బాబు.. బాదుడే బాదుడు | Chandrababu Govt imposing heavy burden of taxes on People under new names | Sakshi
Sakshi News home page

బాబు.. బాదుడే బాదుడు

Dec 30 2025 5:16 AM | Updated on Dec 30 2025 5:16 AM

Chandrababu Govt imposing heavy burden of taxes on People under new names

కొత్త కొత్త పేర్లతో పన్నుల మోత మోగిస్తున్న చంద్రబాబు 

తాజాగా వాహన కొనుగోళ్లపై 10శాతం భారీ సెస్‌ విధింపు

ఏటా రూ.270 కోట్ల మేర రాష్ట్ర ప్రజల జేబులకు చిల్లు 

ఇటీవలి వరకు వాహనాల లైఫ్‌ ట్యాక్స్‌లో 28 శాతం జీఎస్టీ.. శ్లాబ్‌ల సరళీకరణలో దానిని 18 శాతానికి తగ్గించిన కేంద్రం 

కానీ, ఇంతలోనే 10% సెస్‌తో బాబు సర్కారు బాదుడు 

ఇప్పటికే భూ క్రయవిక్రయాలపై రిజిస్ట్రేషన్‌ చార్జీల రెట్టింపు 

ఏడాదిన్నరలో రూ.17,349 కోట్ల విద్యుత్‌ చార్జీల పెంపు.. 

తాగునీటిపై రూ.1,036.97 కోట్ల యూజర్‌ చార్జీల మోత

బాబు ప్రభుత్వ నిర్వాకంతో ప్రజలపై పెను ఆర్థిక భారం

విద్యుత్‌ చార్జీల వీర బాదుడు...భూముల క్రయవిక్రయాలపై రిజిస్ట్రేషన్‌ చార్జీల అదనపు మోత... తాగునీటిపై ఎప్పుడంటే అప్పుడు యూజర్‌ చార్జీల భారం! ఇవన్నీ చాలదన్నట్లు వాహనాల కొనుగోలుపై భారీగా సెస్‌ విధింపుతో సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలపై మళ్లీ పన్ను బాదుడుకు సిద్ధమయ్యారు. వివిధ పేర్లతో అన్ని వర్గాల వారిపై పన్నుల మోత మోగిస్తున్న ఆయన ఈసారి వాహనదారులను లక్ష్యంగా చేసుకున్నారు. ఏడాదిన్నర కిందట అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజలపై ఎడాపెడా పన్నుల బాదుడే లక్ష్యంగా సాగుతోంది బాబు ప్రభుత్వ పాలన. అదనపు పన్నుల మోతతో వీలున్న ప్రతి రంగంలోనూ జనం జేబులకు చిల్లులు పెడుతూ వస్తున్నప్పటికీ చంద్రబాబు శాంతించలేదు. తాజాగా మంత్రివర్గ సమావేశం వేదికగా మరో రుసుముల కొరడా ఝళిపించారు. తన మార్కు బాదుడుకు ఇదే నిదర్శనం అని చాటారు.  

సాక్షి, అమరావతి: అంతుపొంతు లేకుండా సాగుతున్న చంద్రబాబు సర్కారు  పన్నుల మోత రాష్ట్ర ప్రజలపై పెనుభారంగా మారుతోంది. ఈ క్రమంలో ఆర్థికంగా కుంగదీసే మరో బాదుడుకు సిద్ధమైంది. వాహనాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఊరటను రాష్ట్ర ప్రజలకు లేకుండా చేస్తోంది. ‘‘రహదారి భద్రత సెస్‌’’ పేరిట ఏటా ఏకంగా రూ.270 కోట్లు బాదేయనుంది. యథా­ప్రకారం ఇందులో సరికొత్త దోపిడీకి తెరవెనుక పావులు కదుపుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో విక్రయించే వాహనాలపై 10 శాతం రహ­దారి భద్రత సెస్‌ వేయాలని బాబు సర్కారు నిర్ణయించింది. వాహనాల లైఫ్‌ ట్యాక్స్‌లో ఈ సెస్‌ విధించాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించింది. అందుకోసం ఆర్డినెన్స్‌ జారీ చేస్తామని ప్రకటించింది. దాదాపు పదేళ్లుగా వాహనాల లైఫ్‌ ట్యాక్స్‌లో 28 శాతం జీఎస్టీ విధించేవారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను సరళం చేసింది. వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. దీంతో కాస్త ఊరట లభించిందని రాష్ట ప్రజలు భావించారు. కానీ, ఈలోపే వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్‌తో చంద్రబాబు పన్నుల కొరడా ఝళిపించారు.

ప్రభుత్వం చెప్పిన అధికారిక లెక్కలు ప్రజలపై పడనున్న భారీ ఆర్థిక భారాన్ని స్పష్టం చేస్తు­న్నాయి. రాష్ట్రంలో ఏటా 73 వేల వాహనాలను విక్రయి­స్తారు. వాటిపై లైఫ్‌ ట్యాక్స్‌లో 10 శాతం సెస్‌ వేస్తే నెలకు రూ.22.50 కోట్లు కానుంది. ఆ ప్రకారం వాహన కొనుగోలుదారులపై ఏటా రూ.270 కోట్లు పన్ను మోత మోగనుంది. స్కూటర్ల నుంచి లారీల వరకు మున్ముందు వాహన విక్రయాలు పెరిగితే అందుకు తగినట్లే పన్ను భారం పెరుగుతుంది.

రహదారి భద్రత ముసుగే... దోపిడీయే అసలు కథ
చంద్రబాబు ప్రభుత్వం వేసిన రహదారి భద్రత సెస్‌ అనేది దోపిడీ ఓ ముసుగు మాత్రమేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎలాగంటే... సెస్‌ బాదుడు ద్వారా వచ్చిన నిధులను ఎలా వెచ్చిస్తామన్నది మంత్రులు వెల్లడించలేదు. అంటే, సెస్‌ ద్వారా వచ్చిన మొత్తాన్ని దారిమళ్లిస్తారని పేర్కొంటున్నారు. రహదారి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను అందుకోసం ఖర్చు చేయని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హోం, వైద్యఆరోగ్య, ఆర్‌అండ్‌బీ శాఖల సంయుక్త కమిటీల ద్వారా నిధులను వెచ్చించాల్సి ఉండగా, ఆ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాటించడమే లేదు. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం సెస్‌ పేరిట ఏటా వసూలు చేసే రూ.270 కోట్లను సద్వినియోగం చేస్తుందనే నమ్మకం ఏమాత్రం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పెద్దలు అస్మదీయులకు అడ్డదారిలో కాంట్రాక్టు పనుల పేరిట దోచిపెడతారని ఆరోపిస్తున్నారు.

రిజిస్ట్రేషన్ల చార్జీలు 50 శాతం పెంపు
చంద్రబాబు ప్రభుత్వం గత సంవత్సరం రిజిస్ట్రేషన్‌ చార్జీలను భారీగా పెంచింది. ప్రజలపై సుమారు రూ.వెయ్యి కోట్ల భారంపడింది. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువలను 50 నుంచి 60 శాతం పెంచారు. అర్బన్‌ ప్రాంతాల్లో దీని ప్రభావం తీవ్రంగా కనిపించింది. భూముల విలు­వతో పాటు నిర్మాణాల విలువను అమాంతం పెంచి రిజిస్ట్రేషన్‌ చార్జీలు దండుకుంటున్నారు. పూరిళ్లు, రేకుల షెడ్లు, పెంకుటిళ్లు, గోడలు లేని ఇళ్లను కూడా వదలకుండా విలువను పెంచారు. ఫలితంగా అపా­ర్టుమెంట్లలో ఫ్లాట్లు, ఇళ్లు కొన్నవారిపై భారంపడింది. భూముల విలువ పెంపును తక్కువగా చూపేందుకు ప్రస్తుతం భూముల క్లాసిఫికేషన్లను మార్చేశారు. దీంతో ఏరియాను బట్టి కాక స్థలాన్ని బట్టి రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరిగిపోయాయి. గతంలో చార్జీలు రూ.2 లక్షలు ఉండగా, రూ.50 వేల వరకు పెరిగాయి.


బాబు వస్తూనే బాదుడు మొదలు
‘‘అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచేది లేదు. అవసరమైతే తగ్గిస్తాం. వినియోగదారులే విద్యుత్‌ అమ్ముకునేలా చేస్తాం’’ అంటూ ప్రగల్భాలు పలి­కారు చంద్రబాబు. ఇంతలా నమ్మబలికిన ఆయన అధికారం చేతికి రాగానే అసలు స్వభావం బయట­పెట్టు­కున్నారు. బాబు వస్తూనే రూ.15,485.36 కోట్ల భారీ భారాన్ని ప్రజలపై వేసి చార్జీల బాదుడుకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది చివరి నుంచే రూ.6,072.86 కోట్లను వసూలు చేస్తుండగా, ఈ ఏడాది జనవరి బిల్లు నుంచి మరో రూ.9,412.50 కోట్ల భారాన్ని జోడించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది వసూలు చేసిన రూ.2,787.18 కోట్లలో రూ.1,863.64 కోట్లకు ఏపీ­ఈఆర్‌సీ అనుమతి లభించింది. 

అంటే, బాబు ప్రభు­త్వం ఏర్పాటైన ఏడాదిలోనే ఏకంగా రూ.17,349 కోట్ల భారం ప్రజలపై మోపినట్లైంది. దీంతో ప్రజ­లకు కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయి. రూ.వేలల్లో వస్తున్న బిల్లులపై ప్రజలు మండిపడుతున్నా, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా బాబు ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదు, సరికదా ఇంకా చార్జీల భారం వేస్తూనే ఉంది. దీంతో వాడిన విద్యుత్‌కు సమానంగా అదనపు చార్జీలు పడుతు­న్నాయి. ఇంతలేసి బిల్లులు కట్టలేం బాబూ అంటూ జనం గగ్గోలు పెడుతూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు.

తాగునీటిపై యూజర్‌ చార్జీలు అనుకున్నప్పుడు అమలు!
గ్రామాల్లో ప్రజలు తాగేందుకు రక్షిత పథకాల ద్వారా సరఫరా చేసే నీటిపైనా యూజర్‌ చార్జీలు వసూలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లోని సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు, బోర్ల నిర్వహణ, మరమ్మతులకు ఏడాదికి రూ.1680.29 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి, అందులో రూ.1,036.97 కోట్లను ప్రజల నుంచి యూజర్‌ చార్జీలుగా పిండుకోవాలని చూస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికకు రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదం తెలిపి, ‘ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ’ పాలసీ రూపొందించి నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. 

దీనిప్రకారం రెండు కంటే ఎక్కువ గ్రామాలకు ఒకే రక్షిత మంచినీటి పథకం ద్వారా నీటి సరఫరా జరిగేచోట ఒక్కో వ్యక్తిపై నెలకు రూ.26.66 చొప్పున ఏడాదికి రూ.320 భారం మోపనున్నారు. గ్రామ పరిధిలో అంతర్గతంగా చిన్న రక్షిత తాగునీటి పథకం ఉన్నచోట ఒక్కొక్కరి నుంచి నెలకు రూ.20 వంతున ఏడాదికి రూ.240 యూజర్‌ చార్జీ వసూలు చేయాలని నిర్ణయించారు. కాగా, ‘‘ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ’’ పాలసీకి యూజర్‌ చార్జీల వసూలు ఎప్పటినుంచి అన్నది ప్రత్యేకంగా పేర్కొనలేదు. కానీ, నోటిఫికేషన్‌ ప్రభుత్వ జీవో రూపంలో జారీ అయినందున ఎప్పుడనుకుంటే అప్పటినుంచి యూజర్‌ చార్జీల వసూలు ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement