కూడా బ్రిటన్, యూరోపియన్ యూని యన్ (ఈయూ), కెనడాలతో వాణిజ్య ఒప్పందాలు ఖరారు చేసుకోగలిగాం. వీటిపైలాంఛనంగా సంతకాలు చేయటమే మిగిలివుంది. మనకి నచ్చని అంశాలున్నప్పుడూ, అన్యాయమైన షరతులు పెడుతున్నప్పుడూ వ్యతిరేకించటం, కొంత జాప్యం జరిగినా ఈ విషయంలో మన ప్రయోజనాల పరిరక్షణకే ప్రాముఖ్యతనివ్వటం సరైన వైఖరి. ఉత్త మాటలతో ఎవరినీ నమ్మించలేమని ట్రంప్ గ్రహించేలా చేయటం అవసరం. -
ఎట్టకేలకు శాంతి దిశగా...
అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఖరారు దిశగా తొలి అడుగు పడింది. ఫ్రాన్స్‌లోని ప్యాలెస్ ఆఫ్ వెర్సాయ్లో ఈ ఒప్పందానికి సంబంధించిన అవగాహన పత్రం (ఎంఓయూ)పై స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంతకాలు చేశారు. ఇద్దరూ పరస్పరం వేల కిలోమీటర్ల దూరంలో ఉండి ఈ తంతు ముగించడాన్నిబట్టే ఆ రెండు దేశాలమధ్యా ఉన్న వైషమ్యాల తీవ్రతేమిటో తెలుస్తుంది. మొదట ట్రంప్ సంతకం చేసి ఆన్లైన్లో పంపిన ఎంఓయూ నకలు తీసుకుని దానిపై పెజెష్కియాన్ సంతకం చేశారు. ఈ వారం ఆఖరులో జెనీవాలో ఈ సంతకాల కార్యక్రమం ఉంటుందని తొలుత ప్రకటించినా, ఎందుకనో అంతా మారింది. అనుసరించిన విధానం ఏమైనా, ఇకపై పశ్చిమాసియా ప్రశాంతంగా ఉంటే అదే పదివేలని ప్రపంచ ప్రజానీకమంతా ఆరాట పడుతున్నది. తుది ఒప్పందానికి రావటం కోసం రాగల అరవై రోజుల వ్యవధిలో అమెరికా, ఇరాన్ రెండూ ఏమేం చేయాలో ఈ 14 అంశాల ఎంఓయూలో ఉంది. ఇతరత్రా అంశాల మాటెలావున్నా హార్మూజ్ ప్రతిష్ఠంభనకు తెరపడటం, అణ్వాయుధాల జోలికిపోనని ఇరాన్ హామీ ఇవ్వటం ప్రధానమైనవి. లెబనాన్‌లో ఇజ్రాయెల్ సాగించే హత్యాకాండను ఆపటంతోసహా అన్ని రకాల యుద్ధాలూ పరిసమాప్తం చేయటం, ఇరాన్ పునర్నిర్మాణానికి అమెరికా, ఈ ప్రాంత భాగస్వామ్య దేశాలూ 30,000 కోట్ల డాలర్ల నిధిని సమకూర్చటం, ఇరాన్ చమురు విక్రయాలపై అమెరికా ఆంక్షల తొలగింపుపై విధివిధానాలు వెల్లడించటం కూడా ఇందులో భాగమే. 30 రోజుల్లో ఇరాన్ సమీపంలోని అమెరికా నౌకలన్నీ నిష్క్రమిస్తాయనీ, యుద్ధ ప్రారంభానికి ముందున్న పరిస్థితులు పునరుద్ధరిస్తారనీ ఎంఓయూ చెబుతోంది. అయితే ఇప్పటికే 60 శాతం అభివృద్ధి చేసిన యురేనియం విషయంలో ఇరాన్ ఏం చేయాలో ఇరు దేశాలూ చర్చించుకుంటాయి. ఇజ్రాయెల్‌తో కుమ్మక్కయి అకారణంగా, ఏకపక్షంగా ప్రారంభించిన ఈ యుద్ధాన్ని ఎటు తీసుకుపోవాలో, ‘గౌరవప్రదంగా’ ఎలా బయటపడాలో దిక్కుతోచని అమెరికాకు ఇప్పుడు అన్నివిధాలా గర్వభంగమైంది. చిత్రమేమంటే... ఒకే లక్ష్యంతో ఈ ఊబిలోకి దిగిన మిత్రులు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూలిద్దరికీ కొద్ది రోజుల్లోనే మార్గాలు వేరయ్యాయి. ఈ యుద్ధాన్ని తక్షణం వదుల్చుకుంటే తప్ప ఏడాది ఆఖరుకల్లా దేశంలో జరిగే మధ్యంతర ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోవటం ఖాయమని ట్రంప్‌కు అర్థమైతే... ఇది కొనసాగుతుంటే తప్ప ఏడాది చివరన జరిగే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు అసాధ్యమని నెతన్యాహూ లెక్కలేసుకున్నారు. ఆయన సమస్యేమిటో ట్రంప్‌కు తెలియకపోలేదు. కానీ మిత్రత్వం కంటే స్వీయ పీఠ సంరక్షణే ప్రధానమని ఆయన గ్రహించారు. అందుకే విధి లేని స్థితిలో ఈ ఒప్పందానికొచ్చారు. హార్మూజ్ మూతతో అమెరికాలో గ్యాసోలిన్ ధరలు మిన్నంటాయి. ద్రవ్యోల్బణం హద్దులు దాటింది. సరుకుల కొరత ఏర్పడింది. ఒబామా హయంలో ఇంతకంటే మెరుగ్గా కుదిరిన ఒప్పందాన్ని బుట్టదాఖలు చేసిన ట్రంప్, దీనికెలా అంగీకరించారన్న కథనం ఆసక్తికరమైనది. దౌత్యంలో దేశాల అధినేతలు అవతలి పక్ష సైనిక, ఆర్థిక, భౌగోళిక రాజకీయ స్థితిగతుల్ని విశ్లేషించగల నిపుణుల సాయం తీసుకుంటారని చెబుతారు. కానీ ఇరాన్ మరో అడుగు ముందుకేసి మానసిక ఆరోగ్య నిపుణుల్ని కూడా ఇందులో చేర్చిందంటున్నారు. ట్రంప్ ప్రకటనల్ని, క్షణక్షణానికి మారే ఆయన వైఖరుల్ని గమనిస్తూ ఎలా మాట్లాడితే బోధపరుచుకుని సానుకూలంగా స్పందిస్తాడో వారు సలహాలిచ్చారని దాని సారాంశం. ట్రంప్ తీరుతెన్నులు గమనిస్తే అది నిజమే అనిపిస్తుంది. తన కనుసన్నల్లో ఖరారైన ఎంఓయూ తనకి నచ్చకుంటే మళ్లీ బాంబులేయటానికి వెనకాడనని ఆయనే చెప్పటాన్ని గమనిస్తే ట్రంప్‌ను ఇరాన్ సరిగానే అంచనా వేసిందనుకోవాలి. పారిస్ వెలుపలనున్న ప్యాలెస్ ఆఫ్ వెర్సాయ్ రాచరిక ఉత్థాన పతనాలు చూసింది. ఫ్రెంచ్ విప్లవాన్నీ, దానిలోని ప్రజాస్వామిక ఆకాంక్షలనూ గమనించింది. 1783లో బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్‌ల సరిహద్దు తగాదాలపై ఒడంబడికకు సాక్షిగా నిలిచింది. జర్మనీని అవమానకరమైన ఒప్పందంతో శాసించి, 1919లో మొదటి ప్రపంచ యుద్ధాన్ని ముగించిందీ ఇక్కడే. కానీ అమెరికాకు ఇప్పుడెదురైన అవమానం స్వచ్ఛందం, స్వయంకృతం. ఇన్నింటికి వేదికైన చోట కుదిరిన ఈ ఎంఓయూను ట్రంప్ గౌరవిస్తారని ఆశించాలి. -
దాహార్తిని తీర్చే ప్రణాళికలేవి?
సంక్షోభాలు అకారణంగా రావు. అంచనాలున్నప్పుడూ, సమస్య అంతకంతకు ఉగ్ర రూపం దాలుస్తున్న వైనం కనబడుతున్నప్పుడూ మేల్కొంటే సకాలంలో వాటిని నివారించటం, అధిగమించటం వీలవుతుంది. కానీ మన పాలకుల విధానాలన్నీ దాహం వేసిన ప్పుడు బావి తవ్విన చందాన ఉంటున్నాయి. అందువల్లే ఈ వేసవిలో దేశంలోని మహా నగరాలన్నీ కనీ వినీ ఎరుగని నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ జనాభాలో మన వాటా 18 శాతం. కానీ ప్రపంచ నీటి వనరుల్లో వాటా కేవలం 4 శాతం మాత్రమే. ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు నీటి వనరుల సంరక్షణ విషయంలో మొదటినుంచీ ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పనవసరం లేదు. వాతావరణ మార్పులు ఒక్కటే కాదు... భూగర్భ జలాల వినియోగంలో జాగ్రత్తలు పాటించకపోవటం, నగర పట్టణ ప్రాంతాల్లో నీటిని కాస్తయినా పట్టింపు లేకుండా వృథా చేయటం వంటివి సైతం సమస్యను ఉగ్ర రూపం దాల్చేలా చేస్తున్నాయి. ప్రపంచం నీటి కొరత, ఎద్దడి, సంక్షోభం దశల్ని దాటి ఇప్పుడు నీటి దివాలా(పునరుత్పాదకతకు వీల్లేనివిధంగా పూర్తిగా అడుగంటడం) వరకూ వచ్చిందని ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయ జల, పర్యావరణ, ఆరోగ్య సంస్థ ఈమధ్య ప్రకటించింది. అయితే దీన్నుంచి తప్పించుకోవటానికి ఇప్పటికీ మార్గాలున్నాయి. గండం గట్టెక్కడానికి తోచినవిధంగా చేసుకుపోవటం బదులు పారదర్శక విధానాలు పాటించటం అవసరమని ఆ సంస్థ సూచించింది. ఒక ప్రణాళికాబద్ధంగా సహజ నీటివనరుల రీచార్జ్‌కి అనుసరించాల్సిన మార్గాలేమిటో నిర్ధారించుకోవటం, వాగులు, వంకలు, జలాశ యాలు నిండటానికి దోహదపడే కొండలు, గుట్టల్ని ప్రాణప్రదంగా కాపాడుకోవటం అవసరమని నిపుణులంటున్నారు. ప్రపంచంలో 70 శాతం జలాశయాలు క్రమేపీ క్షీణిస్తు న్నాయనీ, 400 కోట్లమంది ప్రజలు ఏడాదిలో కనీసం ఒక నెలపాటు నీటి ఎద్దడి ఎదు ర్కొంటున్నారనీ సమితి విశ్వవిద్యాలయం అంటున్నది. తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటున్న నగరాల్లో ఢిల్లీ, కోల్‌కతా చెన్నై, బెంగళూరులతోపాటు హైదరాబాద్ కూడా ఉంది. ఈ నీటి కొరత ప్రజారోగ్యానికి కూడా ముప్పు కలిగిస్తోంది. 14 యేళ్లలోపున్న 80 లక్షల మంది బాలలు తాగునీటి నాణ్యత నాసిరకంగా ఉండటంవల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని సంస్థ నివేదిక చెబుతోంది. నీటి ఎద్దడిని వర్షాలు సరిగా పడకపోతే వచ్చే సమస్యగానే ఇంకా మన పాలకులు చూస్తున్నారు. కానీ సరిగా అధ్యయనం చేస్తే దీని మూలాలు మరెక్కడో ఉన్నాయని అర్థమవుతుంది. నగరాలు తమ స్థోమతకు మించి విస్తరిస్తున్నాయి. అంతో ఇంతో ఉపాధి కల్పించే సంస్థలన్నీ అక్కడే కేంద్రీకృతం కావటంతో అనివార్యంగా అందరూ నగరాల బాట పట్టాల్సివస్తోంది. కానీ మౌలిక సదుపాయాలు ఇంతమందిని తట్టుకోగల స్థాయిలో లేక సహజంగానే సంక్షోభం ముదురుతుంది. ఉన్న నీటి వనరులేమిటి... వాటి సమర్థ వినియోగానికి మార్గాలేమిటన్న అంశాలపైకాక, కొత్త వనరుల అన్వేషణపై దృష్టి కేంద్రీకరించటం సమస్య తీవ్రతను పెంచుతోంది. భూగర్భ జలాల వినియోగంపై నియంత్రణలు, వ్యర్థ జలాల శుద్ధి అంశాల్లో ప్రభుత్వాలకు సరైన ప్రణాళికలు లేవు. వ్యర్థ జలాలు, పారిశ్రామిక వ్యర్థాలు చెరువుల్లో, నదుల్లో కలుస్తున్నా పట్టకపోవటంతో చివరకు భూగర్భజలాలు కూడా కలుషితమవుతున్నాయి. వచ్చే 2030 నాటికి అందుబాటులో ఉండే నీటి లభ్యతతో పోలిస్తే రెండు రెట్లు అధిక డిమాండ్ ఉంటుందని నీతి ఆయోగ్ సంస్థ చెబుతున్న జోస్యం అందరినీ భయపెడుతోంది. మూడు నాలుగు నెలలపాటు ఉండాల్సిన రుతుపవనాలు చుట్టం చూపుగా వచ్చి పోవటం రివాజుగామారి చాన్నాళ్లవుతోంది. ఈసారి ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో సరేసరి. గంగ, సింధు, బ్రహ్మపుత్ర నదులను నింపే హిమాలయాల్లోని మంచుదిబ్బలు వేగంగా కరుగుతూ వెంటనే వరదలకూ, అటుపై నీటి కొరతకూ కారణమవుతున్నాయి. అందుకే చైనా, సింగపూర్ వంటి దేశాలు నీటి వనరుల రక్షణకూ, వాన నీటి సేకరణకూ, వ్యర్థ జలాల వినియోగానికీ అనుసరించే విధానాలను అధ్యయనం చేసి మన దగ్గర కూడా అమలు చేయాలి. నీటి వినియోగంపై సమగ్రమైన నిబంధనలకు రూపకల్పన చేయాలి. వానాకాలంలో వరదల్లో మునిగి, వేసవిలో ఎడారులుగా మారే నగరాలు మనకొద్దని ప్రతినబూనాలి. -
ఆంక్షల చట్రంలో సిరప్లు
ఎంతో జాప్యం జరిగాక భారత ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. దగ్గుకు వాడే సిరప్లు ఇకపై వైద్యుల చీటి లేకుండా అమ్మరాదని ఔషధ దుకాణాలపై ఆంక్షలు తీసుకొస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 9నే వెలువడిన ఆ నోటిఫికేషన్ మంగళవారం వెలుగులోకొచ్చింది. విదేశాలతో పోలిస్తే మన వైద్య ఆరోగ్యరంగం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత చాలా ఎక్కువ. పట్టణాలు, నగరాల్లో ఈ సమస్య లేదు. గ్రామాల్లోనైనా, పట్టణాల్లోనైనా ఔషధ దుకాణాల కొరత మాత్రం ఉండదు. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి ఔషధాలైనా విక్రయించే అలవాటు కూడా ఎక్కువే. ఈ వెసులుబాటు ఎంత వరకూ వచ్చిందంటే చిన్న చిన్న సమస్యలకు వైద్యుల్ని ఆశ్రయించటంకన్నా మందుల దుకాణంలో సమస్య చెబితే సరిపోతుందన్న అభిప్రాయం సామాన్య జనంలో స్థిరపడింది. పేదరికంవల్ల వైద్యుల దగ్గరకెళ్లే స్థోమత లేకపోవటం కూడా ఇందుకొక కారణం. విదేశాల్లో కేవలం కొన్ని రకాల విటమిన్ మాత్రలు, జలుబు మందులు మాత్రమే చీటి లేకుండా లభిస్తాయి. యాంటీ బయోటిక్స్, కొన్ని ఇతర ఔషధాలు కావాలంటే ప్రిస్క్రిప్షన్ ఉండాలి. అది కూడా ఆన్లైన్లో అప్లోడ్ అయి ఉంటేనే విక్రయిస్తారు. ఇక దగ్గు మందు విషయానికొస్తే మనకు అంతర్జాతీయంగా చాలా చెడ్డపేరొచ్చింది. 2022లో పశ్చిమాఫ్రికా దేశమైన గాంబియాలో మన దేశంనుంచి దిగుమతైన దగ్గుమందు సేవించి 70 మంది చిన్నారులు మరణించారు. వీరిలో దాదాపు అందరూ మూత్ర పిండాలు పూర్తిగా దెబ్బతిన్నవారే. అదే సంవత్సరం ఉజ్బెకిస్తాన్‌లో కూడా ఈ కారణంగానే మరో 18 మంది పిల్లలు చనిపోయారు. అటుతర్వాత ఇండోనేసియా, మార్షల్ ఐలాండ్స్ వంటిచోట్ల భారతీయ దగ్గు మందుల నాణ్యతపై ప్రభుత్వాలు హెచ్చరికలు జారీచేశాయి. మన దేశంలోనూ సమస్యలు తలెత్తిన ఉదంతాలున్నాయి. నిరుడు అక్టో బర్లో మధ్యప్రదేశ్‌లో దగ్గుమందు వాడకంవల్లే 22 మంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పో యారు. ఆ సిరప్‌లో డై ఇథిలీన్ గ్లైకాల్(డీఈజీ) అనే విషపూరిత పారిశ్రామిక ద్రావకం 45 శాతం ఉన్నట్టు తేలింది. వాస్తవానికి ఆ మందులో అనుమతించదగ్గ పరిమితి కేవలం 0.1 శాతం మాత్రమే. అంటే పరిమితికి మించి వందల రెట్లు ఎక్కువుందన్న మాట! మన ఔషధరంగ నియంత్రణ వ్యవస్థలు పకడ్బందీగా లేవన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మార్కెట్ రీసెర్చ్ ఫ్యూచర్(ఎంఆర్ఎఫ్) నివేదిక ప్రకారం 2024లో దగ్గు మందుల మార్కెట్ విలువ దాదాపు 27 కోట్ల డాలర్లు కాగా, అది యేటా 9.9 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేశారు. 2035 నాటికి ఇది మూడురెట్లు పెరుగుతుందని చెబుతున్నారు. కొత్త ఔషధాల తయారీ, దిగుమతులు, క్లినికల్ పరీక్షలు, ప్రమా ణాల రూపకల్పన కోసం మనకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) ఉంది. దీనికింద ఆరు జోనల్ కార్యాలయాలు, సబ్ జోనల్ కార్యాల యాలు, వీటికి అనుబంధంగా డ్రగ్ టెస్టింగ్ లాబొరేటరీలు ఉన్నాయి. ఇవిగాక రాష్ట్రాల స్థాయిలో ఔషధ నియంత్రణలున్నాయి. ఇన్ని రకాల వ్యవస్థలు ఉన్నా నాసిరకం మందులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇవి వైద్యసలహా లేకుండానే దుకాణదారుల దగ్గర లభ్యమవుతున్నాయంటే మనం ఎంత ప్రమాదకర స్థితిలో ఉన్నామో అర్థమవుతుంది. ఇదంతా కేంద్ర, రాష్ట్ర విభాగాల మధ్య సమన్వయం సరిగా లేకపోవటం వల్లనేనని చెబుతారు. మన దేశంలో 1,100 దగ్గుమందు ఉత్పాదక సంస్థలుండగా, తనిఖీ చేసిన 90 శాతం సంస్థల్లో నిబంధనలు ఉల్లంఘనలు కనబడ్డాయనీ, వాటిపై చర్యలు తీసుకుంటు న్నామనీ ఇటీవల డీసీజీఐ రాజీవ్ రఘువంశీ చెప్పారు. దగ్గు మందు మాత్రమే కాదు... యాంటీ బయోటిక్స్, నొప్పి నివారణ మాత్రలు, గర్భస్రావ మాత్రలు, నిద్ర మాత్రలు వగైరాల విషయంలోనూ నియంత్రణలు అవసరం. వైద్యుల సలహా లేకుండా వాడటంవల్ల పౌరుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. ఆ సంగతి గ్రహించేలోగానే పరిస్థితి చేయిదాటుతోంది. గర్భస్రావ మాత్రలైతే మహిళల ప్రాణాలు తీస్తున్నాయి. కనుక మొత్తంగా ఔషధ రంగ వ్యవస్థను ప్రక్షాళన చేయటం అత్యవసరం. -
యుద్ధానికి స్వస్తి?
ప్రపంచాన్ని పలుమార్లు అంతిమ ఘడియల అంచులవరకూ తీసుకెళ్లిన పశ్చిమాసియా యుద్ధం పరిసమాప్తమైంది. ఘర్షణలు నిలిచిపోయాయని ఈ 107 రోజుల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపే స్వయంగా ప్రకటించిన సందర్భాలు చాలా ఉన్నాయి గనుక, యుద్ధం ఆగిందంటే ఎవరూ నమ్మలేదు. చివరకు ఇరాన్ ధ్రువీకరించాకే ట్రంప్ మాటను అందరూ విశ్వసించారు. దీన్ని భగ్నం చేసితీరాలన్న కాంక్షతో ఇజ్రాయెల్ చెలరేగిపోతోంది. లెబనాన్‌పై క్షిపణి దాడులు చేస్తోంది. హార్మూజ్ జలసంధి దగ్గర ప్రస్తుతం 800 నౌకలు నిలిచిపోయాయి. వీటిల్లోని 20,000 మంది సిబ్బంది దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అంతక్రితం మాటెలా వున్నా ట్రంప్ రెండో ఏలుబడిలో అమెరికా, ఇజ్రాయెల్ అవిభక్త కవలల్లా ప్రవర్తించటం మొదలెట్టాయి. సకల వ్యవస్థల్లో ఇజ్రాయెల్ చాపకింద నీరులా విస్తరిస్తున్న తీరుపై అమెరికా ఉన్నతాధికార యంత్రాంగంలోనే భయాందోళనలు అలుముకున్నాయి. నిరుడు సెప్టెంబర్‌లో ట్రంప్ వీరాభిమాని, మాగా ఉద్యమ సారథుల్లో ఒకరైన చార్లీ కిర్క్‌ను దుండగుడు కాల్చిచంపిన ఉదంతంలో ఇజ్రాయెల్ హస్తముందని ఆ ఉద్యమకారులే ఆరోపించారు. అతను ఇరాన్‌పై యుద్ధానికి బద్ధవ్యతిరేకి. ఒబామా హయాంలో ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందాన్ని గత ఏలుబడిలోనే రద్దుచేసిన ట్రంప్... దాన్ని తలదన్నేలా కొత్త ఒప్పందం సాధించితీరతానని శపథం చేశారు. తాజా ఒప్పందం వివరాలు తెలియాల్సేవున్నా, ఇరు దేశాలమధ్యా కుదిరిందంటున్న అవగాహన గమనిస్తే ఆ శపథం నీరుగారినట్టే. తననూ, పార్టీనీ, దేశాన్నీ అధః పాతాళానికి నెట్టేసిన ఈ యుద్ధం నుంచి బయటపడాలని మొదటి వారానికే ట్రంప్ తహతహలాడారు. కానీ దోవ దొరకలేదు. దీనికి ప్రపంచం భారీ మూల్యం చెల్లించింది. క్షిపణి దాడుల్లో దాదాపు 4,000 మంది ఇరాన్ పౌరులు చనిపోగా, అమెరికావైపు 13 మంది సైనికులు మరణించారు. ఇరాన్లో 240 వైద్య ఆరోగ్య కేంద్రాలు ధ్వంసంకాగా, 20 పాఠశాలలు శిథిలాలయ్యాయి. ప్రపంచ పురావస్తు సంపదగా గుర్తించిన అయిదు ప్రాంతాలు, 54 మ్యూజియంలు నాశనమయ్యాయి. చివరకు హార్మూజ్‌లో భారత్ వస్తున్న నౌకపై దాడి జరిగి మన నావికులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విమాన ఇంధన ధరలు రెట్టింపు కావటంతో పలు సంస్థలు వేలాది విమాన సర్వీసుల్ని రద్దు చేశాయి. చమురు ధరలు పైపైకి ఎగబాకి ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ యుద్ధంతో మూడున్నర కోట్లమంది పేదరికంలోకి జారుకున్నారని ఏప్రిల్ నెలాఖరున ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. అమెరికా యుద్ధ వ్యయం లక్ష కోట్ల డాలర్లు ఉండొచ్చని హార్వర్డ్ ఆర్థికవేత్త లిండా బిల్మ్స్ అంచనా. విదేశీ యుద్ధాల్లో అమెరికా ప్రమేయం ఉండబోదని హామీ ఇచ్చి అధికారంలోకొచ్చిన ట్రంప్... దేశాన్ని యుద్ధం ఊబిలోకి నెట్టారు. యుద్ధం మొదలెడుతూనే ఆయతుల్లా అలీ ఖమేనీతోసహా పలువురు అగ్రనాయకుల్ని హతమార్చి అమెరికా చాలా నష్టపోయింది. ఉన్నంతలో మధ్యేవాద దృక్పథంతో ఉండే ఆ నాయకత్వంతో పోలిస్తే ఇప్పుడున్నవారంతా అత్యంత కఠినంగా వ్యవహరించే రకం. అందుకే ‘బేషరతు లొంగుబాటు’ తప్ప దేనికీ అంగీకరించబోనని మొదట్లో బీరాలు పలికిన ట్రంప్, చివరకు రాజీకోసం కాళ్లావేళ్లా పడాల్సివచ్చింది. ఇంతకూ తనదగ్గరున్న శుద్ధి చేసిన యురేనియంను ఇవ్వ డానికీ, బాలిస్టిక్ క్షిపణుల తయారీని ఆపటానికీ, హార్మూజ్ వద్ద యథాపూర్వస్థితి పునరుద్ధరణకూ ఇరాన్ అంగీకరించిందా? మరో నాలుగు రోజుల్లో ఆ సంగతి తేలాక ట్రంప్ పరువు మరింత దిగజారుతుంది. వచ్చే నవంబర్ మధ్యంతర ఎన్నికలనాటికి ఆర్థికవ్యవస్థ ఎంతో కొంత మెరుగు పడితేనే రిపబ్లికన్ పార్టీకి ఓట్లు రాలతాయనీ, లేదంటే అమెరికన్ కాంగ్రెస్‌పై పట్టు కోల్పోవటం ఖాయమనీ ట్రంప్ బెంగపడుతున్నారు. కానీ ఇంతవరకూ వెల్లడైన వివరా లకే అన్ని వర్గాలూ ఆయన్ను దుయ్యబడుతున్నాయి. ఇరాన్ ముందు సాగిలపడ్డారని విమర్శిస్తున్నాయి. ఆర్థికంగా, సైనికంగా నష్టపోయినా తనకున్న అరకొర బలంతోనే చివరివరకూ దృఢంగా పోరాడి ఇరాన్ తన పంతం నెగ్గించుకుంది. ఏదేమైనా యుద్ధంలో ఆయుధ సంపత్తి కాదు... సంకల్ప బలమే విజేతను నిర్ణయిస్తుందన్న పురాతన చైనా యుద్ధ వీరుడు సన్ జూ మాట మరోమారు రుజువైంది. -
కలం చేతనే!
వేల ఏళ్ల కింద గుహగోడ మీద మనిషి బొగ్గుతో గీత గీశాడు. అది అతడి మొదటి కవిత. ఆకలి గురించి కాదు. వేట గురించి కాదు. ఆశ్చర్యం గురించి. ఆకాశం వైపు చూసి మొదటిసారి ‘ఏమిటది?’ అని అడిగిన క్షణమే ఆ గీత. ఆ ప్రశ్నే సాహిత్యమైంది. ఇవాళ అదే మనిషి ఒక తెర ముందు కూర్చున్నాడు. తెర అతన్ని అడుగుతోంది: ‘ఏం కావాలి? కథా... కవితా... వచనమా’... మనిషి కలాన్ని పక్కన పెట్టి, ఆబగా తెరతో బేరసారాలు చేస్తున్నాడు. జోలె పడుతున్నాడు. ఏఐ నా వేయి ఏనుగుల బలం అంటున్నాడు.ఏఐకి జ్ఞాపకాలు ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని గ్రంథాలయాల జ్ఞాపకాలు దాని వద్ద నిక్షిప్తమై ఉన్నాయి. దానికి ‘మరపు’ లేదు. కాని మనిషి రచయిత అవుతాడు ఎందుకంటే వాడు మర్చిపోతాడు. బాధను మర్చిపోవడానికి కథ రాస్తాడు. అవమానాన్ని కప్పిపుచ్చడానికి వ్యంగ్యం రాస్తాడు. తీరని ప్రేమను బతికించుకోవడానికి పద్యం రాస్తాడు. మరపు అనే ఖాళీలోనే సృజన పుడుతుంది. యంత్రానికి ఆ ఖాళీ లేదు. దానికి అంతా గుర్తుంటుంది. అందుకే అది కొత్తగా పుట్టించలేదు. ‘వాన వెనుకంజ వేసింది’ అనే వాక్యాన్ని సృష్టించలేదు – ఇంతకు ముందు రాసి ఉంటే తప్ప.మనిషి రాయడానికి బయల్దేరిన ప్రతి క్షణం భయమే. తెల్ల కాగితం భయం. మొదటి వాక్యం భయం. ‘నేను రాసింది ఎవరైనా చదువుతారా లేదా?’ అనే వణుకు. ఈ భయమే రచయితను నిజాయితీగా ఉంచుతుంది. ప్రతి పదాన్నీ తూకం వేయిస్తుంది. ఏఐకి? అది నిర్భయంగా రాస్తుంది. దానికి పరువు లేదు. పోగొట్టుకోవడానికి పేరూ లేదు. పరువు పోతుందనే భయం లేని చోట సాహిత్యం పుట్టదు. సర్కస్ పుడుతుంది. అపసాహిత్యం. అలాగని యంత్రాన్ని ద్వేషించాల్సిన పని లేదు. అది శత్రువు కాదు. ఉలి. శిల్పి చేతిలో ఉలి శిల్పాన్ని చెక్కుతుంది. పిచ్చివాడి చేతిలో పడితే నాశనం చేస్తుంది. రాత్రి రెండు గంటలకు ఒక ఆలోచన తట్టి, పదం దొరకక గోడకు తల బాదుకునే రచయితకు ఏఐ ఒక నిఘంటువు. కథ అడ్డం తిరిగినప్పుడు ‘ఇలా ముగిస్తే ఎలా ఉంటుంది?’ అని సలహా ఇచ్చే మూగ స్నేహితుడు. డెబ్బై ఏళ్ల స్త్రీ తన జ్ఞాపకాలను పుస్తకం చేయాలనుకుంటే ఆమెకు ఏఐ ఒక కార్యదర్శి. ఏ పీరియడ్ నవలో రాయాలనుకుంటే మెటీరియల్ వెతికి పెట్టే రీసెర్చ్ అసిస్టెంట్. అంతవరకే. అంతవరకు మాత్రమే. తలకిందుల తపస్సు చేసినా ఏఐకి గర్భగుడిలో ప్రవేశం లేదు. ఇవ్వరాదు. కథ పుట్టే చోటు, ఆ మొదటి స్పార్క్, ‘ఎందుకు చెప్పాలి’ అనే తపన – అది మనిషి హృదిలోనే పుట్టాలి. దాన్ని అవుట్సోర్స్ చేస్తే ఇక అతను రచయిత కాదు, చీప్ ఎడిటర్ మాత్రమే. యంత్రం రాసిన పేరాలో విషం ఉంటే, అబద్ధం ఉంటే, ఆ పాపం ప్రాంప్ట్ కొట్టిన చేతిదే. అన్నీ యంత్రమే ఇస్తే బాగుండనే తరం నేడు తయారైతే రేపటి తరానికి ‘తపన’ అనే పదానికి అర్థం తెలియదు. పదం కోసం వేటాడటం, ఒక ఉపమానం కోసం నెలలు తపించడం, ఒక ఐడియా తట్టినప్పుడు వచ్చే కన్నీరు – ఈ ఆకలిని యంత్రం తీర్చకూడదు. ఇది మనిషికే వదిలేయాలి. మనిషి పెన్ చూశాడు, టైపు మిషన్ చూశాడు, కంప్యూటర్ కీబోర్డు చూశాడు, ఇప్పుడు కృత్రిమ మేధను చూస్తున్నాడు. పరికరం మారుతుంది కానీ ఆర్తి మారదు. మారకూడదు. మనిషి గొప్పవాడు ఎందుకంటే వాడు అసంపూర్ణుడు. వాడి రాతలో తప్పులు దొర్లుతాయి. వాక్యం అసంపూర్తిగా ఆగిపోతుంది. అదే మనిషికి అందం. యంత్రం పరిపూర్ణంగా రాస్తుంది. అందుకే చప్పగా ఉంటుంది. సాంకేతిక విప్లవం రావాలి. మన వేళ్లకు సంకెళ్లు వేయకుండా మన కలలకు రెక్కలు ఇవ్వాలి. రేపు ఒక పిల్లవాడు ‘నేను రచయితను అవుతాను’ అన్నప్పుడు, వాడి చేతిలో కలంతో పాటు ఒక తెర కూడా ఉండొచ్చు. తప్పులేదు. కానీ ఆ తెర మీద వాడు చూసేది వాడి ప్రతిబింబమే కావాలి, యంత్రం నీడ కాదు. కలం ఇంకా మన చేతిలోనే ఉంది. దాని మీద వేలిముద్రలు మనవే. రక్తం మనదే. చమట మనదే. ఆ గుర్తులు చెరిగిపోని వరకు మనిషే మహనీయుడు. యంత్రం ఎప్పటికీ అతని నీడ మాత్రమే. -
ఇంత క్రూర పరిహాసమా స్వామీ!
తిరుపతి సమీపాన నిన్న కూటమి సర్కార్ రెండేళ్ల పండుగ సభ జరిగింది. ఆ సభలో చెప్పుకోవడానికి విశేషాలు చాలానే ఉన్నాయట! సభా ప్రాంగణంలో లోకేశ్‌బాబు కలియతిరిగారట. మంత్రులూ, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముచ్చటించారట! ఆంధ్రజ్యోతి రాసింది. మూడో క్లాస్ చదువుతున్న అనిత్‌రాజ్ అనే బాలుడు ‘డిప్యూటీ సీఎంతో ఫోటో దిగాలని ఉంద’ని ఓ ప్లకార్డు పట్టుకొని వేదిక సమీపంలో నిలబడ్డాడట! అది చూసిన పవన్ కల్యాణ్ వేదికపైకి అనిత్రాజ్ను పిలిపించుకున్నారట! ఈనాడు రాసింది.వేదిక పైకి వచ్చిన అనిత్‌రాజ్ పవన్‌ను బాబాయ్ అని, చంద్రబాబును తాతయ్యా అని పిలిచాడట! లోకేశ్‌బాబును ఏమని పిలిచాడో ఈనాడు రాయలేదు. బహుశా ఆయన కలవ లేదేమో! తాతయ్యా అన్న బాలుని పిలుపుతో చంద్రబాబు ఉత్సాహం పొందినట్టున్నారు. యువత కలలను సాకారం చేసే బాధ్యత తమదేనని ఓ ట్వీట్ రువ్వారు. ఇది కూడా ఈనాడే రాసింది. మూడో క్లాసు చదివే అనిత్రాజ్కు ఎనిమిదేళ్లుంటా యేమో! ఆ సభలో తాతయ్య ప్రసంగం వినిఉండకపోవచ్చు. విన్నా అర్థం చేసుకునే వయసు కాదు.డియర్ అనిత్‌రాజ్, ఆ తాతయ్య మాటల్లో కొసరుగా విసిరిన ఓ అవశేషంలో ఎంత నమ్మకద్రోహం దాగి ఉన్నదో నీకు బోధపడకపోవచ్చు. నీకంటే పదేళ్లు పెద్దవాళ్లయిన పెద్దక్కల దగ్గర్నుంచి, అమ్మ వయసు అత్తలూ, పెద్దమ్మలూ, పిన్నమ్మల వయసువాళ్లకూ, యాభై తొమ్మిదేళ్ల లోపు వుండే అమ్మమ్మలూ, నానమ్మలకూ వేదికపైనున్న తాతయ్య తీరని ద్రోహం చేశారు. దీన్నే నయవంచన అని కూడా అంటారు. ఆ వయసువాళ్ల ఆత్మీయ మహిళలందరికీ వెన్నుపోటు పొడిచిన తాతయ్య మీ కలలను నెరవేరుస్తారంటే నమ్మశక్యమేనా?అన్నిటికంటే పెద్ద విశేషమేమిటంటే ఈ సభకు ‘నమ్మకం’ అనే పేరు పెట్టుకున్నారు. ‘రెండేళ్లలో ప్రజల నమ్మకాన్ని నిల బెట్టుకున్నాం, అదే కూటమి ప్రభుత్వ విజయం’ అనే మకుటంతో మీడియాలో అడ్వరై్టజ్మెంట్లను హోరెత్తించారు. ఆ సభ వేదికపై నుంచి మాట్లాడుతూనే ‘ఆడబిడ్డ నిధి’ పథకానికి ఆర్థిక సమస్యలున్నాయనీ, పీ–4 పథకంతో వారికి సహాయం చేస్తా మనీ ముఖ్యమంత్రి సన్నాయి నొక్కులు నొక్కారు. సూపర్ సిక్స్ పథకాలకు కూటమి మేనిఫెస్టోలో అత్యంత ప్రాధాన్యతనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానమైన ఈ ఆరు హామీలను నెరవేర్చడా నికి ఆర్థికపరమైన ఇబ్బందులేమీ ఉండవని ఎన్నికల సభల్లో చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు.2024 జూన్ నుంచే ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలుచేస్తా మని కూటమి వాగ్దానం చేసింది. రెండేళ్లు గడిచిపోయాయి. తల్లికి వందనం పథకానికి కూడా మొదటి సంవత్సరం ఎగ నామం పెట్టి, రెండో సంవత్సరం అమలు చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకొని రెండేళ్లు ఆలస్యంగానైనా ‘ఆడబిడ్డ నిధి’ని అమలుచేస్తారేమోనని కోటీ ఎనభై లక్షలమంది మహిళలు ఎదురు చూస్తున్నారు. వారి ఆశలపై చంద్రబాబు తిరుమలేశుని సాక్షిగా చల్లనీళ్లు చల్లారు. ఏపీలో ఓటుహక్కు ఉన్న మహిళలు రెండు కోట్ల ఏడు లక్షలమంది. వీరిలో అరవై, అంతకుమించిన వయసున్నవారు 12 శాతం వరకు ఉంటారని సెన్సస్ లెక్కలు చెబుతున్నాయి. వారిని మినహాయించి సుమారు ఒక కోటి ఎనభై లక్షలమంది మహిళలకు కూటమి సర్కార్ ఇప్పటికే ఒక్కొ క్కరికి ఏటా 18 వేలు చొప్పున రెండేళ్ల నిధులు బకాయి పడింది. ఇప్పుడు మొత్తానికే పథకాన్ని ఎత్తేస్తున్నట్టు ప్రకటించారు.పీ–4 పథకంతో ఆదుకుంటామనేది పచ్చి బూటకం. అసలీ పథకమే పౌరుల ఆత్మగౌరవాన్ని అంగట్లో పెట్టే అమానవీయ స్వభావం గలది. తమకు దిక్కు దివాణం లేదని పేద కుటుంబాలు దరఖాస్తు చేసుకోవాలట! దయగలిగిన ధనవంతులు కొన్ని కుటుంబాలను దత్తత తీసుకొని వారికి సహాయం చేయా లట! ఇది అయ్యే పనేనా? పేదరికం నుంచి ప్రజలను విముక్తం చేయడం ప్రభుత్వాల బాధ్యత. నాణ్యమైన విద్యను వారికి అందజేయడం ద్వారా, అభ్యున్నతికి చేరుకునే అవకాశాలు కల్పించడం ద్వారా వారి జీవితాల్లో మార్పు చేయాలి. వనరుల్లో వారికి తగినంత వాటా కల్పించాలి. ఇది రాజ్యాంగబద్ధమైన ఆదేశం. అలాకాకుండా ధనవంతుల దొడ్లో పేదవాళ్లను కట్టేయ డమనేది బానిస వ్యవస్థ లక్షణం.అయినా పీ–4 విధి విధానాలకు, ‘ఆడబిడ్డ నిధి’ పథకానికి సారూప్యత ఎక్కడున్నది! మహిళల కోసం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన ‘చేయూత’, ‘ఆసరా’ పథకాలకు దీటుగా ప్రకటించిన పథకం ‘ఆడబిడ్డ నిధి’. ఈవిధంగా ఎన్నిక లకు ముందు నమ్మబలికి ఇప్పుడీ పథకాన్ని పూర్తిగా అటకెక్కించారు. మహిళల ఆత్మగౌరవానికీ, సాధికారతకూ పెద్దపీట వేస్తూ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మకమైన ‘అమ్మవొడి’ పథకానికి బదులుగా ‘తల్లికి వందనం’ పేరుతో కూటమి ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది.పేద కుటుంబాల పిల్లలు కూడా నాణ్యమైన విద్యను అభ్యసించాలని అభిలషిస్తూ ప్రభుత్వ పాఠశాలల స్థాయినీ, బోధనా పద్ధతులనూ అనూహ్యమైన స్థాయిలో ప్రైవేట్ స్కూళ్లను తలదన్నేలా మెరుగుపరిచింది జగన్ సర్కార్. జగన్ మోహన్‌రెడ్డి స్వయంగా పరిశీలించి విద్యార్థులందరికీ మంచి స్కూల్ బ్యాగ్‌లు, బూట్లు, బెల్ట్, శ్రేష్ఠమైన పౌష్ఠికాహారాన్ని ఎంపిక చేసిన సంగతి పాఠకులకు విదితమే. డిజిటల్ బోర్డులు, ట్యాబ్లూ ప్రభుత్వ బడుల్లో ప్రవేశించాయి. శిథిలమైన బడి భవనాలు, విరిగిపోయిన బల్లలు, అసహ్యకరమైన పరిస్థితుల్లో ఉండే సింగిల్ వాష్రూముల ముందట లైన్లో నిలబడే పిల్లలు, అసలు వాష్రూములే లేక బడి మానేసే ఆడపిల్లలు, తాగడానికి మురికి నీళ్లే గతి అనే పరిస్థితులను మార్చి కార్పొరేట్ స్కూళ్ల స్థాయిలో వాష్‌రూమ్‌లూ, శుభ్రమైన తాగునీరూ అందేలా జగన్ ఏర్పాట్లు చేశారు.ఒకపక్క ఇంత నాణ్యమైన విద్యకు మౌలిక వసతులను ఏర్పాటు చేస్తూనే ఇంగ్లీషు మీడియం బోధననూ, సీబీఎస్ఈ సిలబస్‌నూ పేద బిడ్డలకు పూర్తి ఉచితంగానే అందుబాటులోకి తెచ్చారు. దాంతోపాటు ఎట్టి పరిస్థితుల్లో డ్రాపవుట్లు ఉండకుండా బిడ్డలను బడికి పంపేలా తల్లిని ప్రోత్సహించడం కోసం జగన్మోహన్రెడ్డి ‘అమ్మవొడి’ పథకాన్ని ప్రవేశపెట్టారు. నాణ్యమైన విద్య ద్వారా ఉన్నతమైన సమాజాన్ని నిర్మించాలనే ఒక సమగ్ర వ్యూహంలో ‘నాడు–నేడు’ ‘అమ్మవొడి’ అనేవి రెండు అవిభాజ్యమైన అంశాలు. ఈ వ్యూహంలో అమ్మది కేంద్ర స్థానం.‘అమ్మవొడి’ పథకం నేపథ్యంలో ఉన్న ఉన్నతమైన తాత్విక భూమిక ‘తల్లికి వందనం’ పథకానికి లేదు. అటువంటి ఉన్నత లక్ష్యమే ఉన్నట్లయితే ‘నాడు–నేడు’ పథకం కొనసాగి ఉండేది. ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్, సబ్జెక్ట్ టీచర్ మోడల్ కొనసాగి ఉండేవి. ఇప్పుడివేమీ లేవు. ప్రభుత్వ బడులకు మళ్లీ పూర్వపు రోజులు వచ్చాయి. దాదాపు పది లక్షలమంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల బాట పట్టినట్టు సమాచారం. ప్రభుత్వం ఈ లెక్కలను ఉద్దేశపూర్వకంగానే తొక్కిపెడుతున్నది. ఎంత మంది విద్యార్థులు చదువు మానేశారో లెక్కల్లేవు. జగన్ ప్రభుత్వం ప్రతి విద్యార్థిని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ట్రాకింగ్ సిస్టమ్ ఇప్పుడు లేదు. ప్రభుత్వ బడుల పునరుజ్జీవనం, పేద పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య లభించాలనే ఉద్దేశంతో ‘అమ్మవొడి’ని జగన్ తీర్చిదిద్దారు. కేవలం ఎన్నికల్లో తనకు సహకరించే కార్పొరేట్ స్కూళ్ల లాబీకి కాసుల వర్షం కురిపించేలా తల్లికి వందనం పథకాన్ని కూటమి డిజైన్ చేసింది. ఇదీ తేడా!లక్ష్యం ఇంత హేయమైనది కనుకనే నీకు పదిహేను, నీకు పదిహేను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలంటూ చౌకబారు ప్రచారాన్ని కూటమి చేసింది. పోనీ ముందుగా చెప్పినట్టు పిల్లలందరికీ ఈ పథకం వర్తిస్తున్నదా? జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రభుత్వం, ప్రైవేట్ స్కూళ్లలో 80 లక్షలకు పైగా విద్యార్థులుండేవారు. తల్లికి వందనం పథకానికి మాత్రం 67 లక్షల మందినే అర్హులుగా తేల్చారు. విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ బడుల్లో చేరినవారిలో లక్షమందిని లబ్ధి దారుల జాబితా నుంచి తొలగించారు. కేంద్ర స్కాలర్షిప్ను పొందుతున్న మరో లక్షమందిని తొలగించారు. ఆధార్ సరిగా లేదనీ, అడ్రస్ సరిగా లేదనీ మూడు లక్షలమందికి మొండిచేయి చూపారు. పంచ పాండవులు – మంచం కోళ్ల సామెతలా సాగు తున్న ఈ పథకం చివరకు ఎక్కడ ఆగుతుందో చూడాలి.అధికార యంత్రాంగంలో, రాజకీయ నేతలలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ప్రతిపక్షం కాదు... అధికార పక్షానికి అనుకూలంగా ఉండేవారే విమర్శిస్తున్నారు. అమరావతి ప్రయోగం డిజాస్టర్‌గా మిగలబోతున్నదనీ, పోలవరం పనులు పరమ నాసిరకంగా జరుగుతున్నాయనీ నిపుణులు ఆరోపిస్తు న్నారు. డీఎస్సీ పరీక్షలో సాక్షాత్తూ ప్రభుత్వ ముఖ్యులే అవినీతికీ, ఆశ్రిత పక్షపాతానికీ తెరలేపి లక్షలాది మంది యువకుల కల లను కల్లలు చేశారు. వ్యవస్థల విశ్వసనీయత పట్ల యువతరంలో నమ్మకం సన్నగిల్లుతున్నది. పేదలు, మధ్యతరగతి ప్రజల పాలిట అపర సంజీవనిలాంటి ఆరోగ్యశ్రీ పథకానికి మరణ శాసనం అమలు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఫార్సుగా మార్చారు. వృద్ధుల సంఖ్య పెరుగుతున్నదనీ, ముగ్గురు నలు గురు పిల్లల్ని కనాలనీ బోధిస్తున్న చంద్రబాబు సామాజిక పెన్షన్లలో మాత్రం వృద్ధుల సంఖ్యను తగ్గిస్తున్నారు. ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం, ప్రభుత్వాంగాలన్నీ అవినీతి రోగగ్రస్థం అన్నట్టుగా పరిస్థితులు తయారయ్యాయి. ఓట్లకోసం ప్రజల అరచేతుల్లోకి వైకుంఠం సినిమాను ప్రొజెక్ట్ చేసి ఇప్పుడు వారందరికీ సామూహికంగా వెన్నుపోటు పొడిచిన తర్వాత నమ్మకాన్ని నిలబెట్టుకున్నామంటూ సభ పెట్టడం న్యాయమా? సమాజం మీద ఇంత క్రూరమైన పరిహాసమేమిటి స్వామీ!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఆక్రమిత కశ్మీర్ కల్లోలం
ఎప్పుడూ జమ్మూ, కశ్మీర్ గురించి అంతర్జాతీయ వేదికలపై గంభీరోపన్యాసాలిస్తూ, మానవ హక్కుల చాంపియన్‌గా తనను తాను చిత్రించుకునే పాకిస్తాన్ గత కొన్ని రోజులుగా ఆక్రమిత కశ్మీర్లో నెత్తురుటేర్లు పారిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం సైన్యం కాల్పుల్లో 30 మంది మరణించారంటున్నా, వాస్తవ సంఖ్య అంతకుమించి ఉంటుందన్నది స్థానికులు చెప్పే మాట. మరో 200 మంది గాయపడ్డారు. వేలాదిమంది అరెస్టయ్యారు. ఈసారి సాగిన నిరసన ప్రదర్శన సాధారణమైంది కాదు. ముజఫరాబాద్ ప్రదర్శనలో అన్నివర్గాలకూ చెందిన లక్షన్నరమంది పాల్గొన్నారు. మతం పేరు చెప్పి, గతం పేరుచెప్పి ఎల్లకాలమూ జనాన్ని మభ్యపెట్టడం సాధ్యంకాదని పాక్ పాలకులకు ఈ నిరసనలు తెలియజెప్పాయి. తమ ప్రాంత నదుల్లో మంగళ డ్యామ్‌వంటి ప్రాజెక్టులు నిర్మించి,ఇక్కడ ఉత్పత్తయ్యే జలవిద్యుత్‌ను పంజాబ్ తదితర ప్రాంతాలకు తరలించుకుపోతూ, స్థానికులకు అరకొర సదుపాయాలు కల్పించటం విషయంలో రెండు దశాబ్దాల క్రితమే అసంతృప్తి పెల్లుబికింది. కానీ సంఘటితం కాకపోవటంవల్ల చల్లారిపోయాయి. 2023లో రావల్కోట్, ముజఫరాబాద్, మరికొన్ని ఇతర ప్రాంతాల్లో స్థానిక సమస్యలపై కమిటీలు ఏర్పడి ఉద్యమించాయి. ప్రజల మౌలికాహారమైన గోధుమ పిండి ధర పెంచడాన్నిప్రశ్నించాయి. వీటిని ప్రభుత్వం బేఖాతరు చేసిన ఫలితంగా ఆ కమిటీ లు జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(జాక్)గా ఒక్కటయ్యాయి. ఆనకట్టల కారణంగా పలువురు నిర్వాసితులవుతున్నా, వలసపోతున్నా పట్టించు కునేవారు లేరు. పోనీ అని స్థానిక ప్రజలకైనా ఒరిగేదేమీ ఉండదు. మిలిటెన్సీ ఉందన్న పేరిట భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరించటం ఒక్కటే వారికి కనబడేది. అందుకేశాంతియుత పద్ధతుల్లో పన్నుల నిరాకరణ ఉద్యమం నిర్వహించటం, విద్యుత్ బిల్లుల చెల్లింపు నిలిపివేయటం, సంపూర్ణ బంద్, లాంగ్‌మార్చ్ వంటివి ఈ మూడేళ్లలో ఎన్నో జరిగాయి. సైన్యం పడగనీడలో కాలక్షేపం చేసే ప్రభుత్వానికుండే అధికారాలు అంతంత మాత్రం. ఏ జవాబుదారీతనమూ లేని సైన్యానిదే పెత్తనం. అందుకే ఆక్రమిత కశ్మీర్‌కు ఎదుగూ బొదుగూ లేదు. ఆ ప్రాంత వనరుల్ని కొల్లగొట్టడానికి పాక్ పాలకులు ఒక సృజనాత్మక విధానం కనుక్కున్నారు. 53 మందితో దానికొక అసెంబ్లీ ఉంది. ఆక్రమిత కశ్మీర్‌కు ముఖ్యమంత్రి కాదు... ప్రధాని ఉంటాడు. కానీ అధికారాలన్నీ ఇస్లామాబాద్‌లో కొలువుదీరిన సైనికాధికారుల ఆధిపత్యంవుండే కశ్మీర్ కౌన్సిల్ చేతిలో ఉంటాయి. ఈసారి కేవలంఆర్థిక సమస్యలపై మాత్రమే కాదు... అసెంబ్లీ అమరికపై కూడా డిమాండ్లు బయల్దేరాయి. మొత్తం 53 స్థానాలుండగా, ‘శరణార్థుల’కు డజను కేటాయిస్తారు. మరో అయిదు మహిళలకూ... ఉలేమాలు, సాంకేతిక నిపుణులు, విదేశాల్లో స్థిరపడిన కశ్మీరీలకు ఒక్కొక్క స్థానం ఉంటాయి. ఈ ఖాతాలకింద పోయే 20 స్థానాలకూ ఎన్నికలు జరిగేదెక్కడో, నిర్వహించేదెవరో ఎవరికీ తెలియదు. వారు ఎన్నుకోవాల్సింది మాత్రం 33 మందిని.మళ్లీ ఇందులో అత్యధికులు పాక్ పాలకుల కనుసన్నల్లో నడిచేవారే ఉంటారు. చివరకు కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఉద్యమకారులు అడిగేదల్లా ‘శరణార్థుల’ డజను స్థానాలూ రద్దు చేయాలన్నదే. కానీ అలా చేస్తే స్థానికుల పెత్తనం పెరుగుతుందని ప్రభుత్వం భయపడుతోంది. అందుకే జాక్ నాయకుల ఆచూకీ చెబితే 35,000 డాలర్లు బహుమతి ఇస్తామని ప్రకటించింది. వచ్చే నెల్లో ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ప్రాంత వనరుల దోపిడీ తప్ప, వారి ఆకాంక్షల్ని నెరవేర్చడం సాధ్యపడదని ఉద్యమాలను అణిచేయటం ద్వారా పాక్ చెబుతోంది. పాలకులు వలసవాద మనస్తత్వంతో ఆప్రాంతాన్ని చెరబట్టారు తప్ప, స్థానికుల డిమాండ్లపై ఖాతరు లేదు. ఉద్యమకారులు38 కోర్కెలు ప్రభుత్వం ముందుంచారు. డజను సీట్ల కోటా రద్దుతోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు, రాజకీయనాయకులకిస్తున్న ఖరీదైన కార్లు, ఉచిత విద్యుత్ తదితర రాయితీలు రద్దు చేసి, ఆ నిధులు జన సంక్షేమానికి వ్యయం చేయాలని కూడావారు కోరుతున్నారు. ఇలాగే మొండికేస్తూ పోతే ఆ ప్రాంత ప్రజల ఆగ్రహం మరింత పెరుగుతుందే తప్ప చల్లారదని పాకిస్తాన్ పాలకులు గ్రహించాలి. -
భారత నౌకలపై దాడులా?
ప్రపంచానికి పీడలా పరిణమించిన అమెరికా... భారత్ వస్తున్న నౌకలపై తన ప్రతాపాన్ని చూపటం మొదలెట్టింది. మంగళవారం ఒమన్ తీరంలో 24 మందితో వెళ్లే నౌకపై క్షిపణి ప్రయోగించటంతో ముగ్గురు నావికులు మరణించారు. వారిలో ఒకరు ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన పట్నాల సురేష్ అనే చీఫ్ మెరైన్ ఇంజినీర్. అంతకుముందు రోజు సైతం భారత్‌కు వస్తున్న మరో నౌకపై ఇలాగే దాడి జరగ్గా, అందరూ క్షేమంగా బయట పడగలిగారు. ఆ రెండు నౌకలూ భారత్‌కు చెందినవని తెలిసే ఉద్దేశపూర్వకంగా దాడి చేశా రని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఈ రెండు ఉదంతాల్లోనూ ఒమన్ సైన్యం మన నావికుల్ని ఆదుకుంది. తమ నిషేధాన్ని ధిక్కరించి ఇరాన్నుంచి చమురు కొనుగోలు చేసి వెళ్తుండటంవల్లే దాడులు చేశామని అమెరికా సైనిక దళం పశ్చిమాసియా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కాం) అంటున్నది. ఒకపక్క భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రాణ మిత్రుడని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెబుతారు. మనతో వాణిజ్య ఒప్పందం కోసం వెంపర్లాడతారు. కానీ భారత్‌కొస్తున్న వాణిజ్య నౌకలను ధ్వంసం చేస్తారు. అసలు రెండు దేశాల మధ్య కుదిరే వాణిజ్య లావాదేవీలపై, సంబంధం లేని మూడో దేశం ఆంక్షలు విధించటమేమిటి? మనం ఎవరి దగ్గర కొనాలో, కొనకూడదో చెప్పడానికి ట్రంప్ ఎవరు?దాడులు జరిగిన ప్రాంతం అమెరికాకు సరిహద్దేమీ కాదు. ఆ నౌకల గమనంవల్ల దానికి కలిగే ముప్పేమీ లేదు. అయినా ఖండాంతరాలు దాటి, వేల మైళ్లు ఈవలకొచ్చి విధినిషేధాలు పెట్టడం వింత కాదా? ఒక్క సెంట్‌కాం మాత్రమే కాదు... భూగోళమంతటా వేర్వేరు పేర్లతో అమెరికా పహారా కాస్తోంది. ఆఫ్రికాలో ‘ఆఫ్రికాం’, ఇండో–పసి ఫిక్‌లో ‘ఇండోపాకాం’, యూరప్‌లో ‘ఈయూకాం’, ఉత్తరమెరికాలో ‘నార్త్ కాం’ పేరిట సైన్యాల్ని దించి, క్షిపణులు గురిపెట్టి, యుద్ధ విమానాలు మోహరించి, అక్కడక్కడ అణు బాంబులు పోగేసి దేశాలపై పెత్తనం చలాయిస్తోంది. ఈ లక్షలాదిమంది సైన్యాన్ని పోషించటం కోసం అడ్డగోలు సుంకాలతో, వేరే దేశాలకు భారీనష్టం కలిగే వాణిజ్య ఒప్పందా లతో చెలరేగిపోతోంది. చిత్రమేమంటే... ఒక్కటంటే ఒక్క దేశం ‘నీకిక్కడేం పని?’ అని అమెరికాను ప్రశ్నించలేకపోతోంది. తాజా దాడుల తర్వాత మన దేశం గట్టిగా స్పందించింది. అమెరికా చార్జ్ డీ ఎఫైర్స్ జాసన్ మీక్స్‌ను పిలిపించి, ‘దౌత్యపరమైన నిరసన’ తెలిపింది. అందరూ ముక్తకంఠంతో నిరసిస్తేనే ఈ దుర్మార్గం ఆగుతుంది.అక్రమంగా యుద్ధానికి దిగి, శాంతి ఒప్పందానికి రావాలని ఇరాన్‌ను ట్రంప్ బెదిరి స్తున్నారు. ప్రపంచంలోనే ఎదురులేనిదని గప్పాలు కొట్టుకున్న మిలిటరీ హెలికాప్టర్ అపాచేను అది కూల్చేయటంతో గత మూడు రోజులుగా దాడులు, ప్రతిదాడులతో పశ్చి మాసియా దద్దరిల్లుతోంది. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్‌లలోని అమెరికా స్థావరాలపై దాడులు చేసింది. తమ దాడి ఆత్మరక్షణ అని అమెరికా చెప్పు కోవటం సిగ్గుచేటు. ట్రంప్ వచ్చాక అమెరికా రక్షణ శాఖ పేరునే యుద్ధశాఖ అని మార్చాక, అందులో ‘ఆత్మరక్షణ’ ప్రసక్తి ఎక్కడ? అసలు తమ సరిహద్దులు దాటి వేల కిలోమీటర్ల ఆవలనున్న దేశాలపై దాడులు జరుపుతూ, దానికి ఆత్మరక్షణ అని పేరెట్టడం నయవంచన కాదా? వేరేవాళ్లపై యుద్ధానికి దిగుతూ, అందుకు పర్యవసానాలుండరాదని ట్రంప్ అత్యాశకు పోతున్నారు. స్వల్పకాలంలోనే ఇరాన్ కీలక చమురు క్షేత్రాలున్న ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటానని హెచ్చరికలు జారీచేస్తున్నారు.నాలుగో నెలలోకి ప్రవేశించిన ఈ యుద్ధంవల్ల ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ పెను సంక్షోభంలో కూరుకుపోయాయి. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో ప్రపంచ చమురు మార్కెట్ ఒక్కసారిగా భగ్గుమంది. దాడులకు వెరవకుండా ఇరాన్ దీటైన జవాబివ్వటంతో అమెరికాకు ఎటూ పాలుబోవడం లేదు. నిజంగా ట్రంప్ అంటున్నట్టు ఖర్గ్ ద్వీపం జోలికిపోతే ఇది మరింత వికటించి, పరిస్థితులు ఇంకా క్షీణిస్తాయి. దురదృష్టమేమంటే, అమెరికాకు ఎవరూ నచ్చజెప్పే స్థితి లేదు. పటిష్టమైన వ్యవస్థలున్నాయనుకున్న ఆ దేశంలోనూ ఏ ఒక్కటీ ట్రంప్‌ను నియంత్రించలేకపోతోంది. అక్కడి ప్రజల్లో కదలికవచ్చి, ట్రంప్‌పై ఒత్తిళ్లు పెరగనంతకాలం ప్రపంచం ఇలా బిక్కుబిక్కుమని బతుకీడ్చక తప్పదు. -
‘ఫిఫా’కు అమెరికా గండం!
మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్త సాకర్ అభిమానులను 39 రోజులపాటు ఊగించి, శాసించే క్రీడా సంరంభం మొదలుకాబోతోంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య(ఫిఫా) నేతృత్వంలో గురువారం అర్ధరాత్రి 12.30 దాటాక (భారత కాలమానం ప్రకారం చెప్పాలంటే శుక్రవారం) ప్రపంచ ప్రసిద్ధ మెక్సికో సిటీ స్టేడియం(ఎస్టాడియో అజకా) వేదికగా మెక్సికో–దక్షిణాఫ్రికా జట్ల మధ్య సాగే తొలి పోరుతో ఈ జాతరకు అంకురార్పణ జరుగుతుంది. 96 యేళ్ల వరల్డ్ కప్ చరిత్రలో ఇలా మూడు దేశాల్లో ఈవెంట్లు నిర్వహించటం ఇదే తొలిసారి. అమెరికా, కెనడా, మెక్సికో ‘ఐక్యంగా, ఒక్కటిగా’ నినాదంతో కలిసికట్టుగా బిడ్ వేసి గెల్చుకున్నాయి. ఈసారి జట్ల సంఖ్య 32 నుంచి 48కి పెరగటంతో 104 మ్యాచ్‌లు జరుపుతున్నారు. వీటన్నిటినీ ఈ మూడు దేశాల్లోని 16 నగరాల్లో నిర్వహించనుండగా, ఇందులో 78 మ్యాచ్‌లు, కీలక ఈవెంట్లు తమ దగ్గరే ఉండేలా అమెరికా చూసుకుంది. మెక్సికో, కెనడా చెరి 13 నిర్వహిస్తాయి.‘క్రీడలు ప్రపంచాన్ని ఏకం చేస్తాయి... దేశాల మధ్య సరిహద్దులు చెరిపేస్తాయి’ అని క్రీడల నిర్వాహకులు తరచు చెప్పేదంతా బడాయి తప్ప నిజం కాదని మళ్లీ రుజువైంది. ‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడ’న్నట్టు ఈమధ్య శ్వేతజాతి దురహంకారాన్ని ఒళ్లంతా పులుముకుంటున్న అమెరికా, అతిగా వ్యవహరిస్తూ ఈ సంరంభాన్ని నీరుగార్చే పోకడ లకు పోతోంది. ఫిఫా రిఫరీ, సోమాలియా క్రీడాకారుడు ఒమర్ అర్టన్ ఈ సంరంభం కోసం మయామీలో దిగిన వెంటనే ఆయన్ను వెనక్కి పంపింది. ఒమర్‌కు దౌత్య వీసా కూడా ఉంది. అతను ‘జాతీయ భద్రత’కు ముప్పు తెస్తాడంటోంది అమెరికా. ఇరాన్ బృందానికి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అరిజోనాలో శిక్షణ మ్యాచ్‌లు నిర్వహించుకోవాల్సిన ఆ బృందం ఈ కారణంగా మెక్సికోకు మార్చుకోవాల్సి వచ్చింది. మ్యాచ్ జరిగే రోజున వచ్చి వెనుదిరగాలట! ఇలాంటి ఆంక్షలు సహజంగానే ఆటగాళ్ల మానసిక స్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. అమెరికా ఉన్మాదం అక్కడితో ఆగలేదు. మ్యాచ్‌లలో ఇరాన్ అభిమానులుగా వచ్చే వారికి సైతం వీసాలు ఎగ్గొట్టింది. షికాగో విమానాశ్రయంలో దిగిన ఇరాక్ బృందం వైస్ కెప్టెన్ ఆయమాన్ హుస్సేనీని నిర్బంధించి, ఏడుగంటలపాటు ప్రశ్నలతో వేధించి, సోదాలు జరిపి విడిచిపెట్టింది. ఆయనతో వచ్చిన బృందం ఫొటోగ్రాఫర్‌ని వెనక్కి పంపింది. సెనెగల్, మొరాకో, ఉజ్బెకిస్తాన్ బృందాల్ని దుస్తులు విప్పించి నేరగాళ్ల మాదిరిగా పరిగణించారు. 90 మంది మొరాకో అభిమానులకూ ఈ ‘మర్యాదే’ ఎదురైంది. వారి రాకపై సందేహాలున్నాయట! దక్షిణాఫ్రికా బృందం వీసాల కోసం దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా ఇంతవరకూ తేల్చలేదు. ఇప్పటికే అమెరికాలో హోటల్ గదులు రిజర్వ్ చేయించుకోవటంతో పలువురికి లక్షల డాలర్లు వృథా అయ్యాయి.చిత్రమేమంటే... ఈ క్రీడాకారులూ, వారి అభిమానుల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా నేరచరిత్ర లేదు. నిజానికి ఉగ్రవాదమంటే వణికే అమెరికా ఈ దేశాలన్నిటిపైనా పలు సందర్భాల్లో దురాక్రమణలకు దిగింది. వాటిని వల్లకాళ్లుగా మార్చింది. అధినేతలను కాల్చిచంపింది. దీన్ని ఏమనాలి? చేసిందంతా చేసి దొంగే ‘దొంగ... దొంగ’ అని అరిచి నట్టు ఇప్పుడీ వికృత చర్యలేమిటి? విషాదమేమంటే ఇదంతా చూస్తూ కూడా ఫిఫా నోరుమూసుకుని కూర్చోవటం! అమెరికాలో ఫిఫా ఈవెంట్లు జరిగితే సమస్యలొస్తాయే మోనని 2017లో ఒక సందర్భంలో ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినోను అడిగితే... ‘ఫిఫా ఏం చెప్తే అదే చెల్లుతుంది. అమెరికా మొండికేస్తే అక్కడ వేడుకలు రద్దవుతాయి’ అని గంభీరంగా చెప్పారు. ఇప్పుడు వీసా నిరాకరణలూ, వేధింపులూ ఆతిథ్యం ఇచ్చే దేశానికి సంబంధించినవని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఎందుకీ పిరికితనం? 2013లో బ్రెజిల్నూ, 2022లో ఖతార్నూ వరల్డ్ కప్ ఈవెంట్లు రద్దవుతాయని బెదిరించి, ప్రత్యేక చట్టాలు చేయించినప్పుడు ఈ ‘విశాల హృదయం’ ఎటుపోయింది? దక్షిణార్ధగోళ దేశాలంటే చులకనా? అప్పట్లో ఖతార్‌లో స్వేచ్ఛ లేదంటూ నోళ్లు నొక్కుకుని నిరసన తెలిపిన జర్మనీ ఆటగాళ్లు ఈసారి అమెరికాలో ఆ సాహసం చేయగలరా? కడివెడు పాలల్లో విషపు చుక్కలా ఉన్న అమెరికా తీరుపై కళ్లుమూసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్లపై అందరిలోనూ ఆసక్తిపోతుందని ఫిఫా గుర్తించాలి. -
ఇది సర్కారీ నిర్లక్ష్యం!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జనం సుదీర్ఘకాలం పోరాడి, ఎన్నో బలిదానాలు చేసి సాధించు కున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేసి తీరాలన్న పాలకుల యావ 8 మంది కార్మికుల నిండు ప్రాణాలు తీసింది. సోమవారం సాయంత్రం స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్ఎంఎస్)–1లో ద్రవపు ఉక్కును మోసుకెళ్తున్న భారీ లాడెల్‌లో హఠాత్తుగా విస్ఫోటం సంభవించి, అక్కడ పనిచేస్తున్న 8 మంది క్షణాల్లో మాంసపు ముద్దలుగా మిగలగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. 1,600 డిగ్రీల సెల్సియస్‌తో సలసలకాగుతున్న ఆ ఉక్కు ద్రవం... సమీపంలోని భారీ క్రేన్‌పై పడి అది పూర్తిగా దగ్ధమైందంటే దాని తీవ్రత ఎంతటిదో గ్రహించవచ్చు. ఉద్దేశపూర్వకంగా, నిర్లక్ష్యంతో వ్యవహరించిన పర్యవసానంగా చోటుచేసుకున్న ఈ మరణాలు నిజానికి హత్యలు. దీన్ని కప్పిపుచ్చుకోవటానికే మంత్రి నారా లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం పడరాని పాట్లు పడ్డారు. సీఎం చంద్రబాబు పత్తాలేరు. ముందురోజు వెళ్లిన హోంమంత్రి అనిత కార్మిక కుటుంబాలను పలకరించే ధైర్యం లేక అట్నుంచి అటే పలాయనం చిత్తగించారు. లోకేశ్, పవన్ అర్థంపర్థం లేని మాటలు మాట్లాడి కార్మికుల ఆగ్రహాన్ని చవిచూశారు. ‘అకటా వికటపు రాజుకు అవివేకపు మంత్రులు, చాదస్తపు పరివారం...’ అనే నానుడి మనకు ఉండనే ఉంది. అందుకు తగినట్టే కార్మిక నేతలు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్ప లేక, రంకెలేస్తూ ‘మీకెందుకు... మీ ఇంట్లో ఎవరైనా పోయారా?’ అంటూ లోకేశ్ మాట్లా డిన తీరు ఆయన కుసంస్కారానికి నిదర్శనం. రెండేళ్లనుంచి మంత్రిగా ఉన్నా పవన్ అపరిపక్వతను వదుల్చుకోలేకపోతున్నారని ఆయన తీరు తేటతెల్లం చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కర్మాగారాన్ని అమ్మేయాలని చూస్తే తానే అడ్డుకున్నారట. ఘటన జరిగిన కర్మాగారం ఏమిటో, అది ఎవరి అధీనంలో ఉంటుందో కూడా ఆయనకు తెలియ దన్నమాట! పైగా పోరాడదామంటే కార్మికులు కదల్లేదట!! ఇంత పెద్ద విషాద ఘటన తర్వాత, ఇలా చవకబారు మాటలు మాట్లాడటానికి ఆయనకు సిగ్గనిపించలేదు. పైగా 2021లో దీన్ని ప్రైవేటీకరించాలనుకుంటే అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంఅసెంబ్లీలో తీర్మానం చేయించి అడ్డుకుందని అదే నగరంలో కేంద్ర ఉక్కుగనుల మంత్రి హెచ్డి కుమారస్వామి చెప్పి ఇంకా 24 గంటలు గడవకుండానే అబద్ధాలు చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి!ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం తరఫున వచ్చినవారిపై సహజంగానే ఆగ్రహా వేశాలు పెల్లుబుకుతాయి. పైగా విశాఖ ఉక్కును రక్షిస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకొచ్చినవారు గనుక, మీరేం చేశారని ప్రశ్నిస్తారు. ‘అప్రయోజకుడికి అహంకారం ఎక్కువన్న’ట్టు గొంతు చించుకుని దబాయిస్తే కార్మికలోకం నోరుమూసుకుని పడి ఉంటుందని లోకేశ్ అనుకుంటున్నట్టున్నారు. ఒకప్పుడు వేలమంది ఉద్యోగులతో కళకళ్లాడుతూ ఉత్పాదనలో దేశంలోనే నంబర్ వన్‌గా, నవరత్నాల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న పరిశ్రమను ఉద్దేశపూర్వకంగా చిదిమేస్తుంటే... ప్రైవేటుపరం చేయడానికి పావులు కదుపుతుంటే నిలదీయటం నేరమా? ఇంతవరకూ కర్మాగారంలో 7,500 మంది కాంట్రాక్టు కార్మికుల్ని తొలగించారు. నిపుణులైన 6,000 మందిని పనిలో నుంచి తీసేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ పేరిట మరో 2,000 మందిని పంపేశారు. మరోపక్క ఉత్పాదకత పెంచాలని కార్మికుల్ని వేధిస్తున్నారు. 30 ఏళ్లనాటి బ్యాటరీలేఇంకా వినియోగిస్తుండగా, కొన్ని విడి భాగాలు పనికి రాకుండా పోయాయని చెప్పినా అరణ్యరోదనైంది. పైగా విశాఖ ఉక్కు ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఉక్కు తయారీలో నాసిరకం రసాయనాలను వాడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుత విషాద ఘటనకు ఇవన్నీ కారణమే. అందుకే ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరగాలి. కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నట్టు మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం, ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలి. ఇదే నగరంలో ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగినప్పుడు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెనువెంటనే మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున అంద జేశారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు విశాఖ ఉక్కు విషయంలో డ్రామాలు కట్టిపెట్టి దాని ప్రైవేటీకరణను అడ్డుకోవాలి. -
టీఎంసీ అంతర్విస్ఫోటనం!
ఎన్నికల ఫలితాలు వెలువడి పట్టుమని పాతిక రోజులు కాకుండానే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ)కి వీధుల్లో హింసతో మొదలైన ఎదురుదెబ్బలు ఇంకా ఆగలేదు. తాజాగా ఇండియా కూటమి సమావేశానికి ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ ఢిల్లీ వచ్చిన సోమవారం నాడే ఆ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగరేసి, తమదే అసలైన టీఎంసీ అనీ, ఎన్డీయేలో ఉంటామనీ స్పీకర్‌కు లేఖ రాశారు.వారి సంఖ్య 13 మాత్రమేనని పార్టీ చెబుతోంది. ఇప్పటికే టీఎంసీ శాసనసభా పక్షం చీలి, 58 మంది ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీ నాయకత్వంలో వేరు కుంపటి పెట్టారు. తమనే ప్రధాన ప్రతి పక్షంగా గుర్తించమని స్పీకర్‌కు లేఖ రాశారు. స్థానిక సంస్థల్లో రాజీనామాలకూ, గోడ దూకుళ్లకూ కొదవే లేదు. ‘స్ట్రీట్ ఫైటర్’గా పేరున్న మమత ఈ అరాచకాన్ని ఆపడానికి ప్రయత్నించకపోలేదు. కానీ అదేమీ ఫలితమివ్వలేదని తాజా పరిణామాలు చెబు తున్నాయి. ఫిరాయింపులనగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ‘వైస్రాయ్ ఎపిసోడ్’ అందరికీ గుర్తొస్తుంది. కానీ ఆ జాడ్యం ‘వైస్రాయ్’ కన్నా చాలా పాతది. 1967లో హరియాణాలో గయాలాల్ అనే స్వతంత్ర శాసనసభ్యుడు వారం రోజుల వ్యవధిలో మూడు పార్టీలు మారినప్పుడు ‘ఆయా రాం... గయారాం’ అనే నానుడి మొదలైంది. ఫిరాయింపులకు ఆయన ఆద్యుడు కాకపోవచ్చుగానీ, వాటితో ఆయన పేరు శాశ్వతంగా ముడిపడి పోయింది.కానీ గత రెండు దశాబ్దాలనుంచి గుంపుగా వెళ్లి అవతలి పార్టీతో అంటకాగే ఉదంతాలు లేదా సొంత పార్టీ పెట్టుకోవడం వంటివి చోటుచేసుకున్నప్పుడల్లా... ప్రభుత్వాలు కుప్ప కూలినప్పుడల్లా ఆ పాత నానుడి పోయి, ‘వైస్రాయ్ ఎపిసోడ్’ గుర్తుకురావటం మొదలైంది. 1995లో జరిగిన ఆ ఉదంతం వెన్నుపోటుకూ, విద్రోహా నికీ, నయవంచనకూ బండగుర్తుగా మారిపోయింది.తన మామ స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా జిల్లా పర్యటనలో ఉండగా, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, అప్పటి రెవెన్యూ మంత్రి చంద్రబాబు తన విధేయులైన అరడజను మంది ఎమ్మెల్యేలను వైస్రాయ్ హోటల్లో పోగేసి, టీడీపీ చీలిపోయిందంటూ బ్రహ్మాండం బద్దలయిన స్థాయిలో అనుకూల మీడియాలో ప్రచారం చేయించుకుని, ఎమ్మెల్యేలను మభ్యపెట్టి, బ్లాక్మెయిల్ చేసి ఆ సంఖ్యను పెంచుకుంటూ పోయారు.ఆయన మిత్రుడు, నాటి స్పీకర్ యనమల రామకృష్ణుడు సరేసరి... సకల వ్యవస్థలూ చంద్రబాబుకు సాగిలపడటంతో ఎన్టీఆర్ అధికారాన్ని కోల్పోయారు. కొన్ని నెలల వ్యవధిలోనే మనోవ్యధతో కన్ను మూశారు. ఇప్పటి ‘రెడ్‌బుక్’లా ఆ ఉదంతానికి బాబు పేరెట్టినట్టు లేరుగానీ... ఈనాటికీ సకల రాష్ట్రాల ఫిరాయింపుదార్లకూ అదే శిరోధార్యం. 2014లో 23 మంది ఎమ్మెల్యేలను ఖరీదు చేయటం సంగతలా ఉంచి... 2024లో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ అధికారం నుంచి వైదొలగాక కొందరు ఎంపీలతో పార్టీకీ, పదవికీ రాజీనామాలు చేయించటంద్వారా మళ్లీ ఆయనే ‘నైతికత’ ముసుగులో కొత్త రకం చీడకు గేట్లు తెరిచారు. మహారాష్ట్రలో 2022లో ఫిరాయింపులతో శివసేన, ఎన్సీపీలు చతికిలబడి అప్పటి మహావికాస్ అఘాదీ(ఎంవీఏ) ప్రభుత్వం కుప్పకూలింది. ఇప్పుడు విపక్షంలో ఉన్నా టీఎంసీకి అదే దుఃస్థితి ఎదురైంది. ఇదంతా మమత స్వీయ తప్పిదాల ఫలితమా... బీజేపీ చూపే ఆకర్షణల వల్లనా అని చర్చించటం వృథా. రెండూ నిజమే కావొచ్చు. కానీ మమత తప్పిదాలుంటే అవి ఇప్పుడే గుర్తుకురావటం, బీజేపీ ఆకర్షణలు చూపితే పార్టీ అధికారం కోల్పోయాకే ఎగబడటం వింత.గత నెల 4న వెలువడ్డ ఫలితాల్లో 45.92 శాతం ఓట్లతో, 208 సీట్లతో బీజేపీ అధికారంలోకి రాగా... 40.68 శాతం ఓట్లు, 80 సీట్లతో తృణమూల్ అధికారం కోల్పోయింది. అంటే ఓట్లపరంగా పెద్ద వ్యత్యాసం లేదు. కానీ టీఎంసీ ఎమ్మె ల్యేలూ, ఎంపీల్లో ఎంత అభద్రతాభావం! ఈ బాపతు ఫిరాయింపుల్ని అలా గోడదూకే వారిలో లోపించిన నైతికతగా మాత్రమే చూడటం సరికాదు. ఈ వికృత ధోరణుల్ని నిలదీసే కాలంపోయి... ఘనకార్యాలుగా, ‘అపర చాణక్యం’గా అభివర్ణించే మీడియా వచ్చింది. ఇతర వ్యవస్థలూ తమకేమీ తెలియనట్టు నటిస్తున్నాయి. అందుకే ఈ గోడ దూకుళ్లు నిర్లజ్జగా సాగిపోతున్నాయి. కనుక పార్టీలు చీలిపోతే... ప్రభుత్వాలు పడిపోతే ‘యూ టూ బ్రూటస్’ అనుకుని ఆశ్చర్యపోవటం తప్ప ఎవరూ చేయగలిగింది లేదు. -
కృత్రిమ మాయలో మనిషి
‘కృత్రిమ మేధ’గా మనం చెప్పుకునే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) ‘కపటి’ అనే అర్థంలో నిజంగానే కృత్రిమంగా మారి ప్రపంచాన్ని భయపెడుతోంది. తెలుగులో ‘నకిలీ తెలివి’ లాంటి మాటల్ని వెతుక్కునే లోపలే అది నకిలీ విన్యాసాలలో చిత్రవిచిత్రమైన లోతులు చూస్తోంది. ఒక చేత్తో సానుకూలపు పూల బాణాలనూ, ఇంకోచేత్తో ప్రతికూలపు వాడిబాణాలనూ ప్రయోగిస్తూ జనాన్ని ఏకకాలంలో మోహపారవశ్యంలోనూ, భయవిభ్రమాల్లోనూ ముంచెత్తుతోంది. అనుకూల ఫలితాలపై ఆశపడుతూనే, ప్రతికూల ప్రభావాలనుంచి తప్పించుకునే మార్గాల వేటలో ప్రపంచం తలమునకలవుతోంది. భారత్, చైనా, రష్యా సహా పది దేశాలు సభ్యులుగా ఉన్న ‘బ్రిక్స్’ కూటమి కృత్రిమ మేధో వినియోగంలో, అభివృద్ధిలో, దానితో ముడిపడిన నైతిక సమస్యల నివారణలో, మేధో హక్కులూ, డేటా పరిరక్షణలో కలసి పనిచేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా, సాంస్కృతిక రంగంలో కృత్రిమ మేధో దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుపుతోంది; ఒక సమావేశానికి ప్రపంచ పురాతన నగరాలలో ఒకటైన వారణాసి వేదిక కాబోతోంది. కృత్రిమ మేధ ఏం చేస్తోందంటే, ఒక సాంకేతిక మహాద్భుతంగా మాయామేయ మాంత్రిక జగత్తును సృష్టిస్తూ పురాణ, ఇతిహాస, జానపద కథల కాలంలోకి తీసుకెడుతోంది. రామాయణంలో భర్త శాపానికి గురై అహల్య శిలగా మారిపోవడం, రాముని పాదాలు తాకగానే పూర్వరూపం తెచ్చుకోవడం గురించి చదివాం; ‘జగదేకవీరుని కథ’ సినిమాలో జలక్రీడలాడుతున్న దేవకన్యలను చూసిన పాపానికి వారి శాపానికి ఎరై కథానాయకుడు శిలగా మారిపోవడం, ఒక వృద్ధ మహిళ అతనికి శాపవిముక్తి కలిగించడం చూశాం. త్రిశంకుని స్వర్గానికి పంపించే ప్రయత్నంలో అతణ్ణి మధ్యలోనే స్తంభింపజేసి ‘త్రిశంకు స్వర్గా’న్ని సృష్టించిన విశ్వామిత్రుని పునఃసృష్టి పాటవాన్ని కథల్లో దర్శించాం. రామాయణంలో ఇంద్రజిత్తు చేసే మబ్బుచాటు మాయావి యుద్ధాన్నీ, మహాభారతంలో సైంధవుని వధ సందర్భంలో కృష్ణుడు చక్రం అడ్డేసి కృత్రిమ సూర్యాస్తమయాన్ని సృష్టించడాన్నీ తిలకించాం. తన అర్ధాంగి పార్వతి అభ్యంగన స్నానానికి వెడుతూ నలుగుపిండి నుంచి సృష్టించి కాపలాపెట్టిన బాలుడు తనను అడ్డగించినందుకు శివుడు ఆగ్రహించి అతని శిరస్సును ఖండించడం; నిజం తెలిసి అతనికి ఏనుగు తలను అతికించి, బతికించడం గురించి విన్నాం. తలలు తీసి తలలు పెట్టడంతో సహా కృత్రిమ మేధ ఇలాంటి చిత్రవిచిత్ర సన్నివేశాలను అవలీలగా సృష్టించగలుగుతోంది. అవి కపటత్వపు అంచులు తాకుతూ ప్రసిద్ధ వ్యక్తుల శీలహననానికి పాల్పడుతూ వివాదాస్పదమవుతున్నాయి; నిజమో, అబద్ధమో తెలియని త్రిశంకు స్థితికి జనాన్ని నెడుతున్నాయి. రాజకీయ నాయకులు, సినీనటులతో సహా ప్రముఖుల రూపాలనూ, గొంతులనూ వాడుకుంటూ అభ్యంతరకర సన్నివేశాలను సృష్టించడం, వారు న్యాయస్థానాలను ఆశ్రయించడం చూస్తున్నాం. పూర్తి సాంకేతిక నైపుణ్యాలూ, సాంకేతికతను బాధ్యతాయుతంగా వాడుకోవాలనే స్పృహ లేనివారికి కూడా కృత్రిమ మేధ అందుబాటులోకి రావడం వల్ల తలెత్తే ఇలాంటి వైపరీత్యాలతో కూడా పురాణ, ఇతిహాస కథలతో పోలిక కుదరడం మరో వైచిత్రి. ఉదాహరణకు, మహాభారతంలోని అశ్వత్థామతో ముడిపడిన ఒక ఉదంతాన్నే చూస్తే, కురుక్షేత్ర యుద్ధాంతంలో అతను ఉపపాండవులను వధించి పారిపోయినప్పుడు అతణ్ణి పట్టుకోవడానికి భీముడు బయలుదేరివెడతాడు; అశ్వత్థామ క్రూరుడనీ, చపలచిత్తుడనీ; అతని దగ్గర ‘బ్రహ్మశిరోనామక’మనే దివ్యాస్త్రం ఉందనీ, దాని ప్రయోగమే తప్ప ఉపసంహారం అతనికి తెలియదనీ కృష్ణుడు అర్జునుడితో చెప్పి భీముని కాపాడుకోవడానికి తక్షణమే వెళ్ళాలంటాడు; ఊహించినట్టే అశ్వత్థామ దానిని ప్రయోగించడం, ప్రయోగోపసంహారాలు రెండూ తెలిసిన అర్జునుడు అదే అస్త్రంతో దానిని శాంతింపచేయబోవడం చూస్తాం. మనిషి– తన మేధ సృష్టించిన కృత్రిమ మేధముందు తనే చిత్తవుతున్నాడు. మాంత్రికతనుంచి వాస్తవికతవైపు వెడుతున్న భ్రమలో ఉన్న మనిషిని కృత్రిమ మేధ తిరిగి మాంత్రికతవైపు మళ్ళిస్తూ పైచేయిని చాటుకుంటోంది. తను సృష్టించిన సాంకేతికత చేతిలో తనే ఓడి దిక్కులు చూసే పరిస్థితిని తెచ్చుకోవడం మనిషిని తొలినుంచి వెంటాడుతున్న శాపం. -
సారం లేని సారా కథలు
‘ఈనాడు’ మీడియా అధిపతి వియ్యంకుల వారికి మరోసారి తాజాగా చంద్రబాబు ప్రభుత్వం భారీ నజరానాను సమర్పించిందట! వారి కాంట్రాక్టు సంస్థ పోలవరం ఎడమ కాలువ పనుల్లో రెండు ప్యాకేజీలను చేపట్టింది. కేవలం ఇరవై నెలల కింద ఖరారు చేసిన వాటి అంచనా వ్యయాన్ని 126 శాతం పెంచుతూ ఈ శుక్రవారం నాడు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ‘సాక్షి’ బయటపెట్టింది. అదేరోజు ఉషోదయాన ‘ఈనాడు’ మొదటి పేజీలో వడ్డించిన ఒక వార్త గమనించదగ్గది. మద్యం కేసులో త్వరలోనే జగన్‌కు ఈడీ నోటీసులిస్తుందట! విషయం లేకుండా గాలిని పోగేసి కట్టిన ఈ కక్షపూరిత కేసుపై ‘ఈనాడు’ సహా యెల్లో మీడియా వాహినంతా కూడబలుక్కొని ఏడాదిన్నర కాలంలో సృష్టించిన కాల్పనిక సాహిత్యాన్ని టన్నుల లెక్కల్లో గణించవలసి ఉంటుందేమో!చంద్రబాబుకు అవసరమైన పద్ధతిలో సమాచార ఉపచారాలు చేయడం యెల్లో మీడియా పని. బదులుగా ఆ మీడియా అధిపతులకు కోరుకున్న ఉపకారాలు చేసిపెట్టడం బాబు సర్కార్ బాధ్యత. ఈ సహకార ధోరణి మూడు దశాబ్దాలుగా నిరాటంకంగా సాగుతున్నది. మద్యం కేసు పేరుతో యెల్లో మీడియా నిర్వహించిన వ్యాసంగాన్ని కాకమ్మ కథలని పిలవాలో, చిలకమ్మ పలుకులని నుడవాలో అర్థం కాని పరిస్థితి. అయితే, రాసినదాన్నే పలుమార్లు మార్చి మార్చి రాయగలిగే వారి రచనా చమత్కృతికీ, జబ్బ పుష్టికీ పాఠకులు అచ్చెరువొందడం ఖాయం. వాటిని చదివిన విభ్రమావస్థలో ఏది కుంభకోణమో, ఏది అసలు కోణమో పాఠకులు తేల్చుకోలేరనే కనికట్టు విశ్వాసం వారికి ఉండవచ్చు. కానీ, ఇంగితజ్ఞానం అనేదాన్ని రాసేవాడు విడిచేసినా చదివేవాడు కోల్పోడనే ఎరుకలేకపోవడం వారి బలహీనత.పత్రికా రంగంలో తనకు పోటీగా తయారైన ‘ఉదయం’ను దెబ్బతీయడానికి ‘ఈనాడు’ మద్యనిషేధ ఉద్యమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏబీకే ప్రసాద్ ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు ప్రారంభించిన ‘ఉదయం’ సంచలన వార్తలకు కేంద్ర బిందువుగా మారింది. ఆర్థిక నిర్వహణ భారం కావడంతో దాన్ని లిక్కర్ వ్యాపారస్తుడైన మాగుంట సుబ్బిరామిరెడ్డికి అప్పగించారు. లిక్కర్ వ్యాపారాన్ని నిషేధిస్తే ‘ఉదయం’ పునాదులు దెబ్బతింటాయన్న లక్ష్యంతోనే ‘ఈనాడు’ మద్యనిషేధ ఉద్యమాన్ని ప్రారంభించిందనే విమర్శలు ఆ రోజుల్లోనే వినిపించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ తానిచ్చిన హామీ మేరకు మద్యనిషేధాన్ని అమలు చేశారు. నాడు ‘ఈనాడు’ సహకారంతో వెన్నుపోటు వ్యూహం ద్వారా అధికారం చేపట్టిన చంద్రబాబు సర్కార్‌కు మద్యనిషేధం ఇబ్బందిగా మారింది. వెంటనే ‘ఈనాడు’ రంగంలోకి దిగి ఒక సంపాదకీయాన్ని రాసిపారేసింది. ప్రజలు చైతన్యవంతులై వారంతట వారు తాగడం మానేస్తే తప్ప మద్యనిషేధాన్ని అమలు చేయడం అసాధ్యమని అందులో తేల్చేశారు. బోధివృక్ష ఛాయలో సంపాదకీయాన్ని చదివిన చంద్రబాబు తక్షణం కర్తవ్యోన్ముఖుడై మద్య నిషేధాన్ని ఎత్తిపారేశారు.ఆనాడు మొదలైన బాబు – యెల్లో మీడియా బంధం మరింత బలపడింది. ఆనాటి వెన్నుపోటు వ్యూహాలు, లిక్కర్ కథల ట్విస్టులూ నేటికీ కొనసాగుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. రాష్ట్ర విభజన తర్వాత కూడా అధికారంలో ఉన్న నేతను బట్టి యెల్లో మీడియా లిక్కర్ కథల్లోని ట్విస్టులను మనం స్పష్టంగా చూడవచ్చు. 2014–19 మధ్యకాలంలో అధికారంలో ఉన్న చంద్రబాబు మద్యం పాలసీపై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. తెలుగుదేశం పార్టీ నాయకులతో ఏర్పాటుచేసిన మద్యం సిండికేట్‌కు లబ్ధి చేకూరేవిధంగా ప్రభుత్వం వ్యవహరించిందనీ, ఫలితంగా 20 వేల కోట్లకు పైగా సిండికేట్ దండుకున్నదనీ ఆరోపణలు చేసింది. అంతటితో ఆగకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత సీఐడీ విచారణకు ఆదేశించింది. సీఐడీ దర్యాప్తులో వైసీపీ ఆరోపణలు చాలావరకు నిర్ధారణ అయ్యాయి. దర్యాప్తుల సంగతి పక్కనపెట్టి కామన్సెన్స్ను ఉపయోగించి ఆలోచించినా కూడా జరిగిన అవినీతికి స్పష్టమైన సాక్ష్యాలు కనిపిస్తాయి.అంతకుముందు ఆరు డిస్టిలరీలు ఉంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా మరో 14 డిస్టిలరీలకు అనుమతి ఇచ్చారు. తమకు అనుమతులిచ్చి వ్యాపారాన్నిచ్చిన వారి పట్లనే సంస్థలు కృతజ్ఞతతో ఉంటాయి తప్ప ఇవ్వనివాళ్ల పట్ల ఎందుకుంటాయి? ఉమ్మడి రాష్ట్రంలో 2012 నుంచి బార్ల మీద వాటి వ్యాపారాన్ని బట్టి ప్రివిలేజ్ ఫీజును వసూలు చేస్తున్నారు. విభజన తర్వాత ఏపీకి ఈ ప్రివిలేజ్ ఫీజు ద్వారా ఏటా 1,300 కోట్ల ఆదాయం సమకూరేది. 2015లో చంద్రబాబు సర్కార్ ఈ ఫీజును తొలగించింది. అది కూడా కేబినెట్లో పెట్టకుండా, ఆర్థిక శాఖ అనుమతి కోరకుండా చీకటి జీవోల ద్వారా తీసుకున్న నిర్ణయం. అంటే తాము చేస్తున్న పని తప్పని తెలిసి కూడా సర్కార్ పెద్దలు ఈ ఫీజును రద్దు చేశారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. ఆ మేరకు ప్రైవేట్ వ్యాపారులకు నాలుగేళ్లలో ఐదు వేల కోట్లకు పైగా లబ్ధి జరిగింది. ఈ వ్యవహారంలో పాలకులు అవినీతికి పాల్పడేందుకు నూటికి నూరు శాతం అవకాశాలున్నాయి. అందువల్లనే కాగ్ ఆధ్వర్యంలో పనిచేసే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాన్ని నమోదు చేశారని సమాచారం. స్పష్టమైన ఆధారం కనుకనే సీఐడీ కేసు నమోదు చేసింది.3,400 లైసెన్స్డ్ లిక్కర్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లు ఏర్పాటయ్యాయి. చేతులు తడపకుండానే ఇంతటి భారీ వెసులుబాటు సాధ్యం అవుతుందా? ప్రతి షాపు పరిధిలో అదనంగా పది నుంచి పదిహేను వరకు బెల్టు షాపులు ఏర్పాటయ్యాయి. రాష్ట్రం మొత్తంగా 43 వేల బెల్టు షాపులు అవతరించాయి. ఒక్కో బెల్టు షాపును ప్రాంతాన్ని బట్టి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు పాడుకున్నారన్నది బహిరంగ రహస్యం. అందుకుగాను ఒక్కో బెల్ట్ షాపులో ప్రతి క్వార్టర్ మీద అదనంగా 20 రూపాయలకు పైగా వసూలు చేశారు. విచ్చలవిడిగా మద్యాన్ని ప్రవహింపజేసి ఎమ్ఆర్పీ మీద అదనపు దోపిడీతో జనాన్ని పీడించిన ఈ విధానంలో తెలుగుదేశం పార్టీ సిండికేట్ ముఠాలు 20 వేల కోట్లకు పైగా దిగమింగాయని వైసీపీ ఆరోపించింది.జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానంలో మార్పు చేశారు. విచ్చలవిడి మద్యం ప్రవాహానికి కళ్లెం వేసే మద్య నియంత్రణను ప్రవేశపెట్టారు. కొత్తగా జగన్ ప్రభుత్వం ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. అధిక లాభాపేక్షతో విచ్చలవిడి అమ్మకాలకూ, కల్తీ మద్యం ప్రవాహాలకు పాల్పడకుండా ప్రైవేట్ వ్యాపారాన్ని పూర్తిగా తొలగించారు. ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించింది. అమ్మకం వేళలను కూడా రాత్రి 9 గంటల వరకే పరిమితం చేశారు. అంతకుముందు మాదిరిగా రౌండ్ ద క్లాక్ మద్యం లభ్యమయ్యే పరిస్థితి లేదు. షాపుల సంఖ్యను కూడా 3 వేలకు పరిమితం చేశారు. అనుబంధంగా పర్మిట్ రూమ్‌లకు అవకాశం ఇవ్వలేదు. బెల్ట్ షాపుల ఊసే లేకుండా చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం ప్రవేశించకుండా ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, చెన్నయ్, బెంగళూరుల నుంచి కార్లలో ఒక బాటిల్ అర బాటిల్ తెచ్చుకున్నా సరే లాగిపారేసే దాకా ఈ పోలీసుల ఓవర్ యాక్షన్ వెళ్లింది. ఫలితంగా కొన్ని వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమైనా సరే మద్య నియంత్రణను జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేసింది.ఇప్పుడు లాజికల్‌గా ఆలోచిస్తే జగన్ సర్కార్ మద్యం విధానంలో అవినీతి జరిగే అవకాశం ఎక్కడున్నది? కొత్తగా ఒక్క డిస్టిలరీకీ అనుమతి ఇవ్వలేదు. నియంత్రణ చర్యల వల్ల మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. వ్యాపారం తగ్గిపోయిందన్న ఆనందంతో డిస్టలరీలు లంచాలిస్తాయా? విచ్చలవిడిగా షాపులకూ, పర్మిట్ రూమ్లకూ, బెల్ట్ షాపులకూ అనుమతిలిచ్చిన ప్రైవేట్ వ్యాపార విధానంలో లంచాలు వస్తాయా? నియంత్రిత ప్రభుత్వ వ్యాపారంలో లంచాలు వస్తాయా? చంద్రబాబు గత ప్రభుత్వం కొత్తగా 14 డిస్టిలరీలకు అనుమతినివ్వడమే కాదు, మద్యం బేసిక్ రేట్లను పెంచి మరీ వాటికి లబ్ధి జరిగేలా చూసింది. బేసిక్ రేటును పెంచకుండా తమ లాభాలకు కళ్లెం వేసినందుకు డిస్టిలరీలు జగన్ సర్కార్‌కు లంచాలు ముట్టజెప్పాయని అనుకోవాలా? ఇక్కడే యెల్లో మీడియా క్రియేటివిటీ విశృంఖల విహారం చేయడం మొదలుపెట్టింది. తెలుగుదేశం పార్టీ హెడ్‌క్వార్టర్‌లో తయారైన స్క్రిప్టునే దర్యాప్తు కోసం నియమించిన సిట్ లీక్ చేస్తుంది, యెల్లో మీడియా అచ్చేస్తున్నదని వైసీపీ ఆరోపణలు చేస్తున్నది. ఈ ఆరోపణలను విశ్వసించకుండా ఉండేందుకు తగిన కారణం కనిపించడం లేదు. ఎంపిక చేసుకున్న కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేసినందువల్లనే వేలకోట్ల ధనం చేతులు మారిందని ‘సిట్’ పలుకుతున్నది. యెల్లో మీడియా కోరస్ పాడుతున్నది. జగన్ సర్కార్ జమానాలో వచ్చిన కొత్త డిస్టిలరీ లేదు. కొత్త మద్యం బ్రాండ్ కూడా లేదు. అన్నీ కూడా చంద్రబాబు సర్కార్ వారసత్వమే. బాబు పాత జమానాలో 20 డిస్టిలరీలు వుంటే అందులో కేవలం ఐదు డిస్టలరీలకే బేవరేజెస్ కార్పొరేషన్ 50 శాతానికి పైగా ఆర్డర్లు ఇచ్చిందని సీఐడీ దర్యాప్తులో తేటతెల్లమైంది. ఎంపిక చేసుకున్న కొన్ని సంస్థలకే ఆర్డర్లు ఇవ్వడం వల్ల జగన్ హయాంలో వేల కోట్లు చేతులు మారాయన్న కథనం నిజమైతే చంద్రబాబు హయాంలో కూడా అంతకంటే ఎక్కువ మొత్తమే కైంకర్యం అయి వుండాలి కదా! యెల్లో మీడియాకు ఈ లాజిక్‌తో పనేముంది?డిస్టిలరీలకు మద్యం ఆర్డర్లు ఇచ్చే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని సిట్ వాళ్లు బెదిరించి, హింసించి తాము కోరుకున్న వారి పేర్లు చెప్పించి, ఆ పేర్లన్నింటినీ అభియోగపత్రంలోకి ఎక్కించారన్న విమర్శలు వినబడుతున్నాయి. సీఎమ్‌ఓలో కార్యదర్శిగా పనిచేసిన ధనంజయరెడ్డి, సీఎమ్‌కు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డి, అంతర్జాతీయ దిగ్గజ సిమెంట్ సంస్థలో డైరెక్టర్‌గా ఉన్న బాలాజీ గోవిందప్ప, ఐటీ సలహాదారుగా ఉన్న రాజ్ కేసిరెడ్డి, ఆయన బంధువు అనివాశ్రెడ్డి, లోక్‌సభలో వైసీపీ నేత మిథున్‌రెడ్డి, వైసీపీ నాయకుడైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జగన్ పీఏ నాగేశ్వరరెడ్డి వగైరా సుమారు యాభై మంది మరే పని లేకుండా మద్యం వ్యాపారంలో మునిగితేలారని సిట్ నమ్మమంటున్నది.ఈ కథా సరిత్సాగరంలో ఇంకా చాలా పిట్టకథలున్నాయి. ఛార్జిషీట్లో పేర్కొన్నవారు, పేర్కొనని మరికొందరి పేర్ల మీద, వారి బినామీల పేర్ల మీద ఒక్కొక్కరికి వందల కోట్ల ఆస్తులున్నాయట! అంతేకాకుండా, కొన్ని వందల కోట్లతో దుబాయ్‌లో, ఆఫ్రికాలో వ్యాపారాలు జరుగుతున్నాయట! మరికొన్ని వందల కోట్లో, వేల కోట్లో వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి తరలించారట! అసలు అవినీతికే అవకాశం లేని విధానంలో ఇన్ని వేల కోట్లు ఎలా ప్రవహిస్తాయి? ఇంగిత జ్ఞానం అనేది ఉంటే ఈ ఎంగిలి కథలను విశ్వసిస్తుందా? ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా పాలనలో చేతులెత్తేసి ప్రత్యర్థి వంక వేలెత్తి చూపితే జనం విశ్వసిస్తారా? అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంలో, చెప్పుకోవడానికి సాధించిన విజయాలు లేకనే కూటమి సర్కార్ విషప్రచారపు జోరును పెంచిందని అనుకోవలసి వస్తున్నది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
యుద్ధం ఉన్నట్టా... లేనట్టా?!
అయోమయాన్ని సృష్టించటానికీ, అవతలి పక్షంపై పైచేయి సాధించటానికీ ఎంతకైనా తెగించే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈసారి అమెరికన్ కాంగ్రెస్‌కు పెద్ద అబద్ధం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇరాన్‌తో శత్రుత్వాన్ని ఆపి, అక్కడున్న సేనలనువెంటనే వెనక్కి పిలిపించాలని 215–208 ఓట్ల తేడాతో బుధవారం అమెరికన్ కాంగ్రెస్ తీర్మానించగా, ‘అసలు యుద్ధం ఎక్కడుంది? అది ఏప్రిల్ మొదటి వారంలోనే ముగిసి పోయింది. ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అది కొనసాగుతోంది’అంటూ ట్రంప్ లేఖ రాశారు. ఇజ్రాయెల్‌తో కుమ్మక్కై, ఫిబ్రవరి 28న ఇరాన్‌పై మొదలు పెట్టిన దండయాత్ర ఇప్పటికీ ఆగలేదు. హార్మూజ్ జలసంధి ఇంకా తెరుచుకోలేదు. తమ షరతులకు తలొగ్గితేనే ఒప్పందం సాధ్యమంటూ ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ తీర్మానానికి కొన్ని గంటలముందు కూడా అమెరికా దాడులకు ప్రతీకారంగా కువైట్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. కానీ ఈ ఘర్షణల్ని యుద్ధంగా పరిగణించరాదని ట్రంప్ భాష్యం చెబుతున్నారు. నిజానికి యుద్ధం ఆపాలని ప్రతినిధుల సభ ఆదేశించినంత మాత్రాన ట్రంప్కొచ్చే నష్టమేం లేదు. ఆ తీర్మానం చట్టపరంగా కీలకమైన చర్యే కావొచ్చు, కానీ ఆచరణలో అదే మంత పనికొచ్చేది కాదు. నలుగురు రిపబ్లికన్ సభ్యులు డెమాక్రాట్లతో చేయి కలపటంతో తీర్మానం ఆమోదం పొందింది. 1973లో వచ్చిన యుద్ధ అధికారాల చట్టంకిందకాంగ్రెస్ అనుమతి లేకుండా అధ్యక్షుడు యుద్ధంలోకి దిగితే, రెండు నెలల్లో దాన్నిముగించాల్సి ఉంటుంది. ఒకవేళ యుద్ధం ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉందని భావిస్తే మరో 30 రోజులు పొడిగించటానికి అధ్యక్షుడికి వెసులుబాటుంది. కానీ అటు తర్వాత మాత్రం అసాధ్యం. ట్రంప్ రాసిన లేఖ ప్రకారం నిండా నెలకుమించి యుద్ధం సాగలేదు! కాల్పుల విరమణ అమల్లో ఉందంటే యుద్ధం లేనట్టేననీ, ‘అవసరమైన’సందర్భాల్లో చేస్తున్న దాడుల్ని యుద్ధంగా పరిగణించరాదనీ యుద్ధ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ వాదిస్తున్నారు. తలా తోకా లేకుండా మాట్లాడటంలో ట్రంప్ సిద్ధహస్తుడు. ఒకపక్క కాంగ్రెస్ చేసిన తీర్మానం దేశభక్తి రాహిత్యమంటూనే, అదే నోటితో అదెప్పుడో ముగిసిందని చెబు తున్నారు. ఆయన తర్కం ప్రకారం యుద్ధం చేయటమే దేశభక్తి అయితే, దాన్ని నిలి పేసిన తనకూ దేశభక్తి లోపించినట్టే. ఈ వాదప్రతివాదాల మాటెలావున్నా ఇలాంటి అధ్యక్షుణ్ణి నెత్తిన పెట్టుకున్నందుకు మున్ముందు ఆ దేశం భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఈ నెలాఖరుతో యుద్ధం వంద రోజులకు చేరుతుంది. యుద్ధం ఆగేందుకు ఇప్పటికి నాలుగుసార్లు ప్రతినిధుల సభలో డెమాక్రాట్లు తీర్మానాలు పెట్టారు. కానీ మొదటి మూడుసార్లూ అవి వీగిపోయాయి. మూడోసారి తీర్మానమైతే 212–212తో ఎటూతేలకుండా ముగిసింది. ఈసారి అది నెగ్గినా ట్రంప్ తన తర్కంతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. యుద్ధంవల్ల ఇరాన్లో ఇంతవరకూ 3,400 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, 13 మంది అమెరికన్ సైనికులు మరణించారు. 2,900 కోట్ల డాలర్లు ఖర్చయిందని పెంటగాన్ చెబుతుండగా, ఇదంతా ముగిసేసరికి లక్ష కోట్ల డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ మూర్ఖత్వం ఇలాగే కొనసాగితే అమెరికా నిండా మునగటం ఖాయం. దాంతో పాటు డాలర్‌తో ముడిపడివున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ దివాలా స్థితికి చేరుకుంటాయి. ఇంధనం, ఎరువుల ధరలు ఆకాశాన్నంటి ఇప్పటికే ట్రంప్ రేటింగ్ నేల చూపులు చూస్తోంది. ప్రతినిధుల సభ చేసిన తీర్మానంవంటిదే రిపబ్లికన్ల ఆధిక్యతగల సెనేట్‌లో కూడా చేస్తే అమెరికా అధ్యక్షుడి సంతకం అవసరం లేకుండానే యుద్ధం ఆపాల్సి ఉంటుంది. అయితే అలాంటి సందర్భం ఎదురైనప్పుడు సైతం దాన్ని ట్రంప్ వీటో చేయొచ్చని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ తీర్మా నిస్తే తప్ప ఇవన్నీ పెద్దగా పనికొచ్చేవి కాదు. ఇప్పటికే మొత్తం ఓటర్లలో 64 శాతంమంది ట్రంప్ యుద్ధోన్మాదాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. తటస్థ ఓటర్లలో అయితే 73 శాతంమంది యుద్ధం ఆపాలని కోరుకుంటున్నారు. ఎవరెంతగా కోరుకున్నా ట్రంప్ మాత్రం స్వీయ వినాశనంవైపే అమెరికాను తీసుకుపోతున్నారు. -
మయన్మార్‌తో చెలిమి
అనుచిత కారణాలవల్ల తరచు వార్తల్లో ఉండే మయన్మార్ నుంచి ఆ దేశాధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లయింగ్ అయిదు రోజుల పర్యటన కోసం శనివారం మన దేశం వచ్చారు. ఆయనతోపాటు వచ్చిన బృందంలో కేబినెట్ మంత్రులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. కొన్ని దశాబ్దాలక్రితం ఇలాంటి పర్యటన ఊహించలేం. ఎందుకంటే ఆ దేశం నిరంతరం సైన్యం పడగనీడలో మనుగడ సాగిస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను సైన్యం బతకనీయదు. 2020లో తిరుగులేని మెజారిటీతో వరసగా రెండోసారి ఎన్నికైన ప్రజా స్వామ్య ఉద్యమ నేత ఆంగ్ సాన్ సూకీ నాయకత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ (ఎన్ఎల్డీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ఏడాదిలోపే సైనిక దళాలు హస్తగతం చేసుకున్నాయి. మన పొరుగును మనం ఎంచుకోలేం. అక్కడ ఎలాంటి ప్రభుత్వాలుండాలో ఆశించటం కూడా అసాధ్యం. మారుతున్న ప్రపంచ పరిణామాల నేపథ్యంలో మన ప్రయోజనాలు తప్ప వేరే దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని, అందుకోసం అక్కడి పాలకులపై ‘నైతిక ఒత్తిడి’ తీసుకురావాలనుకోవటం వృథా ప్రయాసగా, అనవసర చాదస్తంగా భావించే ధోరణి అలుముకుంది. మార్క్సిజాన్ని అనుసరిస్తున్నానని చెప్పుకొనే చైనా దశాబ్దాల క్రితమే ఈ సూత్రాన్ని నమ్మి మయన్మార్‌ను అక్కున చేర్చుకుని అన్నివిధాలా లాభపడింది.వాస్తవానికి మయన్మార్‌తో మన దేశానికి సన్నిహిత సంబంధాలుండేవి. 1951లో ఆ దేశంతో స్నేహ ఒప్పందం కుదిరింది. 1955లో మనతోపాటు అలీనోద్యమ అంకు రార్పణకు తోడ్పడిన దేశాల్లో మయన్మార్ ఒకటి. కానీ 1958లో సైనిక పాలకుల ఆగమనం తర్వాత ఆ సంబంధాలు దెబ్బతిన్నాయి. మనమే కాదు... దాదాపు ప్రపంచ దేశాలన్నీ దానితో ‘దౌత్యపరమైన అంటరానితనాన్ని’ పాటించటం మొదలెట్టాయి. 1988లో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని సైనిక పాలకులు అణిచేయటాన్ని నిరసిస్తూ సూకీకి భారత్ మద్దతు ప్రకటించింది. 1992లో జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవగాహన అవార్డుకు ఆమెను ఎంపిక చేసింది. కానీ వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2002లో మళ్లీ దాంతో సంబంధ బాంధవ్యాలు పునరుద్ధరించి మాండలేలోని భారత కాన్సులేట్‌ను పునఃప్రారంభించింది. తిరిగి మళ్లీ 2014లో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే అధికారంలోకొచ్చేవరకూ ఇరు దేశాల సంబంధాలూ అంతంత మాత్రమే. 2017లో మోదీ మయన్మార్‌ను సందర్శించారు.మన దేశానికి మయన్మార్‌తో 1,643 కిలోమీటర్ల పొడవునా అంతర్జాతీయ సరిహద్దు ఉంది. ఇందులో ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ (520 కి.మీ.), నాగాలాండ్ (215 కి.మీ.), మిజోరం (510 కి.మీ.), మణిపూర్ (398 కి.మీ.)ఉన్నాయి. 2021లో తిరిగి సైనిక పాలకులు అధికారం చేజిక్కించుకున్నాక మన దేశం గతంలో మాదిరి మయ న్మార్ను ఏకాకిని చేయాలనుకోలేదు. నిరంతరం సంబంధ బాంధవ్యాల్లో ఉంటే అక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణకు అది దోహదపడుతుందనీ, దాంతోపాటు సరిహద్దు భద్రత విషయంలో మన ప్రయోజనాలు నెరవేరుతాయనీ భావించింది. దానికితోడు మయ న్మార్ను దూరం చేసుకుంటే అది చైనాకు దగ్గరకావటం మినహా సాధించేదేమీ ఉండదని కూడా అనుకుంది. అందుకే కావొచ్చు... సైనిక చీఫ్ పదవి వదులుకుని, దేశాధ్యక్షుడైన రెండు నెలల్లోనే తన తొలి విదేశీ పర్యటనకు మిన్ మన దేశాన్ని ఎంచుకున్నారు. నిరుడు డిసెంబర్, ఈ ఏడాది జనవరి మధ్య జరిపిన ఎన్నికల్లో మిన్ భారీ ఓట్లతో విజయం సాధించారు. దాదాపు అన్ని విపక్షాలనూ ఎన్నికల్లో పాల్గొననీయకపోవటంవల్ల ఇది సాధ్యమైంది. ఆ సంగతలావుంచి మయన్మార్‌తో కుదిరిన ఒప్పందాలు మన దేశానికి వ్యూహాత్మకంగా, భద్రతాపరంగా మేలుచేసేవే. అంతర్జాతీయ కరెన్సీ బదులు మన రూపాయి, మయన్మార్ క్యాట్‌లలో లావాదేవీలు జరుపుకోవాలనీ... ఇంధనం, మైనింగ్, ఆగ్రో ప్రోసెసింగ్ రంగాల్లో సహకరించుకోవాలనీ నిర్ణయించుకున్నాయి. అలాగే నౌకా శ్రయ నిర్మాణంలో మయన్మార్‌కు తోడ్పడేందుకు అవగాహన కుదిరింది. ఈశాన్య రాష్ట్రాల్లో అలజడి రేపే సంస్థలకు ఆశ్రయం లభించకుండా చర్యలు తీసుకుంటామని మయన్మార్ హామీ ఇచ్చింది. వర్తమానంలో ఇరుగు పొరుగుమధ్య సర్దుబాట్లు తప్ప ‘అనవసర’ చాదస్తాలు ఉండబోవని ఈ పర్యటన నిరూపించింది. -
ఇప్పటికైనా కళ్లు తెరుస్తారా?
అన్నిచోట్లా అడుగడుగునా కనబడే అవినీతి, నిర్లక్ష్యం దేశాన్నేలే ఉన్నతాధికార వ్యవస్థలు కొలువుదీరిన ఢిల్లీలో కూడా నిక్షేపంగా కొనసాగుతున్నాయని మూడురోజుల వ్యవధిలో జరిగిన రెండు విషాద ఘటనలు రుజువు చేశాయి. శనివారం రాత్రి అయిదంతస్తుల భవంతి కూలి పోటీ పరీక్షలకు కోచింగ్ కోసం వచ్చిన అయిదుగురు విద్యార్థులతోపాటు మరో మహిళ మరణించగా, దాదాపు 20 మంది గాయపడ్డారు. ఇది మరువకముందే బుధవారం వేకువజామున దక్షిణ ఢిల్లీలో ఒక హోటల్ మంటల్లో చిక్కుకుని 21 మంది చనిపోయారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందటానికి వచ్చే విదేశీయులు ఈ హోటల్లో బస చేస్తారని చెబుతున్నారు. ఈ రెండు ఉదంతాలూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) పనితీరుకు అద్దం పడతాయి. దేశంలో దాదాపు అన్నిచోట్లా నియమోల్లంఘనలు కనబడుతూనే ఉంటాయి. వాటిని పట్టించుకోని అధికార యంత్రాంగాలకూ కొదవ లేదు. కానీ ఢిల్లీలోనూ ఇదే స్థితి! పైగా ఇలాంటి ఉదంతాలు ఆ నగరానికి కొత్తగాదు. 2024లో ఒక చిన్న పిల్లల ఆసుపత్రి మంటల్లో చిక్కుకుని ఏడుగురు నవజాత శిశువులు కన్నుమూశారు. అదే ఏడాది ఒక సెల్లార్లో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లోకి వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించారు. ఈ మహానగరంలో కాలం చెల్లిన భవంతులు కూలడం, ఏడాదికి ఒకటో రెండో అగ్నిప్రమాదాలు రివాజుగా మారడం... అయినా ఎవరికీ చీమ కుట్టినట్టయినా అనిపించకపోవటం దిగ్భ్రాంతికరం.ఎంసీడీ అధికారులు గుణపాఠం నేర్వకపోవడం సరే... ఢిల్లీ ప్రభుత్వం లేదా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిస్సహాయంగా మిగలటం క్షమార్హం కాదు. ముఖ్యమంత్రి రేఖా శర్మకు ఈ సమస్యలన్నీ తెలియవనుకోలేం. ఆమె మూడు దఫాలు కార్పొరేటర్‌గా పని చేశారు. 2023లో లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జవాబిస్తూ రాజధాని నగరంలో నియమాలు ఉల్లంఘించిన భవంతులు 55,000 వరకూ ఉన్నాయని తెలియజేసింది. ఆ జాబితాలోని ఎందరిపై చర్య తీసుకున్నారో, ఆ భవంతుల్ని ఏం చేశారో ఎవరికీ తెలియదు. శనివారం ప్రమాదం జరిగిన అయిదంతస్తుల భవనం కూడా నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిందే. కేవలం మూడంతస్తులకు అనుమతి ఉంటే, మరో రెండంతస్తులు వేయటమే కాక, తాజాగా మరో అంతస్తు నిర్మాణానికి పనులు చేయిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అప్పటికే బలహీనమైన పునాదులపై నాసిరకంగా నిర్మించిన ఆ భవంతిపై అదనపు భారం పడటంతో కూలిపోయిందని చెబుతున్నారు. అలాంటి భవంతి నివాసయోగ్యమైనదేనని ఎంసీడీలో ధ్రువీకరించిందెవరో తేలాలి. బంగారు భవిష్యత్తును ఆశించి రకరకాల కోచింగ్‌ల కోసమని యువత వస్తుంది. చవగ్గా లభిస్తుందన్న కారణంతో అనేకులు ఇలాంటి భవంతుల్ని ఆశ్రయిస్తారు. కిక్కిరిసిన జనావాసాలున్నచోట మంచినీరు, డ్రెయినేజి ఏర్పాట్లు, విద్యుత్ సరఫరా ఎంతో కష్టమవుతాయి. అయినా అధికార యంత్రాంగాలు మౌనంగా ఉండిపోతున్నాయి. బుధవారం మంటల్లో చిక్కుకున్న హోటల్ల్లో రాకపోకలకు కేవలం ఒకే మార్గం ఉందని చెబుతున్నారు. ఆరు గదులకే అనుమతి ఉన్న హోటల్ ఏకంగా అయిదంతస్తుల్లో ఇరవై గదులు నిర్మించింది. దీనికి అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ లేదంటున్నారు. మధ్యతరగతికి అందుబాటు ధరల్లో ఇళ్లు లభించే ప్రభుత్వ విధానాలు లేకపోగా, అక్రమ కట్టడాలు, కాలనీలు వెలుస్తాయి. అవి క్రమబద్ధమవుతాయి. అల్పాదాయ వర్గాలు ఏ సదుపాయాలూ లేని అలాంటి నాసిరకం భవంతుల్లో ఉండక తప్పడంలేదు. ఢిల్లీలో ప్రణాళికాబద్ధంగా లేని ప్రాంతం దాదాపు 60 శాతంమేర ఉంటుందని ఒక అంచనా. 2014లో ఒక ప్రత్యేక చట్టం ద్వారా 1,799 కాలనీలను క్రమబద్ధం చేశారు. అటుతర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ అక్రమ కాలనీలను, నిర్మాణాలనూ అనుమతించ బోమన్నారు. కానీ ఈ పుష్కరకాలంలో అలాంటి మరిన్ని వందల కాలనీలు, వాణిజ్య, నివాస భవంతులు ఉనికిలోకొచ్చాయి. ఏటా వర్షాకాలానికి ముందు ఎంసీడీ తనిఖీలు సాగుతుంటాయి. అవన్నీ మొక్కుబడి వ్యవహారాలేనని ఈ ప్రమాదాలు రుజువు చేస్తు న్నాయి. భూకంప జోన్–4లో ఉన్న ఢిల్లీలో ఇకనైనా పాలకులు మేల్కొంటారా? నిర్మాణ రంగ ఇంజినీర్లతో, నిపుణులతో సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటారా? -
లెక్కల్లో దాగుడుమూతలు
గణాంకాలపై ఎందరికెన్ని ఫిర్యాదులున్నా, ఎవరెంత వేళాకోళం చేసినా ప్రభుత్వ విధానాల రూపకల్పనకూ, అమల్లోవున్న విధానాల దిద్దుబాటుకూ అవే ఆధారం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మూడు రోజుల క్రితం విడుదల చేసిన జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్) చూస్తే మన దేశం ఏయే రంగాల్లో మెరుగుపడింది, ఇంకెన్ని రంగాల్లో సవరించుకోవాల్సిన అవసరముంది అనే విషయాలు తెలుస్తాయి. 1992–93లో విడుదల చేసిన తొలి సర్వేనుంచీ చూస్తే తాజాగా విడుదలైన సర్వే ఆరోది. దేశవ్యాప్తంగా 715 జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వే మాతా–శిశు ఆరోగ్యం, బాలల పౌష్టికాహారం, ఆరోగ్య బీమా వగైరాల్లో మన దేశం ముందడుగు వేసిందని చాటుతోంది. ఇది సమగ్రమైనదనీ, అత్యుత్తమ నాణ్యతతో కూడిన గణాంకాలు రాబట్టడానికి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నామనీ ఆ నివేదిక వివరిస్తోంది. 2030 నాటికి ప్రపంచ దేశాలన్నీ సాధించి తీరాల్సిన వాటిగా ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు ఎంత చేరువలో ఉన్నాం... ఎంత దూరంలో ఉన్నాం అనేది తెలుసుకోవటం, తగువిధంగా సవరించుకోవటం ఈ గణాంకాల ఉద్దేశం. గత నివేదికతో పోలిస్తే ఆసుపత్రుల్లో శిశుజననాల శాతం పెరిగిందనీ(88.6 శాతం నుంచి 90.6 శాతానికి), ప్రసవానికి ముందు ఆరోగ్య పరిరక్షణ 95.9 శాతానికి చేరుకుందనీ, సంతాన సాఫల్యత రేటు స్థిరంగా 2.0 దగ్గరుందనీ, పౌష్టికాహారలోపం తగ్గిందనీ, ఏడాది–రెండేళ్లమధ్య వయసుండే పిల్లలకు వ్యాధి నిరోధక టీకాల శాతం 87.1 శాతానికి చేరుకుందనీ నివేదిక వివరిస్తోంది. అసలు తొలి ఎన్ఎఫ్హెచ్ఎస్ నివేదికకూ, తాజా నివేదికకూ చూస్తే స్పష్టమైన పురోగతి కనిపిస్తుంది. అప్పట్లో కేవలం 40 శాతం ప్రసవాలు మాత్రమే ఆసుపత్రుల్లో జరిగేవి. అవి ఇప్పుడు 90 శాతానికి పెరగటం చిన్న విషయమేం కాదు. అయితే గణాంకాలు ఏం చెబుతున్నాయన్నది కాదు... ఏం చెప్పటం లేదన్నది ముఖ్యమని నిపుణులంటారు. ఆ కోణంలో ఎన్ఎఫ్హెచ్ఎస్ నివేదిక నిరాశపరుస్తుంది. గత నివేదికకూ, ఇప్పటికీ చూసినా ఎన్నో అంశాల దాటవేత తెలుస్తుంది. గత నివేదికకు మొత్తం 131 సూచీలుంటే ఇప్పుడవి 101కి తగ్గాయి. అంటే అనేక అంశాలను ఈ సర్వే పూర్తిగా విస్మరించిందన్నమాట! శిశువులు, పిల్లల మరణాల రేటైనా, కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలైనా, హెచ్ఐవిపై అవగాహన కల్పించటమైనా ఇందులో కనబడవు. అవి సర్వే చేయదగ్గ అంశాలు కాదనిపించటంలోని సహేతుకత ఏమిటో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖకే తెలియాలి. ఒకవేళ వేరే గణాంకాల కోసం విడిగా సర్వే చేసివుంటే ఆ సంగతి చెప్పాలి. 2015–16 సంవత్సరంలో విడుదలైన నాలుగో నివేదికలో వంటగ్యాస్ వినియోగం 43.8 శాతం మేర ఉంటే ఆ తదుపరి సర్వే నాటికి అది 58.6 శాతానికి పెరిగిందని వెల్లడైంది. అటు తర్వాత కేంద్రం కోట్ల సంఖ్యలో అదనపు కనెక్షన్లు మంజూరు చేసింది. దాని ప్రభావం ఎలా ఉందో చూద్దామంటే ఇప్పుడది మాయం! స్వచ్ఛ భారత్ అభియాన్ కింద మరుగుదొడ్ల నిర్మాణాల సంఖ్య 10 కోట్లకు చేరుకుందని 2019లో ప్రకటించి, దాన్ని కీలకమైన ఘట్టంగా చెప్పారు. తీరా తాజా నివేదిక ప్రస్తుత స్థితి ఎలా వుందో, అటుతర్వాత మెరుగుపడిందో లేదో చెప్పకుంటే ఎలా? ఇక పిల్లల్లో, మహిళల్లో రక్తహీనత ఎలా వుందన్న ప్రశ్న కూడా ఎగిరిపోయింది. గత సర్వేలో ఈ అంశానికి సంబంధించి ఏడు సూచీలున్నాయి. అయితే ఈ నివేదికలో నేరుగా నగదు బదిలీ, డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక లావాదేవీలు వగైరా అంశాలున్నాయి. మంచిదే. అంత మాత్రాన ఇతర సూచీలు తొలగించటం సరికాదు. మనం చెప్పుకోవటానికైతే జీడీపీపరంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఆరో స్థానంలో ఉన్నాం. కానీ మౌలికంగా మనది అల్పాదాయ వర్గాలు అధికంగా ఉండే దేశం. సంపద పంపిణీ రీత్యాచూస్తే జనాభాలో కేవలం 10 శాతంమంది దగ్గర దాదాపు 65 శాతం సంపద ఉండగా, వీరిలో కేవలం 1 శాతంమంది చేతుల్లో 40 శాతం సంపద ఉంది. అట్టడుగు 50 శాతం జనాభా చేతిలో కేవలం 6.4 శాతంమేర మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో పాలనాపరమైన జోక్యాలతోనే నిరుపేద వర్గాలకు వివిధ అంశాల్లో సాయం అందించటం సాధ్యమవుతుంది. ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు అందుకోవాలంటే మన వర్తమాన స్థితిగతుల అధ్యయనం తప్పనిసరి. దాన్ని విస్మరించటం తెలివైన పనికాదు. -
కాలాతీత బాల్యం
‘టామ్.’ జవాబు లేదు. ‘ఒరేయ్ టామ్.’ పోలీ పెద్దమ్మ పిలుపునకు ఇప్పుడు ప్రపంచం నలుమూలలా ఓ అని వినబడుతుంది. టామ్ అమెరికాలో మాత్రమే లేడుగా! వాడు ఆఫ్రికాలోనూ ఉన్నాడు, అనకాపల్లిలోనూ ఉంటాడు. అల్లరి, సాహసం కలగలిసిన ప్రతి పిల్లాడూ టామే! 1876 జూన్ 9న ‘పుట్టిన’ టామ్ సాయర్‌కు ఇప్పుడు 150 ఏళ్లు! కానీ ఆ తుంటరికి వయసనేది అయిపోతుందా? టామ్ సదాబాలుడు, సరదా బాలుడు; పోలీ పెద్దమ్మనే కాదు, సకల ప్రపంచాన్ని తన అల్లరి చేష్టలతో ఏలిన కౌబాలుడు. ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్’ నవలను మార్క్ ట్వెయిన్ కేవలం పిల్లల కోసమే రాయలేదు. ‘పెద్దవాళ్లు తమ చిన్నతనంలో తాము ఎలా ఉండేవారో, తమ ఆలోచనలు ఎలా ఉండేవో, తాము ఎలా మాట్లాడేవారో, చిత్రమైన సన్నివేశాల్లో ఎలా చిక్కుకునేవారో ఆహ్లాదకరంగా వారికి జ్ఞాపకం’ చేసిందా నవల. ప్రపంచ సాహిత్య యవనికపై ఒక చిలిపి బాలుడి సాహసాలు ఇంతటి సుదీర్ఘ కాలం సజీవంగా ఉండటం సామాన్యమైన విషయం కాదు. ఇంటి గోడకు సున్నం వేయడాన్ని కూడా ఒక కళగా మార్చి, ఇతరులతో పని చేయించుకునే తెలివితేటలున్న టామ్ నేటి మేనేజ్మెంట్ గురువులకు ఆది గురువు. ఈ నవల రాకముందు, అమెరికన్ సాహిత్యం ఎక్కువగా యూరోపియన్ శైలిని అనుకరిస్తూ, నీతి సూత్రాలతో నిండి ఉండేది. కానీ ట్వెయిన్ అమెరికన్ మాండలికాన్ని, సామాన్యుల భాషను సాహిత్య గౌరవ పీఠంపై కూర్చో బెట్టాడు. ‘ఆధునిక అమెరికన్ సాహిత్యం అంతా మార్క్ ట్వెయిన్ రాసిన ఒకే ఒక్క పుస్తకం నుండి పుట్టింది’ అని ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ హకల్‌బెరీ ఫిన్’ (1884) నవలను కొనియాడాడు ఎర్నెస్ట్ హెమింగ్వే. ఈ నవల టామ్ సాయర్‌కు పొడిగింపు అన్నది గుర్తుంచుకుంటే దాని బీజాలు మొదటే ఉన్నాయన్నది అర్థమవుతుంది.కొన్ని కథలు రాసినా ట్వెయిన్‌కు ఇది తొలి నవల. మిసిసిపీ నది తీరాన ఉన్న హానిబాల్ గ్రామంలో గడిపిన తన సొంత బాల్య స్మృతుల నుంచే ట్వెయిన్ ఈ కథను అల్లుకున్నాడు. తనకు తెలిసిన ముగ్గురు అల్లరి పిల్లల లక్షణాలను కలిపి ‘టామ్’ను సృష్టించాడంటారు. పేరును మాత్రం లోకల్ హీరో అయిన ఒక ఫైర్‌ఫైటర్ మీదుగా స్వీకరించాడు. ట్వెయిన్‌కు అతడు స్నేహితుడు కూడా. ఇద్దరూ కలిసి సాయంత్రాలు షికార్లు కొట్టేవాళ్లు. అందరికీ ఇష్టమైన హకల్‌బెరీ ఫిన్ పాత్రనేమో తన బాల్యమిత్రుడు టామ్ బ్లాంకె¯Œ షిప్ ఆధారంగా రూపొందించాడు. ట్వెయిన్ చుట్టూ ఎందరు టాములో! సిడ్ సాయర్, బెకీ థాచర్, జడ్జ్ థాచర్, జో హార్పర్, విడో డగ్లస్, ఇంజన్ జో లాంటి పాత్రలు కూడా మరిచిపోలేనివి. సినిమాలుగా, టీవీ ప్రోగ్రాములుగా, మ్యూజి కల్సుగా అలరించిన టామ్ సాయర్, టైప్‌రైటర్ మీద రాసిన తొలి నవల అని ప్రచారంలో ఉంది. కానీ అది నిజానికి ‘లైఫ్ ఆన్ ద మిసిసిపీ’ (1883) అని మరోమాట! ఇదీ మార్క్ ట్వెయిన్దే కావడం గమనార్హం.పిల్లలు కేవలం మంచివాళ్లు లేదా చెడ్డవాళ్లు కాదు; వాళ్లు అల్లరి, భయం,సాహసం కలగలిసిన వాళ్లని ప్రపంచానికి చాటి చెప్పాడు ట్వెయిన్. ప్రకృతితో మమేకమవ్వడం, అన్వేషించడం నేటి పిల్లలు కోల్పోతున్న సహజ లక్షణాలు. చీకటి గుహల్లో నిధుల కోసం వెతికిన టామ్ మనకు ఇదే గుర్తు చేస్తాడు. నేటి డిజిటల్ యుగంలో, స్మార్ట్ఫోన్లకు బందీలైపోతున్న బాల్యానికి టామ్ సాయర్ ఒక తాళంచెవి. వందల ఏళ్లు గడిచినా, సమాజం ఎంత ఆధునీకరించబడినా మనుషుల్లోని అమాయ కత్వం, సాహస ప్రవృత్తి మారవు. అందుకే ‘టామ్ సాయర్’ కేవలం ఒక పుస్తకం కాదు, అది ప్రతి ఒక్కరి లోపల దాగి ఉన్న బాల్యానికి నిలువుటద్దం. ఈ 150వ వేడుకల సందర్భంగా మనలోని ఆ చిలిపి టామ్ సాయర్‌ను ఒకసారి నిద్రలేపుదాం! ఈ నవలను నండూరి రామమోహనరావు (1927–2011) టామ్ మన పక్కింటి పిల్లాడే అన్నంత హాయిగా తెలుగులోకి అనువదించాడు. రచయిత నామిని తన కొడుక్కు టామ్ సాయర్ అని పేరు పెట్టుకున్నాడు. టామ్ ఎంతటి తెలుగువాడో చెప్పడానికి ఇంతకంటే రుజువు అక్కర్లేదు. ఈ తిరుపతి టామ్ రచయితగా మారడం ఆ టామ్‌ను కన్నమార్క్ ట్వెయిన్‌కు తగిన నివాళి. -
జగన్నామ మహానాడు!
కవిత్వంలోనూ, జీవితంలోనూ ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అండ్ థాట్స్ లేకపోతే ఆత్మలోకంలో దివాలా తీసినట్టేనని విఖ్యాత రచయిత చలం రాసిన వాక్యం చాలామంది పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ప్రజా జీవితంలో ప్రకాశిస్తున్నామనుకుంటున్నవాళ్లు కూడా ఎథిక్స్ ఆఫ్ వర్డ్స్ అండ్ థాట్స్‌ను పూర్తిగా విడిచేస్తే... పైపెచ్చు, డంబాచారపు కోతలకూ, విద్వేషపు కూత లకూ మాత్రమే అంకితమైపోతే, వారు కూడా ఆత్మలోకాల్లో పూర్తిగా దివాలా తీసినట్టే! తెలుగుదేశం పార్టీ వాళ్లు జరుపుకున్న మహానాడు తంతును చూసిన తర్వాత చలం మాట గుర్తు కొచ్చింది. మహానాడు ఆసాంతం యాంత్రికమైన అట్టహాసం తప్ప ఆత్మవిశ్వాసం మచ్చుకైనా కనిపించలేదు. కూటమి కుహరంలో భయం బయల్దేరిందనీ, ప్రమాద ఘంటారావం మొదలైందనీ మహానాడు సన్నివేశానికి తాత్ప ర్యంగా చెప్పుకోవచ్చు. మహానాడు కంటే ముందే జరిగిన కొన్ని సభల్లో చంద్రబాబునాయుడు ఉపన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మళ్లీ ఒకసారి పొరపాటున ప్రతిపక్షానికి ఓటేస్తారా తమ్ముళ్లూ, అలా చేయబోమని మాటివ్వండని ఆయన ప్రాధేయపడటం దేన్ని సూచిస్తున్నది? పైగా తానే అధికారంలోకి రావాలని ప్రజలంతా పూజలు చేయాలని కూడా ఆయన సూచిస్తున్నారు. ప్రజలంతా పూజలు చేస్తే తప్ప గట్టెక్కే అవకాశం లేదా? తమ రెండేళ్ల అధికారాన్ని ‘మంచి’ పాలనగా ఎంత ప్రచారం చేసుకున్నా జనం గుర్తించడం లేదన్న శంక వారిలో బయల్దేరింది.ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జరిగే మహానాడులో ఆయన ప్రస్తావన 98 సార్లు వస్తే, జగన్మోహన్రెడ్డి నామ స్మరణ మాత్రం 140 సార్లు వచ్చిందట! కారణమేమై ఉంటుంది? ప్రజలను మెప్పించగలిగే ఘనకార్యాలు ఈ రెండేళ్లలో ఏమీలేవా? జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే తప్ప రాజకీయంగా జరుగుబాటు కావడం లేదా? డెబ్బయ్ ఆరేళ్ల వయసు, యాభయ్యేళ్ల రాజకీయ జీవితం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చక్రాలు తిప్పిన నైపుణ్యం, ముఖ్యమంత్రిగా పదహారేళ్ల అనుభవం చంద్రబాబు సొంతం. మహానాడులో ఆయన ఉపన్యాసం ఎలా ఉందో గమనించండి.ఆ స్థాయి వ్యక్తి నుంచి ఎటువంటి ఉపన్యాసాన్ని ఆశించాలి? పైగా పార్టీ గమనాన్ని గమ్యాన్ని సమీక్షించుకునే మహా నాడు వంటి సందర్భంలో వైసీపీని గొడ్డలి పార్టీగా ప్రజల్లో ప్రచారం చేయాలని ఆయన కార్యకర్తలకు ఉద్బోధించారు. ఎక్కడిదీ గొడ్డలి? మనకు తెలిసినంతవరకు వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్. మరీ గొడ్డలి కథేంటి? వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలి వేటుతో చంపారు కనుక, అది వైసీపీ పనేనని జనంతో నమ్మించాలి కనుక గొడ్డలి పార్టీ అని ప్రచారం చేయాలని చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్న వివేకానందరెడ్డిని వైసీపీవాళ్లే బుద్దిహీనత వల్ల చంపించారా? గొడ్డలితో తానే హత్య చేశానని చెప్పినవాడు ఎవరి కనుసన్నల్లో సంచరిస్తున్నాడు? ఏ పార్టీ నాయకులు అతనికి అండదండలిస్తున్నారు? అతనికి పోలీసు రక్షణను, కాన్వాయ్‌ను ఏర్పాటు చేసి వీఐపీ మర్యాదలు చేస్తున్నదెవరు? అతను అరెస్టు కాకుండా కాపాడిందెవరు? వీటికి సరైన సమాధానాలు దొరికితే గొడ్డలి పార్టీ ఏదో తేలుతుంది.గొడ్డలి మార్కుతో పాటు వైసీపీ మీద ప్రచారం చేయడానికి ఇంకో ఐదారు సూచనలు కూడా చంద్రబాబు చేశారు. ఆ పార్టీ గంజాయి బ్యాచ్ అని ప్రచారం చేయాలట! గంజాయి మీద ఉక్కు పాదం మోపడానికి ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని (ఎస్ఇబి) ఏర్పాటు చేసిందే జగన్ సర్కార్ కావడం ఇక్కడ గమనార్హం. కానీ యధార్థాలతో సంబంధం లేకుండా ప్రత్యర్థి పార్టీపై నిందాప్రచారం చేయాలని బాబు ఉద్బోధించారు. వైసీపీ కోసం ఆయన ఇంకా కొన్ని బిల్‌బోర్డులు సిద్ధం చేశారు. వాటికి గట్టిగా ప్రచారం చేసిపెట్టాలని టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అందులో ఒకటి వైసీపీలో బ్లేడ్ బ్యాచ్ ఉన్నదని! బెజవాడ బ్లేడ్ బ్యాచ్ గురించి, కాల్‌మనీ – సెక్స్ రాకెట్ల వ్యవహారం వెనకున్న నాయకుల గురించి జనం ఇప్పటికే మరిచిపోయి ఉంటారని టీడీపీ అధినేత నమ్మకం కావచ్చు.సోషల్ మీడియా సైకో బ్యాచ్, ఫేక్ పబ్లిసిటీ పేటీఎం బ్యాచ్ కూడా వైసీపీ కోసం పని చేస్తున్నాయట! రాజకీయ నాయకుల వ్యక్తిత్వ హననాల కోసం కిరాయి ముఠాలను ఉసిగొలిపిన ట్రాక్ రికార్డు ఎవరికి ఉన్నదో తెలుగు ప్రజకు తెలియనిది కాదు. ఎన్టీఆర్ మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ఈనాడు వేసిన జుగుప్సాకరమైన కార్టూన్లు ఎవరూ మరిచిపోలేరు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దిగజారుడు విమర్శలు చేయడానికి అసెంబ్లీని సైతం వేదికగా ఉపయోగించుకున్న దెవరు? మెగాస్టార్ చిరంజీవి మీద, ఆయన స్థాపించిన రాజ కీయ పార్టీ మీద విషప్రచారానికి ఒడిగట్టిన ముఠా నాయకులు ఎవరు? తన తల్లిని కూడా అవమానించారని ఎవరి మీద పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారు? ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా సుదీర్ఘమైనది. ఇక జగన్మోహన్రెడ్డి మీద గత పద్నాలుగేళ్లుగా అత్యంత హేయమైన ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డు ప్రచా రాన్ని చేసిందెవరు? ఇప్పుడు మహానాడు వేదికను కూడా ఆ ప్రచారం కొనసాగించడానికే వినియోగించుకున్నారు. హిందూ ధర్మం మీద, ఆలయాల మీద కూడా వైసీపీ వాళ్లు దాడులు చేస్తారని చెప్పాలట! టీడీపీ కార్యకర్తలకు పార్టీ నేత ఆదేశం. ఈ ముద్ర వేయడానికి చాలాకాలం నుంచి టీడీపీ అనుబంధ విభాగాలు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎనభై శాతానికి పైగా హిందువులు నివసించే రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకునే రాజకీయ పార్టీగానీ, వచ్చిన పార్టీగానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, ఆలయాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందా? కామన్సెన్స్ విషయం కదా! అది పక్కన పెడితే హిందూ ధర్మం కోసం పదహారేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేసిన సేవ కంటే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ చేసిన సేవలే ఎక్కువ. సెక్యులర్ రాజ్యాంగం అమలులో ఉన్న దేశంలో ఇటువంటి దిక్కుమాలిన చర్చ చేయాల్సి రావడమే దౌర్భాగ్యం.తెలుగుదేశం పార్టీ జగన్నామ మహానాడు ద్వారా 3–జి నాయకత్వం ప్రారంభమైందని చెప్పవచ్చు. కార్యనిర్వాహక అధ్యక్షుని హోదాలో లోకేశ్‌బాబు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలబడ్డారు. నాయకత్వ మార్పు మొదలైనట్టేనని గ్రహించిన నేతలంతా పోటీలుపడి లోకేశ్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. కొత్త తరంలోనైనా తెలుగుదేశం వ్యవహార శైలిలో ఏమైనా మార్పు వస్తుందా అని చూసేవారికి ఆశాభంగమే ఎదురైంది. వ్యక్తిత్వ హనన వ్యూహంలో, లేని గొప్పలు చెప్పుకోవడంలో 2–జి కంటే 3–జి నాలుగాకులు ఎక్కువే చదివిందని తేలి పోయింది. జగన్నామ స్మరణే లోకేశ్ ప్రసంగం కూడా! అతడు అనే సినిమాలో త్రిష చెప్పిన డైలాగ్ ఒకటున్నది – ‘అక్క అంబా సిడర్ అయితే నేను బెంజ్, అది పోర్టబుల్ అయితే నేను ప్లాస్మా, అది లైఫ్‌బాయ్, నేను లక్స్’ అంటుంది.అదే తరహాలో లోకేశ్‌బాబు కూడా జగన్ పార్టీది గొడ్డలి, మాది గూగుల్; జగన్ టెన్త్ పేపర్లు లీక్ చేశాడు, నేను స్టాన్ ఫోర్డ్లో చదివాను’ అంటూ అథమస్థాయి భాషను ఉపయోగించి మాట్లాడాడు. జగన్ టెన్త్ పేపర్లు లీక్ చేసినట్టు తన కెప్పుడు కల వచ్చిందో మాత్రం చెప్పలేదు. లోకేశ్‌కు స్టాన్ ఫోర్డ్లో ఎండోమెంట్ (డొనేషన్) కోటాలో సీటొచ్చిందని అప్పట్లో కొందరు వ్యాఖ్యానాలు చేశారు. వాటి మీద లోకేశ్స్పందించి ఉండాల్సింది. విశాఖలో అదానీ డేటా సెంటర్ కోసం అనుమతులు, భూములు ఇచ్చింది జగన్మోహన్రెడ్డి. వ్యాపార భాగస్వామిగా ఇప్పుడు గూగుల్‌ను తెచ్చుకున్నది అదానీ గ్రూప్. గూగుల్ రాకకు చంద్రబాబు – లోకేశ్‌లకు ఎటువంటి సంబంధం లేదు.సినిమాటిక్ పోలికలతో జగన్‌తో సమవుజ్జీగా నిలబడాలని లోకేశ్‌బాబు తంటాలు పడుతున్నట్టున్నారు. అదెట్లా కుదురు తుంది బాబూ... ఆత్మగౌరవం కోసం అప్పట్లో సర్వశక్తి మంతురాలైన పార్టీ అధినేత్రిని ఎదిరించి పార్టీని వదిలేసి ఒంటరిగా జనంలోకి వెళ్లి, మూడు పార్టీల కూటములను ఒక్కడిగానే ఎదురొడ్డి నిలిచిన ధీరుడు జగన్మోహన్రెడ్డి. ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎంత వ్యక్తిత్వ హననం చేసినా ఇప్పటికీ పొత్తుల్లేకుండా జగన్‌ని ఎదిరించడమంటే గజగజ వణికి పోయే పరిస్థితి కూటమి పార్టీలది. గత పదిహేనేళ్లుగా తండ్రి చాటు బిడ్డగా పొలిటికల్ అప్రెంటిస్‌షిప్ చేసిన అదృష్టం లోకేశ్‌ది. వారసత్వంగా తండ్రి నుంచి అధికారాన్ని అందుకోవ డానికి సిద్ధపడుతున్నారాయన. జగన్ హయాంలో లక్షా ముప్పయ్ వేల సచివాలయ ఉద్యోగాల కోసం పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి చిన్న కంప్లెయింట్ రాకుండా ఒకేసారి అన్ని ఉద్యోగాలను నియమించిన ఘటనను గుర్తు చేసుకోండి. లోకేశ్ విద్యామంత్రిగా నిర్వహించిన డీఎస్సీ పరీక్ష మీద ఎన్ని వేలమంది ఉద్యోగార్థులు రోడ్లపైకొచ్చి నిరసన ప్రకటి స్తున్నారో గమనించండి. ట్రాక్ రికార్డు ముఖ్యం... లక్స్ – లైఫ్ బాయ్ పోలికలు కావు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అరాచకమే విధానం
మన విద్యావిధానానికేమైంది? ‘నీట్’ పోటీ పరీక్ష ప్రశ్నపత్రాల లీక్‌తో మొదలై ఇప్పుడు సీబీఎస్ఈ జవాబుపత్రాల తప్పుడు మూల్యాంకనం బయటికొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన డీఎస్సీలో ప్రశ్నపత్రాలు లీకయ్యాయనీ, పోస్టుల్ని అమ్ముకున్నారనీ, అనర్హులకు దొంగ ర్యాంకులు పంచారనీ వెల్లడై ప్రభుత్వం అభాసుపాలవుతుండగానే, అక్కడ ఎస్సెస్సీ జవాబుపత్రాల మూల్యాంకనం పరమ అధ్వాన్నంగా సాగిందని బట్ట బయలైంది. ‘నీట్’కు ఈసారి 22.79 లక్షలమంది పోటీపడ్డారు.వీరంతా అర్ధాకలితో మాడుతూ నెలల తరబడి పట్టణాల్లో, నగరాల్లో ఉండి కోచింగ్ సంస్థలకు వేలాది రూపాయలు అర్పించి చదువుకున్నవారు. కానీ ప్రశ్నపత్రాలు లీకై అదంతా వ్యర్థమైంది. పరీక్ష రద్దయ్యాక పలుచోట్ల నిరాశా నిస్పృహలతో అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గత పన్నెండేళ్లలో 15 రాష్ట్రాల్లో 70 ప్రధాన లీక్‌లు చోటుచేసుకున్నాయని ఒక కథనం చెబుతోంది. అదే నిజమైతే ప్రశ్నపత్రాల వెల్లడి యాదృచ్ఛికంగా జరిగింది కాదు. దీనివెనక పెద్ద మాఫియానే ఉండొచ్చు. బట్టబయలైనప్పుడే సమస్య అందరికీ తెలుస్తోంది. నీట్ వివాదం సద్దుమణగకముందే సీబీఎస్ఈ వంతు వచ్చింది. ఈ ఏడాది పన్నెండో తరగతి పరీక్షలు 18 లక్షలమంది రాశారు. నిద్రాహారాలు మాని చదువుకున్న ఈ పిల్లల జవాబు పత్రాలు దిద్దటానికి ‘హైటెక్’ ఆలోచన చేసింది సంస్థ. ఆ పత్రాలను స్కాన్ చేసి వాటి డిజిటల్ ఫైళ్లను అప్లోడ్ చేసి మూల్యాంకనం చేసే విధానాన్ని అనుసరించింది. ఆన్ స్క్రీన్ మార్కింగ్(ఓఎస్ఎం) అనే ఈ విధానం గురించి తొలి పరీక్షకు పదిరోజుల ముందు పాఠశాలలకు చెప్పిందంటున్నారు. ఇలాంటి కొత్త విధానంపై పాఠశాల ప్రిన్సిపాళ్లకూ, విద్యార్థులకూ అవగాహన కల్పించాలనీ, అభ్యంతరాలు వ్యక్తమైతే ప్రత్యామ్నాయం ఆలోచించాలనీ దానికి లేకపోయింది.తీరా ఈ నెల 13న ఫలితాలు వెలువడినప్పుడు లక్షలాదిమంది విద్యార్థులు నిర్ఘాంతపోయారు. 90 శాతం వరకూ మార్కులొస్తాయని నమ్మినవారి స్కోర్ అడ్డంగా పడిపోయింది. అప్పటికే హార్వర్డ్, బ్రౌన్, యేల్, కార్నెల్ వంటి ఉన్నత శ్రేణి విశ్వవిద్యాలయాల్లో సీట్లు లభించినవారు బావురుమన్నారు. ఈ అరకొర మార్కులతో కనీసం ఆ విశ్వవిద్యాలయాల గేట్లు తాకే అర్హత కూడా ఉండదు మరి! సీబీఎస్ఈలో నిరుడు ఉత్తీర్ణత శాతం 88.39 అయితే, ఈసారి 85.29 శాతానికి పడిపోయింది. 90 శాతంపైగా మార్కులొచ్చినవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. బ్రిటిష్ వలసపాలకుల హయాంలో 1921లో అత్యున్నత విద్యాప్రమాణాల కోసం స్థాపించిన ఒక సంస్థ కాలక్రమంలో... అంటే 1962లో ఇప్పుడున్న రూపానికి మారింది. అక్కడ ఉత్తీర్ణత సాధించి, సర్టిఫికెట్ తెచ్చుకుంటే ప్రపంచంలో అత్యున్నత శ్రేణి విశ్వ విద్యాలయాలు రెడ్ కార్పెట్ పరిచేంత ప్రతిష్ఠను సీబీఎస్ఈ సంపాదించుకుంది.ఆ సంస్థ ఇప్పుడెంతగా భ్రష్టుపట్టిందంటే... పాఠశాలలు మొదలై మూణ్ణెల్లు గడిచి, ఒక యూనిట్ టెస్ట్ కూడా అయినాక, మెడమీద కత్తిపెట్టి త్రిభాషా సూత్రం పేరిట హిందీ లేదా సంస్కృతం నేర్చుకుతీరాలని శాసిస్తోంది. అందుకోసం పాఠ్యపుస్తకం కూడా లేదంటే... ఆరో తరగతి పుస్తకం చదవాలంటోంది. పైగా ఆ మార్కుల్ని పట్టించుకోబోనని అభయమిస్తోంది. ఇంతకన్నా అరాచకం ఉంటుందా అని అందరూ అనుకునేలోగానే ఈ ముదనష్టపు మూల్యాంకనం వెల్లడైంది. డీఎస్సీ నిర్వాకం బయటపడ్డాక, అంతా సవ్యంగానే ఉందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దబాయిస్తున్న తరుణంలోనే తాజాగా టెన్త్ మూల్యాంకనం అడ్డదిడ్డంగా సాగిన వైనం బయటపడింది. విద్యార్థులు రాసిన కొన్ని జవాబుల్ని పట్టించుకోకపోవటం, దిద్దినా ఆ మార్కుల్ని పరిగణించకపోవటం వంటి చిత్రాలు చోటుచేసు కున్నాయి. తెలివైన విద్యార్థులు అనుమానం వచ్చి రీవెరిఫికేషన్, రీవాల్యూయేషన్ కోసం దరఖాస్తులు చేశాక ఇదంతా బయటికొచ్చింది.పాలన గాలికొదిలిన చోట ఇలాంటి అరాచకాలు జరగటంలో ఆశ్చర్యమేమీ లేదుగానీ...‘నీట్’ నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కు ఏమైంది? సీబీఎస్ఈ ఎలా ధ్వంసమైంది? పాలకులు జవాబుదారీ తనంతో వ్యవహరించటం, జరిగే తప్పులకు నైతిక బాధ్యత తీసుకోవటం తప్పనిసర య్యేలా ప్రజలు ఒత్తిళ్లు తెస్తేనే ఈ దుఃస్థితి మారుతుంది. అప్పుడే ఇతర వ్యవస్థలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తాయి. లేకుంటే అవి కూడా చోద్యం చూస్తుంటాయి. -
ఆత్మస్తుతి – పరనింద
పార్టీ శ్రేణులకు భవిష్యత్తుపై భరోసా కల్పించాలన్నా, వారిని కార్యసాధన దిశగా ఉరక లెత్తించాలన్నా, ఉత్సాహపరచాలన్నా అధినేతకు ముందుగా కావాల్సింది ఆత్మవిశ్వాసం, తన కార్యాచరణపై స్పష్టత. అది రాజ్యమేలే పార్టీ అయితే ఇవి మాత్రమే సరిపోవు. ఆ పార్టీ ప్రభుత్వం అప్పటికే ప్రజల అభ్యున్నతికోసం చాలా చేసివుండాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గతంలోనూ, ఇప్పుడూ దేన్నీ సక్రమంగా చేసిన చరిత్ర లేదు. విశ్వసనీయత మొదటికే లేదు. అందుకే రెండురోజుల ‘హైబ్రిడ్’ మహానాడును ప్రారంభిస్తూ బుధవారం ఆయన చేసిన ప్రసంగం నిండా పరనింద, స్వోత్కర్ష దండిగా ఉన్నాయి. చేసిందేమీ లేదు గనుక... చెప్పుకోవడానికేమీ మిగల్లేదు మరి! గత ఎన్నికలకు ముందు భారీ వాణిజ్య ప్రకటనలతో, ఎస్ఎంఎస్లతో, ఊరూరా ఉపన్యాసాలతో జనాన్ని ఊదరగొట్టారు! సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ ఊరించారు. సంతకాలతో బాండ్లు రాసిచ్చారు. తీరా అమలుదగ్గరకొచ్చేసరికి అలవాటు ప్రకారం దగా చేశారు. ఆడబిడ్డ నిధి పేరిట ఆడవాళ్లందరికీ నెలకు రూ. 1,500 చొప్పున ఇస్తామన్నారు. ఈ రెండేళ్లలో ఆ పద్దుకింద ఒక్కొక్కరికి రావాల్సిన మొత్తం రూ. 36,000. నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3,000 ఇస్తామన్న హామీ కింద ఇంతవరకూ ఒక్కొక్కరికి రావాల్సిన మొత్తం రూ. 72,000. ఈ రెండు పథకాలకూ గుండుసున్నా చుట్టగా... మిగిలినవి అరకొరగా అమలు చేస్తూ వంచిస్తున్నారు. యాభైయ్యేళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నెలకు రూ. 4,000 చొప్పున అందిస్తామని వాగ్దానమిచ్చి, వైఎస్ జగన్ హయాంలో ఉన్న పింఛన్‌దార్లు 66,34,372 మందిలో 6,23,079 మందికి ఎగనామం పెట్టారు. ఈ రెండేళ్లలో ఒక్కొక్కరికి బకాయిపడ్డ మొత్తం రూ. 96,000. మహిళల కోసం తీసుకొస్తామన్న ఉచిత బస్సు పథకాన్ని తాత్సారం చేయటమేకాక, 16 కేటగిరీ బస్సుల్లో కేవలం అయిదింటికే పరిమితం చేశారు. భవిష్యత్తులో ఇక ఎలక్ట్రిక్ బస్సులే ఉంటాయని చెబుతున్న నోటితోనే వాటిల్లో ఉచితం ఉండబోదని సెలవిస్తున్నారు. అంతేకాదు... ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తున్నారు. ‘తల్లికి వందనం’ తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి, ఆపై 20 లక్షల మందికి కోతపెట్టి అమలు ప్రారంభించారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కోరకం మొత్తం వేస్తూ మోసగిస్తున్నారు. ‘అన్నదాతా సుఖీభవ’ అంటూనే తొలి ఏడాది మొండిచేయి చూపారు. రెండోఏడాది 53.52 లక్షలమంది రైతుల్లో 7 లక్షలమందికి కోతపెట్టి అరకొరగా అమలుచేశారు. రెండేళ్లకూ రూ. 40,000 ఇవ్వాల్సి వుండగా, రూ. 14,000తో సరిపెట్టారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగం వగైరాలన్నీ ధ్వంసం చేశారు. జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల పర్యవసానంగా వస్తున్న సంస్థలను తమ ఖాతాలో వేసుకోవటం, ఉన్నవాటిని తరిమే యటం బాబు ‘పారిశ్రామిక విధానం’! ఇన్ని లొసుగులుండబట్టే మహానాడును ‘హైబ్రిడ్’ చేశారు. పశ్చిమాసియా యుద్ధంవల్ల పొదుపు పాటించదల్చుకుని ఈ మోడల్ తీసుకొచ్చామని పైకంటున్నా... కార్య కర్తలను ఒకచోట పోగేస్తే, తమ గంభీరోపన్యాసాలు విని ఊరుకోక క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేమిటో, జనం ఎలా ఛీకొడుతున్నారో ఏకరువుపెట్టే ప్రమాదం ఉందని గ్రహించటంవల్లే ఈ ఎత్తుగడ! కానీ తానొకటి తలిస్తే జరిగింది వేరొకటి. రాష్ట్రవ్యాప్తంగా 1,875 క్లస్టర్ల నుంచి 7.20 లక్షలమంది వర్చువల్‌గా పాల్గొన్నారని టీడీపీ గప్పాలు కొట్టుకుంటుండగా చాలాచోట్ల ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చి ఆ పార్టీ వాలకమేమిటో బట్టబయలైంది. నియోజకవర్గానికి 7 నుంచి 10 కేంద్రాల్లో దీన్ని నిర్వహించటంవల్ల స్థానిక నేతలకు ఒక్కొక్కరికి దాదాపు రూ. 15 లక్షలు చేతిచమురు మాత్రం వదిలింది. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం కోటా మరో పెద్ద దగా. జగన్ హయాంలో ‘అమ్మ ఒడి’ మొదలుకొని ఉద్యోగాలవరకూ... పంచాయతీరాజ్ సంస్థలు మొదలుకొని నామినేషన్ పనుల వరకూ అన్నిటా మహిళలకు 50 శాతం కోటా ఇచ్చిన వైనం తండ్రీ కొడుకులు మరిచివుంటారు. నాయకుడికి విశ్వసనీయత ఉండాలి. గాలి మాటలతో, వెన్నుపోట్లతో, రెడ్‌బుక్ పాలనతో, హద్దులెరుగని దూషణలతో బాబు సాధించేదేమీ ఉండదు. పేలవంగా ముగిసిన వర్చువల్ మహానాడు దీన్నే చాటుతోంది. -
క్వాడ్‌లో మళ్లీ చలనం
ఉందో, ముగిసిపోయిందో తెలియని స్థితిలో ఏడాదిగా దారీతెన్నూ లేకుండా ఉండిపోయిన చతుర్భుజ కూటమి(క్వాడ్)లో ఎందుకనో కొంత చలనం వచ్చింది. మంగళవారం సభ్య దేశాలైన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రుల సమావేశం జరగటం, చివరిలో ఒక ఉమ్మడి ప్రకటన వెలువడటం ఆర్నెల్ల ముందు కూడా ఊహకందనిది. ఎందుకంటే నిరుడు జనవరిలో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మిత్రులు, శత్రువులన్న విచక్షణ మరిచి అందరితో గిల్లికజ్జాలకు దిగడం మొదలెట్టారు. నిర్విచక్షణగా సుంకాలు విధిస్తూ అందరినీ సమానంగా ఇబ్బందిపెట్టారు. ఇలాంటి స్థితిలో అమెరికా చొరవతో ఏర్పడ్డ క్వాడ్ ఇక ముగిసిన అధ్యాయమని అందరూ అనుకున్నారు. నిజానికి ఆరంభంనుంచి క్వాడ్ ఏదో కారణంతో అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటూనేవుంది. చైనాకు వ్యతిరేకంగా 2007లో తొలి సమావేశం జరుపుకోగా ఆ మరుసటి ఏడాదికే జపాన్, ఆస్ట్రేలియాలు వైదొలగాయి. ఆ రెండుచోట్లా పాలకులు మారటం ఇందుకొక కారణం. 2008లో అప్పటి మన ప్రధాని మన్మోహన్ సింగ్ ‘చైనాను కట్టడిచేసే ఎలాంటి కూటమిలోనూ భాగస్వాములం కాదల్చుకోలేదు’ అని కుండబద్దలుకొట్టారు. దాంతో దాదాపు పదేళ్లపాటు అది అచేతనావస్థలో పడింది. 2017 నాటికి దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రం ప్రాంతాల్లో చైనా పెత్తనం పెరగటంతో ట్రంప్ చొరవ తీసుకుని దానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. అయినా కోవిడ్ కారణంగా తొలి శిఖరాగ్ర సమావేశం జరగటానికి నాలుగేళ్లు పట్టింది. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, సముద్రజలాల్లో ఇంటర్నెట్ కేబుల్స్ ఏర్పాటు, టెలికాం సాంకేతికత తదితర అంశాల్లో పరస్పరం సహకరించుకోవాలని విదేశాంగ మంత్రుల సదస్సు నిర్ణయించటం తాజా ప్రపంచ పరిణామాల పర్యవసానమే. హార్మూజ్ జలసంధి ప్రతిష్ఠంభన... ఇంధన సరఫరా నిలిచిపోవటం, ఆ ప్రాంతంవైపు నుంచి వచ్చే అండర్ సీ కేబుల్స్ సైతం ప్రమాదంలో పడటం వగైరా అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఆ ప్రాంతంలో నౌకలను అడ్డగిస్తున్న ఇరాన్ వైఖరిని, వచ్చే పోయే నౌకలవద్ద సుంకాలు వసూలు చేసే ఆలోచనను క్వాడ్ సమావేశం తప్పుబట్టింది. అనవసర యుద్ధంతో ఇంత వివాదానికి కారణమై, తాను సైతం హార్మూజ్‌ను దిగ్బంధించిన అమెరికాకు జనాంతికంగానైనా మిగిలిన దేశాలు హితవు పలికాయా అన్నది తెలియదు.చైనాను నిరోధించి, ఇండో–పసిఫిక్ దేశాల భద్రతకు కృషిచేయాలని గతంలో చెప్పుకున్న సంకల్పం ఇప్పుడు తాత్కాలికంగా వెనక్కిపోయింది. ఈ ప్రాంతంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేసి, ఎప్పటికప్పుడు క్వాడ్ దేశాలమధ్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చు కోవాలని నిర్ణయించినా దీనర్థం క్వాడ్‌ను సైనికీకరణ చేయటం కాదని మన విదేశాంగ శాఖ వివరణనిచ్చింది. క్వాడ్ ఇంధన వేదికను ఈ ఏడాది ఆఖరులోగా నిర్వహించ బోతున్నామని అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో ప్రకటించారు. కానీ ఈ సంస్థ శిఖరాగ్ర సమావేశాలు ఎప్పుడో చెప్పకపోవటం సందేహాలకు తావిచ్చింది. విదే శాంగ మంత్రుల సమావేశంలోనే శిఖరాగ్ర తేదీలు ప్రకటించటం ఆనవాయితీ. వాస్తవా నికి అది 2024లోనే భారత్‌లో నిర్వహించాలి. కానీ వాయిదా పడింది. ఈలోగా సుంకాల వివాదం నేపథ్యంలో ట్రంప్ మన దేశం రావటానికి చొరవ చూపటం లేదు. క్వాడ్ మొదలయ్యే నాటికి చైనా దూకుడు మీదుంది. ముఖ్యంగా హిందూ సముద్ర ప్రాంత దేశాలమీదుగా అది ప్రారంభించదల్చుకున్న బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్టు భారత్ భద్రతకు ముప్పు తెస్తుందన్న సందేహం ఉంది. ఇక ఇరు దేశాల సరిహద్దుల్లో ఆ దేశం తరచు సృష్టించే వివాదాలు సరేసరి. ఇలాంటి నేపథ్యంలో క్వాడ్‌లో భాగస్వామ్యం కావటానికి మన దేశం ముందుకొచ్చింది. ఆనాటి పరిస్థితుల మాటెలావున్నా ఎవరికీ అంతుచిక్కని ట్రంప్ వంటి అధినేతను నమ్మి ముందుకెళ్లటం ఇప్పుడు సాధ్యమేనా? ఆయన చైనాతో సాన్నిహిత్యం కోసం తహతహలాడుతున్నారు. అది ఒక రూపం తీసుకుంటే క్వాడ్ కాడిపడేయరన్న గ్యారెంటీ ఏం లేదు. అందుకే రక్షణేతర రంగాల్లో భాగస్వామ్యం వరకూ ఫర్వాలేకున్నా, ఇతర విషయాల్లో మన దేశం ఆచితూచి అడుగేయక తప్పదు. -
డీఎస్సీ స్కాంపై నోరెత్తరేం?
అధికారంలోవున్న ప్రతిసారీ పదో తరగతి మొదలుకొని ప్రభుత్వోద్యోగాల భర్తీ వరకూ జరిగే ఏ పరీక్షనూ ఎన్నడూ సక్రమంగా నిర్వహించటం చేతకాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి కూడా ఆ ‘ఘనత’ సొంతం చేసుకున్నారు. డీఎస్సీ నిర్వహణలో పూర్తిగా ఫెయిలైనా ఏమీ జరగనట్టు ప్రవర్తిస్తున్నారు. అధికారంలో కొచ్చాక తొలి సంతకం పెట్టి, నిరుడు ఆర్భాటంగా జరిపించిన డీఎస్సీ పాపాలపుట్ట బద్దలై నాలుగు రోజులవుతున్నా ఆయనగానీ, విద్యాశాఖను చూస్తున్న ఆయన కుమారుడు లోకేశ్‌గానీ ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోవటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. పేపర్‌లీక్ మొదలు కొని స్పోర్ట్స్ కోటా పోస్టులు అమ్ముకోవటంవరకూ ఆరోపణలు వచ్చిపడుతున్నా తండ్రీ కొడుకులు సంజా యిషీ ఇవ్వకపోవటం, చడీచప్పుడూ లేకుండా కొందరిని బాధ్యతల నుంచి తప్పించటం, ర్యాంకుల్ని పక్కనç ³డేయటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇదేమీ కుటుంబ వ్యవహారం కాదు... పార్టీ సంస్థాగత అంశం అంతకన్నా కాదు. జవాబు దారీతనాన్ని గుర్తెరిగి సంజాయిషీ చెప్పి తీరాల్సిన అతి ముఖ్యమైన విషయం.జీవితంలో ఏనాడైనా కష్టపడి చదివుంటే, నిజాయితీగా ఎదిగుంటే పరీక్షలంటే ఏమిటో, అభ్యర్థులుపడే ఇబ్బందులెలా ఉంటాయో తెలిసేది. దశాబ్దాలుగా అనుసరిస్తున్న నియమ నిబంధనలకు మంగళం పాడి, కాసులతో తూకంవేసి పోస్టులు భర్తీ చేశారని నిరుద్యోగులు ఆక్రోశిస్తున్నారు. డీఎస్సీ నిర్వహణలో, ఎంపికలో అనేక లోపాలున్నాయంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థులు ఆశ్రయిస్తే ప్రభుత్వ తీరుపై ధర్మాసనం నిరుడు అక్టోబర్‌లోనే ఆగ్రహం వ్యక్తంచేసింది. ఒకటికన్నా ఎక్కువ ఉద్యో గాలు పొందిన వారిని ఉన్నత అర్హతగల ఉద్యోగానికి ఎంపిక చేయాలనీ, ఇది రెండు నెలల్లో పూర్తి కావాలనీ నిరుడు ఆగస్టులో మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కానీ ఎనిమిది నెలలు గడుస్తున్నా అతీగతీ లేదు. ప్రచండమైన పోటీ, పరిమిత అవకాశాలుగల వర్తమానంలో పోటీ పరీక్షలపై లక్ష లాదిమంది నిరుద్యోగులు ఆశలు పెట్టుకుంటున్నారు. స్వస్థలాలనుంచి దూరప్రాంతాల కెళ్లి కోచింగ్ పేరిట వేలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. తినీతినకా కష్టాలూ పడుతూ రాత్రింబగళ్లు చదువుకుంటున్నారు. ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు. తమ పిల్లలకు ఎలాగైనా అవకాశం దక్కాలంటూ తల్లిదండ్రులు కనిపించని దేవుళ్లకు మొక్కుకుంటు న్నారు. పరీక్షలు బాగా రాశామనీ, అవకాశం వచ్చితీరుతుందనీ ఎదురుచూసే వారికి శరాఘాతంగా పోస్టులన్నీ అంగడి సరుకుగా మార్చేస్తే ఏమనాలి? పేరుకు ‘మెగా డీఎస్సీ’ అని ప్రచారం చేసుకున్నా ఈసారి కేవలం 16,347 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, కావాలని ఆలస్యంచేసి ఇచ్చిన ఈ కొత్త నోటిఫికేషన్ కనీవినీ ఎరుగని ‘మెగా’ద్భుతమంటూ ప్రచారం చేసుకున్నారు. తీరా నిర్వాకం ఇలా తగలబడింది. ఈసారి ఫలితాలు పారదర్శ కంగా లేవు. కేవలం సెలెక్టయినవారి జాబితాతో సరిపెట్టారు. ఎంపికైనవారు వేరే అవకాశాలొచ్చి వెళ్లినప్పుడు, ఒకటికి మించి ఉద్యోగావకాశాలొచ్చిన వారున్నప్పుడు తమకు అవకాశం దక్కుతుందని ఆశలు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా చేశారు. ఎంపికైన వారికి ఫోన్లో ‘రారమ్మ’ని ఆహ్వానించటం, కొన్ని రోజులు గడిచాక రావొద్దని చెప్పడం ఒక ప్రహసనం. కొత్తగా వచ్చిన టీచర్లకు శిక్షణ శిబిరం నిర్వహిస్తూ, అందులో ఎంపిక కానివారికి చోటిచ్చి, అటుపై వారిని ‘టీచర్లు’గా ముద్రేసిన వైనం మరో చిత్రం. దేశం మొత్తం ‘నీట్’ పరీక్ష గురించి మాట్లాడుకుంటున్నది. కానీ ఈ డీఎస్సీ కుంభకోణం ముందు అది పిపీలకం. అక్కడ ప్రశ్నపత్రాలు లీకైతే... ఇక్కడ ప్రశ్నపత్రాలు మొదలుకొని పోస్టుల భర్తీ వరకూ అడుగడుగునా అవకతవకలే. ఫోన్లలో బేరసారాలూ, స్పోర్ట్స్ కోటా పోస్టుల అమ్మకాలు, మహిళా అభ్యర్థులతో అసభ్య చాటింగులు పాలకుల హైన్యాన్ని చాటుతున్నాయి. జగన్ పాలనలో గ్రామ సచివాలయం మొదలుకొని ఉన్నతో ద్యోగాలవరకూ... టెన్త్ మొదలుకొని పీజీ పరీక్షలవరకూ ఎలాంటి అక్రమాలకూ తావు లేకుండా సమర్థవంతంగా నిర్వహించినప్పుడు కూటమి సర్కారుకు ఏమైంది? లోకేశ్‌ను బర్తరఫ్ చేసి, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపితే అసలు దొంగలు బయటికొస్తారు. -
చమురు ధర దిగొచ్చేదెలా?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏం చెప్పినా హార్మూజ్ జలసంధి ఇప్పట్లో తెరుచుకో బోదని అందరికీ అర్థమైంది. అమెరికాకూ, ఇరాన్‌కూ మధ్య సాగుతున్న ఎడతెగని లడాయి పర్యవసానంగా ముడిచమురు, సహజవాయు దిగుమతులు అస్తవ్యస్తమై ఇంధన ధరలు తారస్థాయిలో పెరిగిపోతున్నాయి. మన దేశంలో కేవలం 11 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ(ఓఎంసీ)లు నాలుగోసారి సోమ వారం ఉదయం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశాయి. ఇంతవరకూ ఈ పెరుగుదల లీటర్‌కు సగటున రూ. 8 ఉంది. నిజానికి రూ.28 నుంచి రూ. 33 వరకూ పెంచితే తప్ప నష్టాల భర్తీ సాధ్యపడదని నిపుణులు సెలవిస్తున్నారు. అందులో సగమో, అంతకన్నా కాస్త తక్కువో పెంచకతప్పదనేది కూడా వారి మాటే. యుద్ధం మొదలైనాక వాటి ధరలు 30 శాతం పెరిగినా మన దేశంలో దాదాపు 74 రోజులపాటు ఓఎంసీలు ‘పెద్ద మనసు’తో రూ. లక్షా 20 వేలకోట్లకుపైగా నష్టాన్ని భరించాయి. ‘ఒక దేశం–పలు ఎన్నికలు’ జనానికి చేసే మేలుగా దీన్ని చూడాలి! అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే చమురు ధరలు కళ్లెం తెంచుకున్న గుర్రం మాదిరి పరుగులంకించుకున్నాయి. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘ఫ్రీడమ్ 250’ పేరిట శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఢిల్లీలో అమెరికా రాయబారిగా ఉంటున్న సెర్జియో గోర్ నేరుగా తమ అధ్యక్షుడు ట్రంప్‌కు ఫోన్ చేసి ఆ సంభాషణలు అందరికీ వినిపించారు. ‘భారత్ నాపై వంద శాతం భరోసా పెట్టుకోవచ్చు. ఏ సాయం కావాల్సివచ్చినా ఎక్కడికి ఫోన్ చేయాలో వారికి తెలుసు’ అంటూ ట్రంప్ చెప్పుకుపోయారు. ‘నేను ప్రధాని మోదీకి పెద్ద ఫ్యాన్‌ను’ అని కూడా అన్నారు. కానీ దురదృష్టమేమంటే మన చమురు కష్టాలకు ట్రంపే కారకుడు. తన నిర్వాకం ఫలితంగా ముడి చమురు, సహజవాయు ధరలు పెరిగి అన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతుంటే, ఆర్థిక వ్యవస్థలు పతనమవుతుంటే... చవగ్గా రష్యా అమ్మజూపే చమురు కొనడానికి వీల్లేదంటూ మూర్ఖపు ఆంక్షలు విధిస్తున్నది ఆయనగారే. మధ్యమధ్యన ‘ఈ నెల్లాళ్లూ కొనుక్కోండి... ఈ రెండు వారాలూ ఓకే’ అంటూ బిచ్చంవేస్తున్నట్టు సడలిస్తున్నదీ ఆయనే. ఇప్పుడైతే పూర్తి స్థాయి ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ముడి చమురు అవసరాల్లో 90 శాతం దిగుమతులపైనే ఆధారపడే దేశంగా మనం చమురు దిగుమతి దేశాల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాం. హార్మూజ్‌ను కాదని, ఎర్ర సముద్రంవైపునుంచి దిగుమతి చేసుకుందామనుకున్నా యుద్ధ భీతితో ఇన్సూరెన్సు సంస్థలు నౌకల బీమా ప్రీమియంను భారీగా పెంచేశాయి. రవాణా చార్జీలూ అంతే. ఇదంతా ఓఎంసీలకు తడిసిమోపెడవుతున్న మాట వాస్తవమే.ఎవరి మస్తిష్కం ఎలా ప్రకోపిస్తుందో, దాని పర్యవసానాలేమిటో తెలియని వర్తమానంలో మనం దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించుకోక తప్పదు. ముడి చమురు, సహజవాయు నిల్వలను పెంచుకోవటం, దిగుమతులకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ, చమురు, సహజవాయు నిక్షేపాల వెలికితీతను పెంచుకునే అవకా శాలు చూడటం ప్రధానం. వీటితోపాటు అర్థరహితమైన ఆంక్షలతో ఇబ్బంది పెడుతున్న అమెరికాను ప్రశ్నించటం కూడా తక్షణావసరం. శరవేగంగా విస్తరిస్తున్న మన ఆర్థిక వ్యవస్థకు చేటుతెచ్చేలావుంటున్న మతిమాలిన హుకుంలు కట్టిపెట్టమని చెప్పటం ముఖ్యం. ‘మేం సన్నిహిత మిత్రులం...’ అని చెప్పే అమెరికా కబుర్లు ఆచరణలో నిగ్గుతేలేది ఇలాంటపుడే.ఇంధన ధరల పెరుగుదల పాపంలో రాష్ట్రాల వాటా కూడా ఉంది. పెట్రో ధరలవల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు విలవిల్లాడుతున్నా విలువ ఆధారిత పన్ను (వ్యాట్) పేరుతో దోపిడీ చేయటం కొన్ని రాష్ట్రాలు ఆపటంలేదు. పర్యవసానంగా చమురు ధర మరింత మండిపోతోంది. ఢిల్లీలో రూ. 99. 51 ఉన్న పెట్రోల్ ఆంధ్ర ప్రదేశ్‌లో రూ.118వరకూ ఉండటంపై బాబు సర్కారు ఏం చెబుతుంది? బీజేపీ సర్కార్లున్నచోట రూ. 114 వరకూ ఉంటే, పొరుగునున్న తమిళనాట రూ. 107.80 ఉంది. మరి ఏపీ ప్రజలు చేసుకున్న పాపం ఏమిటి? ఈ కష్టకాలంలో జనానికి చేతనైతే సాయపడాలి. పనిలో పనిగా దోచుకునే అతి తెలివి కట్టిపెట్టాలి. -
సాహిత్యమూ శాస్త్రమూ
‘సహితస్య భావః సాహిత్యం’ అని సాహిత్యానికి నిర్వచనం. శబ్దార్థాల సుందర సమన్వ యమే సాహిత్యం. ‘శాసనాత్ శాస్త్రం’ అని శాస్త్రానికి నిర్వచనం. శాస్త్రం – ఏదైనా విషయాన్ని బోధించి, నియంత్రించి, మార్గనిర్దేశం చేస్తుంది. సాహిత్యం మనసును తీర్చిదిద్దు తుంది. శాస్త్రం మేధస్సుకు పదును పెడుతుంది. శాస్త్ర సాహిత్యాలు పరస్పర పూరకాలు. ‘సాహిత్యం, సీతాకోక చిలుకలు– ఈ రెండు మాత్రమే మనిషికి తెలిసిన తీయని అభిరుచులు’ అన్నాడు రష్యన్– అమెరికన్ రచయిత వ్లాదిమిర్ నబొకోవ్. సాహిత్యాన్నీ, సీతాకోక చిలుకలనూ ఒకే గాటన కట్టాడంటే, అతడికి ఎంతటి సౌందర్యాభిరుచి ఉండి ఉండాలి?! సాహిత్యాన్ని యాంత్రికంగా చదవడం, సాహిత్యంలోని సమస్త ప్రక్రియలను అధ్యయనం చేయడం, సాహిత్యాన్ని గురించి అనర్గళంగా ఉపన్యాసాలు చేయడం మాత్రమే చాలదు; సాహిత్యాన్ని ఆస్వాదించగలిగే లక్షణం కూడా ఉండాలి. అదే లేకపోతే, ఎంత సాహిత్యం చదివినా దండగే! సాహిత్యాన్ని అధ్యయనం చేసిన పండిత ప్రకాండుల్లో చాలామందికి సాహిత్యాన్ని ఆస్వాదించడం చేతకాదు. అలాంటి వారిని ఉద్దేశించే, ‘అతనికి సాహిత్యం గురించి సమస్తం తెలుసు, సాహిత్యాన్ని ఎలా ఆస్వాదించాలో తప్ప’ అని చెణుకు విసిరాడు అమెరికన్ రచయిత జోసెఫ్ కెల్లర్. సాహిత్యం మనోవ్యాపారం. సాహిత్యం మనిషికి విలువలు నేర్పుతుంది. సమాజాన్ని అర్థం చేసుకోవడం నేర్పుతుంది. జీవితం పట్ల అవగాహన పెంచుతుంది. సాహిత్యం వల్ల భాషా నైపుణ్యం మెరుగుపడుతుంది. ఊహాశక్తి, సృజనాత్మకత పెరుగు తాయి. శాస్త్రం బుద్ధివ్యాపారం. శాస్త్రం మనిషికి తార్కికత నేర్పుతుంది. వాస్తవికతను నేర్పుతుంది. ప్రయోగాత్మక దృక్పథాన్ని అలవరుస్తుంది. సాంకేతిక పురోగతికి పునాదులు వేస్తుంది. శాస్త్ర సాహిత్యాలు పరస్పర ప్రేరకాలు కూడా!ప్రపంచ సాహిత్యాన్ని పరిశీలిస్తే, సాహిత్యం శాస్త్ర పురోగతికి ప్రేరణ కలిగించిన ఉదంతాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. మనిషి స్వేచ్ఛాపిపాసి. మనిషి ఊహలకు రెక్క లొచ్చి, ఆకాశం అంచుల వరకు విహరిస్తాయి. స్వేచ్ఛగా ఆకాశంలో విహరించడానికి మనిషికి రెక్కలుంటే బాగుండు, కనీసం రెక్కల వాహనం ఏదైనా అందుబాటులో ఉండే బాగుండు అనే ఆలోచనలు పురాణకాలం నుంచే ఉన్నాయి. రామాయణంలోని పుష్పక విమానం మనకు తెలిసినదే! గ్రీకు పురాణాల్లో డెడలస్ అనే శిల్పి, అతడి కొడుకు ఇకారస్ దురదృష్టవశాత్తు చెరసాల పాలవుతారు. బందిఖానా నుంచి తనతో పాటు తన కొడుకును తప్పించడానికి డెడలస్ పక్షి ఈకలు, తేనెటీగల మైనం ఉపయోగించి మనిషి తొడుక్కోగల రెక్కలు తయారు చేస్తాడు. పురాణకాలం నాటి ఈ ఊహలు శాస్త్ర పరిశోధన లకు ప్రేరణనిచ్చాయి. తర్వాతి కాలంలో ఇటాలియన్ బహుముఖ ప్రజ్ఞశాలి లియొనార్డో ద వించీ ‘ఆర్నిథాప్టర్’ అనే ఎగిరే యంత్రాన్ని రూపొందించాడు. అది పెద్దగా ఫలించ లేదు. ఆ తర్వాత అమెరికన్ ఇంజినీర్లు రైట్ సోదరులు విమానాన్ని రూపొందించి, మనిషి ఊహలకు భౌతికంగా రెక్కలివ్వడంలో కృతకృత్యులయ్యారు. సాహిత్యమే లేకుంటే, మనకు విమానాలు అందుబాటులోకి వచ్చేవేనా?!ఇలాంటివే మరికొన్ని ఉదాహరణలు ఉన్నాయి. మనిషి చంద్రుడిపై కాలు మోపడానికి శతాబ్దం ముందే, ఆ ఊహను ఫ్రెంచ్ సాహితీవేత్త జూల్స్ వెర్న్ తన నవల ‘ఫ్రమ్ ది ఎర్త్ టు ద మూన్’లో రాశాడు. ఇంగ్లిష్ రచయిత హెచ్‌జీ వెల్స్ అణ్వాయుధాల ముప్పును తొలి అణుబాంబు దాడికి మూడు దశాబ్దాలకు ముందే తన ‘ద వరల్డ్ సెట్ ఫ్రీ’ నవలలో ఊహించాడు.శాస్త్ర పరిణామాన్ని సాహిత్యం ఊహించడం కొత్తకాదు గాని, సాహిత్యం గురించి ఇప్పుడిప్పుడే శాస్త్ర పరిశోధనలు ఊపందుకుంటున్నాయి. ఇటాలియన్ కవి డాంటే కావ్యం ‘డివైన్ కామెడీ’లో భూగర్భశాస్త్ర విశేషాల గురించి ఇటీవల వియన్నాలో జరిగిన యూరోపియన్ జియోసైన్సెస్ యూనియన్ జనరల్ అసెంబ్లీలో ఒక పరిశోధన పత్రాన్ని విడుదల చేయడం ఇందుకు ఒక తాజా ఉదాహరణ. ‘డాంటే సాహితీవేత్త మాత్రమే కాదు, భూభౌతిక శాస్త్రవేత్త కూడా!’ అని మార్షల్ యూనివర్సిటీ ఇంగ్లిష్ ప్రొఫెసర్ టిమోతీ బర్బరీ ఈ పరిశోధన పత్రంలో వ్యాఖ్యానించడం విశేషం. ప్రపంచంలో శాస్త్ర సాహిత్యాల సమన్వయానికి ఇదొక ముందడుగు. -
మంటలు రేపుతున్న మనువాద కూటమి
దేశవ్యాప్తంగా విద్వేషపు నెగళ్లను ఎగదోస్తున్న మనువాద రాజకీయాల గురించిన చర్చ చాలా కాలంగా జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు జరగాల్సింది ఆంధ్రప్రదేశ్ సంఘ జీవనంలో అగ్గి రాజేస్తున్న నయా మనువాద రాజకీయం గురించి! ముంచుకొస్తున్న పెను ప్రమాదం గురించి ప్రజలను అప్రమత్తం చేయవలసిన అవసరం ఉన్నది. మనుధర్మశాస్త్రం ప్రతులను దాదాపు వందేళ్ల కిందనే అంబేడ్కర్ మహాశయుడు దహనం చేశాడని మనం చరిత్రలో చదువుకున్నాము. పుట్టుక ద్వారానే మనుషుల్లో గొప్పోళ్లూ, అల్పులూ అనే తేడాలుంటాయనే వర్ణ విభజన అది చేసింది కనుక అంబేడ్కర్ ఆ అధర్మ ‘ధర్మాన్ని’ దహనం చేశారు.పుట్టుక ఆధారంగా హెచ్చు తగ్గులుండే నిచ్చెన మెట్ల సామాజిక వ్యవస్థను మనుస్మృతి ప్రబోధించింది. పై మెట్టు పైనున్న వారికి గొప్ప బాధ్యతలు, కింది మెట్టుపైనున్న వారికి అల్పకార్యాలనూ అప్పగించింది. విద్యాగంధాన్ని కొందరికే పరిమితం చేసింది. అన్ని వర్గాల్లోని స్త్రీలపైనా అవమానకరమైన ఆంక్షలను విధించింది. స్త్రీలకు స్వతంత్రంగా ఆలోచించే అర్హత లేదని శాసించింది. ఇటువంటి అమానవీయ భావనలతో కూడిన మనుస్మృతిని రాజ్యాంగ రచనలో ఉపయోగించుకోవా లని అప్పట్లోనే డిమాండ్ చేసినవారూ లేకపోలేదు. భారత రాజ్యాంగం ఆమోదం పొందిన తర్వాత ఆరెస్సెస్ అధికారిక పత్రిక ‘ఆర్గనైజర్’ దానిపై సంపాదకీయాన్ని రాసింది. ప్రాచీన భారతీయ న్యాయ సంప్రదాయాలను ముఖ్యంగా మను స్మృతిని రాజ్యాంగం విస్మరించడం పట్ల విచారాన్ని వ్యక్తం చేసింది. ఈ రకమైన అభ్యంతరాలను లెక్కచేయకుండా ప్రజా స్వామ్యం, పౌరహక్కులు, సర్వమానవ సమానత్వాలు పునాదు లుగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయినా సరే మారువేషాలతో ఏమార్చడానికి మనువాదం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నది. ఇప్పుడది మతం ముసుగేసుకొని ముందుకొస్తున్నది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మధ్యన ముగ్గురు పిల్లల్ని కంటే ముప్ఫై వేలిస్తా, నలుగుర్ని కంటే నలభై వేలిస్తా అని చాటింపు వేస్తున్నారు. దీనిపై పౌర సమాజం తీవ్రంగా విమర్శలు గుప్పించింది. ఈ సహేతుకమైన విమర్శల్లో ఎక్కువ భాగం ఆర్థికపరమైనవి. మహిళా సాధికారత కోణంలో ముందుకొచ్చిన ఒక విమర్శ ఆలోచించదగ్గది. మహిళల్ని కేవలం పిల్లల్ని కనే యంత్రాలుగానే చంద్రబాబు పరిగణిస్తున్నారా అని కొందరు ప్రశ్నించారు. పనిచేసే వయసులో ఉన్న మహిళలు పదిహేనేళ్ల కాలాన్ని నలుగురు పిల్లల్ని కనడం వారిని పెంచడం కోసమే అంకితం చేయాలనడం ఎంతవరకు సమంజసం? మహిళా సాధికారత పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఏపాటిది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఒక పదేళ్లు వెనక్కి వెళితే మహిళల పట్ల బాబు వైఖరేమిటో స్పష్టం చేసే ఉదాహరణ మనకు దొరుకుతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన చేసిన ఒక వ్యాఖ్య అప్పట్లో కలకలం సృష్టించింది. ‘‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా?’’ అని ఆయన మాట్లాడారు. ఆడపిల్లతో పోల్చితే మగ పిల్లాడిని కోరుకోవడమే సహజమన్న భావన ఆయన వ్యాఖ్యల్లో ధ్వనించింది. నాటి అభిప్రాయానికి కొనసాగింపుగానే నేడు పిల్లల్ని కని పెంచే యంత్రాలుగా మహిళల్ని పరిగణించడమని అర్థం చేసుకోవాలి. ఓట్ల కోసం మహిళలందరికీ ‘ఆడబిడ్డ నిధి’ పథకాన్ని అమలు చేస్తానని చెప్పి, గెలిచిన తర్వాత తూచ్ అనడం కూడా మహిళా చైతన్యం పట్ల ఆయనకున్న చిన్న చూపునకు నిదర్శనం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించినట్టు చేసి ఇప్పుడా సంస్థనే ప్రైవేట్ వాళ్లకు కట్టబెట్టే పనిలో ఉన్నారు.మహిళల విషయం మాత్రమే కాదు. దళితుల విషయంలోనూ, బలహీన వర్గాల ప్రజల విషయంలోనూ చంద్రబాబుదీ, ఆయన పార్టీదీ, కూటమిదీ అదే ధోరణి. ‘దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అని బహిరంగంగానే నాడు ప్రశ్నించారు. నిచ్చెనమెట్ల హిందూ సమాజంలో చివరి మెట్టుమీద దళితులు ఉంటారనీ అలా ఉండాలనే మనువాద మనోగతం వల్లనే ఆయనావిధంగా మాట్లాడగలిగారు. ఆయన పార్టీ నేత లదీ, కూటమిలోని ఇతర నేతలదీ అదే అభిప్రాయం. దెందు లూరు ఎమ్మెల్యే అప్పట్లో ఒక బహిరంగ సభ వేదికపై నుంచే ‘మీరంతా దళితులు, మీకెందుకురా రాజకీయాలు, అవన్నీ మేం చూసుకుంటాం’’ అన్న మాటల్ని కూడా మరోసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు బీజేపీలో ఉన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ‘దళితులు శుభ్రంగా ఉండరు, స్నానం చేయ’రంటూ ఈసడించుకోవడాన్ని కూడా చూశాము.ఇప్పుడీ ధోరణి మరింత ప్రమాదకరమైన మలుపులు తీసుకుంటున్నది. సామాజిక అశాంతిని సృష్టించడానికి సన్నద్ధ మవుతున్నది. దళితులపై క్రైస్తవులనే ముద్రవేసి వారిని వేటాడే పనిలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్టంరాజు నిమగ్న మయ్యారు. టీడీపీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ పార్టీతో పాటు కూటమి పార్టీల నేతలనుద్దేశించి ఆయన మాట్లా డిన ఆడియోలు బయటకొచ్చాయి. ‘‘ఎన్నికల్లో పోటీ చేయాలను కుంటున్న దళితులను ఓ కంట కనిపెట్టండి. వాళ్లు చర్చికి వెళ్తు న్నారా, దేవాలయాలకు వెళ్తున్నారా తెలుసుకునేందుకు నిఘా పెట్టండి. వాళ్ల తల్లిదండ్రులు చనిపోతే అంత్యక్రియలు ఏ పద్ధతిలో జరిగాయో శ్మశానాల దగ్గరికి వెళ్లి తెలుసుకోండి. వారి వివాహాలు ఏ పద్ధతిలో జరిగాయో తెలుసుకోండి...’’ ఇలా సాగుతున్నాయి ఆయన ప్రబోధాలు.ఈ రకమైన నిఘా, వారి జీవితాల్లోకి తొంగిచూడటం, వారు స్వేచ్ఛగా జీవించే హక్కును హరించడం కిందకే వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో కోటిమందికి పైగా ఉన్న దళితులను రెండో తరగతి పౌరులకింద జమకట్టే ధోరణిగా దీన్ని భావించవలసి ఉంటుంది. మొత్తం దళిత సమాజమే తీవ్రమైన అశాంతికి లోనయ్యే పరిస్థితిని కూటమి కల్పిస్తున్నది. రఘరామ కృష్ణంరాజు తన అభిప్రాయాలను బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఈ ధోరణికి మాట మాత్రంగానైనా అడ్డు చెప్పే ప్రయత్నం ఏ కూటమినేతా ఇంతవరకూ చేయలేదు. దళితులు క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఎస్సీ లుగా ప్రయోజనం పొందుతున్నారనేది రఘురామకృష్ణంరాజు అభియోగం. అందుకు వీల్లేదని చింతాడ ఆనంద్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పును ఆయన ఉదహరిస్తున్నారు. చింతాడ ఆనంద్ కులపరంగా దళిత వర్గానికి చెందినవాడు. క్రైస్తవం స్వీకరించి పాస్టర్‌గా మారాడు. అగ్రకులానికి చెందిన వారు ఆయన్ను కులం పేరుతో దూషించి దౌర్జన్యం చేశారని అత్యాచార నిరోధకచట్టం కింద కేసు పెట్టాడు. ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను ఉటంకిస్తూ క్రైస్తవ మతంలోకి మారినందువలన అత్యాచార నిరోధక చట్టం ఆనంద్‌కు వర్తించదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇది పూర్తిగా టెక్నికల్ తీర్పు. తన నివాస ప్రాంతంలో ఆనంద్ కులపరంగానే గుర్తింపు పొందుతున్నప్పటికీ, కులపరంగానే దూషణకు, దౌర్జ న్యానికి గురైనప్పటికీ, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఆయన మతాన్నే సుప్రీంకోర్టు గమనంలోకి తీసుకున్నది. ఆయన సామాజిక గుర్తింపును నిరాకరించింది.ఈ తీర్పును ఆధారం చేసుకొనే దళితల వేట కోసం రఘు రామ టాస్క్‌ఫోర్స్ ప్రారంభమైంది. చర్చిలో ప్రార్థనలు చేసే వారందరినీ ఈ టాస్క్‌ఫోర్స్ క్రైస్తవుల జాబితాలో వేస్తుందన్న మాట! దళితులు అత్యధిక సంఖ్యలో చర్చికి వెళ్తున్న మాట వాస్తవమే. ఇందులో దాపరికం ఏమీలేదు. అందుకు కారణాన్ని కూడా వారు చెబుతున్నారు. హిందూ సమాజంలోని పెత్తందారీ శక్తులు దళితులకు ఆలయ ప్రవేశాన్ని నిరాకరించిన రోజుల్లో బ్రిటిష్ వాళ్లు పెట్టిన చర్చిలు వారికి స్వాగతం పలికాయి. ఆత్మ గౌరవం కోసం, ఆరాధన కోసం వారు అక్కడకు వెళ్లడం ప్రారంభించారు. అది సంప్రదాయంగా నేటికీ కొనసాగుతున్నది. అయినా హిందూ సమాజ స్రవంతిలో ఉన్నవాళ్లు చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తే చర్చికి లేని అభ్యంతరం హిందూత్వ టాస్క్ ఫోర్స్‌లకు ఎందుకు? హిందూ సమాజాంలో కొన్ని లక్షలమంది షిర్డీ సాయి మందిరాలకు వెళ్తారు. వాళ్ల మీద కూడా ఆంక్షలు పెట్టే ఆలోచన వుందా? సాయిబాబా హిందువు కాదు మరి!పెళ్లి, చావు వంటి సందర్భాల సంగతి కూడా అంతే! హిందూ పద్ధతిలో నిర్వహించడానికి ఆనాడు అయ్యవార్లు మా వాడలకు రాలేదు, ఆత్మగౌరవం కోసం ప్రత్యామ్నాయాన్ని ఆశ్రయించాము, అదే ఇప్పుడొక సంప్రదాయంగా స్థిరపడిందని దళితులు చెబుతున్నారు. హిందువుల్లో మంగళసూత్రధారణ జరిగితేనే, జీలకర్ర బెల్లం పెడితేనే పెళ్లి. లేకుంటే కాదా? ఐదారు దశాబ్దాల కింద ఆంధ్ర ప్రాంతంలో హేతువాద, కమ్యూనిస్టు ఉద్యమాలు బలంగా ఉన్న రోజుల్లో కొన్నివేల స్టేజీ పెళ్లిళ్లు జరి గాయి. వాటిలో మంగళసూత్రధారణ లేదు, బ్రాహ్మణ పండి తుడూ లేడు. ఇప్పుడా పెళ్లిళ్లన్నింటినీ రద్దు చేద్దామా? మరణా నంతరం జరిగే అంత్యక్రియల్లో హిందూ సమాజంగా గుర్తించే వాళ్లలోనే అనేక తేడాలున్నాయి. శవాన్ని పూడ్చి పెట్టినవాళ్లంతా క్రైస్తవులే అనే ముద్రను ఎట్లా వేస్తారు?చర్చికి వెళ్లే వాళ్లందరి మీదా క్రైస్తవ ముద్ర వేయడం ఒక అంశం. అంతకంటే ముఖ్యమైన విషయం క్రైస్తవ మతం స్వీకరించిన దళితుల ఎస్సీ హోదాను ఎందుకు కోల్పోవాలి అన్నది. రిజర్వేషన్ల విషయంపై స్పష్టత కోసం 1950లో జారీచేసిన రాష్ట్రపతి ఉత్తర్వుల్లో బౌద్ధంలోకి, సిక్కు మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా ఉంటుంది. కానీ, క్రైస్తవంలోకీ, ఇస్లామ్లోకీ మారిన వారికి ఈ హోదా రద్దవుతుందని ఉన్నది. దీని ఆధారంగానే ఆనంద్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆ మతాల్లో అంటరానితనం లేదు కనుక, అందులోకి మారిన వెంటనే వారి సామాజిక హోదా మాయమైపోతుందన్న అంచనాతో క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా ఇచ్చిన ఉత్తర్వులుగా వాటిని సామాజికవేత్తలు పరిగణిస్తున్నారు.మతం మారినా షెడ్యూల్డ్ తెగల వారికి ఈ ఉత్తర్వులు వర్తించవు. వారి ఎస్టీ హోదా కొనసాగుతుంది. అగ్రకులాల వారు ఎవరైనా క్రైస్తవం స్వీకరిస్తే, వారికి ఈడబ్లు్యఎస్ రిజర్వేషన్లకు అర్హత వుంటే ఆ సౌకర్యం నిక్షేపంగా కొనసాగుతుంది. దళితులపై మాత్రమే ఈ వివక్ష ఎందుకని ఆ వర్గాల వారితోపాటు పలువురు ఇతర మేధావులు కూడా ప్రశ్నిస్తు న్నారు. 2004లో ఏర్పడిన రంగనాథ్ మిశ్రా కమిషన్ క్రైస్తవ/ ఇస్లాం మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగించాలని చెప్పింది. ఆ కమిషన్ రిపోర్టు ఆమోదానికి నోచు కోలేదు. మతం మారిన దళితులను ఎస్సీలుగా గుర్తించాలని పలువురు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఆ కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నది.మతం మారినంత మాత్రాన పుట్టుకతో వచ్చే కులం పోదు అనేది ఒక వాస్తవికత. అంతరాలతో కూడిన హిందూ సమాజంలోనే అంతర్భాగంగా వారి జీవితం కొనసాగుతున్నది తప్ప, దాన్ని విడిచిపోయే పరిస్థితి ఉండదు. ఆ సమాజంలో చివరి మెట్టు మీద నిలబడినందున లభిస్తున్న అవమానాలను భరిస్తూ, అందాల్సిన అవకాశాలకు మాత్రం దళితులే ఎందుకు దూరం కావాలనే ప్రశ్న తలెత్తుతున్నది. దేశమంతటా ప్రకంపనలు సృష్టించిన కారంచేడు హత్యాకాండనే తీసుకుందాము. దళితులు మంచినీళ్లు తెచ్చుకునే చెరువులో అగ్రకులం వారు పశువుల్ని కడగడాన్ని ప్రశ్నించి ఎదురుతిరిగినందుకు ‘దళితులకు ఇంత ధైర్యమా’ అనే కావరంతో అగ్రకులం వాళ్లు దాడి చేశారు. తరిమి తరిమి వేటాడారు. ఎనిమిదిమంది చనిపోయారు.చనిపోయిన వారిలో అబ్రహం, మోషా, యేషువా, వందనం వంటి క్రైస్తవ పేర్లున్నాయి. పశువులు కడగడాన్ని ప్రశ్నించిన మహిళ పేరు సువార్త. వీరికి క్రైస్తవ పేర్లున్నాయి కాబట్టి వీరి సామాజిక హోదా మారినందున తాము దాడి చేయ లేమని కులోన్మాదులు వెనక్కు పోలేదు. దళితులుగానే పరిగణించి వేటాడారు. మతం మారినా దళితుల సామాజిక హోదా మారలేదు అనడానికి ఇటువంటి ఉదాహరణలు చాలా ఉంటాయి. ఈ అంశంపై ఇంకా సుప్రీం తుదితీర్పు రావలసే ఉంది. కేంద్రం నియమించిన బాలకృష్ణన్ కమిషన్ నివేదిక అందవలసే ఉన్నది. ఈలోగానే ఆనంద్ కేసులో వచ్చిన తీర్పును ఆయుధంగా చేసుకొని కోటిమందిని భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమానికి కూటమి శ్రీకారం చుట్టింది. ఈ అంశమే కాదు, తిరుమల లడ్డూ వివాదం దగ్గర్నుంచి కడపలోని టిప్పు సుల్తాన్ సర్కిల్ దాకా సాంఘిక విభజనను సృష్టించి మెజారిటీ ప్రజల మనసుల్లో విషబీజాలు నాటడానికి ఈ నయా మనువాద కూటమి ప్రమాదకర క్రీడకు తెరతీసింది. ఈరోజు (శనివారం) సైతం చంద్రబాబు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ హిందూ ధర్మంపై, దేవాలయాలపై దాడులు చేస్తున్నారని ప్రధాన ప్రతిపక్షాన్ని ఆడిపోసుకున్నారు. ఈ దాడులు ఎప్పుడు జరిగాయి, ఎక్కడ జరిగాయి, ఎవరు చేశారు... రుజువులేమిటి అన్న దానితో పనిలేదు. ఒకటికి వందసార్లు చెప్పాలి. జనం పుర్రెల్లోకి కిర్రెక్కించాలి. విభజించి పాలించాలి... ఇదే ఎజెండా!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
కాలుష్యంపై సమితి పోరు
వాతావరణ స్థితిగతులు మారి, పెను ముప్పు ముంచుకొస్తున్నా చాలా దేశాలు కళ్లు మూసుకున్నాయని గురువారం వాతావరణంపై జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం తేటతెల్లం చేసింది. నిరుడు జూలైలో అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) వాతావరణంపై వెలువరించిన తీర్పును సమర్థిస్తూ చేసిన తీర్మానానికి 144 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. కానీ శిలాజ ఇంధనాలతో, తప్పుడు అభివృద్ధి నమూనాలతో కాలుష్యానికి కారణమవుతున్న అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు ఆ తీర్మానాన్ని వ్యతిరేకించాయి. మన దేశంతోపాటు 28 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. 2015 నాటి పారిస్ ఒడంబడిక వివిధ దేశాలు ఏమేరకు ఉద్గారాలు తగ్గించుకోవాలో నిర్దేశించినా అదంతా స్వచ్ఛందంగా అమలు చేసేది మాత్రమే. కానీ తాజా తీర్మానంతో ఆ అమలు చట్టపరమైన విధిగా మారింది. అయితే దాన్ని నిర్వర్తించమని ఒత్తిడి తెచ్చేవారెవరు?వాతావరణ మార్పులకు దారితీసే విధానాలను అవలంబించటం చట్టవిరుద్ధమనీ, అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఉద్గారాలను తగ్గించి, తన పౌరులకూ, ఇరుగు పొరుగు దేశాలకూ ముప్పు ఏర్పడకుండా చూడాల్సిన కనీస బాధ్యత ప్రతి దేశానికీ ఉంటుందనీ ఐసీజే తన తీర్పులో చెప్పింది. లాభార్జనపై మాత్రమే దృష్టి పెట్టే దేశాలవల్ల ప్రజలజీవించే హక్కు, ఆరోగ్యం, ఆహారం, ఇతరేతర జీవనప్రమాణాలు దెబ్బతింటున్నాయని గుర్తుచేసింది. దురదృష్టమేమంటే ఐసీజే తీర్పుల్ని పాటించితీరాలన్న నియమం లేదు. అవి కేవలం నైతికబాధ్యతను మాత్రమే గుర్తుచేస్తాయి.ఆయా దేశాల ప్రజలు తమ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి తప్ప ఇతరత్రా మార్గాల్లో చర్యలకు అవకాశం లేదు. ఐక్యరాజ్యసమితి తీర్మానాలకూ ఇదే వర్తిస్తుంది. ఏడాది కాలవ్యవధిలో పాకిస్తాన్, కాంగో, ఆస్ట్రియా, మధ్య యూరొప్ దేశాల్లో భారీ వరదలు సంభవించాయి. గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ ఈ స్థాయి వరదలు రాలేదని చెబుతున్నారు. అమెరికాలో కూడా మధ్య, దక్షిణ రాష్ట్రాలు రికార్డు స్థాయిలో టార్నెడోలు చవిచూశాయి. వేలాది ఇళ్లు నేలమట్టంకాగా, జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు. పసిఫిక్ ద్వీపకల్ప దేశాలది తీరని వ్యథ. ముఖ్యంగా వనౌటు, తువాలు దేశాలకు ప్రకృతి వైపరీత్యాల సంగతలావుంచి అసలు తమ భూభాగమే కనుమరుగైపోతుందన్న భయం పట్టుకుంది. ఇప్పటికే అక్కడి భూగర్భ జలాలు ఉప్పగా మారి, తాగునీరు లభ్యత పడిపోయింది. వ్యవసాయం సాగక జనం వలసపోతున్నారు. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడుతున్న సూపర్ ఎల్‌నినో అన్ని దేశాలనూ వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయనీ, కరువుకాటకాలు, పెను వర్షాలు, వరదలు జనావాసాలను ముంచెత్తనున్నాయనీ వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూగోళానికి ఉత్తర భాగంలో ఉండటంవల్ల నార్వే, ఫిన్లాండ్, స్వీడన్వంటి స్కాండినేవియన్ దేశాలకు వేడి బెడద పెద్దగా ఉండదు. వీటికి ప్రామాణికమైన విపత్తు నిర్వహణ వ్యవస్థలుండటంవల్ల వాతావరణ మార్పుల్ని తట్టుకోగలుగుతున్నాయి. స్విట్జర్లాండ్, డెన్మార్క్, సింగపూర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలి యాలు సైతం వాటివాటి భౌగోళిక స్థానాలవల్లా, పకడ్బందీ చర్యలవల్లా సురక్షితమే. కానీ భూతాపోన్నతి పెరిగి, ప్రకృతి వైపరీత్యాలు చుట్టుముట్టి, మెజారిటీ దేశాలు సంక్షోభంలో పడి ఆహారగొలుసు దెబ్బతింటే అందరికీ ప్రమాదమే.అందుకే సమస్య అందరిదీ. అయితే సమితి తీర్మానం అన్ని దేశాల వాదనలనూ పరిగణనలోకి తీసుకోవాల్సింది. శతాబ్దాలుగా పారిశ్రామికీకరణతో వాతావరణాన్ని దెబ్బతీస్తూ, ఇప్పటికీ ఎలాంటి బాధ్యతకూ సిద్ధపడని అభివృద్ధి చెందిన దేశాలనూ... హరిత ఇంధన వ్యవస్థల కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న వర్థమాన దేశాలనూ ఒకేగాటన కట్టడం, ఉద్గారాల తగ్గింపునకు అవసరమైన సాంకేతికతలను చవగ్గా అందించేందుకు సంసిద్ధంకాని దేశాలను పల్లెత్తు మాట అనకపోవడం తీర్మానం లోపం. అందుకే మన దేశమూ, మరికొన్ని దేశాలూ ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. మొత్తానికి పాశ్చాత్య దేశాల్లో సైతం వాతావరణ మార్పులపై గుబులు మొదలైందని తీర్మానంపై జరిగిన ఓటింగ్ నిరూపించింది. ఎలా చూసినా ఇది మంచి పరిణామం అని చెప్పాలి. -
అగ్రజుల గుసగుసలు
రెండు సాధారణ దేశాల అధినేతలు కలిశారంటే వాణిజ్యం, వ్యాపారం, పరస్పర సహకారం, ఇచ్చిపుచ్చుకోవడాలు చర్చకొస్తాయి. ఒప్పందాలు కుదురుతాయి. కానీ రెండు అగ్రదేశాలు కలిశాయంటే పైకి కనబడే వాణిజ్య, వ్యాపారాదులతోపాటు గుట్టుచప్పుడు కాకుండా కుదిరే లాలూచీలుంటాయి. వారం రోజుల వ్యవధిలో మూడు అగ్ర రాజ్యాల మధ్య మంతనాలు సాగాయి. గతవారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకొస్తే, ఈ బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వంతు. స్వల్ప వ్యవధిలో ఇలా ఇద్దరు అగ్రరాజ్యాధినేతలు రావటంవల్ల సహజంగానే చైనా స్థాయి అమాంతం పెరిగిపోయింది. పుతిన్ వచ్చిన సందర్భం సాధారణమైనది కాదు. ఆయనే చెప్పినట్టు 54 సంవత్సరాల క్రితం ఇదేరోజున అప్పటి చైనా అధినేత మావో జెడాంగ్ ‘ప్రపంచ దేశాలన్నీ ఏకమై అమెరికా సామ్రాజ్యవాదంపై పోరాడాల’ని పిలుపునిచ్చారు. అప్పటికీ ఇప్పటికీ ప్రపంచం మారింది. పెట్టుబడి ఎగుమతిలో, దేశాలపై ఆర్థికంగా పట్టుబిగించటంలో, ఇరుగుపొరుగును చీకాకుపెట్టడంలో, కనిపించేదంతా తనదేనని ప్రకటించుకోవటంలో చైనా సైతం సామ్రాజ్యవాద పోకడలకు పోతోంది. మధ్యన ‘సోషల్ సామ్రాజ్యవాదం’ ముద్ర వేయించుకున్న సోవియెట్ యూనియన్ చీలికలూ, పేలికలై కుప్పకూలింది. అందులోని ప్రధాన భాగం రష్యా కూడదీసుకునే ప్రయత్నం చేస్తూ, గత వారసత్వాన్ని కొనసాగించటానికి ఆపసోపాలు పడుతోంది. ఇక అమెరికా పోకడలు దశాబ్దాలుగా అదే బాణీలో కొనసాగుతున్నాయి.గతవారం ట్రంప్‌కు లభించిన స్వాగత సత్కారాలన్నీ పుతిన్‌కు కూడా దక్కాయి. రెడ్‌కార్పెట్ పరచడం, సైనిక వందనం, కేరింతలతో పిల్లలు అభివాదం చేయడం వంటివన్నీ కనబడ్డాయి. అయితే స్వీయ ప్రయోజనాల రక్షణలో తమకెవరూ సాటిరారని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నిరూపించారు. ఏవేవో ఒప్పందాలు కుదిరాయని ట్రంప్ చెప్పటమే తప్ప చైనా వైపునుంచి గతవారం ఎలాంటి ప్రకటనలూ రాలేదు. ఇప్పుడు పుతిన్‌కు కూడా దాదాపు అదే అనుభవం ఎదురైంది. ఇంధన సర ఫరా కోసం ‘పవర్ ఆఫ్ సైబీరియా 2’ పేరిట రెండో పైప్‌లైన్ నిర్మాణానికి రష్యా సిద్ధపడినా, చైనా అందుకు సంబంధించి మరింత లోతుగా చర్చించాల్సి ఉందంటూ వాయిదా వేసింది. కాకపోతే తైవాన్ విషయంలో ట్రంప్‌కు ‘రెడ్‌లైన్’ హెచ్చరిక జారీ అయిన పద్ధతిలో పుతిన్కుఎలాంటి భంగపాటు కలగలేదు. ఎవరికి వారు అవతలివారిని వేలెత్తి చూపడమే తప్ప, తమ తప్పులెరగరని ట్రంప్, పుతిన్‌ల పర్యటనలు నిరూపించాయి. హార్మూజ్ జలసంధి ప్రతిష్టంభన, ఇరాన్ యుద్ధం విషయంలో గతవారం అమెరికా, చైనాలు ‘ఏకాభిప్రాయం’ ప్రకటిస్తే... ఇప్పుడు చైనా, రష్యాలు సైతం అలాంటి స్వరమే వినిపిస్తున్నాయి. ‘ఏకపక్ష వ్యవహారశైలి, ఆధిపత్యవాద ధోరణులు’ ఉండరాదని కోరాయి. ప్రపంచం ఆటవిక న్యాయంలోకి దిగజారే ప్రమాదం కనబడుతోందని ఆందోళన వ్యక్తంచేశాయి. తరచిచూస్తే ఈ మూడు దేశాలూ జంకూ గొంకూ లేకుండా ఆధిపత్య ధోరణులు ప్రదర్శిస్తున్నాయి. అయినా గంభీరస్వరాలతో హితవు పలికే సాహసం చేస్తున్నాయి. అమెరికా సైన్యం వెనెజులా అధ్యక్షుణ్ణి భార్యా సమేతంగా చీకటిచాటున అపహరించుకు పోయింది. ఇరాన్ అగ్రనేతను ఇజ్రాయెల్‌తో కలిసి హత్య చేసింది. క్యూబాను కబళించటానికి కత్తులు నూరుతోంది. రష్యా నాలు గేళ్లుగా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది. దురాక్రమణకు దిగకపోయినా ఆసియా ఖండ దేశాల్లో చైనా కండబల ప్రదర్శన తక్కువేం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పుతిన్‌కు చైనా అవసరమే ఎక్కువుంది. ఉక్రెయిన్ను తక్కువ అంచనా వేసి యుద్ధంలోకి దిగి, అది తీవ్రంగా దెబ్బతింది. పుతిన్ స్వీయభద్రతే ప్రమాదంలో పడింది. రష్యా కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించిన ఉక్రెయిన్... ‘రష్యా తలపెట్టిన మే 9 విక్టరీ పెరేడ్ సజావుగా సాగటానికే’ దీనికి అంగీకరించామంటూ ఎద్దేవా చేసింది. దానికితోడు 2008 తర్వాత తొలిసారి ట్యాంకులు, క్షిపణులు లేకుండా ఆ పెరేడ్ హడావుడిగా ముగిసింది. మొత్తానికి ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఆ రెండు దేశాల మాదిరిగా తనపై ఇంకా దురాక్రమణదారు ముద్రపడనందువల్లే ఈమాత్రం ప్రతిష్ఠయినా దక్కుతున్నదని చైనా గ్రహించి సవ్యంగా వ్యవహరిస్తే అదే పదివేలు! -
స్వాగతించదగిన తీర్పు
బహిరంగ ప్రదేశాల్లో వీధికుక్కల బెడద మనుషుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించినప్పుడు ఉదాసీనంగా ఉండటం రాజ్యానికి సాధ్యంకాదని మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వాలకూ, జంతు ప్రేమికులకూ కళ్లు తెరిపించాలి. మనిషి ప్రాణమా, శునకాల ప్రాణమా... ఏది ప్రధానం అనే సమస్య తలెత్తినప్పుడు మానవ జీవితమే సర్వోన్నతమైనదనీ, జీవించే హక్కుకు పూచీపడుతున్న రాజ్యాంగంలోని 21వ అధికరణం ఈ విషయంలోనూ వర్తిస్తుందనీ ముగ్గురు సభ్యుల ధర్మాసనం తేల్చిచెప్పడం గమనించ దగ్గది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల తర్వాత జంతు జనన నియంత్రణ(ఏబీసీ) నిబంధనలు సవ్యంగా అమలైతే ఈ సమస్యే ఉత్పన్నమయ్యేది కాదు. కానీ ప్రభుత్వాలు, మున్సిపాలిటీలు, ఇతర స్థానిక సంస్థలు నిరాసక్తంగా, నిర్లిప్తంగా ఉండిపోయాయి. దాని పర్యవసానమే తాజా తీర్పు. గ్రామాలు, పట్టణాలు, నగరాలన్న తేడా లేకుండా జనావాసాలన్నిటా శునకాలు తారసపడతాయి. విద్యాసంస్థలు, ఆస్పత్రులు, క్రీడా మైదానాలు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, మతపరమైన ప్రదేశాలు, పర్యాటక కేంద్రాలు... ఒకటేమిటి ఎక్కడికెళ్లినా వీధికుక్కల బెడద తప్పడం లేదు. అవి సవ్యంగానే ఉన్నాయా, ప్రమాదకరమైన జబ్బులతో ఉన్నాయా అని ఆరా తీసేవారుండరు. వాటి నియంత్రణ కర్తవ్యమని భావించే యంత్రాంగం ఎక్కడా కనబడదు. అలాగని వాటిని బంధించి, అత్యంత క్రూరంగా చంపటం కూడా పరిష్కారం కాదు. అనుకోని దురదృష్ట కర సంఘటన జరిగినప్పుడు మున్సిపల్ సిబ్బంది కుక్కలవేట మొదలెట్టడం, సద్దుమణి గాక ఊరుకోవటం రివాజుగా మారింది. మున్సిపల్ సిబ్బంది చర్యలు తీసుకున్నప్పుడూ, ఎవరైనా వాటిని విషాహారంతో చంపినప్పుడూ జంతు ప్రేమికులు రంగప్రవేశం చేసి కేసులు పెడతారు. ఎల్లకాలమూ ఇదిలా కొనసాగుతూనే పోవటం సరికాదు. ఎక్కడో అక్కడ అడ్డుకట్ట పడితీరాలి.కుక్కల బెడదవల్ల ఎదురయ్యే సమస్యలు తక్కువేమీ కాదు. ఒక అంచనా ప్రకారం మన దేశంలో దాదాపు 8 కోట్ల వీధికుక్కలున్నాయి. ఏటా కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకూ కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది తొలి త్రైమా సికంలో దాదాపు లక్షన్నర కేసులు నమోదైనట్టు అంచనా. తమిళనాడు, కర్ణాటకల్లో ఈ సంఖ్య 4.5 లక్షలవరకూ ఉందని గణాంకాలు చెబుతున్నాయి. రేబిస్ వ్యాధిబారినపడి దేశ వ్యాప్తంగా ఏటా 20,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరో ఆశ్చర్యకరమైన విష యమేమంటే... ఏటా ప్రపంచవ్యాప్తంగా సంభవించే కుక్కకాటు మరణాల్లో మన దేశం వాటా 36 శాతం. అందుకే ప్రమాదకర కుక్కలకు కారుణ్యమరణం ప్రసాదించ వచ్చనీ,అంత ప్రమాదంలేని వాటిని జనావాసాలనుంచి తొలగించాలనీ తీర్పు స్పష్టం చేసింది.కుక్కకాట్లవల్ల సామాన్యులకూ, ప్రభుత్వాలకూ కూడా ఆర్థికభారం తప్పడంలేదు. బాధితులకిచ్చే పీఈపీ వాక్సిన్లకూ, ఇంజక్షన్లకూ ప్రభుత్వాలు వందలకోట్లు వ్యయం చేస్తున్నాయి. అయినా వీటి లభ్యత సరిగా లేదు. బాధితుల్లో అత్యధికులు రెక్కాడితేగానీ డొక్కాడని సాధారణ జనం. చిన్నా చితకా వ్యాపారాల కోసమో, ఉపాధికోసమో వెళ్లే వారు, చెత్త ఏరుకుని జీవించేవారు. వీరంతా పనులు మానుకుని ఆస్పత్రులచుట్టూ తిరుగుతున్నారు. పాశ్చాత్య దేశాలు వీధికుక్కల్ని నియంత్రించి, వాటి బెడద లేకుండా చేయగలిగినప్పుడు మన దేశంలో ఎందుకు సాధ్యపడదు? ఏబీసీ నిబంధనలు పాటించని ప్రభుత్వ విభాగాలను జంతు ప్రేమికులో, మరొకరో నిలదీయరు. అది తమ బాధ్యతగా భావించరు. సమస్య ఉగ్రరూపందాల్చాక చర్యలు మొదలైతే మాత్రం ఆందోళనకు దిగుతారు. వీధికుక్కల్ని జనావాసాలనుంచి షెల్టర్లకు తరలించాలని నిరుడు ఆగస్టులో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చినప్పుడు నిరసనలు వెల్లువెత్తాయి. రాజ్యాంగంలోని 51ఏ (జి) అధికరణం మూగజీవాలపట్ల కారుణ్యంతో మెలగాలని చెబుతోంది. దాన్ని పాటిచాల్సిందే. కానీ మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగితే పట్టనట్టు ఉండకూడదు. సర్వోన్నత న్యాయస్థానం తాజా తీర్పు ప్రభుత్వాల కర్తవ్యాన్ని గుర్తుచేయటమేకాక,అవి విఫలమైన పక్షంలో ఎలాంటి చర్యలుండాలో సూచించింది. అందుకే ఇది ఆహ్వానించదగ్గ తీర్పు. -
తీరికూర్చుని త్రిభాషా సూత్రం
దేశంలో హిందీ భాషకు ఆధిపత్య స్థానం కల్పించాలనుకుంటున్న ప్రతిసారీ దక్షిణాదిలో... ముఖ్యంగా తమిళనాడులో వివాదం తలెత్తుతుండగా కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ) కొత్త ఎత్తుగడతో ఆ భాషను ప్రతిష్ఠించదల్చుకున్నట్టు కనబడుతోంది. అందువల్లే శుక్రవారంనాటి ఆ సంస్థ మార్గదర్శకాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. జాతీయ విద్యావిధానం–2020కి అనుగుణంగా జారీ చేసినట్టు చెబుతున్న ఈ మార్గదర్శకాల ప్రకారం ఇకపై విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవడం తప్పనిసరి. అందులో ఒకటి విదేశీ భాష. మిగిలిన రెండూ ‘స్థానిక భాషలు’. త్రిభాషా సూత్రంగా పిలిచే ఈ విధానం వాస్తవానికి కొఠారీ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా రూపొందిన జాతీయ విద్యావిధానం–1968 నాటిదే. కేంద్రంలో ఏ పార్టీ లేదా కూటమి అధికారంలో ఉన్నా ఏదోవంకన హిందీని తీసుకొచ్చే ప్రయత్నం చేయటం రివాజైంది. ఉభయ తెలుగు రాష్ట్రాలతోసహా చాలా రాష్ట్రాలు త్రిభాషా సూత్రాన్ని అనుసరిస్తున్నా, తమిళనాడు మాత్రం తమిళంతోపాటు ఇంగ్లిష్ బోధన ఉండే ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంది. విద్యార్థి దశలో వివిధ భాషలపట్ల ఆసక్తి, అనురక్తి పెంచి ప్రోత్సహించటంలో తప్పేం లేదు. కానీ ఆ వంకన ఒక భాష ఆధిపత్యాన్ని నెలకొల్పుదామనుకోవటమే సమస్య. ఇప్పటికైతే తల్లిదండ్రులు విద్యాసంవత్సరం మొదలై రెండునెలలు గడిచాక హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. పునరాలోచన చేయకుంటే ఇది భాషా వివాదంగా మారినా మారొచ్చు. వచ్చే జూలైనుంచి అమల్లోకి రాబోతున్న ఈ విధానం సమస్యాత్మకమైనది. అన్నిటా ఇప్పటికే భాగంగా మారిన ఇంగ్లిష్‌ను ఇది ‘విదేశీ భాష’ గా గుర్తిస్తోంది. మన ప్రభుత్వాల ఉత్తరప్రత్యుత్తరాలు, జీవోలు, చట్టాలు... అన్నీ ఇంగ్లిష్‌లో ఉంటాయి. న్యాయస్థానాల్లో వాదప్రతివాదాలు మొదలుకొని తీర్పులవరకూ దాని వాడకం విస్తృతం. ఇక ఐఐటీ, ఐఐఎంలాంటి ఉన్నతశ్రేణి సంస్థల్లో చెప్పనవసరం లేదు. ఉన్నత చదువులకైనా, ఉద్యోగావకాశాలకైనా అదొక తప్పనిసరి అవసరం. ఈ దశలో ఇంగ్లిష్‌ను ‘విదేశీభాష’గా గుర్తించటం వల్ల మన విద్యార్థులు జర్మన్, ఫ్రెంచ్, జాపనీస్, కొరియన్ వంటి భాషలు నేర్చు కొనే అవకాశాన్ని కోల్పోతారు. ప్రపంచవ్యాప్తంగావున్న తీవ్ర పోటీ పర్యవసానంగా ఉద్యో గార్థులు వారి వారి రంగాల్లో నైపుణ్యం సాధిస్తే సరిపోదు. ఇంటర్వ్యూల్లో దాన్ని సమర్థ వంతంగా వ్యక్తం చేయగలగాలి. ఏ ఉత్పత్తికైనా ప్రపంచవ్యాప్త మార్కెట్ ఏర్పడిన వర్తమానంలో ఇంగ్లిష్‌తోపాటు మరో విదేశీ భాష వస్తేనే ప్రాముఖ్యత. కానీ సీబీఎస్ఈ తీరుతో ఇంగ్లిష్ విడనాడితేనే మరో విదేశీ భాష సాధ్యం.ఉత్తరాదిన త్రిభాషా సూత్రం ఎంచక్కా అమలవుతోంది. వారు హిందీతోపాటు సంస్కృతాన్ని ‘స్థానిక భాష’గా నేర్చుకుంటారు. ‘విదేశీ భాష’గా ఇంగ్లిష్ ఉండనే ఉంది! దక్షిణాదిన మాత్రం స్థానిక భాషతోపాటు ఎంచుకోవటానికి హిందీ లేదా సంస్కృతం ఉంటాయి. సినిమాల ప్రభావంవల్ల సహజంగా అత్యధికులు హిందీని ఎంచుకుంటారు. దక్షిణాది రాష్ట్రాలు హిందీకి దాదాపు అలవాటుపడినట్టే... అటువైపువారు సైతం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, ఒరియావంటి భాషల్లో ఏదో ఒకటి నేర్చుకోవటం తప్పనిసరి చేస్తే వివక్ష కనబడేది కాదు. పైగా ఇటువైపువారికి ఉత్తరాదిన ఉద్యోగావ కాశాలు లభించేవి. కానీ ఆ పని చేయరు.తొమ్మిదో తరగతికి వర్తింపజేస్తూ తీసుకొచ్చిన ఈ నిర్ణయం తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. 6 నుంచి 8వ తరగతి వరకూ వేరే విధంగా చదివినవారు ఇప్పుడు హఠాత్తుగా సంస్కృతమో, హిందీయో నేర్చుకుతీరాలి. అసలు పాఠ్యపుస్తకాలే లేని ప్రస్తుత స్థితిలో, కీలక మలుపు అనదగిన పదో తరగతినాటికి పిల్లలంతా ఆ భాషల్లో ప్రావీణ్యత సాధించటం సాధ్యమేనా? ఇప్పటికే ఒక యూనిట్ టెస్ట్ కూడా పూర్తయింది. ‘ప్రస్తుతానికి’ తొమ్మిదో తరగతివారికి ఆరో తరగతి పాఠ్యపుస్తకం వినియోగించాలనీ, టీచర్లుండరు గనుక రిటైరైనవారి సేవలను వినియోగించుకోవాలనీ సీబీఎస్ఈ చెబుతోంది. ‘ఎలా రాసినా...’ ఆ మార్కుల్ని పట్టించుకోబోమన్న సన్నాయి నొక్కులు అదనం. కానీ అన్నిటా 90 శాతంపైగా సాధించిన విద్యార్థి మార్కుల జాబితాలో ఇదొక దిష్టిచుక్కగా మిగలదా? సీబీఎస్ఈ ఇంతకూ ఏం సాధించదల్చుకుంది? ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. -
‘అధిక సంతాన’ వ్యామోహం!
చెప్పడానికేం లేనప్పుడూ, సంజాయిషీ ఇవ్వడానికి మాటలు దొరకనప్పుడూ ఏదో ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చి ప్రజలను గందరగోళపరచడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అలవాటైన విద్య. తిరుమల లడ్డూ మొదలుకొని అనేకానేక అంశాలపై సృష్టించిన వివాదాలు నీరుగారి, తన కుట్రలు బయటపడ్డాక ఇక సూపర్ సిక్స్ హామీల గురించీ, ఇతరత్రా వాగ్దానాల గురించీ ఏదో ఒకటి చెప్పకతప్పని స్థితి ఎదురైంది. అందుకే ఎక్కువమంది పిల్లల్ని కనండంటూ ఆయన ఊదరగొడుతున్నారు. దాన్నెవరూ పట్టించుకున్న దాఖలా లేకపోవటంతో తాజాగా శ్రీకాకుళం జిల్లా నరసన్న పేటలో అధిక సంతానం ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం ఏమేం చేయబోతున్నదో ఏకరువు పెట్టారు. మూడో బిడ్డను కంటే రూ. 30,000, నాలుగో బిడ్డను కంటే రూ. 40,000 ఇస్తామని ప్రకటించారు. ఈ సొమ్మును పురిటి మంచం దగ్గరకే తీసుకొచ్చి ముట్టజెబుతారట! దీన్ని ప్రకటించేముందు ఎన్నికల హామీల అతీ గతీ ఏమైందో నిజాయితీగా చెబితే బాగుండేది. కనీసం చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంత మందికీ ఏడాదికి రూ. 15,000 చొప్పున ఇస్తానన్న ‘తల్లికి వందనం’ ఏమైందో... కుటుంబంలో ఎందరు మహిళలుంటే అందరికీ నెలకు రూ. 1,500 చొప్పున అందిస్తానన్న ‘ఆడబిడ్డ నిధి’ ఎటుపోయిందో...‘కల్యాణ లక్ష్మి’ ఎంత ఘనంగా అమలవుతున్నదో బాబు చెప్పాల్సింది. గత వాగ్దానాలకే దిక్కూ మొక్కూలేని తరుణంలో కొత్త రాగం మొదలెట్టారు. వాస్తవానికి ‘అధిక సంతానం’ ఆలోచన బాబు పుర్రెకు పుట్టిన బుద్ధికాదు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందనీ, అందువల్ల దక్షిణాది నష్టపోతుందనీ తెలిశాక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సహా అనేకులు ఆందోళనపడి, అధిక సంతానాన్ని కనమంటూ బహిరంగ సభల్లో చెప్పడం మొదలెట్టారు. కానీ అంతటితో ఆగితే వారికీ, బాబుకూ తేడా ఏముంటుంది? అందుకే ఈ నజరానాలు! నిజానికి కేంద్రంలో ఎన్డీయే సర్కారు తమ దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన ప్రస్తుత స్థితిలో నియోజకవర్గాల పునర్విభజనకు ఎంచుకున్న ప్రాతిపదిక విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించవచ్చు. కానీ అలాంటి దుస్సాహసం చేస్తే కొంప కొల్లేరవుతుందని భయపడ్డారు. అలాగని లోలోన రగులుతున్న అసంతృప్తిని దాచుకోలేకపోతున్నారు. ఈలోగా గతంలో ఇచ్చిన విచ్చలవిడి హామీలు శాపాలై వెంటాడుతున్నాయి. వీటినుంచి తప్పించుకోవాలంటే ‘అధిక సంతానమే’ ఏకైక మార్గమని బాబుకు తోచినట్టుంది. గండం గడిచేందుకు అవసరార్థం ఏదో ఒకటి మాట్లాడటం మొదటినుంచీ ఆయనకు అలవాటే. 2024 ఎన్నికల్లో మరోసారి ఓటమి తప్పదని గ్రహించాక ఆదరా బాదరాగా ఎన్డీయే పంచన చేరారు. అప్పటికీ విజయంపై గ్యారెంటీ లేకపోవటంతో ఎన్నికల సంఘం(ఈసీ) ప్రాపకంతో కావాల్సినవన్నీ చేసుకున్నారు. మరోపక్క మోసపూరిత హామీలతో మోతెక్కించారు. ఇక పోలింగ్ రోజున ఈవీఎంల ప్రహసనం, దొంగ ఓట్ల జాతర సరేసరి. ఎన్ని చేసినా...ఇచ్చిన వాగ్దానాల మాటేమిటన్న ప్రశ్న ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అందుకే ఈ అధిక సంతానం ప్రచారం!ఇటీవల కాగ్ విడుదల చేసిన తాత్కాలిక లెక్కలు ఏపీ సర్కారు నిర్వాకాన్ని రోడ్డుకీడ్చాయి. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని అభివృద్ధంటూ బాబు చెప్పినవన్నీ ఉత్త డొల్ల మాటలని తేల్చిచెప్పాయి. 10.75 శాతం వృద్ధి రేటు అంటూ బాబు చెప్పిందే నిజమైతే పన్ను రాబడులు 3.22 శాతం పడిపోవటమేమిటి? సంపద సృష్టి మాట దేవుడెరుగు... ఉన్న సంపదంతా ఊడ్చుకుపోతోందని కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా ఏ భరోసాతో పిల్లల్ని కంటారు? ఈ సంక్షోభకాలంలో సర్కారు ఒక్క దఫా ఇచ్చే డబ్బు ఏమూలకు సరిపోతుంది? ఎన్నాళ్లొస్తుంది? ఈ విషయంలో ప్రముఖ పిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని సంతోష్ సూటిగా నిలదీస్తే ఇంతవరకూ జవాబు లేదు. కనీసం పిల్లల సంక్షేమానికీ, వారి ఆరోగ్యరక్షణకూ, పౌష్టికాహారానికీ, విద్యకూ, మొత్తంగా ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకూ సంబంధించిన పథకాలు ప్రకటిస్తే వేరుగా ఉండేది. సందుసందునా బెల్ట్ షాపులతో మద్యం ఏరులై పారుతున్న రాష్ట్రంలో కుటుంబాలు ఏ భరోసాతో పిల్లల్ని కనాలి? అరకొర ఆదాయంతో సగటు ఇల్లాళ్లు కంటతడి పెడుతుంటే ఎందుకీ మతిలేని మాటలు?! -
ఆమ్ రస్
బహదూర్షా జఫర్‌తో కలిసి మీర్జా గాలిబ్ తోట షికారుకు బయలుదేరాడు. తోటంటే మామిడి తోటే. అది విరగ కాసి ఉంది. మీర్జా గాలిబ్ ప్రతి పండునూ కళ్లు చికిలించి మరీ చూస్తూ ఉన్నాడు. అతని పోబడి కాసేపు పరికించి ‘ఏమిటయ్యా మీర్జా, అలా చూస్తున్నావు’ అన్నాడు జఫర్. ‘జహాపనా! ప్రతి పండు మీద తినేవాడి పేరు ఉంటుందని అంటారు. నా పేరు రాసిన పండ్లు ఏవై ఉంటాయా అని వెతుకుతున్నా’ అన్నాడు మీర్జా. జఫర్ ముచ్చటగా నవ్వి ఆ సాయంత్రం మీర్జా ఇంటికి బుట్టల కొద్ది పండ్లు పంపాడు. పేరుకు మహాకవి మీర్జా గాలిబ్... తియ్యటి మామిడి కోసం తన కవిత్వం మొత్తం ఖుర్బాన్ చేయమన్నా చేస్తాడు.బాబర్ ఇండియా మీదకు దండెత్తి వచ్చాక ‘నేను నా నేలన తిన్న తియ్యటి ద్రాక్ష ఏదీ? ఆ మధుర కర్బూజా ఫలము ఎక్కడ?’ అని ఏడ్చినంత పని చేశాడు. ‘ఊరుకో స్వామీ’ అని ఇక్కడి స్థానికులు మామిడి పండు కోసి పెట్టారు. తర్వాత బాబర్ ‘సరైన మామిడి దొరకాలేగానీ దాని అబ్బలాంటి కాయ మరేదీ లేదు’ అని బాబర్ నామాలో రాసుకున్నాడు. సరే. ‘నూర్జహాన్’ పేరు మీదే ఒక పండు అంకితం చేయబడింది. అక్బర్ మహాశయుడైతే మామిడికి దాసుడు. బిహార్‌లోని దర్భంగా దగ్గర లక్ష మామిడి చెట్లతో తోట వేశాడు. దాని పేరు ‘లఖీ బాగ్’. మొఘలులతో పని జరగాలంటే మామిడి పండ్ల బుట్ట ఇస్తే సరి అనే నానుడి ఉండేది. అందుకే అమీర్ ఖుస్రో మామిడిని ‘ఫఖర్–ఏ–గుల్షన్’... ‘తోటలకు గర్వకారణం’ అని కీర్తించాడు. కర్నూలు జిల్లా బనగాన పల్లిలో నవాబులు తమ మామిడి తోటలన్నీ శోధించి శ్రేష్ఠమైన ‘బేనిషాన్’ వెరైటీని వృద్ధి చేసి రైతులకు మొక్కలు ధారాళంగా పంచారు. ఇవాళ తింటున్న బంగినపల్లి తీపికి మొదలు అక్కడ ఉంది.మామిడి మనదే. ఆరు వేల ఏళ్ల చరిత్ర ఉంది దానికి. ఈశాన్య భారతంలో పుట్టి బౌద్ధ సన్యాసుల వల్ల, పర్షియన్ వర్తకుల వల్ల, పోర్చుగీసు వాళ్ల వల్ల ప్రపంచానికి పాకింది. ఇవాళ ఏ దేశంలో మామిడి ఉన్నా దాని వేరు మనదే. వేదాల్లో ‘ఆమ్ర’ అని ప్రస్తావన ఉందట. భూమి చుట్టడానికి బదులు తన చుట్టూ తిరిగిన వినాయకుణ్ణి మెచ్చి శివుడు మామిడి పండును బహుమతిగా ఇచ్చాడట. అంటే అది జ్ఞానఫలం. ఇక బుద్ధునికి ఆమ్రపాలి తన మామిడి తోట దానం చేయడం విదితమే. జైన మహావీరుడు 30 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి ‘జ్ఞాతృఖండ వనం’ అనే మామిడితోటలో దీక్ష తీసుకున్నాడు. వినోదానికేం కొదవ? రాయలవారి తల్లికి మామిడి పండ్లు దానం చేయాలని ఉండే దట. అది తీరకనే పోయేసరికి ‘ప్రాయశ్చిత్తంగా బంగారు మామిడిపండ్లు ఇస్తేనే స్వర్గప్రాప్తి’ అని హఠాయించిన వారికి తెనాలి రామలింగడు ఇనుప కడ్డీలతో వాతబడి చేశాడని జనశ్రుతి. 2000 ఏళ్ల క్రితమే తెలుగునేలకు మామిడిగాలి సోకినా రాయలవారి కాలానికి మామిడి ఛాయ స్థిరపడింది. రాయలవారే స్వయంగా తోటలు పెంచాడు. ఆముక్తమాల్యదలో మామిడి చివురు ప్రస్తావన చేశాడు.మామిడి పండ్లు వచ్చేది ఎందుకంటే జీవితం కాసింత రసభరితం చేసుకోండయ్యా అని గుర్తు చేయడానికి. ఎండ ఉదయాన కుటుంబంతో అల్పాహారానికి కూచుని చద్దన్నంలో మామిడి రసం జుర్రుకుంటూ, వేడివేడి పూరీలను మామిడి రసంలో ముంచు కుంటూ, సువర్ణకాంతిలో మెరిసే మామిడి ముక్కల మెరుపుతో ముఖాన్ని శోభిస్తూ, జిహ్వకు స్వర్గం అందడం అంటే ఏమిటో అనుభవిస్తూ బతుకును కాస్త రుచిమధురం చేసుకోమని చెప్తుంది మామిడి కాలం. కానీ ఏమిటి చేయడం! మంచి కాయలన్నీ విదేశా లకు పంపి, కల్మష కాయలన్నీ బజారున ఒంపారు. చిన్నప్పుడు తిన్న మేలిమి రకాలెన్నో శ్రీమంతుల డైనింగ్ టేబుల్స్‌కు పరిమితమయ్యాయి. ఇటు తీపి రుచికి నోచుకోక... అటు బతుకు బాదరబందీలో కుదురు దొరక్క... రుచీ పచీ లేక మిగిలాం. గడ్డి కప్పి, మగ్గబెట్టి, వెతికి వెతికి అందుకుని తిన్న చిన్నప్పటి జ్ఞాపకం ఏమైంది?లోకాన మంచిగాని, మామిడి రుచిగాని బహు కొద్ది. అందువల్ల దొరికిన ప్రతి లిప్తను జుర్రుకోమని ఉద్బోధించే ఈ కాలానికి నమస్కరించుకుంటూ అందుకోండొక మిగలపండిన మామిడిపండు. పిల్లలకు ఇవ్వండి. మామిడి బాల్యమే తియ్యని బాల్యం.


