
జనతంత్రం
శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి. ‘పరిత్రాణాయ సాధూనామ్, వినాశాయ చదుష్కృతామ్, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే’ అనే సందేశాన్ని మన జనజీవన స్రవంతితో సమ్మేళన పరిచిన భగవానుడాయన. సన్మార్గులను రక్షించడానికీ, దుర్మార్గులను శిక్షించడానికీ ప్రతి యుగంలోనూ నేను అవత రిస్తూనే ఉంటానని ఆయన చేసిన గీతోపదేశాన్ని భారతీయ సమాజం ఇప్పటికీ స్మరించుకుంటూనే ఉన్నది. ఇక జన్మాష్టమి సందర్భమైతే సరేసరి. పామరుల నుంచి పండితుల వరకు, సామాన్యుల నుంచి సర్కార్ పెద్దల వరకూ ఆ మహామహో పాధ్యాయుని సంస్మరణ అవిస్మరణీయమైన ఆచారంగా మిగిలి పోయింది.
ఈ కృష్ణాష్టమి సందర్భంగా రాజకీయ నాయకులు ఇచ్చిన సందేశాల్లో ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ చేసిన ట్వీట్ అందరి దృష్టినీ ఎక్కువగా ఆకర్షించింది. ‘అధర్మం ఎంత బలంగా ఉన్నా – అది తాత్కాలికం. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్ళినా – అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం’ అని ఆ సందేశంలో పేర్కొన్నారు.
నిన్నమొన్నటి రాజకీయ పరిణామాలు ఈ ట్వీట్‌కు ప్రేరణ కావచ్చు. ఎన్నికలొక తతంగంగా – ప్రజాస్వామ్యం ఒక ప్రహసనంగా మారిన తీరు ప్రభావితం చేసి ఉండవచ్చు. కిందటేడాది జరిగిన సాధారణ ఎన్నికలపై పుంఖా నుపుంఖాలుగా ఆరోపణలు వస్తున్న విషయం విదితమే. ఆ ఆరోపణలకు తగిన ఆధారాలు సమకూరుతున్న తీరు కూడా తెలిసిన సంగతే.
రెండు రోజుల కిందటే జరిగిన రెండు జడ్‌పీటీసీ ఉప ఎన్నికల తతంగం మరో రకమైన వంచన. నడిబజార్లలో ప్రజా స్వామ్యం బట్టలూడదీసి వివస్త్రగా నిలబెట్టిన దుశ్శాసన క్రీడగా దాన్ని వర్ణించవచ్చు. ఈ వికృత కేళికి బాధ్యులెవరంటే ఏమని చెబుతాం? కర్ణుడి చావుకు కారణాలేమిటో అర్జునుడికి కృష్ణపర మాత్మ తెలియజెప్పుతాడు.
‘నీ చేతను, నా చేతను వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్ ధర చేత భార్గవు చేత నరయంగ కర్ణుడీల్గె నార్వురి చేతన్’ అని వివరిస్తాడు. ‘కర్ణుడు నీవల్లా నావల్ల మాత్రమే చనిపోలేదు. ఆయన చావుకు కుంతీదేవి,ఇంద్రుడు, భూదేవి, పరశురాముడు కూడా కారకులే’నని చెబుతాడు.
అదేవిధంగా పులివెందుల, ఒంటిమిట్టల్లో కూడా రక్షకు లుగా ఉండవలసినవారే ప్రజాస్వామ్య హత్యాకాండకు ఒడి గట్టారు. ‘సత్యం వద’ (సత్యాన్ని మాట్లాడు), ‘ధర్మం చర’ (ధర్మాన్ని అనుసరించు) అని ఉపనిషత్తులు చేస్తున్న బోధనను మన సనాతన ధర్మ ప్రభుత్వం ‘సత్యం వధ’ (సత్యాన్ని చంపు), ‘ధర్మం చెర’ (ధర్మాన్ని నిర్బంధించు)గా అర్థం చేసుకున్నట్టుంది.
ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రాజకీయ వ్యవస్థ సత్యాన్ని వధించైనా ఓ గెలుపును కైవసం చేసుకోవాలని సంకల్పించింది. రాజ్యాంగ ధర్మాన్ని నిర్వర్తించవలసిన ఎన్నికల వ్యవస్థ ఈ సంకల్పానికి సహకరించింది. నిష్పక్షపాతంగా వ్యవహరించవల సిన అధికార యంత్రాంగం, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం ఈ సంకల్పానికి సాగిలబడింది. సత్యాన్ని మాట్లాడవలసిన నాలుగో స్తంభం (మీడియా) దాన్ని చంపేయడానికి తోడ్పాటు నిచ్చింది.
రాజ్యాంగ ధర్మాన్ని నిలబెట్టవలసిన ప్రభుత్వం, ఎన్నికల సంఘం, అధికార యంత్రాంగం, మీడియా సమష్టిగా అధర్మ పతాకాన్ని ఎగరవేశాయి. అధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపించాయి. ఆ నడక తీరు ఎలా సాగిందో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఇరవై జడ్‌పీటీసీ స్థానాలు ప్రాతినిధ్యం లేకుండా ఖాళీగా ఉన్నాయి.
ఇందులో చాలా స్థానాలు పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలు ఖాళీ అవకముందు నుంచే అలా ఉన్నాయి. అధికారం బాగా తలకెక్కిన వారికి చిత్రాతిచిత్రమైన కోర్కెలు కలుగుతుంటాయని చాలా కథల్లో చదువుకున్నాము. అటువంటి ఒక కోరిక ముఖ్యమంత్రికో, ఆయన కుమారునికో కలిగిందని సమాచారం. జగన్‌మోహన్‌రెడ్డికి బలమైన కోట వంటి పులివెందులలో ఆయన్నొకసారి ఓడించాలనేది ఆశ.
ఆ కోర్కె తీరేలోగా పులివెందుల నియోజకవర్గం నుంచి ఓ తోకనో, ఒక ఈకనో గెలుచుకొచ్చి అదేం దుర్భేద్యమైన దుర్గం కాదని చాటేందుకు ఉబలాటపడ్డారు. అలా చేస్తే వైసీపీ నైతిక ధృతి దెబ్బతిని స్థానిక ఎన్నికల్లో తమకు ‘జీవన్‌టోన్’లా ఉపయోగ పడుతుందని ఆశించారు.
పులివెందుల జడ్‌పీటీసీతోపాటు పక్కనే ఉన్న రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట స్థానానికి కూడా ఉపఎన్నికలు జరిపి ఏదోవిధంగా రెండూ గెలవాలని ఆలోచన చేశారు. అలా జరిగితే కడప జిల్లాలో జగన్ బలం కోల్పోయాడని ప్రచారం చేసుకోవాలనేది లక్ష్యం. ఈ లక్ష్యసాధన కోసం కలిసివచ్చే కరి వేపాకుల్ని ఇంతకుముందే సేకరించి పెట్టుకున్నారు.
ఈ రెండింటికి మాత్రమే ఎన్నికలు జరిపితే మిగిలిన 18 జడ్‌పీటీసీల సంగతి? ఇన్నిచోట్ల ఒకేసారి దుశ్శాసన ప్రయోగం మంచిది కాదు. వికటించినా వికటించవచ్చు – అని ఈ రెంటికి మాత్రమే ఎన్నిక జరిగే విధంగా జయరామిరెడ్డి అనే దేశం కార్యకర్తను కోర్టు మెట్లు ఎక్కించారు.
కడప జడ్‌పీ ఛైర్మన్ ఎమ్మెల్యేగా గెలిచి నందువల్ల అప్పటికే ఆ పదవి ఖాళీగా ఉన్నది. రెండు జడ్‌పీ టీసీలు ఖాళీగా ఉండగా కొత్త ఛైర్మన్ ఎన్నిక కుదరదని, కనుక ఈ రెండు స్థానాలకు ముందుగా ఎన్నికలు నిర్వహించేవిధంగా ఆదేశించాలని జయరామిరెడ్డి న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. న్యాయస్థానం ఓకే చేసింది.
రాజ్యాంగంలోని 243వ అధికరణాన్ని అనుసరించి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సంపూర్ణమైన అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానిదే! రెండు జడ్‌పీటీసీల ఎన్నికలకు కోర్టు ఆదేశించినప్పుడు ఖాళీగా ఉన్న మిగిలిన స్థానాలకు కూడా ఎన్ని కల నిర్వహణకు ఈసీ ఉపక్రమించి ఉండవచ్చు. అది దాని ధర్మం కూడా! కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మతం కాని పనిని చేయడానికి ఈసీ సాహసించలేదు.
ఆరు మాసాలకు మించి ఖాళీగా ఉండకూడదన్న స్ఫూర్తిని కూడా విస్మరించింది. ఇక ఎన్ని కలు జరిగిన రెండు స్థానాలపై చాలాకాలం ముందునుంచే టీడీపీ సర్కార్ వ్యూహాత్మకంగా వ్యవహరించడం మొదలు పెట్టింది. వైసీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఎన్నికలు సరిగ్గా వారం రోజుల ముందటే పులివెందుల నియోజకవర్గానికే చెందిన వైసీపీ కార్యకర్త సైదాపురం సురేష్ రెడ్డిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ మరుసటిరోజే శాసనమండలి సభ్యుడైన రమేశ్ యాదవ్‌పైనా, వైసీపీ నాయ కుడు వేల్పుల రాముపైన దాడి జరిగింది. రామును హత్య చేయ డానికే చూశారని సమాచారం.
వైసీపీ కార్యకర్తలూ, నేతలూ ఎన్నికలయ్యేంతవరకు ఇళ్ళను వదిలి వెళ్లకపోతే ఇటువంటి ఘటనలే జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. పాలక కూటమి దాడుల పట్ల పోలీసుల స్పందన మరీ అన్యాయం. ఒక జడ్‌పీటీసీ ఎన్నిక కోసం వందలాదిమంది పోలీసులతో ఒక డీఐజీ స్థాయి అధికారే మోహరించారు.
దాడులపై ఫిర్యాదులు చేసిన వారితో ఆయన వెటకారంగా వ్యవహరించారనే వార్తలు వచ్చాయి. ‘పక్క ఊరికి వెళ్లి పత్తాపారం చేస్తే ఇలానే ఉంటుంద’ని ఆయన వ్యాఖ్యానించారు. తామే లేకపోతే అక్కడ తలలు తెగిపడేవనే మాటలు కూడా వైరల్ అయ్యాయి.
ఈ తరహా కామెంట్ల వల్ల తమకు పోలీసు రక్షణ లభించ దనే అభిప్రాయం సహజంగానే వైసీపీ కార్యకర్తలకు ఏర్పడుతుంది. ఏడాది మాత్రమే గడువున్న ఒక చిన్న ఎన్నిక కోసం గ్రామాల ప్రశాంతత ఎందుకు భగ్నం కావాలన్న ఆలోచన కూడా ఉండవచ్చు. వైసీపీ ముఖ్య కార్యకర్తలంతా మండలం నుంచి బయటికి వెళ్లారు.
యెల్లో మీడియా మాత్రం వైసీపీ వాళ్లు ఓటుకు ఐదు వేలు, పదివేలిచ్చి ఓటర్లను ప్రలోభపెడుతున్నారని, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారనీ యథావిధిగా వెకిలి రాతలే రాసింది. తలలు తెగిపడే పరిస్థితులు ఉన్నాయని డీఐజీ స్థాయి అధికారి చెప్పినప్పుడు ఎన్నికల సంఘం స్పందించి ఉండాల్సింది. పరిస్థితులు చక్కదిద్దడానికి ప్రయత్నాలు చేసి ఉండవలసింది. కానీ అటువంటివేమీ జరగలేదు.
నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు బయటి ప్రాంతాల వాళ్లంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలి. మంత్రి సవిత నాయకత్వంలో ఒకటి, జమ్మలమడుగు ఎమ్మెల్యే దండ నాయకునిగా మరొకటి, కమలాపురం ఎమ్మెల్యే నేతృత్వంలో ఇంకోటి, బీటెక్ రవి అధీనంలో ఒకటి చొప్పున అక్కడే తిష్ఠవేసి ఉన్న నాలుగు బెటాలియన్లు మాత్రం ఈ నిబంధన పాటించ లేదు.
పోలింగ్ రోజున ఉదయం నాలుగు గంటలకే ఈ బెటా లియన్లు మొత్తం 15 పోలింగ్ బూతుల్ని చుట్టుముట్టాయి. పోలింగ్ బూత్‌లకు ఈ బెటాలియన్లు ఔటర్ రింగ్ రోడ్డు మాదిరిగా నిలబడితే పోలీసులు ఇన్నర్ రింగ్‌రోడ్డు మాదిరిగా పోలింగ్ బూత్ ప్రాంగణాల్లో ఉండిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని వచ్చిన వారికి తొలుత కూటమి బెటాలియన్లే ఎదురుపడ్డాయి.
ఓటేసేందుకు వచ్చిన ఓటర్ల దగ్గర స్లిప్పులు లాక్కుని కూటమి సైన్యం వారిని వెనక్కి పంపించింది. ఒక్క వైసీపీ ఏజెంట్‌ను కూడా బూతుల్లోకి ఈ కిరాయి సైన్యం అనుమతించలేదు. ఫిర్యాదు చేయడానికి ఏ ఒక్క పోలీసూ కనబడలేదు. అంతకు ముందే నాలుగు గ్రామాల పోలింగ్ బూత్‌లను ఎత్తివేసి పక్క గ్రామాలలో ఏర్పాటు చేశారు. ఆ గ్రామాల మధ్య మాత్రం పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటయ్యాయి.
కాళ్లు పట్టుకున్నా పోలీ సులు కనికరించలేదు. ఓట్లు వేసేందుకు వెళ్లనీయలేదు. ఈ వార్తలు, ఫోటోలు ఒక సెక్షన్ మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే కనిపించాయి. కానీ ఎన్నికల సంఘం స్పందించ లేదు. పోలింగ్ బూత్‌లను మార్చడమనే నిర్ణయాన్ని కూడా పాలక కూటమి సూచన మేరకే ఈసీ తీసుకున్నదనే విషయం బహిరంగ రహస్యం.
ఒంటిమిట్ట మండలంలోనూ ఇదే ఫార్ములాను అమలు చేశారు. కాకపోతే తొలుత పోలింగ్ బూతుల్లోకి వైసీపీ ఏజెంట్లు ప్రవేశించగలిగారు. ఓ గంటన్నర తర్వాత రాష్ట్ర మంత్రి నాయ కత్వంలో ఓ పటాలం బయల్దేరి బూతుల్లో ఉన్న ఏజెంట్లను బయటకు తరిమేశారు. సాక్షాత్తూ ఒక రాష్ట్ర మంత్రి అక్రమంగా బూత్‌లో చొరబడ్డా, ఏజెంట్లపై దౌర్జన్యం చేసినా ఎన్నికల సంఘం కిమ్మనలేదు.
కొన్ని బూతుల్లో కాసేపు ఏజెంట్లు కూర్చున్న ఫలితం ఓట్ల సంఖ్యలో కనిపించింది. అక్కడ వైసీపీకి 6 వేలకు పైగా ఓట్లు పడ్డాయి. నిజమైన ఓటర్లను అనుమతించని పులివెందులలో వైసీపీకి 683 ఓట్లు వచ్చాయి. అవి కూడా కూటమి సైన్యమే వేసి ఉంటుంది కనుక అందుకు వారికి ఓ వైసీపీ నాయకుడు వెటకారంగా ధన్యవాదాలు తెలియజేశారు.బూటకపు ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత కూటమికి వంత పాడుతున్న మీడియాలోని ఓ ప్రధాన సెక్షన్ స్పందన జుగుప్సాకరంగా ఉన్నది. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగినందువల్ల టీడీపీ గెలిచిందట.
ముప్పయ్యేళ్ల తర్వాత పులివెందుల ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం లభించిందట! అందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ బ్యాలెట్ బాక్సుల్లో స్లిప్పులు వేశారట! స్లిప్పుల బండారాన్ని సోషల్ మీడియాలో ఓ యువకుడు ఎండ గట్టిన తీరు నవ్వు తెప్పిస్తున్నది. కామెంట్లు రాసిన కాగితాలను బ్యాలెట్ బాక్సుల్లో వేయాలంటే ఆ కాగితాన్ని మతడపెట్టి వేయాలి.
కానీ ఆ కాగితాలపై మడతలు లేకపోగా ఇస్త్రీ చేసిన ట్టుగా ఉన్నాయంటూ వాటి ఫోటోలను జతజేశాడు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఓటేయడానికి క్యూలైన్లలో నిలబడిన కూటమి కార్యకర్తలను గుర్తించి, ఆ ఫోటోలను ఒక సెక్షన్ మీడియా ప్రచురించింది. అయినా ఈసీలో స్పందన లేదు.
ఈరకంగా వ్యవస్థలన్నీ ప్రలోభాలకు లోనై ఏలినవారి ఎదుట సాగిలపడుతున్న తీరును చూస్తుంటే మన ప్రజాస్వామిక వ్యవస్థ పెనుప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నట్టు హెచ్చరికలు కనిపిస్తు న్నాయి. పౌరులారా బహుపరాక్!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com