దళితుల భూములు కబ్జా | dalits' lands grabbing | Sakshi
Sakshi News home page

దళితుల భూములు కబ్జా

Aug 25 2016 8:30 PM | Updated on Sep 4 2017 10:52 AM

అసైన్డ్‌ భూములను పరిశీలిస్తున్న సీఐ, తహసీల్దార్లు

అసైన్డ్‌ భూములను పరిశీలిస్తున్న సీఐ, తహసీల్దార్లు

చింతకుంటలో దళితులకు పంపిణీ చేసిన భూములు కబ్జాపరమయ్యాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో గురువారం సీఐ, తహసీల్దార్‌ భూములను పరిశీలించారు.

  • సీఐ, తహసీల్దార్ల పర్యవేక్షణలో
  • చింతకుంట అసైన్డ్‌ భూముల్లోని పెసర పంటను కోసిన
  • పొలాల వద్ద ఉద్రిక్తత.. పోలీసుల మోహరింపు
  • జోగిపేట: అందోలు మండలం చింతకుంటలో దళితులకు పంపిణీ చేసిన భూములు కబ్జాపరమయ్యాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో గురువారం సీఐ వెంకటయ్య, తహసీల్దార్‌ నాగేశ్వరరావు  సిబ్బందితో వెళ్లి గ్రామంలోని భూములను పరిశీలించారు. ప్రభుత్వ భూమిలో ఉన్న పెసర పంటను రెవెన్యూ శాఖ పరిధిలోని గ్రామ సేవకులతో కోయించారు.

    మూడెకరాల పొలంలో కోసిన పెసర పంటను స్థానిక పోలీసు స్టేషన్‌లో భద్రపరిచారు. గ్రామంలో 572, 634,635,636, 637,638  సర్వే నంబర్లలో సుమారుగా 302 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొంత భూమిని నిరుపేదలైన దళితులకు పంపిణీ చేయగా 39 ఎకరాలు పంపిణీ చేయకుండా మిగిలి ఉంది. గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని స్థానిక ఎస్‌సీలు తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు.

    ఈ వివాదం కలెక్టర్‌, జేసీ, ఎమ్మెల్యే దృష్టికి వెళ్లింది. రోజు రోజుకు ఎస్సీల ఆందోళన ఉధృతం కావడంతో  కలెక్టర్ ఆదేశాల మేరకు 638 సర్వే నంబరులోని మూడెకరాలలో ఉన్న పెసర పంటను గురువారం గ్రామ సేవకులు కోశారు.  మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ, మన్మొహన్‌సింగ్‌ గ్రామానికి చెందిన  దళితులకు ఈ భూములను పంపిణీ చేశారని, ఈభూములు ఇతరులు పేర్లపై ఎలా మారాయంటూ దళిత సంఘాల నాయకులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.

    వివాదస్పద భూమి వద్దకు పోలీసులు, రెవెన్యూ అధికారులు  రావడంతో గ్రామంలోని దళిత కుటుంబాలకు చెందిన వారు వందల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. టేక్మాల్‌ ఎస్‌ఐ రమేశ్‌, అల్లాదుర్గం ఎస్‌ఐ గౌస్‌తో పాటు జోగిపేట ఏఎస్‌ఐ, డిప్యూటీ తహసీల్దార్‌ కిష్టయ్య, ఆర్‌ఐ సతీష్‌, వీర్‌ఓలు, వీఆర్‌ఏలు అక్కడికి చేరుకున్నారు.

    2, 3 రోజుల్లో సర్వేలు నిర్వహిస్తాం : తహసీల్దారు
    వివాదస్పద సర్వే నంబర్‌ 638లోని భూమిని 2,3 రోజుల్లో సర్వే చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశించారని తహసీల్దారు నాగేశ్వరరావు తెలిపారు. సర్వే నివేదిక వచ్చేంతవరకు ఇతరులు ఈ భూమిలోకి  ప్రవేశించకూడదన్నారు.  ఈ భూమిని సర్వే చేసేందుకు ఐదుగురు సర్వేయర్లను నియమించామన్నారు.

    సర్వేలో భూమి ఎవరిదని తేలితే వారికే అప్పగిస్తామని ఒక్కరొక్కరి పేర ఎంత భూమి ఉండాలో నిబంధనల ప్రకారం అంతే ఉండాలని ఎక్కువగా ఉంటే ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుందన్నారు. చింతకుంట భూములకు సంబంధించి రెండు వర్గాల మధ్య వివాదం ఏర్పడడం వల్ల సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసామని సీఐ వెంకటయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement