
మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, చిత్రంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి, సీతక్క, జూపల్లి, ఎంపీ కావ్య తదితరులు
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
హనుమకొండ వేయిస్తంభాల గుడివద్ద ఎంగిలిపూల బతుకమ్మ వేడుక
బతుకమ్మలను ఎత్తుకున్న మంత్రులు కొండా సురేఖ, సీతక్క
సాక్షి ప్రతినిధి, వరంగల్/ హనుమకొండ కల్చరల్: హనుమకొండ వేయి స్తంభాల ఆలయం వద్ద ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. అధికారికంగా వేడుకలను ప్రారంభించిన భట్టి.. ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు కాళోజీ కళాక్షేత్రంలో తెలంగాణ సంగీత అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కాకతీయ నృత్య నాటకోత్సవాల్లో పాల్గొన్నారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మపై రూపొందించిన నృత్య నాటకాన్ని తిలకించారు.వేయి స్తంభాల గుడి వద్ద భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంతోపాటు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవం మన సంస్కృతీ సంప్రదాయాలకు నిదర్శనమన్నారు.
కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్ స్నేహ శబరీష్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు డాక్టర్ అలేఖ్య పుంజాల తదితరులు పాల్గొన్నారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఎంపీ కావ్య, మేయర్ గుండు సుధారాణి బతుకమ్మలు ఎత్తుకొని పాటలు పాడారు.