ఎన్‌ఎఫ్‌హెచ్‌సీ.. సేవల్లో భేష్‌ | Free training camps to be organized in government schools during summer | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎఫ్‌హెచ్‌సీ.. సేవల్లో భేష్‌

Apr 30 2025 5:10 AM | Updated on Apr 30 2025 5:34 PM

Free training camps to be organized in government schools during summer

సైంటిస్టు మూడావత్‌ మోహన్‌ ఆలోచనతో ఎన్‌ఎఫ్‌హెచ్‌సీ పౌండేషన్‌ ఏర్పాటు

15 ఏళ్లుగా పలు జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లో సేవలు 

పేద విద్యార్థులకు తోడ్పాటునందిస్తూ, పలు సేవా కార్యక్రమాలు 

పలు రంగాల నిపుణులతో నాలెడ్జ్‌ నెట్‌వర్క్‌ టీం ఏర్పాటు

సహకారం అందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు 

కేసముద్రం: రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు చేయూతనిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది నేషన్స్‌ ఫస్ట్‌ హ్యూమన్‌ చైన్‌ ఫౌండేషన్‌ (ఎన్‌ఎఫ్‌హెచ్‌సీ). ఫీజులు చెల్లించలేని విద్యార్థులకు ఆర్థికసాయం చేయడంతో పాటు వేసవికాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తూ, మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు, తాగునీటి ప్రాజెక్టుల ఏర్పాటు వంటి పలు సేవాకార్య క్రమాలతో ముందుకు వెళ్తూ అందరితో భేష్‌ అనిపించు కుంటోంది. 

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం తావుర్యా తండాకు చెందిన గిరిజన విద్యాకుసుమం, సైంటిస్ట్‌ మూడావత్‌ మోహన్‌కు వచ్చిన మంచి ఆలోచనతో ఏర్పాటైన ఎన్‌ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేషన్‌ (NFHC Foundation) ద్వారా తన తండా, చదువుకున్న గురుకుల పాఠశాల నుంచి మొదలుకుని, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని మారు మూల గ్రామాల వరకు సేవాకార్యక్రమాలను విస్తరించి, అందరి మన్నలను పొందుతు ఆదర్శంగా నిలుస్తున్నారు. 

తండా నుంచి సైంటిస్ట్‌గా..
తావుర్యాతండాకు చెందిన మూడావత్‌ భద్రునాయక్, శాంతి దంపతులకు కుమారుడు మోహన్, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మొదటి నుంచి ఆ దంపతులు వ్యవసాయం చేస్తూ పిల్లల్ని చదివిస్తూ వచ్చారు. మోహన్‌ చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తూ వచ్చాడు. ఈ క్రమంలో జిల్లాలోని గూడూరు మండలం దామరవంచ ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. అక్కడి గణిత ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్‌రావు ప్రోత్సాహంతో చదువు పట్ల శ్రద్ధ వహించి, పదిలో 550 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచాడు. 

తన గురువు సహకారంతో విజయవాడలోని ఓ విద్యాసంస్థలో మోహన్‌ ఇంటర్‌తోపాటు (ఎంపీసీ), ఐఐటీ కోచింగ్‌ తీసుకున్నాడు. ఇంటర్‌లో 963 మార్కులు సాధించాడు. ఈ క్రమంలో ఏఐఈఈఈలో ఉత్తమ ర్యాంకు సాధించి నిట్‌ వరంగల్‌లో ఈసీఈ బ్రాంచ్‌లో అడ్మిషన్‌ పొందాడు. ఐఐటీ క్వాలీఫై అయినప్పటికీ, తాను కోరుకున్న బ్రాంచ్‌ రాకపోవడంతో నిట్‌లో చేరాడు. 2012లో బీటెక్‌ పూర్తి చేసి, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ సీడాట్‌లో రీసెర్చ్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం పొందాడు. ప్రస్తుతం బెంగళూరులో సీడాట్‌ కంపెనీలో 4జీ, 5జీ టెక్నాలజీతోపాటు, మిగతా సాంకేతిక ప్రాజెక్టుల అభివృద్ధిపై సైంటిస్టుగా పనిచేస్తున్నాడు. 

సేవచేయాలనే తపనతో..
తన తండ్రి, గురువు అందించిన ప్రోత్సాహంతో మోహన్‌ చదువులో రాణిస్తూ వచ్చాడు. తన మాదిరిగానే చదువు పట్ల శ్రద్ధ ఉన్న నిరుపేద పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దనే మంచి ఆలోచన విద్యార్థి దశలోనే తనకు వచ్చింది. తాను బీటెక్‌ చదువుతున్న సమయంలో 2010లో నేషన్స్‌ ఫస్ట్‌ హ్యూమన్‌ చైన్‌ ఫౌండేషన్‌ (ఎన్‌ఎఫ్‌హెచ్‌సీ) అనే సేవాసంస్థను ఏర్పాటు చేశాడు. 

ఆ టీంలో సివిల్‌ సర్వెంట్స్, ఎన్‌ఐటీ, ఐఐటీ (IIT) తదితర ప్రముఖ విద్యాసంస్థల నుంచి ఎదిగిన వారితోపాటు, ప్రముఖ వైద్యులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలకు చెందిన నిపుణులతో కలిసి నాలెడ్డ్‌ నెట్‌వర్క్‌ టీంను ఏర్పాటు చేశాడు. ఎప్పటికప్పుడు ఆ టీం సలహాలు, సూచనలు తీసుకుంటూ, అనేక మంది సహకారంతో పేద విద్యార్థులకు విద్య, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పిస్తూ, వారికి అవసరమైన సాయం అందిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఫౌండేషన్‌లో 100 మంది సభ్యులు ఉన్నారు. 

సేవా కార్యక్రమాలు ఇవే..
రాష్ట్రంలోని మహబూబాబాద్, వరంగల్, మెదక్, నారాయణపేట, నల్లగొండ (Nalgonda) జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లో 40 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రేరణ సదస్సులు నిర్వహించారు. ప్రవేశ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్స్‌ను అందించారు. 8వ తరగతి విద్యార్థులకు ఎన్‌ఎంఎంఎస్‌ మెటీరియల్, పదో తరగతి పిల్లలకు ఆల్‌ఇన్‌వన్, పాలిటెక్నిక్‌ మెటీరియల్‌ అందజేశారు. పాఠశాలల్లోని గ్రంథాలయానికి బుక్స్‌ అందజేశారు. అలాగే స్పోర్ట్స్‌ కిట్‌లు అందించారు. 

ఈ ఏడాది ఇనుగుర్తి మండలం చీన్యాతండాలో వేసవి శిక్షణ శిబిరాన్ని ఇటీవల ప్రారంభించారు. ఈ శిబిరంలో పిల్లలకు స్పోకెన్‌ ఇంగ్లిష్‌తోపాటు, ఆటపాటలు నేర్పించడం, పది పిల్లలకు పాలిటెక్నిక్‌ కోచింగ్‌ ఇస్తున్నారు. అలాగే ఆయా గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించి, వైద్యపరీక్షల అనంతరం రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. తావుర్యాతండాలో ప్రజల దాహార్తి తీర్చేందుకు వాటర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఉన్నత చదువులు చదివే పలువురు నిరుపేద విద్యార్థులకు ఆర్థికసాయం అందిస్తున్నారు.

మా నాన్న, గురువు స్ఫూర్తితో ఎన్‌ఎఫ్‌హెచ్‌సీ ఏర్పాటు 
మానాన్న భద్రునాయక్, మ్యాథ్స్‌ టీచర్‌ జి.వెంకటేశ్వర్‌రావు ప్రోత్సాహంతో ఎన్‌ఎఫ్‌హెచ్‌సీ ఏర్పాటు చేశా. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అండగా నిలిచి ధైర్యం చెప్పేవారు. మా నాన్న, గురువు ప్రోత్సాహంతో చదువులో రాణించి, ప్రస్తుతం బెంగళూరులోని టెలికాం డిపార్ట్‌మెంట్‌ అయిన సీడాన్‌ కంపెనీలో 4జీ, 5జీ టెక్నాలజీతోపాటు, సాంకేతిక ప్రాజెక్టుల అభివృద్ధిపై సైంటిస్టుగా పనిచేస్తున్నాను. ఎంతో మంది నిపుణులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులతో కలిసి పేద విద్యార్థులకు తోడ్పాటునందిస్తూ, ఆర్థిక సాయం అందజేస్తున్నాం.
 – మూడావత్‌ మోహన్, ఎన్‌ఎఫ్‌హెచ్‌సీ వ్యవస్థాపకుడు, తావుర్యాతండాజీపీ, కేసముద్రం మండలం 

సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి
చిన్నతనం నుంచి కష్టపడి చదువుకున్నా. చదువుకునే రోజుల్లోనే పేద విద్యార్థులకు సాయం అందించాలనే ఆలోచన ఉండేది. ఆ విధంగా నా వంతుగా ఎంతోమందికి సాయం చేస్తూ వచ్చా. ఆ తర్వాత 2019లో ఎన్‌ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేషన్‌లో సభ్యుడిగా చేరి, ఎన్నో సేవాకార్యక్రమాలు చేశాం. ప్రస్తుతం జనరల్‌ సెక్రటరీగా పనిచేస్తున్నా. మా తండాలో ఈ వేసవిలో శిక్షణ శిబిరం (Summer Camp) ఏర్పాటు చేశాం. విద్యార్థులకు పాలిటెక్నిక్‌ కోచింగ్, స్పోకెన్‌ ఇంగ్లిష్, ఆటలు ఆడించడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.      
– జాటోత్‌ జయకృష్ణ, ఎన్‌ఎఫ్‌హెచ్‌సీ జనరల్‌ సెక్రటరీ, చీన్యాతండా, ఇనుగుర్తి మండలం 

కోచింగ్‌ ఉపయోగపడుతుంది 
మా తండాలోని ప్రాథమిక పాఠశాలలో ఎన్‌ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో పాలిటెక్నిక్‌ కోచింగ్‌ ఇస్తున్నారు. ఈ కోచింగ్‌ తమకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మాకు వచ్చే అనుమానాలను ఎప్పటికప్పడు నివృత్తి చేసుకుంటున్నాం. పైగా స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కోచింగ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.  – గుగులోత్‌ శైలజ, విద్యార్థిని, చీన్యాతండా జీపీ, ఇనుగుర్తి మండలం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement