సర్కారు బడుల్లో ఆస్ట్రానమీ ల్యాబ్‌లు
స్వీయ అనుభూతి కలిగేలా విద్యార్థులకు అనుభవాత్మక బోధన
ఖగోళ, భౌతిక, జీవశాస్త్ర అంశాలపై ప్రయోగాత్మక టీచింగ్..
కలెక్టర్ కృషితో మహబూబ్‌నగర్ జిల్లాలో 5 పాఠశాలల్లో ఏర్పాటు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రభుత్వ పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఖగోళ పరిశోధనలు, నూతన ఆవిష్కరణలపై పల్లె, మారుమూల గ్రామీణ విద్యార్థుల్లోనూ ఆసక్తి పెంపొందించేలా అధికారులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. సర్కారు బడుల్లో శాస్త్రీయతతో పాటు అనుభవ పూర్వక విద్యనందించేలా అధునాతన పద్ధతిలో ఖగోళ శాస్త్ర ప్రయోగశాలల ఏర్పాటుకు నడుం బిగించారు.
ఆకాశం ఎలా ఉంటుందో అలా పాఠశాలలోనే అంతరిక్షాన్ని నిర్మించి.. విద్యార్థులు స్వీయ అనుభూతితో సులువుగా అర్ధం చేసుకునేలా ప్రయోగాత్మకంగా బోధిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నిర్మల్ జిల్లాలో ఇప్పటికే ఐదు సర్కారు స్కూళ్లలో ప్రయోగాత్మకంగా బోధన జరుగుతుండగా.. అక్షరాస్యత, విద్యారంగంలో అత్యంత వెనుకబడిన మహబూబ్‌నగర్ జిల్లాలోనూ తాజాగా ఇవి అందుబాటులోకి వచ్చాయి.
5 పాఠశాలల్లో ఆస్ట్రానమీ ల్యాబ్స్..
మహబూబ్‌నగర్ జిల్లాలో కలెక్టర్ విజయేందిర బోయి, విద్యాశాఖ అధికారుల కృషితో తొలుత ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో ఆస్ట్రానమీ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ మోడల్ బేసిక్ హైస్కూల్, జడ్చర్ల మున్సిపాలిటీలోని బాదేపల్లి బాలుర జిల్లా పరిషత్ హైస్కూల్‌తో పాటు గ్రామీణ ప్రాంతాలైన గండేడ్ మండలం వెన్నచేడ్ మోడల్ స్కూల్, కోయిల్‌కొండ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్, దేవరకద్ర నియోజకవర్గం సీసీకుంట మండలంలోని లాల్‌కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఖగోళ శాస్త్ర ప్రయోగశాలలు అందుబాటులోకి వచ్చాయి.
ఆకాశంలా డిజైన్..
ఒక్కో స్కూల్‌లో రూ.3.70 లక్షల వ్యయంతో ఆరు నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం ఆస్ట్రానమీ ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. ఓ పెద్ద గదిలో అంతరిక్షం ఏ విధంగా ఉంటుందో అలా కళ్లకు గట్టేలా నీలం రంగు వేశారు. ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు, తోక చుక్కలు, ఉల్కలు, అస్ట్రరాయిడ్స్ వంటి వాటిని స్వయంగా చూసి.. ఖగోళ పాఠ్యాంశాలపై విద్యార్థులు పట్టు సాధించేలా టెలిస్కోప్‌ను అందుబాటులో ఉంచారు. సూర్య, చంద్ర గ్రహణాలపై సైతం సులువుగా విద్యార్థులకు అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేశారు.
ప్రాక్టికల్‌గా నేర్చుకోవడం సులువుగా ఉంది..
పాఠాలు వినడం, పుస్తకాల్లో చదవడం కంటే ప్రాక్టికల్‌గా నేర్చుకోవడం సులువుగా ఉంది. ప్రయోగాత్మకంగా దృశ్య విజ్ఞానం పొందడం వల్ల త్వరగా అవగాహన చేసుకోగలుగుతున్నాం. అంతరిక్షం, విశ్వం తదితర పాఠ్యాంశాలు, సైన్స్ సబ్జెక్ట్ అంటే ఇంతకు ముందు భయపడేటోళ్లం. ఇప్పుడా భయం లేదు. – వైశాలి, ప్రభుత్వ మోడల్ బేసిక్ హైస్కూల్ విద్యార్థిని, 8వ తరగతి
రెస్పాన్స్ బాగుంది.. హాజరు శాతం పెరిగింది..
కలెక్టర్ విజయేందిర బోయి తన ప్రత్యేక ఫండ్ నుంచి ఆస్ట్రానమీ ల్యాబ్‌లకు నిధులు కేటాయించారు. ఈ ప్రయోగశాలలు విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందిస్తున్నాయి. ఉపాధ్యాయులకు సైతం బోధన సులభతరంగా మారింది. ఆయా స్కూళ్లలో విద్యార్థుల హాజరు 5 నుంచి 8 శాతం పెరిగింది. – దుంకుడు శ్రీనివాస్, ఏఎంఓ, మహబూబ్‌నగర్


