
చిన్నచిన్న సమస్యలకే గాబరా పడిపోతుంటాం. అపజయాలు ఎదురైనప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోతుంటాం. అయితే కొంతమంది మాత్రం ఓటములనే తమ విజయానికి మెట్లుగా మలుచుకుంటారు. అవరోధాలను అధిగమించడానికి అనుభవాలుగా అపజయాలను అనుకుంటారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా లెక్కచేయరు. కష్టాలు ఎదురొచ్చినా తాము అనుకున్నది సాధించే వరకు పట్టువదలరు. దీపేష్ కుమారి కూడా ఈ కోవలోకే వస్తారు.
ఎవరీ దీపేష్ కుమారి?
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు దీపేష్ కుమారిది చాలా పేద కుటుంబం. ఆమె తండ్రి గోవింద్ కుమార్ తన భార్య, ఐదుగురు పిల్లలను పోషించడానికి పకోడీలు, స్నాక్స్ అమ్మేవాడు. ఏడుగురు సభ్యుల కుటుంబం పరిమిత వనరులతో ఒక చిన్న గదిలో నివసించింది. చాలీచాలని సంపాదనతో ఆ కుటుంబం నెట్టుకొచ్చేది. అయితే ఇంత కష్టంలోనూ పిల్లల చదువును నిర్లక్ష్యం చేయలేదు. విద్యతోనే తమ కష్టాలు తీరతాయని గోవింద్ భావించాడు. ఎన్ని సమస్యలు ఉన్నా పిల్లలను చదివించాలని గట్టిగా అనుకున్నాడు. అతడి పెద్ద కుమార్తె దీపేష్ కుమారి. తమ కోసం తండ్రి పడుతున్న కష్టాన్ని తొలగించాలంటే చదువుతోనే సాధ్యమని ఆమె గట్టిగా విశ్వసించింది. అందుకే చిన్నప్పటి నుంచి కష్టపడి చదివింది. భరత్‌పూర్‌లోని శిశు ఆదర్శ్ విద్యా మందిర్‌లో చదివి.. 10వ తరగతిలో 98%, 12వ తరగతిలో 89% స్కోర్ సాధించి సత్తా చాటింది. జోధ్‌పూర్‌లోని MBM ఇంజనీరింగ్ కళాశాల నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ ( B.Tech), ఐఐటీ బాంబే నుంచి ఎంటెక్ పట్టా సాధించింది.
ప్రైవేట్ జాబ్ వదిలేసి..
చదువు ముగిసిన తర్వాత ఏడాది పాటు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసింది. సివిల్ సర్వెంట్ కావాలన్న తన కలను సాకారం చేసుకోవాలన్న లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలేసి UPSC పరీక్షకు ప్రిపేర్ కావడం ప్రారంభించింది. 2020లో మొదటి ప్రయత్నం విఫలమైంది. కానీ ఆమె పట్టు వదలేదు. తాను దాచుకున్న డబ్బుతో ఢిల్లీ వెళ్లి కోచింగ్ తీసుకుంది. దీక్షగా చదవడంతో మరుసటి ఏడాదే ఆమె కల సాకారమయింది. దీపేష్ UPSC పరీక్షలో అఖిల భారత స్థాయిలో 93వ ర్యాంక్, EWS విభాగంలో 4వ ర్యాంక్ సాధించి ఐఏఎస్‌కు ఎంపికైంది. శిక్షణ పూర్తైన తర్వాత జార్ఖండ్ కేడర్‌కు నియమించబడింది.
తోబుట్టువులకు స్ఫూర్తి
దీపేష్ కుమారి విజయం ఆమె తోబుట్టువులకు కూడా స్ఫూర్తినిచ్చింది. ఆమె చెల్లెలు ఇప్పుడు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో వైద్యురాలిగా, ఒక సోదరుడు గౌహతిలోని ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ (MBBS) చదువుతున్నాడు. మరొక సోదరుడు లాతూర్‌లో చదువు కొనసాగిస్తున్నాడు.
చదవండి: 40 ఏళ్ల వ్యక్తి 22 ఏళ్ల అమ్మాయితో అలా చేయడం తప్పు
నాన్నే ప్రేరణ
దీపేష్ కుమారి తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ.. తన తండ్రి అంకితభావమే తనకు అతిపెద్ద ప్రేరణ (Inspiration) అని చెప్పారు. "నేను అలసిపోయినప్పుడల్లా, ఆయన పోరాటం నాకు బలాన్నిచ్చింది" అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. పరిమిత మార్గాలు ఉన్నప్పటికీ గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించే యువతకు దీపేష్ కుమారి ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.