
కాకతీయుల కాలం నుంచి రెడ్డి రాజుల వరకు పాలన
700 ఏళ్ల పాటు కొనసాగిన పరిపాలన
కురుమూర్తిస్వామి సేవ కోసం అమ్మాపురంలో మకాం
నేటికీ ఆలయ ధర్మకర్తలుగా ముక్కెర వంశీయులు
చిన్నచింతకుంట: మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గత చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. అమరచింత, ఆత్మకూర్ సంస్థానాల పాలన అమ్మాపురం కేంద్రంగా సాగింది. అప్పట్లో 69 గ్రామాలు, 190 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన అమ్మాపురం సంస్థానాన్ని కాకతీయుల కాలం నుంచి రెడ్డి రాజుల కాలం వరకు ముక్కెర వంశీయులు పరిపాలించారు. 1268 నుంచి 1948 వరకు వీరి పరిపాలన కొనసాగింది. ఇది 19వ శతాబ్దంలో భారత యూనియన్‌లో విలీనమైంది.
కురుమూర్తి క్షేత్రం అభివృద్ధికి..
కురుమూర్తి స్వామి క్షేత్రం అభివృద్ధి కోసం ముక్కెర వంశీయులు అమ్మాపురంలో సంస్థానం ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది. కాకతీయుల కాలంలో అమరచింత, ఆత్మకూర్ సంస్థానాలు వెలుగొందాయి. ముక్కెర వంశీయులు ఆ సంస్థానాల్లో పరిపాలన సాగిస్తూ. కురుమూర్తి క్షేత్రం దర్శనానికి వచ్చేవారు. కురుమూర్తి క్షేత్రాన్ని నిత్యం దర్శించుకోవాలనే ఆకాంక్ష, ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో అమ్మాపురంలో సంస్థానం ఏర్పాటు చేశారు. రాణి భాగ్యలక్ష్మీ దేవమ్మ ఇక్కడి నుంచే అమరచింత, ఆత్మకూర్ సంస్థానాలను పరిపాలించారు.
ఇప్పటికీ నాటి ఆనవాళ్లు..
16వ శతాబ్దంలో రాణి భాగ్యలక్ష్మీదేవి అమ్మాపురంలో నిర్మించిన కోట బురుజు, శివాలయం, మసీదుతో పాటు 200 ఏళ్ల క్రితం వారి వంశీయులు నిర్మించిన రాజ భవనం, సింహద్వారం, రాజ భవనంలోని కోనేరు, గుర్రాల స్థావరాలు, అతిథి గృహాలు నేటికీ ఉన్నాయి.
సజీవ సాక్ష్యాలుగా కట్టడాలు..
ముక్కెర వంశస్తుల పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామానికో సుభేదారును నియమించారు. వారి ద్వారా వచ్చే కప్పాలతో ఆయా గ్రామాల్లో చెరువులు, బావులను తవ్వించారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణం నాటి సంస్థానంలో ఒక భాగంగా ఉండటంతో.. అక్కడే రాజ విడిది భవనాలు నిర్మించారు. ముక్కెర వంశానికి చెందిన పెద్ద సోమ భూపాలుడు తరచూ ఈ ప్రాంతానికి వస్తూ పరిపాలన కొనసాగించే వాడని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు.
ఆత్మకూర్‌లో చెరువును తవ్వింస్తుండగా.. శివుడి విగ్రహం లభ్యం కావడంతో అక్కడే శివాలయాన్ని నిర్మించారు. ఇప్పటికీ చెర్ల పరమేశ్వరుడిగా పిలుస్తున్నారు. అమరచింతలో గుర్రాలను మేపేందుకు అనువైన స్థలాన్ని గుర్తించి.. వాటి సంరక్షణ బాధ్యతలను హజారి వంశస్తులకు అప్పగించారు. అక్కడ కోటబురుజును నిర్మించారు. వాటితో పాటు తిప్పడంపల్లిలో నిర్మించిన కోట బురుజు నాటి చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఆత్మకూర్‌లో సంస్థానాదీశులు నిర్మించిన పలు భవనాలను ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగిస్తున్నారు.
తిరుపతి నుంచి వచ్చి..
వర్ధమానపురం (నేటి వడ్డేమాన్)కు గన్నారెడ్డి సామంత రాజుగా ఉండే వాడు. అప్పట్లో గన్నారెడ్డి తన పరివారంతో తిరుపతి యాత్రకు వెళ్లాడు. తిరుపతి సమీపంలోని చంద్రగిరి ప్రాంతంలో పేరు ప్రఖ్యాతులున్న ముక్కెర వంశీయుడు గోపాల్‌రెడ్డిని కలిశాడు. గోపాల్‌రెడ్డి గుణగణాలు, ధైర్య సాహసాలు మెచ్చి వర్ధమానపురం ఆహ్వానించాడు. గోపాల్‌రెడ్డి తన కుటుంబ సమేతంగా వర్ధమానపురం చేరుకోగా.. గన్నారెడ్డి అతన్ని గౌరవించి మక్తలవాడ పదవి అప్పగించాడు.
చదవండి: ఊరు ఊరంతా ప్రభుత్వ అధికారులే!
క్రమంగా గోపాల్‌రెడ్డి మక్తల, ఊట్కూర్, కడేమార్, వడ్డేమాన్, అమరచింత పరిగణాలపై ఆధిపత్యం సాధించారు. అప్పట్లో కురుమూర్తి క్షేత్రం వడ్డేమాన్ పరిధిలో ఉండటం.. గోపాల్‌రెడ్డి వైష్ణవ భక్తుడు కావడంతో తన ఇంటి ఇలవేల్పుగా ఆరాధించాడు. అది మొదలుకొని నేటివరకు ముక్కెర వంశీయులు కురుమూర్తిస్వామిని ఆరాధిస్తూ వస్తున్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తూ శాశ్వత ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు.