యాదగిరిగుట్ట: తిరుమల తిరుపతి తరహాలో యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో వివిధ పూజలతో కూడిన నూతన సేవా కార్యక్రమాలు వైకుంఠ ఏకాదశి రోజు నుంచి నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వెంకట్రావ్ వెల్లడించారు. ఆదివారం యాదగిరి కొండపైన తన కార్యాలయంలో వైదిక కమిటీ, వివిధ విభాగాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈవో మాట్లాడారు. ప్రధానంగా యాదగిరి క్షేత్రంలో సహస్ర దీపాలంకార సేవ, తోమాల సేవ, తులాభారం సేవ, కొత్త వాహన సేవలైన సూర్యప్రభ వాహన సేవ, చంద్ర ప్రభ వాహన సేవలను నిర్వహించేందుకు సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సహస్ర దీపాలంకార సేవ ప్రతి నెలలో స్వాతి నక్షత్రం, ఏకాదశి రోజున దంపతులకు రూ.500 చొప్పున సాయంత్రం 6గంటలకు ఉంటుందన్నారు. తోమాల సేవ ప్రతి బుధవారం ఉదయం 6.15 గంటలకు రూ.500 టికెట్‌పై దంపతులకు ప్రవేశం ఉంటుందని తెలిపారు.
తులాభార సేవ రోజూ దర్శన సమయాల్లో ఉంటుందని, తూకం కొలిచేందుకు నాణేలు, బెల్లం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సూర్యప్రభ వాహన సేవ ప్రతి ఆదివారం, రథ సప్తమి రోజున ఉదయం 7 గంటల నుంచి 7.30 గంటల వరకు రూ.1000 టికెట్‌పై దంపతులకు ఈ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. చంద్ర ప్రభ వాహన సేవ ప్రతి పౌర్ణమి రోజు సాయంత్రం వేళ దంపతులకు రూ.1000 టికెట్‌తో ప్రవేశం ఉంటుందని వివరించారు. సహస్ర దీపాలంకార సేవ, తోమాల సేవ, తులాభారం సేవలను ఈ నెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశి నుంచి ప్రారంభిస్తామన్నారు. సూర్య ప్రభ వాహన సేవ, చంద్ర ప్రభ వాహన సేవలు ఫిబ్రవరి 2వ తేదీన మాఘ పౌర్ణమి రోజున ప్రారంభించనున్నట్లు తెలిపారు.
యాదగిరీశుడి సన్నిధిలో భక్తుల రద్దీ
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి 3గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. శ్రీస్వామి వారిని 40వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.


