
‘ఏదయా మీ దయా మా మీద లేదు... ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు’ అని స్కూలు పిల్లలు... అయ్యవార్లు తమవెంట రాగా ఇంటింటి ముందు పాడటం ముగించి, ‘జయీభవ... విజయీభవ’ అని గాఠ్ఠిగా నినదించి, సిద్ధంగా ఉంచుకున్న బాణాలను వాకిలి మీదకు సంధిస్తారు. ఆ బాణాలకు ఆకులు, పువ్వులు కట్టి ఉండటం వల్ల అవన్నీ రాలి వాకిలి ఆకుపచ్చటి కాంతులీనుతుంది. ఏ ఇల్లయినా పచ్చగా బతకడానికి మించిన విజయం ఏముంటుంది సంఘంలో? దసరా ఆకాంక్ష అది.
తెలంగాణలో పండగనాడు ఆకులు నిండిన జమ్మికొమ్మను ఊరిలోకి తెచ్చి, నాటి, పూజ చేస్తారు. పూజ చాలాసేపు సాగినా ప్రజలు ఓపికగా ఉండి, ముగిశాక భక్తి ప్రపత్తులతో జమ్మి ఆకులను తీసుకుని, ఒకరికొకరు ఇచ్చుకుని అలాయి బలాయి చెప్పుకుంటారు. ఎంతో సంతోషభరితమైన సన్నివేశం అది. జమ్మి ఆకును ‘జమ్మి బంగారం’ అంటారు. పాండవులు తమ ఆయుధాలను దాచడానికి యోగ్యంగా భావించిన జమ్మిచెట్టు, జమ్మి ఆకు విజయానికీ, శుభానికీ చిహ్నం. జీవితంలో ఎదురయ్యే అపజయాలను ఎదుర్కొని జయం పొందడం, చెడును తరిమి శుభానికి స్వాగతం చెప్పడం దసరా ఆకాంక్ష.
మనిషి పర్యావరణాన్ని కాపాడుకుంటే అది మనిషిని కాపాడుతుంది. భూతలం మీద ఇద్దరిదీ కదా హక్కు. దసరానాడు ఆకాశవాసం చేసే పక్షులకు కృతజ్ఞత చెప్పే ఆనవాయితీ ఉంది. తెలంగాణలో పాలపిట్టను దర్శించడం అత్యంత శుభసూచకం. పండుగ రోజు ఊరి యువకులు ఊరి చుట్టూ తిరుగుతూ, వాగులూ వంకల్లో, అడవుల వరకూ వెళ్లి కొమ్మలపై గుట్టుగా ఉన్న పిట్టలను ‘పాలా.. పాలా.. ’ అని పిలుస్తూ చప్పట్లు చరిచి ఎగిరేలా చేస్తారు. ఆ ఎగిరిన పక్షుల్లో పాలపిట్టను పోల్చి, దర్శించుకుని సంతోషపడతారు. కాని పాలపిట్ట కనపడటం అంత సులభం కాదు.
విజయం మాత్రం సులభంగా దక్కుతుందా? ప్రయత్నం సాగించాలి. ఆశావహ దృక్పథంతో ప్రయత్నం సాగించమని చెప్పేది కూడా దసరా ఆకాంక్ష. తీరొక్క పూలతో బతుకమ్మను అలంకరిస్తే ఆ పూల అమరికలోని సౌందర్యమే కడు శుభసూచకం. పూలు పూసే చెట్లున్నాయంటే ఊరిలో సజీవత, వర్ణాలు ఉన్నట్టే. ఇక బతుకమ్మ చుట్టూ తిరిగి పాటలు పాడటం జీవన భ్రమణాన్ని అంగీకరించి కొనసాగించడం. బృందం లేకుండా భ్రమణం సాగదు. సాటి మనిషిని తోడు చేసుకుని జీవనాన్ని జయించమనడం దసరా ఆకాంక్షే.
‘స్త్రీలతో నాకు భయం లేదు. పురుషుడి చేతిలో మరణం లేని వరమివ్వు’ అని కోరాడు మహిషాసురుడు. ఈ పురుష అహమే మహిషత్వం. పశుత్వం. అందుకే శక్తి స్వరూపిణి అయిన జగన్మాత తొమ్మిది రోజులు పద్దెనిమిది బాహువులతో మహిషాసురుడిపై విరుచుకుపడింది. మహిషారుసురుడిని అంతమొందించడం అంటే పురుషాహంకారాన్ని అంతమొందించడం. కాని మనిషి గుణంలో మరుపు ఉంటుంది. వెనుకటి పాఠాలను మరచి పాత పాటనే పాడుతుంటుంది. అందుకే ప్రతి ఏటా నవరాత్రులు వస్తాయి. ప్రతి ఏటా స్త్రీ శక్తిని చాటుతాయి. ప్రతి ఏటా మనిషిలోని సకల అహాలను హెచ్చరిస్తాయి. ప్రకృతి ముందు మనిషి శక్తి ఏపాటి?
కాస్తంత వినమ్రుడవై ఉండటం కూడా విజయమే అని చాటడం దసరా ఆకాంక్ష. పిల్లా పాప, చెట్టూ చేమా, గోడ్డూ గోదాలతో ఆకాశం నుంచి కురిసే వాన, భూమిన పండే పంట... వీటితో సుఖంగా బతకవలసిన మనిషి... అలా బతికేందుకు విశ్వగతులు, ప్రకృతి శక్తులు సకల సహకారాలు అందిస్తుండగా తల ఎగరేస్తూ తనకు తానే ఎన్నో మహిషాసురులను సృష్టించుకుంటున్నాడు. గిల్లికజ్జాలు, తకరార్లు, ఆధిపత్య ధోరణి, ఈర‡్ష్య, అసూయ, ఆడంబరం, విద్వేషం, తీవ్ర వ్యసనాలు, మూఢ విశ్వాసాలు, మూక స్వభావం... ఎన్నెన్ని ఇవాళ పచ్చటి ఇంటికి నిప్పు పెడుతున్నాయో, స్వీయ మనోదేహాలకు ఖేదం కలిగిస్తున్నాయో నిత్యం ప్రసార మధ్యమాలు చూపుతూనే ఉన్నాయి. అయినా సరే దున్నపోతు మీద వర్షం కురిసిట్టే ఉంటోంది.
వివేచన లేని చోట అసురత్వం, అసురత్వం వెంట చీకటి, చీకటి నుంచి ఓటమి, ఓటమి నుంచి దుఃఖం ఈ జీవన భ్రమణమా? తీరొక్క పూల బతుకమ్మ పాట వంటి జీవన భ్రమణమా? ఏది కావాల్సింది? హేతువు కలిగిన హితంలోకి, వికాసానికి పాదుకొలిపే జ్ఞానంలోకి మనిషి జాగరూకుడై నడిచిననాడు, ఫుస్తకాన్ని జమ్మి బంగారంలా పంచుకున్ననాడు... ప్రతి జాతి ముంగిట్లోకి, ప్రతి ఇంటి వాకిట్లోకి విజయాలు పిల్లల నవ్వుల్లా వచ్చి పడతాయి. ధ్వానాలు వెల్లువెత్తుతాయి. జయీభవ... విజయీభవ!