
ఇళ్లల్లో క్లీనింగ్ పనిచేసే కార్మికులు లేదా పనిమనుషులు ఓ నాలుగైదు ఇళ్లల్లో పనిచేసేలా టైం సెట్ చేసుకుంటుంటారు. అలా అయితేనే గానీ డబ్బులు గిట్టుబాటు కావు, ఎక్కువ సంపాదించలేం అని వాళ్లు చెబుతుండటం వింటుంటాం. అలానే టైంకి సరిగారాకపోయినా..పొట్టకూటి కోసం కదా కష్టపడుతుందటని నాలుగు చివాట్లు పెట్టి పనిచేయించుకుంటారే తప్ప పెద్దగా ఏం అనరు మనదేశంలో. పైగా ఇన్ని ఇళ్లల్లోనే పాచిపని చేయాలనే నిబంధనలు కూడా ఉండవు. అందువల్లే కొంతమంది పనివాళ్లు నాలుగు నుంచి ఆరు ఇళ్లల్లో పనిచేసే వారు కూడా ఉన్నారు. ఇదేం పెద్ద నేరం కాదని మనకి అనిపించినా..సింగపూర్ లాంటి విదేశాల్లో ఇలా చేయడం ఎంత పెద్ద నేరమో తెలిస్తే విస్తుపోతారు. విశ్రాంతి తీసుకోకుండా పరిమితికి మించి ఎక్కువ ఇళ్లల్లో క్లీనింగ్ పని చేసినట్లు తెలిస్తే అంతే సంగతులు. పాపం ఇక్కడొక పనిమనిషి అలా చేసి..అడ్డంగా పట్టుబడింది, పైగా భారీగా జరిమానా కూడా విధించారు.
సింగపూర్ కోర్టు పిడో ఎర్లిండా ఒకాంపో అనే 53 ఏళ్ల మహిళా గృహకార్మికురాలికి అనధికారిక పార్ట్‌టైం క్లీనింగ్ ఉద్యోగాలు చేసినందకుగానూ దారుణంగా జరిమానా విధించింది. ఆమె ఇద్దరు సింగపూర్ వాసులకు రహస్యంగా క్లీనింగ్ పనిచేసిందనే ఆరోపణల వచ్చిన నేపథ్యంలో సింగపూర్ కోర్టు ఈ విధంగా శిక్ష విధించింది. ఆమె సోహ్ ఓయ్‌బెక్, పులక్ ప్రసాద్ అనే యజమానుల వద్ద పార్ట్‌టైం క్లీనింగ్ పనిచేసినట్లు సమాచారం.
ఇలా నాలుగేళ్లుగా పనిచేసిందని, అందుకుగానూ ఒకాంపో నుంచి నెలకు రూ. 32 వేలు, ప్రసాద్ నుంచి రూ. 39 వేలు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. నిజానికి సింగపూర్ విదేశీ గృహ కార్మికులు తమ సెలవుదినాల్లో లేదా విశ్రాంతి సమయాల్లో కూడా అదనంగా పనిచేయడం నిషేధం. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 17 లక్షల వరకు భారీ జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారట. అలాగే అనధికారికంగా ఇలా పనిమనుషులను నియమించుకున్న యజమానులకు సైతం భారిగా జరిమానాలు, ఒక ఏడాది జైలు శిక్ష విధిస్తారు.
అందువల్ల అక్కడ ఉండే నివాసితులు, పనికార్మికులు ఇరువురు ఉపాధి చట్టాలకు లోబడి మసులుకోవాల్సి ఉంటుందని హ్యుమన్ పవర్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ నేపథ్యంలోనే సదరు గృహ కార్మికురాలు ఒకాంపోకు హ్యుమన్ పవర్ ఎంప్లాయిమెంట్ చట్టం ఉల్లంఘన కింద ఏకంగా రూ. 8 లక్షల భారీ జరిమానా విధించింది. అలాగే ఆ ఇద్దరి యజమానులకు కూడా ఒకరికి రూ. 11 లక్షలు, మరొకరికి రూ. 4 లక్షలు చొప్పును జరిమానా విధించింది.
(చదవండి: అత్యంత వృద్ధ 'డ్రైవర్ అమ్మ'..!)