విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేలా అడుగులు
డాలస్, టెక్సాస్ : భాషే రమ్యం .. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేలా అడాప్ట్ ఏ స్ట్రీట్ పేరుతో కార్యక్రమాన్నిచేపట్టి వీధులను శుభ్రం చేసింది. ఫ్రిస్కో నగరంలో ఫీల్డ్స్ పార్క్‌వేలో చెత్తను తీసేసి.. అక్కడ వీధిని శుభ్ర పరిచింది. దాదాపు 20 మందికి పైగా తెలుగు వారు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరిలో అవగాహన పెంచే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 25 పౌండ్లకు పైగా చెత్తను సేకరించి ఆ వీధిని బాగుచేసింది. ఈ కార్యక్రమం ద్వారా యువతలో పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతను, ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించే లక్ష్యాలు నెరవేరుతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్ధులకు సామాజిక బాధ్యతను నేర్పిస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకీ , పెద్దలకీ మరియు మద్దతు అందించిన దాతలకు నాట్స్ డాలస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ. శ్రావణ్ నిడిగంటిలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి సహ కోశాధికారి రవి తాండ్ర , మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె,డల్లాస్ చాప్టర్ జట్టు నుండి పావని నున్న, వంశీ వేనాటి, కిరణ్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. మానవతా విలువలకు ప్రాధాన్యతనిస్తూ ఈ తరహా సేవా కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తున్న డాలస్ చాప్టర్ బృందానికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి అభినందనలు తెలిపారు.