
ఏ రాష్ట్రం నుంచి అత్యధికంగా UPSC టాపర్లు వచ్చారో చెప్పమని ఎవరినైనా అడిగితే.. వారి నుంచి వెంటనే వచ్చే సమాధానం బిహార్. అయితే కొన్నేళ్ల క్రితం వరకు ఇది సరైన సమాధానమే. కానీ ఇప్పుడు కాదు. గతంలో యూపీఎస్సీ టాపర్లు అనగానే ముందుగా బిహార్ పేరుకు గుర్తుకు వచ్చేది. ఎందుకంటే ఆ రాష్ట్రానికి చెందిన చాలా మంది సివిల్స్‌లో సత్తా చాటి యావత్ దేశం తమవైపు చూసేలా చేశారు. అకుంఠిత దీక్ష, పట్టుదలతో కష్టసాధ్యమైన సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, ముందు వరుసలో నిలిచి బిహార్‌కు పేరు తెచ్చారు. దీంతో చాలా కాలం పాటు యూపీఎస్సీ టాపర్లకు చిరునామాగా బిహార్ నిలిచింది.
ఐఏఎస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా
అయితే గడిచిన నాలుగేళ్లలో యూపీఎస్సీ టాపర్ల కేరాఫ్ అడ్రస్ మారింది. బిహార్ పొరుగు రాష్ట్రమైన యూపీ 'టాప్' లేపింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అభ్యర్థులు సివిల్స్‌లో విజయపతాకం ఎగురువేశారు. వరుసగా నాలుగేళ్లు అత్యధిక సంఖ్యలో టాపర్లను అందించి ఐఏఎస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా యూపీ అవతరించింది. అధికారిక గణాంకాల ప్రకారం చూసుకుంటే.. గత ఐదు UPSC టాపర్లలో నలుగురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే ఉన్నారు.
యూపీఎస్సీ టాపర్లు
2021: శ్రుతి శర్మ (ఉత్తరప్రదేశ్)
2022: ఇషితా కిషోర్ (ఉత్తరప్రదేశ్)
2023: ఆదిత్య శ్రీవాస్తవ (ఉత్తరప్రదేశ్)
2024: శక్తి దుబే (ఉత్తరప్రదేశ్)
ఎలా సాధ్యమైంది?
ఐఏఎస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా యూపీ ఎదగడానికి గల కారణాలు ఏంటని చూస్తే.. ఆ రాష్ట్రం ప్రధాన బలం అధిక జనాభా. ప్రభుత్వ సేవను విలువైనదిగా భావించే సాంస్కృతిక వాతావరణం రెండో కారణంగా చెప్పుకోవచ్చు. ప్రయాగ్‌రాజ్, లక్నో(Lucknow) వంటి నగరాలు సివిల్స్ కోచింగ్ కేంద్రాలుగా మారడం మూడో కారణం. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉండడంతో అక్కడి కోచింగ్ సెంటర్లు కూడా అందుబాటులో ఉండడం వల్ల యూపీ వాసులకు ఎక్కువగా సివిల్స్ యోగం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
చదవండి: ఆరాటం ముందు ఆటంకం ఎంత
వరుసగా నాలుగేళ్ల నుంచి సివిల్స్ టాపర్లలో యూపీ ముందున్నా, బిహార్ (Bihar) ఘనమైన వారసత్వం మరుగన పడదు. ఇతర ప్రాంతాల నుంచి కూడా విజేతలు ఉద్భవిస్తారనే వాస్తవాన్ని తాజా గణింకాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు విజయం ఎప్పుడూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదన్న నిజాన్ని చాటి చెబుతున్నాయి.