సర్కారుకు తడిసిమోపెడు అవుతున్న కరెంట్ బిల్లులు
చెల్లింపులు లేక రూ.24,312 కోట్లకు ఎగబాకిన బకాయిలు.. అందులో కాళేశ్వరంవి రూ.9,185 కోట్లు
రెండేళ్లుగా ఎత్తిపోతల పథకాల సబ్‌స్టేషన్ల పనులు బంద్.. కాంట్రాక్టర్లకు రూ.4,849 కోట్ల బకాయిలు చెల్లించకపోవడమే కారణం
ట్రాన్స్‌కోకు మరో రూ.1,550 కోట్ల్ల బకాయిలు
సాక్షి, హైదరాబాద్: ఎత్తిపోతల పథకాల నిర్వహణ భారంగా మారింది. వాటి విద్యుత్ బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడంతో బకాయిలు ఏటేటా పెరిగి కొండలాగా మారాయి. ఎత్తిపోతల పథకాల నిర్వహణకు విద్యుత్ సరఫరా చేస్తున్న దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన విద్యుత్ బిల్లుల బకాయిలు ఏకంగా రూ.24,312 కోట్లకు ఎగబా కాయి. 2014–25 మధ్య కాలంలో మొత్తం రూ.36,435 కోట్ల విద్యుత్ బిల్లులు రాగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.12,278 కోట్లు మాత్రమే చెల్లించింది.
» ఎత్తిపోతల పథకాల పంప్‌హౌస్‌లకు విద్యుత్ సరఫరా చేసే సబ్‌స్టేషన్ల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను చూస్తున్న తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో)కు చెల్లించా ల్సిన బకాయిలు మరో రూ.1,550.22 కోట్లకు పెరిగాయి.
» నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాల సబ్‌స్టేషన్లను నిర్మిస్తున్న కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల బకాయిలు రూ.4,849.57 కోట్లకు చేరాయి. మొత్తం కలిపి రూ.30,711.79 కోట్ల బిల్లుల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలు, ట్రాన్స్‌కోకు చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు బిల్లుల చెల్లింపులకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఇంధన శాఖ ఇటీవల రాష్ట్ర నీటిపారుదల శాఖకు లేఖ రాసింది.
కరెంట్ బకాయిలు ఇలా.....
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని వివిధ పంప్‌హౌస్‌ల నిర్వహణకు సంబంధించిన మొత్తం 17 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 2019–20 నుంచి 2025 సెప్టెంబర్ వరకు 9,384 మిలియన్ యూనిట్ల (ఎంయూ)ల విద్యుత్ వినియోగం జరిగింది. ఇందుకుగాను మొత్తం రూ.13,156 కోట్ల విద్యుత్ బిల్లులు రాగా, ప్రభుత్వం రూ.3,971 కోట్లు మాత్రమే చెల్లించడంతో రూ.9,185 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి.
» దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన 13 విద్యుత్ కనెక్షన్లుండగా, 2014–15 నుంచి 2025 సెప్టెంబర్ వరకు 5,257 ఎంయూల విద్యుత్ వినియోగం జరిగింది. మొత్తం రూ.5,568 కోట్ల విద్యుత్ బిల్లులు వస్తే ప్రభుత్వం రూ.1,727 కోట్లను మాత్రమే చెల్లించింది.
»ఇతర ఎత్తిపోతల పథకాలకు సంబంధించి మొత్తం 462 కనెక్షన్లుండగా, 2014–15 నుంచి 2025 సెప్టెంబర్ వరకు 15,971 ఎంయూల విద్యుత్ వినియోగం జరిగింది. మొత్తం రూ.17,710 కోట్ల బిల్లులు రాగా ప్రభుత్వం రూ.6,580 కోట్లు చెల్లించింది.
రెండేళ్లుగా సబ్‌స్టేషన్లలో....
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన సబ్‌స్టేషన్ల పనులను రెండేళ్లుగా కాంట్రాక్టర్లు నిలుపుదల చేశారని ట్రాన్స్‌కో ప్రభుత్వానికి నివేదించింది. ఎత్తిపోతల పథకాల సబ్ స్టేషన్ల నిర్మాణ బాధ్యతలను గత ప్రభుత్వం ట్రాన్స్‌కోకు అప్పగించింది.
మొత్తం రూ.10,037.12 కోట్ల వ్యయంతో వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులను ట్రాన్స్‌కో పర్యవేక్షిస్తుండగా, ప్రభుత్వం రూ.4,749.57 కోట్ల బిల్లులను కాంట్రాక్టర్లకు బకాయిపడింది. నిర్మాణం పూర్తయిన ఎత్తిపోతల పథకాల సబ్‌స్టేషన్ల నిర్వహణ, పర్యవేక్షణను చూస్తున్నందుకుగాను ట్రాన్స్‌కో రూ.1550.22 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.


