
చాన్నాళ్ల క్రితం ‘మీ పిల్లల్ని ఏం చదివిద్దామనుకుంటున్నార’ని తల్లిదండ్రుల్ని అడిగితే వైద్య విద్యనో, సాంకేతిక విద్యనో సమాధానంగా వచ్చేది. 90వ దశకానికల్లా సాంకేతిక విద్యే తారక మంత్రమైంది. పట్టా రావటానికి ముందే క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఖాయమయ్యేది మరి. ఇప్పుడంతా తారుమారైంది. సాంకేతిక విద్య కిక్కిరిసి అవకాశాలు అంతంత మాత్రం అయ్యాయి. చదువుతోపాటు సాంకేతిక నైపుణ్యాలగురించి అడగటం మొదలైంది. ప్రస్తుతం కృత్రిమ మేధ(ఏఐ)లో నైపుణ్యం ఏమిటన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది.
దశాబ్దం క్రితం నైపుణ్యాల విషయంలో మన సాంకేతిక పట్టభద్రులు వెనకబడి ఉన్న మాట వాస్తవమే అయినా ఇప్పుడంతా మారిందని తాజాగా విడుదలైన ‘ఇండియా స్కిల్స్ నివేదిక 2025’ చెబుతోంది. దాని ప్రకారం 54.8 శాతం మంది పట్టభద్రులు ఉద్యోగార్హులు. చూడటానికి ఇది ఎక్కువేం కాదన్న అభిప్రాయం కలగొచ్చు. కానీ పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇది 20 పాయింట్లు అధికం. గతేడాదితో పోల్చినా మూడు పాయింట్లు అధికం.
విద్యారంగానికీ, పారిశ్రామిక రంగానికీ అనుసంధానం పెరగటం వల్ల ఇదంతా సాధ్యమైందని ఆ నివేదిక అంటున్నది. ముఖ్యంగాఇంటర్న్‌షిప్‌లు విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవాలనిచ్చి వారిని ఉద్యోగాలకుసంసిద్ధం చేస్తున్నాయని చెబుతోంది. కానీ ప్రభుత్వాలు విద్యకు ఇవ్వాల్సినంత ప్రాము ఖ్యత ఇస్తున్నాయా? ఫీజు రీయింబర్స్‌మెంటువంటి పథకాలను పకడ్బందీగా అమలు చేసి పేద పిల్లలకు సాంకేతిక విద్య అందుబాటులోకి తెస్తున్నాయా?
మన సాంకేతిక విద్యారంగం ప్రపంచ శ్రేణితో పోటీ పడాలంటే మరింత వేగంగా కదలాల్సి ఉంటుంది. అందులో అన్ని వర్గాల భాగస్వామ్యం పెంచాల్సి ఉంది. ఈమధ్యే విడుదలైన నాల్‌స్కేప్ సంస్థ నివేదిక 2028 నాటికి తయారీ రంగ పరిశ్రమలో సాంకేతిక నైపుణ్య లేమి వల్ల ప్రపంచ వ్యాప్తంగా 24 లక్షల ఉద్యోగాలు ఖాళీగా మిగిలిపోతాయని తెలిపింది. దీన్ని సరిదిద్దకపోతే 2030 నాటికి లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం తప్పదని హెచ్చరించింది. తయారీ రంగంలో అత్యధిక పరిశ్రమలు ఉద్యోగార్థుల చదువుతోపాటు వారికున్న భిన్న రకాల నైపుణ్యాలేమిటని చూస్తున్నాయి.
ముఖ్యంగా ఏఐ ఆధారిత సామర్థ్యాలు, సీఎన్‌సీ ఆపరేషన్స్, ఆటోమేషన్ సిస్టమ్స్ ఇంటెగ్రేషన్, డేటా ఎనలిటిక్స్, డిజిటల్ ట్విన్ టెక్నాలజీస్, హ్యూమన్–మెషీన్ ఇంటర్‌ఫేస్ డిజైన్ వగైరాలకు అపారమైన డిమాండ్ ఏర్పడబోతోంది. సాఫ్ట్‌వేర్ రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ వగైరాలు అవసరమవుతాయి. సిబ్బందికుండే నైపుణ్యాలే విజయానికి బాటలు వేస్తాయి గనుక ఎంపికలో వాటినే ప్రధానంగా చూస్తామని 94 శాతం సంస్థలంటున్నాయి.
అవసరాలకు అనుగుణంగా తగిన నైపుణ్యాలను పెంపొందించుకునే వారికే, ప్రపంచ స్థాయిలో పోటీపడగల వారికే ఏ పరిశ్రమల్లోనైనా ఉద్యోగాలు భద్రంగా ఉంటాయన్నది ఆ నివేదిక సారాంశం. కానీ మన సాంకేతిక విద్య ఈ స్థాయికి చేరుకుందా... విద్యాసంస్థలు ఇందుకనుగుణమైన సాంకేతికతను విద్యార్థులకు సమర్థంగా అందించగలుగుతున్నాయా అనే సందేహాలున్నాయి.
మన దేశానికుండే ప్రత్యేకతేమంటే ప్రస్తుతం ఇక్కడ పనిచేయగలిగిన సత్తా గల (15–64 యేళ్ల మధ్య) జనాభా 99 కోట్ల 47 లక్షలకు చేరుకుంది. ఇది చైనాకన్నాఅధికం. 2030 వరకూ ఏడాదికి కోటి మందికి పైగా దీనికి జమ అవుతారు. భిన్నరంగాల్లో మెరుపు వేగంతో దూసుకొస్తున్న ఏఐకి సంబంధించిన బహుముఖ నైపుణ్యాలను ఒడిసిపట్టుకోవటంలో వెనకబడితే వీరందరికీ మెరుగైన ఉద్యోగాల కల్పన అసాధ్యమవుతుంది. ఐటీ, ఆరోగ్య రంగం, హరిత ఇంధన రంగం వగైరాల ద్వారా2030 నాటికి ప్రపంచ ఆర్థిక రంగానికి 50,000 కోట్ల డాలర్ల అదనపు సంపద జమవుతుందని అంచనా.
ఈ సంపదలో మన వాటా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండాలంటే మెరికల్లాంటి నిపుణుల సైన్యం తయారు కావాలి. సాంకేతిక కళాశాలల తీరుతెన్నుల్నిసంపూర్ణంగా మార్చాలి. నిరుపేద గ్రామీణ విద్యార్థులకు అందుబాటులోకి తేవాలి. ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు, ప్రభుత్వాలు ఫీజురీయింబర్స్‌మెంట్ వంటివిసక్రమంగా అమలు చేయాలి. అప్పుడే అన్ని వర్గాల పిల్లలూ ఈ అభివృద్ధిలో భాగస్వాములవుతారు.