గాలికి ఎగిరిపోయిన టెన్త్‌ ఓఎంఆర్‌ షీటు | guntur constable saves students omr sheet during 10th exam | Sakshi
Sakshi News home page

గాలికి ఎగిరిపోయిన టెన్త్‌ ఓఎంఆర్‌ షీటు

Mar 17 2026 7:53 AM | Updated on Mar 17 2026 7:53 AM

guntur constable saves students omr sheet during 10th exam

తాడేపల్లి రూరల్‌: పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష రాస్తుండగా ఒక్కసారిగా గాలి రావడంతో ఓ వి­ద్యార్థి దగ్గర నుంచి ఆప్టికల్‌ మార్క్‌ రికగి్నషన్‌ (ఓఎంఆర్‌) షీటు ఎగిరిపోయింది. పది నిమిషాల వెతుకులాట అనంతరం దానిని ఓ కానిస్టేబుల్‌ పట్టుకుని ఇవ్వడంతో విద్యార్థి ఊపిరిపీల్చుకున్నాడు. తీవ్ర ఉత్కంఠ రేకెత్తించిన ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలో సోమవారం జరిగింది. తాడేపల్లి జిల్లా పరిషత్‌ పాఠశాలలో 10వ నంబర్‌ గదిలో తలుపు పక్కనే కూర్చుని ఓ విద్యార్థి పరీక్ష రాస్తున్నాడు. 

ఒక్కసారిగా గాలి ఎక్కువగా రావడంతో అతడి ఓఎంఆర్‌ షీటు కింద పడింది. దీంతో కంగారు పడిన ఆ విద్యార్థి జరిగిన విషయాన్ని అక్కడున్న ఉపాధ్యాయులకు చెప్పాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్‌ రవి..సూ్కల్‌ వెనుక భాగంలో వెతికినప్పటికీ ఓఎంఆర్‌ షీటు దొరకలేదు. అతడితో పాటు ఎగ్జామ్‌ సెంటర్‌ వద్ద వేచి ఉన్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా 10 నిమిషాల పాటు ఓఎంఆర్‌ షీటును వెతికారు. 

పాఠశాల బిల్డింగ్‌కు చిన్నపాటి సన్‌షేడ్‌ ఉండటంతో దానిపై ఉందేమోనని అనుమానంతో రవి వేరే బిల్డింగ్‌ ఎక్కి పరిశీలించగా అక్కడ ఓఎంఆర్‌ షీటు కనపడింది. వెంటనే ఆయన కిందకు దిగి పాఠశాలలో కర్రకు కట్టి వున్న చీపురు తీసుకుని కిందకు ఊడ్చాడు. బిల్డింగ్‌ వెనుక పెద్ద డ్రైనేజీ ఉండటంతో ఆ షీటు దానిలో పడుతుందని తల్లిదండ్రులు డ్రైనేజీపై నిలబడి ఓఎంఆర్‌ షీటును పట్టుకున్నారు. అనంతరం దాన్ని విద్యార్థికి ఇవ్వడంతో అతడు పరీక్ష రాశాడు.  

Advertisement
 
Advertisement
Advertisement