
వచ్చే నెల నుంచే కొత్త విలువలు అమల్లోకి?
ఆదాయం పెంపే లక్ష్యంగా రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు
ఖాళీ స్థలాల విలువలు 150 శాతం మేరకు పెరిగే చాన్స్
అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్ల విలువలు కూడా 50 శాతం పెరుగుదల
వ్యవసాయ భూముల కనీస విలువ ఎకరం రూ.3 లక్షలుగా ఖరారు
విలువల సవరణ కోసం సబ్ రిజిస్ట్రార్లకు ప్రత్యేక ఫార్మాట్ పంపిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల విలువలు భారీగా పెరగనున్నాయి. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మరోమారు కసరత్తు చేపట్టింది. ఖాళీ స్థలాల విలువలు 150 శాతం వరకు, అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్ల విలువలు 50 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. అలాగే వ్యవసాయ భూముల కనీస విలువ ఎకరం రూ.3 లక్షలకు పెరుగుతుందని సమాచారం. నివాస (రెసిడెన్షియల్), వాణిజ్య (కమర్షియల్) ప్రాతిపదికన వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలను భారీగా సవరించే కసరత్తు ఇప్పటికే ప్రారంభమవగా, రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్లందరూ రెండు రోజులుగా ఇదే పనిలో నిమగ్నమయ్యారు.
ఆదాయ వనరుల పెంపు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఇటీవల స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పనితీరును సమీక్షించింది. ఆదాయ పెంపు ప్రతిపాదనలను 15 రోజుల్లో ప్రభుత్వానికి పంపాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే మరోమారు భూముల విలువల సవరణ కసరత్తు జరుగుతోంది. నాలుగైదు రోజుల్లోనే కొత్త విలువల ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్తాయని, వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఈ విలువలు అమల్లోకి వస్తాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెపుతున్నాయి.
ప్రత్యేక ఫార్మాట్ పంపిన ఉన్నతాధికారులు
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) లోపలి భాగంలో ఉన్న కోర్ అర్బన్ ఏరియాలోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో విలువల సవరణ ప్రక్రియ ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చింది. ఈ ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. తాజాగా అర్బన్, సెమీ అర్బన్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని విలువల సవరణ కోసం క్షేత్రస్థాయిలోని సబ్ రిజిస్ట్రార్లకు ఉన్నతాధికారులు ప్రత్యేక ఫార్మాట్లు పంపారు. ఈ ఫార్మాట్‌లో భూముల విలువలను సవరించేందుకు అనుసరించాల్సిన ప్రక్రియను వివరించారు.
నేడో, రేపో సబ్ రిజిస్ట్రార్ల ప్రతిపాదనలు
ఉప సంఘం సమీక్షా సమావేశం ముగిసిన మరుసటి రోజే రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు రాష్ట్ర కార్యాలయంలోని ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. మరుసటి రోజు రాష్ట్రంలోని అందరు సబ్ రిజిస్ట్రార్లతో ఆన్‌లైన్‌లో సమావేశమై భూముల విలువల సవరణకు సంబంధించిన మార్గదర్శకాలను వివరించారు. దీంతో సబ్ రిజిస్ట్రార్లంతా నేడో, రేపో తమ ప్రతిపాదనలను మార్కెట్ వాల్యూ రివిజన్ కమిటీలకు సమర్పించనున్నారు. ఈ కమిటీలు ఆ ప్రతిపాదనలు పరిశీలించి జిల్లా కలెక్టర్‌కు పంపనున్నాయి. వాటిని కలెక్టర్లు పరిశీలించి ప్రభుత్వానికి పంపనున్నారు. ప్రభుత్వం ఆమోదించిన అనంతరం కొత్త విలువలు అమల్లోకి రానున్నాయి.
మహిళలకు స్టాంపు డ్యూటీ తగ్గింపు!
ప్రస్తుతం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కలిపి రాష్ట్రంలో 7.5 శాతం వసూలు చేస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో భూముల ప్రభుత్వ విలువలను పెంచినప్పుడు డ్యూటీలను తగ్గించడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే పద్ధతిని రాష్ట్రంలోనూ అమలు చేయాలని, స్టాంపు డ్యూటీ 1 శాతం తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే భూముల విలువల సవరణ ద్వారా రూ.2 వేల కోట్ల నుంచి రూ.2,500 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుండగా, స్టాంపు డ్యూటీ 1 శాతం తగ్గిస్తే రూ.1,000 కోట్ల వరకు ఆదాయం తగ్గే అవకాశం ఉండటంతో స్టాంపు డ్యూటీ తగ్గించాలా వద్దా అనే మీమాంస ప్రభుత్వ వర్గాల్లో కొనసాగుతోంది. అయితే మహిళల పేరిట రిజిస్ట్రేషన్లు జరిగితే స్టాంపు డ్యూటీ 1 శాతం తగ్గించే అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
విలువల సవరణ ప్రాతిపదికలివే..
వ్యవసాయ భూములు: 1) పూర్తిగా వ్యవసాయానికి మాత్రమే ఉపయోగపడేవి. 2) ఇండ్ల స్థలాలకు కూడా పనికి వచ్చేవి. 3) వ్యవసాయ భూములయినా, ఇండ్ల స్థలాలకు ఉపయోగపడేవి అయినా రాష్ట్ర, జాతీయ రహదారుల పక్కన ఉన్న భూములు.
వ్యవసాయేతర భూములు: 1) నివాసానికి ఉపయోగించే ఖాళీ స్థలాలు (రెసిడెన్షియల్). 2) రాష్ట్ర, జాతీయ రహదారులకు పక్కన ఉన్న స్థలాలు (కమర్షియల్). 3) అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లకు కూడా రెసిడెన్షియల్, కమర్షియల్ వర్తింపజేస్తారు. ఖాళీ స్థలాలు, అపార్ట్‌మెంట్లకు సంబంధించి బహిరంగ మార్కెట్‌లో ఎంత విలువ ఉందో అందులో 33–50 శాతం వరకు పెంచే వెసులుబాటు కల్పించారు. ఉదాహరణకు ప్రస్తుత ప్రభుత్వ విలువ గజానికి రూ.22,500 ఉన్న చోట బహిరంగ మార్కెట్ విలువ రూ.80 వేల వరకు ఉంటే అందులో 50 శాతం అంటే రూ.40 వేలు పెంచుకోవచ్చు. అదే బహిరంగ మార్కెట్‌లో ఆ భూమి గజం రూ.1.50 లక్షల వరకు ఉంటే దాన్ని రూ.50 వేల వరకు పెంచవచ్చని సబ్ రిజిస్ట్రార్లకు పంపిన ప్రత్యేక ఫార్మాట్‌లో పేర్కొన్నారు. ఖాళీ స్థలాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న విలువలో కనీసం 60 శాతం నుంచి 150 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయన్నమాట.