
అదో చిన్న ఊరు. అక్కడ 75 ఇళ్లు మాత్రమే ఉన్నాయి. ఊరు చిన్నదే కానీ దాని ప్రత్యేకత మాత్రం చాలా ఘనం. ఆ ఊరి నుంచి 50 మంది పైగా ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు సాధించారు. వీరిలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, పీసీఎస్ జాబ్స్ సాధించిన వారు ఉన్నారు. దీంతో ఆఫీసర్స్ విలేజ్, యూపీఎస్సీ ఫ్యాక్టరీగా ఆ ఊరిని పిలుస్తుంటారు. ఇంత చిన్న ఊరి నుంచి అంత మంది ఉన్నత ఉద్యోగాలు సాధించారంటే
అక్కడేదో పెద్ద కోచింగ్ సెంటర్ ఉండే ఉంటుందని ఊహిస్తున్నారా? అలాంటిదేమి లేదక్కడ. ఇంతకీ ఆ ఊరు పేరేంటి, ఎక్కడ ఉంది..?
ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఊరి పేరు మాధోపట్టి. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో ఉంది. ఈ ఊరి విజయగాథ (success story) గురించి తెలుసుకోవాలంటే వందేళ్లు వెనక్కి వెళ్లాలి. స్వాతంత్ర్య సమరయోధుడు ఠాకూర్ భగవతి దిన్ సింగ్, ఆయన భార్య శ్యామరతి సింగ్‌తో ఈ విలేజ్ సక్సెస్ స్టోరీ ప్రారంభమైంది. శ్యామరతి సింగ్ 1917లో అమ్మాయిలకు చదువు చెప్పడం ప్రారంభించారు. తర్వాత అబ్బాయిలు కూడా ఆమె దగ్గర చదువుకోవడానికి వచ్చేవారు. ఇలా ఆ ఊళ్లో విద్యార్జనకు బీజం పడింది.
మాధోపట్టి మహిమ
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆ ఊరి నుంచి ఒకరు తొలిసారిగా ఓ యువకుడు ఐఎఫ్ఎస్‌కు ఎంపికయ్యాడు. తర్వాత వినయ్ కుమార్ సింగ్ అనే మరో యువకుడు ఐఏఎస్ సాధించాడు. ఒకే కుటుంబంలోని నలుగురు అన్నదమ్ములు ఐఏఎస్, ఐపీఎస్‌కు ఎంపిక కావడంతో మాధోపట్టి గ్రామం పేరు మార్మోగిపోయింది. యూపీఎస్ జాబ్స్ సాధించడం మాధోపట్టి (Madhopatti) వాసులకు అలవాటుగా మారిపోయింది. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఆ ఊరికి కోడళ్లుగా వచ్చిన యువతులు కూడా ఈ విజయంలో భాగస్వాములయ్యారు. మెట్టింటిలో అడుగు పెట్టగానే పుస్తకాలతో కుస్తీ పట్టి సర్కారీ కొలువులు సాధించారు. మాధోపట్టి మహిమ అది!
విజయ రహస్యం
ఇంత మందికి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు రావడానికి అక్కడేమి పెద్ద కోచింగ్ సెంటర్లు లేవు. గ్రామమే కోచింగ్ సెంటలా పనిచేస్తుంది. ఇప్పుడు అధికారులుగా ఉన్న సీనియర్లు కొత్త విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు. ఒకరు గెలిచినప్పుడు మొత్తం గ్రామం సంబరాలు జరుపుకుంటుంది. ఎవరైనా విఫలమైనప్పుడు మళ్లీ ప్రయత్నించడానికి మద్దతు ఇస్తుంది. ఇదే మాధోపట్టి విజయ రహస్యం.
చదవండి: ఐఏఎస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా.. ఆ రాష్ట్రం!
మాధోపట్టి అనేది కేవలం మ్యాప్‌లో ఉన్న ప్రదేశం మాత్రమే కాదు. సంకల్పానికి చేయూత తోడైతే ఎలాంటి విజయాన్నైనా సాధింవచ్చనే భరోసాయిచ్చే స్ఫూర్తిదాయక ప్రాంతం. కష్టపడి పనిచేసే వారికి అండగా నిలబడేవారు ఉంటే అపజయం అన్నమాటే ఉండదనడానికి మాధోపట్టి గ్రామ విజయమే ప్రత్యక్ష నిదర్శనం.