ఏడాదిన్నరలోనే చంద్రబాబు సర్కారు నిర్వాకం
తాజాగా 7.54 శాతం వడ్డీతో రూ.4 వేల కోట్ల రుణం
అలాగే మార్క్‌ఫెడ్ ద్వారా మరో రూ.1,200 కోట్ల అప్పు
బడ్జెట్ బయట, లోపల అప్పులు చేయడంలో రికార్డు
బడ్జెట్ అప్పులే రూ.1,65,637 కోట్లకు చేరిక
బడ్జెట్ బయట అప్పులు మరో రూ.1,27,632 కోట్లు
ఇన్ని చేసినా ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఎగనామం
సంపద సృష్టి దేవుడెరుగు.. ప్రజలపై భారీగా రుణ భారం
ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్‌పరం చేయడమే లక్ష్యంగా బాబు పాలన
సాక్షి, అమరావతి: బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఎడాపెడా అప్పు...! భారీగా రుణాలు తీసుకుంటూ ప్రజలపై పెనుభారం..! సంపద సృష్టించడం దేవుడెరుగు... ఉన్న ఆస్తులు ప్రైవేటుపరం...! ఇదీ చంద్రబాబు ప్రభుత్వ పనితీరు..! ఏడాదిన్నరలో ఏకంగా రూ.2.93 లక్షల కోట్లు అప్పులు చేసి ఆయన రికార్డుల మీద రికార్డు సృష్టిస్తున్నారు. రాష్ట్ర సర్కారు మంగళవారం బడ్జెట్ లోపల 7.54 శాతం వడ్డీతో రూ.4 వేల కోట్ల రుణం తీసుకుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఈ మొత్తాన్ని ఆర్‌బీఐ సమకూర్చింది. దీంతో బడ్జెట్ లోపలే బాబు సర్కారు రూ.1,65,637 కోట్లు అప్పు చేసినట్లయింది. ఇక బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు, రాజధాని పేరుతో మరో రూ.1,27,632 కోట్లు అప్పు చేశారు. ఇందులో కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో రూ.80,245 కోట్లు రుణం తీసుకున్నారు. మరోపక్క రాజధాని పేరుచెప్పి ప్రపంచ బ్యాంక్, జర్మనీ సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ, హడ్కో, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ), ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీఎఫ్‌సీఎల్), నాబార్డు నుంచి ఏకంగా రూ.47,387 కోట్లు అప్పు చేసింది.
సంపద లేదు అప్పే..!
చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర సంపద పెంచడంలో, కొత్త సంపద సృష్టించంలో విఫలమైంది. భారీగా అప్పులు చేస్తూ ప్రజలపై కొత్తగా అప్పుల భారాన్ని మోపుతున్నారు. బడ్జెట్ లోపల, బయట ఇష్టానుసారం అప్పులు చేస్తున్నప్పటికీ సూపర్ సిక్స్‌లో కీలకమైన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పథకాలను అమలు చేయకుండా ఎగనామం పెట్టారు. చేసిన అప్పులతో ఆస్తులు సృష్టించకపోగా... గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన 17 మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేట్‌పరం చేస్తోంది. వాస్తవానికి అప్పులను ఆస్తుల కల్పనపై వెచ్చించాలి. ఇదే విషయాన్ని ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు పదేపదే నొక్కిచెప్పారు. కానీ, అధికారంలోకి వచ్చాక మాత్రం దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ రంగంలో ఆస్తులను కల్పించగా చంద్రబాబు సర్కారు ప్రైవేట్‌పరం చేస్తోంది. మరోవైపు చేసిన అప్పులను మెడికల్ కాలేజీల్లో మిగిలిన నిర్మాణాలకు వ్యయం చేయడం లేదు.
కళ్లు మూసుకుపోయిన ఎల్లోమీడియా...
కేవలం ఏడాదిన్నర పాలనలోనే చంద్రబాబు సర్కారు రూ.2.93 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినా ఎల్లో మీడియాకు కనిపించడం లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో లేని అప్పులను కూడా ఉన్నట్లు తప్పుడు సమాచారం వ్యాప్తి చేసింది పచ్చ మీడియా. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారంటూ దుష్ప్రచారం చేసింది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడి 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగానే వైఎస్సార్‌సీపీ సర్కారు అప్పులు చేసినా రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ చంద్రబాబు, ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది. ఇప్పుడు చంద్రబాబు రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు చేస్తున్నా ఎల్లో మీడియాకు కనిపించకపోతుండడం గమనార్హం.


