breaking news
chintakunta
-
అద్భుతం.. అమ్మాపురం సంస్థానం
చిన్నచింతకుంట: మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గత చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. అమరచింత, ఆత్మకూర్ సంస్థానాల పాలన అమ్మాపురం కేంద్రంగా సాగింది. అప్పట్లో 69 గ్రామాలు, 190 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన అమ్మాపురం సంస్థానాన్ని కాకతీయుల కాలం నుంచి రెడ్డి రాజుల కాలం వరకు ముక్కెర వంశీయులు పరిపాలించారు. 1268 నుంచి 1948 వరకు వీరి పరిపాలన కొనసాగింది. ఇది 19వ శతాబ్దంలో భారత యూనియన్‌లో విలీనమైంది.కురుమూర్తి క్షేత్రం అభివృద్ధికి.. కురుమూర్తి స్వామి క్షేత్రం అభివృద్ధి కోసం ముక్కెర వంశీయులు అమ్మాపురంలో సంస్థానం ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది. కాకతీయుల కాలంలో అమరచింత, ఆత్మకూర్ సంస్థానాలు వెలుగొందాయి. ముక్కెర వంశీయులు ఆ సంస్థానాల్లో పరిపాలన సాగిస్తూ. కురుమూర్తి క్షేత్రం దర్శనానికి వచ్చేవారు. కురుమూర్తి క్షేత్రాన్ని నిత్యం దర్శించుకోవాలనే ఆకాంక్ష, ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో అమ్మాపురంలో సంస్థానం ఏర్పాటు చేశారు. రాణి భాగ్యలక్ష్మీ దేవమ్మ ఇక్కడి నుంచే అమరచింత, ఆత్మకూర్ సంస్థానాలను పరిపాలించారు.ఇప్పటికీ నాటి ఆనవాళ్లు.. 16వ శతాబ్దంలో రాణి భాగ్యలక్ష్మీదేవి అమ్మాపురంలో నిర్మించిన కోట బురుజు, శివాలయం, మసీదుతో పాటు 200 ఏళ్ల క్రితం వారి వంశీయులు నిర్మించిన రాజ భవనం, సింహద్వారం, రాజ భవనంలోని కోనేరు, గుర్రాల స్థావరాలు, అతిథి గృహాలు నేటికీ ఉన్నాయి.సజీవ సాక్ష్యాలుగా కట్టడాలు.. ముక్కెర వంశస్తుల పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామానికో సుభేదారును నియమించారు. వారి ద్వారా వచ్చే కప్పాలతో ఆయా గ్రామాల్లో చెరువులు, బావులను తవ్వించారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణం నాటి సంస్థానంలో ఒక భాగంగా ఉండటంతో.. అక్కడే రాజ విడిది భవనాలు నిర్మించారు. ముక్కెర వంశానికి చెందిన పెద్ద సోమ భూపాలుడు తరచూ ఈ ప్రాంతానికి వస్తూ పరిపాలన కొనసాగించే వాడని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. ఆత్మకూర్‌లో చెరువును తవ్వింస్తుండగా.. శివుడి విగ్రహం లభ్యం కావడంతో అక్కడే శివాలయాన్ని నిర్మించారు. ఇప్పటికీ చెర్ల పరమేశ్వరుడిగా పిలుస్తున్నారు. అమరచింతలో గుర్రాలను మేపేందుకు అనువైన స్థలాన్ని గుర్తించి.. వాటి సంరక్షణ బాధ్యతలను హజారి వంశస్తులకు అప్పగించారు. అక్కడ కోటబురుజును నిర్మించారు. వాటితో పాటు తిప్పడంపల్లిలో నిర్మించిన కోట బురుజు నాటి చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఆత్మకూర్‌లో సంస్థానాదీశులు నిర్మించిన పలు భవనాలను ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగిస్తున్నారు. తిరుపతి నుంచి వచ్చి.. వర్ధమానపురం (నేటి వడ్డేమాన్)కు గన్నారెడ్డి సామంత రాజుగా ఉండే వాడు. అప్పట్లో గన్నారెడ్డి తన పరివారంతో తిరుపతి యాత్రకు వెళ్లాడు. తిరుపతి సమీపంలోని చంద్రగిరి ప్రాంతంలో పేరు ప్రఖ్యాతులున్న ముక్కెర వంశీయుడు గోపాల్‌రెడ్డిని కలిశాడు. గోపాల్‌రెడ్డి గుణగణాలు, ధైర్య సాహసాలు మెచ్చి వర్ధమానపురం ఆహ్వానించాడు. గోపాల్‌రెడ్డి తన కుటుంబ సమేతంగా వర్ధమానపురం చేరుకోగా.. గన్నారెడ్డి అతన్ని గౌరవించి మక్తలవాడ పదవి అప్పగించాడు. చదవండి: ఊరు ఊరంతా ప్రభుత్వ అధికారులే!క్రమంగా గోపాల్‌రెడ్డి మక్తల, ఊట్కూర్, కడేమార్, వడ్డేమాన్, అమరచింత పరిగణాలపై ఆధిపత్యం సాధించారు. అప్పట్లో కురుమూర్తి క్షేత్రం వడ్డేమాన్ పరిధిలో ఉండటం.. గోపాల్‌రెడ్డి వైష్ణవ భక్తుడు కావడంతో తన ఇంటి ఇలవేల్పుగా ఆరాధించాడు. అది మొదలుకొని నేటివరకు ముక్కెర వంశీయులు కురుమూర్తిస్వామిని ఆరాధిస్తూ వస్తున్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తూ శాశ్వత ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. -
దళితుల భూములు కబ్జా
సీఐ, తహసీల్దార్ల పర్యవేక్షణలో చింతకుంట అసైన్డ్ భూముల్లోని పెసర పంటను కోసిన పొలాల వద్ద ఉద్రిక్తత.. పోలీసుల మోహరింపు జోగిపేట: అందోలు మండలం చింతకుంటలో దళితులకు పంపిణీ చేసిన భూములు కబ్జాపరమయ్యాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో గురువారం సీఐ వెంకటయ్య, తహసీల్దార్ నాగేశ్వరరావు సిబ్బందితో వెళ్లి గ్రామంలోని భూములను పరిశీలించారు. ప్రభుత్వ భూమిలో ఉన్న పెసర పంటను రెవెన్యూ శాఖ పరిధిలోని గ్రామ సేవకులతో కోయించారు. మూడెకరాల పొలంలో కోసిన పెసర పంటను స్థానిక పోలీసు స్టేషన్లో భద్రపరిచారు. గ్రామంలో 572, 634,635,636, 637,638 సర్వే నంబర్లలో సుమారుగా 302 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొంత భూమిని నిరుపేదలైన దళితులకు పంపిణీ చేయగా 39 ఎకరాలు పంపిణీ చేయకుండా మిగిలి ఉంది. గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని స్థానిక ఎస్సీలు తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం కలెక్టర్, జేసీ, ఎమ్మెల్యే దృష్టికి వెళ్లింది. రోజు రోజుకు ఎస్సీల ఆందోళన ఉధృతం కావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు 638 సర్వే నంబరులోని మూడెకరాలలో ఉన్న పెసర పంటను గురువారం గ్రామ సేవకులు కోశారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ, మన్మొహన్సింగ్ గ్రామానికి చెందిన దళితులకు ఈ భూములను పంపిణీ చేశారని, ఈభూములు ఇతరులు పేర్లపై ఎలా మారాయంటూ దళిత సంఘాల నాయకులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. వివాదస్పద భూమి వద్దకు పోలీసులు, రెవెన్యూ అధికారులు రావడంతో గ్రామంలోని దళిత కుటుంబాలకు చెందిన వారు వందల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. టేక్మాల్ ఎస్ఐ రమేశ్, అల్లాదుర్గం ఎస్ఐ గౌస్‌తో పాటు జోగిపేట ఏఎస్ఐ, డిప్యూటీ తహసీల్దార్ కిష్టయ్య, ఆర్ఐ సతీష్, వీర్‌ఓలు, వీఆర్ఏలు అక్కడికి చేరుకున్నారు. 2, 3 రోజుల్లో సర్వేలు నిర్వహిస్తాం : తహసీల్దారు వివాదస్పద సర్వే నంబర్ 638లోని భూమిని 2,3 రోజుల్లో సర్వే చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారని తహసీల్దారు నాగేశ్వరరావు తెలిపారు. సర్వే నివేదిక వచ్చేంతవరకు ఇతరులు ఈ భూమిలోకి ప్రవేశించకూడదన్నారు. ఈ భూమిని సర్వే చేసేందుకు ఐదుగురు సర్వేయర్లను నియమించామన్నారు. సర్వేలో భూమి ఎవరిదని తేలితే వారికే అప్పగిస్తామని ఒక్కరొక్కరి పేర ఎంత భూమి ఉండాలో నిబంధనల ప్రకారం అంతే ఉండాలని ఎక్కువగా ఉంటే ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుందన్నారు. చింతకుంట భూములకు సంబంధించి రెండు వర్గాల మధ్య వివాదం ఏర్పడడం వల్ల సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసామని సీఐ వెంకటయ్య తెలిపారు. -
ఆంధ్ర సరిహద్దు చేరిన ఎల్లెల్సీ నీరు
హాలహర్వి : తుంగభద్ర డ్యాం నుంచి దిగువకాల్వకు విడుదలైన నీరు ఆదివారం రాత్రికి ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలోని 135వ మైలురాయిని దాటాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రైతులు సోమవారం తుంగభద్ర జలాలకు పూజలు చేశారు. ఈ నెల 18వ తేదీన తుంగభద్ర డ్యాం అధికారులు ఆంధ్రాకు తాగునీటి అవసరాల నిమిత్తం 690 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అయితే కర్ణాటకలోని 6వ కి.మీ. వద్ద కాలువకు ఓ చోట గండి పడడంతో నీటిని నిలుపుదల చేశారు. గండిని పూడ్చేందుకు అక్కడి అధికారులు చర్యలు చేపట్టారు. రెండు రోజులక్రితం గండి పూడ్చడం పూర్తయిన తర్వాత తిరిగి నీట విడుదలను కోనసాగించారు. ఆ నీరే ప్రస్తుతం దిగువ కాలువకు చేరిందని ఆంధ్రసరిహద్దు ఎల్లెల్సీ డీఈ నెహేమియా సోమవారం విలేకరులకు తెలిపారు. డ్యాంలో పూర్తిస్థాయిలో నీరు చేరితే సాగునీటిని కూడా త్వరలో విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. -
హైకోర్టుకు చింతకుంట విద్యార్థుల లేఖ
-
హైకోర్టుకు చింతకుంట విద్యార్థుల లేఖ
మహబూబ్‌నగర్: ఉపాధ్యాయుల గైర్హాజరుపై విసుగెత్తిన విద్యార్థులు చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరు మండలం చింతకుంట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.. హైకోర్టుకు లేఖ రాశారు. పాఠశాలకు ఉపాధ్యాయులు రావటం లేదంటూ వారు ఉన్నత న్యాయస్థానానికి లేఖ రాశారు. విద్యార్థుల లేఖను సుమోటోగా స్వీకరించిన కోర్టు.. ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం ఎల్లుండికి వాయిదా వేసింది.