
చిన్నప్పటి నుంచి కడు పేదరికం, ఆర్థిక ఇబ్బందుల మధ్య పెరిగింది. అవే ఆమెను కార్పొరేట్ స్థాయి ఉద్యోగాన్ని సాధించే దిశగా నడిపించాయి. పోని అక్కడితో ఆగిపోలేదు. ఇంకా ఏదో చేయాలి..తన కుటుంబం తనను చూసి గర్వించేలా అత్యున్నత స్థాయిలో ఉండాలని ఆరాటపడేది. ఆ క్రమంలోనే యూపీఎస్సీకి సన్నద్ధమైంది. ఒకటి రెండు కాదు ఏకంగా మూడు సార్లు ఆమెను అపజయం పలకరిస్తూనే ఉంది. అది కూడా ప్రిలిమినరీ స్టేజ్‌లోనే విఫలమవ్వడం అంటే..అస్సలు సివిల్స్ విజయం దరిదాపుల్లోకి వెళ్లకుండానే ఆమెను ఫెయిల్యూర్ భూతం భయపెట్టేస్తూ ఉండేది. మరేవరైనా అయితే మూడేళ్లు వృధా అయ్యిందని డిప్రెషన్‌కి గురై ఆ ప్రయత్నమే మానుకుంటారు కానీ.. ఈమె మొండి పట్టుదలతో తాడోపేడో అన్నట్లుగా ముందుకు సాగి మంచి మార్కులతో ఉత్తీర్ణురాలై ఐఏఎస్ సాధించింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.
ఆ అమ్మాయే కేరళ నిర్మాణ కార్మికుడి కుమార్తె అశ్వతి. తండ్రి నిర్మాణ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. చిన్నతనం నుంచి ఆమెకు స్ఫష్టమైన జీవిత లక్ష్యం ఉంది. ఐఏఎస్ (IAS) కావాలనేది ఆమె ధ్యేయం. అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి అయిన వెంటనే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో చేరి కుటుంబానికి ఆసరాగా మారింది. అయితే అక్కడితో తన సక్సెస్‌కి బ్రేక్ వేయలేదామె.
తన చిన్ననాటి కల ఆమెను వెంటాడుతూనే ఉండేది. ఎలాగైనా ఐఏఎస్ కావాలనే కోరిక ఆమె మనసులో చాలా బలంగా ఉండేది. అందుకోసమే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేయాలనై నిర్ణయాన్ని అత్యంత ధైర్యంగా తీసుకుని మరీ యూపీఎస్సీ (UPSC) పరీక్షలకు సన్నద్ధమైంది. అయితే 2017, 2018, 2019లలో దారుణంగా ఫెయిల్ అయ్యింది. కనీసం ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేయలేక తిప్పలు పడింది. ఇక లాభం లేదని, చేస్తున్న తప్పిదాలను సమీక్షిస్తూ.. మెరుగ్గా రాసేలా ప్రాక్టీస్ చేసింది.
ఆమె దృఢ సంకల్పంతో మరోసారి సివిల్స్ ప్రయత్నించగా.. ఈసారి అపజయం తోకముడవడమే కాదు, సక్సెస్ సంతోషంగా ఒడిలోకి వచ్చి చేరింది. అలా ఆమె 2020 నాల్గో ప్రయత్నంలో 481వ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారామె. ఈ సక్సెస్ స్టోరీ (Success Story).. ధైర్యంగా రిస్క్ తీసుకునేందుకు సన్నద్ధం కావడమే గాక, దాంట్లో ఎదురై ఫెయిల్యూర్‌లను ఓర్చుకునే ఓపిక కూడా అవసరమని చెప్పకనే చెబుతోంది. అప్పుడే విజయ ఢంకాను సగర్వంగా మోగించగడం సాధ్యమని నొక్కి చెబుతోంది కదూ..!.