
విమలక్క పాడిన పాట.. రచించిన అమర్
సిరిసిల్ల ప్రాంతంలో పాట చిత్రీకరణ
ఈ నెల 20 నుంచి అక్టోబర్ 3 వరకు రాష్ట్రమంతటా ఆటాపాట
ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ నినాదంతో వేడుకలు
‘అడవి పూల సింగారం.. చేను చెల్కల బంగారం
పైలమే తల్లీ.. పైలమే బతుకమ్మా..
గునుగు పూలెయ్యాలో.. తంగెడు పూలెయ్యాలో..
ఊరూ.. అడవి.. ఆడీపాడంగా..
అడవులన్నీ పైలంగా.. ఆపదలన్నీ దూరంగా..
చప్పట్లే మిరిమిట్లవ్వంగా.. రావే చెల్లి.. రావే అక్క..
బతుకమ్మ ఆడగరావే.. ఉయ్యాలో.. ఉయ్యాలో..
బతుకు సుడిగుండం దాటి బరిగీసి నిలువగ రావే.. ఉయ్యాలో.. ఉయ్యాలా..’
ఇలా సాగే బతుకమ్మ పాటతో బహుజన బతుకమ్మ సింగారించుకుంది. ఈ పాటను వేములవాడకు చెందిన కూర దేవేందర్ అలియాస్ అమర్ అలియాస్ మిత్ర రాయగా.. ఆయన సతీమణి విమలక్క గానం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిసరాల్లోనే చిత్రీకరణ జరిగింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆదివారం బహుజన బతుకమ్మ పాటను ఆవిష్కరించారు. పన్నెండు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా బహుజన బతుకమ్మ (Bahujana Bathukamma) ఆటాపాటలతో అలరించనుంది.
ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ అని చాటుదాం
‘బహుజన బతుకమ్మ కేవలం ఉత్సవం మాత్రమే కాదు ఉద్యమం అంటూ..’ ప్రారంభమైన ఈ కార్యక్రమానికి 15 ఏళ్లు నిండుతున్నాయి. తెలంగాణ ప్రాంత మెట్టపంటలు అందివచ్చే కాలానికి పంటల పండుగలా (హార్వెస్ట్ ఫెస్టివల్) వస్తున్న బతుకమ్మను తెలంగాణ ప్రజలు వందల ఏళ్లుగా జరుపుకుంటున్నారు. ఈ సాంస్కృతిక ఉత్సవం మహత్తర తెలంగాణ (Telangana) సాయుధ పోరాటకాలంలోనూ, రైతాంగ పోరాటాలలోనూ, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాల్లో సాధనంగా మారిన అనుభవం ఉంది.

పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో మొదలైన బహుజన బతుకమ్మ, కులం, మతం అని తేడాలు లేకుండా, వనరుల విధ్వంసం జరగకుండా, ప్రత్యేకించి స్త్రీల సమానహక్కుల ప్రస్తావనతో సెక్యులర్ పండుగగా జరగాలని బహుజన బతుకమ్మ కృషి చేస్తుంది. ‘ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ’అనే నినాదంతో ఈ ఏడాది బహుజన బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి.
సిరిసిల్ల ప్రాంతంలో చిత్రీకరణ
బహుజన బతుకమ్మ పాటను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి, గోపాల్‌రావుపల్లి, తాడూరు శివారుల్లో చిత్రీకరించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు విమలక్క బృందం, జానపద కళాకారుడు వంతడ్పుల నాగరాజు పర్యవేక్షణలో ఈ పాట షూటింగ్ జరిగింది. ‘ప్రకృతి విధ్వంసమంటే.. ప్రజలపై యుద్ధమే.. శాంతి స్వావలంబన చాటుదామని ఈ ఏడాది ప్రజాబాహుళ్యంలోకి వెళ్లారు. గత 15 ఏళ్లుగా బహుజన బతుకమ్మను అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నిర్వహిస్తోంది. కళాకారుల నృత్యాలు, ఆటపాటలతో గోపాల్‌రావుపల్లి, తాడూరు, తంగళ్లపల్లి పరిసరాల్లో సందడి చేశారు.
పన్నెండు రోజులు పాటల పండుగే
బహుజన బతుకమ్మ పాటల పండుగను రాష్ట్రమంతంటా నిర్వహించనున్నారు. తొలిరోజు సెప్టెంబర్ 20న గన్‌పార్క్‌లో 11 గంటలకు నివాళితో మొదలై.. 3 గంటలకు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఆటపాటలతో ప్రారంభమవుతుంది.
సెప్టెంబర్ 21న సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లి, 22న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు, 23న వనపర్తి జిల్లా కొత్తకోట, 24న ఉమ్మడి నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రం, 25న ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరు, 26న ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం పెద్దాపురంలో, 27న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వేడుకలు నిర్వహించనున్నారు.
చదవండి: గత చరిత్రకు సజీవ సాక్ష్యం.. అమ్మాపురం సంస్థానం
సెప్టెంబర్ 28న ఉమ్మడి మెదక్ జిల్లా పెద్ద నిజాంపేట మండలం కల్వకుంట, 29న హైదరాబాద్‌లోని మల్లాపురం గోకుల్‌నగర్‌లో, 30న మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నాచెడ్, అక్టోబర్ 3న నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో బహుజన బతుకమ్మ వేడుకలు ముగియనున్నాయి.
- సిరిసిల్ల