
పారిశ్రామిక దిగ్గజం అనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు స్ఫూర్తిని కలిగించే వీడియోలు, పోస్టులను నెట్టింట్ షేర్ చేస్తుంటారు. అలానే ఈసారి శక్తిమంతమైన వైరల్ వీడియోని నెట్టింట షేర్ చేశారు. ఉత్సాహం ఉరకలు వేసేలా కథన రంగంలోకి దిగడానికి.. ఆమెనే ప్రేరణ అంటూ నెట్టింట ఆమెకు సంబంధించిన వీడియోని పంచుకున్నారు. గతంలో ఆమెకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తాజాగా ఆమె ప్రస్థానం మరింతకు ముందుకు సాగిన వైనాన్ని తెలుపుతూ వీడియోని పంచుకున్నారు. అంతేగాదు జీవితాన్ని ఆస్వాదించడం పట్ల ఆమెకున్న ఆసక్తిని, తపనని ప్రశంసించారు.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..72 ఏళ్ల భారతీయ మహిళ మణి అమ్మ సాంప్రదాయ చీరలో దుబాయ్‌లో విలాసవంతమైన రోల్స్ రాయిస్ నడుపుతున్నట్టు కనిపిస్తోంది. ఈమె ఆత్మవిశ్వాసం, ప్రశాంతతకు నిలువెత్తు దర్శనం. "డ్రైవర్ అమ్మ"గా పిలిచే ఈ మణి అమ్మ సుమారు 11 రకాల వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్‌లను కలిగి ఉంది. కేరళలో డ్రైవింగ్ స్కూల్‌ని నడుపుతోంది. ఆమె కార్లు, ట్రక్కులు, ఫోర్క్‌లిఫ్ట్‌లు, క్రేన్‌లతో సహా వివిధ వాహానాలను నడపటంలో ప్రావీణ్యం సంపాదించడమే కాదు, ఎందరికో స్ఫూర్తిగా నిలిచారామె.
ఆమె స్టోరీ ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరిని ఆకర్షించింది, కదలించింది కూడా. అక్కడితో ఆమె ప్రస్థానం ఆగిపోలేదు. మహర్షి సినిమాలో మహేశ్ బాబు చెప్పినట్లు సక్సెస్ ఈజ్ జర్నీ దానికి పుల్‌స్టాప్‌లు ఉండవు అన్నట్లుగా ఈ మణి అమ్మ అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్‌ను కూడా సంపాదించారు. ఆ లైసెన్స్‌తో ఆ దుబాయ్ నగర వీధుల్లో సగర్వంగా తిరుగుతూ..అత్యంత ప్రశాంత వదనంతో ఉన్న ఆమె ఆహార్యం నెటిజన్లను తెగ ఆకట్టుకుంది.
ఆనంద్ మహింద్రా సైతం ఈ రోజు ఆమె నాకు స్ఫూర్తి అంటూ అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు. జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించడం ఎలా అనే విషయంలో ఆ మణి అమ్మ అందరికీ స్ఫూర్తి. అంతేగాదు బహుశా ఈ మణి అమ్మే..అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన అత్యంత వృద్ధమహిళ కావోచ్చు అంటూ నెటిజన్లు ఆమె పై ప్రసంశల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: నైజీరియా స్టూడెంట్స్ 'దేవ శ్రీ గణేశ'ప్రదర్శన..!)