మసిబారిన ఎన్నికల సంఘం! | Sakshi Editorial On Election Commission of India By Vardhelli Murali | Sakshi
Sakshi News home page

మసిబారిన ఎన్నికల సంఘం!

Aug 10 2025 1:41 AM | Updated on Aug 10 2025 1:05 PM

Sakshi Editorial On Election Commission of India By Vardhelli Murali

జనతంత్రం

పేరుకు మనది అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ. ఇప్పుడది మేడిపండు చందంగా మారిపోయిందనడానికి రుజువులు చాలా కనిపిస్తున్నాయి. దాని పొట్ట విప్పి చూస్తే పురుగులు భయపెడుతున్నాయి. ప్రజాస్వామ్యానికి కాపు కాయవలసిన ఎన్నికల వ్యవస్థ అచేతనత్వంలోకి, నిష్క్రియాపరత్వంలోకి జారుకున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టి.ఎన్‌. శేషన్‌ వలె పులిలా గాండ్రించగల అధికారాన్ని ఎన్నికల సంఘానికి మన రాజ్యాంగం దఖలు పరిచింది. గాండ్రించవలసిన రాజ్యాంగ వ్యవస్థలు పెంపుడు చిలకలుగా మారిపోయి, పంజరాల్లోకి చేరిపోయాయి. సర్కారు వారి పాటకు అవి కోరస్‌లు పాడుతుంటే మన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నట్టా? మాయల ఫకీర్ల చెరలో మూలుగుతున్నట్టా?

కుల, మత, జాతి నెపాలతో ఏ వ్యక్తికీ ఓటు హక్కును తృణీకరించడానికి వీల్లేదని రాజ్యాంగంలోని 325వ అధికరణం స్పష్టం చేసింది. కానీ ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందట బిహార్‌ ప్రజలు పౌరసత్వ శీల పరీక్షను ఎదుర్కోవలసి వచ్చింది. ఎన్నికల నేపథ్యంలో ఈసీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మాటమాత్రంగానైనా చెప్పకుండానే, ఆ తర్వాత ఓటర్ల జాబితాల ప్రత్యేక వడబోత (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమాన్ని ప్రకటించారు. 

నెలరోజుల సమయం మాత్రమే ఇచ్చి ఓటర్లందరూ వారి శాశ్వత నివాసాన్ని నిరూపించుకునే ఆధారాలను సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి ఆధార్‌తో పాటు ఎన్నికల సంఘమే గతంలో జారీచేసిన వోటర్‌ ఐ.డి. కార్డులు పనికి రావని తేల్చారు.

బిహార్‌ శ్రామికులు లక్షల సంఖ్యలో దినసరి ఉపాధి కోసం పలు ప్రాంతాలకు తాత్కాలికంగా వలస పోతారనే సంగతి తెలి సిందే. వీళ్లంతా హుటాహుటిన సొంతూరికి బయల్దేరి తమ ముల్కీని నిరూపించుకోవలసిన పరిస్థితి. అసలు ఎన్నికల సంఘం ఆదేశాల గురించే వారిలో చాలామందికి తెలిసి ఉండక పోవచ్చు. ఓటర్ల జాబితాను వడపోయాలనే ఆలోచన మంచిదే కావచ్చు. 

సమగ్రంగా సక్రమమైన రీతిలో ఓటర్ల జాబితాను తయారుచేయాలనుకున్నప్పుడు సరిగ్గా ఎన్నికల ముందే ముహూర్తం పెట్టుకోవడం అనుమానాలకు తావిచ్చింది. అది కూడా అఖిలపక్ష సమావేశంలో చూచాయగానైనా చెప్పకుండా ఆదేశాలు జారీ చేయడాన్ని బట్టి అనుమానాలు మరింత బలపడ్డాయి.

ఎన్నికల నిర్వహణతోపాటు, ఓటర్ల జాబితా రూపకల్పన బాధ్యతను 324వ అధికరణం ప్రకారం ఎన్నికల సంఘంపైనే రాజ్యాంగం మోపింది. ఓటరుగా నమోదయ్యే బాధ్యతను పౌరునిపై రాజ్యాంగం పెట్టలేదు. ఓటును అతనికి ఒక హక్కుగా ప్రసాదించింది. 

పౌరులను ఓటరుగా నమోదు చేయవలసిన బాధ్యతను నిర్వహించవలసిన ఎన్నికల సంఘం అందుకు విఘ్నాలను కల్పించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమవుతుంది. గతంలో ఎన్నికల సంఘమే జారీచేసిన ఓటరు కార్డులు చెల్లు బాటు కావనడం ఆందోళనకరం. ఈ గుర్తింపు కార్డుల ఆధారంగా ఇప్పటివరకు జరిగినవన్నీ బూటకపు ఎన్నికలే అను కోవాలా?

ప్రతిపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఎన్నికల సంఘం కొత్త ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించింది. గత జాబితాలో ఉన్న 65 లక్షల మందిని తొలగించినట్టు ప్రకటించింది. ఇందులో 22 లక్షలు చనిపోయిన వారి పేర్లనీ, 36 లక్షలమంది శాశ్వతంగా వలస పోయారనీ పేర్కొన్నారు. శాశ్వ తంగా వలస పోయినట్టు ఎలా నిర్ధారణకొచ్చారో తెలియదు. ఆ మేరకు వాళ్లేమైనా అఫిడవిట్లు సమర్పించారా? పారదర్శకత ఎక్కడుంది? 22 లక్షలమంది ఏయే సమయాల్లో చనిపోయారో తెలియదు. 

ఐదేళ్ల కింద జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 7.36 కోట్ల మందికి ఓటు హక్కు ఉన్నది. ఇప్పుడు వడబోత తర్వాత 7.24 కోట్లమందే నివాస పత్రాలను సమర్పించారని చెప్పారు. ఐదేళ్లలో చనిపోయేవారి సంఖ్యకు రెట్టింపు సంఖ్యలోనైనా కొత్త ఓటర్లు నమోదై ఉండాలి కదా! భారతదేశంలో ప్రతి వెయ్యి జనాభాకు జననాల రేటు 19.3 శాతంగా ఉంటే మరణాల రేటు 7.5 శాతంగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వ హెల్త్‌ ప్రొఫైల్‌ నివేదిక తెలియజేస్తున్నది. ఈ లెక్కన ఐదేళ్ళలో ఓట్లు పెరగాలి. కానీ తగ్గడం ఆశ్చర్యాన్నీ, ఆందోళననూ కలిగిస్తున్నది.

2024 సాధారణ ఎన్నికల తర్వాత గత ఏడాది కాలంగా ఎన్నికల సంఘం పనితీరు మీద తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పార్టీలే కాదు, స్వచ్ఛంద సంస్థలు కూడా సంఘం పనితీరును ప్రశ్నిస్తున్నాయి. సాక్ష్యాధా రాలతో అనేక అవకతవకలను ఎత్తిచూపుతున్నాయి. కానీ, ఎన్నికల సంఘం స్పందించడం లేదు. బెల్లం కొట్టిన రాయిలా మౌనాన్నే ఆశ్రయిస్తున్నది. అడపాదడపా బుకాయించేందుకు ప్రయత్నిస్తున్నది. యథా రాజా తథా ప్రజా అంటారు గదా! యథా కేంద్ర ఎన్నికల సంఘం తథా రాష్ట్ర సంఘం. 

ఆంధ్ర ప్రదేశ్‌లో జరుగుతున్న రెండు జడ్‌పీటీసీల ఉపఎన్నికలనే తీసు కుందాం. ఎన్ని అక్రమాలు చేసైనా ఈ రెండు స్థానాలను గెలుచు కోవాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తున్నది. అధికారంలో ఉన్న పార్టీ రాజకీయ ఎజెండాకు పోలీసుయంత్రాంగంతోపాటు ఎన్నికల సంఘం కూడా తందానా అంటున్న తీరు విభ్రాంతికరం. మామూలుగానైతే జడ్‌పీటీసీ ఉపఎన్నికల్లో రాష్ట్ర నాయకులు జోక్యం చేసుకోరు. పార్టీల జిల్లాస్థాయి నాయకులే ప్రచారం చేస్తారు.



జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్థానిక ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా జరిగినప్పుడు కూడా ఆయన ప్రచారానికి వెళ్ళలేదు. స్థానిక నాయకత్వానికే బాధ్యత అప్పగించారు. చంద్రబాబు మాత్రం విస్తృతంగానే ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో బాబు సొంత నియోజకవర్గంలో ఉన్న నాలుగు జడ్‌పీ టీసీలు, నాలుగు మండల పరిషత్‌లు, ఒక మునిసిపాలిటీని కూడా గెలుచుకొని వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. 

బహుశా అప్పటి అవమానాగ్ని వారిని ఇప్పటికీ దహిస్తున్నట్టున్నది. ఇప్పుడు ఉపఎన్నికలు జరుగుతున్న రెండు స్థానాల్లో పులివెందుల మండల జడ్‌పీటీసీ కూడా ఒకటి. దీంతోపాటే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిచిన రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట స్థానం మరొకటి. ఈ రెండు స్థానాలనూ గెలవడం కోసం భూమ్యాకాశాలను ఏకం చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రయాసపడుతున్నది.

ప్రతిపక్ష పార్టీ అభిమానుల్లో, ఓటర్లలో భయోత్పాతం సృష్టించడానికి పాలక పార్టీ దాడులకు తెగబడటం, అధికార దుర్వినియోగానికి పాల్పడటం యథేచ్ఛగా జరిగిపోతున్నది. ఒక ఎమ్మెల్సీ సహా వైసీపీ నాయకులను టార్గెట్‌ చేసి మరీ దాడులు చేశారు. మేం లేకపోతే వాళ్ల తలలు తెగిపడేవని సాక్షాత్తూ డీఐజీ ర్యాంకు పోలీసు ఉన్నతాధికారే ప్రకటించారు. 

వైసీపీ వాళ్లపై హత్యాప్రయత్నం జరిగిందని స్వయంగా డీఐజీయే సాక్ష్యం చెబుతుంటే అరెస్టు చేసింది మాత్రం వైసీపీ కార్యకర్తలనే! ఇంత దారుణం జరుగుతుంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏం చేస్తు న్నట్టు? ఏదోరకంగా పాలక పార్టీని గెలిపించాలనే తాపత్రయంతో నాలుగు గ్రామాల పోలింగ్‌ బూత్‌లనే పక్క గ్రామాలకు మార్పించారు. 

ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఇటు వంటి మార్పులు అసాధారణం. ఈ గ్రామాల్లో అత్యధిక సంఖ్యలో వైసీపీ అభిమానులుంటారనీ, పొరుగూరుకు వెళ్ళి ఓటెయ్యడానికి వృద్ధులూ, అనారోగ్యంతో ఉన్నవారు ఆసక్తి చూపకపోవచ్చుననీ, కనుక ప్రతిపక్షం ఓట్లు తగ్గించవచ్చనీ పాలక పార్టీ ఆలోచన కావచ్చు. స్వతంత్రంగా వ్యవహరించ వలసిన ఎన్నికల సంఘం పాలక పార్టీ ఆదేశాలకు తలూపి నిర్హే తుకమైన ఇటువంటి నిర్ణయాలను తీసుకోవడం శోచనీయం.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంతవరకు 2024లో జరిగిన సాధారణ ఎన్నికలు ఎంత ప్రహసనంగా ముగిశాయో, కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహార శైలి ఎంత అనుమానాస్పదంగా ఉన్నదో తెలియజేసే ఉదంతాలు ఒక్కొక్కటే బయటకు వస్తు న్నాయి. ఈ అంశాలపై ఇటీవల వైసీపీ ప్రతినిధి బృందం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక నివేదికను ఇచ్చింది. 

ఇందులో ప్రధానంగా ఈవీఎమ్‌ల పనితీరుపై అనుమానాలకు కారణాలను వివరిస్తూ, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పేపర్‌ బ్యాలెట్‌ను పునరుద్ధరించే విషయాన్ని ఆలోచించాలని కోరారు. వైసీపీ బృందం ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వడానికి చాలాకాలం ముందటే ‘వోట్‌ ఫర్‌ డెమోక్రసీ’ (వీఎఫ్‌డీ) అనే స్వచ్ఛంద సంస్థ దేశవ్యాప్తంగా 2024 ఎన్నికల పోలింగ్, కౌంటింగ్‌ తీరు తెన్నులపై సునిశితమైన అధ్యయనం చేసి, 226 పేజీల నివే దికను విడుదల చేసింది. 

ఆ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, ఆధారాలతో సహా వాటిని నివేదికలో పొందుపరిచింది. ఎన్నికల సంఘం అనుమానాస్పద వ్యవహార శైలిని కూడా ఈ నివేదిక దుయ్యబట్టింది. నివేదికను విడుదల చేయడమే కాకుండా, మరో స్వచ్ఛంద సంస్థ (ఏడీఆర్‌)తో కలిసి ఢిల్లీలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలను వీఎఫ్‌డీ వెల్లడించింది.

వీఎఫ్‌డీ వంటి సంస్థల ఆరోపణలను ఎన్నికల సంఘం ఇప్పటివరకు ఖండించలేకపోయింది. దానిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా సాహసించలేకపోయింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పోలింగ్,
కౌంటింగ్‌ తీరుతెన్నులపై ప్రముఖ సెఫాలజిస్టు ఆరా మస్తాన్‌ వంటి వాళ్లు కూడా నిశితమైన పరిశీలన చేసి తమ అనుమానాలను ప్రకటిస్తున్నారు. 

ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనడానికి ఈ పరిశీలనలన్నీ కావలసినన్ని కారణాలను చూపెడుతున్నాయి. వాటన్నింటినీ క్రోడీకరించడం ఇక్కడ సాధ్యం కాకపోవచ్చు. కానీ నాలుగైదు ముఖ్యాంశాలను మాత్రం ప్రస్తావన చేయవచ్చు.

పోలయిన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు దేశవ్యాప్తంగా 4 కోట్ల 65 లక్షల పైచిలుకు ఎక్కువ ఉన్నాయనీ, దీని పర్యవ సానంగా దేశవ్యాప్తంగా 79 లోక్‌సభ స్థానాల ఫలితాలు తారు మారయ్యాయనీ వీఎఫ్‌డీ తేల్చింది. పోలింగ్‌ జరిగిన రోజు రాత్రి 8 గంటల తర్వాత ఈసీ విడుదల చేసిన తుది వోట్ల సంఖ్య కంటే కొన్ని రోజుల తర్వాత విడుదల చేసిన ఓట్ల సంఖ్య అసాధారణ రీతిలో పెరిగిపోవడంలోని ఔచిత్యాన్ని అది ప్రశ్నించింది. 

గతంలో ఎన్నడూ ఇటువంటి తేడా ఒక శాతాన్ని మించి రాలేదన్న విషయాన్ని గుర్తుచేసింది. వీఎఫ్‌డీ పరిశోధన ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో అనుమానాస్పద ఓట్ల పెరుగుదల 12.54 శాతం. 49 లక్షల పైచిలుకు ఓట్లని వీఎఫ్‌డీ తేల్చింది. వైసీపీ బృందం ఈసీకి సమర్పించిన నివేదికలో ఈ తేడా 51 లక్షలుగా పేర్కొంది. మొత్తం ‘లెక్కించిన’ ఓట్ల సంఖ్య నుంచీ, కూటమికి లభించిన మొత్తం ఓట్ల నుంచి ఈ ‘దొంగిలించిన’ ఓట్లను తీసివేసి లెక్కవేస్తే వైసీపీకి, కూటమికి చెరో 46 నుంచి 48 శాతం ఓట్ల వరకు వస్తాయి. 

2014 ఫలితాలకు ఇది దగ్గరగా ఉన్నది. అప్పుడూ మూడు పార్టీలు కూటమిగా ఉన్నాయి. అప్పుడూ చంద్రబాబు అలవికాని హామీలు ఇచ్చారు. ఇప్పుడు అంతకు మించిన హామీలను ఇచ్చారు. ఈ లెక్కలు కనీసం వాస్తవానికి కొంచెం దగ్గరగా కనిపిస్తున్నాయి.

పోలింగ్‌ ముగిసే సమయానికి 40–50 శాతంగా ఉన్న ఈవీఎమ్‌ల బ్యాటరీలు లెక్కింపు రోజున 99 శాతం ఉండటంపై చేసిన ఫిర్యాదుకు ఈసీ స్పందన విచిత్రంగా ఉన్నది. ఫిర్యాదు చేసిన ఈవీఎమ్‌ల జోలికి వెళ్ళకుండా కొత్త మెషీన్లతో మాక్‌ పోలింగ్‌ జరిపి చూసుకోమన్నారు. సుప్రీంకోర్టు ఆదేశించినా మైక్రో కంప్యూటర్లలో నిక్షిప్తమైన అసలైన సమాచారాన్ని తనిఖీ చేయడానికి అంగీకరించలేదు. 

ఐదు శాతం వీవీ ప్యాట్ల లెక్కింపునకు అంగీకరించలేదు. పైగా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ)ని మార్చి, కౌంటింగ్‌ ముగిసిన నెలరోజుల తర్వాత సరికొత్త ఎస్‌ఓపీని విడుదల చేశారు. వీవీ ప్యాట్లనూ ధ్వంసం చేసి ఓడిపోయిన అభ్యర్థులు కోర్టును ఆశ్రయించకుండా వ్యూహా త్మకంగా ఈసీ వ్యవహరించింది. 

అన్నిటినీ మించి, బూత్‌ల వారీ ఓటింగ్‌ వివరాలతో అభ్యర్థులకు ఇవ్వవలసిన ఫామ్‌–20ని మూడున్నర నెలల వరకు ఎన్నికల సంఘం అప్‌లోడ్‌ చేయక పోవడం తీవ్రమైన అనుమానాలకు దారి తీసింది. పోలింగ్‌ సమయం ముగిసిన తర్వాత కూడా జాతరను తలపించేవిధంగా ఓటర్లు బారులు తీరినందువల్లనే ఈ అసాధారణ పెరుగుదల అని నమ్ముదామంటే సీసీ టీవీ ఫుటేజిలను కూడా ఎన్నికల సంఘం అందుబాటులో లేకుండా చేసింది.

కర్ణాటకలోని మహదేవ్‌పూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో తాము చేసిన పరిశీలన ఫలితాలను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇటీవలనే ప్రకటించారు. అవకతవకలపై పక్కా ఆధారాలను ఆయన మీడియాకు చూపెట్టారు. జరిగిన గోల్‌మాల్‌ వ్యవహారానికి ఈ అంశాలు కొత్త కోణాలు. పెద్ద ఎత్తున డూప్లికేట్‌ ఓట్లున్నాయనీ, ఫేక్‌ అడ్రస్‌లున్నాయనీ, ఒకే అడ్రస్‌పై డజన్లకొద్దీ ఓట్లున్నాయని ఆధారాలతో సహా ఆయన ప్రదర్శించారు. 

కొత్త ఓటర్ల నమోదుకు ఉద్దేశించిన ఫామ్‌–6 దుర్వినియోగంపై కూడా ఆయన సాక్ష్యాలను బయటపెట్టారు. ప్రతిపక్ష నేత ఆరోపణలపై సరైన రీతిలో స్పందించకపోగా, రాహుల్‌గాంధీని ప్రమాణం చేయాలని ఈసీ కోరడం ఒక విడ్డూరం. ఎన్నికల సంఘం అంపశయ్యపైకి చేరిందనీ, మన ప్రజాస్వామ్యానికి ప్రమాదం ముంచుకొస్తుందనీ అనడానికి ఈ పరిణామాలే నిదర్శనాలు. రాజకీయ వ్యవస్థలతోపాటు, ప్రజాస్వామ్య ప్రియులు, పౌర సమాజాలు గొంతెత్తి ప్రతిఘటించకపోతే మనం భారీ మూల్యం చెల్లించవలసి రావచ్చు.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement