సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్. చిత్రంలో జగదీశ్‌రెడ్డి, కొప్పుల, సత్యవతి, సబిత, తలసాని, కేటీఆర్, మధుసూదనాచారి, హరీశ్‌రావు, పొన్నాల, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, బండా ప్రకాశ్, మల్లారెడ్డి
ఉద్యమ కార్యాచరణపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం
పార్టీ సంస్థాగత నిర్మాణంపైనా పలు సూచనలు
‘పాలమూరు’కు జరుగుతున్న అన్యాయంపై ప్రధానికి లేఖ రాయాలని నిర్ణయం
చేవెళ్ల, మల్లేపల్లితో పాటు మహబూబ్‌నగర్‌లో ఏదో ఒకచోట సభ
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ భవన్‌కు వచ్చిన బీఆర్‌ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. నందినగర్ నివాసం నుంచి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటినుంచి రాత్రి ఏడున్నరకు ఆయన తిరిగి వెళ్లేంత వరకు అక్కడ ఉత్సాహపూరిత సందడి వాతావరణం నెలకొంది. కాగా కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో సుమారు 450 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఎండగట్టేలా బీఆర్‌ఎస్ ఉద్యమ కార్యాచరణ చేపట్టడంతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ.. ఈ మూడు జిల్లాల్లో బహిరంగ సభల నిర్వహణ, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో దశల వారీగా చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాల తీరును వివరించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, నల్లగొండ జిల్లా మల్లేపల్లితో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలో ఏదో ఒక చోట బహిరంగ సభ నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తమైంది.
తొలుత మహబూబ్‌నగర్ జిల్లాలో సభను నిర్వహించేందుకు ఒకటి రెండు రోజుల్లో జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ అవుతారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మహబూబ్‌నగర్ సభను సంక్రాంతి లోపు నిర్వహించాలని నేతలు అభిప్రాయపడ్డారు. ‘పాలమూరు’కు జరుగుతున్న అన్యాయంపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని నిర్ణయించారు.
సభ్యత్వ నమోదులో డంబాచారం వద్దు
పార్టీ సభ్యత్వ నమోదును ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో చేయాలనే అంశంపై పార్టీ నేతల నుంచి కేసీఆర్ అభిప్రాయాలు కోరారు. రెండు విధానాల్లో సభ్యత్వ నమోదు చేయాలని, సభ్యత్వ నమోదుకు ఇన్‌చార్జిలను నియమించాలనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే పార్టీ సభ్యత్వ నమోదు పేరిట డంబాచారాలకు పోకుండా పార్టీ పట్ల నిబద్ధత ఉండే వారికే సభ్వత్యం ఇవ్వాలని కేసీఆర్ సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూలును సంక్రాంతి తర్వాత ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సభ్యత్వ నమోదు ఉచితంగా కాకుండా ఎంతో కొంత మొత్తాన్ని చెల్లించేలా నిబంధనలు ఉండాలని నేతలు సూచించారు. సభ్యత్వం తీసుకునే వారికి గుర్తింపు కార్డు ఇవ్వాలని నిర్ణయించారు.
ఎమ్మెల్యే కేంద్రంగా పనిచేయడంతో నష్టం!
ఎమ్మెల్యేలు కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు సాగడంతో కొంత మేర నష్టం జరిగిందనే అభిప్రాయాన్ని ఈ భేటీలో కేసీఆర్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు క్షేత్ర స్తాయిలో కేడర్‌తో సమన్వయంతో చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు సాధించిన పలితాపై కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేస్తూ వారికి అభినందనలు తెలిపారు.
పాతాళంలో దాక్కున్నా లాక్కొస్తాం
చెక్‌డ్యామ్‌ల పేల్చివేత అంశంపై స్పందిస్తూ.. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి న తర్వాత బాధ్యులు పాతాళంలో దాక్కున్నా లాక్కొస్తామని కేసీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ సహజ శైలిలో సాగిన ప్రసంగంలో ఆయన సీఎం రేవంత్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత 26 ఏళ్లుగా ప్రత్యర్థులు తన చావును కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ఇలావుండగా కేసీఆర్ రాకమునుపే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరుల స్తూపం వద్ద నివాళి అరి్పంచారు. కేసీఆర్ రాక సందర్భంగా తోపులాట చోటు చేసుకోవడంతో పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డికి స్వల్ప గాయం అయ్యింది. దీంతో ఆయన ఆసుపత్రికి వెళ్లి ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు.
అజ్మీర్ దర్గా ఉర్సుకు కేసీఆర్ చాదర్ సమర్పణ
సాక్షి, హైదరాబాద్: అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా ప్రతియేటా పార్టీ తరపున చాదర్ సమరి్పంచే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ కేసీఆర్ ఆదివారం చాదర్ అందజేశారు. మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, బీఆర్‌ఎస్ మైనారిటీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు వారి వైద్య విద్యకు అయ్యే ఫీజును కేసీఆర్ చేతుల మీదుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అందజేశారు. 15 మంది విద్యార్థులకు ఈ చెక్కులు అందజేశారు.


