
జనతంత్రం
వీళ్లు పాలకులేనా? భారత రాజ్యాంగం స్ఫూర్తితో ఎన్నికైన ప్రజా ప్రతినిధులేనా? ఇంతటి విశృంఖల అవినీతి గతంలో ఎప్పుడైనా ఉన్నదా? గజ్జెల మల్లారెడ్డి పద్యాన్ని కొద్దిగా మార్చి ‘తెలుగు నాట అవినీతి తెప్పలుగా పారుతోంది. డ్రైనేజీ స్కీము లేక డేంజర్‌గా మారింద’ని చదువుకోవాలి. ఆంధ్రప్రదేశ్ పాలక కూటమి పల్లకీని మోసే డ్యూటీలో ఉన్న యెల్లో బోయీలు కూడా అవినీతి ప్రవాహంపై మాట్లాడక తప్పని దురవస్థ దాపు రించింది. కాకపోతే వారి ఎజెండా వేరు.
వారికో డైవర్షన్ స్కీమున్నది. అవినీతి హెడ్‌క్వార్టర్స్‌పై ముసుగు కప్పి ప్రవహిస్తున్న మురుగంతా క్షేత్రస్థాయి, ద్వితీయ శ్రేణి నేతల మురికేనని చెప్పాలి. అదే చెబుతున్నారు. ‘ఎమ్మెల్యే సారూ... తగ్గాలి మీరు’ అనే పతాక శీర్షికలతో అవినీతి కథనాల సీరియల్స్ నడుపు తున్నారు. మంత్రుల పీఏలు, ఓఎస్‌డీలు తెగబడుతున్నారని రాస్తున్నారు. ప్రతి పనికీ రేటు పెట్టి వసూలు చేస్తున్నారని స్థానిక నేతలపై వాపోతున్నారు.
జడలు విరబోసుకొని నడివీధుల్లో నర్తిస్తున్న అవినీతి భూతాన్ని దాచిపెట్టలేరు గనుక డైవర్షన్ వ్యూహాలపై తెలివి తేటల్ని ఖర్చు చేస్తున్నారు. సాధారణ పరిపాలన శ్రుతి తప్పితే అధికారుల తప్పు. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పితే పోలీసుల తప్పు.
ఇదీ, యెల్లో మీడియా వరుస. అదునులోగా రైతుకు అందవలసిన యూరియా ఎరువును కూడా అవినీతి భూతం పరపర నమిలేస్తుంటే గద్దె మీదనున్న పెద్దలకు ఏ పాపం తెలియదని యెల్లో బోయీలు నమ్మబలుకుతున్నారు. ఇతరుల ఖాతాల్లో పడేయడానికి వీలు కాని ముఖ్య భాగోతాలను మాత్రం అభివృద్ధి కోణంలో ఆవిష్కరిస్తున్నారు.
ప్రజారోగ్యాన్ని ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లో పెట్టడంలో అవినీతి లేదట! అభివృద్ధికి అదే అర్థమట! జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చి భూసేకరణ చేసి నిర్మాణాలు ప్రారంభించారు. ఆయన హయాంలోనే ఐదు కాలేజీలు ప్రారంభమయ్యాయి.
ఎన్నికలు ముగిసిన వెంటనే పాడేరు కాలేజీ కూడా ప్రారంభమైంది. దాంతోపాటు అనుమతులొచ్చిన పులివెందుల కాలేజీకి మాత్రం బాబు అడ్డు చక్రం వేశారు. అడ్డుకోవడానికి అసలు కారణం, ఇప్పుడు తేటతెల్లమైంది. పులివెందుల కాలేజీతోపాటు పది కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు.
అయితే, దీన్ని ప్రైవేటీకరణ అనగూడదని సర్కార్ వాదిస్తున్నది. పిల్లి కాదు మార్జాలమట! ఈ మార్జాలం మర్మమేమిటో తెలుసుకోవాలంటే ప్రభుత్వం తరఫున ఏపీఎమ్‌ఎస్‌ఐడీసీ తయారుచేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొంతమేరకు ఉపయోగపడుతుంది. ఈ పది మెడి కల్ కాలేజీల్లో అసలు పనులేమీ జరగలేదనీ, కేవలం పునాదు ల్లోనే అవి ఆగిపోయాయని మంత్రులు, ముఖ్యమంత్రి వాదిస్తుండటాన్ని మనం చూస్తున్నాము.
పులివెందుల కాలేజీని తీసుకుంటే అక్కడ ఇప్పటికే 418 కోట్ల 20 లక్షల రూపాయలను నిర్మాణం కోసం ఖర్చుపెట్టినట్టు ఆ పీపీటీలో ప్రభుత్వం అంగీకరించింది. క్యాంపస్ విస్తీర్ణం 47.58 ఎకరాలని అందులో పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉన్న కాలంలోనే అక్కడ ఎకరా రెండు కోట్ల దాకా ఉన్నదని సమాచారం.
మెడికల్ కాలేజీ, అనుబంధ ఆస్పత్రి పని చేయడం ప్రారంభిస్తే ఈ భూమి ధర శరవేగంగా పెరిగే అవకా శముంటుంది. దీన్ని ఏటా ఎకరాకు 100 రూపాయల చొప్పున 66 ఏళ్లపాటు లీజుకు ఇస్తారు. అంటే పులివెందుల కాలేజీ లీజుకు తీసుకునేవారు ఏడాదికి 4,758 రూపాయలు చెల్లిస్తే చాలు.
వందకోట్ల విలువైన (ప్రస్తుత ధర) భూమితోపాటు 420 కోట్లతో చేసిన నిర్మాణం 66 ఏళ్లపాటు వారికి సొంతమవుతుంది. ఈ కాలేజీకి కేటాయించిన 150 అండర్‌గ్రాడ్యుయేట్ సీట్లలో 50 శాతం మేనేజ్‌మెంట్ కోటా కింద కేటాయిస్తారు. 15 శాతం ఆలిండియా సీట్లు పోను 35 శాతం సీట్లు రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి.
జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్ ప్రభుత్వరంగంలో ప్రారంభించిన కాలేజీల్లో సగం సీట్లను కాలేజీల నిర్వహణ కోసం సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద పెట్టింది. అప్పటి ప్రతిపక్షం దీనిపై గగ్గోలు పెట్టి తాము అధికారంలోకి వస్తే ఆ కోటా ఎత్తివేస్తామని చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. ప్రభుత్వ నిర్వహణలో ఉన్న కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకు ప్రభుత్వం నిర్ధారించిన ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
కానీ ప్రైవేట్ యాజమాన్యంలో అది కుదరదు. ప్రభుత్వం నిర్ధారించిన ఫీజుతోపాటు దొడ్డిదారి డొనేషన్లు, డొంకదారి వసూళ్లు చాలా ఉంటాయన్న సంగతి మనకు అనుభవంలో ఉన్న విషయమే. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పులివెందుల కాలేజీని ఉదాహరణగా తీసుకున్నప్పటికీ మిగిలిన 9 కాలేజీల పరిస్థితి ఇంతే. వాటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.
ఆదోని కాలేజీకి సేకరించిన స్థలం 58.44 ఎకరాలు. అక్కడ ఇప్పుడే ఎకరా 5 కోట్లు ధర పలుకుతున్నది. నిర్మాణం కూడా 70 శాతం పూర్తయింది. మదనపల్లె కాలేజీ స్థలం 95.5 ఎకరాలు. నిర్మాణం 30 శాతం పూర్తయింది. మిగిలిన కాలేజీలు కూడా 50 ఎకరాలకు తగ్గకుండా ఉన్నాయి. ఒకసారి కాలేజీ, ఆస్పత్రి పనిచేయడం ప్రారంభమైతే ఆ స్థలాల ధరలు అనూహ్యంగా పెరుగుతాయి.
మరో ముఖ్యమైన అంశం – కాలేజీలకు అనుబంధంగా ఏర్పడే ఆస్పత్రులు! 650 పడకల ఆస్పత్రులను ప్రతిపాది స్తున్నారు. ఇందులో 30 శాతం పడకలకు ప్రైవేట్ మేనేజ్‌మెంట్ తన ఇష్టప్రకారం డబ్బులు వసూలు చేసుకోవచ్చు. మిగిలిన 70 శాతం పడకలపై మాత్రం నియంత్రణ ఉంటుంది. ప్రైవేట్ యాజమాన్యాలు ఈ నియంత్రణలను ఏమేరకు పాటిస్తాయన్నది తెలియంది కాదు.
తెల్ల రేషన్ కార్డులున్న వారికి 5 శాతం ఉచిత వైద్యాన్ని రిజర్వు చేయాలన్న నిబంధనను కార్పొరేట్ ఆస్పత్రులు ఏమేరకు పట్టించుకుంటున్నాయో తెలిసిన సంగతే! అదే ప్రభుత్వరంగంలో ఉన్నట్లయితే ఇన్‌పేషెంట్లతో పాటు ఔట్ పేషెంట్లు కూడా ఉచిత ఉన్నతస్థాయి వైద్య సౌకర్యాలను పొందే అవకాశం ఉండేది.
డబ్బులేని కారణంగా వైద్యవిద్యకు దూరమ వుతున్న ఆసక్తి గల విద్యార్థులకు మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకురావడం, పేద–మధ్యతరగతి ప్రజలకు చేరువలోనే ఉచితంగా స్పెషలిస్టు వైద్య సేవలను అందించడమనే జంట లక్ష్యాల సాధన కోసం జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ప్రారంభించింది.
ఆ ఆశయాన్ని తుంగలో తొక్కుతూ చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు అందులో 10 కాలే జీలను ప్రైవేట్ రంగానికి కట్టబెడుతున్నది. వేల కోట్ల విలువ చేయబోయే ఆ స్థలాలను కారుచౌకగా ఏటా రూ. 5 వేలకే కట్టబెట్టడం వెనుక స్కామ్ కాకపోతే మరే కారణం ఉంటుంది? లక్షలాదిమంది పేద మధ్యతరగతుల ప్రజలను ఉన్నత స్థాయి ఉచిత వైద్యానికి దూరం చేస్తూ, వేలాదిమంది విద్యార్థులూ, వారి తల్లిదండ్రుల డాక్టర్ చదువు కలలను భగ్నం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీసుకున్నది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు మెడికల్ కాలేజీలకు, పది ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రైవేట్‌రంగంలో అనుమతించినప్పుడు చంద్రబాబు చేసిన యాగీ, యెల్లో మీడియా పెట్టిన అల్లరి అప్పటివాళ్లకు గుర్తుండే ఉంటుంది.
నాటి ముఖ్యమంత్రి జనార్దన్‌రెడ్డికి ‘ధనార్జనరెడ్డి’ అనే నామకరణం కూడా బాబు ముఠా చేసింది. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే నిర్మించి ప్రైవేట్‌కు అప్పగిస్తున్న వ్యవహారాన్ని ఏమనాలి? ఈ ముఖ్యమంత్రికి ఏమని నామకరణం చేయాలి?ప్రభుత్వ ఆధ్వర్యంలో కాలేజీలు, ఆస్పత్రుల నిర్వహణ బాగుండదని, ప్రైవేట్ యాజమాన్యమైతే సమర్థంగా ఉంటుందనే ఒక డొల్ల వాదనను కూడా ఈ ప్రభుత్వం ముందుకు తెస్తున్నది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల నిర్వహణ తీరుపై ఇప్పటికే మనకు పలు అనుభవాలున్నాయి. ఉన్నతాధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు దినసరి కూలీలను పేషెంట్ల రూపంలో పడుకో బెట్టడం, అద్దెకు తెచ్చిన వారికి డాక్టర్ల వేషాలు వేసి చూపించడం మీడియాలో చాలాసార్లు రిపోర్టయింది.
సౌకర్యాలు లేక, సమర్థులైన సిబ్బంది లేక ప్రైవేట్ మెడికల్ కాలేజీల స్థాయి అథమస్థాయిలో ఉన్నదనే అధ్యయనాలు కూడా వచ్చాయి. వైద్యరంగంలో ప్రైవేట్ నిర్వాకం ఎట్లా ఉంటుందో తాజా ఉదాహరణను ఒకదాన్ని చెప్పుకోవచ్చు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో రక్తపరీక్షలు సరిగ్గా జరగడం లేదని, 2015లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం, ఆ విభాగాన్ని మెడాల్ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించింది.
ఒక్కో పరీక్షకు 235 రూపాయలు సంస్థకు చెల్లించారు. 2016 నవంబర్ ఒక్క మాసంలోనే 53 వేల డెంగీ కేసులు నమోదైనట్టు లెక్క రాసి మెడాల్ బిల్లులు క్లెయిమ్ చేసింది. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో 7 వేల కేసులే నమోదైనట్టు చివరకు అంగీకరించవలసి వచ్చింది. ఈ రకమైన తప్పుడు లెక్కలతో మూడేళ్లలోనే 360 కోట్ల ప్రజాధనాన్ని ఆ సంస్థ లూటీ చేసింది.
పైవారికి కమీషన్లు సమర్పిస్తున్నామన్న బరితెగింపుతో ఇటువంటి ప్రైవేట్ సంస్థలు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం మనకు కొత్త కాదు. పేదలకు అపర సంజీవనిగా భాసిల్లుతున్న ‘ఆరోగ్యశ్రీ’ని కూడా ఓ ప్రైవేట్ బీమా కంపెనీ చేతిలో పెడు తున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు ఎక్కడ ఫెయిలైంది? బీమా కంపెనీ ఏరకంగా అంతకంటే మెరుగు? కాదేదీ కమీషన్లకనర్హమా? మానవీయ కోణంలో చూడవలసిన ప్రజారోగ్యాన్ని కూడా కమీషన్ల కోణంలో చూసే దుఃస్థితికి తీసుకొచ్చారు. ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పడకేశాయి. ‘ఫ్యామిలీ డాక్టర్’ ఎటో వెళ్ళిపోయాడు. 108, 104 సర్వీసులు కునారిల్లు తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్యం కుప్పకూలింది. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో భాగమైన ఆర్టికల్ 47 ప్రకారం ప్రజారోగ్యం ప్రభుత్వాల ప్రాథమిక విధి. పౌరులందరికీ ఉచితంగానే విద్య, వైద్యాలను అందజేయడం ప్రభుత్వాల ప్రాథమిక కర్తవ్యంగా నాగరిక ప్రపంచమంతా గుర్తించింది. కానీ, మనం మాత్రం విద్య, వైద్యాలను కొనుక్కోవాలనే అనాగరిక వ్యవస్థలోకి, రాజ్యాంగ విరుద్ధ పాలనలోకి జారిపోవడం మన అజ్ఞానమా... అమాయకత్వమా... ప్రశ్నించుకోవాలి.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com