
సొంతూళ్లకు పయనమైన నగర వాసులు
7,754 ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ
హైదరాబాద్ నుంచి వందకు పైగా ప్రత్యేక రైళ్లు
వారం రోజుల పాటు కొనసాగనున్న రద్దీ
సాక్షి,హైదరాబాద్: దసరా రద్దీ మొదలైంది. విద్యాసంస్థలు సెలవులు ప్రకటించడంతో నగర వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో నగరం నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే బస్సులు, రైళ్లలో ఆదివారం ప్రయాణికుల రద్దీ పెరిగింది. మరో వారం రోజుల పాటు ప్రయాణికుల రద్దీ కొనసాగనుంది. ఆర్టీసీ బస్సులు, రైళ్లతో పాటు ప్రైవేట్ బస్సులు, సొంత వాహనాల్లోనూ జనం పల్లెబాట పట్టారు. ప్రయాణికుల రద్దీకనుగుణంగా ఈసారి ఆర్టీసీ 7754 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలు రూపొందించింది.
మరోవైపు సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల డిమాండ్ మేరకు 100 రైళ్లను అదనంగా నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది. ప్రయాణికుల రద్దీ మేరకు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసి బెర్తుల సంఖ్యను పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. రెగ్యులర్ రైళ్లన్నింటిలోనూ ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్ వందల్లోకి చేరింది. దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి వంటి వరుస పండుల సీజన్ దృష్ట్యా రైళ్లకు భారీ డిమాండ్ నెలకొంది. ఫిబ్రవరి వరకు పలు రైళ్లలో 150 నుంచి 200 వరకు వెయిటింగ్ లిస్ట్ దర్శనమివ్వడం గమనార్హం.
నగర శివార్ల నుంచే..
బతుకమ్మ, దసరా పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకొని 7,754 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. సుమారు 377 స్పెషల్ సరీ్వసులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కలి్పంచారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా. ఈ మేరకు నగర శివార్ల నుంచే ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఉప్పల్, ఎల్‌బీనగర్, హయత్‌నగర్, సాగర్‌రింగ్ రోడ్డు, మెహిదీపట్నం, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి బస్సులు బయలుదేరనున్నాయి. మరోవైపు హాస్టళ్లలో ఉండే విద్యార్థులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు వీలుగా బస్సులను నేరుగా హాస్టళ్ల నుంచి ఆయా జిల్లా కేంద్రాలకు నడిపేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. దసరా ప్రత్యేక బస్సుల్లో 25 శాతం నుంచి 50 శాతం వరకు అదనపు చార్జీలు విధించనున్నారు. అన్ని రెగ్యులర్ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళా ప్రయాణికులకు యథావిధిగా ఉచిత ప్రయాణ సదుపాయం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
చర్లపల్లి నుంచే ఎక్కువ రైళ్లు..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనుల దృష్ట్యా పలు రెగ్యులర్ రైళ్లతో పాటు ప్రత్యేక సరీ్వసులను చర్లపల్లి నుంచి నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఇవి కాకుండా యథావిధిగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే రైళ్ల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ సిబ్బందిని అదనంగా ఏర్పాటు చేశారు. సాధారణ బోగీల్లో బయలుదేరే ప్రయాణికులు టికెట్‌ల కోసం పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా యూటీఎస్ మొబైల్ యాప్ సదుపాయాన్ని స్టేషన్‌లోని వివిధ చోట్ల అందుబాటులో ఉంచారు. అధికారులు ఎంపిక చేసిన కొంతమంది సిబ్బంది మొబైల్ స్కానర్లు కలిగిన జాకెట్‌లను ధరించి ప్రయాణికుల వద్దకు వచ్చేవిధంగా ఏర్పాటు చేశారు. దీంతో టికెట్ కౌంటర్‌ల వద్ద క్యూలైన్‌లలో పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండదని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు.